Jump to content

పోతన తెలుగు భాగవతము/ద్వితీయ స్కంధము/రామావతారంబు

వికీసోర్స్ నుండి


తెభా-2-154-వ.
మఱియు శ్రీరామావతారంబు సెప్పెద వినుము.
టీక:- మఱియున్ = ఇంక; శ్రీరామ = శ్రీరాముని; అవతారంబున్ = అవతారము; చెప్పెదన్ = చెప్పెదను; వినుము = వినుము.
భావము:- శ్రీ మహావిష్ణువు లోకోపకారం చేయడానికై జగదభిరాముడైన శ్రీరాముడుగా అవతరించాడు. ఆ వృత్తాంతం వివరిస్తాను విను.

తెభా-2-155-సీ.
తోయజహిత వంశ దుగ్ధ పారావార-
రాకా విహార కైరహితుండు
మనీయ కోసలక్ష్మాభృత్సుతా గర్భ-
శుక్తి సంపుట లసన్మౌక్తికంబు
నిజపాదసేవక వ్రజ దుఃఖ నిబిడాంధ-
కార విస్ఫురిత పంరుహసఖుఁడు
శరథేశ్వర కృతాధ్వరవాటికా ప్రాంగ-
ణాకర దేవతానోకహంబు

తెభా-2-155.1-తే.
టుల దానవ గహన వైశ్వానరుండు
రావణాటోప శైల పురందరుండు
గుచు లోకోపకారార్థ వతరించె
రాముఁడై చక్రి లోకాభిరాముఁ డగుచు.

టీక:- తోయజహిత = సూర్య {తోయజహిత - తోయము (నీళ్ళలో) జ (పుట్టినది) (పద్మము) హిత (ఇష్టుడు) - సూర్యుడు}; వంశ = వంశము అను; దుగ్ద = పాల; పారావర = సముద్రమునకు; రాకా = పూర్ణిమనాడు; విహార = విహరిస్తున్న; కైరవహితుండు = చంద్రుడు {కైరవహితుండు - కలువలకు ఇష్టుడు - కలువల రాయుడు -చంద్రుడు}; కమనీయ = అందమైన; కోసల = కోసల దేశపు {కోసల క్ష్మా భృత్సుత - కౌసల్య}; క్ష్మా = భూమికి; భృత్ = భర్త; సుతా = కుమార్తె (కౌసల్య); గర్భ = గర్భము అను; శుక్తి = ముత్యపు చిప్ప; సంపుట = లోపలి; లసత్ = ప్రకాశించు; మౌక్తికంబున్ = ముత్యమును; నిజ = తన; పాద = పాదముల; సేవక = సేవకుల; వ్రజ = సమూహము యొక్క; దుఃఖ = దుఃఖము అను; నిబిడ = చిక్కటి; అంధకార = చీకటికి; విస్పురిత = విచ్చుకొన్న; పంకరుహ = పద్మమునకు {పంకరుహ - బురదనందు పుట్టునది - పద్మము}; సఖుఁడు = ప్రియుడు (సూర్యుడు) {పంకరుహ సఖుడు - పద్మమునకు సఖుడు - సూర్యుడు}; దశరథ = దశరథు; ఈశ్వర = మహారాజు చే; కృత = చేయబడిన; అధ్వర = యజ్ఞ; వాటికా = శాల; ప్రాంగణ = ప్రాంగణముకి, ముంగిలికి; ఆకర = వచ్చిఉన్న; దేవత = దేవతల; అనోకహంబు = వృక్షమును (కల్పవృక్షము) {దేవతానోకహంబు - దేవతా అనోకహంబు -};
చటుల = భయంకరమైన; దానవ = దానవులు అను; గహన = అడవికి; వైశ్వానరుడు = అగ్నిహోత్రుడును; రావణ = రావణుని; ఆటోప = సంరంభము అనెడి; శైల = పర్వతమునకు; పురంధరుండు = ఇంద్రుడు; అగుచున్ = అగుచు; లోక = లోకమలకు; ఉపకార = ఉపకారము; అర్థము = చేయుట కోసము; అవతరించెన్ = అవతరించెను; రాముఁడు = రాముడు; ఐ = అయ్యి; చక్రి = విష్ణువు {చక్రి - చక్రము ధరించువాడు - విష్ణువు}; లోక = లోకములకు; అభిరాముడు = మనోహరుడు; అగుచున్ = అగుచు.
భావము:- ఆయన సూర్యవంశమనే పాల్కడలికి పున్నమ చంద్రుడు. కోసలరాజు కూతురైన కౌసల్యాదేవి గర్భమనే ముత్తెపు చిప్పలో పుట్టిన మేలి ముత్యము. తన పాదసేవకుల శోకమనే చిమ్మచీకట్లను పోకార్చే సూర్యభగవానుడు. దశరథమహారాజు గారి పుత్రకామేష్ఠి యాగశాల ముంగిట మొలకెత్తిన కల్పవృక్షం. దానవులనే దారుణారణ్యాన్ని దహించే కార్చిచ్చు. రావణుని గర్వమనే పర్వతాన్ని బద్దలు చేసే ఇంద్రుడు. అయిన శ్రీరాముడుగా, చక్రధారి శ్రీ మహావిష్ణువు లోకోపకారం చేయుటకొరకు జగదభిరాముడై అవతరించాడు.

