పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/జరాసంధునిసేన పోరాటము

వికీసోర్స్ నుండి


తెభా-10.1-1558-వ.
మఱియు నయ్యెడ మాగధ మాధవ వాహినులు రెండు నొండొంటిం దాఁకి రౌద్రంబున సంవర్తసమయ సముద్రంబుల భంగి నింగికిం బొంగి చెలంగి చలంబునం దలపడి పోరునెడ మసరుకవిసి మహారణ్యంబులు వెలువడి మార్కొను మదగజంబుల మాడ్కిని, మహోత్కంఠంబులగు కంఠీరవంబుల గ్రద్దన, దుర్లభంబులగు శరభంబుల చాడ్పునం, బ్రచండంబులగు గండభేరుండంబుల గమనికం దమతమ మొనలకుం దలకడచి వీరరసంబుల వివిధరూపంబులైన విధంబునం బదుగురు నూర్వు రేవురు గములై కులకుధర గుహాంతరాళంబులు నిండ సింహనాదంబు లొనర్చుచు, నార్చుచు నట్టహాసంబులు సేయుచు, నరివీరుల రోయుచు పటహ కాహళ భేరీ శంఖ శబ్దంబులకు నుబ్బుచు, గర్వంబులం బ్రబ్బుచు, గదల వ్రేయుచుఁ గాండంబు లేయుచు, ముద్గరంబుల నొత్తుచు, ముసలంబుల మొత్తుచుఁ, గుంతంబుల గ్రుచ్చియెత్తుచుఁ గరవాలంబులం ద్రెంచుచుఁ, జక్రంబులం ద్రుంచుచు శస్త్రంబులఁ దఱుగుచుఁ, జిత్రంబులం దిరుగుచు పరిఘంబులఁ ద్రిప్పికొట్టుచుఁ, బ్రాసంబులఁ బెట్టుచు, శూలంబులఁ జిమ్ముచు, సురియల గ్రుమ్ముచు బహుభంగులఁ బరాక్రమించు వీరభటులును, నిబిడ నీరంధ్రం నేమినిర్ఘోషంబుల నాకాశంబు నిరవకాశంబుగ ననర్గళ చక్రమార్గణంబులం బడు పదాతులును జదియు నరదంబులును వివిధాయుధ ప్రయోగంబుల వైరుల వ్రచ్చి వందఱలాడు రథికులును, రథిక శరపరంపరలఁ గంపింపక మహామోఘ మేఘధారలకుఁ జలింపని ధరణీధరంబుల చాడ్పున రథంబులకుం గవిసి కల్పాంతకాల దండిదండ ప్రచండంబులగు శుండాదండంబులు సాఁచి యూఁచి కడనొగ లొడిసి తిగిచి కుదిచి విఱిచి కూబరములు నుఱుములుగ జిఱజిఱం ద్రిప్పివైచియు, భటులం జటుల గతి బంతుల క్రియ నెగుర వైచి దంతంబుల గ్రుచ్చియు ఘోటకంబుల వ్రచ్చియు విచ్చలవిడిం దిరుగు కరులును, వజ్రి వజ్రధారలకుం దప్పి కకుప్పులకు నెగయు ఱెక్కలుగల గిరుల సిరులం బక్కెరల తోడ హేషారవ భీషణంబులయి మనోజవంబులగు తురంగంబులం బఱపి తురంగ పదపాంసుపటల ప్రభూత బహుళాంధకారంబులు కరకలిత కఠోర ఖడ్గ మరీచి జాలంబుల నివారించుచు నానాప్రకారంబులం బ్రతివ్యూహంబులం జించి చెండాడు రాహుత్తులుం గలిగి సంగ్రామంబు భీమం బయ్యె నందు.
