Jump to content

పోతన తెలుగు భాగవతము/ద్వితీయ స్కంధము/మత్యావతారంబు

వికీసోర్స్ నుండి


తెభా-2-141-వ.
మఱియు మత్స్యావతారంబు వినుము
టీక:- మఱియున్ = ఇంక; మత్స్య = మత్స్య; అవతారమున్ = అవతారమును; వినుము = వినుము.
భావము:- మరిప్పుడు మత్స్యావతారం గురించి చెబుతాను ఆకర్ణించు.

తెభా-2-142-సీ.
నుఁడు వైవస్వతనువుకు దృష్టమై-
రుదెంచునట్టి యుగాంత సమయ
మందు విచిత్రమత్స్యావతారము దాల్చి-
ఖిలావనీమయం గుచుఁ జాల
ర్వజీవులకు నాశ్రయభూతుఁ డగుచు నే-
కార్ణవంబైన తోముల నడుమ
న్ముఖశ్లథ వేదమార్గంబులను జిక్కు-
డకుండ శాఖ లేర్పడఁగఁ జేసి

తెభా-2-142.1-తే.
దివ్యు లర్థింప నా కర్థిఁ దెచ్చి యిచ్చి
నువు నెక్కించి పెన్నావ నధి నడుమ
మునుఁగకుండంగ నరసిన నిమిషావ
తార మేరికి నుతియింపఁ రమె? వత్స!

టీక:- ఘనుడు = గొప్పవాడు {ఘనుడు - ఘనమైన వర్తనము గలవాడు}; వైవస్వత = వైవస్వత; మనువున్ = మనువు; కున్ = కు; ద్రష్టము = కనబడినది; ఐ = అయ్యి; అరుదెంచున్ = వచ్చుచున్నది; అట్టి = అయిన; యుగ = యుగము; అంత = అంతమగు; సమయము = సమయము; అందున్ = లో; విచిత్ర = విచిత్రమైన; మత్స్యావతారమున్ = మత్స్యావతారమును; దాల్చి = ధరించి; అఖిల = సమస్త; అవనీ = భూమండలము; మయంబున్ = నిండినది; అగుచుఁన్ = అగుచు; చాలన్ = చాలా; సర్వ = సమస్త; జీవులకున్ = ప్రాణులకును; ఆశ్రయ = ఆశ్రయము; భూతుఁడు = అయినవాడు; అగుచుఁన్ = అగుచు; ఏక = ఒకే; ఆర్ణవంబున్ = సముద్రము వలె; ఐనన్ = అయిపోగా; తోయముల = నీటి; నడుమన్ = మధ్యలో; మత్ = నాయొక్క; ముఖ = నోటినుండి; శ్లథ = జారిపోయిన; వేద = వేదములను; మార్గంబులన్ = దారిలో; చిక్కున్ = చిక్కులు; వడకుండన్ = పడకుండగ; శాఖలు = శాఖలు, విభాగములు; ఏర్పడగన్ = ఏర్పాటులు; చేసి = చేసి;
దివ్యుల = దేవతలు; అర్థింపన్ = కోరగా; నాకున్ = నాకు; అర్థిన్ = సంతోషకరముగ; తెచ్చి = తీసుకొని వచ్చి; ఇచ్చి = ఇచ్చి; మనువున్ = మనువును; ఎక్కించి = ఎక్కించి; పెన్ = పెద్ద; నావన్ = నావలోకి; వనధి = సముద్రము {వనధి - నీటికి నిధి - సముద్రము}; నడుమన్ = మధ్యలో; మునుఁగకుండగన్ = మునిగిపోకుండ; అరసిన = కాపాడిన; అనిమిష = రెప్పపాటులేని, మత్స్యా {అనిమిషులు - రెప్పపాటులేని వారు(వి), దేవతలు, మత్స్యములు}; అవతారము = అవతారము; ఎరికిని = ఎవరికైనను; నుతియింపన్ = స్తుతించుటకు; తరమె = తరమా ఏమిటి; వత్సా = పుత్రుడా.
భావము:- ప్రళయకాలంలో సమస్తము జలమయమైపోయింది. ఆ పరిస్థితి ముందే తెలుపబడిన వైవస్వతమనువు ఒక పడవపై ఎక్కి కూర్చున్నాడు. అంతట భగవంతుడు విచిత్రమైన మత్స్యావతార మెత్తాడు. భూతలానికి ఆశ్రయమైన ఆ దేవుడప్పుడు ఎల్లప్రాణులకూ నివాసభూతుడైనాడు. నా వదనంనుండి జారిపోయిన వేదశాఖలు సంకీర్ణం కాకుండా విభజించి దేవతల కోరికమేరకు మళ్ళీ నాకు ప్రీతితో అందజేశాడు. వైవస్వతమనువు అధిష్ఠించిన నావ సముద్రంలో మునిగిపోకుండా కాపాడాడు. నాయనా! ఆ మత్స్యావతార మహత్యాన్ని వివరించడం ఎవరికి సాధ్యం.