తెభా-2-156-క.
చిత్రముగ భరత లక్ష్మణ
త్రుఘ్నుల కర్థి నగ్రన్ముం డగుచున్
ధాత్రిన్ రాముఁడు వెలసెఁ బ
విత్రుఁడు దుష్కృత లతా లవిత్రుం డగుచున్.

టీక:- చిత్రముగ = చిత్రముగ; భరత = భరతుడు; లక్ష్మణ = లక్ష్మణుడు; శత్రుఘ్నులన్ = శత్రుఘ్నుల; కున్ = కి; అర్థిన్ = కోరి; అగ్ర = అన్నగ (ముందు); జన్ముండు = పుట్టినవాడు; అగుచున్ = అగుచు; ధాత్రిన్ = భూమిమీద; రాముఁడు = రాముడు; వెలసెఁన్ = అవతరించెను; పవిత్రుఁడు = పవిత్రమైనవాడు; దుష్కృతన్ = పాపములు అను; లతా = లతలకు; లవిత్రుండు = కొడవలి వంటివాడు; అగుచున్ = అగుచు.
భావము:- ఆ శ్రీరామచంద్రునిగా అవతరించాడు. భరత లక్ష్మణ శత్రుఘ్నులకు అన్నగా జన్మించాడు. భూలోకంలో పరమ పవిత్రుడుగా, పాపాలనే కలుపు లతలను కోసివేసే కొడవలి వంటి వాడుగా ప్రసిద్ధికెక్కాడు.

తెభా-2-157-వ.
అంత.
టీక:- అంతన్ = తరువాత.
భావము:- అప్పుడు

తెభా-2-158-సీ.
కిసలయ ఖండేందు బిస కుంద పద్మాబ్జ-
ద ఫాల భుజ రద పాణి నేత్రఁ
గాహళ కరభ చక్ర వియత్పులిన శంఖ-
జంఘోరు కుచ మధ్య ఘన కంఠ
ముకుర చందన బింబ శుక గజ శ్రీకార-
గండ గంధోష్ఠ వాగ్గమన కర్ణఁ
జంపకేందుస్వర్ణ ఫర ధనుర్నీల-
నాసికాస్యాంగ దృగ్భ్రూ శిరోజ

తెభా-2-158.1-తే.
ళి సుధావర్త కుంతల హాస నాభి
లిత జనకావనీ పాల న్యకా ల
లామఁ బరిణయ మయ్యె లలాటనేత్ర
కార్ముకధ్వంస ముంకువ గాఁగ నతఁడు.

టీక:- కియలయ = చిగురాకుల వంటి; ఖండేందున్ = చంద్రరేఖ వంటి; బిస = తామరతూడు వంటి; కుంద = మల్లెమొగ్గల వంటి; పద్మ = పద్మముల వంటి; అబ్జ = తమ్మిపూల వంటి; పదన్ = పాదములు; ఫాలన్ = నుదురు; భుజన్ = భుజములు; రదన్ = పలువరస; పాణిన్ = చేతులు; నేత్రన్ = నేత్రములును కలామెను; కాహళన్ = బాకాల వంటి; కరభ = ఏనుగు తొండము వంటి {కరభ - ముంజేయి, 1. మనికట్టునుండి చిటికెనవేలు మొదలుదాక గల చేతి వెలుపల భాగము వంటి, 2. కర (ఏనుగు) భ (చేయి, తొండము) వంటి}; చక్ర = చక్రవాకముల వంటి; వియత్ = ఆకాశము వంటి; పులిన = ఇసకతిన్నెలు; శంఖ = శంఖము వంటి; జంఘ = పిక్కలు; ఊరు = తొడలు; కుచ = స్తనములు; మధ్య = నడుము; జఘన = పిరుదులు; కంఠ = కంఠమును కలామెను; ముకుర = అద్దము వంటి; చందన = మంచిగంధము వంటి; బింబ = దొండపండు వంటి; శుక = చిలుక వంటి; గజ = ఏనుగు వంటి; శ్రీకార = శ్రీకారము వంటి; గండ = చెక్కిళ్ళు; గంధ = మేనిసువాసన; ఓష్ట = పెదవులు; వాక్ = మాటలు; గమన = నడకలు; కర్ణన్ = కర్ణములు కలామెను; చంపక = సంపెంగ; ఇందు = చంద్రుని వంటి; స్వర్ణ = బంగారము వంటి; శఫర = చేపల వంటి; ధనుస్ = విల్లు వంటి; నీల = ఇంద్రనీలముల వంటి; నాసిక = ముక్కు; అస్య = ముఖము; అంగన్ = శరీరము; దృక్ = చూపులు; భ్రూ = కనుబొమలు; శిరోజన్ = శిరోజములు కలామెను; అళి = తుమ్మెదల వంటి;
సుధ = వెన్నెల వంటి, అమృతము వంటి; ఆవర్త = సుడిగుండము వంటి; కుంతల = తలకట్టు; హాస = చిరునవ్వు; నాభిన్ = బొడ్డును; కలిత = కలిగిన; జనక = జనకుడు అను; అవనీ = భూమికి; పాల = పాలకుడు (జనకమహారాజు); కన్యకా = కుమార్తె అయిన; లలామఁన్ = స్త్రీని; పరిణయము = పెండ్లి; అయ్యెన్ = చేసుకొనెను; లలాటనేత్రన్ = శివునియొక్క {లలాటనేత్రుడు - నుదుట కన్ను కలవాడు}; కార్ముక = విల్లును; ధ్వంసము = విరచుట అను; ఉంకువ = కన్యాశుల్కము, ఓలి; కాఁగ = అగునట్లుగ; అతఁడు = అతడు (రాముడు).
భావము:- ఆ శ్రీరాముడు శివుని ధనుర్భంగం ఓలి కాగా జనకమహారాజు పుత్రిక సీతాదేవిని చేపట్టాడు. ఆ మహాదేవి పాదాలు చివుళ్ల వంటివి, ఫాలం అర్ధచంద్రుని వంచిది, భుజాలు తామరతూండ్ల వంటివి, దంతాలు మొల్లల వంటివి, హస్తాలు పద్మాల వంటివి, నేత్రాలు కలువల వంటివి, పిక్కలు కాహళుల వంటివి, తొడలు కరభాల వంటివి, స్తనాలు చక్రవాకాల వంటిని, నడుము ఆకాశం వంటిది, పిరుదులు ఇసుక తిన్నెల వంటివి, కంఠం శంఖం వంటిది, చెక్కిళ్లు అద్దాల వంటివి, శరీర పరిమళం చందనం వంటిది, పెదవి దొండపండు వంటిది, ముక్కు సంపెంగ వంటిది, మోము చంద్రుని వంటిది. శరీరం స్వర్ణం వంటిది, చూపులు చేపల వంటివి, కనుబొమలు ధనుస్సు వంటివి, తల వెండ్రుకలు నీలాల వంటివి ముంగురులు తుమ్మెదల వంటివి, నవ్వు అమృతం వంటిది, బొడ్డు సుడి వంటిది.

తెభా-2-159-వ.
అంత.
టీక:- అంతన్ = తరువాత.
భావము:- అటుపిమ్మట.

తెభా-2-160-క.
రామున్ మేచకజలద
శ్యామున్ సుగుణాభిరాము ద్వైభవసు
త్రామున్ దుష్టనిశాటవి
రాముం బొమ్మనియెఁ బంక్తిథుఁ డడవులకున్.

టీక:- రామున్ = రాముని; మేచక = నల్లని; జలద = మేఘము వంటి; శ్యామున్ = చాయ కలవానిని; సుగుణ = సుగుణములతో; అభిరామున్ = అందమైన వానిని; సత్ = మంచి, గొప్ప; వైభవ = వైభవముతో; సుత్రామున్ = దేవేంద్రుని వంటి వానిని {సుత్రాముడు – లోకములను లెస్సగా రక్షించువాడు, ఇంద్రుడు}; దుష్ట = చెడ్డ; నిశాటన్ = రాక్షసులను; విరామున్ = సంహరించిన వానిని; పొమ్ము = వెళ్ళుము; అనియెన్ = అనెను; పంక్తిరథుఁడు = దశరథుడు {పంక్తి - పది, దశ}; అడవులన్ = అడవుల; కున్ = కు;
భావము:- నల్లని మేఘఛాయతో మెరిసిపోతు ఉండే వాడు, సర్వసుగుణాలతో ఒప్పి ఉండే వాడు, ఐశ్వర్యంతో ఇంద్రునికి సాటివచ్చే వాడు, దుష్టులైన రాక్షసులను చెండాడెడి వాడు అయిన శ్రీరామచంద్రుడిని దశరథుడు అడవులకు పొమ్మన్నాడు.

