పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/జరాసంధుని మథుర ముట్టడి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తెభా-10.1-1532-వ.
ఇట్లు చని నిరంతర కిసలయ, పత్ర, కోరక, కుసుమ, ఫలభార వినమిత వృక్షవిలసిత మహోద్యానంబును; నుద్యానవనభాగ వలమాన జలోన్నయన దారుయంత్ర లతానిబద్ధ కలశ విముక్త సలిలధారా శీకరపరంపరా సంపాదిత వర్షాకాలంబును; గాలకింకర సదృశ వీరభట రథ తురగ సామ జానీక సంకులంబును; గులాచార ధర్మప్రవీణ పౌరజన భాసురంబును, సురాభేద్యమాన మహోన్నతాట్టాలక యంత్ర భయంకర ప్రాకారచక్రంబును; జక్ర, సారస, హంసాది కలకలరవ కలిత సరోవరంబును; సరోవర సంఫుల్ల హల్లక కమల పరిమళమిళిత పవన విరాజితంబును; జితానేక మండలేశ్వర భూషణ మణిగణ రజోనివారిత మదగజేంద్ర దానజల ప్రభూత పంకంబును; బంకరహిత యాదవేంద్రదత్త సువర్ణాచల కల్పతరు కామధేను సమ్మర్దిత విద్వజ్జన నికేతనంబును; గేతన సన్నిబద్ధ చామర మయూర చాప శింజనీనినద పరిపూరితాభ్రంబును; నభ్రంలిహ మహాప్రాసాద సౌధ గవాక్షరంధ్ర నిర్గత ఘనసార ధూపధూమపటల విలోకన సంజనిత జలధర విభ్రాంత శిఖండితాండవ రుచిరంబును; జిరతరానేక దేవాలయ జోఘుష్యమాణ తూర్యనినద పరిభావిత పారావార కల్లోల ఘోషంబును; ఘోషకామినీ ప్రాణవల్లభ బాహుదండ పరిరక్షితంబునై, పరులకు నలక్షితంబైన మథురానగరంబు చేరి, వేలాలంఘనంబు చేసి, వెల్లివిరిసిన మహార్ణవంబు తెఱంగునఁ బట్టణంబునకు ముట్టణంబుచేసి, చుట్టును విడిసిన జరాసంధుని బలౌఘంబుఁగని వేళావిదుం డగు హరి తన మనంబున.
టీక:- ఇట్లు = ఈ విధముగ; చని = పోయి; నిరంతర = దట్టమైన; కిసలయ = చిగుళ్ళు; పత్ర = ఆకులు; కోరక = మొగ్గలు; కుసుమ = పూలు; ఫల = పండ్లు యొక్క; భార = అధికమైన బరువుచేత; వినమిత = మిక్కిలి వంగిన; వృక్ష = చెట్లతో; విలసిత = విలసిల్లుచున్న; మహా = గొప్ప; ఉద్యానంబును = ఉద్యానవనములు కలది; ఉద్యానవన = ఉద్యానవనముల; భాగ = ప్రదేశములందు; వలమాన = తిరుగుచున్న; జల = నీటిని; ఉన్నయన = పైకి తోడుతున్న; దారు = చెక్క; యంత్ర = యంత్రము లందు; లతా = తీగలచే; నిబద్ధ = కట్టబడిన; కలశ = కుండలనుండి; విముక్త = కారుతున్న; సలిల = నీటి; ధారా = ధారల; శీకర = తుంపరల; పరంపరా = జల్లులచే; సంపాదిత = కలుగజేయబడిన; వర్షాకాలంబునున్ = వర్షాకాలము కలది; కాల = యమ; కింకర = భటుల; సదృశ = సమానులైన; వీర = శూరులైన; భట = సైనికులు; రథ = రథములు; తురగ = గుఱ్ఱములు {తురగము - త్వరగా