పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/విప్రవనితా దత్తాన్న భోజనంబు
తెభా-10.1-859-వ.
అనిన విని గోవింద సందర్శన కుతూహలలై ధరణీసుర సుందరులు సంభ్రమానందంబులు డెందంబుల సందడింప, భక్ష్య భోజ్య లేహ్య చోష్య పానీయ భేదంబులుం గలిగి, సంస్కార సంపన్నంబులైన యన్నంబులు కుంభంబుల నిడికొని సంరంభంబున సముద్రంబునకు నడచు నదుల తెఱంగున.
టీక:- అనినన్ = అనగా; విని = విని; గోవింద = కృష్ణుని; సందర్శన = చూడవలెనని; కుతూహలలు = కుతూహలము కలవారు; ఐ = అయ్యి; ధరణీసుర = విప్ర; సుందరులు = అందగత్తెలు, స్త్రీలు; సంభ్రమ = తొట్రుపాటు; ఆనందంబులున్ = సంతోషములు; డెందంబులన్ = మనసు లందు; సందడింపన్ = అతిశయింపగా; భక్ష్య = కొరికి తిన గలిగినవి {పంచభక్ష్యములు - 1భక్ష్యము (కొరికి తినగలిగినవి) 2భోజ్యము (పిడుచగా తిన గలిగినవి) 3లేహ్యము (నాకి చప్పరించ గలవి) 4చోష్యము (జుఱ్ఱుకో దగినవి) 5పానీయము (తాగ గలిగినవి) ఐన ఆహార పదార్థములు}; భోజ్య = పిడుచగా తిన గలిగినవి; లేహ్య = నాకి చప్పరించ గలవి; చోష్య = జుఱ్ఱుకో దగినవి; పానీయ = తాగ గలిగినవి అను; భేదంబులున్ = రకములై; కలిగి = ఉండి; సంస్కార = పరిశుద్ధత అనెడి; సంపన్నంబులు = సంపత్తి కలగిన; అన్నంబులున్ = ఆహారపదార్థములను; కుంభంబులన్ = కుండలలో; ఇడికొని = పెట్టుకొని; సంరంభంబున = వేగిరపాటుతో; సముద్రంబు = కడలి; కున్ = కు; నడచు = పారెడి; నదుల = నదులు; తెఱంగునన్ = వలె.
భావము:- గోపబాలకుల మాటలు వింటూనే దేవకీనందనుడైన కృష్ణుడిని సందర్శించాలని ఆ స్త్రీలు ఉబలాటపడ్డారు. హృదయాలలో సంబరమూ, సంతోషమూ చెలరేగగా భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, చోష్యాలు, పానీయములు అనే పంచభక్ష్యములైన పంచవిధాహారాలు; పక్వంగా వండిన అన్నమూ; కుండలలో పాత్రలలో నింపుకున్నారు. సాగరుణ్ణి చేరడానికి వెళ్ళే నదీమతల్లుల వలె వేగంగా బయలుదేరారు.
తెభా-10.1-860-క.
బిడ్డలు మగలును భ్రాతలు
నడ్డము చని వల దనంగ నటు తలఁడని మా
ఱొడ్డుచు జగదీశ్వరునకు
జడ్డన నన్నంబు గొనుచుఁ జని రా సుదతుల్.
టీక:- బిడ్డలు = పుత్రులు; మగలును = భర్తలు; భ్రాతలు = సోదరులు; అడ్డము = అడ్డముగా; చని = వెళ్ళి; వలదు = వద్దు; అనంగన్ = అని చెప్పగా; అటు = అవతలకి; తలడు = తొలగుడు; అని = అని చెప్పి; మాఱొడ్డుచున్ = ఎదిరించి పలుకుతు; జగదీశ్వరున్ = కృష్ణుని {జగదీశ్వరుడు – ఎల్ల లోకములకు ఈశ్వరుడు, విష్ణువు}; కున్ = కి; జడ్డనన్ = శీఘ్రముగ; అన్నంబున్ = భోజన పదార్థములు; కొనుచున్ = తీసుకొని; చనిరి = వెళ్ళిరి; ఆ = ఆ యొక్క; సుదతుల్ = స్త్రీలు {సుదతి - మంచి దంతములు కలామె, స్త్రీ}.
