పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/గోపికల దీనాలాపములు

వికీసోర్స్ నుండి

తెభా-10.1-985-వ.
అనిన విని.
టీక:- అనిన = అని చెప్పగా; విని = విని.
భావము:- అని శ్రీకృష్ణుడు చెప్పగా వినిన . . .

తెభా-10.1-986-సీ.
విరహాగ్ని శిఖలతో వెడలు నిట్టూర్పుల-
ముమ్మరంబులఁ గంది మోము లెండఁ
న్నుల వెడలెడి జ్జలధారలు-
కుచకుంకుమంబులు గ్రుచ్చిపాఱఁ
జెక్కులఁ జేర్చిన చేతుల వేఁడిమి-
మోముఁదమ్ముల మేలి మురువు డిందఁ
బొరిఁ బొరిఁ బుంఖానుపుంఖంబులై తాఁకు-
దను కోలల ధైర్యహిమ లెడల

తెభా-10.1-986.1-తే.
దుఃఖభరమున మాటలు దొట్రుపడఁగఁ
బ్రియము లాడని ప్రియుఁ జూచి బెగ్గడిల్లి
రణముల నేల వ్రాయుచు సంభ్రమమునఁ
గాంత లెల్లను వగల నాక్రాంత లగుచు.

టీక:- విరహ = ఎడబాటు అనెడి; అగ్ని = అగ్ని; శిఖల = మంటల; తోన్ = తో; వెడలు = వెలివడు; నిట్టూర్పులన్ = నిట్టూర్పులు; ముమ్మరంబులన్ = అతిశయములవలన; కంది = ఎఱ్ఱగా కందిపోయి; మోములు = ముఖములు; ఎండన్ = ఎండిపోగా; కన్నులన్ = కళ్ళమ్మట; వెడలెడి = కారెడి; కజ్జల = కాటుక కలిసిన కన్నీటి; ధారలు = ధారలు; కచ = స్తనములందలి; కుంకుమంబులు = కుంకుమపూతలు; క్రుచ్చిపాఱన్ = నాటుకోగా; చెక్కులన్ = చెక్కిళ్ళను; చేర్చిన = తాకుతు పెట్టుకొన్న; చేతుల = చేతుల యొక్క; వేడిమిన్ = వేడివలన; మోమున్ = ముఖములు అనెడి; తమ్ముల = పద్మముల; మేలి = మేలైనట్టి; మురువు = వికసము; డిందన్ = అణగిపోగా; పొరిబొరిన్ = పరంపరలుగా; పుంఖానుపుంఖంబులు = అనేకములు; ఐ = అయ్యి; తాకు = తగిలెడి; మదను = మన్మథుని; కోలలన్ = బాణముల వలన; ధైర్య = నిబ్బరముల; మహిమలు = గొప్పదనములు; ఎడలన్ = తొలగిపోగా.
దుఃఖ = దుఃఖము యొక్క; భరమునన్ = అతిశయములచేత; మాటలున్ = మాటలు; తొట్రుపడగన్ = తడబడగా; ప్రియములు = ప్రియభాషణములు; ఆడని = పలుకకున్నట్టి; ప్రియున్ = ఇష్టుడైన కృష్ణుని; చూచి = చూసి; బెగ్గడిల్లి = భయపడి; చరణములన్ = పాదములను; నేలన్ = నేలమీద; వ్రాయుచు = రాస్తూ; సంభ్రమమున = తొట్రుపాటుతో; కాంతలు = స్త్రీలు; ఎల్లను = అందరు; వగలన్ = విచారములతో; ఆక్రాంతలు = ఆక్రమింపబడినవారు; అగుచు = ఔతు.
భావము:- గోపికల పెదవులు విరహమనే మంటలతో వెడలిన మిక్కుట మైన దీర్ఘ నిశ్వాసాలు సోకి ఎండిపోయాయి. కన్నుల నుంచి కారే కన్నీరు కారి, వారు స్తనాలపై పూసుకున్న కుంకుమ చెదరేలా ప్రవహించింది. చెక్కిట జేర్చిన చేతులు వేడిమికి ముఖపద్మాలు అందమంతా కందిపోయింది. ఎడతెరపి లేకుండా తాకుతున్న మన్మథ బాణాలకు ధైర్యం సాంతము చెదరిపోయింది. అగ్గలమైన దుఃఖము వలన మాటలు తడబడగా ప్రియవచనాలు పలకని ప్రియుణ్ణి చూసి బెదిరిపోయారు. పాదాలతో నేలపై వ్రాస్తూ, తొట్రుపాటుతూ విచారంలో మునిగిపోతూ. . .

