Jump to content

పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/దుష్యంతుని చరిత్రము

వికీసోర్స్ నుండి

దుష్యంతుని చరిత్రము


తెభా-9-594-క.
పారావారపరీతో
దా ధరాభారదక్ష క్షిణహస్త
శ్రీ రాజిల్లఁగ నొకనాఁ
డా రాజేంద్రుండు వేఁటయం దభిరతుఁడై.

టీక:- పారావార = సముద్రముచే; పరీత = చుట్టబడిన; ఉదార = పెద్ద; ధరా = భూమి, రాజ్యము; భార = భారమును; దక్ష = వహించడానికి సమర్థమైన; దక్షిణ = కుడి; హస్త = చేతి; శ్రీ = సుప్రశస్తము; రాజిల్లగన్ = విరాజిల్లుతుండగ; ఒక = ఒకానొక; నాడు = రోజు; ఆ = ఆ; రాజేంద్రుండు = మహారాజు; వేట = వేటాడుట; అందున్ = అందు; అభిరతుడు = ఆసక్తి కలవాడు; ఐ = అయ్యి.
భావము:- నాలుగు చెరగుల సముద్రమే సరిహద్దుగా కల పెద్ద రాజ్యాన్ని ఏలే సమర్థమైన తన కుడిచెయ్యి సుప్రశస్తమై విరాజిల్లుతుండగా. ఒకనాడు, ఆ దుష్యంత మహారాజు వేటపై కోరికతో అడవికి బయలుదేరాడు.

తెభా-9-595-క.
గంక కంఠీరవ భే
రుం శశవ్యాళ కోల రోహిష రురు వే
దంవ్యాఘ్ర మృగాదన
చం శరభ శల్య భల్ల మరాటవులన్.

టీక:- గండక = ఖడ్గమృగములు; కంఠీరవ = సింహములు {కంఠీరవము - కంఠమున శబ్దము కలది, సింహము}; భేరుండ = గండభేరుండములు {గండభేరుండము - రెండు తలలు మూడు కన్నుల కలిగి ఏనుగును తన్నుకుపోగల పక్షి}; శశ = కుందేలు; వ్యాళ = పాము; కోల = అడవిపందులు; రోహిష = కొండగొఱ్ఱె; రురు = లేళ్ళు; వేదండ = ఏనుగులు; వ్యాఘ్ర = పెద్దపులులు; మృగాదన = సివంగి {మృగాదనము - మృగములను తినునది, సివంగి}; చండ = పులులు; శరభ = మీగండ్ల మెకములు {శరభము - సింహమును చంపునది, 8 కాళ్ళు శిరోనేత్రములును కల జంతువు, మీగండ్ల మెకము}; శల్య = ఏదుపందులు; భల్ల = భల్లూకము; చమర = సవరపుమెకములు ఉన్న {చమరము - దీనినుండి చామరములు చేయబడును, సవరపు మెకము}; అటవులన్ = అడవులలో.
భావము:- ఆ అడవిలో ఖడ్గమృగాలు, సింహాలు, గండభేరుండాలు, కుందేళ్ళు, పాములు, అడవిపందులు, కొండగొఱ్ఱెలు, లేళ్ళు, ఏనుగులు, పెద్దపులులు, సివంగులు, పులులు, శరభాలు, ఏదుపందులు, భల్లూకాలు, చమరమృగాలు తిరుగుతుంటే....

తెభా-9-596-క.
ప్పుడు చేయుచు మృగముల
రొప్పుచు నీరముల యందు రోయుచు వలలం
ద్రిప్పుకొని పడఁగఁ బోవుచుఁ
ప్పక వ్రేయుచును వేఁటమకం బొప్పన్.

టీక:- చప్పుడు = పెద్దశబ్దములు; చేయుచున్ = చేస్తూ; మృగములన్ = జంతువులను; రొప్పుచున్ = తఱుముతు; ఈరములన్ = పొదల; అందున్ = లో; రోయుచున్ = వెదకుచు; వలలన్ = వలలను; త్రిప్పుకొని = చిక్కుపడి; పడగన్ = పడునట్లు; పోవుచున్ = వెళ్ళుతు; తప్పకన్ = గురి తప్పకుండగ; వ్రేయుచున్ = వేస్తూ; వేట = వేటాడెడి; తమకంబు = మోహము; ఒప్పన్ = అతిశయించగ.
భావము:- పెద్దశబ్దాలు చేస్తూ, ఆ జంతువులు అన్నింటినీ తఱుముతు పొదలలో వెదకుతు, వలలలో పడేస్తు, గురితప్పకుండ బాణాలు వేసి వేటాడాలనే మోహంతో....

తెభా-9-597-క.
మృయూథంబుల వెంటను
మృలాంఛన సన్నిభుండు మృగయాతురుఁడై
మృయులు గొందఱు గొలువఁగ
మృరాజపరాక్రమంబు మెఱయఁగ వచ్చెన్.

టీక:- మృగ = జంతువుల; యూథంబుల = సమూహముల; వెంటన్ = వెనుక; మృగలాంఛన = చంద్రునితో {మృగలాంఛనుడు - లేడి చిహ్నముగా కలవాడు, చంద్రుడు}; సన్నిభుండు = సమానుడు; మృగయా = వేట యందు; ఆతురుడు = తొందరకలవాడు; ఐ = అయ్యి; మృగయులు = వేటగాళ్ళు; కొందఱున్ = కొంతమంది; కొలువన్ = సేవించుతుండగా; మృగరాజ = సింహ; పరాక్రమంబున్ = పరాక్రమము; మెఱయగన్ = ప్రకాశించుచుండగా; వచ్చెన్ = చరించెను.
భావము:- దుష్యంత రాజచంద్రుడు వేట తమకంతో, వేటగాళ్ళు సేవిస్తుండగా, సింహ పరాక్రమం ప్రకాశిస్తుండగా జంతువుల వెంట పడి వేటాడసాగాడు.

తెభా-9-598-వ.
ఇట్లు వచ్చివచ్చి దైవయోగంబునఁ గణ్వమహాముని తపోవనంబు చేరం జని.
టీక:- ఇట్లు = ఈ విధముగ; వచ్చివచ్చి = చాలా దూరము వెళ్ళి; దైవయోగంబునన్ = దైవఘటనవలన; కణ్వ = కణ్వుడు అనెడి; మహా = గొప్ప; ముని = ఋషి యొక్క; తపస్ = తపస్సు చేసుకొనెడి; వనంబున్ = తోపునకు; చేరన్ = దగ్గరకు; చని = వెళ్ళి .
భావము:- ఇలా వేట తమకంలో చాలా దూరం పోయి పోయి దైవయోగంవలన కణ్వ మహర్షి తపస్సు చేసుకునే ఆశ్రమానికి వెళ్ళాడు.

తెభా-9-599-సీ.
రుతర శ్రాంతాహి యుగళంబులకుఁ బింఛ-
ముల విసరెడి కేకిముఖ్యములను
రుణతో మదయుక్త లభంబులకు మేఁత-
లిడుచు ముద్దాడు మృగేంద్రములును
నమృగాదనములు గాపుగా లేళ్ళతో-
తులు సాగించు సారంగములను
నునుపుగా హోమధేనువుల కంఠంబులు-
దువ్వుచు నాడు శార్దూలములను

తెభా-9-599.1-తే.
దార కలహించు నుందురు దంపతులకు
మైత్రి నంకించు మార్జాలల్లములను
తిని జాతివైరంబులు మాని యిట్లు
లసి క్రీడించు మృగములఁ గాంచె నతఁడు.

టీక:- ఉరుతర = అతిమిక్కిలి {ఉరువు - ఉరుతరము - ఉరుతమము}; శ్రాంత = అలసిన; అహి = పాముల; యుగళంబుల్ = జంటల; కున్ = కు; పింఛములన్ = పింఛములతో; విసరెడి = గాలివిసరెడి; కేకి = నెమళ్ళు; ముఖ్యములను = ఉత్తమములను; కరుణ = దయ; తోన్ = తోటి; మదయుక్త = మదించిన; కలభంబుల్ = ఏనుగుల; కున్ = కు; మేతలు = తినెడి ఆకులు అలములు; ఇడుచు = పెడుతు; ముద్దాడు = ముద్దులుపెట్టెడి; మృగేంద్రములును = సింహమును {మృగేంద్రము - జంతువులలో శ్రేష్ఠమైనది, సింహము}; ఘన = గొప్ప; మృగాదనములు = సివంగులు; కాపు = కాపలా; కాన్ = ఉండగా; లేళ్ళ = ఆడు జింకల; తోన్ = తోటి; రతులు = సురతములు; సాగించు = చేసెడి; సారంగములును = మగ జింకలను; నునుపుగా = మృదువుగా; హోమధేనువుల = యాగగోవుల; కంఠంబులున్ = మెడలను; దువ్వుచున్ = రాస్తూ; ఆడు = ఆడుకొనెడి; శార్దూలములను = పులులను; తార = తమలోతామే .
కలహించు = పోట్లాడుకొనెడి; ఉందురు = ఉడుత; దంపతుల = జంటల; కున్ = కు; మైత్రిన్ = పొత్తు; అంకించు = కుదుర్చెడి; మార్జాల = పిల్లుల; మల్లములను = శ్రేష్ఠములను; మతిని = మనసునందు; జాతివైరంబున్ = సహజశత్రుభావములు; మాని = విడిచి; ఇట్లు = ఈ విధముగ; కలసి = కలసిమెలసి; క్రీడించు = విహరించెడి; మృగములన్ = జంతువులను; కాంచెన్ = చూసెను; అతడు = అతను .
భావము:- అలా దైవయోగం వలన వచ్చిన దుష్యంతుడు కణ్వశ్రమంలో తమ సహజమైన శత్రుబావాలు విడిచి అలసిన పాముల జంటలకు పురులు విప్పి పింఛాలతో గాలి విసరె నెమళ్ళు; మదించిన ఏనుగుగున్నలకు జాలితో ఆకులు అలములు ముద్దుగా పెడుతున్న సింహాలు; సివంగులు కాపలా ఉండగా ఆడు జింకలతో జతకట్టే మగ జింకలు; మృదువుగా హోమధేనువుల మెడలను మెల్లగా రాస్తూ ఆడుకొనె పులులు; పోట్లాడుకుంటున్న ఉడుత జంటలకు పొత్తు కుదుర్చెడి పిల్లులు; ఇలా సకల జంతువులు కలసిమెలసి మెలగుతుంటే దుష్యంతుడు చూసాడు.

