పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/గోపికలకు నీతులు చెప్పుట

వికీసోర్స్ నుండి

తెభా-10.1-975-వ.
అటు గావునఁ బరమపురుషుండును, నజుండును, యోగీశ్వరేశ్వరుండును నైన హరిని సోకిఁన స్థావరం బైన ముక్తం బగు; వెఱఁగుపడ వలవ, ది వ్విధంబున.
టీక:- అటు = ఆ విధముగ; కావునన్ = అగుటచేత; పరమపురుషుండును = శ్రీకృష్ణుని {పరమ పురుషుండు - పరమ (ఉత్కృష్టమైన) పురుషుడు (కారణభూతుడు), విష్ణువు}; అజుండును = శ్రీకృష్ణుని {అజుడు - జన్మములేనివాడు, విష్ణువు}; యోగీశ్వరేశ్వరుండును = శ్రీకృష్ణుని {యోగీశ్వ రేశ్వరుడు - యోగులలో శ్రేష్ఠులను పాలించువాడు, విష్ణువు}; ఐన = అయినట్టి; హరిని = శ్రీకృష్ణుని; సోకిన = తాకునట్టి; స్థావరంబు = వృక్షాది, అచలభూతము; ఐనన్ = అయినను; ముక్తంబు = ముక్తిని పొందినది; అగున్ = అగును; వెఱగుపడ = ఆశ్చర్యపడుట; వలవదు = అక్కరలేదు; ఈ = ఈ; విధంబున = విధముగా.
భావము:- కాబట్టి పురుషోత్తముడూ, పుట్టుకలేనివాడూ, యోగీశ్వరుడూ అయిన నారాయుణుడిని స్పృశించినంత మాత్రాన కొండలూ చెట్లూ మున్నగు స్థావరాలు కూడా ముక్తిని పొందగలవు ఈ విషయంలో ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.

తెభా-10.1-976-క.
మధుర గీత నినదము
విని వచ్చిన గోపికలను వీక్షించి నయం
బు మేటి సుగుణి నేర్పరి
వాగ్వైభవము మెఱయఁ గ నిట్లనియెన్.

టీక:- ఘన = మిక్కిలి; మధుర = ఇంపైన; గీత = పాట యొక్క; నినదము = ధ్వని; విని = విని; వచ్చిన = వచ్చినట్టి; గోపికలను = గొల్లస్త్రీలను; వీక్షించి = చూసి; నయంబునన్ = మంచిమాటలతో; మేటి = మిక్కిలి సమర్థుడు; సుగుణి = సుగుణములు కలవాడు; నేర్పరి = చతురుడు; తన = అతని యొక్క; వాక్ = మాటల; వైభవము = అతిశయము; మెఱయన్ = ప్రకాశించునట్లు; తగన్ = చక్కగా; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అధికుడూ, కల్యాణగుణాలు కలవాడూ, చతురుడూ అయిన కృష్ణుడు తన తీయని పాటరవళిని విని వచ్చిన గొల్లమహిళలతో మృదువుగా మాటల నేర్పు తేటపడేలా ఇలా అన్నాడు.

తెభా-10.1-977-శా.
"మేలా మీకు? భయంబు పుట్టదుగదా మీ మందకున్? సింహశా
ర్దూలానేకప ముఖ్యముల్ దిరిగెడిన్ దూరంబు లేతెంతురే?
యేలా వచ్చితి? రీ నిశా సమయమం దిచ్చోట వర్తింతురే?
చాలుంజాలు లతాంగులార! చనుఁడీ సంప్రీతితో మందకున్.