టీక:- మఱియున్ = ఇంకను; ఆ = ఆ; ఎడన్ = సమయ మందు; మాగధ = జరాసంధుని; మాధవ = కృష్ణుని; వాహినులున్ = సేనలు; రెండున్ = రెండు (2); ఒండొంటిన్ = ఒకదాని నొకటి; తాకి = ముట్టడించి; రౌద్రంబునన్ = భయంకరత్వముచేత; సంవర్త = ప్రళయ; సమయ = కాలపు; సముద్రంబుల = సముద్రముల; భంగిన్ = వలె; నింగి = ఆకాశమున; కిన్ = కి; పొంగి = ఉప్పొంగి; చెలంగి = చెలరేగి; చలంబునన్ = పట్టుదలతో; తలపడి = తాకి; పోరున్ = యుద్ధము చేయు; ఎడన్ = సమయమందు; మసరు = మదము; కవిసి = ఎక్కి; మహా = గొప్ప; అరణ్యంబులున్ = అడవులనుండి; వెలువడి = బయల్పడి; మార్కొను = తలపడెడి; మద = మదించిన; గజంబుల = ఏనుగుల; మాడ్కిని = వలె; మహా = మిక్కిలి; ఉత్కంఠంబులు = తమకములు కలవి; అగు = అయిన; కంఠీరవంబుల = సింహముల {కంఠీరవము - కంఠమున ధ్వని కలది, సింహము}; గ్రద్దనన్ = వలె; దుర్లభంబులు = పట్టరానివి; అగు = ఐన; శరభంబుల = శరభమృగముల; చాడ్పునన్ = వలె; ప్రచండంబులు = భయంకరమైనవి {ప్రచండము - మిక్కిలి తీవ్రమైనది, భయంకరమైనది}; అగు = ఐన; గండభేరుండంబుల = గండభేరుండపక్షులు; గమనికన్ = వలె; తమతమ = వారివారి; మొనల = సేనల; కున్ = కి; తలకడచి = మీరి; వీరరసంబులన్ = వీరత్వములతో; వివిధ = పెక్కువిధముల; రూపంబులు = వ్యూహములు కలది; ఐన = అయిన; విధంబునన్ = విధముగ; పదుగురు = పదేసిమంది (10); నూర్వురు = నూరేసిమంది (100); గములు = సమూహములు; ఐ = అయ్యి; కులకుధర = కులపర్వతముల; గుహా = గుహల; అంతరాళంబులు = లోపలి అవకాశములు; నిండన్ = నిండిపోవునట్లుగా; సింహనాదంబులు = గర్జనలు; ఒనర్చుచు = చేయుచు; ఆర్చుచున్ = పెడబొబ్బలు పెట్టుచు; అట్టహాసంబులు = పెడనవ్వులు నవ్వుట; చేయుచున్ = చేయుచు; అరి = శత్రువుల యొక్క; వీరులన్ = శూరులను; రోయుచున్ = నిందించుచు; పటహ = తప్పెటలు; కాహళ = బాకాలు, బూరాలు; భేరీ = భేరీలు; శంఖ = శంఖములు యొక్క; శబ్దంబుల్ = ధ్వనుల; కున్ = కు; ఉబ్బుచున్ = ఉప్పొంగిపోతూ; గర్వంబులన్ = అహంకారములచే; ప్రబ్బుచున్ = కలయతిరుగుచు; గదలన్ = గదలతో; వ్రేయుచున్ = మొత్తుచు; కాండంబులు = బాణములు; ఏయుచున్ = వేయుచు; ముద్గరంబులన్ = ఇనపగుదియలతో, సమ్మెటలతో; ఒత్తుచు = అణచివేయుచు; ముసలంబులన్ = రోకళ్ళతో; మొత్తుచున్ = కొట్టుతు; కుంతంబులన్ = ఈటెలతో; గ్రుచ్చి = పొడిచి; ఎత్తుచు = పైకెత్తుతు; కరవాలంబులన్ = కత్తులతో; త్రెంచుచున్ = తెగనరుకుతు; చక్రంబులన్ = చక్రములతో; త్రుంచుచున్ = తునకలుచేయుచు; శస్త్రంబులన్ = పెడకత్తులతో; తఱుగుచున్ = కోసివేయుచు; చిత్రంబులన్ = విచిత్రరీతులలో; తిరుగుచున్ = గుండ్రముగా తిరుగుచు; పరిఘంబులన్ = ఇనపకట్ల గుదియలను, బాణాకఱ్ఱలను; త్రిప్పి = తిప్పి; కొట్టుచున్ = కొట్టుతు; ప్రాసంబులన్ = బల్లెములతో; పెట్టుచు = నాటించుచు; శూలంబులన్ = శూలములతో; చిమ్ముచున్ = ఎగురగొట్టుచు; సురియలన్ = చురకత్తులతో; క్రుమ్ముచు = పొడుచుచు; బహు = పెక్కు; భంగులన్ = విధములుగ; పరాక్రమించు = పరాక్రమమును చూపెడి; వీర = శూరులైన; భటులును = సైనికులు కలది; నిబిడ = దట్టమైన; నీరంధ్ర = ఎడతెగని; నేమి = రథచక్రముల పైకమ్ముల; నిర్ఘోషంబులన్ = గట్టి చప్పుళ్ళతో; ఆకాశంబు = ఆకాశము; నిరవకాశంబున్ = ఖాళీలేనిది, నిండినది; కన్ = కాగా; అనర్గళ = అడ్డములు లేని; చక్ర = చక్రములు; మార్గణంబులన్ = బాణములచే; పడు = పడిపోయెడి; పదాతులును = కాల్బంట్లు; చదియు = చతికిలబడెడి; అరదంబులును = రథములు, తేరులు; వివిధ = బహువిధములైన; ఆయుధ = ఆయుధములను; ప్రయోగంబులన్ = ప్రయోగించుటలచేత; వైరులన్ = శత్రువులను; వ్రచ్చి = చీల్చి; వందఱలాడు = చెండాడు; రథికులును = రథము మీది యోధులు; రథిక = రథికుల యొక్క; శర = బాణముల; పరంపరలన్ = జల్లులచే; కంపింపక = బెదిరిపోకుండ; మహా = గొప్ప; అమోఘ = చెదరని; మేఘ = మేఘములు వర్షించెడి; ధారల = జడి; కున్ = కి; చలింపన్ = బెదరని; ధరణీధరంబుల = పర్వతముల {ధరణీధరములు - భూమిని మోయునవి, పర్వతములు}; చాడ్పునన్ = వలె; రథంబుల్ = తేరుల; కున్ = కు; కవిసి = తాకి; కల్పాంత = ప్రళయపు; కాల = సమయము నందలి; దండి = యముని యొక్క {దండి - దండించుటను (శిక్షించుటను) ధరించువాడు, దండాయుధ ధారి, యముడు}; దండ = దండాయుధమువలె; ప్రచండంబులు = భీకరములు; అగు = ఐన; శుండా = తొండములు అనెడి; దండంబులున్ = దండములను; సాచి = చాచి, సాగదీసి {చాచి (ప్ర) - సాచి (వి)}; ఊచి = ఊపి; కడలన్ = తొండము చివరలతో; నొగలన్ = రథముల నొగలను {నొగ - రథములకు బండ్లకాడికి ఆధారముగ ముందుండెడి పొడవాటి చట్రము, కూబరము}; ఒడిసి = ఒడుపుగా; తిగిచి = లాగి; కుదిచి = కుదిపి; విఱిచి = ముక్కలుచేసి; కూబరములున్ = బండినొగలు {కూబరము - రథములకు బండ్లకాడికి ఆధారముగ ముందుండెడి పొడవాటి చట్రము, నొగ}; ఉఱుములు = తునుకలు; కన్ = అగునట్లు; జిఱజిఱన్ = గిరగిర; త్రిప్పి = తిప్పి; వైచియు = విసిరేసి; భటులన్ = సైనికులను; చటుల = భయంకరమైన; గతిన్ = విధముగ; బంతుల = చెండ్ల; క్రియన్ = వలె; ఎగురవైచి = మీదికి విసిరేసి; దంతంబులన్ = దంతములతో; గ్రుచ్చియున్ = గుచ్చి; ఘోటకంబులన్ = గుఱ్ఱములను {ఘోటకము - భూమి యందు పొరలునది, గుఱ్ఱము}; వ్రచ్చియున్ = చీల్చివేసి; విచ్చలవిడిన్ = ఇష్టంవచ్చినట్లు; తిరుగు = తిరుగుచున్నట్టి; కరులును = ఏనుగులు; వజ్రి = ఇంద్రుని; వజ్ర = వజ్రాయుధము యొక్క; ధారల = పదును అంచుల; కున్ = కు; తప్పి = తప్పించుకొని; కకుప్పుల్ = దిక్కుల; కున్ = కు; ఎగయు = ఎగిరిపోయెడి; ఱెక్కలు = రెక్కలు; కల = ఉన్నట్టి; గిరుల = పర్వతముల; సిరులన్ = వలె; పక్కెరల = కవచముల; తోడన్ = తోటి; హేషా = సకిలింతల; రవ = ధ్వనిచేత; భీషణంబులు = భయంకరమైనవి; అయి = ఐ; మనోజవంబులు = మనోవేగములు కలవి; అగు = ఐన; తురంగంబులన్ = గుఱ్ఱములను {తురంగము - త్వర యైన గమనము కలది, గుఱ్ఱము}; పఱపి = పరుగెత్తించి, తోలి; తురంగ = గుఱ్ఱముల; పద = కాలి; పాంసు = దుమ్ము; పటల = తెరలచే; ప్రభూత = కలిగిన; బహుళ = మిక్కిలి అధికమైన; అంధకారంబులు = చీకట్లను; కర = చేతులలో; కలిత = ఉన్నట్టి; కఠోర = గట్టి; ఖడ్గ = కత్తుల యొక్క; మరీచి = మెరుపుల; జాలంబులన్ = సమూహములచే; నివారించుచున్ = పోగొట్టుచు; నానాప్రకారంబులన్ = బహువిధములుగా; ప్రతి = శత్రు; వ్యూహంబులన్ = సేనారచనలను {వ్యూహము - విశేషమైన శత్రుదుర్భేధ్యమైన సేనా రచనలు}; చించి = విరగదీసి; చెండాడు = బంతులవలె చెదరగొట్టు; రాహుత్తులును = గుఱ్ఱపు రౌతులు; కలిగి = కలిగి; సంగ్రామంబు = యుద్ధము; భీమంబు = భయంకరమైనది; అయ్యెన్ = అయినది; అందు = దానిలో.
భావము:- అప్పుడు కృష్ణుడి సేనలు, జరాసంధుడి సేనలు పరస్పరం ఎదుర్కొని రౌద్రంతో ప్రళయకాల మందలి సముద్రాల మాదిరి ఆకాశము అంటేటంత ఉప్పొంగి పౌరుషంతో పోరాడసాగాయి. మదమెక్కి మహారణ్యాల నుండి వెలువడి డీకొనే మదపుటేనుగులు లాగ; మిక్కిలి వేగిరపాటు గల సింహాలు మాదిరి; అపూర్వములైన శరభముల వలె; భీతిపుట్టించే గండభేరుండముల కరణి; యోధులు తమ తమ సేనల్ని మించి వీరరసం పలురూపులు గైకొన్నట్లు పదిమంది, నూరుమంది, వెయ్యిమంది వంతున గుంపులై కులపర్వత గుహాంతరాళాలు నిండేటంత బిగ్గరగా పెడబొబ్బలు పెట్టారు; వెడనవ్వులు నవ్వారు; శత్రువీరులను తూలనాడారు. పటహము, కాహళ, భేరి, శంఖం మొదలైన వాద్యాల శబ్దాలకు వారు ఉద్రేకాలు పొందారు; గర్వంతో చెలరేగారు; పరవీరులను గదలతో మోదారు; బాణాలు ప్రయోగించారు; సమ్మెటలతో మర్దించారు; రోకళ్ళతో