పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/గోపకులు నందునికి జెప్పుట

వికీసోర్స్ నుండి

తెభా-10.1-930-వ.
అ య్యవసరంబునఁ గృష్ణు చరిత్రంబులు తలంచి వెఱఁగుపడి గోపజనులు నందున కిట్లనిరి.
టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు; కృష్ణు = కృష్ణుని యొక్క; చరిత్రంబులు = నడవడికలను; తలంచి = తలచుకొని; వెఱగుపడి = ఆశ్చర్యపోయి; గోప = గొల్ల; జనులు = వారు; నందున్ = నందుని; కిన్ = తో; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- అప్పుడు, కృష్ణుని కధలు స్మరించి ఆశ్చర్యచకితులై గోపాలకులు నందుడితో ఇలా అన్నారు. . .

తెభా-10.1-931-సీ.
"న్నులు దెఱవని డుచిన్ని పాపఁడై-
దానవిఁ జనుఁబాలు ద్రాగి చంపె;
మూడవ నెలనాఁడు ముద్దుల బాలుఁడై-
కోపించి శకటంబుఁ గూలఁ దన్నె;
నేఁడాది కుఱ్ఱఁడై యెగసి తృణావర్తు-
మెడఁ బట్టుకొని కూల్చి మృతునిఁ జేసెఁ;
ల్లి వెన్నలకునై ను ఱోలఁ గట్టినఁ-
గొమరుఁడై మద్దులు గూల నీడ్చెఁ;

తెభా-10.1-931.1-తే.
సుల క్రేపులఁ గాచుచు కునిఁ జీరె;
వెలఁగతో వత్సదైత్యుని వ్రేసి గెడపె;
బలుఁడై ఖరదైత్యుని సంహరించె;
నితఁడు కేవల మనుజుఁడే యెంచిచూడ!

టీక:- కన్నులుదెఱవని = కళ్ళు తెరచుట కూడ రాని; కడు = మిక్కిలి; చిన్ని = చంటి; పాపడు = పిల్లవాడు, శిశువు; ఐ = అయ్యి యుండి; దానవిన్ = దానవస్త్రీ యొక్క; చనుబాలు = స్తన్యము; త్రాగి = తాగి; చంపెన్ = సంహరించెను; మూడవ = మూడవ (3); నెల = నెల; నాడు = వయసు నందు; ముద్దుల = బహు అందమైన; బాలుడు = పసిబిడ్డగా; ఐ = ఉండి; కోపించి = రోషము తెచ్చుకొని; శకటంబున్ = బండిని; కూలన్ = విరిగిపోవునట్లు; తన్నెన్ = కాలితో తన్నెను; ఏడాది = సంవత్సర వయసు; కుఱ్ఱడు = పిల్లవాడు; ఐ = అయ్యి; ఎగసి = మీది కెగిరి; తృణావర్తున్ = తృణావర్తుడను రాక్షసుని; మెడ = గొంతుక; పట్టుకొని = పట్టుకొని; కూల్చి = పడగొట్టి; మృతునిజేసె = సంహరించెను; తల్లి = తల్లి; వెన్నలు = వెన్నలు దొంగిలించిన; కున్ = అందుకోసము; ఐ = అయ్యి; తనున్ = అతనిని; ఱోలన్ = రోటికి; కట్టినన్ = బంధించగా; కొమరుడు = పిల్లవాడు; ఐ = అయ్యి యుండి; మద్దులన్ = మద్దిచెట్లను; కూలన్ = పడిపోవునట్లుగా; ఈడ్చెన్ = లాక్కొని వెళ్ళెను; పసుల = ఆవు; క్రేపులన్ = దూడలను; కాచుచున్ = మేపుతు.
బకునిన్ = బకాసురుని; చీఱెన్ = చీల్చివేసెను; వెలగ = వెలగచెట్టు; తోన్ = తోటి; వత్సదైత్యుని = వత్సాసురుని; వ్రేసి = వేసికొట్టి; గెడపెన్ = చంపెను; సబలుడు = బలరామునితో కూడినవాడు; ఐ = అయ్యి; ఖరదైత్యుని = ధేనుకాసురుని; సంహరించె = చంపెను; ఇతడు = ఇతను; కేవలమనుజుడే = సామాన్యమానవుడా, కాదు; ఎంచి = విచారించి; చూడన్ = చూడగా.
భావము:- “కన్నులు తెరవని కసుగందుగా ఉన్నప్పుడే చన్నులపాలు తాగి రక్కసి పూతనను చంపాడు; మూడు నెలల ముద్దు బాలుడుగా ఉన్నప్పుడే కోపంతో శకటాసురుణ్ణి కూలతన్నాడు; ఏడాది కుఱ్ఱాడుగా ఉన్నప్పుడే మెడ పట్టుకుని తృణావర్తుడిని పడద్రోసి పరిమార్చాడు; బాలుడుగా ఉన్నప్పుడే పడతి యశోదమ్మ కినిసి రోటికి కట్టగా ఈడ్చుకుపోయి జంటమద్దులను కూలద్రోశాడు; లేగలను కాస్తూ బకాసురుడిని చీల్చేసాడు; వత్సాసురుణ్ణి వెలగచెట్టుకి కొట్టి చంపాడు; బలవంతుడైన ఖరుడనే దానవుణ్ణి నిర్మూలించాడు; తరచి చూస్తే ఈ శ్రీకృష్ణుడు మానవమాతృడు కాదు అని తెలుస్తోంది.

