పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/ఇంద్రుడు పొగడుట

వికీసోర్స్ నుండి

తెభా-10.1-936-మ.
రి కేలన్ గిరి యెత్తి వర్షజలఖిన్నాభీర గోరాజికిన్
ణంబైనఁ ద్రిలోక రాజ్యమదముం జాలించి నిర్గర్వుఁడై
సుభిం గూడి బలారివచ్చి కనియెన్ సొంపేది దుష్టప్రజే
శ్వదుర్మాన నిరాకరిష్ణు కరుణార్ధిష్ణు శ్రీకృష్ణునిన్.

టీక:- హరి = కృష్ణుడు; కేలన్ = చేతితో; గిరిన్ = కొండను; ఎత్తి = మీదికెత్తి; వర్ష = వాన; జల = నీటిచేత; ఖిన్న = ఖేదపడుతున్న; ఆభీర = గోపకుల; గో = ఆవుల; రాజి = సమూహముల; కిన్ = కు; శరణంబు = రక్షణ ఇచ్చినవాడు; ఐనన్ = కాగా; త్రిలోక = ముల్లోకములను; రాజ్య = ఏలెడి అధికారపు; మదమున్ = గర్వమును; చాలించి = విడిచిపెట్టి; నిర్గర్వుడు = గర్వము లేనివాడు; ఐ = అయ్యి; సురభిన్ = కామధేనువుతో; కూడి = కలిసి; బలారి = ఇంద్రుడు {బలారి - బలాసురుని శత్రువు, ఇంద్రుడు}; వచ్చి = వచ్చి; కనియెన్ = దర్శించుకొనెను; సొంపు = వైభవమును; ఏది = పక్కనపెట్టి; దుష్ట = చెడ్డ; ప్రజేశ్వర = రాజుల; దుర్మాన = దుర్మదమును; నిరాకరిష్ణున్ = అణచెడి స్వభావమువాని; కరుణావర్ధిష్ణున్ = దయాతిశయము కలవాని; శ్రీ = సంపత్కరమైన; కృష్ణునిన్ = కృష్ణుడిని.
భావము:- అప్పుడు, శ్రీ కృష్ణుడు ఒంటి చేత్తో గోవర్దనగిరి ఎత్తి వర్ష జలం వలన క్లేశపడుతున్న గోపకులను, గోవులనూ రక్షించడం తెలిసి త్రిలోకసామ్రాజ్యపతి ననే అహంకారం విడచి పెట్టి, అణకువతో కామధేనువును ముందు ఉంచుకుని దేవేంద్రుడు అమరావతి నుంచి వచ్చాడు. వచ్చి దుష్టులైన మానవేంద్రుల దురహంకారం దూరం చేసేవాడూ, అపార కరుణాశాలి అయిన శ్రీకృష్ణుని దర్శించుకున్నాడు.

తెభా-10.1-937-క.
ని యింద్రుఁడు పూజించెను
దికరనిభ నిజకిరీట దీధితిచేతన్
ముని హృదలంకరణంబులు
సుతోద్ధరణములు నందసుతు చరణంబుల్.

టీక:- కని = దర్శించి; ఇంద్రుడు = ఇంద్రుడు; పూజించెను = భక్తి చూపెను; దినకర = సూర్యునితో {దినకరుడు - పగటిని కలిగించు వాడు, సూర్యుడు}; నిభ = సరిపోలిన; నిజ = తన యొక్క; కిరీట = కిరీటపు; దీధితి = కాంతి; చేతన్ = చేత; ముని = మునుల; హృత్ = హృదయములను; అలంకరణంబులు = అలంకరించునవి; సు = మంచి; నత = భక్తులను; ఉద్ధరణములు = ఉద్ధరించునట్టివి; నంద = నందుని యొక్క; సుతు = పుత్రుని యక్క; చరణంబుల్ = పాదములు.
భావము:- ఇలా శ్రీకృష్ణుడిని దర్శించుకున్న దేవేంద్రుడు సూర్య ప్రకాశంతో సమానమైన ధగధగలతో మెరిసే తన కిరీట కాంతులతో మునీంద్రుల హృదయాలను అలంకరించేవి వినతులైనవారిని ఉధ్దరించేవి అయిన నందకుమారుని పాదారవిందాలు పూజించాడు.