మొట్టారు; బల్లెములతో గుచ్చి పైకెత్తారు; కత్తులతో ఖండించారు; చక్రాలతో ఛేదించారు; శస్త్రాలతో తరిగారు; విచిత్ర రీతులలో తిరుగుతూ ఇనుపకట్ల గుదియలు త్రిప్పికొట్టారు; ఈటెలు శూలాలుతో చిమ్మారు; చురకత్తులతో క్రుమ్మారు; ఈ విధంగా వీరభటులు పలురకాల పరాక్రమించారు. ఎడతెరపిలేని రథచక్ర ఘోషలతో ఆకాశం నిండిపోయింది. చక్రాలక్రిందపడి పదాతిదళాలు నలిగేటట్లు రథములు తోలించి అనేక రకములైన ఆయుధములు ప్రయోగించి రథం ఎక్కి యుద్ధం చేస్తున్న శూరులు శత్రువులను చీల్చిచెండాడారు. ఆ రథికుల శరపరంపరలకు చలించక మహావర్షధారలకు చలించని పర్వతాల మాదిరి ఏనుగులు రథాల మీదకి నడచి ప్రళయకాలంలోని యమదండంవలె భయంకరమైన దండముల వంటి తొండాలు సాచి పూనికతో తొండం చివరలతో రథాల నొగలను ఒడిసిపట్టి లాగి, కుదిపి, జిరజిర త్రిప్పి, విరిచి, పొడిపొడి గావించాయి. భటులను బంతుల ఎగరేసినట్లు ఎగురవేసి దంతాలతో క్రుమ్మాయి; గుఱ్ఱాలను చీల్చివేసి విచ్చలవిడిగా విహరించాయి; దేవేంద్రుడి వజ్రాయుధపు వేటులు తప్పించుకుని దిగంతాలకు ఎగిరిపోయే రెక్కలున్న కొండల కైవడి భాసిస్తూ జీనులతో కూడినవై దారుణంగా సకిలిస్తూ మనస్సు వలె వడి గలిగిన గుఱ్ఱాలు విజృంభించాయి; వాటిని ఉసికొలిపి తోలేటప్పుడు వాటి కాలిడెక్కల దుమ్ముచే కారుచీకట్లు వ్యాపించాయి; ఆ కారుచీకట్లను తమ చేతిలోని కరకుకత్తుల కాంతిపుంజములతో నివారిస్తూ, గుఱ్ఱపురౌతులు శత్రువుల ప్రతివ్యూహాలను పటాపంచలు గావించారు; ఈవిధంగా భీషణమైన సమరం జరిగింది.

తెభా-10.1-1559-క.
చెడు రథములుఁ దెగు హరులును
డు కరులును మడియు భటులుఁ ఱచు రుధిరమున్
డియు తల లొఱగు తనువులుఁ
బొడి యగు తొడవులును మథురిపుని దెసఁ గలిగెన్.

టీక:- చెడు = చెడిపోయెడి; రథములున్ = తేరులు; తెగు = తెగిపోయెడి; హరులును = గుఱ్ఱములు; పడు = పడిపోయెడి; కరులును = ఏనుగులు; మడియు = చనిపోయెడి; భటులున్ = సైనికులు; పఱచు = ప్రవహించెడి; రుధిరమున్ = రక్తము; మడియు = తెగిపడిన; తలలున్ = శిరస్సులు; ఒఱుగు = వాలిపోయిన; తనువులున్ = దేహములు; పొడి = చూర్ణము; అగు = అయిన; తడవులును = భూషణములు; మధురిపు = కృష్ణుని; దెసన్ = వైపున; కలిగెన్ = కలిగినవి.
భావము:- శ్రీకృష్ణుని పక్షంలోని రథములు భగ్నమయ్యాయి; అశ్వాలు తెగిపడిపోయాయి; ఏనుగులు కూలిపోయాయి; భటులు మరణించారు; నెత్తురు ప్రవహించింది; తలలు తెగిపోయాయి; దేహములు వ్రాలిపోయాయి; భూషణములు పొడిపొడి అయి రాలిపోయాయి,

తెభా-10.1-1560-క.