తెభా-2-143-వ.
మఱియుఁ గూర్మావతారంబు వినుము.
టీక:- మఱియున్ = ఇంక; కూర్మ = తాబేలు {కూర్మము - తాబేలు, వ్యు. కుత్సితః ఊర్మిః యస్య, వృషోదరాదిః, బవ్రీ., అల్ప వేగము కలది}; అవతారంబున్ = అవతారమును; వినుము = వినుము.
భావము:- తరువాత కూర్మావతార వృత్తాంతం తెలుపుతాను విను.

తెభా-2-144-మ.
మృతోత్పాదన యత్నులై విబుధ దైత్యానీకముల్, మందరా
ముఁ గవ్వంబుగఁ జేసి యబ్ధిదఱువంగాఁ గవ్వపుంగొండ వా
ర్థి మునుంగన్ హరి కూర్మరూపమున నద్రిం దాల్చెఁ దత్పర్వత
భ్రణవ్యాజత వీఁపుఁదీట శమియింపం జేయఁగా నారదా!

టీక:- అమృత = అమృతమును; ఉత్పాదన = పుట్టించు; యత్నులు = ప్రయత్నము చేయువారలు; ఐ = అయి; విబుధ = దేవతలును; దైత్య = దానవుల; అనీకముల్ = సేనలును; మందర = మందర అను; అగమున్ = పర్వతము; కవ్వంబుగఁన్ = కవ్వముగా; చేసి = చేసి; అబ్ధిన్ = (పాల) సముద్రమును; తఱువంగాఁన్ = చిలుకతుండగా; కవ్వపున్ = కవ్వపు; కొండన్ = కొండ; వార్థిన్ = సముద్రములో; మునుంగన్ = మునిగిపోతుండగా; హరి = విష్ణుమూర్తి {హరి - దుఃఖములను హరించువాడు - భగవంతుడు}; కూర్మ = తాబేలు; రూపమునన్ = రూపమున; అద్రిన్ = కొండను; తాల్చెన్ = ధరించెను, మోసెను; తత్ = ఆ; పర్వత = పర్వతము యొక్క; భ్రమణ = తిరుగట అను; వ్యాజతన్ = వంకతో; వీఁపుఁన్ = వీపు యొక్క; తీటన్ = దురదను; శమియింపన్ = తగ్గునట్లు; చేయఁగఁన్ = చేయగా; నారదా = నారదా.
భావము:- నారద! పూర్వం దేవతలు, రాక్షసులు కలిసి అమృతం సాధించాలనే ప్రయత్నంలో మందరగిరిని కవ్వంగా జేసుకొని క్షీరసాగరాన్ని మథించారు. ఆ కవ్వపు కొండ కడలి నడుమ మునిగిపోయింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు తన వీపుదురద తొలగించుకోవటానికా అన్నట్లు గిరగిర తిరుగుతున్న గిరిని కూర్మరూపం ధరించాడు.

తెభా-2-145-వ.
వెండియు నృసింహావతారంబు వినుము.
టీక:- వెండియున్ = తరువాత; నృసింహ = నృసింహుని; అవతారంబున్ = అవతారమును; వినుము = వినుము.
భావము:- పిమ్మట నృసింహావతారం గురించి వివరిస్తాను. ఆకర్ణించు.