తెభా-10.1-938-వ.
ఇట్లు నమస్కరించి కరకమలంబులు ముకుళించి హరికి హరిహయుం డిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; నమస్కరించి = నమస్కరించి; కర = చేతులనెడి; కమలంబులున్ = పద్మములను; ముకుళించి = జోడించి; హరి = కృష్ణున; కిన్ = కు; హరిహయుండు = ఇంద్రుడు { హరిహయుడు – పచ్చని గుఱ్ఱములు కలవాడు, ఇంద్రుడు }; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా పాదాభివందనాలు ఆచరించి. చేతులు జోడించి కృష్ణుడితో ఇంద్రుడు ఇలా స్తుతించాడు. . .

తెభా-10.1-939-సీ.
"రమ! నీ ధామంబు భాసుర సత్వంబు-
శాంతంబు; హత రజస్తమము; నిత్య
ధిక తపోమయ; ట్లు గావున మాయ-
నెగడెడి గుణములు నీకు లేవు
గుణహీనుఁడవు గాన గుణముల నయ్యెడి-
లోభాదికములు నీలోనఁ జేర
వైన దుర్జననిగ్రము శిష్టరక్షయుఁ-
గిలి సేయఁగ దండధారి వగుచు

తెభా-10.1-939.1-తే.
గముభర్తవు; గురుడవు; నకుఁడవును
గదధీశుల మను మూఢనులు దలఁక
నిచ్చ పుట్టిన రూపంబు లీవు దాల్చి
హితము జేయుదు గాదె లోకేశ్వరేశ!

టీక:- పరమ = పరమపురుషా; నీ = నీ; ధామంబు = స్థానము, స్వరూపం; భాసుర = ప్రకాశవంతమైన; సత్వంబు = సత్త్వగుణ మయ మైనది; శాంతంబు = శాంతవృత్తి గలది; హత = తొలగింపబడిన; రజస్ = రజోగుణ; తమమున్ = తమోగుణ వృత్తులు గలది; నిత్యము = శాశ్వతమైనది; అధిక = మిక్కిలిగ; తపస్ = తపస్సు యొక్క; మయము = స్వరూపమైనది; అట్లు = ఆ విధముగా; కావునన్ = అగుటచేత; మాయన్ = ప్రకృతి యందు; నెగడెడి = అతిశయించెడి, కనబడెడి; గుణములు = త్రిగుణములు; నీ = నీ; కున్ = కు; లేవు = లేవు; గుణహీనుడవు = నిర్గుణుడవు; కానన్ = అగుటచేత; గుణములన్ = త్రిగుణమలచేత; అయ్యెడి = కలిగెడి; లోభాదికము = దశవిధగుణములు {దశవిధగుణములు - 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్య 7దంభ 8దర్ప 9ఈర్ష్యా 10అసూయలు అనెడి గుణములు}; నీ = నీ; లోన్ = అందు; చేరవు = కలుగవు; ఐనన్ = అయినప్పటికి; దుర్జన = దుష్టులను; నిగ్రహము = శిక్షించుట; శిష్ట = సజ్జనులను; రక్షయున్ = కాపాడుట; తగిలి = పూని; చేయగ = చేయుటకు; దండ = ఆయుధములను; ధారివి = ధరించువాడవు; అగుచున్ = ఔతు.
జగమున్ = సర్వలోకములకు; భర్తవు = ప్రభువవు; గురుడవు = మార్గదర్శకుడవు; జనకుడవును = పుట్టించువాడవై ఉంటివి; జగత్ = ఒక్కొక లోకమునకు; అధీశులము = ఏలెడివారము; అను = అనెడి; మూఢ = తెలివిమాలిన; జనులున్ = వారిని; తలకన్ = భయపడునట్లుగా; ఇచ్చపుట్టిన = ఇష్టమువచ్చిన; రూపంబులున్ = రూపములను; ఈవు = నీవు; తాల్చి = చేపట్టి; హితము = మేలు; చేయుదు = కలిగించెదవు; కాదె = కదా, అవును; లోకేశ్వరేశ = కృష్ణా {లోకేశ్వరేశుడు - లోకేశ్వరుల (సర్వలోకపాలకుల)కు ఈశుడు (ప్రభువు), విష్ణువు}.
భావము:- “పరమపురుషా! నీ ధామం శుద్ధ సత్వమయము, శాంతమూ అయినది. రజస్తమోవిరహితమూ. శాశ్వతమూ అయినది. మిక్కుట మైన తపోదీప్తితో నిండినది. అందుచే, మాయ వలన జనించే గుణాలు నీకు లేవు. నీవు త్రిగుణాతీతుడవు. కనుక, ఆ గుణాల వలన సంక్రమించే లోభం మొదలైనవి నీలో పుట్టవు. అయినా దుర్జనులను శిక్షించుటకూ, సజ్జనులను రక్షించుటకూ దండమును ధరిస్తావు. నీవు జగములకు పతివి, ఆచార్యుడవు, కన్నతండ్రివి. తామే లోకేశ్వరులం అని భావించే ఖలులు భీతిల్లేలాగ, నీకు ఇష్టం వచ్చిన రూపాలు ధరించి మేలు చేకూరుస్తావు స్వామీ! నీవు లోకాధిపతుల పైన అధిపతివి.

