పండితారాధ్యచరిత్ర/పీఠిక
పీఠిక
ఇంచుమించు పదేండ్ల క్రిందట కీర్తిశేషులైన దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులుగారు మా గురువు గారైన మ.రా.రా. రావుసాహేబు గిడుగు వెంకటరామమూర్తిపంతులుగారితో పండితారాధ్యచరిత్రమును పరిష్కరించి ఇవ్వవలసిన దనిన్ని, దానిని తా మచ్చు వేయిస్తా మనిన్ని చెప్పి ఉండిరి. వారికోరిక ప్రకారము శ్రీ రామమూర్తిపంతులుగారు పండితారాధ్యచరిత్రము అచ్చుపడిన గుజిలీప్రతినిన్ని, కొన్ని తాటిఆకుల ప్రతులనున్ను, ప్రభుత్వ ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారములోని బ్రౌనుదొర కొన్ని ప్రతులపాఠములను గుర్తించి ఉంచిన రెండు కాగితపు సంపుటములనున్ను దగ్గర పెట్టుకొని తమకుమారులు శ్రీ వెంకటసీతాపతిగారి సహాయముతో వివిధ పాఠములను గుర్తిస్తూఉండిరి. 1932 సం॥ము ఎండకాలపు సెలవులలో నేను పర్లాకిమిడికి పోయినప్పుడు శ్రీరామమూర్తిపంతులుగారితో ఒకనెల్లా ళ్లుండడము తటస్థించినది. అప్పుడు మేము ముగ్గురమున్ను కలిసి వాదప్రకరణములో కొంతభాగమును సరిచూచినాము. నే నింటికి రావలసినతొందర కలుగడముచేతను, మాగురువుగారికి నామీద నమ్మక ముండడముచేతను, పండితారాధ్య చరిత్రమును పరిష్కరించి అచ్చుకు సిద్ధము చేసే భారమును నామీద వేసి, తా మ ప్పటికి చేసిన కృషికి ఫలితముగా తేలిన సమస్తసామగ్రిని, తమవద్దనుండిన వ్రాతప్రతులను నా కిచ్చివేసిరి. వారి ఆజ్ఞప్రకారము నే నించుమించు మూడేండ్లు పనిచేసి, ఎట్లో అచ్చుకు ప్రతిని సిద్ధముచేసి, శ్రీనాగేశ్వరరావుగారికి పంపినాను. వారు వెంటనే ముద్రణమున కారంభించినారు. నేను సరిచేసిన మహిమ, పర్వతప్రకరణములను ఈలోగా శ్రీరామమూర్తి పంతులుగారు చూస్తే బాగుంటుందని వారికి పంపినాను.
నాగేశ్వరరావుపంతులుగారు శివైక్యము పొందడానికి పదిదినములకు ముందు వారిని దర్శించినాను. పండితారాధ్యచరిత్రము సంపూర్ణముగా అచ్చుపడడము చూడవలె నని ఉన్నదన్నారు. అన్నిటికి అయిదుఫారములుమాత్ర మచ్చు మిగిలినది. ఎంత తొందరపడినా వారికోరిక నెరవేరలేదు. వారి నిర్యాణానంతర మీ గ్రంథప్రకటనమును గురించిన ప్రస్తావన మరిరాలేదు. మొన్న ఏప్రిలు మాసాంతమున శ్రీవారి అల్లుళ్లయిన చిరంజీవి శివలెంక శంభుప్రసాదుగారు ప్రస్తావవశముగా గ్రంథమునకు శీఘ్రముగా పీఠిక వ్రాసి పంపవలసిన దని కోరినారు. వారి కోరిక ప్రకారము పీఠికను వ్రాయడాని కారంభించినాను. కాని, ఆపని సులభముగా కనబడలేదు. శ్రీ ప్రభాకరశాస్త్రిగారు బసవపురాణమునకు చక్కని పీఠికను వ్రాసినారు. కాని, వారి అభిప్రాయములను విమర్శిస్తూ అనేకు లనేక వ్యాసములను వ్రాస్తూవచ్చినారు. మతవిషయములలో ఉన్న చున్నట్లు నిరూపించవలసిన బాధ్యత నా కెక్కువగా తోచినది. భాషావిషయములో వారి అభిప్రాయములతో ఏకీభవించలేని కొన్నిపట్టులు కనబడినవి. పాల్కురికి గ్రామ మెక్కడ ఉన్నది? సోమనాథుని కాల మేమి? అతని కులగోత్రము లేమి? బసవేశ్వరుడు చారిత్రకపురుషుడా, కాడా? బసవేశ్వరునికి పూర్వపు శైవమతస్వరూప మెట్టిది? సిద్ధాంతవిషయములో వీరశైవసిద్ధాంతమునకున్ను తక్కినవాటికిన్ని భేద మేమి? ఇటువంటి ఎన్నో సమస్యలకు సరియైన సమాధానములకోసము అనేకగ్రంథములను చూడవలసి వచ్చినది. నే నీపీఠికలో తత్త్వైకదృష్టితో విలిఖించిన విషయములు కొన్ని కొందరికి సరిపడకపోవచ్చును. దానికి నే నేమిన్ని చేయలేను. నాకు తోచిన అభిప్రాయములను తెలిపినాను. నేను చేయవలసిన పని అంతే.
శ్రీ శంభుప్రసాదుగారు పీఠికను సాధ్యమయినంత సంగ్రహముగా వ్రాయవలసిన దని సెలవిచ్చినందువల్ల నేను చెప్పదలచిన విషయముల నన్నిటిని విపులముగా, వివరముగా తెలుపడానికి వీలయినది కాదు. ముందుముం దావిషయములను గురించి ప్రత్యేకవ్యాసములలో తెలుపుకొంటాను. పాఠకు లిప్పటి కీచిన్నపీఠికతో తృప్తిపడవలసి ఉన్నది. ఎంత కంటిలో కన్ను పెట్టి ప్రూఫులను దిద్దినా, కొన్ని తప్పు లట్లే నిలిచిపోయినవి. గ్రంథపరిష్కర్త ప్రూఫులు దిద్దడములోగల లోోపమే ఇది. పొరపాటున గ్రంథములో మిగిలిన తప్పులను పాఠకులు సవరించుకోవలసిన దని ప్రార్థిస్తున్నాను. ముఖ్యములైన పొరపాట్లను తప్పొప్పులపట్టికలో చేర్చినాను.
ఈ మహాగ్రంథమును పరిష్కరించే భాగ్యము నాకు కలిగినది గదా అని సంతోషిస్తున్నాను. దీని నచ్చొత్తింప సంకల్పించి ఆంధ్రభాషకు మహోపకారము చేసిన శ్రీ దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు గారిని భక్తితో స్మరిస్తూ నామీది శిష్యవాత్సల్యముతో ఈపనిని నాకు వదలి పెట్టిన మాగురువుగారికి నా కృతజ్ఞతాపూర్వక వందనముల నర్పిస్తున్నాను.. తమమామగారి సంకల్పమును సఫలము చేసిన శ్రీ శివలెంక శంభుప్రసాదుగారు శ్రీ నాగేశ్వరరావుగారివలె అజరామరయశస్కాములై వాఙ్మయసేవామూలమున దేశసేవాధురంధరులై వర్ధిల్లునట్లు పరమేశ్వరు డనుగ్రహించునుగాక అని కోరుతున్నాను.
అనంతపురము,
ఆత్రేయాశ్రమము.
19-6-1939
చిలుకూరి నారాయణ రావు.