తెభా-9-600-క.
"ఇత్తెఱఁగున మృగజాతుల
పొత్తులు మే మెఱుఁగ"మనుచు భూవల్లభుఁడుం
జిత్తములోపల నా ముని
త్తము సద్వృత్తమునకు సంతసపడుచున్.

టీక:- ఈ = ఈ; తెఱంగునన్ = విధముగ; మృగ = జంతువుల; జాతుల = జాతుల మధ్య; పొత్తులు = స్నేహము; మేమున్ = మేము; ఎఱుగము = తెలియము; అనుచున్ = అనుకొనుచు; భూవల్లభుడు = రాజు; చిత్తము = మనసు; లోపలన్ = లో; ఆ = ఆ; ముని = మునులలో; సత్తమున్ = సమర్థుని; సత్ = గొప్ప; వృత్తమున్ = వర్తనమున; కున్ = కు; సంతసపడుచున్ = అబ్బురపడుచు.
భావము:- “ఈ విధంగ సహజ శత్రు జంతు జాతుల మధ్య స్నేహం ఎక్కడా వినలేదు.” అనుకుంటూ దుష్యంతమహారాజు మనసులో ఆ కణ్యమహాముని సమర్థతకు అబ్బురపడ్డాడు.

తెభా-9-601-క.
ల్లక బిసురుహ సరసీ
ల్లోలోత్ఫుల్ల యూథికా గిరిమల్లీ
ల్లీ మరువక కురువక
ల్లలితానిలమువలన సంతుష్టుండై

టీక:- హల్లక = చెంగలువల; బిసరుహ = తామరపూల; సరసీ = సరస్సు యొక్క; కల్లోల = అలల; ఉత్ఫల్ల = మీదుగాపుట్టిన; యూధికా = అడవిమొల్లల; గిరిమల్లీ = కొండమల్లెల; మల్లీ = మల్లెపూల; మరువక = మరువము యొక్క; కురువక = గురివిందల; సల్లలిత = చక్కటి; అనిలముల = మారుతముల; వలన = చేత; సంతుష్టుండు = సంతోషించినవాడు; ఐ = అయ్యి .
భావము:- చెంగలువల తామరపూల కొలను అలల మీదుగా, వీస్తున్న అడవిమొల్లల, కొండమల్లెల, మల్లెపూల, మరువం, గురివిందల సువాసనలతో కూడిన మందమారుతాలతో దుష్యంతుడు సేదదీరాడు.

తెభా-9-602-వ.
దుష్యంతుండు వచ్చు నవసరంబున.
టీక:- దుష్యంతుండు = దుష్యంతుడు; వచ్చున్ = వచ్చెడి; అవసరంబునన్ = సంయమునందు .
భావము:- అలా ఆశ్రమానికి దుష్యంతుడు వచ్చిన సమయంలో.

తెభా-9-603-క.
ఇందిందిరాతిసుందరి
యిందిందిరచికుర యున్న దిందింద; శుభం
బిం దిందువంశ; యను క్రియ
నిందీవరవీథి మ్రోసె నిందిందిరముల్.

టీక:- ఇందిందిర = లక్ష్మీదేవి {ఇందిందిర - వ్యు. పద్మసంపదలతో కూడి యుండునది, లక్ష్మీదేవి }; అతి = కంటెనెక్కువ; సుందరి = అందమైనామె; ఇందిందిర = తుమ్మెదలవంటి {ఇందిందిరము - వ్యు. పద్మసంపదలతో కూడినది, తుమ్మెద (విద్యార్థి కల్పతరువు)}; చికుర = ముంగురులుకలామె; ఉన్నది = ఉంది; ఇందిందన్ = దగ్గరలోనే; శుభంబు = మంచిజరుగును; ఇందు = ఇక్కడ; ఇందువంశ = చంద్రవంశస్తుడా; అను = అనుచున్న; క్రియన్ = విధముగ; ఇందీవర = నల్ల కలువల; వీథిన్ = సమూహమునందు; మ్రోసెన్ = ఝంకారముచేసినవి; ఇందిందిరముల్ = మధుపములు .
భావము:- “ఓ చంద్రవంశోద్ధారకా! లక్ష్మీదేవికంటె అందగత్తె, తుమ్మెదల వంటి ముంగురులు గల సుందరి శకుంతల ఇక్కడే ఉంది. ఇక్కడ నీకు శుభం కలుగుతుంది.” అన్నట్లుగా కలువపూలల్లో తిరుగుచున్న తుమ్మెదలు ఝంకారాలు చేశాయి.

తెభా-9-604-క.
మా కందర్పుని శరములు
మాకందము లగుటఁ జేసి మా కందంబుల్
మాకందము లను కైవడి
మాకందాగ్రములఁ బికసమాజము లులిసెన్.

టీక:- మా = మా యొక్క; కందర్పుని = మన్మథుని; శరములు = బాణములు; మాకందములు = మామిడిపూలు; అగుటన్ = ఐ ఉండుటచేత; మాకందంబుల్ = మామిడిచెట్లు; మా = మా; కున్ = కు; అందములు = తగినవి; అను = అనుచున్న; కైవడిన్ = విధముగ; మాకంద = మామిడిచెట్ల; అగ్రములన్ = కొనకొమ్మలలో; పిక = కోయిలల; సమాజమున్ = సమూహములు; ఉలుసెన్ = కూజితములు చేసినవి .
భావము:- మా మన్మథునిబాణాలు మామిడిపూలు అగుటచేత మామిడిచెట్లు మాకు తగి ఉన్నాయి అంటున్నట్లుగా కోయిలలు కూస్తున్నాయి.

తెభా-9-605-వ.
అంత.
టీక:- అంత = అంతట .
భావము:- అంతట అలా ప్రకృతి సహకరించి ఆహ్వానిస్తునట్లు ఉండగా దుష్యంతుడు.

తెభా-9-606-క.
ఇందున్న కణ్వమునికిని
వంన మొనరించి తిరిగి చ్చెద ననుచుం
బొందుగ ననుచరులను దా
నంఱ నందంద నిలిపి టఁ జని మ్రోలన్.

టీక:- ఇందు = దీనిలో; ఉన్న = ఉన్నట్టి; కణ్వ = కణ్వుడు అనెడి; ముని = ఋషి; కిని = కి; వందనము = నమస్కారము; ఒనరించి = చేసి; తిరిగి = మరలి; వచ్చెదన్ = వస్తాను; అనుచున్ = అనుకొనుచు; పొందుగన్ = చక్కగా; అనుచరులన్ = కూడవచ్చినవారిని; తాన్ = అతను; అందఱన్ = అందరిని; అందంద = అక్కడే; నిలిపి = ఆపివేసి; అటన్ = అక్కడకు; చని = వెళ్ళి; మ్రోలన్ = ఎదురుగ .
భావము:- దుష్యంతుడు ఈ ఆశ్రమంలో ఉన్న కణ్వ మహామునికి నమస్కారం చేసి వస్తాను అనుకుంటూ, కూడ వచ్చిన వారిని అందరిని అక్కడే ఉండమని తాను ముందుకు వెళ్ళి అక్కడ ఎదురుగా.....

తెభా-9-607-శా.
ణ్వాశ్రమమందు నీరజనివాసాంతప్రదేశంబులన్
మాకందంబులనీడఁ గల్పలతికా ధ్యంబులన్ మంజు రం
భాకాండాంచితశాలలోఁ గుసుమ సంన్నస్థలిం జూచె నా
భూకాంతుండు శకుంతలన్ నవనటద్భ్రూపర్యటత్కుంతలన్.

టీక:- ఆ = ఆ; కణ్వ = కణ్వుని; ఆశ్రమము = ఆశ్రమము; అందున్ = లో; నీరజనివాస = కొలను {నీరజనివాసము – పద్మముల చోటు, సరస్సు}; అంత = దగ్గర; ప్రదేశంబులన్ = ప్రదేశములలో; మాకందంబుల = మామిడిచెట్ల; నీడన్ = నీడలలో; కల్పలతికా = పుష్పలతల; మధ్యంబులన్ = నడుమ; మంజు = మనోజ్ఞమైన; రంభా = అరటి; కాండ = బోదెలు; అంచిత = అలకరించిన; శాల = శాల; లోన్ = అందు; కుసుమ = పూలతో; సంపన్న = సంపన్నమైన; స్థలిన్ = స్థలము నందు; చూచెన్ = చూసెను; ఆ = ఆ; భూకాంతుండు = రాజు; శకుంతలన్ = శకుంతలను; నవ = సరికొత్తగా; నటత్ = చలిస్తున్న; భ్రూ = భ్రుకుటి; పర్యటత్ = అలముకొన్న; కుంతలన్ = ముంగురులు కలామెను.
భావము:- ఆ కణ్వాశ్రమంలో కొలను సమీపంలో మామిడిచెట్ల నీడలో మనోజ్ఞమైన అరటి బోదెలు అలకరించిన శాల కనబడింది. ఆ శాలలో పూలగుత్తుల నడుమ చక్కదనాల చోటునందు దుష్యంత మహారాజు నవనవోన్మేషంగా చలిస్తూ నుదుట అలముకుంటున్న ముంగురులు కల శకుంతలను సందర్శించాడు.

తెభా-9-608-క.
ట్టపుఁ దుఱుమును మీఁదికి
మిట్టించిన చన్నుఁగవయు మిఱుమిఱు చూడ్కుల్
ట్టాడునడుముఁ దేనియ
లుట్టెడు మోవియును మనము నూరింపంగన్.