తెభా-10.1-940-క.
నావంటి వెఱ్ఱివారిని
శ్రీల్లభ! నీవు శాస్తి చేసితివేనిం
గారము మాని పెద్దల
త్రోవన్ జరుగుదురు బుద్ధితోడుత నీశా!

టీక:- నా = నా; వంటి = లాంటి; వెఱ్ఱివారిని = తెలివితక్కువవారిని; శ్రీవల్లభ = శ్రీకృష్ణా {శ్రీవల్లభుడు - శ్రీ (లక్ష్మీదేవి)కి వల్లభుడు (భర్త), విష్ణువు}; నీవు = నీవు; శాస్తి = శిక్షించుట; చేసితివి = చేసిన; ఏనిన్ = పక్షము నందు; కావరము = గర్వము; మాని = వదలిపెట్టి; పెద్దల = గొప్పవారి; త్రోవన్ = ప్రవర్తించిన మార్గమున; జరుగుదురు = వర్తించెదరు; బుద్ధి = మంచిబుద్ధి; తోడుతన్ = కలిగి ఉండుటతో; ఈశా = స్వామీ.
భావము:- ప్రభూ! ఇందిరానాథా! నావంటి మూర్ఖులను నీవు శిక్షిస్తే తక్కిన వారు గర్వం విడచి, పెద్దలు నడచిన మార్గాన్ని బుద్ధి కలిగి అనుసరిస్తారు

తెభా-10.1-941-క.
క్కొక లోకముఁ గాచుచు
నెక్కుడు గర్వమున "నేమె యీశుల"మనుచుం
జొక్కి ననుబోటి వెఱ్ఱులు
నిక్కము నీ మహిమ దెలియనేర రనంతా!