భావము:- బిడ్డలు, పతులు, తోబుట్టువులు అడ్డంవచ్చి వద్దని వారిస్తున్నా, ఆ బ్రాహ్మణ స్త్రీలు “మమ్మల్ని అడ్డగించకండి తప్పుకోండి” అని బదులు చెబుతూ జగన్నాథునికి అన్నం తీసుకుని వెళ్ళారు.
తెభా-10.1-861-వ.
చని యమునాసమీపంబున నవపల్లవాతిరేకంబును విగత వనచర శోకంబును నైన యశోకంబుక్రింద నిర్మలస్థలంబున.
టీక:- చని = వెళ్ళి; యమునా = యమునానదీ; సమీపంబునన్ = వద్ద; నవ = కొత్త; పల్లవ = చిగుళ్ళచేత; అతిరేకంబును = అతిశయించినది; విగత = పోయిన; వన = అడవి యందు; చర = తిరుగువారి; శోకంబును = శోకములు కలది; ఐన = అయిన; అశోకంబు = అశోకవృక్షము; క్రింద = కింద; నిర్మల = పరిశుభ్రమైన; స్థలంబునన్ = చోటునందు.
భావము:- అలా వారు వెళ్ళి యమునానది వద్ద వనాలలో తిరిగే వారి క్లేశాలు హరించేది, నవనవలాడే చిగురులతో ఇంపారు తున్నది అయిన అశోక చెట్టు క్రింద నిర్మలప్రదేశంలో ఉన్న కృష్ణుడిని చూసారు. . .
తెభా-10.1-862-సీ.
ఒక చెలికానిపై నొక చేయి చాఁచి వే-
ఱొక చేత లీలాబ్జ మూఁచువానిఁ
గొప్పున కందని కొన్ని కుంతలములు-
చెక్కుల నృత్యంబు చేయువానిఁ
గుఱుచ చుంగులు పుచ్చి కొమరారఁ గట్టిన-
పసిఁడి వన్నియ గల పటమువానిఁ
నౌదలఁ దిరిగిరా నలవడఁ జుట్టిన-
దట్టంపు పింఛపు దండవాని
తెభా-10.1-862.1-తే.
రాజితోత్పల కర్ణపూరములవాని
మహిత పల్లవ పుష్ప దామములవాని
భువన మోహన నటవేష భూతివానిఁ
గనిరి కాంతలు కన్నుల కఱవు దీఱ.
టీక:- ఒక = ఒకానొక; చెలికాని = స్నేహితుని; పైన్ = మీద; ఒక = ఒక; చెయి = చేతిని; చాచి = చాపి ఉంచి; వేఱు = మరి; ఒక = ఒక; చేతన్ = చేతిలో; లీలా = వినోదార్థపు; అబ్జమున్ = పద్మమును; ఊచు = ఊపెడి; వానిన్ = వాడిని; కొప్పున్ = సిగ, జుట్టుముడి; కిన్ = కి; అందని = పొడగుసరిపోని; కొన్ని = కొన్ని; కుంతలములున్ = తల వెంట్రుకలు; చెక్కులన్ = చెంపలమీద; నృత్యంబున్ = నాట్యములు; చేయు = చేయుచున్నట్టి; వానిన్ = వాడిని; కుఱచ = పొట్టి; చుంగులు = కుచ్చిళ్ళు; పుచ్చి = పోసి; కొమరారన్ = చక్కగా; కట్టిన = ధరించిన; పసిడి = బంగారు; వన్నియ = రంగు; కల = కలిగిన; పటము = వస్త్రముగల; వానిన్ = వాడిని; ఔదలన్ = శిరస్సుకు; తిరిగిరాన్ = చుట్టివచ్చునట్లు; అలవడన్ = అనువుగా; చుట్టిన = కట్టిన; దట్టంపు = చిక్కటి; పింఛపు = నెమలి పింఛముల; దండ = దండగల; వానిన్ = వాడిని.