టీక:- దట్టపు = వత్తుగా ఉన్న; తుఱుమును = జుట్టు; మీదికిన్ = పైకి; మిట్టించిన = నిక్కిన; చన్ను = స్తనముల; కవయున్ = జంట; మిఱుమిఱు = చలించే; చూడ్కుల్ = చూపులు; నట్టాడు = నాట్యమాడెడి; నడుమున్ = నడుము; తేనియల్ = తేనెలు; ఉట్టెడు = ఊరెడి; మోవియునున్ = పెదవి; మనమున్ = మనసున్; ఊరింపగన్ = ఆశలురేపుచుండగ.
భావము:- ఆమె వత్తుగా ఉన్న జుట్టు; పైకి ఉబికిన స్తనద్వయం; చలించే చూపులు; నాట్యలాడే నడుము; తేనెలూరే పెదవి; ఆ రాకుమారుని మనసున ఆశలు రేపసాగాయి.

తెభా-9-609-వ.
అంతనా రాజకుమారుం డలరుటమ్ములవిలుకాని వెడవింట ఘణఘణాయమానలయి మ్రోయు ఘంటలకుం బంటించి, తన మనంబున.
టీక:- అంతన్ = అంతట; రాజకుమారుండు = రాకుమారుడు; అలరుటమ్ములవిలుకాని = మన్మథుని {అలరు టమ్ముల విలుకాడు - పుష్పములు బాణములుగా గల విల్లుగలవాడు, మన్మథుడు}; వెడవింటన్ = పూలవిల్లు యొక్క; ఘణఘణ = గణగణ మనెడి శబ్దములు; ఆయమానలు = వచ్చెడివి; అయి = ఐ; మ్రోయు = ధ్వనించెడి; ఘంటల్ = గంటల; కున్ = కు; పంటించి = తడబడి; తన = తన; మనంబునన్ = మనసునందు;
భావము:- అంతట. ఆ రాకుమారుడు మారుని వింటి గంటల గణగణ ధ్వనులకు తడబడిన తన మనసులో...

తెభా-9-610-శా.
"న్యాహారములన్ జితేంద్రియత నావాసించు నా కణ్వుఁ డీ
న్యారత్నము నే గతిం గనియెడిం; గా దీ కురంగాక్షి రా
న్యాపత్యముగాఁగనోపు; నభిలాషం బయ్యెఁ; గాదేని నే
న్యాయక్రియలందుఁ బౌరవుల కెం దాశించునే చిత్తముల్?

టీక:- వన్య = అడవిలో దొరికెడి; ఆహారములన్ = కందమూలాదులను; జితేంద్రియతన్ = ఇంద్రియముల జయముతో; ఆవాసించున్ = తినెడి; ఆ = ఆ; కణ్వుడు = కణ్వుడు; ఈ = ఈ; కన్యా = యువతులలో; రత్నమున్ = శ్రేష్ఠరాలను; ఏ = ఎలాంటి; గతిన్ = విధముగను; కనియెడిన్ = పుట్టించ గలిగనివాడు; కాదు = కాదు; ఈ = ఈ; కురంగాక్షి = సుందరి {కురంగాక్షి - లేడివలె బెదురుచూపులు కలామె,వనిత}; రాజన్యా = క్షత్రియోత్తముని; ఆపత్యమున్ = సంతానము; కాగన్ = అయి; ఓపున్ = ఉండవచ్చును; అభిలాషంబు = కోరిక కలుగుట; అయ్యెన్ = జరిగెను; కాదేనిన్ = కాకపోయినచో; ఏ = ఎలాంటి; అన్యాయ = అధర్మపు; క్రియలు = పనుల; అందున్ = ఎడలను; పౌరవుల = పురువంశస్థుల; కున్ = కు; ఎందు = ఎలా చూసినను; ఆశించునే = ఆశపడునా, పడవు; చిత్తముల్ = మనసులు.
భావము:- “అడవిలో దొరికే కందమూలాలు తింటూ జితేంద్రియుడై మెసలే, ఆ కణ్వునికి ఇంతటి సుందర కన్యారత్నం ఎల పుట్టిందో? కాదు ఈ లేడి కన్నుల చిన్నది రాకుమారి అయి ఉండవచ్చు. అలా కాకపోతే నాకు ఈమె పట్ల కోరిక కలుగదు గదా. పురువంశం వారి మనసులు ఎలాంటి అధర్మకార్యాలలోనూ ప్రవర్తిల్లవు కదా.

తెభా-9-611-క.
డిగిన నృపసుతుఁ గానని
నొడివెడినో యిది మనంబు నొవ్వ"నని విభుం
డుడురాజవదన నడుగక
డుమన యొక కొంత ప్రొద్దు డఁబడ జొచ్చెన్.

టీక:- అడిగిన్ = ఒకవేళ అడిగినచో; నృపసుత = రాకుమారిని; కాను = కాను; అని = అని; నొడివెడినో = చెప్పుతుందేమో; ఇది = ఈమె; మనంబున్ = మనసు; నొవ్వన్ = నొచ్చుకొనునట్లు; అని = అని; విభుండు = రాజు; ఉడురాజవదన = చంద్రవదనను; అడుగక = అడుగకుండ; తడుమనన్ = సందేహముతో; ఒకకొంత = కొద్ది; ప్రొద్దున్ = సమయము; తడబడజొచ్చెన్ = తడబడసాగెను.
భావము:- నోరువిప్పి అడిగితే చంద్రవదనంతో అలరారే ఈ రాకుమారి, నా మనసు నొచ్చుకొనేలా కాదంటుందేమో” అనే సందేహంతో రాకుమారుడు కొద్దిసేపు తటపటాయించాడు.

తెభా-9-612-వ.
మఱియు నెట్టకేలకుఁ దన చిత్తసంచారంబు సత్యంబుగాఁ దలంచి యిట్లనియె.
టీక:- మఱియున్ = ఇంకను; ఎట్టకేలకున్ = చిట్టచివరకు; తన = తన యొక్క; చిత్త = మనసులో; సంచారంబున్ = మెదలినది; సత్యంబు = సరియగునది; కాన్ = అయినట్లు; తలంచి = భావించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను .
భావము:- ఇక చిట్టచివరకు, తన మనసులో మెదలిన ప్రేరణ సత్యమని భావించి ఇలా అన్నాడు.

తెభా-9-613-క.
"భూపాలక కన్యక వని
నీ యిఁ జిత్తంబు నాఁటె; నీవా రేరీ?
నీ పేరెవ్వరు? నిర్జన
భూర్యటనంబు దగవె? పూర్ణేందుముఖీ!"

టీక:- భూపాలకకన్యకవి = రాకుమారివి; అని = అని; నీ = నీ; పయిన్ = మీద; చిత్తంబున్ = మనసు; నాటెన్ = లగ్నమైనది; నీ = నీకు; వారు = చెందినవారు; ఏరీ = ఎక్కడ ఉన్నారు; నీ = నీ యొక్క; పేరు = నామధేయము; ఎవ్వరు = ఏమిటి; నిర్జన = జనసంచారములేని; భూపర్యటనంబు = ప్రదేశమున తిరుగుట; తగవె = సరియైన పనా, కాదు; పూర్ణేందుముఖీ = సుందరీ {పూర్ణేందుముఖి - నిండు చంద్రునివంటి మోము కలామె, స్త్రీ}.
భావము:- “ఓ నిండుచంద్రుని వంటి మోము గల సుందరీ! నీవు రాకుమారివి అని నీ మీద నా మనసు లగ్నమైంది. జనసంచారం లేని చోట ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? నీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? నీ నామధేయం ఏమిటి?”

తెభా-9-614-వ.
అని పలుకుచున్న రాజకుమారుని వదనచంద్రికారసంబు నేత్ర చకోరంబులవలనం ద్రావుచు, నయ్యువిద విభ్రాంతయై యున్న సమయంబున.
టీక:- అని = అని; పలుకుచున్న = అడుగుతున్న; రాజకుమారుని = రాకుమారుని; వదన = మోము అనెడి; చంద్రికా = చంద్రుని యొక్క; రసంబున్ = వెన్నెలను; నేత్ర = కన్నులు అనెడి; చకోరంబుల = చకోరపక్షుల; వలనన్ = వలన; త్రావుచున్ = తాగుతూ; ఆ = ఆ; యువిద = వనిత; విభ్రాంత = వివశ; అయి = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; సమయంబునన్ = సమయము నందు.
భావము:- ఇలా అడుగుతున్న రాకుమారుని ముఖంలోని వెన్నెలను తన కన్నులు అనె చకోరపక్షుల వలన తాగుతూ, ఆమె తడబడే సమయంలో.

తెభా-9-615-క.
కంఠేకాలునిచేతం
గుంఠితుఁడగు టెట్లు మరుఁడు? కుసుమాస్త్రంబుల్
లుంఠించి గుణనినాదము
ఠంమ్మన బాల నేసె వఠవ గదురన్.

టీక:- కంఠేకాలుని = పరమశివుని {కంఠేకాలుడు - కంఠము నల్లగానున్నవాడు, శంకరుడు}; చేతన్ = వలన; కుంఠితుడు = దహింపబడినవాడు; అగుట = ఐ ఉండుట; ఎట్లు = ఎలా అగును, కాదు; మరుడున్ = మన్మథుడు; కుసుమ = పూల; అస్త్రంబుల్ = బాణములను; లుంఠించి = సంధించి; గుణ = అల్లెతాడు; నినాదము = ధ్వని; ఠంఠమ్ము = ఠంకారము; అనన్ = చేయగా; బాలన్ = బాలికపైన; ఏసెన్ = ప్రయోగించెను; ఠవఠవ = టకటకమని; కదురన్ = పడేలాగ.
భావము:- అదిగో మన్మథుడు ఆ పిల్ల మీద అల్లెతాడు ఠంఠమ్మనేలా పూలబాణాలు సంధించి ఠవఠవ మని నాటేలా వేసాడు. కంఠంనల్లగా ఉన్న శంకరుడు మరులురేపే మన్మథుని దహించాడు అంటే ఎలా నమ్మేది.