తెభా-2-146-మ.
సులోకంబుఁ గలంచి దేవసమితిన్ స్రుక్కించి యుద్యద్గదా
రుఁడై వచ్చు నిశాచరుం గని, కనద్దంష్ట్రా కరాళస్య వి
స్ఫురిత భ్రూకుటితో నృసింహగతి రక్షోరాజ వక్షంబు భీ
భాస్వన్నఖరాజిఁ ద్రుంచె ద్రిజగత్కల్యాణసంధాయియై.

టీక:- సుర = దేవ; లోకంబున్ = లోకమును; కలంచి = కలచి; దేవ = దేవతల; సమితిన్ = సమూహమును; స్రుక్కించి = బాధించి, ఓడించి; ఉద్యత్ = పైకెత్తిన; గదా = గదను; ధరుఁడు = ధరించినవాడు; ఐ = అయి; వచ్చు = వచ్చుచున్న; నిశాచరున్ = రాక్షసుని {నిశాచరుడు - నిశ (రాత్రి) చరించువాడు (తిరుగువాడు) - రాక్షసుడు}; కని = చూసి; కనత్ = తళుక్కుమనే; దంష్ట్రా = కోరలు; కరాళ = భయంకరమైన; ఆస్య = ముఖము; విస్ఫురిత = విచ్చుకున్న; భ్రూకుటి = భ్రుకుటి, కనుబొమలముడి; తోన్ = తోటి; నృసింహ = నరసింహ; గతిన్ = వలె, రూపముతో; రక్షస్ = రాక్షస; రాజ = రాజు యొక్క; వక్షంబున్ = వక్షమును; భీకర = భీకరమైన; భాస్వత్ = మెరుస్తున్న; నఖ = గోర్లు; రాజిఁన్ = సమూహమున; త్రుంచెన్ = చీల్చెను; త్రిజగత్ = ముల్లోకములకు; కల్యాణ = కల్యాణమును, శుభమును; సంధాయి = సమకూర్చువాడు; ఐ = అయి.
భావము:- ఒకప్పుడు రాక్షసుడు హిరణ్యకశిపుడు, దేవలోకంపై దండెత్తి దేవతలను బాధించసాగాడు. ప్రచండమైన గదాదండం చేబూని వస్తున్న ఆ దానవుణ్ణి శ్రీహరి చూచాడు. వాణ్ణి ఫరిమార్చి ముల్లోకాలకు క్షేమం కలిగించాలనుకొన్నాడు. వెంటనే కోరలతో భీతికొలిపే నోరు, కోపంతో ముడివడ్డ కనుబొమ్మలు కలిగిన నరసింహావతారం ధరించాడు. వాడి గోళ్లతో ఆ రాక్షసేశ్వరుని వక్షం చీల్చి హతమార్చాడు.

తెభా-2-147-వ.
ఇంక నాదిమూలావతారంబు సెప్పెద వినుము.
టీక:- ఇంకన్ = ఇంక; ఆదిమూల = ఆదిమూల; అవతారంబున్ = అవతారమును; చెప్పెదన్ = చెప్తాను; వినుము = వినుము.
భావము:- మరిప్పుడు ఆదిమూలావతారము వివరము తెలుపుతాను. ఆలకించు

తెభా-2-148-మ.
రినాథుండు జలగ్రహగ్రహణ దుఃఖాక్రాంతుఁడై వేయి వ
త్సముల్ గుయ్యిడుచుండ వేల్పులకు విశ్వవ్యాప్తి లేకుండుటన్
రి నీవే శరణంబు నా కనినఁ గుయ్యాలించి వేవేగ వా
శ్చముం ద్రుంచి కరీంద్రుఁ గాచె మహితోత్సాహంబునం దాపసా!

