పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/కృష్ణుడు విజృంభించుట

వికీసోర్స్ నుండి


తెభా-10.1-1562-వ.
ఇట్లు తన మొనలు విఱిగి పాఱినం గనుంగొని, సమరసంరంభంబున హరి విశ్వంభరాభరణ వేదండ తుండాభంబులగు బాహుదండంబులం బెంచి, విజృంభించి, బ్రహ్మాండకుహరకుంభ పరిస్ఫోటనం బగు పాంచజన్య నినదంబు నిబిడ నిర్ఘాత శబ్దంబులుగ నుదంచిత పింఛదామంబు సంక్రందన చాపంబుగఁ, బ్రశస్త హస్తలాఘవంబున శరాకర్షణ సంధాన మోక్షణంబు లేర్పడక, నిర్వక్ర చక్రాకారాంబుతోడ మార్తాండమండల ప్రభా ప్రచండం బగు శార్ఙ్గ కోదండంబు క్రొమ్మెఱుంగులు మెఱుంగులుగ, దిగ్గజేంద్ర కర్ణభీషణంబులగు గుణఘోషంబులు ఘుమఘుమారావ దుస్సహంబు లయిన గర్జనంబులుగ రథ తురంగమ రింఖా సముద్ధూత పరాగపటల పరంపరా సంపాదిత పుంజీభూతంబగు పెంజీఁకటి యిరులుగ నసమసమరసన్నాహ చాతురీ విశేషంబులకుం జొక్కి నిక్కి కరంబు లెత్తి నర్తనంబులం బ్రవర్తించు నారద హస్త విన్యాసంబులు లీలాతాండవమండిత మహోత్కంఠంబు లగు నీలకంఠంబులుగ సుందర స్యందననేమి నిర్ఘోషభీతులై కుంభి కుంభంబులపై వ్రాలు వీరులు మత్తమయూర కేకారవ చకితులై యువతీ కుచకుంభంబుల మీఁద వ్రాలెడు కాముకులుగ నానా నరేంద్ర రక్తపిపాసా పరవశంబులై వాచఱచుచున్న భూతవ్రాతంబులు వర్షవర్షేతి నిస్వనంబు లొసంగు చాతకంబులుగ నభంగ సంగర ప్రేరకుండగు హలాయుధుండు వృష్టికారణంబగు మందసమీరణంబుగ, ననల్ప కల్పాంతకాల నీలవలాహకంబు భాతిం బరఁగు మేని చాయతోడం దోయజనాభుం డరాతి చతురంగ దేహక్షేత్రంబులం బుంఖానుపుంఖంబులుగ నసంఖ్యాత బహువిధ దివ్యబాణవర్షంబు గురియునెడ శస్త్రాస్త్రపరంపరా సంఘట్టన జనితంబులగు మిడుఁగుఱులు వర్షాకాలవిహిత విద్యోతమాన ఖద్యోతంబులుగ, విశిఖ వికీర్ణ వీర కోటిర ఘట్టిత పద్మరాగశకలంబు లింద్రగోపంబులుగ, మహిత మార్గణ విదళిత మత్తమాతంగ కుంభ మౌక్తికంబులు వడగండ్లుగఁ, జటు లార్ధచంద్రశరచ్ఛిన్న చరణంబులై "కృష్ణ! కృష్ణ! నిలునిలు"మని పలుకుచుం గూలెడి మేనులు కృషీవల కర పరశుధారా విదళిత మూలవిశాల సాలంబులుగ, భాసురభల్లభగ్నంబులైన వదనగహ్వరంబులవలన డుల్లెడు దంతపుంజంబులు మాలతీకుసుమ మంజరులుగ నవ్య నారాచభిన్న దేహంబులయి దిగ్గనఁ గ్రొగ్గండ్లవలన వెడలు రక్త స్యందసందోహంబులతో సంచరింపక ప్రాణంబులు విడుచు శుండాలంబులు సెలయేఱులతోడి కొండలుగఁ గఠోరకాండ ఖండితంబు లైన భుజాదండంబులతోడం గలసిపడిన వజ్రమయ కంఠికాభరణంబులు భోగిభోగసమేత కేతకీ కుసుమంబులుగఁ బ్రళయార్ణవ కల్లోల శబ్దసన్నిభంబులైన