పోతన తెలుగు భాగవతము/ద్వితీయ స్కంధము/నారాయణ వైభవంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


(తెభా-2-267-వ. )[మార్చు]

మఱియు నుత్పత్తిస్థితిలయంబు లెం దగుచుఁ బ్రకాశింపఁబడు నది "యాశ్రయం" బనంబడు; నదియ పరమాత్మ; బ్రహ్మశబ్దవాచ్యంబు నదియ; ప్రత్యక్షానుభవంబున విదితంబుసేయుకొఱకు నాత్మ యాధ్యాత్మికాది విభాగంబు సెప్పంబడియె; నది యెట్లనిన నాత్మ యాధ్యాత్మి, కాధిదైవి, కాధిభౌతికంబులం ద్రివిధం బయ్యె; నందు నాధ్యాత్మికంబు చక్షురాది గోళకాంతర్వర్తియై యెఱుంగంబడుఁ; జక్షురాది కరణాభిమానియై ద్రష్టయైన జీవుండె యాధిదైవకుం డనందగుఁ; జక్షురాద్యధిష్టానాభిమానదేవతయై సూర్యాది తేజో విగ్రహుండు నగుచు నెవ్వని యందు నీ యుభయ విభాగంబునుం గలుగు నతండె యాధిభౌతికుండును, విరాడ్విగ్రహుండును నగుం; గావున ద్రష్టయు దృక్కును దృశ్యంబు ననందగు నీ మూటి యందు నొకటి లేకున్న నొకటి గానరా దీ త్రితయంబు నెవ్వండెఱుంగు నతండు సర్వలోకాశ్రయుండై యుండు; నతండె పరమాత్మయును; అమ్మహాత్ముండు లీలార్థంబైన జగత్సర్జనంబు సేయు తలంపున బ్రహ్మాండంబు నిర్భేదించి తనకు సుఖస్థానంబు నపే క్షించి మొదల శుద్ధంబులగు జలంబుల సృజియించె; స్వతః పరిశుద్ధుండు గావున స్వసృష్టంబై యేకార్ణవాకారంబైన జలరాశియందు శయనంబు సేయుటం జేసి "శ్లో| ఆపోనారా ఇతిప్రోక్తా, ఆపోవై నరసూనవః, తా యదస్యాయనం పూర్వం, తేన నారాయణః స్మృతః;" అను ప్రమాణము చొప్పున నారాయణశబ్దవాచ్యుండు గావున నతని ప్రభావంబు వర్ణింప దుర్లభం; బుపాదానభూతం బయిన ద్రవ్యంబును ద్రివిధంబయిన కర్మంబును గళాకాష్టాద్యుపాధిభిన్నంబయిన కాలంబును, జ్ఞానాదికంబగు జీవస్వభావంబును భోక్త యగు జీవుండును నెవ్వని యనుగ్రహంబునం జేసి వర్తించుచుండు, నెవ్వని యుపేక్షంజేసి వర్తింపకుండు, నట్టి ప్రభావంబుగల సర్వేశ్వరుండు దా నేకమయ్యు ననేకంబు గాఁదలంచి యోగ తల్పంబునం బ్రబుద్ధుండై యుండు; అటమీఁద స్వసంకల్పంబునం జేసి హిరణ్మయంబైన తన విగ్రహంబు నధిదైవతంబును నధ్యాత్మికంబును నధిభూతంబును నను సంజ్ఞాయుతంబై త్రివిధంబుగా సృజియించె.

21-05-2016: :