టీక:- కరి = గజ, ఏనుగుల; నాథుండు = ఇంద్రుడు, రాజు; జలగ్రహ = మొసలి యొక్క; గ్రహణ = పట్టువలన; దుఃఖ = దుఃఖము; ఆక్రాంత = కమ్మినవాడు; ఐ = అయి; వేయి = వెయ్యి; వత్సరముల్ = సంవత్సరములు; కుయ్యిడుచున్ = మొరపెట్టుచు; ఉండన్ = ఉండగ; వేల్పుల్ = దేవతలు; కున్ = కు; విశ్వ = విశ్వం మొత్తము; వ్యాప్తిన్ = వ్యాప్తించ గలుగుట; లేకుండుటన్ = లేకపోవుటచే; హరి = విష్ణువు {హరి - దుఃఖములు హరింప చేయువాడు - భగవంతుడు}; నీవే = నీవే; శరణంబున్ = శరణము; నాకు = నాకు; అనినన్ = అనగా; కుయ్యాలించి = మొర విని {కుయ్యాలించి - కుయ్యిడన్ ఆలించి, మొర విని}; వేవేగ = శ్రీఘ్రమే; వాశ్చరమున్ = మొసలిని {వాశ్చరము - వారి చరము, మొసలి}; త్రుంచిన్ = ఖండించి; కరీంద్రుఁన్ = గజేంద్రుని; కాచెన్ = కాపాడెను; మహిత = గొప్ప; ఉత్సాహంబునన్ = ఉత్సాహముతో; తాపసా = తపస్వీ.
భావము:- ఓ మహర్షి! నారద! గజేంద్రుడు మొసలిచేత పట్టువడి దుఃఖించసాగాడు. వేయి సంవత్సరాలు దానితో పెనగులాడుతు రక్షణకై విశ్వమయునికి మొరపెట్టుకొన్నాడు. నీవే నాకిక దిక్కు అని ఆర్తుడై ఆక్రందనం చేసాడు. తక్కిన దేవతలు విశ్వమయులు కారు. కాబట్టి అతని ఆపద మాస్పలేక పోయారు. అప్పుడతడు అది విని వెనువెంటనే పరమాత్ముడు, శ్రీహరి ఆదిమూల స్వరూపుడై వచ్చి పరమోత్సాహంతో మకరిని చంపి కరిని కాపాడాడు.

తెభా-2-149-వ.
మఱియును వామనావతారంబు వినుము.
టీక:- మఱియునున్ = ఇంకను; వామన = వామన; అవతారంబున్ = అవతారమును; వినుము = వినుము.
భావము:- ఇక వామనావతారం వర్ణిస్తాను విను.

తెభా-2-150-సీ.
జ్ఞేశ్వరుండగు రి విష్ణుఁ డదితి సం-
తానంబునకు నెల్లఁ మ్ముఁ డయ్యుఁ
బెంపారు గుణములఁ బెద్ద యై వామన-
మూర్తితో బలిచక్రర్తిఁ జేరి
ద్భూమి మూడు పామ్ము లనడిగి ప-
త్రయంబునను జత్త్రయంబు
వంచించి కొనియును వాసవునకు రాజ్య-
మందింప నీశ్వరుంయ్యు మొఱఁగి

తెభా-2-150.1-తే.
ర్థిరూపంబు గైకొని డుగ వలసె
ధార్మికుల సొమ్ము వినయోచిముగఁ గాని
వెడఁగుఁదనమున నూరక విగ్రహించి
లనమందింపరాదు నిశ్చయము పుత్ర!

