పోతన తెలుగు భాగవతము/ద్వితీయ స్కంధము/శుకుని సంభాషణ
తెభా-2-3-సీ.
"క్షితిపతి! నీ ప్రశ్న సిద్ధంబు మంచిది,-
యాత్మవేత్తలు మెత్తు రఖిలశుభద
మాకర్ణనీయంబు, లయుతసంఖ్యలు గల-
వందు. ముఖ్యం బిది యఖిల వరము,
గృహములలోపల గృహమేధులగు నరు-
లాత్మతత్త్వము లేశమైన నెఱుఁగ,
రంగనారతుల నిద్రాసక్తిఁ జను రాత్రి-
పోవుఁ గుటుంబార్థబుద్ధి నహము,
తెభా-2-3.1-ఆ.
పశు కళత్ర పుత్ర బాంధవ దేహాది
సంఘ మెల్లఁ దమకు సత్య మనుచుఁ
గాఁపురములు సేసి కడపటఁ జత్తురు,
కనియుఁ గాన రంత్యకాలసరణి.
టీక:- క్షితిపతి = రాజా {క్షితిపతి - రాజ్యమునకు ప్రభువు, రాజు}; నీ = నీ; ప్రశ్న = సందేహము; సిద్ధంబు = నిశ్చయముగ; మంచిది = శ్రేష్ఠమైనది; ఆత్మవేత్తలున్ = బుద్ధిమంతులు; మెత్తురు = మెచ్చుకొనెదరు; అఖిల = సమస్తమైన; శుభదము = శుభములను ఇచ్చునది; ఆకర్ణనీయంబులు = వినదగినవి; అయుత = వేలకొలది {అయుతము - పదివేలు}; సంఖ్యలున్ = గణించదగినవి; కలవు = ఉన్నవి; అందున్ = అందులో; ముఖ్యంబు = ముఖ్యమైనది; ఇది = ఇది; అఖిల = అన్నివిధములను; వరము = కోరదగినది; గృహములు = నివాసములు; లోపలన్ = లోపల; గృహమేధులు = గృహస్థులు; అగు = అగు; నరులు = మానవులు; ఆత్మ = ఆత్మయొక్క; తత్త్వమున్ = స్వభావమును; లేశము = కొంచెము; ఐన = అయినను; ఎఱుంగరు = ఎరుగరు; అంగనా = స్త్రీలతోటి; రతులన్ = సౌఖ్యములందు; నిద్ర = నిద్రించుటందు; ఆసక్తిన్ = ఆసక్తిలోను; చనున్ = జరిగిపోవును; రాత్రి = రాత్రి; పోవున్ = జరిగిపోవును; కుటుంబ = కుటుంబము - ఆలుబిడ్డలు; అర్థన్ = కొరకైన; బుద్ధిన్ = ఆలోచనలతో; అహము = పగలు;
పశు = పశు సంపద; కళత్ర = భార్య; పుత్ర = సంతానము; బాంధవ = బంధువులు; దేహ = శరీరము; ఆది = మొదలగు వాని; సంఘము = సమూహము; ఎల్లన్ = అంతా; తమకున్ = తమకు; సత్యము = నిజము; అనుచున్ = అనుకొనుచు; కాపురములు = కాపురములు; సేసిన్ = చేయుచు; కడపటన్ = చివరకు; చత్తురు = చనిపోవుదురు; కనియున్ = కనిపిస్తున్నప్పటికిని; కానరు = చూడరు; అంత్య = తుదకు; కాల = కాలము గమనము యొక్క; సరణి = స్వభావమును.
భావము:- “ఓ పరీక్షిత్తు మహారాజా! ఇప్పుడు నీవడిగిన ప్రశ్న చాలా సమంజసమైనది. దీనిని ఆత్మతత్త్వం తెలిసిన వాళ్లు మెచ్చుకుంటారు. ఇది సమస్త శుభాలను సమకూరుస్తుంది. లోకంలో వినదగిన విషయాలు వేలకొలది ఉన్నాయి. అందులో ఇతి అతి ముఖ్యమైంది. గొప్పది యిది. సంసారంలో మునిగితేలుతున్న గృహస్థులకు ఆత్మతత్త్వం కొంచెము కూడా తెలియదు. వాళ్లకు స్ర్తీ సంగమం, నిద్రలతో రేయి అంతా గడచిపోతుంది. పగలంతా కుటుంబ వ్యవహారాలతో సరిపోతుంది. పశువులూ, భార్యాబిడ్డలూ, చుట్టాలూ, శరీరమూ ఇత్యాది పరివార మంతటినీ నిజమని నమ్ముకొని సాగిస్తూ, కడకు వాళ్లు కన్నుమూసి కాటిపాలవుతారు. అంత్యకాల దుర్దశ తెలిసినా తెలియనట్లే ఉండిపోతారు.