టీక:- ఒక్కొక్క = ఒకటి చొప్పున మాత్రమే; లోకమున్ = లోకములు {చతుర్దశభువనములు - సప్త ఊర్ధ్వలోకములు (1భూలోకము 2భువర్లోకము 3సువర్లోకము 4మహర్లోకము 5జనలోకము 6తపోలోకము 7సత్యలోకము) సప్త అధోలోకములు (1అతలము 2వితలము 3సుతలము 4రసాతలము 5మహాతలము 6తలాతలము 7పాతాళము) అను పద్నాలుగు లోకములు}; కాచుచున్ = పాలించుచు; ఎక్కుడు = అధికమైన; గర్వమునన్ = మదముతో; ఏమె = మేమే; ఈశులము = సర్వనియామకులము; అనుచున్ = అని; చొక్కి = మత్తుగొని; నను = నన్ను; బోటి = పోలిన; వెఱ్ఱులు = మూఢులు; నిక్కమున్ = నిజముగా; నీ = నీ యొక్క; మహిమన్ = మహత్వమును; తెలియనేరరు = తెలిసికొనజాలరు; అనంతా = కృష్ణా {అనంతడు - అంతములేని వాడు, విష్ణువు}.
భావము:- అనంతా! కృష్షా! ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క లోకాన్ని పాలిస్తూ, ఎంతో ఎక్కువ గర్వంతో నిక్కి నీల్గి, నిఖిలమునకు మేమే ప్రభువులం అంటూ ఒడలు మరచి వర్తించే నా వంటి వెఱ్ఱివాళ్ళు నిజంగా నీ ప్రభావం గుర్తించ లేరు.

తెభా-10.1-942-ఆ.
వాసుదేవ! కృష్ణ! రద! స్వతంత్ర! వి
జ్ఞానమయ! మహాత్మ! ర్వపుణ్య
పురుష! నిఖిలబీజభూతాత్మకబ్రహ్మ!
నీకు వందనంబు నిష్కళంక!

టీక:- వాసుదేవ = శ్రీకృష్ణా {వాసుదేవుడు - వ సనివాస ఇత్యస్మాద్థాతోః వ సత్యస్మిన్సర్వం వ సత్యసౌసర్వత్రేతివాసుః దీవ్యతేప్రకాశత ఇతిదేవః సచాసౌచేతి వాసుదేవః (వ్యుత్పత్తి), సర్వలోకములు నిండి ఆ లోకములు వసింపగా దివ్యముగా ప్రకాశించునో ఆ దేవుడు వాసుదేవుడు అనబడును, విష్ణువు}; కృష్ణ = శ్రీకృష్ణా {కృష్ణ - కృఞకరణే అను ధాతువుచేత సృష్టిస్థితిలయములను చేయువాడు, శ్లో. కృషిర్భూవాచకశ్శబ్దోనశ్చ నిర్వృతివాచకః, తయోరైక్యాత్పరంబ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే (ప్రమాణము), అజ్ఞానబంధమును తెంచివేయువాడు, కృష్ణుడు}; వరద = శ్రీకృష్ణా {వరదుడు - వరములనిచ్చువాడు, విష్ణువు}; స్వతంత్ర = శ్రీకృష్ణా {స్వతంత్రుడు - ఏ విషయమునందును ఒకరి సహాయము లేనివాడు, సర్వస్వతంత్రుడు, విష్ణువు}; విజ్ఞానమయ = శ్రీకృష్ణా {విజ్ఞానమయుడు - విజ్ఞాన స్వరూపమైన వాడు, విజ్ఞానం బ్రహ్మేతి వ్యజనాత్ (శ్రుతి) విజ్ఞానమే పరబ్రహ్మ, విష్ణువు}; మహాత్మా = శ్రీకృష్ణా {మహాత్ముడు - గొప్ప ఆత్మ కలవాడు, విష్ణువు}; సర్వపుణ్య = శ్రీకృష్ణా {సర్వపుణ్యుడు - సమస్తమైన సుకృతముల రాశియైన వాడు, విష్ణువు}; పురుష = శ్రీకృష్ణా {పురుషుడు - సమస్తమునకు కారణభూతుడు, విష్ణువు}; నిఖిలబీజ = శ్రీకృష్ణా {నిఖిలబీజుడు - సర్వప్రాణ సహిత రహితలకు మూల జన్మ స్థానము యైన వాడు, విష్ణువు}; భూతాత్మక = శ్రీకృష్ణా {భూతాత్మకుడు -పంచభూతములు తానైన వాడు, సర్వ ప్రాణులందు ఆత్మగానుండు వాడు, విష్ణువు}; బ్రహ్మ = శ్రీకృష్ణా {బ్రహ్మ - బృహిర్బహ్మ వృద్ధౌ బృహతేర్ధాతోః అర్థానుగమాత్ దేశతః కాలతః స్వరూపతః అపరిచ్ఛిన్నం యద్వస్తు తద్బ్రహ్మ (వ్యుత్పత్తి)}; నీ = నీ; కున్ = కు; వందనంబు = నమస్కారము; నిష్కళంక = శ్రీకృష్ణా {నిష్కళంకుడు - కలుషితము లేనివాడు, విష్ణువు}.
భావము:- స్వతంత్రుడవు; విజ్ఞాన మయుడవు; మహాత్ముడవు; సకల పుణ్య పురుషుడవు; నిఖిల బీజ భూతాత్ముకుడవు అయిన పరబ్రహ్మవు; నిష్కళంకుడవు అయిన ఓ వాసుదేవా! వరదా! కృష్ణా! నీకు నమస్కారము.

