Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/కామధేనువు పొగడుట

వికీసోర్స్ నుండి

తెభా-10.1-948-వ.
అని యిట్లు జిష్ణునిం బలుకుచున్న కృష్ణునికి మ్రొక్కి గోగణసమేత యయిన కామధేనువు భక్తజనకామధేనువైన యీశ్వరున కిట్లనియె.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; జిష్ణునిన్ = ఇంద్రునితో {జిష్ణుడు - జయశీలుడు, ఇంద్రుడు}; పలుకుచున్న = చెప్పుతున్న; కృష్ణుని = కృష్ణుని; కిన్ = కి; మ్రొక్కి = నమస్కరించి; గో = గోవుల; గణ = సమూహములతో; సమేత = కూడుకొన్నది; అయిన = ఐనట్టి; కామధేనువు = కామధేనువు; భక్త = భక్తులయెడ; కామధేనువు = కామధేనువువంటివాడు; ఐన = అయినట్టి; ఈశ్వరున్ = భగవంతుని; కున్ = ఉద్దేశించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా అని దేవేంద్రుడికి చెప్పిన గోవిందుడికి గోగణంతో కూడి యున్న కామధేనువు నమస్కరించి భక్తుల పాలిటి కామధేనువూ పరమేశ్వరుడూ అయిన శ్రీకృష్ణునితో ఇలా అన్నది.

తెభా-10.1-949-క.
"విశ్వేశ! విశ్వభావన!
విశ్వాకృతి! యోగివంద్య! విను నీచేతన్
శాశ్వతుల మైతి మిప్పుడు
శాశ్వతముగఁ గంటి మధిక సౌఖ్యంబు హరీ!

టీక:- విశ్వేశ = శ్రీకృష్ణా {విశ్వేశుడు - విశ్వమంతటిని ఏలువాడు, విష్ణువు}; విశ్వభావన = శ్రీకృష్ణా {విశ్వభావనుడు - విశ్వ (ప్రణవరూపముచే) భావనుడు (ధ్యానింపదగిన వాడు), విష్ణువు}; విశ్వాకృతి = శ్రీకృష్ణా {విశ్వాకృతి - ప్రపంచమే తన రూపమైన వాడు, విశ్వంవిష్ణుః (శ్రుతి)}; యోగివంద్య = శ్రీకృష్ణా {యోగివంద్యుడు - యోగులచే స్తుతింపబడు వాడు, విష్ణువు}; విను = వినుము; నీ = నీ; చేతన్ = అనుగ్రహము చేత; శాశ్వతులము = నిలకడ గలవారము; ఐతిమి = అయ్యాము; ఇప్పుడు = ఇప్పుడు; శాశ్వతముగ = స్థిరముగ; కంటిమి = పొందితిమి; అధిక = అధికమైన; సౌఖ్యంబున్ = సుఖములను; హరీ = శ్రీకృష్ణా {హరి - భక్తుల పాపములను హరించువాడు, విష్ణువు}.
భావము:- “విశ్వేశ్వరా! విశ్వబావనా! విశ్వస్వరూపా! యోగులచే నమస్కరించబడువాడా! గోవిందా! విను. ఇప్పుడు నీ చేత సుస్థిరులము అయ్యాము. సుస్థిరమైనట్టి గొప్ప సౌఖ్యం మాకు సమకూడింది.

తెభా-10.1-950-వ.
దేవా! మాకుం బరమదైవంబ; వింద్రుండవు; భూసుర గో సురసాధు సౌఖ్యంబుల కొఱకు నిన్నింద్రునిం జేసి పట్టంబు గట్టుమని విరించి నియమించి పుత్తెంచె నీవు భూతల భూరిభార నివారణంబు సేయ నవతరించిన హరి” వని పలికి; యంత.
టీక:- దేవా = స్వామీ; మా = మా; కున్ = కు; పరమ = అత్యుత్కృష్టమైన; దైవంబవు = భగవంతుడవు; ఇంద్రుండవు = ప్రభువవు; భూసుర = బ్రాహ్మణుల; గో = ఆవుల; సుర = దేవతల; సాధు = సజ్జనుల; సౌఖ్యంబుల = శుభములు; కొఱకున్ = కోసము; నిన్నున్ = నిన్ను; ఇంద్రున్ = అధిపతివిగా; చేసి = చేసి; పట్టముగట్టుము = పట్టాభిషేకముచేయుము; అని = అని; విరించి = బ్రహ్మదేవుడు {విరించి - వివరముగా రచించువాడు, చతుర్ముఖబ్రహ్మ}; నియమించి = ఆజ్ఞాపించి, చెప్పి; పుత్తెంచెన్ = పంపించెను; నీవు = నీవు; భూతల = భూమండలము నందలి; భూరి = అత్యధికమైన; భార = భారమును; నివారణంబు = పోగొట్టుట; చేయన్ = చేయుటకై; అవతరించిన = పుట్టినట్టి; హరివి = విష్ణుమూర్తివి; అని = అని; పలికి = విన్నవించుకొని; అంత = అంతట.
భావము:- దేవా! నీవు మాకు పరమదైవమవు. నీవే మాకు ప్రభువవు. బ్రాహ్మణులు, ధేనువులు, దేవతలు, సాధువులు యొక్క సుఖంకొరకు నీకు పట్టం గట్టమని బ్రహ్మదేవుడు మమ్ము నియమించి పంపాడు. నీవు ఈ సమస్త భూమండలం మహాభారాన్ని నివారించడానికి అవతరించిన ఆదినారాయణుడవు” అని కామధేనువు స్తుతించింది. పిమ్మట . . .