తెభా-10.1-987-వ.
ఇట్లనిరి.
టీక:- ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- ఆ యాదవ భామలు ఇలా అన్నారు.

తెభా-10.1-988-మ.
"టా! నమ్మితి మేము; క్రూరుఁడన ని న్నర్హంబె; మా యిండ్లలో
లవ్యాప్తుల డించి నీ పదసరోజాతంబు లర్చింపఁ జి
క్క యేతెంచితి, మీశుఁ; డాఢ్యుఁడవు; మోక్షాసక్తులం గాచు పో
లికఁ గావందగు గావవే? విడువ మేలే కాంతలన్ భ్రాంతలన్.

టీక:- అకట = అయ్యో; నమ్మితిమి = నమ్మినాము నిన్ను; ఏము = మేము; క్రూరుడు = దయ లేనివాడు; అనన్ = అనుట; నిన్నున్ = నిన్ను; అర్హంబె = తగినదే; మా = మా యొక్క; ఇండ్ల = నివాసముల; లోన్ = అందు; సకల = సమస్తమైన; వ్యాప్తులన్ = పనులను; డించి = విడిచిపెట్టి; నీ = నీ; పద = పాదము లనెడి; సరోజాతంబులన్ = పద్మములను; అర్చింపన్ = పూజించుటకు; చిక్కకన్ = తప్పించుకొని; ఏతెంచితిమి = వచ్చితిమి; ఈశుడ = భగవంతుడవు; ఆఢ్యుడవు = శ్రేష్ఠుడవు; మోక్షాసక్తులన్ = ముక్తికోరువారిని; కాచు = కాపాడు; పోలికన్ = విధముగనే; కావన్ = కాపాడుటకు; తగున్ = తగినది; కావవే = కాపాడుము; విడువన్ = వదలివేయుట; మేలే = మంచిపనా, కాదు; కాంతలన్ = స్త్రీలను; భ్రాంతలన్ = భ్రమపొందినవారిని.
భావము:- “అయ్యో! నిన్ను నమ్ముకున్నాము. నిన్ను క్రూరుడు అనడం తగదా? మా ఇండ్లలో సకల సంగతులూ దిగవిడచి అరవిందాల వంటి నీ అడుగులు పూజించడాని కని తప్పించుకు వచ్చేసాము. ప్రభుడవు ఆదిపురుషుడవు అయిన నీవు ముముక్షువులను రక్షించే విధంగా కావదగిన మమ్మల్ని కాపాడవయ్యా. వెలదులం వేదురు కొన్నాం, మమ్మల్ని విడచిపెట్టడం నీకు తగదయ్యా.

తెభా-10.1-989-మ.
తులన్ బిడ్డల బంధులన్ సతులకుం బాటించుటే ధర్మప
ద్ధతి యౌ నంటివి; దేహధారిణులకున్ ర్మజ్ఞ! చింతింపుమా;
తి పుత్రాదిక నామమూర్తి వగుచున్ భాసిల్లు నీ యందుఁ ద
త్పతి పుత్రాదిక వాంఛలన్ సలిపి సంభావించు టన్యాయమే?