తెభా-2-161-వ.
ఇట్లు పంచిన.
టీక:- ఇట్లు = ఈ విధముగ; పంచిన = పంపగా.
భావము:- అలా పంపేసరికి.

తెభా-2-162-చ.
రుదుగ లక్ష్మణుండు జనకాత్మజయుం దనతోడ నేఁగుదే
రిగి రఘూత్తముండు ముదమారఁగ జొచ్చెఁ దరక్షు సింహ సూ
కరి పుండరీక కపి డ్గ కురంగ వృకాహి భల్ల కా
ముఖ వన్యసత్త్వచయ చండతరాటవి దండకాటవిన్.

టీక:- అరుదుగ = అపూర్వముగ; లక్ష్మణుండున్ = లక్ష్మణుడును; జనకాత్మజయున్ = సీతయును {జనకాత్మజ - జనకుని మానసపుత్రిక, సీత}; తన = తన; తోడన్ = కూడా; ఏఁగుదేన్ = రాగా; అరిగి = వెళ్ళి; రఘు = రఘు వంశమునకు; ఉత్తముండు = ఉత్తముడు (రాముడు); ముదము = సంతోష; ఆరఁగన్ = పూర్వకముగ; చొచ్చెన్ = ప్రవేశించెను; తరక్షు = సివంగులు; సింహ = సింహములు; సూకర = అడవి పందులు; కరి = ఏనుగులు; పుండరీక = పెద్దపులులు; కపి = కోతులు; ఖడ్గ = ఖడ్గ మృగములు; కురంగ = లేళ్ళు; వృక = తోడేళ్ళు; అహి = పాములు; భల్ల = ఎలుగుబంట్లు; కాసర = అడవిదున్నలు; ముఖ = మొదలైన; వన్య = అడవి; సత్త్వ = జంతు; చయ = సమూహములతో; చండతర = మిక్కిలి భయంకరమైన; అటవిన్ = అడవిని; దండకా = దండక అను; అటవిన్ = అరణ్యమును.
భావము:- లక్ష్మణుడు, సీత అడవులకు వెళ్తున్న రాముడి వెంట వెళ్ళారు. అలా రఘువంశ లలాముడైన ఆ శ్రీరాముడు సివంగులు, సింహాలు, అడవిపందులు, ఏనుగులు, పులులు, కోతులు, ఖడ్గమృగాలు, జింకలు, తోడేళ్లు, పాములు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు మొదలైన అడవి మృగాలు వసించే అత్యంత భీకరమైన దండకారణ్యం ప్రవేశించాడు.

తెభా-2-163-క.
నమున వసియించి నృ
పాననయశాలి యిచ్చె భయములు జగ
త్పాన మునిసంతతికిఁ గృ
పాననిధి యైన రామద్రుం డెలమిన్.

టీక:- ఆ = ఆ; వనమున = అడవిలో; వసియించి = నివసించి; నృప = రాజుల లక్షణమైన; అవన = రక్షణ యందు; నయ = నేర్పుతో; శాలి = ఒప్పువాడు; ఇచ్చెన్ = ఇచ్చెను; అభయములున్ = అభయములు; జగత్ = లోకమలకు; పావన = పవిత్రము చేయునట్టి; ముని = మునుల; సంతతి = సమూహము; కిన్ = కి; కృపా = దయకు; వననిధి = సముద్రము {వననిధి - నీరు కి నిధి, సముద్రము}; ఐన = అయినట్టి; రామభద్రుండు = రామభద్రుడు {రామభద్రుడు - చక్కటి భద్రతను ఇచ్చువాడు, రాముడు}; ఎలమిన్ = సంతోషముతో, వికాసముతో.
భావము:- రాజుల లందరిలోను నీతిసంపన్నుడు, దయాసముద్రుడు అయిన ఆ శ్రీరాముడు ఆ దండకారణ్యంలోని లోకాలను పవిత్రం చేసే మునులు అందరికి అభయాలు యిచ్చాడు.