టీక:- మేలా = క్షేమమేనా; మీ = మీ; కున్ = కు; భయంబు = ఎలాంటి భయము; పుట్టదు = కలుగదు; కదా = కదా; మీ = మీ యొక్క; మంద = పల్లె; కున్ = కు; సింహ = సింహములు; శార్దూల = పెద్దపులులు; అనేకప = ఏనుగులు; ముఖ్యముల్ = మున్నగునవి; తిరిగెడిన్ = తిరుగుతుంటాయి; దూరంబులు = ఇంతేసి దూరములు; ఏతెంతురే = వస్తారా, రారు; ఏలా = ఎందుకు; వచ్చితిరి = వచ్చారు; ఈ = ఈ యొక్క; నిశా = రాత్రి; సమయము = వేళ; అందు = లో; ఈ = ఈ; చోటన్ = ప్రదేశము నందు; వర్తింతురే = సంచరించెదరా; చాలుంజాలు = ఇకచాలు; లతాంగులారా = అందగత్తెలు {లతాంగులు - లతల వంటి దేహములు కలవారు, స్త్రీలు}; చనుడీ = వెళ్ళిపోండి; సంప్రీతి = సంతోషము; తోన్ = తోటి; మంద = వ్రేపల్లె; కున్ = కు.
భావము:- “ఓ గోపికలారా! మీ అందరికీ శుభమే కదా. మీ గోకులానికి ఎటువంటి భయమూ లేదు కదా. సింహాలూ పెద్దపులులు ఏనుగులు మొదలైన క్రూర జంతువులు సంచరించే ఈ సమయంలో మీరింత దూరం రావచ్చునా? ఇలా రాత్రివేళ ఎందుకు వచ్చారు? ఇంత రాత్రివేళ ఈ ప్రదేశంలో తిరగవచ్చునా? చాల్చాలు లెండి. ఇక మీ గొల్లపల్లెకు తిరిగి వెళ్ళిపొండి.

తెభా-10.1-978-శా.
మీరేతెంచిన జాడఁ గానక వగన్ మీ తల్లులుం దండ్రులున్
మీ రాముల్ మఱదుల్ తనూజులు గురుల్ మీసోదరుల్ బంధువుల్
"మేరల్ మీఱిరి లేరు పోయి"రనుచున్ మీ ఘోష భూభాగమం
దేరీతిం బరికించిరో తగవులే యీ సాహసోద్యోగముల్?

టీక:- మీరు = మీరు; ఏతెంచిన = వచ్చినట్టి; జాడన్ = వివరము; కానక = తెలియక; వగన్ = విచారముతో; మీ = మీ యొక్క; తల్లులు = తల్లులు; తండ్రులున్ = తండ్రులు; మీ = మీ యొక్క; రాముల్ = మగవారు; మఱదుల్ = మరుదులు; తనూజులు = సంతానము; గురుల్ = పెద్దలు; మీ = మీ యొక్క; సోదరుల్ = తోడబుట్టినవారు; బంధువుల్ = చుట్టములు; మేరల్ = హద్దులు, క్రమములు; మీఱిరి = దాటిరి, తప్పి చరించిరి; లేరు = ఇక్కడలేరు; పోయిరి = వెళ్ళిపోయారు; అనుచున్ = అనుచు; మీ = మీ యొక్క; ఘోష = గొల్లపల్లె; భూభాగము = ప్రదేశము; అందున్ = లో; ఏ = ఏ; రీతిన్ = విధముగా; పరికించిరో = వెతికిరో; తగవులే = తగిన పనులే ఇవి, కావు; ఈ = ఈ యొక్క; సాహస = తెగువ చూపెడి; ఉద్యోగముల్ = ప్రయత్నములు.
భావము:- ఇలా వచ్చిన మీ జాడ తెలియక విచారంతో మీ తండ్రులు, తల్లులూ, మగలు, మరుదులు, కొడుకులూ, కులపెద్దలు, తోబుట్టువులు మీరు హద్దుదాటారని వ్రేపల్లెలో ఎక్కడెక్కడ వెదుకుతున్నారో ఏమో. ఇంతటి తెగువతో కూడిన పనులు మీకు తగవు.

తెభా-10.1-979-చ.
లువడి సున్నఁజేసి, హృదయేశుల సిగ్గులు పుచ్చి, యత్తమా
నెరియించి, సోదరులమానము సూఱలు పుచ్చి, తల్లిదం
డ్రు రుచిమాన్చి, బంధులకు రోఁత యొనర్చుచు జారవాంఛలన్
నఱి సత్కులాంగనలు త్తురె? లోకులు సూచి మెత్తురే?