టీక:- యజ్ఞేశ్వరుండు = యజ్ఞమునకు అధికారి; అగు = అయిన; హరి = భగవంతుడు {హరి - దుఃఖమును హరించువాడు}; విష్ణుఁడు = విష్ణువు; అదితి = అదితి యొక్క {అదితిసంతానము - ఆదిత్యులు - దేవతలు}; సంతానంబున్ = సంతానము; కున్ = నకు; ఎల్లన్ = అందరకి; తమ్ముఁడు = తమ్ముడు; అయ్యుఁన్ = అయినప్పటికిని; పెంపారు = అతిశయిస్తున్న; గుణములఁన్ = గుణములతో; పెద్ద = పెద్దవాడు; ఐ = అయ్యి; వామన = వామన, పొట్టి; మూర్తి = స్వరూపము; తోన్ = తోటి; బలి = బలి; చక్రవర్తిఁన్ = చక్రవర్తిని; చేరి = దగ్గరకెళ్ళి; తత్ = అతని; భూమిన్ = భూమిని; మూడు = మూడు; పాదములన్ = అడుగులను; అడిగి = యాచించి; పద = అడుగులను; త్రయంబుననున్ = మూటితో; జగత్ = లోకములు; త్రయంబున్ = మూటిని; వంచించి = వంగదీసు, మోసగించి {వంచించు - వంచు (లొంగు) ఇంచు(తీయు)}; కొనియును = కొన్నప్పటికిని; వాసవున్ = ఇంద్రనకు; రాజ్యమున్ = రాజ్యమును; అందింపన్ = అందించుటకు; ఈశ్వరుండు = ప్రభువు; అయ్యున్ = అయినప్పటికిని; మొఱఁగి = మొరపెట్టుతూ, ఆర్తితో;
అర్థి = అర్థించువాని, యాచకుని; రూపంబున్ = రూపమును; కైకొని = చేపట్టి; అడుగన్ = అడుగ; వలసెన్ = వలసివచ్చెను; ధార్మికులన్ = ధర్మాత్ముల; సొమ్ము = ధనమును; వినయ = వినయమునకు; ఉచితముగఁన్ = తగినట్లు; కానిన్ = తప్ప; వెడఁగుఁన్ = వెకిలి; తనమునన్ = తనముతో; ఊరక = వ్యర్థముగ; విగ్రహించి = కలహించి, కోపించి; చలనమందింపన్ = కదిలింప, హరింప; రాదు = రాదు; నిశ్చయమున్ = నిశ్చయముగ; పుత్ర = కుమార.
భావము:- యజ్ఞాధిపుడైన విష్ణువు అదితి బిడ్డలలో కనిష్ఠుడు ఐనా ఉత్తమ గుణాలలో అందరికంటే జ్యేష్ఠుడు. అయన వామనాకారంతో బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి మూడడుగుల నేల అతణ్ణి యాచించి పుచ్చుకొన్నాడు. ఆ మూడడుగులతో ముల్లోకాలను ఆక్రమించి వంచనతో అపహరించాడు. తాను సర్వేశ్వరుడై వుండికూడ ఇంద్రుడికి రాజ్యం ముట్టజెప్పడానికై ఆయన వంచనతో బలిని యాచించవలసి వచ్చింది. సత్య ధర్మాత్ముల సొమ్ము వినయంగా వెళ్లి ఉచిత పద్ధతిలో గ్రహించాలి. అంతే కాని మూర్ఖత్వంతో పోట్లాడి ఆక్రమించ గూడదు సుమా. ఇది నిజం.

తెభా-2-151-చ.
లి నిజమౌళి నవ్వటుని పాదసరోరుహ భవ్యతీర్థ ము
త్కలిక ధరించి, తన్నును జత్త్రయమున్ హరికిచ్చి, కీర్తులన్
నిలిపె వసుంధరాస్థలిని నిర్జరలోక విభుత్వహానికిం
లఁకక శుక్రు మాటల కుఁదారక భూరివదాన్యశీలుఁడై.

టీక:- బలి = బలి (చక్రవర్తి); నిజ = తన; మౌళిన్ = నెత్తిమీద; ఆ = ఆ; వటుని = బ్రహ్మచారి యొక్క; పాద = పాదము అను; సరోరుహ = పద్మమును; భవ్య = శుభకరమైన; తీర్థమున్ = తీర్థజలమును; ఉత్కలికన్ = అతిశయముతో {ఉత్కలిక - ఉత్ కలిక - అతిశయించు}; ధరించి = తాల్చి; తన్నునున్ = తనను; జగత్ = లోకములు; త్రయమున్ = మూటిని; హరి = విష్ణువు {హరి - దుఃఖములను హరించు వాడు}; కిన్ = కి; ఇచ్చి = ఇచ్చి; కీర్తులన్ = తన కీర్తితో; నిలిపెన్ = నింపెను; వసుంధరాస్థలిని = భూమండలమున; నిర్జర = దేవతల {నిర్జర - నిర్ జర - ముసలితనము లేని వారు, దేవతలు}; లోక = లోకమునను; విభుత్వ = అధికారము; హాని = నష్టమగుట; కిన్ = కి; తలఁకక = బెదరక; శుక్రు = శుక్రుని; మాటలున్ = మాటలు; కున్ = కు; తారక = కదియక, చేరక; భూరి = అతిమిక్కిలి; వదాన్య = దానమిచ్చు; శీలుఁడు = శీలము కలవాడు; ఐ = అయి.
భావము:- పరమదాత అయిన బలిచక్రవర్తి ఆ బ్రహ్మచారి వామనుని పాదపద్మాలు కడిగిన పవిత్ర తీర్థాన్ని ఉత్సుకతతో తలమీద చల్లుకున్నాడు. తనతోపాటు మూడులోకాలను నారాయణుడికి ధారాదత్తం చేసాడు. విశ్వమంతట శాశ్వతమైన యశస్సు నిలుపుకొన్నాడు. ఆ దానంవల్ల దేవలోకం మీద తనకున్న పెత్తనం పోతుందని జంక లేదు. తనకు హాని జరుగుతుందని శుక్రాచార్యుడు చెప్పినా లక్ష్య పెట్టలేదు.