భేరీరవంబులు భీకర భేకీనికర రవంబులుగ దారు ణేషు విలూన వాహ వారణ మనుజ మస్త మస్కిష్కంబు రొంపియునై సొంపుమెఱయ నాభీల కీలాల ప్రవాహంబులు ప్రవహించె; నందు భుజంబులు భుజంగంబులుగఁ, గపాలంబులు కమఠంబులుగ, శిరోజంబులు శైవలంబులుగఁ, గరంబులు మీనంబులుగ, హయంబులు నక్రంబులుగ గజంబులు దీవులుగ ధవళఛత్రంబులు నురువులుగఁ, జామరంబులు కలహంసంబులుగ, భూషణరత్నరేణురాసులు పులినంబులుగ నొప్పె; నప్పుడు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; తన = అతని; మొనలు = సేనలు; విఱిగి = చెదిరి; పాఱినన్ = పోగా; కనుంగొని = చూసి; సమర = యుద్ధము నందలి; సంరంభంబునన్ = ఆటోపముచేత; హరి = కృష్ణుడు; విశ్వంభర = భూమిని; భరణ = మోచునట్టి; వేదండ = దిగ్గజముల; తుండా = తొండములును; ఆభంబులు = పోలునట్టివి; అగు = ఐన; బాహు = భుజము లనెడి; దండంబులన్ = కఱ్ఱలను; పెంచి = చాచి; విజృంభించి = చెలరేగి; బ్రహ్మాండ = బ్రహ్మాండము అనెడి; కుహర = గుహల; కుంభ = కుంభమును; పరిస్ఫోటనంబు = బద్దలుచేయునది; అగు = ఐన; పాంచజన్య = పాంచజన్యశంఖము; నినదంబు = ధ్వని; నిబిడ = దట్టమైన; నిర్ఘాత = పిడుగుల; శబ్దంబులు = ధ్వనులు; కన్ = అగునట్లుగాను; ఉదంచిత = బహుచక్కని; పింఛ = నెమలిపింఛముల; దామంబు = దండ; సంక్రందనచాపంబుగ = ఇంద్రధనుస్సుగా {సంక్రందనుడు - శత్రువులను ఆక్రందనము (మొఱలు) పెట్టించు వాడు. దేవేంద్రుడు}; ప్రశస్త = శ్లాఘించదగిన; హస్తలాఘవంబునన్ = మెలకువవలన; శర = బాణమును; ఆకర్షణ = తీయుట; సంధాన = ధనుస్సునకూర్చుట; మోక్షణంబులు = వేయుటలు, వదలుట; ఏర్పడక = తెలియరాక; నిర్వక్ర = తిరుగులేని; చక్ర = గుండ్రని; ఆకారంబునన్ = ఆకారముతో; మార్తాండ = సూర్య; మండల = బింబపు; ప్రభా = ప్రకాశము యొక్క; ప్రచండంబు = తీవ్రత కలది; అగు = ఐన; శార్ఙ్గ = శార్ఙ్గము అనెడి; కోదండంబు = ధనుస్సు యొక్క; క్రొమ్మెఱుంగులు = కొత్తతళుకులు; మెఱుంగులుగన్ = మెరుపులుగా; దిగ్గజ = దిగ్గజ; ఇంద్ర = శ్రేష్ఠములకు; కర్ణ = చెవులకు; భీషణంబులు = విని సహింపరానివి; అగు = ఐన; గుణ = వింటినారి; ఘోషంబులున్ = ధ్వనులు; ఘుమఘుమా = ఘుమఘుమ అనెడి; రావ = శబ్దములచే; దుస్సహంబులు = సహింపరానివి; అయిన = ఐన; గర్జనంబులుగ = ఉరుముల గర్జనలుగా; రథ = రథముల; తురంగమ = గుఱ్ఱముల యొక్క; రింఖా = గిట్టల తాకుడుచే; సముద్ధూత = బాగా రేగిన; పరాగ = దుమ్ము; పటల = తెరల; పరంపరా = సమూహములచే; సంపాదిత = కలుగజేయబడిన; పుంజీభూతంబు = దట్టముగా నేర్పడినవి; అగు = ఐన; పెంజీకటి = గాఢాంధకారము; ఇరులుగన్ = చీకట్లుగా; అసమ = సాటిలేని; సమర = యుద్ధ; సన్నాహ = ప్రయత్నముల; చాతురీ = నేర్పుల; విశేషంబుల్ = ప్రత్యేకతల; కున్ = కు; చొక్కి = పరవశులై; నిక్కి = నిగిడి; కరంబులు = చేతులు; ఎత్తి = ఎత్తి; నర్తనంబులన్ = నాట్యము లందు; ప్రవర్తించు = తిరుగుచున్నట్టి; నారద = నారదుడి; హస్త = చేతులు; విన్యాసంబులు = లయబద్ధముగా త్రిప్పుటలు; లీలా = విలాసపు; తాండవ = నటనలచే; మండిత = చక్కనైన; మహా = మిక్కుటమైన; ఉత్కంఠంబులు = తమకములు కలవి; అగు = ఐన; నీలకంఠంబులుగ = నెమళ్ళుగా; సుందర = అందమైన; స్యందన = రథముల; నేమి = కడకమ్ముల యొక్క; నిర్ఘోష = ధ్వనికి; భీతులు = భయపడినవారు; ఐ = అయ్యి; కుంభి = ఏనుగుల {కుంభి - కుంభస్థలము కలది, ఏనుగు}; కుంభంబుల = కుంభస్థలముల; పైన్ = మీద; వ్రాలు = ఒరగెడి; వీరులు = సైనికులు; మత్త = మదించిన; మయూర = నెమళ్ళ; కేకా = కేకల; రవ = శబ్దములచే; చకితులు = నిశ్చేష్టులు; ఐ = అయ్యి; యువతీ = స్త్రీల యొక్క; కుచ = స్తనములు అనెడి; కుంభంబుల = కలశముల; మీదన్ = పైన; వ్రాలెడు = ఒరగునట్టి; కాముకులుగ = విటులుగా; నానా = పెక్కండ్రు; నరేంద్ర = రాజుల యొక్క; రక్త = రక్తమును; పిపాసా = తాగునిచ్చచేత; పరవశంబులు = చొక్కివి; ఐ = అయ్యి; వాచఱచుచున్న = శోకరాగాలు పెడుతున్న; భూత = భూతముల; వ్రాతంబులున్ = సమూహములు; వర్షవర్ష = వానవాన; ఇతి = అని; నిస్వనంబులు = కేకలు; ఒసంగు = పెట్టెడి; చాతకంబులుగ = చాతకపక్షులుగా, వానకోయిలలుగా; అభంగ = చెడని; సంగర = యుద్ధమును; ప్రేరకుండు = ప్రేరేపించువాడు; అగు = ఐన; హలాయుధుండు = బలరాముడు; వృష్టి = వానకు; కారణంబు = హేతువు; అగు = ఐన; మంద = మెల్లని; సమీరణంబుగన్ = గాలిగా; అనల్ప = గొప్ప; కల్పాంతకాల = ప్రణయ సమయపు; నీల = నల్లని; వలాహకంబు = మేఘముల; భాతిన్ = వలె; పరగు = ప్రసిద్ధమగు; మేని = దేహపు; చాయ = వర్ణము, రంగు; తోడన్ = తోటి; తోయజనాభుండు = కృష్ణుడు {తోయజనాభుడు - పద్మనాభుడు, విష్ణువు}; అరాతి = శత్రువుల యొక్క; చతురంగ = చతురంగసేనలోని; దేహ = భాగములు అనెడి; క్షేత్రంబులన్ = మూర్తులపై; పుంకానుపుంఖంబులుగన్ = పింజనంటి పింజలు నాటునట్లుగా; అసంఖ్యాత = లెక్కలేనన్ని; బహు = అనేక; విధ = విధములైన; దివ్య = మహిమాన్వితము లైన; బాణ = బాణముల; వర్షంబున్ = వానను; కురియు = వర్షించెడి; ఎడన్ = సమయము నందు; శస్త్రా = కత్తి మొదలైన ఆయుధములు; అస్త్ర = బ్రహ్మాస్త్రాది ఆయుధముల; పరంపరా = జల్లుచేత; సంఘట్టన = గట్టిగా తగులుటచేత; జనితంబులు = పుట్టినవి; అగు = ఐన; మిడుగుఱులు = నిప్పురవ్వలు; వర్షాకాల = వానాకాలమున; విహిత = తప్పక వచ్చెడివి అగు; విద్యోతమాన = మెరుస్తున్నవి అగు; ఖద్యోతంబులుగ = మిణుగురు పురుగులుగా; విశిఖ = బాణములచే; వికీర్ణ = చెదరగొట్టబడిన; వీర = వీరుల యొక్క; కోటీర = కిరీటములచే; ఘట్టిత = కూర్చబడిన; పద్మరాగ = కెంపుల; శకలంబులు = ముక్కలు; ఇంద్రగోపంబులుగన్ = పుట్టగొడుగులుగా; మహిత = మహిమాన్వితమైన; మార్గణ = బాణములచే; విదళిత = కొట్టబడిన; మత్త = మదించిన; మాతంగ = ఏనుగుల {మాతంగము - మతంగుడు అను ఋషివలన పుట్టినది, ఏనుగు}; కుంభ = కుంభస్థలము నందలి; మౌక్తికంబులు = ముత్యాలు; వడగండ్లుగన్ = వడగళ్ళుగా; చటుల = భీకరమైన; అర్ధచంద్రశర = అర్ధచంద్రబాణములచే; ఛిన్న = విఱిగిపోయిన; చరణంబులు = కాళ్ళు గలవి; ఐ = అయ్యి; కృష్ణకృష్ణ = కృష్ణకృష్ణ; నిలునిలు = ఇక ఆగుము; అని = అని; పలుకుచున్ = అనుచు; కూలెడి = పడునట్టి; మేనులున్ = దేహములు; కృషీవల = రైతు {కృషీవలుడు - వ్యవసాయము చేయువాడు, రైతు}; కర = చేతిలోని; పరశు = గొడ్డలి; ధారా = పదునుచేత; విదళిత = నరకబడిన; మూల = మోదళ్ళు; విశాల = లావుగా కలిగిన; సాలంబులుగ = చెట్లుగా; భాసుర = ప్రకాశవంతములైన; భల్ల = బాణములచే; భగ్నంబులు = పగులగొట్టబడినవి; ఐన = అగు; వదనగహ్వరంబుల = నోళ్ళ; వలన = నుండి; డుల్లెడి = రాలెడి; దంత = దంతముల, పండ్ల; పుంజంబులున్ = సమూహములు; మాలతీ = జాజి; కుసుమ = పూల; మంజరులుగన్ = గుత్తులుగా; నవ్య = కొత్త; నారాచ = బాణములచే; భిన్న = పగిలిన; దేహంబులు = శరీరములు కలవి; అయి = ఐ; దిగ్గనన్ = తటాలున; క్రొగ్గండ్ల = కొత్తగాయముల; వలన = నుండి; వెడలు = స్రవించు; రక్త = నెత్తుటి; స్యంద = ప్రవాహముల; సందోహంబుల్ = సమూహముల; తోన్ = తోటి; సంచరింపక = కదలకుండా; ప్రాణంబులున్ = ప్రాణములను; విడుచు = వదలివేసెడి; శుండాలంబులు = ఏనుగులు; సెలయేఱుల = కొండ యేరుల; తోడి = తోటి; కొండలుగన్ = కొండలుగా; కఠోర = కఠినములైన; కాండ = బాణములచే; ఖండితంబులు = తెగిపోయినవి; ఐన = అగు; భుజా = చేతులు అను; దండంబుల్ = కఱ్ఱల; తోడన్ = తోటి; కలసి = కూడి; పడిన = పడిపోయిన; వజ్ర = రత్నములు; మయ = పొదిగిన; కంఠికా = కంటెలు అనెడి; ఆభరణంబులు = భూషణములు; భోగి = సర్పముల; భోగ = దేహములుతో; సమేత = కూడిన; కేతకీ = మొగలి; కుసుమంబులుగన్ = పూలుగా; ప్రళయ = ప్రళయకాల; ఆర్ణవ = సముద్రమునమందలి; కల్లోల = పెద్ద అలల యొక్క; శబ్ద = ధ్వనులతో; సన్నిభంబులు = సమానములు; ఐన = అయిన; భేరీ = దుందుభుల; రవంబులు = ధ్వనులు; భీకర = భయంకరమైన; భేకీ = ఆడుకప్పల; నికర = సమూహముల; రవంబులుగన్ = అరుపులుగా; దారుణ = క్రూరములైన; ఇషు = బాణములచేత; విలూన = నరకబడిన; వాహ = గుఱ్ఱముల; వారణ = ఏనుగుల; మనుజ = మానవుల; మస్త = తలల యందలి; మస్కిష్కంబు = మెదళ్ళ; రొంపియున్ = బురద; ఐ = అయ్యి; సొంపు = చక్కదనము; మెఱయన్ = అతిశయించగా; ఆభీల = భయంకరమైన; కీలాల = నెత్తుటి; ప్రవాహంబులు = వెల్లువలు; ప్రవహించెన్ = పారినవి; అందు = వానిలో; భుజంబులు = చేతులు; భుజంగంబులుగన్ = పాములుగా; కపాలంబులు = పుఱ్ఱెలు; కమఠంబులుగన్ = తాబేళ్ళుగా; శిరోజంబులున్ = తలవెంట్రుకలు; శైవలంబులుగన్ = నాచుతీగలుగా; కరంబులున్ = అరచేతులు; మీనంబులుగన్ = చేపలుగా; హయంబులు = గుఱ్ఱములు; నక్రంబులుగన్ = మొసళ్ళుగా; గజంబులున్ = ఏనుగులు; దీవులు = నడిమిదిబ్బలుగా; ధవళ = తెల్లని; ఛత్రంబులు = గొడుగులు; నురువులుగన్ = నురగలుగా; చామరంబులు = వింజామరలు; కలహంసలుగన్ = రాజహంసలుగా; భూషణ = ఆభరణములలోని; రత్న = మణుల; రేణు = పొడుల యొక్క; రాసులు = సమూహములు; పులినంబులుగన్ = ఇసుకతిన్నెలుగా; ఒప్పెన్ = చక్కదనముపొందినవి; అప్పుడు = అప్పుడు.
భావము:- తన సేనలు ఓడిపోయి పారిపోవడం చూసిన శ్రీహరి సమరాటోపంతో భూభారం వహించే దిగ్గజాల తొండాలతో సమానము లైన తన బాహుదండాలు సారించి విజృంభించాడు. బ్రహ్మాండభాండం బద్దలయ్యేలా పాంచజన్య శంఖం పూరించాడు. ఆ శంఖధ్వని పెళపెళ మనే పిడుగుల మ్రోత వలె వినబడింది; అతను ధరించిన నెమలిపింఛం ఇంద్రధనస్సు వలె కనబడింది; మెచ్చదగిన హస్తలాఘవం చేత బాణములు అల్లెత్రాటి యందు సంధించడం, లాగడం విడవడం తెలియరాకుండా ఉంది. మండలాకారంతో సూర్యమండల ప్రభవలె తేరిచూడరానిదై అతని శార్జ్గమనే ధనుస్సు క్రొత్తమెరుపు వలె తేజరిల్లింది; దిగ్గజాల చెవులకు వెరపు కలిగించే అతని ధనుష్టంకారాలు ఘుమఘమ ధ్వనులతో సహింపరానివై ఉరుముల చప్పుళ్ళుగా ఒప్పాయి; రథానికి కట్టిన గుఱ్ఱాల గిట్టల తాకిడికి లేచిన ధూళి మూలాన ఏర్పడ్డ చీకటి అంధకారమై తోచింది; అతని సాటిలేని యుద్ధసన్నాహా నైపుణ్యానికి పరవశించి నిక్కి చేతులెత్తి నాట్యం చేస్తున్న