భీతంబై హతసుభట
వ్రాతంబై భగ్న తురగ వారణ రథ సం
ఘాతంబై విజయశ్రీ
వీతంబై యదుబలంబు విఱిగె నరేంద్రా!

టీక:- భీతంబు = బెదిరిపోయినది; ఐ = అయ్యి; హత = చంపబడిన; సు = మంచి; భట = బంట్ల యొక్క; వ్రాతంబు = సమూహము కలది; ఐ = అయ్యి; భగ్న = దెబ్బతిన్న; తురగ = గుఱ్ఱములు; వారణ = ఏనుగులు {వారణము - శత్రు బలమును వారించునది, ఏనుగు}; రథ = తేరులు యొక్క; సంఘాతంబు = సమూహము కలది; ఐ = అయ్యి; విజయ = గెలుపు యొక్క; శ్రీ = కలిమి; వీతంబు = లేనిది; ఐ = అయ్యి; యదు = యాదవుల యొక్క; బలంబు = సైన్యము; విఱిగెన్ = చెదిరిపోయినది; నరేంద్రా = రాజా.
భావము:- ఓ మహారాజా! పరీక్షిత్తు! యాదవసైన్యం భీతిల్లింది; మేటివీరులు మరణించారు; గుఱ్ఱాలు, ఏనుగులు, రథాల సమూహములు భగ్నమయ్యాయి; విజయలక్ష్మి విరహితమై యాదవబలం వెనుకకు తగ్గింది.

తెభా-10.1-1561-శా.
యోధాగ్రేసరుఁ డా హలాయుధుఁడు లోకోత్కృష్ట బాహాబల
శ్రీ ధౌరేయుఁడు కృష్ణుఁ డిట్టి ఘనులం జిత్రంబు; నే డిట్లు సం
రోధించెన్; బలముం దెరల్చె; మగధేంద్రుం డంచు నీక్షించుచున్
సౌధాగ్రంబులఁ బౌరకాంతలు మహాసంతప్తలై రెంతయున్.

టీక:- యోధా = యుద్ధవీరులలో; అగ్రేసరుడు = మొదటివాడు; ఆ = ఆ ప్రసిద్ధుడైన; హలాయుధుడు = బలరాముడు {హలాయుధుడు - నాగలి ఆయుధముగా కలవాడు, బలరాముడు}; లోక = ప్రపంచము నందు; ఉత్కృష్ట = మిక్కిలి మేలైన; బాహాబల = భుజబలము అనెడి; శ్రీ = సంపద యొక్క; ధౌరేయుడు = భారము మోసెడివాడు; కృష్ణుడు = కృష్ణుడు; ఇట్టి = ఇటువంటి; ఘనులన్ = గొప్పవారిని; చిత్రంబు = విచిత్రము; నేడు = ఇవాళ; ఇట్లు = ఈ విధముగ; సంరోధించెన్ = నిరోధించెను; బలమున్ = సేనలను; తెరల్చెన్ = పారిపోవునట్లు చేసెను; మగధేంద్రుండు = జరాసంధుడు; అంచున్ = అనుచూ; ఈక్షించుచున్ = చూచుచు; సౌధ = భవనముల; అగ్రంబులన్ = మీద; పౌర = పురము నందలి; కాంతలు = స్త్రీలు; మహా = అధికమైన; సంతప్తలు = తాపము పొందువారు; ఐరి = అయినారు; ఎంతయున్ = మిక్కుటముగా.
భావము:- “బలరాముడు వీరులలో అగ్రగణ్యుడు; శ్రీకృష్ణుడు లోకోన్నత భుజబలసంపన్నుడు; ఇంతటి మహా మహులను జరాసంధుడు అడ్డగించి వారి సేనలను తరిమికొట్టడం, చాలా వింతగా ఉంది.” అని ఆ పట్టణపు స్త్రీలు మేడల మీద చేరి ఎంతో పరితాపం చెందారు.