టీక:- ఇలువడి = మంచినడత; సున్నజేసి = పోగొట్టుకొని; హృదయేశులన్ = భర్తలను; సిగ్గులు = లజ్జిలు; పుచ్చి = చితికిపోవు నట్లు చేసి; అత్త = భర్తతల్లిని; మామలన్ = భర్తతండ్రిని; ఎరియించి = తపింపజేసి; సోదరుల = తోడబుట్టువుల; మానమున్ = గౌరవమును; చూఱలుపుచ్చి = కొల్లగొట్టి; తల్లిదండ్రుల = తల్లిదండ్రుల యొక్క; రుచిన్ = కాంతి; మాన్చి = పోగొట్టి; బంధుల్ = చుట్టముల; కున్ = కు; రోత = అసహ్యము; ఒనర్చుచుచు = కలుగజేయుచు; జార = విటుని యందలి; వాంఛలన్ = కోరికలతో; వలనఱి = విధముతప్పి; సత్కుల = మంచి వంశపు; అంగనలు = స్త్రీలు; వత్తురె = ఇలావత్తురా, రారు; లోకులు = ప్రజలు; చూచి = చూసి; మెత్తురే = మెచ్చుకొంటారా,మెచ్చరు.
భావము:- ఇంటిమర్యాద బుగ్గిలో కలిపి; భర్తలను సిగ్గుల పాలు చేసి; మామలకు పరితాపం కలిగించి; తోబుట్టువుల పరువుదీసి; తలితండ్రుల ఆశలు అడియాసలు చేసి; చుట్టాలకు రోత పుట్టిస్తూ; మంచికులంలో పుట్టినవారు పర పురుషుల మీది కోరికతో రాదగునా? చూసిన లోకులు మెచ్చుకుంటారా?

తెభా-10.1-980-సీ.
ప్రాణేశుఁ డెఱిఁగినఁ బ్రాణంబునకుఁ దెగు-
దండించు నెఱిఁగిన రణివిభుఁడు
మామ యెఱింగిన నువెల్లఁ జెడిపోవుఁ-
లవరి యెఱిఁగినఁ గులు సేయు
లిదండ్రు లెఱిఁగినఁ లలెత్తకుండుదు-
రేరా లెఱింగిన నెత్తిపొడుచు
నాత్మజు లెఱిఁగిన నాదరింపరు చూచి-
బంధువు లెఱిఁగిన హి యొనర్తు

తెభా-10.1-980.1-ఆ.
రితరు లెఱిఁగిరేని నెంతయుఁ జుల్కఁగాఁ
జూతు; రిందు నందు సుఖము లేదు;
శము లేదు నిర్భయానందమును లేదు
జారుఁ జేరఁ జనదు చారుముఖకి.

టీక:- ప్రాణేశుడు = మొగుడు; ఎఱిగినన్ = తెలిసికొన్నచో; ప్రాణంబున = ప్రాణముతీసినంతపని; కున్ = కి; తెగున్ = తెగబడును; దండించున్ = శిక్షించును; ఎఱిగినన్ = తెలిసినచో; ధరణివిభుడు = రాజు; మామ = మావగారు (భర్త తండ్రి); ఎఱింగినన్ = తెలిసినచో; మనువు = జీవితము; ఎల్లన్ = అంతా; చెడిపోవు = పాడగును; తలవరి = గస్తీ తిరుగు రాజభటుడు; ఎఱిగినన్ = తెలిసినచో; తగులు = న్యాయాధికారివద్ద తగవు; చేయు = చేయును; తల్లిదండ్రులు = తల్లిదండ్రులు; ఎఱిగినన్ = తెలిసినచో; తలయెత్తకుండుదురు = తలవొంపులు చెందెదరు; ఏరాలు = తోడికోడలు; ఎఱింగినన్ = తెలిసినచో; ఎత్తిపొడుచు = దెప్పిపొడుచును; ఆత్మజులు = కడుపున పుట్టినవారు; ఎఱింగినన్ = తెలిసినచో; ఆదరింపరు = గౌరవించరు; చూచి = కనుగొని; బంధువులు = చుట్టములు; ఎఱిగినన్ = తెలిసినచో; బహిన్ = వెలి, కులబహిష్కరణ; ఒనర్తురు = చేసెదరు; ఇతరులు = పైవాళ్ళు; ఎఱిగిరేని = తెలిసినచో; ఎంతయో = మిక్కిలి; చుల్కనగా = అలక్ష్యముచేసి; చూతురు = తలతురు; ఇందునందు = ఇహపరలము లందు.
సుఖము = సుఖము; లేదు = లేదు; యశము = కీర్తి; లేదు = లేదు; నిర్భయానందమును = భయరహితానందము; లేదు = లేదు; జారున్ = విటును; చేరన్ = దగ్గరకుపోవుట; చనదు = తగినపనికాదు; చారుముఖి = స్త్రీకి {చారుముఖి - చారు (చక్కనైన) ముఖి (ముఖము, గుర్తింపు) కలామె, స్త్రీ}; కిన్ = కి.
భావము:- మంచి ఇల్లాళ్ళకు జారుడితో పొత్తు వాంఛనీయం కాదు. ప్రాణేశ్వరుడికి తెలిస్తే ప్రాణం మీదికి వస్తుంది; రాజుకి తెలిస్తే శిక్షిస్తాడు; మామకు తెలిస్తే మనువు మట్టిగొట్టుకు పోతుంది; తలారికి తెలిస్తే తంటా వస్తుంది; తల్లిదండ్రులకు తెలిస్తే పదిమందిలో తలఎత్తుకోలేరు; తోటికోడలుకి తెలిస్తే ఎత్తిపొడుస్తుంది; కొడుకులకు తెలిస్తే గౌరవించడం తగ్గిస్తారు; చుట్టాలకు తెలిస్తే వెలివేస్తారు; ఇతరులకు తెలిస్తే ఎంతో చులకనగా చూస్తారు; జారిణికి ఇహంలో గానీ పరంలో గానీ సుఖం ఉండదు; కీర్తి ఉండదు; భయం లేని నిండు సంతోషం ఉండదు.