తెభా-10.1-932-క.
తెంరి యై రామునిచేఁ
జంపించెఁ బ్రలంబు; మ్రింగెఁ టుల దవాగ్నిన్;
సొంపు చెడఁ ద్రొక్కి కాళియుఁ
ద్రుంక కాళింది వెడలఁ దోలెన్ లీలన్.

టీక:- తెంపరి = తెగువ కలవాడు; ఐ = అయ్యి; రాముని = బలరాముని; చేన్ = చేత; చంపించె = సంహరింపజేసెను; ప్రలంబున్ = ప్రలంబాసురుని; మ్రింగెన్ = తాగివేసెను; చటుల = తీవ్రమైన; దవాగ్నిన్ = కార్చిచ్చును; సొంపు = గర్వము; చెడన్ = అణగిపోవునట్లు; త్రొక్కి = కాళ్ళతో తొక్కి; కాళియున్ = కాళియసర్పరాజును; త్రుంపకన్ = చంపకుండ; కాళిందిన్ = యమునానదిని; వెడలన్ = వదలిపోవునట్లు; తోలెన్ = తరిమివేసెను; లీలన్ = విలాసముగా.
భావము:- సాహసంతో ప్రలంబాసురుణ్ణి బలరాముడిచే చంపించాడు; దారుణమైన దావానలం మ్రింగేసాడు; తలపొగరు దిగేటట్లు కాళీయుడిని అవలీలగా త్రొక్కాడు; ప్రాణాలు తీయకుండా యమునా మడుగు నుండి బయటకు గెంటేసాడు.

తెభా-10.1-933-క.
డేండ్ల బాలుఁ డెక్కడ?
క్రీడం గరి తమ్మి యెత్తు క్రియ నందఱముం
జూ గిరి యెత్తు టెక్కడ?
వేడుక నొక కేల నేడు వెఱఁగౌఁ గాదే.

టీక:- ఏడు = ఏడు (7); ఏండ్ల = సంవత్సరముల; బాలుడు = పిల్లవాడు; ఎక్కడ = ఏమిటి; క్రీడన్ = ఆటలాగ; కరి = ఏనుగు; తమ్మిన్ = పద్మమును; ఎత్తు = ఎత్తినంత సుళువైన; క్రియన్ = విధముగా; అందఱమున్ = మనమంతా; చూడన్ = చూస్తుండగా; గిరిన్ = కొండను; ఎత్తుట = పైకెత్తుట; ఎక్కడ = ఏమిటి; వేడుకన్ = విలాసముగా; ఒక = ఒంటి; కేలన్ = చేతితో; నేడు = ఇవాళ; వెఱగు = అద్భుతము; ఔ = అయినట్టి (విషయము); గదే = కదా.
భావము:- ఏడేళ్ళ బాలుడు ఏమిటి? ఏనుగు తామరపువ్వును ఎత్తినట్లు ఇవాళ మనం అందరం చూస్తుండగా ఒక్క చేత్తో పర్వతాన్ని పైకెత్తడం ఏమిటి? ఇదెంతో అద్భుతంగా ఉంది కదా!