తెభా-9-616-వ.
ఇట్లు వలరాచవాని క్రొవ్విరికోలలవేఁడిమిఁ దాలిమిపోఁడిమి చెడి, యా వాలుఁగంటి యిట్లనియె.
టీక:- ఇట్లు = ఇలా; వలరాచవాని = మన్మథుని; క్రొవ్వు = బలమైన; విరి = పూల; కోలలన్ = బాణముల; వేడిమిన్ = తాపమువలన; తాలిమిన్ = ఓర్పు; పోడిమిన్ = నేర్పు; చెడి = పోయి; ఆ = ఆ; వాలుగంటి = సుందరి {వాలుగంటి - వాలుచూపులామె, స్త్రీ}; ఇట్లు = ఇలా; అనియె = పలికెను .
భావము:- ఇలా మన్మథుని బలమైన పూల బాణాల తాపం తట్టుకునే ఓర్పు నేర్పు లేక, ఆ వాలుచూపుల సుందరి శకుంతల దుష్యంతునితో ఇలా పలికింది.

తెభా-9-617-మ.
"నివార్యప్రభ మున్ను మేనకయు విశ్వామిత్రభూభర్తయుం
ని; రా మేనక డించిపోయెనడవిం; ణ్వుండు నన్నింతగా
నిచెన్; సర్వము నామునీంద్రుఁ డెఱుఁగున్; ద్భాగధేయంబునన్
నినుఁగంటిం బిదపం గృతార్థ నగుచున్ నేఁడీ వనాంతంబునన్.

టీక:- అనివార్య = అమోఘమైన; ప్రభన్ = తేజస్సుతో; మున్ను = పూర్వము; మేనకయున్ = మేనక; విశ్వామిత్ర = విశ్వామిత్రుడనెడి; భూభర్తయున్ = రాజు; కనిరి = కన్నారు; మేనక = మేనక; డించి = వదలి; పోయెన్ = వెల్లపోయినది; అడవిన్ = అడవియందు; కణ్వుండు = కణ్వుడు; నన్నున్ = నన్ను; ఇంత = ఇంతదానిని; కాన్ = అగునట్లు; మనిచెన్ = పెంచెను; సర్వమున్ = సమస్తము; ఆ = ఆ; ముని = ఋషులలో; ఇంద్రుండు = ఉత్తముడు; ఎఱుగున్ = తెలియును; మత్ = నా యొక్క; భాగదేయంబునన్ = సౌభాగ్యము వలన; నినున్ = నిన్ను; కంటిన్ = చూసితిని; పిదపన్ = తరువాత; కృతార్థన్ = ధన్యురాలను; అగుచున్ = అగుచు; నేడు = ఇవాళ; ఈ = ఈ; వన = అడవి; అంతంబునన్ = లోపల.
భావము:- “పూర్వం విశ్వామిత్ర మహారాజు అమోఘమైన తేజస్సుతో మేనక నన్ను కన్నది. ఆ మేనక అడవిలో వదలి తన లోకానికి వెళ్ళిపోయింది. కణ్వమహర్షి చూసి అన్నీ తానై నన్ను పెంచాడు. ఇవాళ ఈ అడవిలో నా అదృష్ట వశాత్తు నిన్ను చూసాను, ధన్యురాలను అయ్యాను.

తెభా-9-618-క.
నీ వారము ప్రజలేమును
నీవారము పూజగొనుము నిలువుము నీవున్
నీవారును మా యింటను
నీవారాన్నంబుగొనుఁడు నేఁడు నరేంద్రా! "

టీక:- నీ = నీకు చెందిన; వారము = వాళ్ళము; ప్రజలున్ = ప్రజలు; ఏమునున్ = మేము; ఈ = ఈ; వారమున్ = రోజు; పూజన్ = మా పూజలన; కొనుము = అందుకొనుము; నిలువుము = ఆగుము; నీవున్ = నీవు; నీ = నీయొక్క; వారునున్ = పరివారము; మా = మా యొక్క; ఇంటన్ = ఇంటిలో; నీవారి = నివ్వరియైన {నీవారము - విత్తక పండెడు దూసర్లు లోనగు తృణధాన్యము, నివ్వరి}; అన్నంబున్ = అన్నమును; కొనుడు = తీసుకొనండి; నేడు = ఇవాళ; నరేంద్రా = రాజా .
భావము:- ఓ రాజా! పౌరులు, మా ఆశ్రమవాసులం అందరం నీ వాళ్ళమే నయ్యా! ఇవాళ్టికి ఇక్కడ ఆగి మా పూజలు అందుకో. మా యింట్లో నివ్వరి అన్నంతో ఆతిథ్యాన్ని స్వీకరించు.
. – అని శకుంతల తమ కణ్వాశ్రమానికి వచ్చిన దుష్యంతునితో పలికింది. నీవార అంటు ప్రతి పాదం మొదట చమత్కారంగా వాడిన విధం పద్యానికి వన్నెతెచ్చింది. ఒకటి కంటె ఎక్కువ అక్షరాలు అర్థ భేదంతో ఒకటి కంటె ఎక్కువ మారులు ప్రయోగిస్తే అది యమకాలంకారం అంటారు. నాలుగు పాదాలలో నీవాళ్ళం, ఈరోజు, నీపరిజనులు, చక్కటిభోజనం అనే నాలుగు అర్థ భేద ప్రయోగాలతో ఇక్కడ యమకం చక్కగా పండింది."

తెభా-9-619-వ.
అని పలికిన, దుష్యంతుండు మెచ్చి, మచ్చెకంటి యిచ్చ యెఱింగి యిట్లనియె.
టీక:- అని = అని; పలికినన్ = చెప్పగా; దుష్యంతుడు = దుష్యంతుడు; మెచ్చి = సంతోషించి; మచ్చెకంటి = చేపకళ్ళచిన్నదాని {మచ్చెకంటి - చేపవంటి కన్నులు కలామె, స్త్రీ}; ఇచ్చన్ = మనసు; ఎఱింగి = అర్థముచేసికొని; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను .
భావము:- అని శకుంతల చెప్పగా దుష్యంతుడు సంతోషించి ఆ చేపకళ్ళ చిన్నదాని మనసు అర్థం చేసికొని ఇలా అన్నాడు.

తెభా-9-620-ఆ.
"రాజతనయ వగుదు రాజీవదళనేత్ర!
మాట నిజము లోనిమాటలేదు
నకు సదృశుఁడయిన రుణునిఁ గైకొంట
రాజసుతకుఁ దగవు రాజవదన! "

టీక:- రాజతనయ = క్షత్రియకన్యవే; అగుదు = అయ్యి ఉంటావు; రాజీవదళనేత్ర = పద్మపత్రనయన; మాట = ఆ మాట; నిజము = సత్యము; లోనిమాట = దాపరికమేమి; లేదు = లేదు; తన = తన; కున్ = కు; సదృశుడు = తగినవాడు; అయిన = ఐన; తరుణుని = యువకుని; కైకొంట = స్వీకరించుట; రాజసుత = రాకుమారి; కున్ = కి; తగవు = తగినపనే; రాజవదన = చంద్రవదన .
భావము:- “కమల దళాల వంటి కన్నులు కల ఓ చంద్రవదన! నీవు క్షత్రియకన్యవే అయి ఉంటావు. ఆ మాట సత్యమే కదా. దీనికి దాపరికం ఎందుకు. రాచకన్నె తనకు తగిన వరుణ్ణి స్వీకరించడం తప్పేం కాదు. తగినపనే.”

తెభా-9-621-వ.
అని మఱియుఁ దియ్యని నెయ్యంపుఁ బలుకులవలన నయ్యువిద నియ్యకొలిపి.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకా; తియ్యని = మధురమైన; నెయ్యంపు = స్నేహపూరిత; పలుకుల = మాటల; వలనన్ = వలన; ఆ = ఆ; యువిదన్ = యువతిని; ఇయ్యకొలిపి = అంగీకరింపజేసి;
భావము:- అని ఇంకా అనేక మృదు మధుర సంభాషణలతో ఆమెను అంగీకరింపజేసి.....

తెభా-9-622-క.
బంధురయశుఁడు జగన్నుత
సంధుఁడు దుష్యంతుఁ డుచిత మయజ్ఞుండై
గంగజగమన నప్పుడు
గాంర్వవిధిన్ వరించె హనాంతమునన్.

టీక:- బంధుర = చక్కటి; యశుడు = కీర్తి కలవాడు; జగత్ = లోకముచే; నుత = స్తుతింపబడుట; సంధుడు = సంధిల్లజేసికొనువాడు; దుష్యంతుడు = దుష్యంతుడు; ఉచిత = తగిన; సమయజ్ఞడు = కాలజ్ఞత తెలిసినవాడు; ఐ = అయ్యి; గంధగమనన్ = శకుంతలను {గంధగమన - ఏనుగు వంటి నడక కలామె, స్త్రీ}; అప్పుడు = అప్పుడు; గాంధర్వ = గాంధర్వ; విధిన్ = విధానములో; వరించెన్ = పెండ్లాడెను; గహన = అడవి; అంతమునన్ = లో .
భావము:- జగన్నుత కీర్తిమంతుడు, తగిన కాలజ్ఞత కలవాడు అయిన దుష్యంతుడు, అప్పుడు ఆ అడవిలో గజగమనను శకుంతలను గాంధర్వ వివాహం చేసుకున్నాడు.

