పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/గోవర్ధనగిరి నెత్తుట

వికీసోర్స్ నుండి

తెభా-10.1-914-వ.
అని పలికి.
టీక:- అని = అని; పలికి = ధైర్యము చెప్పి.
భావము:- ఇలా గోపికా గోపకులకు ధైర్యం చెప్పాడు. . .

తెభా-10.1-915-క.
కిరి యై ధర యెత్తిన హరి
రి సరసిజముకుళ మెత్తుతిఁ ద్రిభువన శం
కరుఁడై గోవర్థన
గిరి నెత్తెం జక్క నొక్క కేలన్ లీలన్.

టీక:- కిరి = వరాహావతారుడు; ఐ = అయ్యి; ధరన్ = భూమిని; ఎత్తిన = ఉద్ధరించినట్టి; హరి = కృష్ణుడు; కరి = ఏనుగు; సరసిజ = పద్మము {సరసిజము - సరసునందు జనించునది, కమలము}; ముకుళము = మొగ్గను; ఎత్తు = పైకెత్తుట; గతిన్ = వలె; త్రిభువన = ముల్లోకములను; శంకరకరుడు = సుఖము కలిగించు వాడు; ఐ = అయ్యి; గోవర్ధన = గోవర్ధనము అనెడి {గోవర్ధన గిరి - గో (గోవులు, జీవులు, ఇంద్రియములు) వర్ధనము (వర్ధిల్లజేయు) గిరి (ఉన్నతమైనది, పర్వతము)}; గిరిన్ = కొండను; ఎత్తెన్ = మీది కెత్తెను; చక్కన్ = చక్కగా; ఒక్క = ఒంటి; కేలన్ = చేతితో; లీలన్ = విలాసముగా.
భావము:- కృష్ణుడు ఆదివరాహమూర్తియై భూమిని పైకెత్తిన అచ్యుతుడు కదా. అందుకే ముల్లోకాలకూ మోదం కలిగించాలని, ఏనుగు తామర మొగ్గను పైకెత్తిన అంత అవలీలగా, ఒక్క చేత్తో గోవర్ధన పర్వతాన్ని గొడుగులాగ పైకెత్తాడు.

తెభా-10.1-916-క.
దండిని బ్రహ్మాండంబులు
చెండుల క్రియఁ బట్టి యెగురఁ జిమ్మెడు హరికిన్
గొండఁ బెకలించి యెత్తుట
కొండొకపని గాక యొక్క కొండా తలఁపన్?

టీక:- దండిని = సమర్థతతో; బ్రహ్మాండంబులున్ = బ్రహ్మాండములను {బ్రహ్మాండము - భూగోళ ఖగోళాదికము, ఇది అండాకారమున నుండును}; చెండుల = పూలబంతి; క్రియన్ = వలె; పట్టి = పట్టుకొని; ఎగురజిమ్మెడు = ఎగరవేసెడి; హరికిన్ = కృష్ణునికి; కొండన్ = పర్వతమును; పెకలించి = పెళ్ళగించి లేపి; ఎత్తుట = మీది కెత్తుట; కొండొక = ఏదో అల్పమైన; పని = కార్యము; కాక = అంతేకాని; ఒక్క = ఒకానొక; కొండా = గొప్పకార్యమా, కాదు; తలపన్ = తరచి చూసినచో.
భావము:- బ్రహ్మాండాలను పూబంతులలాగ విలాసంగా ఎగురేసే గోవిందుడికి, ఒక కొండను పెల్లగించి పైకెత్తడం సులువైన పని గాక పెద్ద ఘనకార్యమా?

తెభా-10.1-917-వ.
ఇట్లు గిరి యెత్తి.
టీక:- ఇట్లు = ఈ విధముగ; గిరిన్ = పర్వతమును; ఎత్తి = పైకెత్తి.
భావము:- కృష్ణమూర్తి ఇలా కొండనెత్తి. . .

తెభా-10.1-918-శా.
బాలుం డాడుచు నాతపత్ర మని సంభావించి పూగుత్తి కెం
గేలం దాల్చిన లీల లేనగవుతోఁ గృష్ణుండు దా నమ్మహా
శైలంబున్ వలకేలఁ దాల్చి విపులచ్ఛత్రంబుగాఁ బట్టె నా
భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీగోపగోపంక్తికిన్.