తెభా-2-164-క.
కర కుల జలనిధి హిమ
రుఁ డగు రఘురామవిభుఁడు ఱకఱితోడన్
రుని వధించెను ఘనభీ
శరముల నఖిల జనులుఁ ర మరుదందన్.

టీక:- ఖరకర = సూర్య {ఖరకరుడు - ఎండను కలిగించు వాడు - సూర్యుడు}; కుల = వంశము అను; జలనిధి = సముద్రమునకు {జలనిధి - నీటికి నిధి - సముద్రము}; హిమ = చల్లదనమును; కరుఁడు = ఇచ్చు వాడు (చంద్రుడు) {హిమకరుఁడు - చల్లదనమును ఇచ్చువాడు - చంద్రుడు}; అగు = అయిన; రఘు = రఘు వంశపు; రామ = రాముడు అను; విభుఁడున్ = ప్రభువు; కఱకఱిన్ = కాఠిన్యము; తోడన్ = తోటి; ఖరుని = ఖరుడు (అను రాక్షసుని); వధించెను = సంహరించెను; ఘన = గొప్ప; భీకర = భయంకరమైన; శరములన్ = బాణములతో; అఖిల = సమస్త; జనులుఁన్ = జనములు; కర = మిక్కిలి; అరుదున్ = ఆశ్చర్యమును; అందన్ = పొందగా.
భావము:- సూర్యవంశమనే సముద్రానికి చంద్రునివంటివాడైన ఆ రామచంద్రుడు అందలి జనులందరు ఆశ్చర్యపడగా కోపంతో మిక్కిలి భయంకరమైన బాణాలు ప్రయోగించి ఖరుడనే రక్కసుణ్ణి ఉక్కడగించాడు.

తెభా-2-165-క.
రిసుతుఁ బరిచరుఁగాఁ గొని
రిసుతుఁ దునుమాడి పనిచె రిపురమునకున్;
రివిభునకు హరిమధ్యను
రిరాజ్యపదంబు నిచ్చె రివిక్రముఁడై.

టీక:- హరి = సూర్యుని (కోతి); సుతుఁన్ = పుత్రుని (సుగ్రీవుని); పరిచరుఁగా = సహచరునిగా; కొని = తీసుకొని; హరి = ఇంద్రుని, కోతి; సుతుఁన్ = పుత్రుని (వాలిని); తునుమాడి = చెండాడి; పనిచెన్ = పంపించెను; హరి = యముని; పురమున్ = పురము; కున్ = నకు; హరి = కోతుల; విభున్ = ప్రభువు (సుగ్రీవుడు); కున్ = కు; హరి = సింహము వంటి; మధ్యను = నడుము కలామెను (రుమను); హరి = కోతుల; రాజ్య = రాజు; పదంబున్ = పదవిని; ఇచ్చెన్ = ఇచ్చెను; హరి = సింహము వంటి; విక్రముఁడు = పరాక్రమశాలి; ఐ = అయి.
భావము:- సింహపరాక్రముడైన శ్రీరామచంద్రుడు సూర్యసుతుడైన సుగ్రీవుణ్ణి అనుచరునిగ స్వీకరించాడు. ఇంద్ర పుత్రుడైన వాలిని నేలగూల్చి యమపురికి పంపాడు. వానరాధిపుడైన సుగ్రీవునికి కిష్కింధ రాజ్యాన్ని, సింహం వంటి నడుము గల రుమని అప్పగించాడు.

తెభా-2-166-వ.
అంత సీతా నిమిత్తంబునం ద్రిలోకకంటకుం డగు దశకంఠుం దునుమాడుటకునై కపిసేనాసమేతుండయి చనిచని ముందట నతి దుర్గమంబయిన సముద్రంబు పేర్చి తెరువు సూపకున్న నలిగి.
టీక:- అంత = తరువాత; సీతా = సీత అను; నిమిత్తంబునన్ = వంకతో; త్రి = మూడు; లోకన్ = లోకములందు; కంటకుండు = బాధించువాడు; అగు = అయిన; దశ = పది; కంఠుండు = కంఠములు కలవాని (రావణుని); తునుమాడుట = చంపుట; కున్ = కు; ఐ = అయి; కపి = కపుల, కోతుల; సేనా = సేనలు; సమేతుండు = కూడిన వాడు; అయి = అయి; చనిచని = వెళ్తూ; ముందటన్ = ఎదురుగ; అతి = మిక్కిలి; దుర్గమము = దాటుటకు కష్టమైనది; అయిన = అయినట్టి; సముద్రంబున్ = సముద్రమును; పేర్చి = విజృంభించి; తెరవున్ = దారి; చూపక = చూపింపక; ఉన్న = ఉండగా; అలిగి = కోపించి;
భావము:- అటుపిమ్మట శ్రీరామచంద్రుడు సీత కొరకై ముల్లోకాలను బాధించేవాడైన రావణుణ్ణి సంహరింప దలచాడు. వానర సేనలను వెంటబెట్టుకొని లంకవైపు పయనించాడు. దక్షిణ సముద్రతీరం చేరాడు. దాటుటకు వీలుగాని ఆ సాగరం దారి చూపనందున ఆయనకు అగ్రహం వచ్చింది.