టీక:- పతులన్ = భర్తలను; బిడ్డలన్ = కన్నపిల్లలను; బంధులన్ = బంధువులను; సతుల్ = ఇంల్లాండ్ర; కున్ = కు; పాటించుటే = ఆదరించుట; ధర్మ = ధర్మబద్ధమైన; పద్ధతి = విధానము; ఔన్ = అయి ఉన్నది అని; అంటివి = అన్నావు; దేహధారిణుల్ = జీవు లందరి; కున్ = కి; ధర్మజ్ఞ = ధర్మము లన్ని తెలిసినవాడ; చింతింపుమా = తరచి చూడుము; పతి = భర్త; పుత్ర = పిల్లలు; ఆదిక = మొదలైన; నామ = పేర్లు; మూర్తివి = రూపము కలవాడవు; అగుచున్ = ఔతు; భాసిల్లు = ప్రకాశించెడి; నీ = నీ; అందున్ = లో; తత్ = ఆయా; పతి = భర్త; పుత్ర = పిల్లలు; ఆదిక = మున్నగు; వాంఛలన్ = కోరికలను; సలిపి = చేసి; సంభావించుట = గౌరవించుట; అన్యాయమే = అధర్మమా, కాదు.
భావము:- “భర్తలను బిడ్డలనూ బంధువులనూ ఆదరించడమే పతివ్రతలకు ధర్మం” అన్నావు. మరి ధర్మవేత్తవు కదా నీవే అలోచించు. మగడు కొడుకు మున్నగు పేర్లు ధరించిన వాడవై ప్రకాశించే నీయందు దేహధారిణులైన స్త్రీలము మేము, పతి సుతాదుల పట్ల మాకున్న కోరికలు తీర్చుకోవడం అన్యాయమంటావా? చెప్పు.

తెభా-10.1-990-మత్త.
నీ యిన్ రతి చేయుచుందురు నేర్పరుల్; సతతప్రియో
ద్దీకుండవు; గాన నెవ్వగ దెచ్చు నాథ సుతాదులం
జూ నేటికి? మన్మహాశలు చుట్టి నీకడ నుండఁగాఁ
బా నేల? మదీయ తాపముఁ బాపఁ బోలు కృపానిథీ!

టీక:- నీ = నీ; పయిన్ = మీద; రతి = ఆపేక్ష; చేయుచుందురు = పెట్టుకొనుచుందురు; నేర్పరుల్ = చతురులు; సతత = ఎల్లప్పుడు; ప్రియ = ఇష్ఠులను; ఉద్దీపకుండవు = ప్రకాశింప జేసెడి వాడవు; కాన్ = అగునట్లు; నెర = అధికమైన; వగన్ = విచారములను; తెచ్చు = కలిగించెడి; నాథ = భర్త; సుత = పుత్రులు; ఆదులన్ = మున్నగువారిని; చూపన్ = గుర్తుచేయుట; ఏటికిన్ = ఎందుకు; మత్ = మా యొక్క; మహా = గొప్ప; ఆశలు = కోరికలను; చుట్టి = మడిచేసి; నీ = నీ; కడన్ = వద్ద; ఉండగా = ఉండగా; పాపన్ = దూరముచేయుట; ఏలన్ = ఎందుకు; మదీయ = మా యొక్క; తాపమున్ = బాధలను; పాపన్ = తొలగించుట; పోలున్ = తగును; కృపానిధీ = దయాసాగరా.
భావము:- వేద శాస్త్ర చతురులు ఆత్మభూతుడవైన నీయందే ఆసక్తి చూపుతూ ఉంటారు. నీవు ఎడతెగని ప్రీతిని కలిగించే వాడవు కదా. మరి దుఃఖాలను కలిగించే భర్తా బిడ్డలూ మొదలైన వారిని మాకెందుకు చూపుతావు. మా జీవితాశ లన్నీ నీ చుట్టూనే ఉంటే ఎందుకు త్రుంచేస్తావయ్యా! ఓ కరుణకు పెన్నిధివైన వాడా! మా తాపం బాపవయ్యా!

తెభా-10.1-991-సీ.
నీ పాదకమలంబు నెమ్మి డగ్గఱఁ గాని-
రలి పోవంగఁ బాములు రావు;
నీ కరాబ్జంబులు నెఱి నంటి తివఁ గాని-
క్కిన పనికి హస్తములు చొరవు;
నీ వాగమృతధార నిండఁ గ్రోలనె గాని-
చెవు లన్యభాషలఁ జేరి వినవు;
నీ సుందరాకృతి నియతిఁ జూడఁగఁ గాని-
చూడ వన్యంబులఁ జూడ్కి కవలు;

తెభా-10.1-991.1-ఆ.
నిన్నెకాని పలుకనేరవు మా జిహ్వ;
లొల్ల ననుచుఁ బలుకనోడ వీవు
మా మనంబు లెల్ల రపించి దొంగిలి
తేమి చేయువార మింకఁ? గృష్ణ!

