Jump to content

పోతన తెలుగు భాగవతము/ద్వితీయ స్కంధము/కృష్ణావతారంబు

వికీసోర్స్ నుండి


తెభా-2-172-వ.
అట్టి శ్రీరామావతారంబు జగత్పావనంబును నస్మత్ప్రసాద కారణంబును నై నుతికెక్కె; నింకఁ గృష్ణావతారంబు వివరించెద వినుము.
టీక:- అట్టి = అటువంటి; శ్రీ = శుభకలమైన; రామ = రాముని; అవతారంబున్ = అవతారము; జగత్ = లోకములను; పావనంబునున్ = పవిత్రము చేయునది యును; అస్మత్ = మా; ప్రసాద = అనుగ్రహమునకు; కారణంబునున్ = కారణమును; ఐ = అయి; నుతి = ప్రసిద్ధి; కిన్ = కి; ఎక్కెన్ = పొందినది; ఇంకన్ = ఇంక; కృష్ణ = కృష్ణుని; అవతారంబున్ = అవతారమును; వివరించెదన్ = వివరముగ చెప్పెదను; వినుము = వినుము.
భావము:- అటువంటి శ్రీరాముని అవతారం లోకపావనమై అస్మదాదులకు అనుగ్రహకారణ మయింది. ఇక కృష్ణావతారాన్ని వర్ణిస్తాను, విను.

తెభా-2-173-సీ.
తాపసోత్తమ! విను దైత్యాంశములఁ బుట్టి-
రనాథు లతుల సేనాసమేతు
గుచు ధర్మేతరులై ధాత్రిఁ బెక్కు బా-
ల నలంచుటఁ జేసి రణి వగలఁ
బొందుచు వాపోవ భూభార ముడుపుట-
కై హరి పరుఁడు నారాయణుండు
చెచ్చెరఁ దన సితాసిత కేశయుగమున-
లరామ కృష్ణ రూములఁ దనరి

తెభా-2-173.1-తే.
దుకులంబున లీలమై నుయ మయ్యె
వ్యయశుఁ డగు వసుదేవు భార్యలైన
రోహిణియు దేవకియు నను రూపవతుల
యందు నున్మత్తదైత్య సంహారి యగుచు.

టీక:- తాపస = మునులలో; ఉత్తమ = ఉత్తముడా; విను = విను; దైత్య = రాక్షసుల; అంశములఁన్ = అంశలతో; పుట్టిన్ = పుట్టి; నర = మానవ; నాథులు = ప్రభువులు; అతుల = సాటిలేని; సేనా = సేనలతో; సమేతులు = కలిగినవారు; అగుచున్ = అగుచు; ధర్మ = ధర్మము; ఇతరులు = తప్పినవారు; ఐ = అయ్యి; ధాత్రిన్ = భూమిని; పెక్కు = ఎక్కువ; బాధలన్ = బాధలచే; అలంచుటఁన్ = కష్టపెట్టుతుండుట; చేసిన్ = వలన; ధరణి = భూమాత; వగలఁన్ = దుఃఖములను; పొందుచున్ = పొందుతూ; వాపోవన్ = మొరపెట్టగా; భూ = భూమి యొక్క; భారమున్ = భారమును, కష్టములను; ఉడుపుటన్ = కృశింప జేయుటకు, తగ్గించుటకు; ఐ = అయ్యి; హరి = విష్ణుమూర్తి {హరి - దుఃఖములను హరించువాడు - భగవంతడు}; పరుఁడున్ = విష్ణుమూర్తి {పరుఁడు - సమస్తమునకు పరమై (బయట) నుండు వాడు}; నారాయణుండు = విష్ణుమూర్తి {నారాయణుండు - నారములందు ఉండువాడు}; చెచ్చెరఁన్ = శ్రీఘ్రముగ; తన = తన యొక్క; సిత = తెల్లని; అసిత = నల్లని; కేశ = రోమముల; యుగమునన్ = జంట వలన; బలరామ = బలరాముడు; కృష్ణ = కృష్ణుడు అను; రూపములఁన్ = రూపములతో; తనరి = ఒప్పి;
యదు = యాదవ; కులంబునన్ = వంశములో; లీలమైన్ = లీలార్థమై, విలాసముగ; ఉదయమయ్యెన్ = అవతరించెను; భవ్య = శుభ్రమైన; యశుఁడు = కీర్తి కలవాడు; అగు = అయిన; వసుదేవున్ = వసుదేవుని; భార్యలు = భార్యలు; ఐన = అయిన; రోహిణియున్ = రోహిణి; దేవకియున్ = దేవకి; అను = అనే; రూపవతులు = అందగత్తెలు {రూపవతులు - (మంచి) రూపము కల వారు, అందగత్తెలు}; అందున్ = అందు; ఉన్మత్త = మదించిన; దైత్య = రాక్షస; సంహారి = సంహరించు వాడు; అగుచున్ = అగుచు.
భావము:- మునిశ్రేష్ఠుడ! నారద! రాక్షస అంశలతో పుట్టిన రాజులు అనేకమంది తమ అపారసేనాబలాలతో అధర్మమార్గాన ప్రవర్తించారు. భూదేవికి పెక్కుబాధలు కలిగించారు. ఆమె దుఃఖిస్తూ విష్ణుమూర్తికి మొరపెట్టుకుంది. పరాత్పరుడైన శ్రీహరి మదోన్మత్తులైన దానవులను సంహరించి భూ భారాన్ని తొలగించాలనుకొన్నాడు. యదువంశంలో వన్నెకెక్కిన వాసుదేవునకు రోహిణి, దేవకి అనే భార్యల యందు తన తెల్లని వెంట్రుకతో బలరాముడాగానూ, నల్లని వెంట్రుకతో కృష్ణుడుగానూ ఆయన అవతరించాడు.

