పండితారాధ్యచరిత్ర/దీక్షాప్రకరణము
పండితారాధ్యచరిత్ర
దీక్షాప్రకరణము
మల్లికార్జున
పండితారాధ్యచరిత్ర
దీక్షాప్రకరణము
కృతిపతినిరూపణము
శ్రీగురుమూర్తి నూర్జితపుణ్యకీర్తి
నాగమాంతస్ఫూర్తి నానందవర్తి
వృషభస్వరూపు నవిద్యాదురాపు
విషయప్రతాపు నిర్విషయకలాపుఁ
బరమకల్యాణు సద్భక్తధురీణు
శరణాగతత్రాణు సజ్జనప్రాణుఁ
[1]బ్రమదైకవిశ్రాము [2]భసితలలాముఁ
గమనీయ[3]గుణధాము గణసార్వభౌము
నీతజంగమదాస్యు [4]నిగమమయాస్యు
భూతలైకనమస్యు బుధజనోపాస్యు
శివభక్తసింహంబు చిన్నివాసంబు
భవగిరికులిశంబు బసవలింగంబుఁ
దెల్లంబుగా నస్మదియేశుఁ జెన్న
మల్లికార్జునదేవు మహితరూపంబుఁ
దానైన బసవన దండనాయకుని
జానొంద మత్కృతిస్స్వామిఁ గావించి;
భక్తప్రార్థన
[5]కమనీయ సకల నిష్కలతత్త్వ[6]మయులఁ
భ్రమథుల త్రిభువనప్రమథులఁ దలఁచి;
నుత పురాతనభక్త నూతనభక్త
వితతి లింగంబకా వీక్షించి [7]కొలిచి;
యారూఢముగ మల్లికార్జునపండి
తారాధ్యులచరిత్ర మర్థివర్ణింతుఁ.
కృతిఫలము
[8]బండితారాధ్యుల బ్రస్తుతించినను
నిండారు శివభక్తినియతి వర్ధిల్లుఁ;
బండితారాధ్యుల బ్రస్తుతించినను
దండతండములు పాతకములు వొలియుఁ;
బండితారాధ్యులఁ బ్రస్తుతించినను
బండినసద్భక్తిభాగ్యంబు వొందుఁ;
బండితారాధ్యులఁ బ్రస్తుతించినను
మండెడుదావాగ్ని మంచయిపోవు;
బండితారాధ్యులఁ బ్రస్తుతించిననుఁ
జండోరగాదివిషంబులు గ్రాఁగు;
బండితారాధ్యులఁ బ్రస్తుతించినను
[9]దుండగంబులు [10]బహుదుఃఖముల్ వాయుఁ;
బండితారాధ్యులఁ బ్రస్తుతించినను
దండి భవాంబుధి దరతర మింకుఁ;
బండితారాధ్యుల బ్రస్తుతించినను
ఖండితైశ్వర్యప్రకాశ[11]త దనరు;
భావింప నటు గాన పండితారాధ్య
దేవునిచరితఁ గీర్తింతు నెట్లనినఁ;
గురుస్తోత్రము
జిరతమోగుణ పరిస్ఫీతుండు శివుఁడు
[12]వరసత్త్వగుణ వికస్వరుఁడు పండితుఁడు;
అరయ నచరలింగ మా లింగమూర్తి
యరయఁగాఁ జరలింగ మా పండితయ్య;
యసమలోకాధీశుఁ డంబికా[13]ధవుఁడు
అసమలోకారాధ్యుఁ డా పండితయ్య;
యఖిలలోకమయుండు హైమవతీశుఁ
డఖిలోకాతీతుఁ డా పండితయ్య;
లోకానుసారి ద్రిలోచనుం డిల న
లోకానుసారశీలుఁడు పండితయ్య;
యరుదగు లోకసంహారుండు శూలి
గరుణమై లోకోపకారి పండితుఁడు;
అసితకంఠుఁడు దా నసమలోచనుఁడు
భసితకంఠుఁడు శ్రీ పండితేద్రుండు;
ఊర్ధ్వైకలోచనుఁ డుడురాజమౌళి
యూర్ధ్వ[14]ద్విలోచనుం డొగిఁ బండితయ్య;
భక్తైకదేహుఁడు పరమేశ్వరుండు
భక్తసత్ప్రాణుండు పండితస్వామి;
మల్లికార్జుననామి మల్లికార్జునుఁడు;
మల్లికార్జునకీర్తి మల్లికార్జునుఁడు;
మహి[15]లోనఁ బండిత మల్లికార్జునుని
మహిమలు వర్ణింప మనుజుల తరమె?
కడు నర్థి నుత్పత్తికర్త నాబ్రహ్మ
వడి బ్రహ్మ మను బ్రహ్మవాదులఁ ద్రుంచి
హరభక్తి యుత్పత్తి కధిపతి నాఁగఁ
బరఁగెఁ దాఁ దొల్లి శ్రీపతి పండితయ్య;
స్థితికర్త హరి నుమాపతికి మ్రొక్కించి
క్షితి విష్ణువాదులఁ గీ టడఁగించి,
చెనసి భక్తిక్రియాస్థితికర్త యనఁగ
జనియెను లెంక మంచన పండితయ్య;
[16]గాథగా సంహారకర్తయ యనుచు
సాధారణముగ నీశ్వరుఁ బల్కుభక్తి
దూరాన్యసమయసంహారుఁడై చనియె
శూరుడు మల్లికార్జునపండితయ్య;
ఖ్యాపితభక్తికిఁ గారణపురుషు
లై పండితత్రయం బన భువిఁ జనియెఁ;
దనరు నీపండితత్రయములో మాన్యుఁ
డన నొప్పు మల్లికార్జున పండితయ్య;
అట్టి పండితమల్లికార్జును[17]మహిమ
- ↑ బ్రమథైక
- ↑ భక్త
- ↑ సద్గుణ
- ↑ నిగమా
- ↑ కమనియ్య శాసనము లందున్ను, తాటాకుపుస్తకములందున్ను ‘—అనియ్య’
రూపము ప్రకటముగా ఉన్నది. - ↑ విదుల
- ↑ తలఁచి
- ↑ కొన్నిపుస్తకములలో వాక్యావసానమందు అరసున్న, ఆదేశము కానరావు.
- ↑ "దుర్దమా విషయక్లేశా శ్శాంతి మాయాంతి సత్వరం” అని సం.
- ↑ విష
- ↑ మిం పొందు
- ↑ పరతత్త్వ
- ↑ రమణుఁ-డ
- ↑ లోచనయుగుం
- ↑ లోకబంధుఁడు
- ↑ గాథమై(యై, య). సం.—"సంహారకర్తైన మహాదేవ ఇత్య సమంజసం వచశ్శాస్త్రపరిజ్ఞాన మవిజ్ఞాయ వదంతి యే”.
- ↑ చరిత