పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/విప్రుల విచారంబు
తెభా-10.1-872-వ.
ఇట్లు సర్వేశ్వరుండైన హరికి భిక్ష యిడి తమ భార్య లతని వలనం గృతార్థు లగుట యెఱింగి భూసురులు తమలో నిట్లనిరి.
టీక:- ఇట్లు = ఈ విధముగ; సర్వేశ్వరుండు = సర్వులను నియమించువాడు; ఐనన్ = అయినట్టి; హరి = కృష్ణుని; కిన్ = కి; భిక్ష = భిక్ష; ఇడి = పెట్టి; తమ = వారి యొక్క; భార్యలు = సతులు; అతని = అతని; వలనన్ = వలన; కృతార్థులు = ధన్యులు; అగుట = అగుట; ఎఱింగి = తెలిసి; భూసురులు = విప్రులు; తమలోన్ = వారిలోవారు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = చెప్పుకొనిరి.
భావము:- ఇలా తమ పత్నులు అఖిలాండేశ్వరుడైన కృష్ణునికి ఆహారం నివేదించి కృతార్థులు అయ్యారని తెలుసుకుని, ఆ బ్రాహ్మణ పుంగవులు తమలో ఇలా అనుకున్నారు. . .
తెభా-10.1-873-చ.
"కటకట! మోసపోయితిమి; కాంతల పాటియు బుద్ధి లేదు; నే
డిట హరిఁ గానఁబో నెఱుఁగ; మేము దురాత్ముల; మేము గల్మషో
ద్భటులము; విష్ణుదూరగుల ప్రాజ్ఞత లేల? తపంబు లేల? ప
ర్యటనము లేల? శీలములు యాగములున్ మఱి యేల కాల్పనే?
టీక:- కటకట = అయ్యో; మోసపోతిమి = ఏమరితిమి; కాంతల = స్త్రీలకున్న; పాటియున్ = అంతయైన; బుద్ధి = జ్ఞానము; లేదు = లేదు; నేడు = ఇవాళ; ఇటన్ = ఇక్కడ; హరిన్ = కృష్ణుని; కానగన్ = దర్శించుటకు; పోన్ = వెళ్ళవలెనని; ఎఱుగము = తెలిసికొనలేకపొతిమి; ఏము = మేము; దురాత్ముల = చెడ్డమనసు కలవారము; ఏము = మేము; కల్మష = పాపములచేత; ఉద్భటులము = అధికులము; విష్ణు = విష్ణుమూర్తికి; దూరగుల = దూరమైనవారి; ప్రాజ్ఞతలు = వివేకములు; ఏల = ఎందుకు, దండగ; తపంబులు = తపస్సులు; ఏలన్ = ఎందుకు, దండగ; పర్యటనములు = యాత్రలు; ఏలన్ = ఎందుకు, దండగ; శీలములు = సద్వర్తనములు; యాగములున్ = యజ్ఞములు; మఱి = ఇంకా; ఏలన్ = ఎందుకు, దండగ; కాల్పనే = తగులబెట్టుటకా.
భావము:- “అయ్యయ్యో! ఎంతగా మోసపోయం. ఆడువారికి ఉన్నపాటి బుద్ధి మనకు లేకపోయిందే! ఇక్కడ ఉన్న శ్రీహరిని దర్శించడానికి వెళ్ళలేకపోయాం. మనం ఎంత దుష్ట చిత్తులం! పరమ పాపాత్ములం! విష్ణుమూర్తికి దూర మైపోయాము. మన ప్రజ్ఞలు ఎందుకు? తపస్సులు ఎందుకు? తీర్థయాత్రలు ఎందుకు? నియమనిష్ఠలు ఎందుకు? యజ్ఞాలు ఎందుకు? తగలబెట్టడానికా?
తెభా-10.1-874-క.
జపహోమాధ్యయనంబులు
తపములు వ్రతములును లేని తరుణులు హరి స
త్కృపఁ బడసి రన్ని గలిగియుఁ
జపలతఁ బొందితిమి భక్తి సలుపమి నకటా!
టీక:- జప = మంత్రములు జపించుట; హోమ = హోమములు చేయుట; అధ్యయనంబులు = వేదము చదువుట; తపములున్ = తపస్సులు చేయుట; వ్రతములును = వ్రతములు చేయుట; లేని = చేయనివారైన; తరుణులు = స్త్రీలు; హరి = కృష్ణుని; సత్ = మంచి; కృపన్ = దయను; పడసిరి = పొందిరి; ఇన్ని = ఇవన్నికూడ; కలిగియున్ = ఉన్నప్పటికిని; చపలతన్ = చాంచల్యము {చపలత - రాగద్వేషాదులచేత పనుల ఎడ కలుగు తబ్బిబ్బు}; పొందితిమి = పడితిమి; భక్తి = అనన్య భక్తి; సలుపమిన్ = చేయకపోవుటచేత; అకటా = అయ్యో.