టీక:- నీ = నీ యొక్క; పాద = పాదము లనెడి; కమలంబున్ = పద్మములను; నెమ్మిన్ = ప్రీతితో; డగ్గఱన్ = సమీపించుటకు; కాని = కాని; తరలిపోవగన్ = బయటకు వెళ్ళుటకు; పాదములున్ = మా కాళ్ళు; రావు = సహకరించవు; నీ = నీ యొక్క; కర = చేతు లనెడి; అబ్జంబులున్ = పద్మములను; నెఱిన్ = నిండుగా; అంటి = తాకి; తివన్ = తీయుటకే; కాని = కాని; తక్కిన = మరే యితరమైన; పని = పని; కిన్ = కి; హస్తములున్ = మా చేతులు; చొరవు = రావు; నీ = నీ; వాక్ = మాటలు అనెడి; అమృత = అమృతపు; ధారన్ = ధారను; నిండన్ = పూర్తిగా; క్రోలనె = తాగుటకే; కాని = కాని; చెవులు = మా చెవులు; అన్య = ఇతరమైన; భాషలన్ = మాటలను; చేరి = సమీపించి; వినవు = వినటకు రావు; నీ = నీ యొక్క; సుందర = అందమైన; ఆకృతిన్ = రూపమును; నియతిన్ = పూని; చూడగన్ = చూచుటకే; కాని = కాని; చూడవు = చూచుటకు రావు; అన్యంబులన్ = ఇతరములను; చూడ్కి = కన్నుల; కవలు = జంటలు, రెండుకూడ.
నిన్నె = నిన్ను మాత్రమే; కాని = తప్పించి; పలుకన్ = మాట లాడుటకు; నేరవు = రావు; మా = మా యొక్క; జిహ్వలు = నాలుకలు; ఒల్లను = మిమ్ము అపేక్షింపను; అనుచు = అని; పలుకన్ = చెప్పుటకు; ఓడవు = వెనుదీయవు; ఈవు = నీవు; మా = మా యొక్క; మనంబులు = మనసులు; ఎల్లన్ = అన్నిటిని; మరపించి = మాయచేసి; దొంగిలితి = దొంగిలించినావు; ఏమి = ఏమిటి; చేయువారము = చేయగలవారము; ఇంకన్ = ఇకను; కృష్ణ = కృష్ణుడా.
భావము:- కృష్ణా! నీ చరణపద్మాలను ప్రీతితో చేరడానికే తప్ప మరో పక్కకి వెళ్ళడానికి మా కాళ్ళు రావు; నీ హస్తకమలాలను పట్టుకోవడానికే తప్ప ఇతర పనులకు మా చేతులు పూనుకోవు; నీ వచనసుధారసం చెవులారా ఆస్వాదించడానికే తప్ప ఇతరమైన మాటలు వినడానికి మా చెవులు ఇష్టపడవు; నీ మనోహరాకారం ఎల్లప్పుడూ చూస్తూ ఉండటానికే తప్ప మా కనులు మరి వేటినీ చూడవు; నీ నామ గుణాలు తప్ప మరి దేనినీ మా నాలుకలు పలుకవు; మరి నీవో మమ్మల్ని ఒల్ల నని పలుకడానికి జంకడం లేదు. మా మనసులను మురిపించి అపహరించావు. ఇంక మేమేమి చేయగలం.

తెభా-10.1-992-చ.
సిరికి నుదార చిహ్నములు చేయు భవచ్చరణారవిందముల్
సిజనేత్ర! మా తపము సంపదఁ జేరితి మెట్టకేలకున్
లఁగ లేము మా మగల మాటల నొల్లము; పద్మగంధముల్
గినతేఁటు లన్య కుసుమంబుల చెంతనుఁ జేరనేర్చునే?