తెభా-2-174-వ.
ఇట్లు పుండరీకాక్షుం డగు నారాయణుండు సమస్త భూభార నివారణంబు సేయం దన మేనికేశద్వయంబ చాలునని యాత్మ ప్రభావంబు దెలుపుకొఱకు నిజకళాసంభవులైన రామకృష్ణుల దేహవర్ణంబులు శ్వేతకృష్ణం బని నిర్దేశించుకొఱకు సితాసితకేశద్వయ వ్యాజంబున రామకృష్ణాఖ్యల నలరి యవతరించె నందు భగవంతుడును సాక్షాద్విష్ణుండును నైన కృష్ణుండు జనమార్గవర్తి యయ్యును నతిమానుష్యకర్మంబుల నాచరించుటం జేసి కేవల పరమేశ్వరుం డయ్యె; నమ్మహాత్ముం డాచరించు కార్యంబులు లెక్కపెట్ట నెవ్వరికి నలవిగాదు అయినను నాకు గోచరించిన యంత యెఱింగించెద వినుము.
టీక:- ఇట్లు = ఈ విధముగ; పుండరీకాక్షుండు = విష్ణువు {పుండరీకాక్షుడు - పుండరీకములు (తామరాకుల) వంటి కన్నులు ఉన్న వాడు - భగవంతుడు}; అగు = అయిన; నారాయణుండు = విష్ణువు; సమస్త = సమస్తమైన; భూ = భూమి యొక్క; భార = భారములను; నివారణంబున్ = తొలగ; చేయన్ = చేయుటకు; తన = తన; మేని = శరీరము నందలి; కేశ = రోమముల; ద్వయంబ = జంట మాత్రము; చాలును = సరిపోవును; అని = అని; ఆత్మ = తన; ప్రభావంబున్ = ప్రభావమును; తెలుపు = తెలియజేయు; కొఱకున్ = కోసము; నిజ = తన; కళా = అంశ యందు; సంభవులు = పుట్టినవారు; ఐన = అయినట్టి; రామ = బలరామ; కృష్ణుల = కృష్ణుల యొక్క; దేహ = శరీరపు; వర్ణంబులున్ = రంగులను; శ్వేత = తెలుపు; కృష్ణంబు = నలుపు; అని = అని; నిర్దేశించు = నిర్ధారముగ చూపుట; కొఱకున్ = కోసము; సిత = తెల్ల; అసిత = నల్ల; కేశ = రోమముల; ద్వయ = జంటను; వ్యాజంబునన్ = వంకతో; రామ = బలరామ; కృష్ణా = కృష్ణులు అను; ఆఖ్యలన్ = పేర్లతో; అలరి = ప్రసిద్ధుడై; అవతరించెన్ = అవతరించెను; అందున్ = వారిలో; భగవంతుడును = భగవంతుడును {భగవంతుడు - మహిమాన్వితుడు, వీర్యవంతుడు, సమర్థుడు}; సాక్షాత్ = స్వయముగ; విష్ణుండును = విష్ణుమూర్తియును; ఐన = అయినట్టి; కృష్ణుండు = కృష్ణుడు; జన = జనులు, సాధారణ మానవులు; మార్గ = నడచు మార్గమున; వర్తి = నడచువాడు; అయ్యున్ = అయినప్పటికిని; అతిమానుష్య = మానవాతీత, మానవులు చేయలేని; కర్మంబులున్ = కార్యములు, పనులు; ఆచరించుటన్ = చేయుట; చేసి = వలన; కేవల = కేవలము; పరమేశ్వరుండు = పరమేశ్వరుడే {పరమేశ్వరుడు - పరమమైన ఈశ్వరుడు, అత్యున్నత ప్రభువు}; అయ్యెన్ = అయ్యెను; ఆ = ఆ; మహాత్ముండు = గొప్పవాడు; ఆచరించున్ = చేసిన; కార్యంబులున్ = లీలలు; లెక్కపెట్టన్ = లెక్కించుట; ఎవ్వరికిన్ = ఎవరికైనా; అలవిన్ = శక్యము; కాదు = కాదు; అయినను = అయినప్పటికిని; నాకున్ = నాకు; గోచరించినన్ = చూడగలిగిన; అంత = అంత; ఎఱింగించెదన్ = తెలిపెదను; వినుము = వినుము.
భావము:- ఈ విధంగా పద్మాక్షుడైన శ్రీమన్నారాయణుడు భూభార మంతా నివారించడానికి తన రెండు వెంట్రుకలే చాలనుకున్నాడు. తన ప్రభావం తెలపడానికి తన అంశలతో పుట్టిన రామకృష్ణుల శరీరకాంతులు తెలుపు నలుపులుగా చేసాడు. ధవళమూ, నీలమూ అయిన రెండువెంట్రుకల నెపంతో రాముడు, కృష్ణుడు అను పేర్లతో అవతరించాడు. వారిలో షడ్గుణైశ్వర్య సంపన్నుడు, సాక్షాద్విష్ణు స్వరూపుడు అయిన కృష్ణుడు ఇతర జనులు నడిచిన మార్గంలో నడిచినను మానవాతీతమైన కార్యాలెన్నో చేసాడు. అందువల్ల పరమేశ్వరుడుగానే ప్రసిద్ధి చెందాడు. ఆ మహనీయు డొనర్చిన కార్యాలు గణించడం ఎవరికీ సాధ్యం కాదు. అయినా నాకు తెలిసినంత వరకూ తెలుపుతాను, విను.