తెభా-9-623-వ.
ఇవ్విధంబున నమోఘవీర్యుండగు నా రాచపట్టి, దపసిరాచూలికిఁ జూలు నెక్కొలిపి, మఱునాఁడు తన వీటికిం జనియె; నయ్యింతియుఁ గొంతకాలంబునకుఁ గొడుకుం గనినఁ గణ్వమునీంద్రుం డా రాచపట్టికి జాతకర్మాది మంగళాచారంబు లొనర్చె; నా డింభకుండును దినదినంబునకు బాలచంద్రుఁడునుం బోలె నెదుగుచు.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగ; అమోఘ = అమోఘమైన; వీర్యుండు = తేజోవంతుడు; అగు = ఐన; ఆ = ఆ; రాచపట్టి = రాకుమారుడు; తపసిరాచూలి = శకుంతల {తపసిరాచూలు - ఋషి యొక్క రాకుమారి, శకుంతల}; కిన్ = కి; చూలు = గర్భము; నెక్కొలిపెను = పాదుకొనజేసెను; మఱు = తరవాతి; నాడు = దినమున; తన = తన యొక్క; వీడు = పురమున; కిన్ = కు; చనియెన్ = వెళ్ళిపోయెను; ఆ = ఆ; ఇంతియున్ = వనిత; కొంత = కొద్ది; కాలమున్ = కాలమున; కున్ = కు; కొడుకున్ = పుత్రుని; కనినన్ = కనగా; కణ్వ = కణ్వుడు అనెడి; ముని = ఋషి; ఇంద్రుడు = ఉత్తముడు; ఆ = ఆ; రాచపట్టి = రాకుమారుని; కిన్ = కి; జాతకర్మ = బాలసార {జాతకర్మ - పుట్టినప్పుడు చేసెడి కర్మములు, బాలసారాది}; ఆది = మున్నగు; మంగళ = శుభ; ఆచారంబులున్ = కార్యములను; ఒనర్చెన్ = చేసెను; ఆ = ఆ; డింభకుండును = పిల్లవాడు; దినదినంబున్ = రోజురోజు; కున్ = కి; బాలచంద్రుడునున్ = బాలచంద్రుని; పోలెన్ = వలె; ఎదుగుచున్ = పెరుగుతు.
భావము:- ఈ విధంగా అమోఘతేజోవంతుడు అయిన ఆ దుష్యంత రాకుమారుడు, ఋషి కన్యగా ఉన్న రాకుమారి శకుంతలను గర్భవతిని చేసి, మరునాడు తన పురానికి వెళ్ళిపోయాడు. ఆమె కొంతకాలానికి కుమారుని కన్నది. కణ్వమహాముని ఆ రాకుమారునికి జాతకాది కర్మలు చేసాడు. ఆ పసివాడు బాలచంద్రుడిలా దినదిన ప్రవకర్థమానుడు అయ్యాడు.

తెభా-9-624-క.
కుంఠితుఁడుగాక వాఁడు
త్కంఠం దన పిన్ననాఁడె ణ్వవనచర
త్కంఠీరవ ముఖ్యంబుల
కంములం బట్టి యడుచుఁ; ట్టున్; విడుచున్.

టీక:- కుంఠితుడుగాక = మొక్కపోనిధైర్యముకలవాడై; వాడు = అతను; ఉత్కంఠన్ = ఉత్కంఠముతో {ఉత్కంఠము - నేర్చుకొనుటాది యందలి వేగిరపాటు}; తన = తన యొక్క; పిన్ననాడె = పసితనమునందె; కణ్వ = కణ్వుని; వన = ఆశ్రమమునందు; చరత్ = తిరిగెడి; కంఠీరవ = సింహము; ముఖ్యంబులన్ = మున్నగువానిని; కంఠములన్ = మెడలు; పట్టి = పట్టి; అడుచున్ = అణచివేయును; కట్టున్ = కట్టివేయును; విడుచున్ = విడిచిపెట్టును .
భావము:- పసితనంలోనే మొక్కపోని ధైర్యంతో ఆ కణ్వాశ్రమంలో తిరుగుతున్న సింహాలను సైతం మెడలు వంచి లొంగదీసుకుని కట్టివేసేవాడు.

తెభా-9-625-వ.
అంత నా కణ్వమునీంద్రుండు బాలకుం జూచి శకుంతల కిట్లనియె.
టీక:- అంతన్ = అంతట; ఆ = ఆ; కణ్వ = కణ్వుడు అనెడి; ముని = ఋషులలో; ఇంద్రుండు = శ్రేష్ఠుడు; బాలకున్ = పిల్లవానిని; చూచి = కనుగొని; శకుంతల = శకుంతల; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను .
భావము:- అప్పుడు, ఆ కణ్వమహర్షి ఆ బాలుడి నేర్పులు చూసి, శకుంతలతో ఇలా అన్నాడు.

తెభా-9-626-ఉ.
"ట్టపురాజు నీ మగఁడు; పాపఁడు నన్నిట నెక్కు డంతకుం;
ట్టపుదేవివై గఱువ! బాగున నుండక పాఱువారితో
ట్టువనంబులో నవయఁగాఁ బనిలే దిటఁ దర్లిపోఁగదే
పుట్టిన యిండ్ల మానినులు పోరచిగా ననిశంబు నుందురే? "

టీక:- పట్టపు = పట్టాభిషిక్తమైన; రాజు = రాజు; నీ = నీ యొక్క; మగడున్ = భర్త; పాపడున్ = పిల్లవాడు; అన్నిటన్ = అన్నివిషయములలోను; ఎక్కుడున్ = అందెవేసినచెయ్యి; అంతకున్ = అందుచేత; పట్టపుదేవివి = పట్టపురాణివి; ఐ = అయ్యి; గఱువ = అధికురాల; బాగుగన్ = చక్కగ; ఉండక = ఉండకుండ; పాఱువారి = బ్రాహ్మణుల; తోన్ = తోటి; కట్టున్ = పొత్తుతో; వనంబు = అడవి; లోనన్ = అందు; నవయగాన్ = కష్టపటవలసిన; పనిలేదు = అవసరములేదు; ఇటన్ = ఇక్కడనుండి; తరలిపోగదే = వెళ్ళిపొమ్ము; పుట్టినయిండ్లన్ = పుట్టిళ్ళలో; మానినులు = మానవతులు; పోరచిగాన్ = నిస్సారముగా; అనిశంబున్ = ఎల్లకాలము; ఉందురే = ఉండిపోతారా, ఉండరు .
భావము:- “నీ భర్త పట్టపుమహారాజు. నీ కొడుకు అన్నింట్లోను అందెవేసిన చెయ్యి. మరి, నీవు పట్టపురాణివి అయ్యి గొప్పగా ఉండక, బ్రాహ్మణులతో పొత్తు పెట్టుకుని ఇలా అడవిలో కష్టాలు పడడం ఎందుకు. మానవతులు పుట్టింట్లో ఉండిపోరు కదా. అందుచేత వెంటనే బయలుదేరి పొమ్ము.”

తెభా-9-627-వ.
అనిన నియ్యకొని.
టీక:- అనినన్ = అనగా; ఇయ్యకొని = అంగీకరించి .
భావము:- అలా భర్త వద్దకు వెళ్ళమని కణ్వమహర్షి చెప్పగా శకుంతల అంగీకరించింది.

తెభా-9-628-క.
"ఆ పిన్నవాని నతుల
వ్యాపారు నుదారు వైష్ణవాంశోద్భవునిం
జూపెద"నంచు శకుంతల
భూపాలునికడకు వచ్చెఁ బుత్రుని గొనుచున్.

టీక:- ఆ = ఆ; పినవాని = పిల్లవాడిని; అతుల = సాటిలేని; వ్యాపారున్ = సాహసవంతుని; ఉదారున్ = గొప్పవానిని; వైష్ణవ = విష్ణుమూర్తి యొక్క; అంశ = అంశతో; ఉద్భవునిన్ = పుట్టనివానిని; చూపెదన్ = చూపించెదను; అంచున్ = అనుచు; శకుంతల = శకుంతల; భూపాలుని = రాజు; కడ = వద్ద; కున్ = కు; వచ్చెన్ = వచ్చెను; పుత్రునిన్ = కొడుకును; కొనుచున్ = తీసుకొని.
భావము:- “సాటిలేని సాహసవంతుడు, వైష్ణవాంశ సంభూతుడు అయిన ఈ పిల్లవాడిని చూపిస్తాను” అంటూ శకుంతల దుష్యంతమహారాజు దగ్గరకి కొడుకును తీసుకొని వచ్చింది.

తెభా-9-629-వ.
వచ్చి దుష్యంతుండున్న సభామండపంబునకుం జని నిలిచి యున్న యెడ.
టీక:- వచ్చి = వచ్చి; దుష్యంతుండు = దుష్యంతుడు; ఉన్న = ఉన్నట్టి; సభా = సభలోని; మండపంబున్ = మండపమున; కున్ = కు; చని = వెళ్ళి; నిలిచి = నిలబడి; ఉన్న = ఉన్నట్టి; ఎడన్ = సమయమునందు .
భావము:- శకుంతల అలా వచ్చి దుష్యంతుడు ఉన్న సభామండపంలో నిలబడింది. అప్పుడు.

తెభా-9-630-మ.
కేలన్ గురుచక్రరేఖయుఁ బదద్వంద్వంబునం బద్మరే
లు నొప్పారఁగ నందు వచ్చిన రమాకాంతుండు నాఁ గాంతి న
గ్గమై యున్న కుమారు మారసదృశాకారున్ విలోకించి తాఁ
లుకం డయ్యె విభం డెఱింగి సతి విభ్రాంతాత్మ యై యుండగన్.