టీక:- సిరి = లక్ష్మీదేవి; కిన్ = కి; ఉదార = మేలైన; చిహ్నములున్ = సంతోష చిహ్నములను; చేయు = కలిగించెడి; భవత్ = నీ యొక్క; చరణ = పాదము లనెడి; అరవిందముల్ = పద్మములు; సరసిజనేత్ర = పద్మాక్షుడా, కృష్ణుడా; మా = మా యొక్క; తపము = తపస్సుల; సంపదన్ = కలిమివలన; చేరితిమి = సమీపించితిమి; ఎట్టకేలకున్ = చిట్టచివరకు; మరలగలేము = తిరిగి పోలేము; మా = మా యొక్క; మగల = భర్తల; మాటలన్ = అధికారములను; ఒల్లము = అంగీకరించము; పద్మ = కమలముల; గంధముల్ = పరిమళములను; మరగిన = అలవాటుపడిన; తేటులు = తుమ్మెదలు; అన్య = ఇతరమైన; కుసుమంబులన్ = పూలకు; చెంతను = దగ్గరగా; చేరనేర్చునే = వెళ్ళగలవా, వెళ్ళలేవు.
భావము:- ఓ పద్మాక్షా! మా నోములు తపములు పండటంతో, శ్రీ మహాలక్ష్మికి వన్నెచిన్నెలు చేకూర్చు నీ పాదపద్మాల దగ్గరకు ఎలాగో చేరగలిగాము. ఇంక ఇక్కడనుండి వెనక్కి పోలేము. మా పతుల సంగతి అంగీకరించం. తామర పువ్వుల సుగంధం మరగిన తుమ్మెదలు ఇతర పూల చెంతకు చేరవు కదా.

తెభా-10.1-993-ఆ.
వతు లేక నీ విశాల వక్షఃస్థలిఁ
దొళసితోడఁ గూడఁ దోయజాక్ష!
నుపు మనుచు నెపుడు మాకాంత నీ పాద
మలరజముఁ గోరుఁ గాదె కృష్ణ!

టీక:- సవతులు = సరిపోలదగినవారు; లేకన్ = లేకపోయినను; నీ = నీ యొక్క; విశాల = విస్తారమైన; వక్షస్థలిన్ = వక్షముపైన; తొళసి = తులసి; తోడన్ = తో; కూడన్ = కలిసి; తోయజాక్ష = పద్మాక్షుడా, కృష్ణుడా; మనుపుము = రక్షింపుము; అనుచున్ = అని; ఎపుడున్ = ఎల్లప్పుడు; మాకాంత = లక్ష్మీదేవి; నీ = నీ యొక్క; పాద = పాదము లనెడి; కమల = పద్మము లంటిన; రజమున్ = రేణువులను; కోరున్ = కోరుకొనును; కాదే = కదా; కృష్ణ = కృష్ణుడా.
భావము:- కృష్ణా! నీరజాక్షా! శ్రీమహాలక్ష్మి ఎంత సాటిలేనిది అయినా నీ వెడల్పైన వక్షస్థలం మీద తులసితో కలసిమెలసి విలసిల్లునట్లు కటాక్షింపు మని ఎప్పుడూ నీ పాదపద్మపరాగాన్ని కోరుతుంది కదా.

తెభా-10.1-994-ఉ.
త్తలు మామలున్ వగవ నాఱడి కోడక నాథులన్ శుగా
త్తులఁ జేసి యిల్వరుస లాఱడి పోవఁగ నీదు నవ్వులన్
మెత్తని మాటలన్ మరుఁడుమేల్కొని యేఁచిన వచ్చినార మే
పొత్తుల నొల్లమో పురుషభూషణ! దాస్యము లిచ్చి కావవే.

టీక:- అత్తలు = మా అత్తగార్లు; మామలున్ = మా మామగార్లు; వగవన్ = విచారపడుతుండగా; ఆఱడి = నిందల; కిన్ = కు; ఓడక = వెనుదీయక; నాథులన్ = మా భర్తలను; శుగాయత్తులన్ = శోకము వచ్చినవారిని; చేసి = చేసి; ఇల్వరుసలు = ఇంటి పరువులు; ఆఱడిపోవగన్ = చెడిపోవునట్లు; నీదు = నీ యొక్క; నవ్వులన్ = నవ్వులచేతను; మెత్తని = మృదువైన; మాటలన్ = మాటలచేతను; మరుడు = మన్మథుడు; మేల్కొని = లేచి; ఏచినన్ = వేపుకు తినగా; వచ్చినారము = వచ్చితిమి; ఏ = ఎట్టి ఇతరమైన; పొత్తులను = స్నేహములను; ఒల్లము = అంగీకరించము; ఓ = ఓ; పురుషభూషణ = కృష్ణుడా {పురుష భూషణుడు - పురుషుల (మిక్కిలి సమర్థుల)లో భూషణుడు (శ్రేష్ఠుడు), విష్ణువు}; దాస్యములు = నిన్ను సేవించుకొనుటలు; ఇచ్చి = ఇచ్చి; కావవే = కాపాడుము.
భావము:- పురుషత్వానికే అలంకారమైనవాడా! కృష్ణా! అత్తమామలు ఆక్రోశిస్తున్నా, నిందకు జంకకుండా, భర్తలను దుఃఖాలపాలు చేసి, కులమర్యాదలు తోసిపుచ్చి, నీ నవ్వులకూ నీ మృదువచనాలకు, మన్మథుడు బాధించడం వలన ఇలా వచ్చాము. ఇంక మా కెవ్వరి పొత్తు వద్దు నీ పాదదాస్య మిచ్చి రక్షించు.