భావము:- జపాలూ, హోమాలూ, అధ్యయనాలూ, తపస్సులూ, వ్రతాలూ ఏవీ లేని స్త్రీలు హరి దయకు పాత్రులు అయ్యారు. అయ్యో! అన్నీ ఉండి అలసత్వంతో భక్తి హీనులమై బుద్ధి చాచంల్యానికి లోనయ్యాం కదా!
తెభా-10.1-875-క.
సుర గురులగు యోగీంద్రుల
నరుదుగ మోహితులఁ జేయు హరిమాయ మమున్
నరగురుల మూఢవిప్రుల
నురవడి మోహితులఁ జేయ నోపక యున్నే?
టీక:- సుర = దేవతలలో; గురులు = శ్రేష్ఠులు; అగు = ఐన; యోగి = ఋషి; ఇంద్రులన్ = శ్రేష్ఠులను; అరుదుగా = అప్పు డప్పుడు; మోహితులన్ = మాయలోపడినవారిగా; చేయు = చెసెడిది యైన; హరి = విష్ణువు యొక్క; మాయ = మాయ; మమున్ = మమ్మల్ని; నర = మానవులలో; గురులన్ = గురువులను; మూఢ = అజ్ఞానము పొందిన; విప్రులన్ = బ్రాహ్మణులను; ఉరవడిన్ = మిక్కిలి వేగముగా, విజృంభించి; మోహితులన్ = మాయలో పడినవారిగా; చేయనోపకన్ = చేయలేకుండ; ఉన్నే = ఉండునా, ఉండదు.
భావము:- దేవతల గురువులు అయిన యోగీంద్రులనే విష్ణు మాయ అప్పుడప్పుడు మోహింప జేస్తుంది. మరి మానవ గురువులమూ, జడ విప్రులమూ అయిన మనలను విష్ణు మాయ మోహింప జేయలేదా?
తెభా-10.1-876-మ.
క్రతువుల్ ధర్మము మంత్ర తంత్ర ధనముల్ కాలంబు దేశంబు దే
వతయున్ వహ్నులు మేదినీసురులు నెవ్వా డిట్టి సర్వేశుఁ డీ
క్షితి రక్షింప జనించినాఁ; డెఱుగ; మా శ్రీభర్తకుం గర్తకుం
గుతలోద్ధర్తకు మేము మ్రొక్కెదము రక్షోనాథ సంహర్తకున్. "
టీక:- క్రతువుల్ = యజ్ఞములు; ధర్మము = ఆచారములు; మంత్ర = మంత్రశక్తి; తంత్ర = తంత్రజ్ఞానములు అనెడి; ధనముల్ = సంపదలు; కాలంబు = కాలము; దేశంబున్ = ప్రదేశము; దేవతయున్ = అధిదేవత; వహ్నులు = అగ్నులు, త్రేతాగ్నులు; మేదినీసురులున్ = విప్రులు; ఎవ్వాడు = ఎవరో; ఇట్టి = ఇటువంటి; సర్వేశ్వరుడు = సర్వనియామకుడు; ఈ = ఈ యొక్క; క్షితిన్ = భూలోకమును; రక్షింపన్ = కాపాడుటకు; జనించినాడు = అవతరించినాడు; ఎఱుగము = తెలియము; ఆ = ఆ ప్రసిద్ధుడైన; శ్రీభర్త = కృష్ణుని {శ్రీభర్త - శ్రీ (లక్ష్మీదేవి)కి భర్త (పెనిమిటి), విష్ణువు}; కున్ = కి; కర్త = కృష్ణుని {కర్త - కారణభూతుడైనవాడు, విష్ణువు}; కున్ = కి; కుతలోద్ధర్త = కృష్ణుని {కుతలోద్ధర్త - కుతల (భూమిని) ఉద్ధర్త (ఉద్ధరించు వాడు), విష్ణువు}; కున్ = కి; మేమున్ = మేము అందరము; మ్రొక్కెదము = నమస్కరించెదము; రక్షోనాథసంహర్తకున్ = కృష్ణుని {రక్షో నాథ సంహర్త - రక్షస్ (రాక్షసుల యొక్క) నాథ (రాజులను) సంహర్త (చంపెడి వాడు), విష్ణువు}; కున్ = కి.
భావము:- యాగములు, మంత్రాలూ, తంత్రాలూ, ద్రవ్యాలూ, కాలమూ, దేశమూ, దేవతలూ, అగ్నులూ, విప్రులూ ఏ పరమేశ్వరుడో, అట్టి పరమేశ్వరుడే భూలోకంలో శ్రీకృష్ణుడుగా జగద్రక్షకై అవతరించాడని తెలుసుకోలేక పోయాం. ఆ లక్ష్మీపతికి, సకలమునకు కర్తకు, భూ మండలాన్ని ఉద్ధరించు వాడికి, రాక్షసరాజులను సంహరించు వాడికి ఇవే మా వందనములు.”