తెభా-10.1-943-శా.
నీ సామర్థ్య మెఱుంగ మేఘములచే నీ ఘోషమున్ భీషణో
గ్రాసారంబున ముంచితిన్ మఖము నాకై వల్లవుల్ చేయ రం
చో ర్వేశ! భవన్మహత్త్వమున నా యుద్యోగ మిట్లయ్యె; నీ
దాసున్ నన్నుఁ గృతాపరాధుఁ గరుణన్ ర్శింపవే మాధవా!

టీక:- నీ = నీ యొక్క; సామర్థ్యమున్ = శక్తిని; ఎఱుంగ = ఎరుగను; మేఘముల = మేఘముల; చేన్ = చేత; నీ = నీ యొక్క; ఘోషమున్ = గొల్లపల్లెను; భీషణ = భయంకరమైన; ఉగ్ర = హింసాత్మకమైన; ఆసారంబునన్ = వానవెల్లువ లందు; ముంచితిన్ = మునుగునట్లు చేసితిని; మఖము = యాగము; నా = నా; కై = కోసము; వల్లవుల్ = గోపకులు; చేయరు = చేయకపోతిరి; అంచున్ = అని; ఓ = ఓ; సర్వేశా = శ్రీకృష్ణా {సర్వేశుడు - సర్వులను (పిపీలకాది బ్రహ్మ పర్యంతము) నియమించువాడు, విష్ణువు}; భవత్ = నీ యొక్క; మహత్వమునన్ = గొప్పదనముచేత; నా = నా యొక్క; ఉద్యోగము = ప్రయత్నము; ఇట్లు = ఇలా; అయ్యెన్ = ఐనది; నీ = నీ యొక్క; దాసున్ = సేవకుని; నన్నున్ = నన్ను; కృతాపరాథున్ = అపరాథముచేసినవాడను; కరుణన్ = దయతోటి; దర్శింపవే = చూడుము; మాధవా = శ్రీకృష్ణా {మాధవుడు - లక్ష్మీపతి, విష్ణువు}.
భావము:- సర్వేశ్వరా! లక్ష్మీపతీ! నీ సామర్థ్యం ఎంతటిదో తెలుసుకోలేక పోయాను. నా కోసం గోపకులు యజ్ఞం చెయ్యడం మానేశారు. అని కాఱు మేఘాలను పంపి దారుణ మైన తీవ్రవర్షంలో నీ మందను ముంచేశాను. నీ ప్రభావం వలన నా ప్రయత్నం వమ్మయింది. నీ దాసుణ్ణి. తప్పు సైరించి నన్ను కరుణతో నీ కడగంట వీక్షించు.