తెభా-10.1-995-మ.
గువల్ చిక్కరె తొల్లి వల్లభులకున్? న్నించి తద్వల్లభుల్
పంతంబు తలంపరే? తగులముల్ మా పాలనే పుట్టెనే?
వారాడెడి మాటలే తగవు నీ మాటల్ మనోజాగ్నిచేఁ
బొగులం జాలము; కౌఁగలింపుము మముం బుణ్యంబు పుణ్యాత్మకా!

టీక:- మగువల్ = స్త్రీ లెవరు; చిక్కరె = ప్రేమతో అధీనులు కారా; తొల్లి = ఇంతకుముందు; వల్లభుల = ప్రియమైన వారల; కున్ = కు; మన్నించి = ఆదరించి; తత్ = ఆయా; వల్లభుల్ = ప్రియులు; మగపంతంబున్ = పౌరుషములను; తలంపరే = చూప తలచరా ఏమిటి; తగులముల్ = మోహములు, లాలసలు; మా = మా; పాలనే = ఎడలనే; పుట్టెనే = పుట్టినవా ఏమిటి; మగవారు = పౌరుషము కలవారు; ఆడెడి = చెప్పెడి; మాటలే = మాటలా ఏమిటి; తగవు = తగినవికావు; నీ = నీ యొక్క; మాటల్ = మాటలు; మనోజ = మన్మథ; అగ్ని = తాపము; చేన్ = తో; బొగులంజాలము = తపింపలేము; కౌగలింపుము = ఆలింగనము చేసికొనుము; మమున్ = మమ్ములను; పుణ్యంబు = నీకు పుణ్య ముంటుంది; పుణ్యాత్మకా = కృష్ణుడా {పుణ్యాత్మకుడు - పరిశుద్ధమైన మనసు కలవాడు, విష్ణువు}.
భావము:- పూర్వము మహిళలు ఎవరూ ప్రియులను ప్రేమించలేదా? ఆ మనోహరులు వారిని ఆదరించలేదా? మమతలు మాకే పుట్టాయా? నీవు పలుకు మాటలు మగవారు పలుకే మాటలేనా? ఇవి నీకు ఏమాత్రం తగవు. మన్మథాగ్నితో పరితపించి పోతున్నాము. ఓ పుణ్యాత్మా! మమ్మల్ని అలింగనం చేసుకో, నీలో కలిపేసుకో నీకు పుణ్య ముంటుంది.

తెభా-10.1-996-ఉ.
కుంలదీప్త గండమును గుంచితకుంతల ఫాలమున్ సుధా
మండిత పల్లవాధరము మంజులహాస విలోకనంబునై
యుండెడు నీ ముఖంబుఁ గని యుండఁగ వచ్చునె? మన్మథేక్షు కో
దం విముక్త బాణముల దాసుల మయ్యెద; మాదరింపవే.