తెభా-2-152-వ.
మఱియు న ప్పరమేశ్వరుండు నారదా! హంసావతారంబు నొంది యతిశయ భక్తియోగంబున సంతుష్టాంతరంగుం డగుచు నీకు నాత్మతత్త్వప్రదీపకంబగు భాగవతమహాపురాణం బుపదేశించె; మన్వవతారంబు నొంది స్వకీయ తేజఃప్రభావంబున నప్రతిహతంబైన చక్రంబు ధరియించి దుష్టవర్తనులైన రాజుల దండించుచు శిష్ట పరిపాలనంబు సేయుచు నాత్మీయ కీర్తిచంద్రికలు సత్యలోకంబున వెలింగించె; మఱియు ధన్వంతరి యన నవతరించి తన నామస్మరణంబున భూజనంబునకు సకలరోగ నివారణంబు సేయుచు నాయుర్వేదంబుఁ గల్పించె నింకఁ బరశురామావతారంబు వినుము.
టీక:- మఱియున్ = ఇంక; ఆ = ఆ; పరమేశ్వరుండు = భగవంతుడు {పరమేశ్వరుడు - అత్యుత్తమమైన ప్రభువు}; నారదా = నారదుడా; హంసా = హంస; అవతారంబున్ = అవతారమును; ఒంది = పొంది; అతిశయ = మిక్కిలిన; భక్తి = భక్తి; యోగంబునన్ = యోగముతో; సంతుష్ట = సంతోషముతో కూడిన; అంతరంగుండు = అంతరంగము కలవాడు; అగుచున్ = అగుచు; నీకున్ = నీకు; ఆత్మ = ఆత్మ; తత్త్వ = తత్వమును; ప్రదీపకంబున్ = మిక్కిలి ప్రకాశింప జేయునది; అగు = అయిన; భాగవత = భాగవతము అను; మహా = గొప్ప; పురాణంబున్ = పురాణమును; ఉపదేశించెన్ = ఉపదేశించెను; మన్వు = మనువు అను; అవతారంబున్ = అవతారమును; ఒందిన్ = పొంది; స్వకీయ = తన; తేజస్ = తేజస్సు యొక్క; ప్రభావంబునన్ = ప్రభావముతో, మహిమతో; అప్రతిహతము = ఎదురు లేనిది; ఐన = అయినట్టి; చక్రంబున్ = చక్రమును; ధరియించి = చేపట్టి; దుష్ట = చెడ్డ; వర్తనులు = ప్రవర్తన కలవారు; ఐన = అయినట్టి; రాజులన్ = రాజులను; దండించుచున్ = శిక్షించుచు; శిష్ట = శిష్టులను, మంచివారిని; పరిపాలనంబున్ = కాపాడుట; చేయుచున్ = చేస్తూ; ఆత్మీయ = తన యొక్క; కీర్తి = కీర్తి అను; చంద్రికలు = వెన్నెలలు; సత్య = సత్య; లోకంబునన్ = లోకములో; వెలిగించెన్ = ప్రకాశింపజేసెను; మఱియున్ = ఇంక; ధన్వంతరి = ధన్వంతరి; అనన్ = అనే పేరుతో; అవతరించి = అవతరించి; తన = తన యొక్క; నామన్ = పేరును; స్మరణంబునన్ = తలచగానే; భూ = భూలోకపు; జనంబున్ = జనమున; కున్ = కు; సకల = సమస్తమైన; రోగ = రోగములు; నివారణంబున్ = పోగొట్టుట; సేయుచున్ = చేస్తూ; ఆయుర్వేదంబుఁన్ = ఆయుర్వేదమును; కల్పించెన్ = పుట్టించెను; ఇంకఁన్ = ఇంక; పరాశుర = పరాశురుని; అవతారంబున్ = అవతారమును; వినుము = వినుము.
భావము:- ఓ నారద! అంతేకాదు. ఆ పరమేశ్వరుడు హంసావతార మెత్తాడు. అతిశయమైన భక్తి యోగంతో సంతసించిన వాడు అయ్యాడు. నీకు, ఆత్మతత్త్వం తెలయపరచే భాగవత, మనే మహాపురాణం ఉపదేశించాడు. మనువుగా అవతరించి తన తేజోమహిమతో అమోఘమైన చక్రం చేబూని దుర్జనులైన రాజులను శిక్షించాడు, సజ్జనులను రక్షించాడు. తన కీర్తిచంద్రికలు సత్యలోకంలో ప్రకాశింప జేశాడు. ఇంకా ధన్వంతరిగా అవతారం దాల్చాడు. తన నామస్మరణతోనే భూమిమీది జనానికి రోగాలన్నీ పోగొట్టుచు ఆయుర్వేదం కల్పించాడు. ఇక పరశురామావతారం ఎలా జరిగిందో వివరిస్తాను, ఆకర్ణించు.