తెభా-10.1-944-మ.
నిను బ్రహ్మాదు లెఱుంగలేరు; జడతానిష్ఠుండ లోకత్రయా
దుర్మాన గరిష్ఠుఁడన్; విపులదుర్వైదుష్య భూయిష్ఠుఁడన్;
వియ త్యాగ కనిష్ఠుడం; గుజనగర్వి శ్రేష్ఠుఁడన్; దేవ! నీ
లీలా విభవంబు పెంపుఁ దెలియంగా నెవ్వఁడన్? సర్వగా!"

టీక:- నిను = నిన్ను; బ్రహ్మ = చతుర్ముఖబ్రహ్మ; ఆదులు = మున్నగువారు; ఎఱుంగలేరు = తెలిసికొనలేరు; జడత = మూఢత్వమునకు; ఆనిష్ఠుండన్ = ఉనికిపట్టైనవాడను; లోకత్రయా = ముల్లోకములను; ఆవన = పాలించెడివాడ ననెడు; దుర్మాన = దుర్మదము; గరిష్ఠుడన్ = అధికముగా కలవాడను; విపుల = విస్తారమైన; దుర్వైదుష్య = చెడ్డపాండిత్యము; భూయిష్ఠుడన్ = నిండుగా కలవాడను; వినయ = వినయము; త్యాగ = ఈవి, దానబుద్ధి; కనిష్ఠుండన్ = తక్కువగా కలవాడు; కుజన = దుష్టుడైన; గర్వి = గర్విష్ఠులలో; శ్రేష్ఠుడన్ = హెచ్చైనవాడను; దేవ = శ్రీకృష్ణా {దేవుడు - ప్రకాశింపజేయు వాడు, విష్ణువు}; నీ = నీ యొక్క; ఘన = మిక్కిలి గొప్పదైన; లీలా = లీలల యొక్క; విభవంబున్ = వైభవము, ప్రభావము; పెంపున్ = గొప్పదనము; తెలియంగాన్ = తెలిసికొనగలుగుటకు; ఎవ్వాడన్ = నేనెంతటివాడను; సర్వగా = శ్రీకృష్ణా {సర్వగుడు - ఎల్ల యెడల నిండి ఉండువాడు, విష్ణువు}.
భావము:- దేవా! నిన్ను బ్రహ్మ మొదలగు వారే తెలియ లేరు. నేను జడత్వంలో మునిగినవాడిని. ముల్లోకాలను పాలిస్తున్నా అన్న దురహంకారంలో పడ్డవాడిని. వినయం విడచి పెట్టుటలో శ్రేష్ఠిని. దుర్జనులలో, గర్వపరులలో అగ్రేశ్వరుడిని. ఓ సర్వాంతర్యామీ! నీ విచిత్ర లీలావైభవం ఎరుగుటకు నేనెంతవాణ్ణి.”

తెభా-10.1-945-వ.
అనిన విని నగుచు జలధరగంభీర రవంబున శక్రునకుం జక్రి యిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; విని = విని; నగుచు = నవ్వుతు; జలధర = మేఘములవలె; గంభీర = గంభీరమైన; రవంబునన్ = స్వరముతో; శక్రున్ = ఇంద్రుని {శక్రుడు - దుష్టులను శిక్షించుట యందు శక్తి కలవాడు, ఇంద్రుడు}; కున్ = కి; చక్రి = కృష్ణుడు {చక్రి - చక్రము ఆయుధముగా కలవాడు, విష్ణువు}; ఇట్లు = ఈ విధముగ; అనియె = చెప్పెను.
భావము:- ఇంద్రుడి మాటలు విని, నవ్వుతూ మేఘగంభీరమైన కంఠధ్వనితో వాసుదేవుడు అతడితో ఇలా అన్నాడు.