టీక:- కుండల = కర్ణాభరణములచేత; దీప్త = ప్రకాశింపజేయబడిన; గండమున్ = చెక్కిళ్ళు కలది; కుంచిత = ఉంగరాలు తిరిగిన; కుంతల = శిరోజములు గల; ఫాలమున్ = నుదురు కలది; సుధా = అమృతముచేత; మండిత = అలంకరింపబడిన; పల్లవ = చిగురులవంటి; అధరము = పెదవి కలది; మంజుల = మనోజ్ఞమైన; హాస = చిరునవ్వుతో కూడిన; విలోకనంబున్ = చూపులు కలది; ఐ = అయ్యి; ఉండెడు = ఉండునట్టి; నీ = నీ యొక్క; ముఖంబున్ = ముఖమును; కని = చూసికూడ; ఉండగవచ్చునె = చలింపకుండుట వీలగునా; మన్మథ = మన్మథుని యొక్క; ఇక్షు = చెరకుగడ; కోదండ = వింటినుండి; విముక్త = వేయబడిన; బాణములన్ = బాణములవలన; దాసులము = సేవకులము; అయ్యెదము = అవుతాము; ఆదరింపవే = ఏలుకొనుము.
భావము:- చెవికమ్మల కాంతి ప్రతిఫలించే చెక్కిళ్ళూ; ముసిరిన ముంగురులతో ముద్దులొలుకే నుదురూ; అమృతము చిందే చిగురుమోవీ; మధురమైన చిరునవ్వుల చూపులూ కల నీ వదనం వీక్షించి నిలువగలమా? మదనుని చెరకు వింటి నుండి వెడలిన శరపరంపరలకు దాసుల మయ్యామయ్యా! మమ్ము కాపాడవయ్యా!

తెభా-10.1-997-సీ.
నీ యధరామృత నిర్ఝరంబులు నేడు-
చేరి వాతెఱలపైఁ జిలుకకున్న
నీ విశాలాంతర నిర్మలవక్షంబుఁ-
గుచకుట్మలంబులఁ గూర్పకున్న
నీ రమ్యతర హస్తనీరజాతంబులు-
చికురబంధంబులఁ జేర్పకున్న
నీ కృపాలోకన నివహంబు మెల్లన-
నెమ్మొగంబుల మీఁద నెఱపకున్న

తెభా-10.1-997.1-ఆ.
నీ నవీన మాననీయ సల్లాపంబు
ర్ణరంధ్రదిశలఁ ప్పకున్న
నెట్లు బ్రతుకువార? మెందుఁ జేరెడువార?
ధిప! వినఁగఁ దగదె యాఁడుకుయులు

టీక:- నీ = నీ యొక్క; అధర = మోవి యొక్క; అమృత = అమృతపు; నిర్ఝరంబులున్ = ప్రవాహములు; నేడు = ఇవాళ; చేరి = కూడి; వాతెఱల = మా అధరముల; పైన్ = మీద; చిలుకకున్నన్ = చిలకరించని యెడల; నీ = నీ యొక్క; విశాలాంతర = అతి విశాలమైన {విశాలము - విశాలాంతరము - విశాలాంతము}; నిర్మల = స్వచ్ఛమైన; వక్షంబున్ = వక్షస్థలమునందు; కుచకుట్మంబులన్ = మా స్తనాగ్రములను; కూర్పకున్నన్ = చేర్చనియెడల; నీ = నీ యొక్క; రమ్యతర = అతి చక్కటి {రమ్యము - రమ్యతరము -రమ్యతమము}; హస్త = చేతు లనెడి; నీరజాతంబులు = పద్మములు; చికురు = జుట్టు; బంధంబులు = ముళ్ళ యందు; చేర్పకున్నన్ = చేర్చని యెడల; నీ = నీ యొక్క; కృపాలోకన = దయావీక్షణముల; నివహంబు = సమూహములు; మెల్లన = సున్నితముగా; నెఱ = మా నిండైన; మొగంబులన్ = ముఖముల; మీద = పైన; నెఱపకున్న = ప్రసరించని యెడల.
నీ = నీ యొక్క; నవీన = సరికొత్త; మాననీయ = మన్నింపదగిన; సల్లాపంబున్ = ముచ్చటలు; కర్ణ = మా చెవుల; రంధ్ర = కన్నముల; దిశలన్ = వైపు; కప్పకున్నన్ = పరవని యెడల; ఎట్లు = ఏ విధముగ; బ్రతుకువారము = జీవించి యుండగలము; ఎందున్ = ఎక్కడ; చేరెడువారము = శరణుపొందగలవారము; అధిప = రాజా; వినగదగదే = వినవచ్చునక దా; ఆడు = స్త్రీల; కుయలు = విన్నపములు, మొరలు.
భావము:- విభూ! కృష్ణా! చెంతకుజేరి నీ అధరసుధారసపూరం మా చిగురు పెదవులపై చిలికించు; విశాలమైన చక్కనైన విమలమైన నీ ఉరమును మా చనుమొగ్గలపై గదించు; పరమ సుందరములైన నీ కరకమలములను మా కొప్పులపై ఉంచు; నీ కరుణాకటాక్ష వీక్షణాలను మెల్లగా మా నెమ్మోములపై ప్రసరించు; ఆదరింపదగిన నీ సరిక్రొత్త పలుకుతేనియ మా చెవులలో ఒలికించు. లేకపోతే మేమెలా బతుకగలం? ఎక్కడికి పోగలం? ఆడువార మయ్యా మా మొరాలకించ వయ్యా.

