పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/అస్తిప్రాస్తులు మొరపెట్టుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తెభా-10.1-1525-శా.
"వాండ్రున్ వీండ్రును రాజులే యనుచు గర్వప్రౌఢితో యాదవుల్
వేండ్రంబైన బలంబుతో మథురకున్ వే వచ్చి నిష్కారణం
బాండ్రున్ బిడ్డలు బంధులున్ వగవఁ గంసాదిక్షమానాథులం
దండ్రీ! చంపిరి కృష్ణుచేత నిటు వైవ్యంబు వచ్చెన్ జుమీ."

టీక:- వాండ్రున్ = వాళ్ళు; వీండ్రున్ = వీళ్ళు కూడ; రాజులే = రాజులేనా; అనుచున్ = అని; గర్వ = అహంకార; ప్రౌఢి = అతిశయము; తోన్ = తోటి; యాదవుల్ = రామకృష్ణులు {యాదవులు - యదువంశము వారు, కృష్ణుడు బలరాముడు}; వేండ్రంబు =తీక్షణమైనది; ఐన = అయిన; బలంబు =సైన్యం; తోన్ = తోటి; మథుర = మథురాపట్టణమున; కున్ = కు; వే = వేగముగా; వచ్చి = వచ్చి; నిష్కారణంబు = కారణము లేకుండ; ఆండ్రున్ = ఆడవారు; బిడ్డలున్ = పిల్లలు; బంధులున్ = బంధువులు; వగవన్ = దుఃఖించునట్లుగ; కంస = కంసుడు; ఆది = మున్నగు; క్షమానాథులన్ = రాజులను {క్షమానాథుడు - భూమికి పతి, రాజు}; తండ్రీ = తండ్రీ; చంపిరి = చంపేసారు; కృష్ణు = కృష్ణుని; చేతన్ = వలన; ఇటు = ఇలా; వైధవ్యంబున్ = భర్తలేని విధవత్వము; వచ్చెన్ = వచ్చినది; చుమీ = సుమా.
భావము:- అలా అస్తి, ప్రాస్తి వెళ్ళి తమ జనకునితో “తండ్రీ! లోకంలో వారూ వీరూ రాజులేనా? అని యాదవులు మిక్కిలి గర్వించి దుస్సహమైన సైన్యంతో వచ్చి మధురను ముట్టడించారు. భార్యలు పిల్లలు చుట్టాలు ఆక్రందిస్తుండగా కంసుడు మున్నగు భూపతులను వధించారు. ఈ విధంగా మాకు కృష్ణుడి వలన వైధవ్యం సంప్రాప్తించింది.”

తెభా-10.1-1526-వ.
అనిన విని, ప్రళయకాలానలంబు తెఱంగున మండిపడి శోకరోషంబులు బంధురంబులుగా జరాసంధుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; విని = విని; ప్రళయకాల = ప్రళయకాలపు; అనలంబు = అగ్ని; తెఱంగునన్ = వలె; మండిపడి = మిక్కిలి కోపించి; శోక = దుఃఖము; రోషంబులు = కోపములు; బంధురంబులు = తీవ్రమైనవి; కాన్ = అగుటచేత; జరాసంధుండు = జరాసంధుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని కూతుళ్ళు చెప్పగా వినిన జరాసంధుడు ప్రళయకాలాగ్ని మాదిరి మండిపడ్డాడు. శోకరోషములు మనసున పెనుగొనగా ఇలా అన్నాడు.

తెభా-10.1-1527-శా.
"మీ? కంసునిఁ గృష్ణుఁడే రణములో హింసించె నోచెల్ల! నా
సార్థ్యంబు దలంప డించుకయు మచ్చండప్రతాపానలో
ద్దామార్చుల్ వడి నేడు గాల్చు యదుసంతానాటవీ వాటికన్
భూమిం గ్రుంగిన నింగిఁ బ్రాకిన మహాంభోరాశిలోఁ జొచ్చినన్.

టీక:- ఏమీ = ఏమిటీ; కంసుని = కంసుడిని; కృష్ణుడే = కృష్ణుడు; రణము = యుద్ధము; లోన్ = అందు; హింసించెనా = చంపెనా; ఓచెల్ల = ఔరా; నా = నా యొక్క; సామర్థ్యంబున్ = శక్తిని; తలపడు = తలచుకొనడు, గుర్తించడు; ఇంచుకయు = కొంచెము కూడ; మత్ = నా యొక్క; చండ = తీవ్రమైన; ప్రతాప = పరాక్రమము అనెడి; అనల = అగ్ని యొక్క; ఉద్దామ = అణచరాని; అర్చుల్ = మంటలు; వడిన్ = వేగమే; నేడు = ఇవాళ; కాల్చున్ = మసిచేయును; యదు = యాదవ; సంతాన = సంతతి అనెడి; అటవీ = అడవి; వాటికన్ = వరుసలను; భూమిన్ = భూమిలోకి; క్రుంగినన్ = దూరిపోయిన; నింగిన్ = ఆకాశముపైకి; ప్రాకినన్ = ఎగబ్రాకిన; మహా = గొప్పదైన; అంభోరాశి = సముద్రము; లోన్ = లోపలకి; చొచ్చినన్ = మునిగిన.
భావము:- “ఏమిటీ! కృష్ణుడు యుద్ధములో కంసుణ్ణి సంహరించాడా? ఔరా! అతడు నా సమర్ధత ఏమాత్రమూ గణించలేదా? చెలరేగుతున్న నా ప్రతాపాగ్నిజ్వాలలు యదువు వంశములో పుట్టిన ఆ యాదవులనే అడవిని అంతా నేడే దహించి వేయగలవు. భూమిలో దాగునో; ఆకాశమునకు ఎగబ్రాకునో; మహాసముద్రంలోకి ప్రవేశించునో చూచెద గాక!