తెభా-10.1-946-మ.
"రాధీశ్వర! లక్ష్మితోఁ దగిలి యిట్లంధుండవై యున్న నీ
దోద్రేకముఁ ద్రుంచివైచుటకు నీ న్నంబుఁ దప్పించితిం
బ్రదశ్రీరత దండధారి నగు నన్ భావింపఁ; రెవ్వాని ని
క్కము రక్షింపఁ దలంతు వాని నధనుం గావింతు జంభాంతకా!

టీక:- అమరాధీశ్వర = ఇంద్రుడా {అమరాధీశ్వరుడు - అమరుల (దేవతల)కు ఆధీశ్వరుడు (ప్రభువు), ఇంద్రుడు}; లక్ష్మి = ఐశ్వర్యము; తోన్ = తోటి; తగిలి = కూడినవాడవై; ఇట్లు = ఈ విధముగ; అంధుండవు = కన్నుగాననివాడవు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; నీ = నీ యొక్క; సమద = గర్వముతోకూడిన; ఉద్రేకమున్ = నిక్కును; త్రుంచివైచుటకు = తొలగించుటకోసము; జన్నంబున్ = యాగమును; తప్పించితిన్ = జరుగకుండ చేసితిని; ప్రమద = అధికమైన గర్వమనెడి; శ్రీ = సంపత్తి యందు; రత = ఆసక్తి కలవారి యెడల; దండధారిని = శిక్షించుట పూనివాడను; అగు = ఐన; నన్ = నన్ను; భావింపరు = తలపరు; ఎవ్వాని = ఎవరినైతే; నిక్కము = తథ్యముగా; రక్షింపన్ = కాపాడాలని; తలంతు = భావించెదనో; వానిన్ = అతనిని; అధనున్ = ధనహీనుని; కావింతు = చేసెదను; జంభాంతకా = ఇంద్రుడా {జంభాంతకుడు - జంభాసురుని సంహరించిన వాడు, ఇంద్రుడు}.
భావము:- “జంభాసురుని కూల్చిన ఓ సురేశ్వరా! నీవు సంపదచే కన్నుగానకుండా ఉన్నందున నీ మదాతిరేకం మాన్పుట కోసం నీ యాగం ఆపించాను అంతే. సంపత్తి వలన మత్తిల్లిన వారు దండధారిని అయిన నన్ను తలంపరు. నిజంగా నేనెవరిని రక్షింప తలుస్తానో వాడిని ధనహీనుణ్ణి గావిస్తాను.

తెభా-10.1-947-క.
నా యాజ్ఞ సేయుచుండుము
నీ ధికారంబునందు నిలువు; సురేంద్రా!
శ్రీయుతుఁడవై మదింపకు
శ్రేయంబులు గల్గుఁ; బొమ్ము సితకరిగమనా!"

టీక:- నా = నా యొక్క; ఆజ్ఞన్ = అధిపత్యమునకు లోబడి; చేయుచుండుము = మెలగుచుండుము; నీ = నీ యొక్క; అధికారంబున్ = అధికార స్థానము; అందున్ = అందు; నిలువు = ఉండుము; సురేంద్రా = ఇంద్రుడా {సురేంద్రుడు - దేవతలకు ఇంద్రుడు}; శ్రీ = సంపత్తితో; యుతుడవు = కూడినవాడవు; ఐ = అయ్యి; మదింపకు = గర్వించకుము; శ్రేయంబులున్ = శుభములు; కల్గున్ = కలుగును; పొమ్ము = వెళ్ళుము; సితకరిగమనా = ఇంద్రుడా {సితకరిగమనుడు - సితకరి (తెల్ల ఏనుగు, ఐరావతము) పై గమనడు (తిరుగువాడు), ఇంద్రుడు}.
భావము:- ఐరావతవాహనా! ఇంద్రా! నాయాజ్ఞను నిర్వర్తిస్తూ, నీ అధికారం నిర్వహించుకో; ఇంద్రాధిపత్యం వలన గర్వించకు; ఇక వెళ్ళు; నీకు భద్రమగు గాక.”