తెభా-2-175-క.
నూన గరళస్తని యగు
పూనఁ బురిటింటిలోనఁ బొత్తుల శిశువై
చేనముల హరియించి ప
రేనగరమునకు ననిచెఁ గృష్ణుఁడు పెలుచన్.

టీక:- నూతన = కొత్తగా పూసుకొనిన, వింత; గరళ = విషము కల; స్తని = పాలిండ్లు కలది; అగు = అయిన; పూతనఁన్ = పూతనను; పురిటింటి = పురిటిశుద్ధి ఇంకా కాని ఇంటి; లోనఁన్ = లోనే; పొత్తుల = పొత్తిళ్ళ లోని {పొత్తిళ్ళు - పుట్టిన కొత్తలో చంటిపిల్లలను ఉంచు మెత్తటి గుడ్డల దొంతరలు, అలాగే పిల్లలు ఆటబొమ్మలకి వాడు గుడ్డలు}; శిశువు = చంటివాడు; ఐ = అయి ఉండగ; చేతనములున్ = ప్రాణములను; హరియించి = హరించి, పీల్చి; పరేత = యముని; నగరమునకున్ = పురమునకు; అనిచెఁన్ = పంపించెను; కృష్ణుండు = కృష్ణుడు; పెలుచన్ = ఆగ్రహముతో.
భావము:- శ్రీకృష్ణుడు పురుటింటిలో చంటిబిడ్డగా పొత్తిళ్ళలో ఉన్న సమయ మది. పాలిళ్ళలో ప్రత్యేక విషం కలిగిన పూతన అనే రాక్షసి పాలివ్వటానికి వచ్చింది. ఆ శైశవ కృష్ణుడు ఆమె ప్రాణాలను తాగేసి యమలోకానికి పంపేసాడు.

తెభా-2-176-క.
విటముగ నిజపదాహతిఁ
బ్రటముగా మూఁడు నెలల బాలకుఁడై యా
టనిశాటుని నంతక
నిటస్థునిఁ జేసె భక్తనికరావనుఁడై.