తెభా-10.1-1528-క.
యావ విరహిత యగుఁ బో
మేదిని నాచేత నేడు మీఁదుమిగిలి సం
పాదిత బలులై హరి రు
ద్రాదులు నింద్రాదు లెవ్వ డ్డం బైనన్."

టీక:- యాదవ = యదువంశము; విరహిత = లేనిది; అగుబో = ఐపోవునుగాక; మేదినిన్ = భూమిపైన; నా = నా; చేతన్ = చేత; నేడు = ఇవాళ; మీదుమిగిలి = మీదుమిక్కిలి, అతిక్రమించి; సంపాదిత = కూర్చుకొన్న; బలులు = సేనలు కలవారు; ఐ = అయ్యి; హరి = విష్ణువు; రుద్ర = శివుడు; ఆదులన్ = మున్నగువారు; ఇంద్ర = ఇంద్రుడు; ఆదులు = మున్నగువారు; ఎవ్వరు = ఎంతటి వారు; అడ్డంబైనను = అడ్డుపడిన కూడ.
భావము:- నేడు ఈ భూమండల మొత్తం నేను యాదవ రహితం చేయబోతున్నాను. మీదుమిక్కిలి, తమతమ బలములతో హరిహరేంద్రాదులు సహా ఎవరు అడ్డుపడినా సరే, ఇది తప్పదు.”

తెభా-10.1-1529-వ.
అని పలికి సమరసన్నాహ సంకులచిత్తంబునఁ గోపంబు దీపింప సంగరభేరి వ్రేయించి కదలి.
టీక:- అని = అని; పలికి = చెప్పి; సమర = యుద్ధమునకు; సన్నాహ = సిద్ధపడుట యందు; సంకుల = వ్యాపించిన; చిత్తంబునన్ = మనసులో; కోపంబున్ = కోపము; దీపింపన్ = అతిశయింపగా; సంగర = యుద్ధ; భేరి = భేరీలను; వ్రేయించి = వాయింపజేసి; కదలి = బయలుదేరి.
భావము:- అని శపథం చేసి జరాసంధుడు కోపము జ్వలించగా యుద్ధసమాయత్త చిత్తుడై యుద్ధభేరి మ్రోగించి, కదిలాడు.

తెభా-10.1-1530-క.
క్షుండై యిరువదిమూ
క్షౌహిణులైన బలము నుగతములుగా
నాక్షణమ జరాసంధుఁడు
ప్రక్షోభముతోడ మథురపైఁ జనియె నృపా!

టీక:- దక్షుండు = సమర్థుడు; ఐ = అయ్యి; ఇరువదిమూడు = ఇరవైమూడు (23); అక్షౌహిణిలు = అక్షోహిణులు సంఖ్య {అక్షౌహిణి - 21,870 రథములు 21,870 ఏనుగులు 65,610గుఱ్ఱములు 109,350కాల్బలము కల సేనాసమూహము}; ఐన = కలిగన; బలములను = సేనలను; అనుగతంబులు = అనుసరించునవి; కాన్ = కాగా; ఆక్షణమ = అప్పుడే, తత్క్షణమే; జరాసంధుడు = జరాసంధుడు; ప్రక్షోభము = కలత, వ్యాకులత; తోడన్ = తోటి; మథుర = మథురాపట్టణము; పైన్ = మీదకి; చనియెన్ = ముట్టడింప పోయెను; నృపా = రాజా.
భావము:- పరీక్షన్మహారాజా! జరాసంధుడు దక్షుడై ఇరవైమూడు అక్షౌహిణుల సైన్యం వెంటబెట్టుకుని ఆ క్షణమే బయలుదేరి సరభసంగా యాదవరాజధాని ఐన మథుర పైకి దాడి చేయడానికి వెళ్ళాడు.

తెభా-10.1-1531-క.
గంధేభ తురగ రథ భట
బంధుర చరణోత్థితోగ్ర పాంసుపటల యో
గాంధీభూతములై దివి
మంరగతి నడచె నపుడు మార్తాండ హరుల్.

టీక:- గంధ = మదించిన; ఇభ = ఏనుగులు; తురగ = గుఱ్ఱములు; రథ = రథములు; భట = కాల్బలముల; బంధుర = దట్టమైన; చరణ = అడుగులవలన; ఉత్థిత = పుట్టుచున్న; ఉగ్ర = భయంకరమైన; పాంసు = దుమ్ము యొక్క; పటల = సమూహములు; యోగ = కూడుటచేత, కమ్ముటచే; అంధీభూతములు = గుడ్డివి చేయబడినవి; ఐ = అయ్యి; దివి = ఆకాశమునందు; మంథర = మెల్లని; గతిన్ = విధముగా; నడచెన్ = పోవుచుండెను; అపుడు = అప్పుడు; మార్తాండ = సూర్యుని {మార్తాండుడు - మృతుండు అనువాని పుత్రుడు, బ్రహ్మాండము మృతి (రెండు ముక్కలు) ఐనప్పుడు పుట్టినవాడు, సూర్యుని సుషమ్న అనెడి రశ్మి యొక్క అవతారము}; హరుల్ = గుఱ్ఱములు.
భావము:- (అలా దాడివెడలిన జరాసంధుడి చతురంగబలం లోని) రథ, గజ, తురగ, పదాతుల పాదఘట్టనలచే ఎగసిన దుమ్ము వలన కండ్లు కనిపించక సూర్యుని రథాశ్వములు గగనతలంలో మెల్లగా నడిచాయి.