టీక:- వల = కుడి; కేలన్ = చేతిలో; గురు = గొప్ప; చక్రరేఖయున్ = చక్రము; పద = పాదముల; ద్వంద్వంబునన్ = రెంటి యందు; పద్మరేఖలు = పద్మములు; ఒప్పారగన్ = చక్కగా ఉండి; అందున్ = అక్కడకు; వచ్చిన = వచ్చినట్టి; రమాకాంతుండు = విష్ణుమూర్తి; నాన్ = వలె; కాంతిన్ = ప్రకాశముతో; అగ్గలము = అతిశయించినవాడు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నటువంటి; కుమారున్ = పుత్రుని; మార = మన్మథునితో; సదృశ = సమానమైన; ఆకారున్ = స్వరూపము కలవానిని; విలోకించి = చూసి; తాన్ = అతను; పలుకండు = మాట్లాడనివాడు; అయ్యెన్ = అయ్యెను; విభుండు = రాజు; ఎఱింగి = తెలిసినప్పటికి; సతి = భార్య; విభ్రాంత = తడబడెడి; ఆత్మ = మనసుకలామె; ఐ = అయ్యి; ఉండగన్ = ఉండగా.
భావము:- కుడి చెతిలో చక్రం, పాదాలు రెంటిలోను పద్మం గుర్తులతో విష్ణుమూర్తిలా ప్రకాశిస్తూ మన్మథాకారుడిలా ఉన్న కొడుకు ఎదురుగా వచ్చి ఉన్ననూ, మాట్లాడని తన భర్త దుష్యంతుని చూసి శకుంతల తడబడి మనసులో విచారించింది.

తెభా-9-631-వ.
ఆ సమయంబున.
టీక:- ఆ = ఆ; సమయంబునన్ = సమయమునందు .
భావము:- అలా బహు యోగ్యుడైన కొడుకుతో భార్య అయిన శకుంతల వచ్చి ఎదురుగా నిలబడినా దుష్యంత మహారాజు మౌనంగా ఉన్న ఆ సమయంలో.

తెభా-9-632-మ.
"దె నీ వల్లభ; వాఁడు నీ సుతుఁడు; భార్యాపుత్రులం బాత్రులన్
లంగా; దలనాఁటి కణ్వవనికా వైవాహికారంభముల్
ది నూహింపు; శకుంతలావచనముల్ మాన్యంబుగా భూవరేం
ద్ర! యం జేకొను"మంచు మ్రోసెను వియద్వాణీవధూవాక్యముల్.

టీక:- అదె = అదిగో; నీ = నీ యొక్క; వల్లభ = భార్య; వాడు = అతడు; నీ = నీ యొక్క; సుతుడు = కొడుకు; భార్యా = పెళ్ళాము; పుత్రులన్ = కొడుకులను; పాత్రులన్ = యోగ్యులన్; వదలన్ = వదలిపెట్టుట; కాదు = తగినది కాదు; నాటి = ఆనాటి; కణ్వ = కణ్వుని; అవనికా = ఆరామము నందలి; వైవాహిక = వివాహమాడిన; ఆరంభముల్ = సంబరములను; మదిన్ = మనసు నందు; ఊహింపు = తలచుకొనుము; శకుంతల = శకుంతల యొక్క; ఆ = ఆ; వచనముల్ = మాటలు; మాన్యంబుగాన్ = గౌరవించునట్లు; భూవరేంద్ర = మహారాజ; దయన్ = కరుణతో; చేకొనుము = స్వీకరించుము; అంచున్ = అనుచు; మ్రోసెన్ = పలికెను; వియద్వాణీ = ఆకాశవాణి; వధూ = కల్యాణ; వాక్యముల్ = పలుకులు.
భావము:- ఆకాశవాణి “ఓ మహారాజా! అదిగో ఆమె నీ భార్య; అతడు నీ కొడుకు; యోగ్యులైన భార్యాపుత్రులను వదలిపెట్టుట తగిన పని కాదు. ఆనాటి కణ్వాశ్రమంలో వివాహమాడిన సంబరాలను మనసులో తలచుకో. శకుంతల మాటలు గౌరవించి దయతో ఆమెను స్వీకరించు.” అంటూ పలికింది.

తెభా-9-633-వ.
ఇట్లశరీరవాణి సర్వభూతంబులకుఁ దేటపడ భరింపు మని పలికిన, నా కుమారుండు భరతుండయ్యె; నంత నా రాజు రాజవదన నంగీకరించి తనూభవుం జేకొని కొంతకాలంబు రాజ్యంబుజేసి పరలోకంబునకుం జనియె; తదనంతరంబ.
టీక:- ఇట్లు = ఈ విధముగ; అశరీరవాణి = అకాశవాణి; సర్వ = సమస్తమైన; భూతంబుల్ = ప్రాణులకు; తేటపపడన్ = తెలియునట్లుగ; భరింపుము = భరించుము; అని = అని; పలికినన్ = చెప్పుట చేత; ఆ = ఆ; కుమారుండు = బాలకుడు; భరతుండు = భరతుడు; అయ్యెన్ = అయ్యెను; అంతన్ = అంతట; ఆ = ఆ; రాజు = రాజు; రాజవదనన్ = పద్మవదనను; అంగీకరించి = ఒప్పుకొని; తనూభవున్ = పుత్రుని {తనూభవుడు - తనువున పుట్టినవాడు, కొడుకు}; చేకొని = స్వీకరించి; కొంతకాలంబున్ = కొన్నాళ్ళు; రాజ్యంబున్ = రాజ్యము; చేసి = పాలించి; పరలోకంబునకుంజనియె = పరలోకగతుడయ్యెను; తదనంతరంబునన్ = ఆ తరువాత.
భావము:- ఈ విధంగా అకాశవాణి అందరూ వినేలా “భరించుము” అని చెప్పుట చేత, ఆ బాలకుడు “భరతుడు”గా ప్రసిద్ధుడు అయ్యాడు. అంతట దుష్యంతమహారాజు పద్మవదన శకుంతలను పుత్రుని స్వీకరించి కొంతకాలం రాజ్యం పాలించి పరలోకగతుడు అయ్యాడు. అటు పిమ్మట.

తెభా-9-634-క.
రెంవహరి క్రియ ధరణీ
మంలభారంబు నిజసమంచితబాహా
దంమున నిలిపి తనకును
భంనమున నెదురులేక రతుం డొప్పెన్.

టీక:- రెండవ = రెండవ; హరి = విష్ణువు; క్రియన్ = వలె; ధరణీమండల = భూచక్రము; భారంబున్ = పరిపాలించెడి భారమును; నిజ = తన; సమంచిత = చక్కటి; బాహాదండమునన్ = భుజములపై; నిలిపి = ఉంచుకొని; తన = తన; కును = కు; భండనమునన్ = యుద్ధము నందు; ఎదురులేక = తిరుగులేకుండ; భరతుండు = భరతుడు; ఒప్పెన్ = విలసిల్లెను.
భావము:- ఆ భరతుడు రెండవ విష్ణువా అన్నట్లు భూభారం సర్వం తన భుజస్కంధాలపై ధరించి, యుద్ధంలో తనకు తిరుగన్నది లేకుండ భరతుడు విలసిల్లాడు.