తెభా-10.1-934-క.
ఓ! నంద! గోపవల్లభ!
నీ నందనుఁ డాచరించు నేర్పరితనముల్
మావులకు శక్యంబులె?
మావమాత్రుండె? నీ కుమారుఁడు తండ్రీ!"

టీక:- ఓ = ఓయీ; నంద = నందుడనెడి; గోప = గొల్లల; వల్లభ = ప్రభువ; నీ = నీ యొక్క; నందనుడు = కొడుకు; ఆచరించు = చేసెడి; నేర్పరితనముల్ = సమర్థతలు; మానవుల్ = మనుషుల; కున్ = కు; శక్యంబులె = సాధ్యమగునవా, కాదు; మానవమాత్రుండె = మామూలుమనిషా, కాదు; నీ = నీ యొక్క; కుమారుడు = కొడుకు; తండ్రీ = నాయనా.
భావము:- ఓ గోపనాయకా! నందమహారాజా! నీ కుమారుడు గావించే విన్నాణపు పనులు మనుజులకు సాధ్యమయ్యే పనులా? ఓ నాయనా! నీ కొడుకు మానవమాత్రుడు కాదయ్యా!”

తెభా-10.1-935-వ.
అనిన విని నందుండు వారలం జూచి మున్ను తనకు గర్గమహాముని చెప్పిన సంకేతంబు తెలిపి “శంకలేదు; కృష్ణుండు లోకరక్షకుండైన పుండరీకాక్షుని నిజాంశంబనుచు నంతరంగంబునం జింతింతు” నని పలికిన వెఱఁగుపడి గోపకులు కృష్ణుం డనంతుండని పూజించి; రంత.
టీక:- అనినన్ = అని పలుకగా; విని = విని; నందుండు = నందుడు; వారలన్ = వారిని; చూచి = ఉద్దేశించి; మున్ను = ఇంతకుపూర్వము; తన = అతని; కున్ = కి; గర్గ = గర్గుడు అనెడి; మహా = గొప్ప; ముని = ఋషి; చెప్పిన = తెలియజెప్పిన; సంకేతంబున్ = గుర్తులు; తెలిపి = తెలియజెప్పి; శంక = అనుమానము; లేదు = లేదు; కృష్ణుండు = కృష్ణుడు; లోక = ఎల్లలోకములను; రక్షకుండు = రక్షించువాడు; ఐన = అయినట్టి; పుండరీకాక్షుని = విష్ణుమూర్తి యొక్క; నిజ = స్వంత; అంశంబు = అంశతోపుట్టినవాడు; అనుచున్ = అని; అంతరంగంబునన్ = మనసునందు; చింతింతున్ = భావింతును; అని = అని; పలికినన్ = చెప్పగా; వెఱగుపడి = ఆశ్చర్యపోయి; గోపకులు = యాదవులు లెల్ల; కృష్ణుండు = కృష్ణుడు; అనంతుడు = విష్ణువే {అనంతుడు - నాశరహితమైన భగవంతుడు, విష్ణువు}; అని = అని; పూజించిరి = పూజించిరి; అంత = అంతట.
భావము:- అలా కృష్ణుడుని పొగడుతున్న గోపకులను చూసి నందుడు మునుపు గర్గమహాముని చెప్పిన రహస్యం స్మృతికి తెచ్చుకుని “అవునవును శ్రీ కృష్ణుడు జగద్రక్షకు డైన ఆ నారాయణుడి నిజాంశమే అని మనసులో భావిస్తున్నాను” అన్నాడు. ఆ మాటలు విని గోపకులు ఆశ్చర్యచకితులై కృష్ణుడు విష్ణుమూర్తి అవతారమని భావించి సేవించారు. అంతట. . .