తెభా-10.1-981-క.
వడి కొఱ గాకున్నను
డుగైనఁ గురూపియైనఁ బామరుఁ డైనన్
డుడైన రోగియైనను
విడుచుట మర్యాద గాదు విభు నంగనకున్.

టీక:- నడవడి = ప్రవర్తన; కొఱగాక = పనికిరానిదిగా; ఉన్నను = ఉన్నప్పటికి; బడుగు = పేదవాడు; ఐనన్ = అయినను; కురూపి = అందము లేనివాడు; ఐనన్ = అయినను; పామరుడు = పాండిత్యము లేనివాడు; ఐనన్ = అయినను; జడుడు = చొరవ లేనివాడు; ఐనన్ = అయినను; రోగి = వ్యాధిగ్రస్థుడు; ఐనను = అయినను; విడుచుట = వదలి వేయుట; మర్యాద = తగినపని; కాదు = కాదు; విభున్ = భర్తను; అంగన = స్త్రీ; కున్ = కి.
భావము:- భర్త దుశ్శీలుడైనా; అశక్తుడైనా; రూపహీనుడైనా; అజ్ఞుడైనా; మందుడైనా; రోగియైనా పరిత్యజించడం కులస్త్రీకి మర్యాద కాదు.

తెభా-10.1-982-చ.
ది యమునానదీజల సమేధిత పాదప పల్లవ ప్రసూ
ళవిరాజితం బగు వనంబు; మనంబుల మేర దప్పెనో?
పొదిఁగిట నేడ్చు బిడ్డలకుఁ బోయుఁడు పాలు; విడుండు లేఁగలన్
మొవులకున్; నిజేశ్వరుల ముద్దియలార! భజింపుఁ డొప్పుగన్.

టీక:- ఇది = ఇది; యమునానదీ = యమునానది యొక్క; జల = నీటివలన; సమేధిత = చక్కగా పెరిగిన; పాదప = చెట్లు; పల్లవ = చిగుళ్ళు; ప్రసూన = పూలతో; దళ = ఆకులతో; విరాజితంబు = విలసిల్లెడిది; అగు = ఐన; వనంబు = అడవి; మనంబులన్ = చిత్తము లందు; మేరదప్పెనో = వైకల్యము కలిగెనా ఏమి; పొదిగిటన్ = చంకలో; ఏడ్చు = రోదిస్తున్న; బిడ్డలు = పిల్లల; కున్ = కు; పోయుడు = పట్టండి; పాలున్ = పాలను; విడుండు = వదలండి; లేగలన్ = దూడలను; మొదవులకున్ = పాడియావులకు; నిజ = మీ; ఈశ్వరులన్ = భర్తలను; ముద్దిలయలార = ఓ ముగ్ధలు; భజింపుడు = సేవించండి; ఒప్పుగన్ = చక్కగా.
భావము:- ఓ ముగ్ధలారా! ఇది కాళిందీ నదీజలాలతో చిగురించిన చిగుళ్ళతో, పూలతో, ఆకులతో పెరిగిన చెట్లు గల బృందావనం. మీ మనసులు హద్దులను మీరాయి. ఇక మందకు వెళ్ళిపొండి. ఏడుస్తున్న పిల్లలకు పాలివ్వండి; ఆవులకు దూడలను వదలండి; చక్కగా ప్రాణవల్లభులకు సపర్యలు చేయండి.