తెభా-10.1-951-మ.
సుభిక్షీరములన్ సురద్విప మహాశుండా లతానీత ని
ర్జగంగాంబువులన్ నిలింపజననీ న్మౌనిసంఘంబుతో
సునాథుం డభిషిక్తుఁ జేసి పలికెన్ సొంపార "గోవిందుఁ" డం
చు ణాక్రాంతవిపక్షుఁ దోయజదళాక్షున్ సాధుసంరక్షణున్!

టీక:- సురభి = కామధేనువు యొక్క; క్షీరములన్ = పాలతో; సురద్విప = ఐరావతము యొక్క {సురద్విపము - దేవతల ఏనుగు, ఐరావతము}; మహా = గొప్ప; శుండా = తొండము అనెడి; లతా = తీగచేత; ఆనీత = తేబడిన; నిర్జరగంగ = దేవగంగ యొక్క {నిర్జరగంగ - నిర్జర (ముసలితనములేనివారి, దేవతల) గంగానది, దేవగంగ}; అంబువులన్ = నీటితో; నిలింపజననీ = కామధేనువుతో; సన్మౌని = గొప్పఋషుల; సంఘంబు = సమూహము; తోన్ = తోటి; సురనాథుండు = ఇంద్రుడు {సురనాథుడు - దేవతలకు ప్రభువు, ఇంద్రుడు}; అభిషిక్తున్ = పట్టాభిషేకింపబడినవానిగా; చేసి = చేసి; పలికెన్ = అనెను; సొంపార = ఒప్పిదముగా, చక్కగా; గోవిందుండు = గోవిందుడు; అంచున్ = అని; రణా = యుద్ధము నందు; ఆక్రాంత = ఆక్రమింపబడిన; విపక్షున్ = శత్రువులు కల వాడు; తోయజదళాక్షున్ = శ్రీకృష్ణుని {తోయజదళాక్షుడు - పద్మదళముల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు}; సాధుసంరక్షణున్ = శ్రీకృష్ణుని {సాధుసంరక్షణుడు - సజ్జనులను కాపాడువాడు, కృష్ణుడు}.
భావము:- అమర వల్లభుడు అయిన ఇంద్రుడు, అదితితోను మునీశ్వరులతోనూ కూడినవాడై కామధేనువుపాలతో, ఐరావతగజం తన తొండం నిండా తీసుకు వచ్చిన మందాకినీ నదీ జలాలతో సమరములలో శత్రువుల పీచమడిచే వాడూ, సాధువులను రక్షించేవాడూ అయిన పద్మాక్షుణ్ణి అభిషేకించాడు.

తెభా-10.1-952-సీ.
తుంబురు నారదాదులు సిద్ధచారణ-
గంధర్వులును హరిథలు పాడి
మరకాంతలు మింట నాడిరి వేల్పులు-
కురియించి రంచిత కుసుమవృష్టి
గములు మూఁడును సంతోషమును బొందెఁ-
గుఱ్ఱుల చన్నులం గురిసెఁ బాలు
వజలంబులతోడ దులెల్లఁ బ్రవహించె-
నిఖిల వృక్షములు దేనియలు వడిసె

తెభా-10.1-952.1-తే.
ర్వలతికల ఫల పుష్ప యము లమరెఁ
ర్వతంబులు మణిగణప్రభల నొప్పెఁ
బ్రాణులకునెల్ల తమలోని గలుమానె
వాసుదేవుని యభిషేక వాసరమున.