టీక:- బాలుండు = పిల్లవాడు; ఆడుచున్ = క్రీడగా; ఆతపత్రము = గొడుగు; అని = అని; సంభావించి = ఎంచి, అనుకొని; పూగుత్తిన్ = పూలగుత్తిని; కెంగేలన్ = అరచేతి యందు; దాల్చిన = ధరించినట్టి; లీలన్ = విధముగ; లేనగవు = లేతనవ్వు, చిరునవ్వు; తోన్ = తోటి; కృష్ణుండు = కృష్ణుడు; తాన్ = అతను; ఆ = ఆ యొక్క; మహా = గొప్ప; శైలంబున్ = కొండను; వల = కుడి; కేలన్ = చేతిపై; దాల్చి = ధరించి; విపుల = విస్తారమైనట్టి; ఛత్రంబు = గొడుగు; కాన్ = ఐనట్లుగా; పట్టెన్ = పట్టుకొనెను; ఆభీల = భయంకరమైన; అభ్ర = మేఘములనుండి; చ్యుత = పడుతున్నట్టి; దుః = చెడ్డ; శిలా = రాళ్ళవలన; చకిత = భయపడిన; గోపీ = గొల్లస్త్రీలు; గోప = గొల్లపురుషులు; గో = ఆవుల; పంక్తి = సమూహముల; కిన్ = కొఱకు.
భావము:- పసిపిల్లాడు ఆటలాడుతూ గొడుగు అంటూ పూలగుత్తిని చేత్తో ఎత్తి పట్టుకున్నట్లు, చిరునవ్వుతో శ్రీకృష్ణుడు గోవర్ధనపర్వతాన్ని ఎత్తి కుడి చేత ధరించాడు. దారుణమైన మేఘాల నుండి రాలుతున్న వడగండ్లవానకు భయపడుతున్న గోపికలను గోపకులకు గోవుల కోసం ఆ కొండను పెద్ద గొడుగులా పట్టుకున్నాడు.

తెభా-10.1-919-వ.
ఇట్లు గోత్రంబు ఛత్రంబుగాఁ బట్టి గోపజనులకు గోపాలశేఖరుం డిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; గోత్రంబున్ = కొండను; ఛత్రంబుగా = గొడుగువలె; పట్టి = పట్టుకొని ఉండి; గోప = గొల్ల; జనుల = వారల; కున్ = కు; గోపాలశేఖరుండు = కృష్ణుడు {గోపాల శేఖరుడు - పశువుల కాపరులలో శ్రేష్ఠుడు, కృష్ణుడు}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;
భావము:- గోపాలశిరొమణి అయిన శ్రీ కృష్ణుడు కొండను గొడుగులా పట్టుకుని గోపాకులతో ఇలా అన్నాడు.

తెభా-10.1-920-క.
"రా ల్లి! రమ్ము తండ్రీ!
వ్రేలు గోపకులు రండు; వినుఁ; డీ గర్త
క్ష్మాలమున నుండుఁడు గో
వ్రాముతో మీరు మీకు లసిన యెడలన్.

టీక:- రా = రండి; తల్లి = అమ్మలు; రమ్ము = రండి; తండ్రీ = నాయనలు; వ్రేతలు = గోపికలు; గోపకులు = యాదవు పురుషులు; రండు = రండి; వినుడు = వినండి; ఈ = ఈ యొక్క; గర్త = కొండను పెల్లగించిన; క్ష్మాతలమునన్ = ప్రదేశమునందు; ఉండుడు = ఉండండి; గో = పశువుల; వ్రాతము = సమూహముల; తోన్ = తోటి; మీరు = మీరు; మీ = మీరల; కున్ = కు; వలసిన = కావలసినట్టి; ఎడలన్ = చోటు లందు.
భావము:- “ఓ యమ్మా! రా; రా నాయనా! గోపవనితలారా! గోపకులారా! రండి రండి; నా మాట వినండి. వచ్చి మీకు నచ్చిన చోట గోవుల మందలతో సహా ఈ కొండ క్రింద నిలవండి.

తెభా-10.1-921-శా.
బాలుం డీతఁడు; కొండ దొడ్డది; మహాభారంబు సైరింపఁగాఁ
జాలండో; యని దీని క్రింద నిలువన్ శంకింపఁగా బోల; దీ
శైలాంభోనిధి జంతు సంయుత ధరాక్రంబు పైఁబడ్డ నా
కే ల్లాడదు; బంధులార! నిలుఁ డీ క్రిందం బ్రమోదంబునన్. "

