పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/యాగము చేయ యోచించుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తెభా-10.1-877-వ.
అని మఱియు ననేకవిధంబులఁ బశ్చాత్తాపంబులం బొంది హరిం దలంచి శమింపుమని మ్రొక్కి బ్రాహ్మణులు కంసభీతులై బల కృష్ణ సందర్శనంబు జేయం జనరై; రంత నక్కడ నఖిలదర్శనుం డైన హరి యింద్రయాగంబు జేయం దలంచి తనకడకు వచ్చిన నందాది గోపవృద్ధులం గని నమస్కరించి, నందున కిట్లనియె.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకను; అనేక = బహు; విధంబులన్ = ప్రకారములుగా; పశ్చాత్తాపంబునన్ = చేసినపనికి బాధపడుటను; పొంది = పొంది; హరిన్ = కృష్ణుని; తలంచి = స్మరించుకొని; శమింపుము = క్షమింపుము, ఓర్చుము; అని = అని; మ్రొక్కి = నమస్కరించి; బ్రాహ్మణులు = విప్రులు; కంస = కంసుని వలన; భీతులు = భయపడువారు; ఐ = అయ్యి; కృష్ణ = కృష్ణుని; సందర్శనంబు = దర్శించుకొనుట; చేయన్ = చేయుటకు; చనరు = వెళ్ళకుండువారు; ఐరి = అయ్యారు; అంతన్ = ఆ తరువాత; అక్కడన్ = అక్కడ; అఖిలదర్శనుండు = సమస్తము తెలిసినవాడు; ఐన = అయిన; హరి = కృష్ణుని; ఇంద్రయాగంబున్ = ఇంద్రునికై యజ్ఞము; చేయన్ = చేయవలెనని; తలంచి = భావించి; తన = అతని; కడ = వద్ద; కున్ = కు; వచ్చినన్ = రాగా; నంద = నందుడు; ఆది = మున్నగు; గోప = గొల్లలలో; వృద్ధులన్ = పెద్దవారిని; కని = చూసి; నందున్ = నందుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = చెప్పెను.
భావము:- ఈ విధంగా తాము చేసిన తప్పు ఆ విప్రపుంగవులు గ్రహించి, చింతించి, హరిని స్మరించుకొని తమ తప్పులను మన్నించ మని ప్రణమిల్లారు. కాని, కంసుడికి భయపడి, బలరామ కృష్ణుల దర్శనానికి వెళ్ళలేదు. అటుపిమ్మట, గోకులంలో ఇంద్రయాగం చేద్దామని అనుకుని నందుడు మొదలగు యాదవ ప్రముఖులు తన దగ్గరకు రాగా, సర్వజ్ఞుడైన కృష్ణుడు వారితో ఇలా అన్నాడు.

తెభా-10.1-878-సీ.
"యాగంబు సేయంగ ర్థించి వచ్చితి-
రీ యాగమున ఫల మేమి గలుగు?
నెవ్వాఁడు దీనికి నీశ్వరుం? డధికారి-
యెవ్వఁడు? సాధన మెంత వలయు?
శాస్త్రీయమో, జనాచారమో కార్యంబు?-
వైరుల కెఱిఁగింప లదు గాని
యెఱిఁగెడి మిత్రుల కెఱిఁగింపఁ దగుఁ జేరి-
యెఱిఁగి చేసినఁ గోర్కు లెల్లఁ గలుగుఁ

తెభా-10.1-878.1-ఆ.
గయుఁ జెలిమి లేక రఁగిన మిముబోఁటి
మంచివారి కేల మంతనంబు?
లఁపు లెల్ల మాకుఁ గ నెఱిఁగింపవే
తాత! వాక్సుధాప్రదాత వగుచు. "