టీక:- వికటముగన్ = వికృతముగ (ప్రకృతి విరుద్ధముగ); నిజ = తన; పద = కాలి; హతిన్ = దెబ్బతో; ప్రకటముగాన్ = గట్టిగ; మూఁడు = మూడు (3); నెలల = నెలల; బాలకుడు = పిల్లవాడు; ఐ = అయి ఉండగా; ఆ = ఆ; శకట = శకటుడు అను; నిశాటుని = రాక్షసుని; అంతకనికటస్థునిఁన్ = యమునిసమీపమునకు పోవునట్లుగ; చేసెన్ = చేసెను; భక్త = భక్తుల; నికర = సమూహమునకు; అవనుఁడు = కాపాడువాడువాడు; ఐ = అయి.
భావము:- భక్తలోక రక్షకుడైన శ్రీకృష్ణుడు మూడునెలల పిల్లవాడుగా ఉన్నాడు. శకటరూపంలో ఒక రాక్షసుడు అతణ్ణి పరిమార్చటానికి వచ్చాడు. అది గమనించిన బాలకృష్ణుడు తన కాలితన్నుతో ఆ దానవుణ్ణి దండధరుని వద్దకు సాగనంపాడు.

తెభా-2-177-క.
ముద్దుల కొమరుని వ్రేతల
ద్దులకై తల్లి ఱోల జ్జులఁ గట్టం
ద్దులకు మిన్నుముట్టిన
ద్దుల వడిఁ గూల్చె జనసమాజము వొగడన్.

టీక:- ముద్దుల = ముద్దులు మూటగట్టే; కొమరునిన్ = పుత్రుని; వ్రేతల = గోపికల; రద్దులన్ = పేచీల; కై = వల్ల; తల్లి = తల్లి (యశోద); ఱోలన్ = రోటికి వేసి; రజ్జులఁన్ = తాళ్ళతో; కట్టఁన్ = కట్టివేయగా; పద్దులకున్ = పంతానికి, పట్టుదలతో; మిన్ను = ఆకాశమును; ముట్టిన = అంటిన; మద్దులఁన్ = మద్ది చెట్లను; వడిఁన్ = వడుపుగా; కూల్చెన్ = కూల్చివేసెను; జన = గోపజనుల, ప్రజల; సమాజము = సమూహము; పొగడన్ = పొగుడునట్లుగా.
భావము:- కృష్ణుడు అల్లరి చేస్తున్నాడని గోపికలు యశోదవద్ద గోలపెట్టారు. యశోద అతణ్ణి త్రాటితో రోటికి కట్టివేసింది. అతడు ఆ రోటిని ఈడ్చుకొంటూ వెళ్లి ఆకాశాన్ని అంటే జంట మద్దులను నేలగూల్చాడు. అప్పుడు అక్కడి జనమంతా కృష్ణుణ్ణి కీర్తించారు.

తెభా-2-178-మ.
దిఁ గృష్ణుండు యశోదబిడ్డఁ డని నమ్మంజాల యోగీంద్ర త
ద్వనాంభోజములోఁ జరాచర సమస్తప్రాణిజాతాటవీ
నద్యద్రి పయోధి యుక్త మగు నానా లోకజాలంబు భా
స్వ నూనక్రియఁ జూపెఁ దల్లికి మహాశ్చర్యంబు వాటిల్లఁగన్.

టీక:- మదిఁన్ = మనసులో; కృష్ణుండు = కృష్ణుడు; యశోద = యశోద యొక్క; బిడ్డఁడు = పిల్లాడు; అని = అని; నమ్మంజాల = నమ్మలేను; యోగి = యోగులలో; ఇంద్ర = శ్రేష్ఠుడా; తత్ = అతని; వదన = నోరు అను; అంభోజమున్ = పద్మము {అంభోజము - నీటిలో పుట్టినది - పద్మము}; లోన్ = లోపల; చర = కదులునవి; అచర = కదలలేనివి అయిన; సమస్త = సర్వ; ప్రాణి = జీవుల; జాత = జాతులను; అటవీ = అడవి; నద = నదములు {నదములు - పడమటికి ప్రవహించునవి}; నది = నదులు {నది - తూర్పునకు ప్రవహించునది}; అద్రి = కొండలు; పయోధిన్ = సముద్రములు; యుక్త = కలిగినది; అగు = అయినట్టి; నానా = అనేక; లోక = లోకముల; జాలంబున్ = సమూహములను; భాస్వత్ = ప్రకాశముతోను; అనూన = నిరాటంకమైన; క్రియఁన్ = విధముగాను; చూపెన్ = చూపించెను; తల్లి = తల్లి; కిన్ = కి; మహా = గొప్ప; ఆశ్చర్యంబున్ = ఆశ్చర్యము; పాటిల్లగన్ = కలుగునట్లు.
భావము:- యోగివరేణ్యుడ! నారద! ఇలాంటి పరమాద్భుతాలు ఎన్నో బాల్యంలోనే చేసిన కృష్ణుడు యశోద కొడుకని నేను నమ్మలేకుండా ఉన్నానయ్యా. ఒకనాడు అతడు తల్లికి సకలచరాచర జీవులు, అడవులు, నదీనదాలు, పర్వతాలు, సముద్రాలు సమస్తంతో కూడిన వివిధ జగజ్జాలాలని అపూర్వంగా తన నోట చూపాడు. అది చూసి ఆ తల్లి అమితాశ్చర్యంతో చకితురా లయింది.