రాజిత = విరాజిల్లుతున్న; ఉత్పల = పద్మముల; కర్ణపూరముల = చెవికుండలముల; వానిన్ = వాడిని; మహిత = మేలైన; పల్లవ = చిగుళ్ళ యొక్క; పుష్ప = పూల యొక్క; దామముల = దండలుగల; వానిన్ = వాడిని; భువన = లోకములను; మోహన = మోహముపుట్టించెడి; నట = నటుని వంటి; వేష = వేషధారణ అనెడి; భూతి = సంపద కల; వానిన్ = వాడిని; కనిరి = చూసిరి; కాంతలు = స్త్రీలు; కన్నులకఱవుదీఱ = కన్నులకానందమగునట్లు.
భావము:- ఆ నందగోపాలుడు ఒక మిత్రుడి భుజంపై చెయ్యి వేసికొని, రెండవ చెయ్యి లీలా పద్మం ఆడిస్తున్నాడు; కొప్పు ముడికి అందని కొన్ని ముంగురులు నునుచెక్కిళ్ళ మీద చిందులు వేస్తున్నాయి; ఆయన పొట్టి కుచ్చెలు వచ్చేలా మంచి మెరుపుల వస్త్రం కట్టుకున్నాడు; తల చుట్టూ గుబురుగా తిరిగి వచ్చేలా నెమలి పింఛాల దండ ధరించాడు; చెవి యందు కళకళలాడుతున్న కలువ పువ్వు నెరపాడు; చివుళ్ళు, పువ్వులు కట్టిన వనమాలలు మెడలో అలంకరించుకున్నాడు; భువన మోహనుడు లీలావేష ధారి అయి విరాజిల్లుతున్నాడు. అట్టి శ్రీకృష్ణుడిని తమ కళ్ళ కరువు తీరిపోయాలా ఆ విప్ర వనితలు దర్శించారు.
తెభా-10.1-863-క.
కని లోచనరంధ్రంబుల
మునుమిడి హరి లలితరూపమును లోఁగొని నె
మ్మనములఁ బరిరంభించిరి
తనుమధ్యలు హృదయ జనిత తాపమువాయన్.
టీక:- కని = చూసి; లోచన = కళ్ళ; రంధ్రంబుల = ద్వారములగుండా; మునుమిడి =చక్కగా; హరి = కృష్ణుని; లలిత = మనోహరమైన; రూపమును = స్వరూపమును; లోగొని = గ్రహించి; నెఱ = నిండైన; మనములన్ = మనసులతో; పరిరంభించిరి = కౌగలించుకొనిరి; తనుమధ్యలు = అందగత్తెలు {తను మధ్య - తను (సన్నని) మధ్య (నడుము కలామె), స్త్రీ}; హృదయ = మనసు లందు; జనిత = పుట్టిన; తాపమున్ = సంతాపము, తాపత్రయము; పాయన్ = తొలగిపోవునట్లుగా.
భావము:- సన్నని నడుములతో అందగించిన ఆ స్త్రీలు, హరి స్వరూపాన్ని వీక్షించి, తమ నయన రంధ్రాల ద్వారా ఆ నళినాక్షుని సుందరమూర్తిని హృదయ మందిరాలలో ప్రవేశింప జేసుకున్నారు. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికములు అనే త్రివిధ తాపాలూ ఉపశమింపగా అతనిని కౌగలించుకున్నారు.
తెభా-10.1-864-వ.
ఇ వ్విధంబున.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగా.
భావము:- అలా కృష్ణుని చేరి. . . .
తెభా-10.1-865-క.
వారిత సర్వస్పృహలై
వా రందఱుఁ దన్నుఁ జూడ వచ్చుట మదిలో
వారిజనయనుఁడు పొడగని
వారికి నిట్లనియె నగి యవారితదృష్టిన్.
టీక:- వారిత = తొలగిన; సర్వ = సమస్తమైన; స్పృహలు = ఇచ్చలు కలవారు; ఐ = అయ్యి; వారు = వారు; అందఱున్ = అందరు; తన్నున్ = తనను; చూడన్ = దర్శించుటకు; వచ్చుటన్ = వచ్చుటను; మది = మనసు; లోన్ = అందు; వారిజనయనుడు = పద్మాక్షుడు, కృష్ణుడు; పొడగని = చూసి; వారి = వారల; కిన్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; నగి = నవ్వి; అవారిత = అడ్డులేని; దృష్టిన్ = దృష్టితో.