పోవునది, గుఱ్ఱము}; సామజ = ఏనుగులుతో {సామజము - సామవేదముల వలన పుట్టినది, ఏనుగు}; సంకులంబును = కలకలము కలది; కులా = తమతమ వంశము యొక్క; ఆచార = ఆచార వ్యవహారములో; ధర్మ = ధర్మమములలో; ప్రవీణ = నేర్పరులైన; పౌరజన = ప్రజలచే; భాసురంబును = ప్రకాశించునది; సురా = దేవతలచేత అయినను; అభేద్యమాన = భేదింపరాని దగుచున్న; మహా = మిక్కిలి; ఉన్నత = ఎత్తైన; అట్టాలక = కోటబురుజుల (అటకల) యందలి; యంత్ర = ఆయుధములచే; భయంకర = భయంకరమైన; ప్రాకారచక్రంబునున్ = కోటగోడవలయము కలది {ప్రాకార చక్రము - కోట యొక్క సరిహద్దుగా కల గోడ, బురుజులు, కందకము మున్నగు రక్షణ వలయములు}; చక్ర = చక్రవాక పక్షులు; సారస = బెగ్గురు పక్షులు; హంస = హంసలు; ఆది = మున్నగువాని; కలకల = కోలాహల; రవ = ధ్వనితో; కలిత = కూడిన; సరోవరంబును = సరస్సులు కలది; సరోవర = సరస్సుల యందలి; సంఫుల్ల = పూర్తిగా వికసించిన; హల్లక = ఎఱ్ఱకలువలు; కమల = తామరలు యొక్క; పరిమళ = సువాసనలచే; మిళిత = కూడుకున్న; పవన = గాలులచే; విరాజితంబును = విలసిల్లుచున్నది; జితా = జయింపబడిన; అనేక = పెక్కుమంది; మండలేశ్వర = రాజుల యొక్క; భూషణ = ఆభరణములలోని; మణి = రత్నాల; గణ = సమూహముల; రజః = పొడిచేత; నివారిత = తొలగింపబడిన; మద = మదించిన; గజ = ఏనుగు; ఇంద్ర = శ్రేష్ఠముల; దాన = మద; జల = జలమున; ప్రభూత = పుట్టినట్టి; పంకంబును = బురదకలది; పంక = పాపములచే; రహిత = విడువబడిన; యాదవ = యదువంశపు; ఇంద్ర = శ్రేష్ఠులచే; దత్త = ఇవ్వబడిన; సువర్ణాచల = కనకాచలము (అంత ధనము); కల్పతరు = కల్పవృక్షము (లాంటి తోటలు భూములు); కామధేను = కామధేనువులచే (లాంటి ఆవులు); సమ్మర్దిత = సందడి కలిగిస్తున్న; విద్వజ్జన = విద్వాంసుల; నికేతనంబును = నివాసములు కలది; కేతన = స్తంభములకు; సన్నిబద్ధ = కట్టబడిన; చామర = వింజామరలు; మయూర = నెమలిపింఛములు కల; చాప = ధనుస్సుల యొక్క; శింజనీ = అల్లె త్రాళ్ళ, వింటినారి; నినద = ధ్వనులతో; పరిపూరిత = నిండిపోయిన; అభ్రంబును = ఆకాశము కలది; మహాప్రాసాద = రాజాంతఃపురము యొక్క; సౌధ = భవనముల యొక్క; గవాక్ష = కిటికీల; రంధ్ర = కన్నములనుండి; నిర్గత = వెలువడెడి; ఘనసార = కర్పూరపు; ధూప = ధూపముల, అగరవత్తుల; ధూమ = పొగ; పటల = సమూహములను; విలోకన = చూచుటచే; సంజనిత = పుట్టిన; జలధర = మేఘములని; విభ్రాంత = భ్రమించుచున్న; శిఖండి = నెమళ్ళ యొక్క; తాండవ = నాట్యములచేత; రుచిరంబును = ప్రకాశించుచున్నది; చిరతర = మిక్కిలి తరచైన; అనేక = పెక్కు; దేవాలయ = గుడుల యందు; జోఘుష్యమాణ = ఘోషించుచున్న; తూర్య = వాయిద్యముల; నినద = ధ్వనిచేత; పరిభావిత = అవమానింపబడుతున్న; పారావార = సముద్రము నందలి {పారావారము - అపారమైన తీరము కలది, కడలి}; కల్లోల = పెద్ద అలల; ఘోషంబును = ఘోష కలది; ఘోషకామినీప్రాణవల్లభ = కృష్ణుని {ఘోషకామినీ ప్రాణవల్లభుడు - గోపికాస్త్రీల ప్రాణముతో సమానమైన ప్రియుడు, కృష్ణుడు}; బాహుదండ = భుజ; పరిరక్షితంబును = చక్కగా కాపడబడుతున్నది; ఐ = అయ్యి; పరుల్ = శత్రువుల; కున్ = కు; అలక్షితంబున్ = చూడరానిది; ఐన = అయిన; మథురా = మథుర అనెడి; నగరంబున్ = పట్టణమును; చేరి = దగ్గరకు పోయి; వేలా = చెలియలికట్ట; లంఘనంబు = దాటుట; చేసి = చేసి; వెల్లివిరిసిన = ప్రవాహరూపమున వెడలిన; మహా = గొప్ప; ఆర్ణవంబు = సముద్రము; తెఱంగునన్ = వలె; పట్టణంబున్ = నగరమున; కున్ = కు; ముట్టణంబుచేసి = ముట్టడించి; చుట్టును = నాలుగు పక్కల; విడిసిన = విడిదిచేసుకొని ఉన్న; జరాసంధుని = జరాసంధుని; బల = సైన్యము యొక్క; ఓఘంబున్ = సమూహమును; కని = చూసి; వేళావిదుండు = వేళతెలిసినవాడు; అగు = అయిన; హరి = కృష్ణుడు; తన = అతని; మనంబునన్ = మనసులో.
భావము:- ఆవిధంగా పోయిపోయి జరాసంధుడి సేనలు మథురాపట్టణం చేరాయి. ఆ మథురాపురం దట్టమైన చిగురుటాకులతో, ఆకులతో, మొగ్గలతో, పూలతో, పండ్ల బరువుతో వంగిన చెట్లతో, అందాలు చిందే ఉద్యానవనాలు కలిగి ఉంది. ఆ ఉద్యానవన వీథులలో నీటిని పైకి తెచ్చే దారుయంత్రాలు గిఱ్ఱున తిరుగుతూ వాటికి బిగించబడిన గిండిగల నుంచి నీటిని పైకి ఎగచిమ్ముతుండగా ఆ నీటితుంపరలు పట్టణంలో కృత్రిమవర్షాకాలాన్ని తలపిస్తూ ఉంది; యమకింకరులతో సమానులైన వీరభటులతో, రథ, గజ, తురంగాలతో నగరం సంకులంగా ఉంది; కులాచారము గల ధర్మవీరులైన పౌరులతో పట్టణం పరిఢవిల్లుతూ ఉంది; ఆ మథురాపురి మిక్కిలి ఎత్తైన కోటబురుజులుతో, వెఱపు పుట్టించే యుద్ధ యంత్రాలతో కూడి దేవతలకైనా భేదించ రాని ప్రాకారాలు కలిగి ఉంది; జక్రవాకాలు, బెగ్గురుపిట్టలు, హంసలు మొదలైన పక్షుల కిలకిలారావములతో నిండిన సరస్సులతో ఆ నగరం అందగిస్తూ ఉంది; సరస్సులలో వికసించిన కలువలు కమలాలు వీటి పరిమళాలతో మేళవించిన వాయువులతో ఆ పురి పొలుపారుతూ ఉంది; నిర్జితులైన రాజుల మణిభూషణాల రాపిడి వలన రాలిన పొడివలన పట్టణంలో మదగజముల