తెభా-2-167-మ.
విటభ్రూకుటిఫాలభాగుఁ డగుచున్ వీరుండు క్రోధారుణాం
కుడై చూచిన యంతమాత్రమున నప్పాథోధి సంతప్తతో
ణగ్రాహ తిమింగిలప్లవ ఢులీ వ్యాళప్రవాళోర్మికా
కారండవ చక్ర ముఖ్య జలసత్వశ్రేణితో నింకినన్.

టీక:- వికట = ముడిపడిన; భ్రూకుటిన్ = ముడిపడిన కనుబొమలు కల; ఫాలభాగుఁడు = నుదురు కలవాడు; అగుచున్ = అగుచు; వీరుండు = వీరుడు; క్రోధ = కోపముతో; అరుణా = ఎఱ్ఱని; అంబకుడు = నేత్రములు కలవాడు; ఐ = అయి; చూచినన్ = చూడగా; అంత = అంత; మాత్రమున = మాత్రమునకే; ఆ = ఆ; పాథోధి = సముద్రము; సంతప్త = మరిగి ఆవిరి అయిన; తోయ = నీటి; కణ = బొట్టుల వలన; గ్రాహ = మొసళ్ళు; తిమింగిల = తిమింగిలములు; ప్లవ = కప్పలు; ఢుల్లీ = తాబేళ్ళు; వ్యాళ = పాములు; ప్రవాళ = పగడపు; ఊర్మికా = అలలు; బక = కొంగలు; కారండవ = కన్నెలేడి యను పక్షులు; చక్ర = చక్రవాకములు; ముఖ్య = మొదలైన; జల = నీటి; సత్వ = జంతువుల; శ్రేణి = సమూహములు; తోన్ = తో; ఇంకినన్ = ఇంకిపోగా.
భావము:- ఆ మహావీరుడు రాముడు నొసట కనుబొమలు ముడివడగా, కోపం వల్ల ఎరుపెక్కిన నేత్రాలతో సముద్రం వైపు చూసాడు. అలా చూసేసరికి సముద్రం, నీటికోళ్లు, తాబేళ్లు, పాములు, మొసళ్లు, తిమింగిలాలు, పగడపు తీగలు, తరంగాలు, కొంగలు, కన్నెలేడి యను పక్షులు, చక్రవాకాలు మొదలైన జలజంతువులతో సహా నీళ్లు తుకతుక ఉడకగా ఇంకి పోయింది.

తెభా-2-168-వ.
అయ్యవసరంబున సముద్రుండు కరుణాసముద్రుం డగు శ్రీరామభద్రుని శరణంబు సొచ్చినం గరుణించి యెప్పటి యట్ల నిలిపి నలునిచే సేతువు బంధింపించి తన్మార్గంబునం జని.
టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయమున; సముద్రుండున్ = సముద్రుడు; కరుణా = కరుణకు; సముద్రుండున్ = సముద్రుడు; అగు = అయిన; శ్రీరామభద్రునిన్ = శ్రీరాముని; శరణంబున్ = శరణము; చొచ్చినన్ = వేడుకొనగా; కరుణించి = దయచూపి; ఎప్పటి = ఎప్పటి; అట్ల = వలెనే; నిలిపి = ఉంచి; నలుని = నలుడు అను కపి; చేన్ = చేత; సేతువున్ = వంతెనను; బంధింపించి = కట్టించి; తత్ = ఆ; మార్గమునన్ = దారి వెంట; చని = వెళ్ళి.
భావము:- అప్పుడు సముద్రుడు దయాసముద్రుడైన రామభద్రుడికి శరణాగతు డయ్యాడు. రాము డతనిపై దయచూపి యథాప్రకారం ఉండమని అనుగ్రహించాడు. నలుడనే వానర ప్రముఖునిచే వంతెన కట్టించి రాముడు సముద్రం దాటాడు.