తెభా-2-153-మ.
ణీ కంటకులైన హైహయనరేంద్రవ్రాతమున్ భూరివి
స్ఫురితోదారకుఠారధారఁ గలనన్ ముయ్యేడు మాఱుల్ పొరిం
బొరి మర్దించి, సమస్త భూతలము విప్రుల్ వేఁడఁగా నిచ్చి తాఁ
జి కీర్తిన్ జమదగ్నిరాముఁ డన మించెం దాపసేంద్రోత్తమా!

టీక:- ధరణీ = భూమికి; కంటకులు = బాధించు వారు; ఐనన్ = అయిన; హైహయ = హైహయ వంశపు; నరేంద్ర = రాజుల; వ్రాతమున్ = సమూహమును; భూరి = మిక్కిలి; విస్పురిత = ప్రకాశిస్తున్న; ఉదార = అంచులు కల; కుఠార = గొడ్డలి; ధారన్ = పదునుతో; కలనన్ = రణరంగమున; ముయ్యేడు = మూడు ఏడులు, ఇరవై ఒక్క; మాఱుల్ = సార్లు; పొరింబొరిన్ = మరలమరల; మర్దించి = సంహరించి; సమస్త = సమస్తమైన; భూతలమున్ = భూమండలమును; విప్రుల్ = బ్రాహ్మణులు; వేఁడఁగాన్ = అడుగగా; ఇచ్చి = ఇచ్చి; తాన్ = తాను; చిర = చిరకాలము ఉండు, గొప్ప; కీర్తిన్ = కీర్తితో; జమదగ్నిరాముఁడు = జమదగ్నిరాముడు; అనన్ = అనగ; మించెన్ = అతిశయించెను; తాపస = తాపసులలో; ఇంద్ర = శ్రేష్ఠులలో; ఉత్తమ = ఉత్తముడ.
భావము:- మునీంద్రులలో అగ్రగణ్యుడవైన నారద! హైహయరాజులు లోక విరోధులై దురుసుగా ప్రవర్తించారు. వాళ్లను శిక్షించడానికి శ్రీమన్నారాయణమూర్తి జమదగ్నిసుతుడైన ఆ పరశురాముడుగా అవతరించాడు. రణరంగంలో ఇరవై యొక్కసార్లు ఈ రాజసమూహాన్ని దారుణమైన తన గండ్రగొడ్డలితో చెండాడు. బ్రాహ్మణులు వేడుకోగా భూమండల మంతా వాళ్లకు దానం చేసాడు. ఆ భార్గవరాముడు అలా శాశ్వత కీర్తితో వెలుగొందాడు.