టీక:- యాగంబు = యజ్ఞము; చేయంగన్ = చేయవలెనని; అర్థించి = కోరి; వచ్చితిరి = వచ్చారు; ఈ = ఈ యొక్క; యాగమునన్ = యజ్ఞము వలన; ఫలము = ప్రయోజనములు; ఏమి = ఏవి; కలుగున్ = కలుగును; ఎవ్వాడు = ఎవరు; దీని = దీని; కిన్ = కి; ఈశ్వరుండు = అధిదేవత; అధికారి = అధిపతి; ఎవ్వడు = ఎవరు; సాధనము = ఉపకరణసమూహము; ఎంత = ఎంత; వలయున్ = కావలెను; శాస్త్రీయమో = శాస్త్రవిహితమా; జనాచారమో = అలవాటుగా చేయునదా; కార్యంబు = ఏదైన కార్యక్రమము; వైరుల్ = శత్రువుల; కున్ = కు; ఎఱిగింపన్ = తెలుప; వలదు = వద్దు; కాని = అంతేతప్పించి; ఎఱిగెడి = తెలిసిన; మిత్రుల్ = స్నేహితుల; కున్ = కి; ఎఱిగింపన్ = తెలుపుట; తగున్ = తగినపని; చేరి = దగ్గరగా, బాగా; ఎఱిగి = తెలిసి; చేసినన్ = చేసినచో; కోర్కులు = కోరికలు; ఎల్లన్ = అన్ని; కలుగున్ = సిద్ధించును; పగ = శత్రుత్వములు; చెలిమి = స్నేహములు.
లేకన్ = లేకుండగా; పరిగిన = ప్రసిద్ధమైన; మిము = మీ; బోటి = లాంటి; మంచి = యోగ్యులైన; వారల = వారి; కున్ = కి; ఏల = ఎందుకు; మంతనంబు = రహస్యపుభావనలు; తలపులు = భావించుటలు; ఎల్లన్ = సమస్తము; మా = మా; కున్ = కు; తగన్ = పూర్తిగా; ఎఱిగింపవే = తెలుపుము; తాత = తండ్రి; వాక్ = మాటలనెడి; సుధా = అమృతమును; ప్రదాత = చక్కగానిచ్చువాడవు; అగుచున్ = అగుచు.
భావము:- “మీరేదో యాగం తలపెట్టి వచ్చినట్లున్నారు. ఈ యజ్ఞం వలన ప్రయోజనం ఏమిటి? ఎవరిని ఉద్దేశించి ఈ యాగం? ఈ యాగానికి అధికారి ఎవరు? ఈ క్రతువుకి కావలసిన సంభారాలు ఏమిటి? ఈ యాగం శాస్త్ర సమ్మతమేనా? లేక లోకాచారాన్ని బట్టి వచ్చిందా? శత్రువులకు అయితే వివరాలు అన్నీ చెప్పరాదు. కానీ మిత్రులకు చెప్పవచ్చు కదా. తెలిసి కర్మలను చేస్తే కార్య సిద్ధి అవుతుంది. తెలియకుండా చేస్తే కాదు. మిత్రుడు, శత్రువు అని భేదం లేని మీవంటి సత్పురుషులకు దాచదగిన రహస్యాలు ఉండవు కదా. మీ పలుకులు అనే అమృతం చిందిస్తూ ఈ యజ్ఞం సంకల్పించిన మీ ఉద్దేశం ఏమిటో నాకు వివరించండి.”

తెభా-10.1-879-వ.
అనినఁ బ్రౌఢకుమారునికిఁ దండ్రి యిట్లనియె.
టీక:- అనినన్ = అని పలుకగా; ప్రౌఢ = అన్ని తెలిసినట్టి; కుమారుని = పుత్రుని; కిన్ = కి; తండ్రి = తండ్రి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా అంటున్న యౌవనుడైన కుమారుడితో తండ్రి అయిన నందుడు ఇలా అన్నాడు. . .

తెభా-10.1-880-సీ.
"ర్జన్యుఁ డధికుండు గవంతుఁ డమరేంద్రుఁ-
తనికిఁ బ్రియమూర్తు గుచు నున్న
మేఘ బృందంబులు మేదినీ తలముపై-
తని పంపున భూతర్షణముగ
లములు గురియుఁ, దజ్జలపూరములఁ దోఁగి-
పండు సస్యంబు లా పంట దమకు
ర్మార్థకామ ప్రదాయకంబుగ లోకు-
లెల్లను బ్రతుకుదు; రింత యెఱిఁగి

తెభా-10.1-880.1-తే.
మేఘవిభుఁడైన యింద్రుఁడు మెచ్చుకొఱకు
నింద్రమఖములు జేయుదు రెల్ల నృపులుఁ
గామ లోభ భయ ద్వేష లితు లగుచుఁ
జేయ కుండిన నశుభంబు చెందుఁ బుత్ర!