తెభా-2-169-మ.
పుముల్ మూఁడును నొక్కబాణమున నిర్మూలంబు గావించు శం
రు చందంబున నేర్చె రాఘవుఁడు లంకాపట్టణం బిద్ధగో
పు శాలాంగణ హర్మ్య రాజభవనప్రోద్యత్ప్రతోళీ కవా
థాశ్వద్విప శస్త్ర మందిర నిశాశ్రేణితో వ్రేల్మిడిన్.

టీక:- పురముల్ = పురములు; మూఁడునున్ = మూడింటిని; ఒక్క = ఒకే ఒక; బాణమునన్ = బాణముచేతనే; నిర్మూలంబున్ = ధ్వంసము; కావించు = చేయు; శంకరు = శివుని; చందంబునన్ = వలె; ఏర్చెన్ = నాశనము చేసెను, కాల్చెను; రాఘవుఁడు = రాముడు {రాఘవుడు, రఘువంశపు వాడు, రాముడు}; లంకా = లంకా; పట్టణంబు = పట్టణము; ఇద్ధ = ప్రసిద్ధమైన; గోపుర = గోపురములు; శాల = శాలలు; అంగణ = భవనములు; హర్మ్య = మేడలు; రాజభవన = రాజభవనములు; ప్రోద్యత్ = బాగుచేయబడిన, కళ్ళాపి చల్లిన; ప్రతోళి = పెద్దవీధులు; కవాట = తలుపులు; రథ = రథములు; అశ్వ = గుఱ్ఱములు; ద్విప = ఏనుగులు; శస్త్ర = ఆయుధముల; మందిర = శాలలు; నిశాట = రాక్షస; శ్రేణిన్ = సమూహములు; తో = తో సహా; వ్రేల్మిడిన్ = చిటికలో.
భావము:- పూర్వము శివుడు ఒకే బాణంతో త్రిపురాలను కాల్చివేసి నట్లు, రాముడు పెద్దపెద్ద గోపురాలు, శాలలు, ముంగిళ్లు, మేడలు , రాజగృహాలు, రచ్చలు, తలుపులు, రథాలు, గుఱ్ఱాలు, ఏనుగులు, ఆయుధాగారాలు, రాక్షసగణాలుతో నిండివున్న లంకానగరాన్ని చిటికలో భస్మీపటలం చేసాడు.

తెభా-2-170-క.
రాణు నఖిల జగద్వి
ద్రాణుఁ బరిమార్చి నిలిపె క్షోవిభుఁగా
రాణుననుజన్ముని నై
రాణసితకీర్తి మెఱసి రాఘవుఁ డెలమిన్.

టీక:- రావణున్ = రావణుని; అఖిల = సమస్త; జగత్ = లోకముల వారిని; విద్రావణుఁన్ = తరిమికొట్టు వానిని; పరిమార్చి = సంహరించి; నిలిపెన్ = నిలిపెను, చేసెను; రక్షస్ = రాక్షస; విభుఁగాన్ = రాజుగా; రావణున్ = రావణుని; అనుజన్మునిన్ = తోబుట్టువుని, తమ్ముడు విభీషణుని; ఐరావణ = ఐరావతము వంటి; సిత = తెల్లని; కీర్తిన్ = కీర్తి; మెఱసి = ప్రకాశించగ; రాఘవుఁడు = రాముడు {రాఘవుడు - రఘువంశమున పుట్టినవాడు}; ఎలమిన్ = సంతోషముతో, వికాసముతో.
భావము:- ఈ విధంగా ఐరావత గజం వలె తెల్లని కీర్తితో ప్రకాశించిన శ్రీ రాముడు సమస్త భువనాలనూ వేధించి బాధించిన రావణుని హతమార్చాడు. అతని తమ్ముడైన విభీషణుణ్ణి రక్కసులకు రాజుగా చేసాడు.

తెభా-2-171-సీ.
ర్మ సంరక్షకత్వప్రభావుం డయ్యు-
ర్మవిధ్వంసకత్వమునఁ బొదలి
రదండనాభిముఖ్యముఁ బొంద కుండియు-
రదండ నాభిముఖ్యమున మెఱసి
బుణ్యజనావన స్ఫూర్తిఁ బెంపొందియుఁ-
పుణ్యజఁనాంతక స్ఫురణఁ దనరి
సంతతాశ్రిత విభీణుఁడు గాకుండియు-
సంతతాశ్రిత విభీణత నొప్పి

తెభా-2-171.1-తే.
మించెఁ దనకీర్తిచేత వాసించె దిశలు;
రమె నుతియింప జగతి నెవ్వరికినైనఁ
జారుతరమూర్తి నవనీశక్రవర్తిఁ
బ్రకటగుణసాంద్రు దశరథరామచంద్రు.