భావము:- ఆ విప్రవనితలు అన్ని అపేక్షలు వదులుకుని తన్ను దర్శించే తహతహతో రావడం సర్వదర్శనుడైన ఆ పద్మాక్షుడు కృష్ణుడు గ్రహించి ఒక చిరునవ్వు నవ్వి వారి వైపు చూస్తూ ఇలా అన్నాడు.
తెభా-10.1-866-శా.
"కాంతారత్నములార! మీ గృహములం గళ్యాణమే? యేమి గా
వింతున్ మీ? కిటు రండు; మమ్ము నిచటన్ వీక్షింప నేతెంచినా
రెంతో వేడుకతో; నెఱుంగుదుము; నిర్హేతుస్థితిన్ నన్ను ధీ
మంతుల్ మీ క్రియఁ జేరి కందురుగదా మత్సేవలన్ సర్వమున్.
టీక:- కాంతారత్నములారా = ఓ స్త్రీలలో ఉత్తములు; మీ = మీ యొక్క; గృహములన్ = ఇండ్లలో; కళ్యాణమే = అంతా శుభమే కదా; ఏమి = ఏమిటి; కావింతున్ = చేయగలను; మీ = మీ; కున్ = కు; ఇటు = ఈ పక్కకి; రండు = రండి; మమ్మున్ = మమ్ములను; ఇచటన్ = ఇక్కడ; వీక్షింపన్ = చూచుటకు; ఏతెంచినారు = వచ్చితిరి; ఎంతో = చాలా ఎక్కువ; వేడుక = కుతూహలము; తోన్ = తోటి; ఎఱుంగుదుము = తెలిసి యున్నాము; నిర్హేతు = నిర్నిమిత్తమైనట్టి; స్థితిన్ = స్థితిలోనుండి; నన్ను = నన్ను; ధీమంతుల్ = బుద్ధిమంతులు; మీ = మీ; క్రియన్ = వలెనే; చేరి = దగ్గరకు వచ్చి; కందురు = పొందెదరు; కదా = కదా; మత్ = నా యొక్క; సేవలన్ = భక్తిచేత; సర్వమున్ = సమస్తమును.
భావము:- “ఓ స్త్రీరత్నములారా! ఇలా రండి. మీకు అందరికీ కుశలమే కదా! ఎంతో ఉల్లాసంగా మీరు మా దర్శనానికి వచ్చారు. మీకు మేము ఏమి చేయాలో చెప్పండి. ఏ ఫలాపేక్ష లేకుండా వచ్చారని మాకు తెలుసు. విజ్ఞానులు మీ వలెనే మా వద్దకు వచ్చి సేవలు చేసి, సకలమూ పొందగలరు.
తెభా-10.1-867-వ.
కావున గృహస్థు లయిన మీ పతులు మిమ్ముం గూడి క్రతువు నిర్విఘ్నంబుగా సమాప్తిం జేసెదరు; మీరు యాగవాటంబునకుం జనుఁ” డనిన విప్రభార్య లిట్లనిరి.
టీక:- కావునన్ = కనుక; గృహస్థులు = సంసారులు; అయిన = ఐన; మీ = మీ యొక్క; పతులు = భర్తలు; మిమ్మున్ = మీతో; కూడి = కలిసి; క్రతువున్ = యజ్ఞమును; నిర్విఘ్నంబుగా = విఘ్నములు లేకుండగా; సమాప్తి జేసెదరు = నెరవేర్చెదరు; మీరు = మీరు; యాగవాటంబున్ = యజ్ఞశాల; కున్ = కు; చనుడు = వెళ్ళండి; అనినన్ = అనగా; విప్ర = బ్రాహ్మణ; భార్యలు = సతులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- కాబట్టి, గృహస్థులైన మీ భర్తలు మీతో కూడి యజ్ఞం నిర్విఘ్నంగా సమాప్తి చేస్తారు. మీరు యాగశాలకు వెళ్ళండి” అని శ్రీకృష్ణుడు బ్రాహ్మణ స్త్రీలకు చెప్పగా వారు ఇలా అన్నారు.
తెభా-10.1-868-మ.
"తగునే మాధవ! యిట్టి వాఁడిపలుకుల్ ధర్మంబులే మా యెడన్?