దానధారలతో ఏర్పడిన పంకములు అణగిపోయి ఉంది; పాపరహితులైన యదు ప్రముఖుల చేత దానం చేయబడిన కనకాచల, కల్పవృక్ష, కామధేనువులతో క్రిక్కిరిసి మథురలోని పండితుల ఇండ్లు ప్రకాశిస్తున్నాయి; టెక్కములకు కట్టబడిన వింజామరల యొక్క, నెమలిఈకలు గల వింటి నారుల యొక్క మ్రోతలతో మథురానగర గగనతలం ఆవరింపబడి ఉంది; ఆకాశమును ముద్దాడుతున్న రాజభవనాల సౌధాల కిటికీ రంధ్రాల నుంచి వెలువడుతున్న కర్పూరధూప ధూమాలను చూసి, మబ్బుల గుంపు లని భ్రమించి నెమళ్ళు పురివిప్పి ఆ పురిలో మనోహరంగా నృత్యం చేస్తున్నాయి; అక్కడున్న అనేక దేవాలయములలో నిరంతరంగా మ్రోగుతున్న మంగళవాద్య ధ్వనులు సముద్ర తరంగ ఘోషను తిరస్కరిస్తున్నాయి; యాదవభామినుల ప్రాణపతుల యొక్క బాహుదండములచే కాపాడబడుతూ ఉంది. అటువంటిది, అన్యులకు తేరిపారజూడ శక్యముగానిది అయిన ఆ మథురానగరం చేరి, చెలియలికట్ట నతిక్రమించి పొంగివచ్చే మహాసముద్రం వలె పట్టణమును ముట్టడించి చుట్టూ విడిసియున్న జరాసంధునడి సైనికశిబిరాలను చూసి, సమయజ్ఞుడైన శ్రీహరి తన మనసులో ఇలా ఆలోచించాడు.

తెభా-10.1-1533-మ.
"దున్నాలుగునాఱురెండునిరుమూ క్షౌహిణుల్ సుట్టి సం
ఛాదించెన్ బురమెల్ల మాగధునెడన్ సామంబు దానంబు సం
భేదంబున్ బనిలేదు దండవిధి శోభిల్లం బ్రయోగించి యీ
భూదేవీ గురుభార మెల్ల నుడుపం బోలున్ జయోద్భాసినై.

టీక:- అయిదున్నాలుగునాఱురెండునిరుమూడు = ఇరవైమూడు (5+4+6+2+6 = 23); అక్షౌహిణుల్ = అక్షోహిణుల సైన్యము; చుట్టి = చుట్టుముట్టి; సంఛాదించెన్ = కమ్ముకొనెను; పురము = మథురానగరము; ఎల్లన్ = అంతటిని; మాగధు = జరాసంధుని {మాగధుడు - మగధ దేశాధీశుడు, జరాసంధుడు}; ఎడన్ = విషయములో; సామంబున్ = సామము {చతురోపాయములు - 1సామ 2దాన 3భేద 4దండోపాయములు}; దానంబు = దానము; సంభేదంబున్ = బేధములతో; పనిలేదు = అవసరములేదు; దండవిధిన్ = దండోపాయము; శోభిల్లన్ = ప్రకాశించునట్లుగ; ప్రయోగించి = ఉపయోగించి; ఈ = ఈ; భూదేవీ = భూమి యొక్క; గురు = అధిక; భారమున్ = భారము; ఎల్లన్ = అంతటిని; ఉడుపన్ = పోగొట్టుట; పోలున్ = తగును; జయత్ = గెలుపుచేత; ఉద్భాసిని = ప్రకాశించువాడను; ఐ = అయ్యి.
భావము:- “ఇరవైమూడక్షౌహిణులసేన పట్టణాన్ని చుట్టూ ముట్టడించి ఉంది. ఈ మగధదేశ అధిపతి అయిన జరాసంధుడి పట్ల సామ దాన భేదాలు అనే ఉపాయాలు పనికిరావు. కాబట్టి నాల్గవది ఐన దండోపాయం ప్రయోగించి జయంతో వెలుగొందుతూ భూభారం తొలగించాలి.