టీక:- ధర్మ = ధర్మమును; సంరక్షకత్వ = రక్షించులక్షణముతో; ప్రభావుండు = ప్రభావశాలి; అయ్యున్ = అయ్యినప్పటికిని; ధర్మ = విల్లు (శివధనుస్సు); విధ్వంసకత్వమునఁన్ = విరుచుటలో; పొదలి = విజృంభించి; ఖర = తీవ్రమైన; దండన = దండించుట యందు; అభిముఖ్యముఁన్ = ఇష్టపడుటను; పొందక = లేకపోవుట; ఉండియున్ = కలిగియు; ఖర = ఖరుడు అను రాక్షసుని; దండన = దండించుట యందు; నాభిముఖ్యమునన్ = ఇష్టపడుటలో; మెఱసి = అతిశయించి; పుణ్యజనా = పుణ్యాత్ముల; ఆవన = రక్షించు; స్ఫూర్తిఁన్ = సంకల్పముతో; పెంపొందియుఁన్ = అతిశయించియు; పుణ్యజనా = రాక్షసులను; అంతకన్ = సంహరించు; స్ఫురణఁన్ = సంకల్పముతో; తనరి = అతిశయించి; సంతత = ఎల్లప్పుడును; ఆశ్రిత = ఆశ్రయించిన వారికి; విభీషణుండున్ = భయంకరుడు; కాకన్ = అవ్వక పోయు; ఉండియున్ = ఉండియు; సంతత = ఎల్లప్పడును; ఆశ్రిత = ఆశ్రయించిన; విభీషణతన్ = విభీషణుడు ఉండుట అందు; ఒప్పి = చక్కగ ఉండి;
మించెన్ = అతిశయించెను; తనరి = తన; కీర్తిచే = కీర్తి; చేతన్ = వలనన్; వాసించెన్ = ప్రకాశించెను; దిశలు = దిక్కులు; తరమె = తరమా ఏమిటి; నుతియింపన్ = స్తుతించుటకు; జగతిన్ = లోకముల; ఎవ్వరికిని = ఎవరికి; ఐనన్ = అయినను; చారుతర = సందరమైన; మూర్తిన్ = స్వరూపుడు; అవని = భూమికి; ఈశ = ప్రభువులకి, రాజులకి; చక్రవర్తిన్ = చక్రవర్తి; ప్రకట = ప్రసిద్దమైన; గుణ = గుణములు; సాంద్రున్ = దట్టముగ ఉన్న వానిని; దశరథ = దశరథు పుత్రుడు; రామచంద్రున్ = రామచంద్రుని {రామచంద్రుడు - రాముడు అను చక్కటి (చల్లటి) వాడు}.
భావము:- ఆయన ధర్మాన్ని రక్షించినవాడు అనే మహత్వం కలిగి కూడ ధర్మవిధ్వంసకుడై ప్రకాశించాడు, అనగా శివధనుర్భంగం చేశాడన్నమాట. ఖరదండనలో అభిముఖుడు కాకపోయినా ఖరదండనలో అభిముఖుయ్యాడు, అంటే కఠినశిక్షలు విధించడానికి విముఖుడైన ఆ రాముడు ఖరుడనే రాక్షసుణ్ణి దండించడానికి సుముఖు డయ్యాడు. పుణ్య జనరక్షకుడై కూడ పుణ్యజనులను హతమార్చాడు, అనగా పుణ్యాత్యులను రక్షించి రక్కసులను శిక్షించాడన్నమాట. ఆశ్రితవిభీషణుడు కాకపోయినా ఆశ్రితవిభీషణుడయ్యాడు, అనగా ఆశ్రయించిన వారిపట్ల భయంకరుడు కాడు, కాని విభీషణుని కాశ్రయం ఇచ్చినవాడయ్యాడు. తన విశాల యశస్సును దశదిశల వ్యాపింపజేసి సుప్రసిద్ధు డయ్యాడు. మహాసుందరుడూ, మహారాజులలో మేటి, సుగణాభిరాముడూ అయిన ఆ దశరథ రాముణ్ణి కీర్తించడానికి లోకంలో ఎవరికిని సాధ్యం కాదు.