తెభా-2-179-చ.
యమునానదీ హ్రద నివాసకుఁడై నిజ వక్త్ర నిర్గత
స్ఫురిత విషాంబుపానమున భూజనులన్ మృతిఁ బొందఁ జేయు భీ
గరళద్విజిహ్వుఁ డగు కాళియ పన్నగు నా హ్రదంబుఁ జె
చ్చె వెడలించి కాచె యదుసింహుఁడు గోపకగోగణంబులన్.

టీక:- వర = శ్రేష్ఠమైన; యమునా = యమునా; నదీ = నది యొక్క; హ్రదన్ = మడుగు (ఏటిలో నీటిలోతుగల చోటు)లో; నివాసకుఁడు = నివసిస్తున్నవాడు; ఐ = అయి; నిజ = తన; వక్త్ర = నోటి నుండి; నిర్గత = వెలువడు; స్పురిత = ప్రసిద్దమైన; విషా = విషముతో కూడిన; అంబున్ = నీటి; పానమునన్ = తాగుట వలన; భూ = భూమిమీది; జనులున్ = ప్రజలను; మృతిఁన్ = మరణమును; పొందఁన్ = పొందునట్లు; చేయు = చేసేటటు వంటి; భీకర = భయంకర; గరళ = విషపు; ద్వి = రెండు; జిహ్వుఁడు = నాలుకల కలవాడు {ద్విజిహ్వుడు - రెండు నాలుకల వాడు, పురుష సర్పము, రెండు రకముల మాట్లాడు వాడు, మోసగాడు}; అగు = అయిన; కాళియ = కాళీయుడు అను; పన్నగున్ = పామును; ఆ = ఆ; హ్రదంబున్ = కొలనును; చెచ్చెరన్ = శ్రీఘ్రమే; వెడలించి = వెడలునట్లు చేసి; కాచెన్ = కాపాడెను; యదు = యాదవులలో; సింహుఁడున్ = సింహము వంటి వాడు; గోపక = గోపకుల; గో = గోవుల; గణంబునన్ = సమూహములను.
భావము:- కాళియుడనే సర్పరాజు యమునా నది మడుగులో నివసించేవాడు. అతని కోరలలో భయంకరమైన విషం వుండేది. అతడు క్రక్కిన ఆ గరళం కలిసిన నీళ్లు త్రాగి ప్రజలు ప్రాణాలు గోల్పోయే వారు. ఇలా వుండగా యాదవశ్రేష్ఠుడైన కృష్ణుడు కాళియుణ్ణి ఆ మడుగునుండి వెడలగొట్టి గోవులను, గోపాలురను కాపాడాడు.

తెభా-2-180-మ.
యా గోపకు లొక్క రేయితఱి, నిద్రం జెందఁ గార్చిచ్చు వ
చ్చినఁ గృష్ణా మము నగ్నిపీడితుల రక్షింపం దగుం గావవే
నినం గన్నులు మీరు మోడ్వుఁ డిదె దావాగ్నిన్ వెసన్నార్తు నే
వారట్ల యొనర్ప మ్రింగె శిఖిఁ బద్మాక్షుండు లీలా గతిన్.