టీక:- తుంబురు = తుంబురుడు; నారద = నారదుడు; ఆదులున్ = మున్నగువారు; సిద్ధ = సిద్ధులు; చారణ = చారణులు; గంధర్వులును = గంధర్వులు; హరి = విష్ణు; కథలు = కథలను; పాడిరి = గానముచేసిరి; అమర = దేవతా; కాంతలు = స్త్రీలు; మింటన్ = ఆకాశమునందు; ఆడిరి = నాట్యములు చేసిరి; వేల్పులు = దేవతలు; కురియించిరి = వర్షింపజేసిరి; అంచిత = మనోజ్ఞమైన; కుసుమ = పూల; వృష్టిన్ = వానను; జగములుమూడును = ముల్లోకములు {ముల్లోకములు - 1భూలోకము 2స్వర్గలోకము 3నరకలోకము}; సంతోషమును = ఆనందమును; పొందెన్ = పొందినవి; కుఱ్ఱుల = పాడియావుల; చన్నులన్ = చన్నులనుండి; కురిసెన్ = వర్షించెను, సమృద్ధికలిగెను; పాలున్ = పాలు; నవజలంబుల్ = కొత్తనీటి; తోడన్ = తోటి; నదులు = ఏరులు; ఎల్లన్ = అన్ని; ప్రవహించెన్ = పారినవి; నిఖిల = సమస్తమైన; వృక్షములున్ = చెట్లు; తేనియలు = మకరందములను; పడిసెన్ = పొందినవి.
సర్వ = సమస్తమైన; లతికలన్ = తీగలందు; ఫల = పండ్లు; పుష్ప = పూల; చయముల్ = సమూహములు; అమరెన్ = చక్కగా కలిగెను; పర్వతంబులున్ = కొండలు; మణి = రత్నాల; గణ = సమూహముల; ప్రభలన్ = కాంతులతో; ఒప్పెన్ = చక్కనయ్యెను; ప్రాణుల్ = జీవులు; కున్ = కు; ఎల్లన్ = అన్నిటికి; తమ = వాటి; లోని = అందలి; పగలు = విరోధభావములు; మానెన్ = తొలగెను; వాసుదేవుని = శ్రీకృష్ణుని {వాసుదేవుడు - వసుదేవుని పుత్రుడు, కృష్ణుడు}; అభిషేక = పట్టముకట్టెడి; వాసరమునన్ = వేళ.
భావము:- అరవిందలోచనుడు ఐన కృష్ణుడిని అలా అభిషేకము చేసి నప్పుడు తుంబురుడు నారదుడు మున్నగువారూ సిద్ధులు చారణులూ గంధర్వులూ విష్ణుచరిత్రములు పాడారు; అప్సరసరలు ఆకాశంలో నాట్యాలు చేసారు; దేవతలు మనోజ్ఞ మైన పుష్పవర్షము కురిపించారు; ముల్లోకాలు సంతోషము పొందాయి; పాడిపశువుల పొదుగుల పాలు వర్షించాయి; క్రొత్తనీటితో నదులు పొంగి పొరలాయి; చెట్లు అన్నీ మకరందాలు చిందాయి; తీగ లన్నిటి నిండా పండ్లు పండాయి, పూలు పూశాయి; గిరులు రత్న సమూహ కాంతులతో రాజిల్లాయి; సహజ వైరం గల ప్రాణికోటికి తమలో విరోధం సమసి పోయింది.

తెభా-10.1-953-వ.
ఇట్లు "గోప గోగణ పతిత్వంబునకు గోవిందు నభిషిక్తుంజేసి" వీడ్కొని పురందరుండు, దేవగణంబులతో దివంబున కరిగె; నంత.
టీక:- ఇట్లు = ఈ విధముగ; గోప = గోపకుల; గో = పశువుల; గణ = సమూహములకు; పతిత్వంబున్ = అధిపత్యమున; కున్ = కు; గోవిందున్ = శ్రీకృష్ణుని; అభిషిక్తున్ = పట్టముకట్టబడినవానిగా; చేసి = చేసి; వీడ్కొని = సెలవు తీసుకొని; పురందరుండు = ఇంద్రుడు {పురందరుడు - శత్రుపురములను వ్రక్కలించిన వాడు, ఇంద్రుడు}; దేవ = దేవతల; గణంబుల్ = సమూహముల; తోన్ = తోటి; దివంబున్ = స్వర్గమున; కున్ = కు; అరిగెన్ = వెళ్ళెను; అంత = అప్పుడు.
భావము:- ఈవిధంగా దేవేంద్రుడు గోవులకూ గోపకులకూ శ్రీకృష్ణుడిని అధిపతిగా అభిషేకించి దేవతాసమూహంతో స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. అటుపిమ్మట. . .