తెభా-9-635-వ.
మఱియునా దౌష్యంతి, యమునాతటంబున దీర్ఘతపుండు పురోహితుండుగా డెబ్బదియెనిమిదియును, గంగాతీరంబున నేఁబది యయిదును, నిట్లు నూటముప్పదిమూఁడశ్వమేధయాగంబులు సదక్షిణంబులుగా నొనర్చి; దేవేంద్రవిభవంబున నతిశయించి, పదుమూఁడువేలునెనుబదినాలుగు కదుపుధేనువులుగలయది ద్వంద్వంబనం బరఁగు, నట్టి వేయి ద్వంద్వంబుల పాఁడిమొదవులఁ గ్రేపులతోడ నలంకారసహితలం జేసి వేవురు బ్రాహ్మణుల కిచ్చి, మష్కార తీర్థకూలంబున విప్రముఖ్యులకుఁ బుణ్యదినంబున గనక భూషణ శోభితంబులయి ధవళదంతంబులు గల నల్లని యేనుంగులం బదునాలుగులక్షల నొసంగె; దిగ్విజయకాలంబున శక, శబర, బర్బర, కష, కిరాతక, హూణ, మ్లేచ్ఛ దేశంబుల రాజులఁ బీచంబడంచి, రసాతలంబున రాక్షస కారాగృహంబులందున్న వేల్పుల గరితలం బెక్కండ్ర విడిపించి తెచ్చి, వారల వల్లభులం గూర్చె; త్రిపురదానవుల జయించి; నిర్జరుల నిజమందిరంబుల నునిచె; నతని రాజ్యంబున గగన ధరణీతలంబులు ప్రజలుగోరిన కోరిక లిచ్చుచుండె; నివ్విధంబున.
టీక:- మఱియున్ = ఇంకను; దౌష్యంతి = భరతుడు {దౌష్యంతి - దుష్యంతుని పుత్రుడు, భరతుడు}; యమునా = యమునానదీ; తటంబునన్ = ఒడ్డునందు; దీర్ఘతపుండు = దీర్ఘతపుడు; పురోహితుండు = పురోహితుడు; కాన్ = అయ్యుండగా; డెబ్బదియెనిమిదియును = డెబ్బైయెనిమిది (78); గంగా = గంగానదీ; తీరంబునన్ = ఒడ్డునందు; ఏబదియయిదునున్ = ఏభైయైదు (55); ఇట్లు = ఈ విధముగ; నూటముప్పదిమూడు = నూటముప్పైమూడు (133); అశ్వమేథ = అశ్వమేథము అనెడి; యాగంబులున్ = యాగములను; సదక్షిణముగా = నేర్పుగా చేయబడినవిగా; ఒనర్చి = చేసి; దేవేంద్ర = ఇంద్రుని వంటి; విభవంబునన్ = వైభవముతో; అతిశయించి = పెంపు కలిగి; పదుమూడువేలున్ = పదమూడువేల; ఎనుబదినాలుగు = ఎనభైనాలుగు; కదుపు = పాడి; ధేనువులున్ = ఆవులు; కలయది = కలది; ద్వంద్వంబున్ = ద్వంద్వము; అనన్ = అనగా; పరగున్ = తెలియబడును; అట్టి = అటువంటి; వేయి = వెయ్యి (1000); ద్వంద్వంబుల = ద్వంద్వముల; పాడి = పాలిచ్చునవైన; మొదవులన్ = ఆవులను; క్రేపుల = దూడలతో; తోడన్ = తోపాటు; అలంకారసహితలన్ = అలంకరింపబడినవిగా; చేసి = చేసి; వేవురు = వెయ్యిమంది (1000); బ్రాహ్మణుల్ = విప్రుల; కున్ = కు; ఇచ్చి = దానముచేసి; మష్కార = మష్కారనదీ; తీర్థ = పుణ్యతీర్థము; కూలంబునన్ = గట్టుమీద; విప్ర = బ్రాహ్మణ; ముఖ్యుల్ = ప్రముఖుల; కున్ = కు; పుణ్యదినంబునన్ = మంచిరోజులలో, శ్రాద్ధదినములలో; కనక = బంగారపు; భూషణ = ఆభరణములతో; శోభితంబులు = విలసిల్లుతున్నవి; అయి = ఐ; ధవళ = తెల్లని; దంతంబులు = దంతములు; కల = కలిగిన; నల్లని = నల్లటి; ఏనుగులన్ = ఏనుగులను; పదునాలుగులక్షలన్ = పద్నాలుగులక్షలు (14,00,000); ఒసంగెన్ = దానముచేసెను; దిగ్విజయ = దిగ్విజయయాత్రచేసెడి; కాలంబునన్ = సమయమునందు; శక = శకుల; శబర = శబరుల; బర్బర = బర్బరుల; కష = కషుల; కిరాతక = కిరాతకుల; హూణ = హూణుల; మ్లేచ్ఛ = మ్లేచ్ఛుల; దేశంబులన్ = దేశము లందలి; రాజులన్ = రాజుల యొక్క; పీచంబు = గర్వము; అడంచి = అణిచివేసి; రసాతలంబునన్ = పాతాళములో; రాక్షస = రాక్షసుల యొక్క; కారాగృహంబుల = చెరసాలల; అందు = లో; ఉన్న = ఉన్నట్టి; వేల్పుల = దేవతల; గరితలన్ = భార్యను; పెక్కండ్రన్ = అనేక మందిని; విడిపించి = విడుదలచేసి; తెచ్చి = తీసుకొని వచ్చి; వారల = వారి యొక్క; వల్లభులన్ = భర్తలతో; కూర్చెన్ = కలిపెను; త్రిపురదానవులన్ = త్రిపురాసురులను; జయించి = గెల్చి; నిర్జరులన్ = దేవతలను; నిజ = వారి యొక్క; మందిరంబులనున్ = ఇండ్లలో; ఉనిచెన్ = ఉండునట్లుచేసెను; అతని = అతని యొక్క; రాజ్యంబునన్ = రాజ్యము నందు; గగన = ఆకాశ; ధరణీ = భూ; తలంబులున్ = మండలములు; ప్రజలు = ప్రజలు; కోరిన = కోరినట్టి; కోరికలున్ = కోరికలను; ఇచ్చుచున్ = ఇస్తూ; ఉండెన్ = ఉండెను; ఈ = ఈ; విధంబునన్ = విధముగ.
భావము:- అంతేకాక, భరతుడు దీర్ఘతపుడు పురోహితుడుగా యమునానది గట్టు మీద డెబ్బైయెనిమిది; గంగానది గట్టుమీద ఏభైయైదు; ఇలా నూటముప్పైమూడు అశ్వమేథ యాగాలు చేసాడు. ఇంద్రవైభవంతో అతిశయించాడు. పదమూడువేల ఎనభైనాలుగు పాడి ఆవులు కలదానిని ద్వంద్వము అంటారు. అటువంటి వెయ్యి ద్వంద్వముల అలంకరింపబడిన పాలిచ్చే ఆవులను, దూడల తోపాటు, వెయ్యిమంది విప్రులకు దానం చేసాడు. మష్కారా పుణ్యతీర్థం గట్టుమీద బ్రాహ్మణులకు శుభతిథులలో, శ్రాద్ధదినాలలో బంగారు ఆభరణములతో విలసిల్లుతున్న పద్నాలుగులక్షలు తెల్లని దంతాలు కల నల్లటి ఏనుగులను (14,00,000) దానం చేసాడు. దిగ్విజయ యాత్రచేసే సమయంలో శక, శబర, బర్బర, కష, కిరాతక, హూణ, మ్లేచ్ఛ దేశాల రాజుల గర్వం అణిచేసాడు. పాతాళంలో రాక్షసుల బంధీలుగా ఉన్న అనేకమంది దేవతాస్త్రీలను విడిపించాడు. వారిని తెచ్చి వారి భర్తలతో కలిపాడు. త్రిపురాసురులను గెల్చి దేవతలను వారి వారి స్థానాలలో ఉండేలా చేసాడు. అతని రాజ్యంలో భూమ్యాకాశాలు ప్రజలు కోరిన కోరికలు తీరుస్తూ ఉండేవి. ఈ విధంగా.

తెభా-9-636-ఆ.
త్యచరితమందుఁ లమందు బలమందు
భాగ్యమందు లోకతులకంటె
నెక్కుడైన పేర్మి నిరువదియేడువే
లేండ్లు ధరణి భరతుఁ డేలె నధిప!

టీక:- సత్య = సత్యమైన; చరితము = ప్రవర్తన; అందున్ = లోను; చలము = పట్టుదల; అందున్ = లోను; బలము = శక్తి; అందున్ = లోను; భాగ్యము = సంపదల; అందున్ = లోను; లోకపతులు = దిక్పాలకుల; కంటెన్ = కంటె; ఎక్కుడున్ = అధికమైనది; ఐన = అయిన; పేర్మిన్ = వైభవముతో; ఇరువదియేడువేల = ఇరవైయేడువేల (27,000); ఏండ్లు = సంవత్సరములు; ధరణిన్ = భూమిని; భరతుడు = భరతుడు; ఏలెన్ = పరిపాలించెను; అధిప = రాజా.
భావము:- ఓ పరీక్షిన్మహారాజా! సత్యవర్తనతో, పట్టుదలతో, అధిక శక్తి సంపదలతో దిక్పాలకులను మించిన వైభవంతో ఇరవైయేడువేల ఏళ్ళు భరతుడు రాజ్యం ఏలాడు.

తెభా-9-637-క.
ర్థపతికంటెఁ గలిమిఁ గృ
తార్థుండై యతుల శౌర్య లవడియు నతం
ర్థములను బ్రాణములను
వ్యర్థము లని తలఁచి శాంతుఁ య్యె నరేంద్రా!

టీక:- అర్థపతి = కుబేరుని; కంటెన్ = కంటె; కలిమిన్ = సంపదలతో; కృతార్థుండు = అనుకొన్నది సాధించువాడు; ఐ = అయ్యి; అతుల = సాటిలేని; శౌర్యమున్ = శౌర్యము; అలవడియున్ = కలిగి ఉండి; అతండు = అతను; అర్థములను = ధనములను; ప్రాణములను = ప్రాణములను; వ్యర్థములు = పనికిరానివి; అని = అని; తలచి = భావించి; శాంతుఁడు = శాంతము కలవాడు {శాంతము – కామక్రోధాది రాహిత్యము}; అయ్యెన్ = అయ్యెను; నరేంద్రా = రాజా.
భావము:- రాజా పరీక్షిత్తూ! పిమ్మట, కుబేరుని మించిన సంపదలు, అనుకున్నదెల్లా సాధించే సాటిలేని శౌర్యం ఉన్నా, భరతుడు అర్థప్రాణాలు వ్యర్థాలని గ్రహించి పరమ శాంతుడుగా అయ్యాడు.

తెభా-9-638-క.
తుని భార్యలు మువ్వురు
రుసం బుత్రకులఁ గాంచి ల్లభుతోడన్
రిగారని తోడ్తోడను
శిములు దునుమాడి రాత్మ శిశువుల నధిపా!

టీక:- భరతుని = భరతుని యొక్క; భార్యలు = భార్యలు; మువ్వురున్ = ముగ్గురు; వరుసన్ = వరసగా; పుత్రకులన్ = కొడుకులన్; కాంచి = కని; వల్లభు = భర్త; తోడన్ = తోటి; సరి = సమానమైనవారు; కారు = కారు; అని = అని; తోడ్తోడన్ = వెంటవెంటనే; శిరములున్ = తలలు; తునుమాడిరి = ఖండించిరి; ఆత్మ = తమ; శిశువులన్ = పుత్రులను; అధిపా = రాజా.
భావము:- మహారాజా! భరతుని ముగ్గురు భార్యలు వరసగా కొడుకులను కని, భర్త పేరు నిలబెట్టగలవారు కారు అని వెంటవెంటనే తమ బిడ్డల తలలు ఖండించారు.

తెభా-9-639-వ.
ఇట్లు విదర్భరాజపుత్రికలు శిశువులం జంపిన భరతుం డపుత్రకుండై మరుత్ స్తోమంబను యాగంబు పుత్రార్థియై చేసి, దేవతల మెప్పించె; నయ్యవసరంబున.
టీక:- ఇట్లు = ఇలా; విదర్భరాజ = విదర్భరాజుయొక్క; పుత్రికలు = కుమార్తెలు; శిశువులన్ = పసిపిల్లలను; చంపినన్ = చంపివేయగా; భరతుండు = భరతుడు; అపుత్రకుండు = కొడుకులులేనివాడు; ఐ = అయ్యి; మరుత్ స్తోమంబు = మరుత్ స్తోమంబు; అను = అనెడి; యాగంబున్ = యజ్ఞమును; పుత్ర = కొడుకులను; అర్థి = కోరువాడు; ఐ = అయ్యి; చేసి = ఆచరించి; దేవతలన్ = దేవతలను; మెప్పించెను = మెప్పించను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు .
భావము:- ఇలా విదర్భరాకుమారీలు అయన తన భార్యలు పసిపిల్లలను చంపివేయడంతో భరతుడు అపుత్రకుడు అయ్యి, కొడుకుల కోసం మరుత్ స్తోమంబు అనే యాగం చేసి దేవతలను మెప్పించాడు. అప్పుడు.