మగలుం బిడ్డలు సోదరుల్ జనకులున్ మమ్మున్ నివారింప మ
చ్చిగ నీ యంఘ్రులు చేరినార; మటఁబోఁ జేకొందురే వార లా
పగి దే మొల్లము; కింకరీజనులఁగా భావించి రక్షింపవే. "
టీక:- తగునె = తగినవా, కాదు; మాధవా = కృష్ణా {మాధవుడు - యదుపుత్రుడైన మధు యొక్క వంశమున పుట్టిన వాడు, కృష్ణుడు}; ఇట్టి = ఇటువంటి; వాడి = పదునైన; పలుకులు = మాటలు; ధర్మంబులే = ధర్మమేనా, కాదు; మా = మా; ఎడన్ = గురించి; మగలున్ = భర్తలు; బిడ్డలున్ = పుత్రులు; సోదరుల్ = తోడబుట్టినవారు; జనకుల్ = తల్లిదండ్రులు; మమ్మున్ = మమ్ములను; నివారింపన్ = అడ్డుకొనగా; మచ్చిగన్ = ప్రేమతో, మోహాముతో; నీ = నీ యొక్క; అంఘ్రులున్ = పాదముల వద్దకు; చేరినారము = చేరితిమి; అటబోన్ = అక్కడకు వెళ్ళినచో; చేకొందురే = అంగీకరింతురా; వారలు = వారు; ఆ = అట్టి; పగిదిన్ = విధమును; ఏము = మేము; ఒల్లము = అంగీకరించము; కింకరీ = సేవకురాండ్రైన; జనులన్ = వారిమి; కాన్ = అగునట్లు; భావించి = తలచి; రక్షింపవే = కాపాడుము.
భావము:- “లక్ష్మీమనోహరా! మాతో ఇలా పరుషంగా మాట్లాడటం నీకు తగునా? మా ఎడల ఇది న్యాయమా? పతులు, సుతులు, సోదరులు, తండ్రులు వారిస్తున్నా తిరస్కరించి చనువుగా నీ చరణాల చెంతకు చేరాము. మేం అక్కడికి వెళితే వారు మమ్మల్ని ఆదరిస్తారా? మరి ఇళ్ళకు తిరిగి వెళ్ళడానికి మేం ఒప్పుకోము. మమ్మల్ని నీ దాసీజనంగా భావించి ఏలుకో.”
తెభా-10.1-869-వ.
అనిన జగదీశ్వరుండు.
టీక:- అనినన్ = అనగా; జగదీశ్వరుండు = కృష్ణుడు {జగదీశ్వరుడు - సర్వలోకములకు నియామకుడు, విష్ణువు}.
భావము:- ఇలా పలికిన వనితలతో కృష్ణుడు ఇలా అన్నాడు. . .
తెభా-10.1-870-సీ.
"నా సమీపమున నున్నా రంచు నలుగరు;-
బంధులు భ్రాతలు పతులు సుతులు
మిమ్ము దేవతలైన మెత్తు రంగనలార!-
నా దేహసంగంబు నరుల కెల్ల
సౌఖ్యానురాగ సంజనకంబు గాదు; ము-
క్తిప్రదాయకము; నా కీర్తనమున
దర్శనాకర్ణన ధ్యానంబులను గర్మ-
బంధ దేహంబులఁ బాసి మీరు
తెభా-10.1-870.1-తే.
మానసంబులు నా యందు మరుగఁజేసి
నన్నుఁ జేరెద రటమీఁద నమ్ము"డనుచుఁ
బలికి వారలు దెచ్చిన భక్షణాదు
లాప్తవర్గంబుతో హరి యారగించె.
టీక:- నా = నా; సమీపంబునన్ = వద్ద; ఉన్నారు = ఉన్నారు; అంచున్ = అని; అలుగరు = కోపింపరు; బంధులు = చుట్టములు; భ్రాతలు = తోడబుట్టినవారు; పతులు = భర్తలు; సుతులున్ = పుత్రులు; మిమ్మున్ = మిమ్ములను; దేవతలు = దేవతలు; ఐనన్ = కూడా; మెత్తురు = మెచ్చుకొనెదరు; అంగనలారా = ఓ ఇంతులు; నా = నా యొక్క; దేహ = దేహముతో; సంగంబు = సాన్నిహిత్యము; నరుల = మానవుల; కున్ = కు; ఎల్లన్ = అందరకు; సౌఖ్య = భోగరూపమైనసుఖపు; అనురాగ = అనురక్తి; సంజనకంబు = కలిగించెడిది; కాదు = కాదు; ముక్తి = మోక్షమును; ప్రదాయకము = ఇచ్చునది, ప్రసాదించునది; నా = నా యొక్క; కీర్తనమునన్ = స్తుతివలన; దర్శన = దర్శించుట; ఆకర్ణన = చరిత్రవినుట; ధ్యానంబులనున్ = ధ్యానములవలన; కర్మ = పుణ్య పాప కర్మలను; బంధ = బంధములుగల; దేహంబులన్ = శరీరములను; పాసి = దూరమై; మీరు = మీరు.