తెభా-2-4-క.
కావున, సర్వాత్మకుఁడు, మ
హావిభవుఁడు, విష్ణుఁ, డీశుఁ డాకర్ణింపన్,
సేవింపను, వర్ణింపను,
భావింపను భావ్యుఁ డభవభాజికి నధిపా!
టీక:- కావున = అందువలన; సర్వ = సమస్తమైన; ఆత్మకుడు = ఆత్మలలో నుండువాడు; మహా = గొప్ప; విభవుడు = వైభవము ఉన్నవాడు; విష్ణుఁడు = విష్ణుమూర్తి; ఈశుఁడు = ఈశ్వరుడు; ఆకర్ణింపన్ = వినుటకు; సేవింపన్ = సేవచేయుటకు; వర్ణింపన్ = కీర్తించుటకు; భావింపను = స్మరించుటకు; భావ్యుఁడు = తగినవాడు; అభవ = పునర్జన్మము లేకపోవుటకు; భాజి = తగినవాని; కిన్ = కి; అధిపా = అధికుడా - రాజా.
భావము:- కనుక, రాజేంద్రా! మోక్షమార్గంలో పయనించే వాడికి సమస్తానికి ఆత్మయైన వాడు, మహావైభవం కలవాడు, జగదీశ్వరుడు అయిన విష్ణువే భావించడానికీ, సేవించడానికీ, వర్ణించటానికీ, ఆకర్ణించడానికీ తగినవాడు.
తెభా-2-5-ఆ.
జనుల కెల్ల శుభము సాంఖ్య యోగము; దాని
వలన ధర్మనిష్ఠవలన నయిన
నంత్యకాలమందు హరిచింత సేయుట
పుట్టువులకు ఫలము భూవరేంద్ర!
టీక:- జనులకు = ప్రజలకు; ఎల్లన్ = అందరకు; శుభము = శుభమును ఇచ్చునది; సాంఖ్య = సాంఖ్యమను {సాంఖ్యము - ఒక ముఖ్యమైన హిందూ దర్శనము}; యోగము = యోగము; దాని = దాని; వలనన్ = వలన; ధర్మ = ధర్మము నాచరించుటలో; నిష్ఠ = శ్రద్ధ, దీక్ష; వలనన్ = వలన; అయినన్ = కలుగునట్టి; అంత్య = మరణాసన్న; కాలము = సమయము; అందున్ = లో; హరిన్ = హరిని; చింతన్ = ధ్యానము; చేయుటన్ = చేయగలుగుట; పుట్టువులు = జన్మములు; కున్ = కు; ఫలము = ప్రయోజనము; భూవరేంద్ర = మహారాజా {భూవరేంద్రుడు - భూవర (రాజులలో) ఇంద్ర (శ్రేష్ఠుడు), మహారాజు};
భావము:- లోకులందరికి సాంఖ్యయోగం మేలు చేకూరుస్తుంది. ఏ యోగం వల్లనైనా లేక ధర్మాచరణతో నైనా సరే అవసానకాలంలో హరిని చింతించాలి. జన్మ మెత్తినందుకు ఓ నరవరా! ప్రయోజనం అలా హరిని చింతించటమే.
తెభా-2-6-తే.
అరసి నిర్గుణబ్రహ్మంబు నాశ్రయించి
విధినిషేధ నివృత్తి సద్విమలమతులు
సేయుచుందురు హరిగుణచింతనములు
మానసంబుల నేప్రొద్దు మానవేంద్ర!
టీక:- అరసి = పరిశీలించి, విశ్లేషించి; నిర్గుణ = నిర్గుణ; బ్రహ్మంబున్ = బ్రహ్మమార్గమును; ఆశ్రయించి = అనుసరించువారు; విధి = చేయదగినిది; నిషేధ = చేయదగనిది అనువాని నుండి; నివృత్త = విడివడిన - అధిగమించిన; సత్ = నిజమైన - ఉత్తమమైన; విమల = మలములు లేని, నిర్మలులైన; మతులున్ = బుద్ధిమంతులు; చేయుచుందురు = చేస్తూ ఉంటారు; హరి = విష్ణుమూర్తి యొక్క; గుణ = గుణముల; చింతనములున్ = ధ్యానములు; మానసంబులన్ = మనస్సులలో; ఏ = ఏ; ప్రొద్దున్ = వేళయం దైనను, అన్ని వేళలలోను; మానవేంద్ర = రాజా;
భావము:- మహారాజా! నిర్మలబుద్ధి గల మహనీయులు విధి నిషేధాలు విడనాడి గుణరహితమైన పరబ్రహ్మమును ఆశ్రయించి మనస్సులో సదా మాధవుని గుణాలను మననం చేస్తుంటారు.