తెభా-10.1-1534-క.
వతరించు టెల్లను
మానుగఁ జతురంత ధరణిమండలభరమున్
మానుపుకొఱకుం గాదే
పూనెద నిది మొదలు దగిలి భూభర ముడఁపన్.

టీక:- ఏన్ = నేను; అవతరించుట = పుట్టుట; ఎల్లను = అంతయు; మానుగన్ = బాగుగా; చతుః = నాలుగు; అంతన్ = దిశలందలి; ధరణీమండల = భూమండలము యొక్క; భరమున్ = భారమును; మానుపు = పోగొట్టుట; కొఱకున్ = కోసమే; కాదె = కాదా, అవును; పూనెదన్ = మొదలిడెదను; ఇది = దీనితో; మొదలు = మొదలుకొని; తగిలి = ప్రయత్నించి; భూ = భూమండలము యొక్క; భారమున్ = భారమును; అడపన్ = అణచుటకు.
భావము:- భూమండలం నాలుగు చెరగుల పెరిగిపోయిన బరువులు తప్పక నివారించుట కొరకే కదా నేను అవతరించినది. కనుక, నేటి నుంచి భూభారం హరించుటకు ఉద్యమిస్తాను.

తెభా-10.1-1535-ఆ.
గధనాథుఁ బోర డియింపఁ బోలదు
డియకున్న వీఁడు రలమరల
లముఁ గూర్చుకొనుచుఁ ఱతెంచుఁ బఱతేఱఁ
ద్రుంపవచ్చు నేల దొసఁగు దొఱఁగ."

టీక:- మగధనాథున్ = జరాసంధుని {మగధనాథుడు - మగదదేశాధీశుడు, జరాసంధుడు}; పోరన్ = యుద్ధము నందు; మడియింపన్ = ఇప్పుడే చంపుట; పోలదు = తగినది కాదు; మడియక = చావకుండా; ఉన్నన్ =ఉంటే; వీడు = ఇతను; మరలమరల = అనేక మారులు; బలమున్ = సైన్యములను; కూర్చుకొనుచు = సమకూర్చుకొనుచు; పఱతెంచున్ = పరుగెట్టివచ్చును; పఱతేఱన్ = రాగానే; త్రుంపవచ్చు = చంపవచ్చును; నేలన్ = భూమి యొక్క; దొసగు = ఆపద, భారము; తొఱగన్ = తొలగునట్లుగా.
భావము:- మగధేశ్వరుడైన జరాసంధుడిని ఈ యుద్ధంలో చంపేయ రాదు. వీడు చావకుండా ఉంటే, మళ్ళీమళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకుని వస్తూ ఉంటాడు. అప్పుడు ధరాభారం ఉడిపి, అటుపిమ్మట వీణ్ణి చంపవచ్చు.”

తెభా-10.1-1536-వ.