మానసంబులు = మనసులను; నా = నా; అందున్ = ఎడలనే; మరుగన్ = లగ్నము; చేసి = చేసి; నన్నున్ = నన్ను; చేరెదరు = కలసెదరు; అటమీదన్ = ఆటుపిమ్మట; నమ్ముడు = నమ్మండి; అనుచున్ = అనుచు; పలికి = చెప్పి; వారలు = వారు; తెచ్చిన = తీసుకు వచ్చిన; భక్షణాదులు = పంచభక్ష్య పరమాన్నములు {భక్షణాదులు - పంచభక్ష్యము (1భక్ష 2భోజ్య 3లేహ్య 4చోష్య 5పానీయము) లతో కూడిన పరమ (శ్రేష్ఠమైన) అన్నములు (ఆహార పదార్థములు)}; ఆప్తవర్గంబు = తనవారి; తోన్ = తోటి; హరి = కృష్ణుడు; ఆరగించెన్ = భుజించెను.
భావము:- “మగువలారా! నా దగ్గర ఉన్నారని మీ చుట్టాలు, సోదరులు, భర్తలు, బిడ్డలు మిమ్మల్ని కోపగించుకోరు. దేవతలు సైతం మిమ్మల్ని ప్రస్తుతిస్తారు. నరుల సంగమం వలె, నా సాంగత్యం సౌఖ్యానురాగాలు ఇచ్చేది కాదు. ఇది కేవలం ముక్తి ప్రదాయకం. నన్ను స్తుతించడం వలన, నన్ను దర్శించడం వలన, నా కథలు వినడం వలన, నన్ను ధ్యానించడం వలన మీరు కర్మబంధదేహాన్ని విడిచి మనసు నా యందే లగ్నం చేసికొని, ఉచితకాలంలో నన్ను పొందగలరు. నా మాట నమ్మండి” అంటూ హరి వారు తెచ్చిన ఆహారాలను ఆప్తమిత్రులతో కలిసి ఆరగించాడు.
తెభా-10.1-871-క.
పరమేశ్వరార్పణంబుగఁ
బరజనులకు భిక్ష యిడినఁ బరమపదమునం
బరఁగెద రఁట; తుది సాక్షా
త్పరమేశుఁడు భిక్ష గొన్న ఫలమెట్టిదియో?
టీక:- పరమేశ్వర = భగవంతునికి; అర్పణంబుగన్ = సమర్పించినదిగా; పర = ఇతరులు; జనులుకు = ఎవిరికైనను; భిక్ష = ఆహారమును; ఇడినన్ = పెట్టినచో; పరమపదమున్ = వైకుంఠమునకు {పరమపదము - సర్వోత్కృష్ట స్థానము, మోక్షము}; పరగెదరు = వెళ్ళదరు; అట = అంటారు; తుదిన్ = చివరకి; సాక్షాత్ = ప్రత్యక్షముగా; పరమేశుడున్ = కృష్ణపరమాత్మయే; భిక్ష = ఆహారము; కొన్నన్ = తీసుకుంటే దానికి; ఫలము = ఫలితము; ఎట్టిదియో = ఎంత గొప్పగా నుండునో.
భావము:- “పరమేశ్వరార్పణం” అంటూ ఎవరికైనా భిక్ష పెడితేనే పరమపదం లభిస్తుంది అంటారు. మరి సాక్షాత్తు పరమేశ్వరు డైన శ్రీకృష్ణ భగవానుడే భిక్ష స్వీకరిస్తే కలిగే ఫలితం ఎంతటిదో చెప్పడం సాధ్యం కాదు కదా!