తెభా-9-640-సీ.
న్న యిల్లాలిఁ జూలాలిని మమతాఖ్యఁ-
జూచి బృహస్పతి సురతమునకుఁ
దొరఁకొని పైబడ్డఁ దొల్లి గర్భంబున-
నున్న బాలుఁడు భయం బొదవి వలదు
గదని మొఱజేయఁమకంబుతో వాని-
నంధుండ వగుమన్న లిగి వాఁడు
యోనిలోపలి వీర్య మూడఁ దన్నిన నేలఁ-
డి బిడ్డఁడై యున్నఁ బాయ లేక

తెభా-9-640.1-ఆ.
నితని పెంపు; కొడుకు లిరువురు జన్మించి
నుచు వెలయఁ జేయు నిన మమతఁ
బెంపఁజాల; నీవ పెంపు; భరింపు; మీ
ద్వాజు ననుచుఁ జనియె దాని విడిచి.

టీక:- అన్న = అన్న యొక్క; ఇల్లాలిన్ = భార్యను; చూలాలినిన్ = గర్భవతిని; మమత = మమత అనెడి; ఆఖ్యన్ = పేరు కలామెను; చూచి = చూసి; బృహస్పతి = బృహస్పతి; సురతమున్ = రతిక్రీడ; కున్ = కు; తొరకొని = సిద్ధపడి; పైబడ్డన్ = మీదపడగా; తొల్లి = ముందుగ; గర్భంబునన్ = కడుపులో; ఉన్న = ఉన్నట్టి; బాలుడు = పిల్లవాడు; భయంబున్ = భయ; పొదవి = పడి; వలదు = వద్దు; తగదు = తగిన పని కాదు; అని = అని; మొఱజేయన్ = మొత్తుకొనగా; తమకంబున్ = మోహము; తోన్ = తోటి; వానిన్ = అతనిని; అంధుండవు = గుడ్డివాడవు; అగుము = అయిపొమ్ము; అన్నన్ = శపించగ; అలిగి = అలిగి; వాడు = అతను; యోని = ఉపస్థు; లోపలి = లోని; వీర్యమున్ = వీర్యమును; ఊడన్ = ఊడిపడిపోయేలా; తన్నినన్ = తన్నగా; నేలన్ = నేలమీద; పడి = పడిపోయి; బిడ్డడు = పిల్లవాడు; ఐ = అయ్యి; ఉన్నన్ = ఉండగా; పాయలేక = వదలలేక; ఇతనిన్ = ఇతనిని కూడ.
పెంపు = పెంచుము; కొడుకులు = పుత్రులు; ఇరువురు = ఇద్దరు; జన్మించిరి = పుట్టిరి; అనుచున్ = అనచెప్పి; వెలయన్ = నమ్మునట్లు; చేయుము = చెయ్యి; అనినన్ = అనగా; మమత = మమత; పెంచజాలన్ = పెంచలేను; నీవ = నీవే; పెంపు = పెంచుము; భరింపుము = భరించుము; ఈ = ఈ; ద్వాజున్ = ద్వాజుని; అనుచున్ = అనుచు; చనియెన్ = వెళ్ళిపోయెను; దానిని = దానిని; విడిచి = వదలివేసి.
భావము:- గర్భవతిగా ఉన్న అన్న ఉతథ్యుని భార్య మమతను చూసి బృహస్పతి రతిక్రీడకు సిద్ధపడి మీదపడ్డాడు. అప్పటికే కడుపులో ఉన్న పిల్లవాడు భయపడి “వద్దు. ఇది తగినపని కాదు” అని మొత్తుకొన్నాడు. తమకంతో ఉన్న బృహస్పతి అతనిని గుడ్డివాడివి అయిపొమ్మని శపించాడు. దానితో అలిగి అతను ఉపస్థు లోని వీర్యాన్ని ఊడిపడేలా తన్నగా, నేలమీద పిల్లవాడిగా పడ్డాడు. బృహస్పతి “ఇద్దరు పుత్రులు పుట్టారు అని చెప్పి నమ్మేలా చేసి, ఇతనిని పెంచు” అన్నాడు. కాని మమత “నేను పెంచలేను ఈ ద్వాజుని నీవే పెంచు.” అంటూ వానిని వదలేసి వెళ్ళిపోయింది.

తెభా-9-641-వ.
ఇట్లు చథ్యుని భార్య యగు మమతయు బృహస్పతియు శిశువుం గని, ద్వాజుండైన వీని నీవ నీవ భరింపుమని, వదినె మఱఁదులు దమలో నొండొరువులం బలికిన కారణంబున వాఁడు భరద్వాజుండయ్యె; గర్భస్థుండయిన వాఁడు బృహస్పతి శాపంబున దీర్ఘతముండయ్యె; నంత నా బృహస్పతియు మమతయు నుదయించిన వాని విడిచి నిజేచ్ఛం జనిన, మరుత్తులు వానిం బోషించి పుత్రార్థి యయిన భరతున కిచ్చిరి; భరతుండు వానిం జేకొనియె; వితథంబయిన భరతవంశంబునకు నా భరద్వాజుండు వంశకర్త యగుటం జేసి వితథుండనం బరఁగె నా వితథునికి మన్యువు, మన్యువునకు బృహత్క్షత్త్ర జయ మహావీర్య నర గర్గు లను వారేవురు సంభవించి; రందు నరునికి సంకృతి, సంకృతికి గురుండు, రంతిదేవుం డన నిరువురు జన్మించిరి; అందు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; ఉచథ్యుని = ఉచథ్యుని; భార్య = భార్య; అగు = ఐన; మమతయున్ = మమత; బృహస్పతియున్ = బృహస్పతి; శిశువున్ = శిశువును; కని = పొంది; ద్వాజుండు = ద్వాజుడు; ఐన = అయినట్టి; వీనిన్ = ఇతనిని; నీవ = నీవే; నీవ = నీవే; భరింపుము = భరించుము; అని = అని; వదినె = అన్నభార్య; మఱదులు = భర్త తమ్ముడు; తమలోన = వారిలోవారు; ఒండొరులన్ = ఒకరినొకరు; పలికిన = చెప్పిన; కారణంబునన్ = కారణముచేత; వాడు = అతను; భరద్వాజుండు = భరద్వాజుడు; అయ్యెన్ = అయ్యెను; గర్భస్థుండు = కడుపులో నున్నవాడు; అయిన = అయినట్టి; వాడు = అతను; బృహస్పతి = బృహస్పతి; శాపంబునన్ = శాపమువలన; దీర్ఘతముడు = బాగాగుడ్డివాడు; అయ్యెన్ = అయ్యెను; అంతన్ = అంతట; ఆ = ఆ; బృహస్పతియున్ = బృహస్పతి; మమతయునున్ = మమత; ఉదయించినవానిని = పుట్టినవాడిని; విడిచి = వదిలేసి; నిజేచ్ఛన్ = ఏవరిదారినవారు; చనినన్ = వెళ్ళిపోగా; మరుత్తులు = మరుత్తులు; వానిన్ = అతడిని; పోషించి = పెంచి; పుత్రార్థి = కొడుకును కోరువాడు; అయిన = అయినట్టి; భరతున్ = భరతుని; కిన్ = కి; ఇచ్చిరి = ఇచ్చిరి; భరతుండున్ = భరతుడు; వానిన్ = అతనిని; చేకొనియె = స్వీకరించెను; వితథంబు = సంతులేనిది; అయిన = ఐన; భరతవంశంబున్ = భరతవంశమున; కున్ = కు; ఆ = ఆ; భరద్వాజుండు = భరద్వాజుడు; వంశ = వంశమును; కర్త = నిలబెట్టినవాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; వితథుండు = వితథుడు; అనన్ = అనగా; పరగెన్ = ప్రసిద్ధుడయ్యెను; ఆ = ఆ; వితథున్ = వితథుని; కిన్ = కి; మన్యువు = మన్యవు; మన్యువున్ = మన్యువున; కున్ = కు; బృహత్క్షత్ర = బృహత్క్షత్రుడు; జయ = జయుడు; మహావీర్య = మహావీర్యుడు; నర = నరుడు; గర్గులు = గర్గుడులు; అను = అనెడి; వారు = వారు; ఏవురు = ఐదుమంది (5); సంభవించిరి = పుట్టిరి; అందున్ = వారిలో; నరున్ = నరుని; కిన్ = కి; సంకృతి = సంకృతి; సంకృతికిన్ = సంకృతికి; గురుండున్ = గురుడు; రంతిదేవుండున్ = రంతిదేవుడు; అనన్ = అనగా; ఇరువురు = ఇద్దరు; జన్మించిరి = పుట్టిరి; అందున్ = వారిలో.
భావము:- ఈ విధంగ ఉచథ్యుని భార్య మమత బృహస్పతి శిశువును కని ద్వాజుడు అయినట్టి ఇతనిని “నీవే నీవే భరించు” అని వదినా మఱిది వాదులాడుకున్న కారణంచేత అతను భరద్వాజుడు అని పిలువబడ్డాడు. కడుపులో ఉన్న పిల్లవాడు బృహస్పతి శాపం వలన గుడ్డివాడు అయిపోయాడు. అంతట, ఆ బృహస్పతి మమత పుట్టినవాడిని వదిలేసి ఎవరి దారిన వారు వెళ్ళిపోగా, మరుత్తులు అతడిని పెంచి, కొడుకును కోసం తపిస్తున్న భరతునికి ఇచ్చారు. అలా భరతుడు స్వీకరించిన ఆ భరద్వాజుడు సంతులేని భరతవంశాన్ని నిలబెట్టాడు. కనుక, వితథుడు అని ప్రసిద్ధుడు అయ్యాడు. ఆ వితథునికి మన్యవు, మన్యువునకు బృహత్క్షత్రుడు, జయుడు, మహావీర్యుడు, నరుడు, గర్గుడు అని ఐదుమంది కొడుకుల పుట్టారు. వారిలో నరునికి సంకృతి; సంకృతికి గురుడు, రంతిదేవుడు అని ఇద్దరు పుట్టారు. వారిలో...