తెభా-10.1-983-చ.
నితలు! నన్నుఁ గోరి యిట చ్చితి, రింతఁ గొఱంత లేదు మే
లొరె; సమస్త జంతువులు నోలిఁ బ్రియంబులుగావె? నాకు నై
ను నిలువంగఁ బోలదు, సనాతన ధర్మము లాఁడువారికిం
బెనిమిటులన్ భజించుటలు పెద్దలు చెప్పుచు నుందు రెల్లెడన్.

టీక:- వనితలు = ఓ ఇంతులు; నన్నున్ = నన్ను; కోరి = కలియగోరి; ఇటన్ = ఇక్కడకు; వచ్చితిరి = వచ్చినారు; ఇంతన్ = ఇంతవరకు; కొఱంత = అకార్యము, తక్కువైనది; లేదు = కాదు; మేలు = మంచి; ఒనరెన్ = జరిగినది; సమస్త = ఎల్ల; జంతువులున్ = జీవులు; ఓలిన్ = తప్పక; ప్రియంబులు = ఇష్టమైనవి; కావె = కావా, అగును; నా = నా; కున్ = కు; ఐనను = అయినప్పటికిని; నిలువంగన్ = ఇక్కడ ఉండిపోవుట; పోలదు = తగదు; సనాతన = పూర్వ; ధర్మములున్ = సంప్రదాయములు; ఆడువారికిన్ = స్త్రీలకు; పెనిమిటులన్ = భర్తలను; భజించుటలు = సేవించుట; పెద్దలు = పెద్దలు; చెప్పుచునుందురు = చెప్తుంటారు; ఎల్లెడలన్ = ఎల్లప్పుడు.
భావము:- ఓ మగువలారా! నన్ను కోరి మీరిక్కడికి వచ్చారు దీంట్లో ఏమాత్రం కొరత లేదు. ఇది సరైన పనే. సకల ప్రాణులూ నాకు ప్రియమైనవే. కానీ, మీరిచట ఉండిపోకూడదు. పడతులకు పతి పరిచర్యయే ధర్మం ఎక్కడైనా పెద్దలు ఇలాగే చెప్తారు.

తెభా-10.1-984-క.
ధ్యానాకర్ణన దర్శన
గానంబుల నా తలంపు లిగినఁ జాలుం
బూనెదరు కృతార్థత్వము
మావతుల్! చనుఁడు మరలి మందిరములకున్."

టీక:- ధ్యాన = నన్ను ధ్యానించుటచే; ఆకర్ణన = నా కథలు వినుటచే; దర్శన = నన్ను చూచుటచే; గానంబులన్ = నా గుణములు పాడుటచే; నా = నా యొక్క; తలంపు = భావన; కలిగినన్ = కలిగి ఉన్నచో; చాలున్ = సరిపోవును; పూనెదరు = పొందెదరు; కృతార్థత్వమున్ = ధన్యతను; మానవతుల్ = ఇంతులు {మానవతులు - మానము (శీలము) కల స్త్రీలు}; చనుడు = వెళ్ళండి; మరలి = వెనుదిరిగి; మందిరముల్ = ఇళ్ళకు; కున్ = కు.
భావము:- ఓ మానినులారా! నన్ను గూర్చి చింతించుట; నన్ను గూర్చి వినుట; నన్ను చూచుట; నాపైని పాటలు పాడుట; ఇలా నాయెడ మనసు పెడితే చాలు. మీరు ధన్యురాండ్రు అవుతారు. ఇక మీరు మీమీ గృహాలకు తిరిగి వెళ్ళిపోండి.”