అని యిట్లు చింతించుచున్న సమయంబున నభోభాగంబుననుండి మహాప్రభా సమేతంబులును, సపరిచ్ఛదసూతంబులును, ననేక బాణ బాణాసన చక్రాది వివిధాయుధోపేతంబులునైన రథంబులు రెండు మనోరథంబులు పల్లవింప దైవయోగంబునం జేరవచ్చినం జూచి హరి సంకర్షణున కిట్లనియె.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; చింతించుచున్న = ఆలోచించుచున్న; సమయంబునన్ = సమయమునందు; నభోభాగంబున = ఆకాశము; నుండి = నుండి; మహా = మిక్కిలి అధికమైన; ప్రభా = కాంతితో; సమేతంబులును = కూడుకొన్నవి; సపరిచ్ఛద = పైకప్పులుతో; సూతంబులును = సారథులతో కూడినవి; అనేక = పెక్కు; బాణ = అంబులు; బాణాసన = విల్లుల; చక్ర = చక్రాయుధము; ఆది = మున్నగు; వివిధ = పెక్కువిధములైన; ఆయుధ = ఆయుధములచే; ఉపేతంబులును = కూడుకొన్నవి; ఐన = అయిన; రథంబులు = తేరులు, రథములు; రెండు = రెండు (2); మనోరథంబులు = కోరికలు; పల్లవింపన్ = చిగురించునట్లు, నెరవేరునట్లు; దైవయోగంబునన్ = దైవనిర్ణయానుసారము; చేర = దగ్గరకు; వచ్చినన్ = రాగా; చూచి = చూసి; హరి = కృష్ణుడు; సంకర్షణున్ = బలరాముని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా గోవిందుడు తలపోస్తుండగా మిక్కిలి ప్రకాశవంతమైనవీ సారథులుతో, ధ్వజకవచాదులతో కూడినవీ; అమ్ములు, ధనస్సులు, చక్రములు మొదలైన రకరకాల ఆయుధములతో ఒప్పునవీ అయిన రెండు రథాలు ఆకాశవీథినుండి దైవయోగం వలన వచ్చిచేరాయి వాటిని చూసి మనోరథములు చిగురింపగా సాక్షాత్ శ్రీహరి అయిన కృష్ణుడు సకంర్షణుడైన బలదేవుడితో ఇలా అన్నాడు.

తెభా-10.1-1537-శా.
కంటే రామ! రథంబు లాయుధములున్ గాఢప్రకాశంబులై
మింటన్ వచ్చెను వీనిఁ గైకొని సురల్ మెచ్చన్ నృపశ్రేణులం
బంటింపం బనిలేదు చంపుము ధరాభారంబు వారింపు మీ
వెంటన్ నీ యవతారమున్ సఫలమౌ వేవేగ లె మ్మాజికిన్.”

టీక:- కంటే = చూసితివా; రామ = బలరాముడా; రథంబులున్ = రథములు; ఆయుధములున్ = ఆయుధములు; గాఢ = మిక్కిలి; ప్రకాశంబులు = ప్రకాశవంతములు; ఐ = అయ్యి; మింటన్ = ఆకాశమునుండి; వచ్చెను = వచ్చినవి; వినిన్ = వీటిని; కైకొని = తీసుకొని; సురల్ = దేవతలు; మెచ్చన్ = మెచ్చుకొనునట్లు; నృప = రాజుల; శ్రేణులన్ = సమూహములను; పంటింపన్ = సందేహించను; పనిలేదు = అక్కరలేదు; చంపుము = చంపివేయుము; ధరా = భూ; భారంబున్ = భారమును; వారింపుము = పోగొట్టుము; ఈ = ఈ; వెంటన్ = రీతిని; నీ = నీ యొక్క; అవతారమున్ = పుట్టుకకూడ; సఫలము = ధన్యము; ఔన్ = అగును; వేవేగన్ = శీఘ్రముగా; లెమ్ము = సిద్ధముకమ్ము; ఆజి = యుద్ధమున; కిన్ = కు.
భావము:- “బలరామా! చూడు చూడు. పరమ ప్రభావంతము లైన రథాలు ఆయుధాలతో సహా ఆకాశం నుంచి దిగి వచ్చాయి. వీటిని స్వీకరించు. తడబాటు పడాల్సిన పని లేదు. దేవతలు హర్షించేలా శత్రురాజులను జాగుచేయక సంహరించు. ఈవిధంగా నీ అవతార ప్రయోజనం నెరవేరుతుంది. కనుక యుద్ధానికి శీఘ్రంగా సిద్ధం కమ్ము.”

తెభా-10.1-1538-వ.
అని పలికి.
టీక:- అని = అని; పలికి = చెప్పి.
భావము:- అని శ్రీకృష్ణుడు బలరాముడిని ఉత్సాహపరుస్తూ పలికి. . .