టీక:- తనయా = కుమారా; గోపకులు = గోపకులు; ఒక్క = ఒక; రేయి = రాత్రి; తఱి = సమయములో; నిద్రన్ = నిద్ర; చెందన్ = పోవుచుండగ; కార్చిచ్చు = కార్చిచ్చు, దావాగ్ని {కార్చిచ్చు - అడవి తగులబడునప్పటి పెద్ద నిప్పు, దావాగ్ని, దహించు అగ్ని}; వచ్చినఁన్ = రాగా; కృష్ణా = కృష్ణా; మమున్ = మమ్ము; అగ్నిన్ = అగ్నిచే; పీడితులన్ = బాధితులను; రక్షింపన్ = కాపాడ; తగున్ = తగ్గవారము; కావవే = కాపాడు; అనినన్ = అనగా; కన్నులు = కళ్ళు; మీరున్ = మీరు; మోడ్వుఁడు = మూసుకొనండి; ఇదె = ఇదిగో; దావాగ్నిన్ = కార్చిచ్చును {కార్చిచ్చు - అడవి తగులబడునప్పటి పెద్ద నిప్పు, దావాగ్ని - దహించు అగ్ని}; వెసన్ = వెంటనే; ఆర్తున్ = ఆర్పెదను; నేన్ = నేను; అనన్ = అనగా; వారు = వారు; అట్ల = ఆ విధముగ; ఒనర్పన్ = చేయగ; మ్రింగెన్ = మింగెను; శిఖిఁన్ = అగ్నిని; పద్మాక్షుండున్ = కృష్ణుడు {పద్మాక్షుడు - పద్మముల వంటి కన్నులు ఉన్న వాడు, కృష్ణుడు}; లీలా = లీల; గతిన్ = వలె.
భావము:- కుమార! గోపకు లందరు ఒకనాటి రాత్రి నిద్రిస్తున్నారు. ఇంతలో అమాంతంగా కార్చిచ్చు వాళ్లను చుట్టుముట్టింది. “కృష్ణా! మంటల్లో చిక్కుకొన్నాము. మమ్మల్ని కాపాడు, కాపాడు” అంటు వాళ్లందరూ తన్ను వేడుకొన్నారు. అప్పుడు పద్మాక్షుడు “మీరంతా కళ్లు మూసుకొండి ఇదిగో క్షణంలో నేను ఆ దావానలాన్ని ఆర్పి వేస్తాను అన్నాడు.” వారలా చేశారు. కృష్ణుడు అలవోకగా కార్చిచ్చును కబళించి వేశాడు.

తెభా-2-181-క.
మందుని గతి యము నాంబువు
లందు నిసిం గ్రుంకి బద్ధుఁడై చిక్కిన యా
నందుని వరుణుని బంధన
మందు నివృత్తునిగఁ జేసె రి సదయుండై.

టీక:- మందుని = తెలివి తక్కువ వాని; గతిన్ = వలె; యమున = యమున యొక్క; అంబువులు = నీటి; అందున్ = లో; నిసిన్ = రాత్రి వేళ; క్రుంకి = మునిగి; బద్ధుఁడై = (వరుణునిచే) బంధింపబడి; చిక్కినన్ = చిక్కుకొనగా; ఆ = ఆ; నందునిన్ = నందుని; వరుణునిన్ = వరుణుని యొక్క; బంధనము = బంధనము; అందున్ = నుండి; నివృత్తునిగఁన్ = విడివడినవానిగ; చేసెన్ = చేసెను; హరి = కృష్ణుడు {హరి - దుఃఖములను హరించు వాడు}; సదయుండు = దయగల వాడు; ఐ = అయి.
భావము:- ఒక రాత్రివేళ నందుడు మందమతి వలె యమునా నదీ జలాలలో స్నానం చేస్తూ మునిగి, వరుణుని పాశాలలో చిక్కకొన్నాడు. అప్పుడు దయాసింధుడైన హరి ఆ బంధంనుండి అతణ్ణి విడిపించాడు.

తెభా-2-182-మ.
సూనుండు నిజానువర్తుల మహామాయన్ మహీభృద్గుహా
శ్రయులంగా నొనరించి తత్పథము నీరంధ్రంబు గావించినన్
మొప్పం గుటిలాసురాధమునిఁ బోరం ద్రుంచి గోపావళిన్
తోఁ గాచిన కృష్ణు సన్మహిమ మేన్మాత్రమే తాపసా!

టీక:- మయ = మయుని; సూనుండున్ = కొడుకు; నిజ = తన; అనువర్తులన్ = అనుచరులను; మహా = గొప్ప; మాయన్ = మాయతో; మహిన్ = కొండల లోని; భృత్ = పెద్ద; గుహన్ = గుహలో; ఆశ్రయులన్ = చేరినవారి; కాన్ = అగునట్లు; ఒనరించి = చేసి; తత్ = ఆ; పథమున్ = దారిని; నీరంధ్రంబున్ = సందులేనట్లుగ, దారిలేనిదిగ; కావించినన్ = చేసినన్; రయము = వేగముగ; ఒప్పన్ = అగునట్లు; కుటిల = వక్ర బుద్ధి ఐన; అసుర = రాక్షస; అధమునిన్ = అధముడిని; పోరన్ = యుద్ధములో; త్రుంచి = నరికేసి; గోప = గోపకుల; ఆవళిన్ = సమూహమును; దయ = కరుణ; తోన్ = తో; కాచినన్ = కాపాడిన; కృష్ణు = కృష్ణుని; సత్ = మంచి; మహిమన్ = మహిమము; ఏతన్మాత్రమే = సామాన్యమైనదా, కాదు; తాపసా = ముని.
భావము:- నారదమునీశ్వర! వ్యోమాసురుడు మయుని కుమారుడు. అతను ఒకసారి తన మాయా ప్రభావంతో కృష్ణుని సహచరులైన గోపకు లందరినీ ఒక గుహలో దాచేసాడు. ఇంకెవ్వరు ఆ గుహలో వెళ్ళడానికి లేకుండా మూసివేశాడు. అంతట మహావేగంతో కృష్ణుడు ఆ క్రూరదానవుణ్ణి పోరాటంలో చంపాడు. గోపాలకుల నందరినీ కృపతో కాపాడాడు. అటువంటి కృష్ణుని మహామహిమలను ఇంతింతని చెప్పతరమా.