నారదమహర్షి హస్తవిన్యాసాలే, మిక్కిలి సంబరంతో తాండవనృత్యం సలిపే నెమళ్ళుగా నెగడాయి; అందమైన ఆయన రథచక్రాల రవళికి జంకి ఏనుగుల కుంభస్థలాలపై ఒరుగుతున్న వీరులు, మదించిన నెమళ్ళ క్రేంకారాలకు ఉలికిపడి తరుణుల కుండల వంటి కుచాల మీద వ్రాలే కాముకులుగా దీపించారు; నానా దేశాల రాజుల నెత్తురు ద్రావు కోరికతో పరవశములై పెనుబొబ్బలు పెట్టు పిశాచబృందాలు, “వర్షం వర్షం” అని పలవరించే చాతకాలుగా ద్యోతకము అయ్యాయి; అమోఘ యుద్ధప్రేరకు డయిన బలరాముడు వర్షానికి కారణమైన మందమారుతము అయ్యాడు; ఘోర విలయ సమయం లోని కారుమబ్బు వలె ప్రకాశించే శరీరచ్ఛాయ కల కమలనాభుడు శత్రువులకు సంబంధించిన రథ, గజాశ్వ పదాతుల దేహాలనే భూము లందు పుంఖానుపుంఖంగా లెక్కింపరాని పలురకాలైన దివ్యబాణములు అనే వర్షం కురిపించాడు; అలా అతడు శరవర్షం కురిపించే టప్పుడు శస్త్రాస్త్రముల రాపిడికి పుట్టిన నిప్పురవ్వలు వానకాలంలోని మిణుగురు పురుగులుగా నెగడినాయి; బాణాలచే చెదరిన వీరుల కిరీటములందు తాపబడిన పద్మరాగమణి ఖండాలు ఆరుద్ర పురుగుల మాదిరి ఉన్నాయి; గొప్ప తూపులచే చీల్చబడిన మదగజ కుంభాలలోని ముత్యాలు వడగండ్లుగా ఉన్నాయి; తీవ్రములైన అర్ధచంద్రబాణాలచే కాళ్ళు ఖండింపబడగా “కృష్ణా! కృష్ణా! నిలు నిలు” మని పలుకుతూ నేలపై కూలుతున్న శరీరాలు సేద్యగాండ్ర చేతులలోని గండ్రగొడ్డళ్ళచే నరకబడి కూలుతున్న పెనువృక్షాలుగా ఉన్నాయి; వాడి బల్లెములచే భగ్నములైన గుహలవంటి నోళ్ళ నుంచి రాలుతున్న దంతముల సమూహం మొల్లపూల గుత్తులుగా ఉన్నాయి; నిశిత బాణాలు నాటిన శరీరాలుకలవై క్రొత్తగాయాలనుండి పిలపిల నెత్తురు ప్రవహింపగా తిరగలేక ప్రాణాలు విడిచే ఏనుగులు సెలయేళ్ళతో కూడిన కొండలుగా ఉన్నాయి; కర్కశము లైన శరములచే ఖండింపబడిన బాహుదండాలతో కలసి నేలపై పడిన వజ్రమయ కంఠాభరణాలు పాముపడగలతో కూడిన మొగలిపూలయ్యాయి; ప్రళయకాల మందలి సముద్రతరంగ ఘోషకు సాటివచ్చే భేరి స్వనాలు దారుణ మైన కప్పల బెకబెక ధ్వనులు అయ్యాయి; భీషణము లయిన బాణములచే కోయబడిన గుఱ్ఱముల ఏనుగుల మనుష్యుల మెదడులు రొంపులు అయి సొబగు మీరాయి; భయంకరమైన నెత్తురు వెల్లువలు ప్రవహించాయి; ఆ ప్రవాహంలో బాహువులు పాములుగా, తలపుఱ్ఱెలు తాబేళ్ళుగా, తలవెంట్రుకలు నాచుగా, చేతులు చేపలుగా, గుఱ్ఱాలు మొసళ్ళుగా, ఏనుగులు దీవులుగా, తెల్లగొడుగులు నురుగులుగా, వింజామరలు రాయంచలుగా, చితికిపోయిన ఆభరణాలలోని రత్నాల పొడులు ఇసుకతిన్నెలుగా అతిశయించాయి.