టీక:- పర్జన్యుడు = వర్షాధిపతి {పర్జన్యుడు - వర్షాధిపతి, ఇంద్రుడు}; అధిపుండు = గొప్పవాడు; భగవంతుడు = షడ్గుణైశ్వర్య సంపన్నుడు; అమరేంద్రుడు = దేవేంద్రుడు; అతని = వాని; కిన్ = కి; ప్రియ = ఇష్ట; మూర్తులు = వస్తువులు; అగుచున్ = ఐ; ఉన్న = ఉన్నట్టి; మేఘ = మేఘముల; బృందంబులు = సమూహములు; మేదినీ = భూ; తలము = మండలము; పై = మీద; అతని = వానిచేత; పంపునన్ = నియమింపబడినట్లు; భూత = జీవులకు; హర్షణము = సంతోషకరము; కన్ = అగునట్లు; జలములున్ = నీటిని; కురియున్ = వర్షించును; తత్ = ఆ; జల = నీటియొక్క; పూరములన్ = ప్రవాహములందు; తోగి = తడిసి; పండు = పండును; సస్యంబులు = పంటలు; పంట = ఫలసాయము; తమ = వారి; కున్ = కి; ధర్మ = ధర్మమును, సద్వర్తన; అర్థ = అర్థము, సద్ప్రయోజన; కామ = కామములను, సదిచ్ఛ; ప్రదాయకములు = చక్కగానిచ్చునవి; లోకులు = ప్రజలు; ఎల్లను = అందరు; బ్రతుకుదురు = సుఖముగాజీవింతురు; ఇంతన్ = ఇది అంతటిని; ఎఱిగి = తెలిసి.
మేఘ = మేఘములకు; విభుడు = ప్రభువు; ఐన = అయిన; ఇంద్రుండు = ఇంద్రుడు; మెచ్చు = మెచ్చుకొనుట; కొఱకు = కోసము; ఇంద్రమఖములు = ఇంద్రయాగములు; చేయుదురు = చేసెదరు; ఎల్ల = సమస్తమైన; నృపులున్ = రాజులు; కామ = కామము; లోభ = లోభము; భయ = భయము; ద్వేష = ద్వేషములు; కలితులు = కలవారు; అగుచున్ = అగుచు; చేయకుండినన్ = చేయకపోయినచో; అశుభంబు = కీడు; చెందున్ = కలుగును; పుత్ర = కొడుకా.
భావము:- “కుమారా! ఇంద్రుడు వర్షాధిపతి, గొప్పవాడు. భగవంతుడు, దేవేంద్రుడు. అతనికి ఇష్టమూర్తులు అయిన మబ్బులు అన్నీ, అతని ఆజ్ఞచే సర్వజీవులకు సంతోషం కలిగిస్తూ నేలమీద వర్షాలు కురుస్తాయి. ఆ నీటి వలన పంటలు పండుతాయి. ఆ పంటల వలన ధర్మార్థ కామాలు సిద్ధిస్తాయి. జనులు హాయిగా జీవనం సాగిస్తారు. కనుక, మేఘాలకు అధిపతి అయిన ఇంద్రుడు మెచ్చేటందుకు, రాజులు అందరూ “ఇంద్రయాగం” చేస్తారు. కామం వలననో, లోభం వలననో, భయం వలననో, ద్వేషం వలననో ఈ యజ్ఞం చేయకపోతే, మానవులకు శుభాలు కలుగవు.

తెభా-10.1-881-వ.
అదియునుం గాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండా.
భావము:- అంతే కాకుండా. . .

తెభా-10.1-882-ఆ.
ఖము సేయ వజ్రి ది సంతసించును
జ్రి సంతసింప వాన గురియు
వాన గురియఁ గసవు సుమతిఁ బెరుగును
సవు మేసి ధేనుణము బ్రతుకు.

టీక:- మఖమున్ = యాగమును; చేయన్ = చేసినచో; వజ్రి = ఇంద్రుడు {వజ్రి - వజ్రాయుధము ధరించువాడు, ఇంద్రుడు}; మదిన్ = మనసు నందు; సంతసించును = తృప్తిచెందును; వజ్రి = ఇంద్రుడు; సంతసింపన్ = సంతోషించగా; వాన = వర్షములు; కురియున్ = వర్షించును; వాన = వర్షములు; కురియన్ = వర్షించినచో; కసవు = పచ్చగడ్డి; వసుమతిన్ = నేలపైన; పెరుగును = వృద్ధిచెందును; కసవున్ = గడ్డిని; మేసి = తిని; ధేను = పశువుల; గణము = సమూహము; బ్రతుకున్ = బాగుగా జీవించును.
భావము:- యాగం చేస్తే వజ్రాయుధుడైన దేవేంద్రుడి మనసు సంతోషిస్తుంది. ఆయన సంతోషిస్తే, వర్షాలు కురుస్తాయి. వాన కురిస్తే భూమిపై గడ్డి బాగా పెరుగుతుంది. పశువులు సుఖంగా బ్రతుకుతాయి.

తెభా-10.1-883-క.
ధేనువులు బ్రతికెనేనియు
మాక ఘనమైన పాఁడి మందలఁ గలుగున్;
నూముగ బాఁడి గలిగిన
మావులును సురలుఁ దనిసి నుదురు పుత్రా! "

టీక:- ధేనువులు = ఆవులు; బ్రతికెన్ = బాగా జీవించునవి; ఏనియున్ = అయినచో; మానక = తప్పక; ఘనము = గొప్పది; ఐన = అయినట్టి; పాడి = పాలదిగుబడి; మందలన్ = గోకులము లందు; కలుగున్ = కలుగును; నూనముగన్ = నిశ్చయముగ; పాడి = పాలదిగుబడి; కలిగినన్ = కలిగినచో; మానవులును = మనుష్యులు; సురలున్ = దేవతలు; తనిసి = తృప్తిచెంది; మనుదురు = బాగుగా జీవింతురు; పుత్రా = కొడుకా.
భావము:- కుమారా! ధేనువులు హాయిగా బ్రతుకుతుంటే, పాడి సమృద్ధిగా లభిస్తుంది. మానవులు, దేవతలు సంతృప్తిగా జీవిస్తారు.”