తెభా-2-183-క.
దివిజేంద్రప్రీతిగ వ
ల్లజను లేఁటేఁటఁ జేయు లాలిత సవనో
త్సము హరి మానిపిన గో
రులు గావింపకున్న లరిపుఁ డలుకన్.

టీక:- దివిజ = దేవతలకు; ఇంద్ర = ఇంద్రునికి; ప్రీతిగన్ = ప్రీతి కలుగు నట్లు; వల్లవ = గోపాలక; జనులున్ = సమూహములు; ఏఁటేఁటఁన్ = ప్రతిఏటా; చేయు = చేస్తుండే; లాలిత = ఆనవాయితీ {లాలిత - లలి (క్రమము) ప్రకారము చేయునది, ఆనవాయితీ}; సవన = యజ్ఞ; ఉత్సవమున్ = ఉత్సవమును; హరి = కృష్ణుడు; మానిపినన్ = మానిపించగ; గోప = గోపకులలో; వరులున్ = శ్రేష్ఠులు; కావింపకున్న = చేయక పోవుటచే; బల = బలుడు అను రాక్షసుని; రిపుఁడు = శత్రువు (ఇంద్రుడు); అలుకన్ = కోపముతో.
భావము:- గోపకులు ప్రతిసంవత్సరము ఇంద్రుడికి ప్రితిగా చేసే యాగాన్ని శ్రీకృష్ణుడుమానిపించగా, గోపకులు యాగం చేయడం మానివేశారు. దానితో ఇంద్రుడు కోపంతో....

తెభా-2-184-తే.
మంద గొందల మంద నమందవృష్టిఁ
గ్రందుకొనుఁ డంచు నింద్రుండు మందలింపఁ
జండపవన సముద్ధూత టుల విలయ
మయ సంవర్త కాభీల లధరములు.

టీక:- మంద = పశువుల గణములు; కొందలము = చీకాకు; అందన్ = పడునట్లుగ; ఆమంద = దట్టమైన; వృష్టిన్ = వర్షముకై; క్రందు = కమ్ము; కొనుఁడు = కోండి; అంచున్ = అని; ఇంద్రుండు = ఇంద్రుడు; మందలింపన్ = హెచ్చరింపగ; చండ = భయంకరములైన; పవనన్ = వాయువులచే; సముద్ధూత = బాగుగా ఎగరగొట్టబడిన; చటుల = భయంకరములైన; విలయ = ప్రళయ; సమయ = కాలపు; సంవర్తక = సుడిగాలులతో కూడిన; ఆభీల = భయంకరమైన; జలధరములు = మేఘములు {జలధరములు - జలమును ధరించునవి - మేఘములు}.
భావము:- వ్రేపల్లె కలతపడేటట్టు జోరున ఎడతెరపిలేని వాన వెంటనే కురవండి అంటూ ఇంద్రుడు మేఘాలను ఆదేశించాడు. ప్రచండమైన మారుతవేగానికి పై కెగిరి ప్రళయకాలంలోని సంవర్తకాలవంటి భయంకరమైన మేఘాలు.....

తెభా-2-185-శా.
ప్తస్కంధ శిఖా కలాప రుచిమత్సౌదామనీవల్లికా
దీప్తోదగ్రముహుస్తమః పిహితధాత్రీ భాగనీరంధ్రమై
ప్తాశ్వస్ఫుర దిందు మండల నభస్సంఛాదితాశాంతర
వ్యాప్తాంభోద నిరర్గళస్ఫుట శిలావాః పూరధారాళమై.