తెభా-10.1-998-మ.
దాలోకన హాస గీతజములై భాసిల్లు కామాగ్నులన్
దీయాధరపల్ల వామృతముచేఁ బాఁపం దగుం, బాఁపవే
ని వియోగానల హేతిసంహతులచే నీఱై, భవచ్చింతలన్
దంఘ్రిద్వయవీధిఁ బొందెదము నీ పాదంబులాన ప్రియా!

టీక:- భవత్ = నీ యొక్క; ఆలోకన = చూపులనుండి; హాస = చిరునవ్వులనుండి; గీత = పాటలనుండి; జములు = పుట్టినవి; ఐ = అయ్యి; భాసిల్లు = ప్రకాశించెడి; కామాగ్నులన్ = మన్మథతాపములను; భవదీయ = నీ యొక్క; అధర = పెదవి అనెడి; పల్లవ = చిగురుల యొక్క; అమృతము = అమృతము; చేన్ = చేత; పాపన్ = అణచుట; తగున్ = సరియైనది; పాపవేని = అణచని ఎడల; వియోగ = విరహము అనెడి; అనల = అగ్ని; హేతి = మంటల; సంహతుల = సమూహముల; చేన్ = వలన; నీఱై = భస్మమైపోయి; భవత్ = నీమీది; చింతలన్ = విచారములతోనే; భవత్ = నీ యొక్క; అంఘ్రి = పాదములు; ద్వయ = రెంటి; వీధి = వైపునకే; పొందెదము = చేరెదము; నీ = నీ యొక్క; పాదంబులాన = పాదములమీద ఒట్టు; ప్రియా = ప్రియుడా.
భావము:- ఓ కృష్ణా! ప్రాణేశ్వరా! నీమీద ఒట్టేసి చెప్తున్నాము. నీ చూపులకి నవ్వులకి పాటలకి జనించి జ్వలించే మన్మథ తాపాలను నీ చిగురుమోవి సుధ చిందించి చల్లార్చు. చల్లార్చక పోతే ఈ విరహానల జ్వాలాలలో భస్మ మైపోయి, నిన్నే స్మరిస్తూ నీ అడుగుల జంట జాడనే చేరుతాము.

తెభా-10.1-999-క.
రు మృగ ఖగ గో గణములు
మొప్పెడు నిన్నుఁ గన్నఁ గానము విన్నం
రఁగి పులకించు, నబలలు
రఁగరె నినుఁ గన్న నీదు గానము విన్నన్?

టీక:- తరు = చెట్లు (చేతనత్వములేనివి); మృగ = జంతువులు (జ్ఞానము లేనివి); ఖగ = పక్షులు (స్థిరము లేనవి); గో = గోవుల, జీవుల; గణములు = సమూహములు; కరము = మిక్కిలి; ఒప్పెడు = చక్కనైన; నిన్నున్ = నిన్ను; కన్నన్ = చూసినను; గానము = నీ పాట; విన్నన్ = వినినను; కరగి = రక్తిని పొంది; పులకించున్ = పులకించి పోవును; అబలలున్ = స్త్రీలు కూడ; కరగరె = అనురక్తితో చొక్కరా; నిన్నున్ = నిన్ను; కన్నన్ = చూసినను; నీదు = నీ యొక్క; గానము = పాటను; విన్నన్ = వినినను.
భావము:- బహు చక్కగా ఉండే నిన్ను కనుగొన్నా నీ సంగీతం విన్నా; చెట్లు, మృగాలు, పక్షులు, గోవులమందలూ కరగి పులకించిపోతాయి. మరి అంగనలు నిను చూసి, నీ గానం వినీ ద్రవించి పోరా మరి?