శృంగారించుకొని వెడలిరి శ్రీ కృష్ణునితోను

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

పల్లవి

శృంగారించుకొని వెడలిరి శ్రీ కృష్ణునితోను సంతోషముగా


అనుపల్లవి

అంగ-రంగ వైభోగముతో

గోపాంగనామణులెంతో సొగసుగ ॥ శృంగారించుకొని ॥


చరణములు

నవ్వుచు కులుకుచునొకతె కొప్పున

పువ్వుల ముడుచుచునొకతె

దువ్వుచు కురులనునొకతె కృష్ణుని

రవ్వ జేయుచునునొకతె వేడ్కగ ॥ శృంగారించుకొని ॥


మగడు వీడనుచునొకతె

రవికె బిగువున చేర్చుచునొకతె

తగును తనకనుచునొకతె పాద

యుగములనొత్తుచునొకతె వేడ్కగ ॥ శృంగారించుకొని ॥


సొక్కుచు సోలుచునొకతె కృష్ణుని

గ్రక్కున ముద్దిడునొకతె

పక్కను రమ్మను చొకతె మడుగులఁ-

అక్కర-నొసగుచు-నొకతె వేడ్కగ ॥ శృంగారించుకొని ॥


పరిమళము-లందుచు-నొకతె శ్రీ

హరి హరియనుచునునొకతె

ఉరమున జేర్చుచునొకతె పయ్యెద

జరిపి వేడుకొనుచునొకతె వేడ్కగ ॥ శృంగారించుకొని ॥


సారసాక్ష యనుచును-నొకతె కను

సైగను పిలుచుచునొకతె

రారా యనుచును-నొకతె త్యాగ-

రాజ సఖుడనుచు నొకతె వేడ్కగ ॥ శృంగారించుకొని ॥