టీక:- సప్త = ఏడు {సప్త స్కంధ శిఖా - ఏడు నాలుకల అగ్ని శిఖలు - అగ్ని ఏడు నాలుకలు - కాళి, కరాళి, విస్ఫులింగిని, ధూమ్రవర్ణ, విశ్వరుచి, లోహిత, మనోజవ}; స్కంధ = నాలుకల; శిఖా = అగ్ని శిఖల; కలాప = సమూహము యొక్క; రుచిన్ = వెలుగులు; మత్ = కలిగిన; సౌదామనీ = మెరుపు; వల్లికా = తీగలు; దీప్త = ప్రకాశమునకు; ఉదగ్ర = భయంకరమై; ముహుః = మధ్య మధ్య వచ్చు; తమస్ = చీకటి; పిహిత = కప్పబడిన; ధాత్రీ = భూమి; భాగ = భాగములందు; నీరంధ్రము = దట్టము; ఐ = అయి; సప్త = ఏడు {సప్తాశ్వస్పురత్ - ఏడు గుఱ్ఱములతో వెలుగొందునది (సూర్యమండలము)}; అశ్వ = గుఱ్ఱములతో; స్ఫురత్ = వెలుగొందునదియు; ఇందు = చంద్ర; మండల = మండలమును; నభస్ = ఆకాశమండలమును; సంఛాదిత = కప్పివేసిన; ఆశ = దిక్కులు; అంతర = అంతము వరకు; వ్యాప్త = వ్యాపించిన; అంభోదన్ = మేఘముల నుండి; నిరర్గళ = ఎడతెగని; స్ఫుట =స్పష్టమైన; శిలా = రాళ్లరాళ్ళతో కూడిన; వాః = నీటి; పూర = వెల్లువలు, మొత్తములు; ధారాళము = ధారలు కట్టినది, విశృంఖలమైనది; ఐ = అయి.
భావము:- వాన ప్రారంభ మయింది. అగ్ని జ్వాలల్లాగా మిరుమిట్లు గొలిపే మెరుపులతోటి, మాటిమాటికి ఉగ్రంగా ఉరిమే ఉరుములతోటి దేవేంద్రునిచే ప్రేరేపింపబడిన వర్షం అంతకంతకూ భయంకర మయింది. సూర్య చంద్రమండలాలతో సహా గగనాన్ని కప్పివేసి దిగంతరాలకు వ్యాపించాయి ఆ కారుమబ్బులు, ధారాళంగా కుండపోతగా రాళ్లవాన కురియసాగింది.

తెభా-2-186-వ.
కురియు వానజల్లు పెల్లున రిమ్మలుగొని సొమ్మలు వోయి గోకులం బాకులంబయి "కృష్ణ! కృష్ణ! రక్షింపు"మని యార్తింబొంది కుయ్యిడ నయ్యఖండ కరుణారస సముద్రుండును భక్తజన సురద్రుముండును నైన పుండరీకాక్షుండు.
టీక:- కురియు = కురియుచున్న; వాన = వర్షము; జల్లు = జల్లుల; పెల్లున = మిక్కిలి వేగమునకు; రిమ్మలుగొని = వెఱ్ఱెత్తి; సొమ్మలు = సొమ్మసిల్లి; ఓయి = పోయి; గోకులంబున్ = గోకులమంతా; ఆకులంబున్ = చీకాకుపడినది; అయి = అయి; కృష్ణ = కృష్ణ; కృష్ణ = కృష్ణ; రక్షింపుము = రక్షింపుము; అని = అని; ఆర్తిన్ = ఆర్తిని, బాధను; పొంది = పొంది; కుయ్యిడన్ = మొరపెట్టుకొనగ; ఆ = ఈ; అఖండ = అఖండమైన; కరుణా = కరుణా; రస = రసముతో; సముద్రుండునున్ = సముద్రము వంటివాడు; భక్తి = భక్త; జన = జనుల; దేవ = దేవ; ధ్రుముడునున్ = చెట్టు (కల్పవృక్షము)ను; ఐన = అయినట్టి; పుండరీక = తామరాకుల వంటి {పుడరీకాక్షుడు - తామరాకుల వంటి కళ్ళు ఉన్నవాడు, కృష్ణుడు}; అక్షుండు = కన్నులున్న వాడు, కృష్ణుడు.
భావము:- విరామం లెకుండా అలా కురిసే అంత పెద్ద వానజల్లుకు గోకులమంతా వ్యాకుల మయిపోయింది. జనులందరూ కలత చెంది మూర్ఛిల్లారు. ఆ విధంగా ఆర్తితో “కృష్ణా! కృష్ణా! కాపాడు; కాపాడు” అంటూ మొరపెట్టుకొన్నారు. అప్పడు అనంత దయాసముద్రుడు, భక్తి జనుల పాలిటి కల్పవృక్షము అయిన పద్మనేత్రుడు.