టీక:- బాలుండు = చిన్న పిల్లవాడు; ఈతడు = ఇతను; కొండ = పర్వతము; దొడ్డది = బాగా పెద్దది; మహా = మిక్కిలి; భారంబు = బరువైనది; సైరింపగాన్ = భరించుటకు; చాలండో = సరిపోడేమో; అని = అని; దీని = దీనికి; క్రింద = కింద; నిలువన్ = ఉండుటకు; శంకింపగాన్ = సందేహించుట; పోలదు = వలదు; ఈ = ఈ యొక్క; శైలంబున్ = కొండలు {శైలము - శిలలగుట్ట, కొండ}; అంభోనిధి = సముద్రము {అంభోనిధి - జలమునకు నిధానమైనది, సముద్రము}; జంతు = ప్రాణులతో; సంయుత = కూడినట్టి; ధరా = భూ; చక్రంబు = మండలము; పైబడ్డ = వచ్చి మీద పడినను; నా = నా యొక్క; కేలు = చేయి; అల్లాడదు = చలించదు; బంధులారా = ఓ బంధువులు; నిలుడీ = ఉండండి; ఈ = దీని; క్రిందన్ = కిందన; ప్రమోదంబునన్ = సంతోషముగ.
భావము:- గోవర్థనగిరిని ఎత్తిన శ్రీకృష్ణుడు గోపకుల నందరను దీని కిందకి రండి అని పిలుస్తున్నాడు –
"ఓ బంధువులారా! కృష్ణుడు ఏమో చిన్న పిల్లాడు. చూస్తే ఈ కొండ ఏమో చాలా పెద్దది. ఇతడు దీనిని మోయ గలడో లేడో అని సందేహించకండి. పర్వతాలు, సముద్రాలు, ప్రాణులు అన్నిటితో కూడిన ఈ భూమండలం అంతా మీద పడ్డా కూడ నా చెయ్యి వణకదు. మీ రందరు ఆనందంగా దీని కింద ఉండండి."

తెభా-10.1-922-వ.
ఇట్లు పలుకుచున్న హరిపలుకులు విని నెమ్మనమ్ముల నమ్మి కొండ యడుగున తమతమ యిమ్ములం బుత్ర మిత్ర కళత్రాది సమేతులై గోవులుం దారును గోపజనులు జనార్దన కరుణావలోక నామృతవర్షంబున నాఁకలి దప్పుల చొప్పెఱుంగక కృష్ణకథా వినోదంబుల నుండి; రివ్విధంబున.
టీక:- ఇట్లు = ఈ విధముగ; పలుకుచున్న = చెప్పుతున్న; హరి = కృష్ణుని; పలుకులు = మాటలు; విని = విని; నెఱ = నిండు; మనమ్ములన్ = మనసులతో; నమ్మి = విశ్వసించి; కొండ = పర్వతము; అడుగున = కింద; తమతమ = వారవారి; ఇమ్ములన్ = నచ్చిన చోటు లందు; పుత్ర = పిల్లలు; మిత్ర = స్నేహితులు; కళత్ర = భార్యలు; ఆది = మున్నగువారితో; సమేతులు = కూడినవారు; ఐ = అయ్యి; గోవులున్ = పశువులు; తారును = తాము; గోపజనులు = గొల్లవారు; జనార్దన = కృష్ణుని; కరుణా = దయతోడి; అవలోకన = చూపు లనెడి; అమృత = అమృతపు; వర్షంబునన్ = వానచేత; ఆకలి = ఆకలి; దప్పులన్ = దాహముల; చొప్పు = విధము, జాడ; ఎఱుంగక = తెలియకుండగ; కృష్ణ = కృష్ణుని యొక్క; కథా = కథలు చెప్పుకొనెడి; వినోదంబులన్ = వేడుక లందు; ఉండిరి = ఉన్నారు; ఈ = ఈ; విధంబున = విధముగ.
భావము:- ఇలా నమ్మకంగా చెప్తున్న కృష్ణుడి మాటలు గోపకులు మనస్ఫూర్తిగా విశ్వసించారు. వారు తమ పుత్రులు, మిత్రులు, భార్యలు మొదలైనవారి తోనూ ధేనువుల తోనూ అతని కరుణాకటాక్ష వీక్షణామృత వర్షంలో ఆకలిదప్పులు లేకుండా, కృష్ణుడి కథలు వేడుకగా చెప్పుకుంటూ వింటూ ఆ కొండ క్రింద తమ తమ స్థానాలలో ఉండిపోయారు.

తెభా-10.1-923-మ.
రిదోర్దండము గామ, గుబ్బశిఖరం, బాలంబి ముక్తావళుల్
రఁగం జారెడు తోయబిందువులు, గోపాలాంగ నాపాంగ హా
రుచుల్ రత్నచయంబు గాఁగ, నచలచ్ఛత్రంబు శోభిల్లెఁ ద
ద్గిరిభిద్దుర్మదభంజి యై జలధరాఖిన్న ప్రజారంజి యై.

టీక:- హరి = కృష్ణుని; దోర్దండము = భుజాదండము అనెడి; కామ = చత్రదండము, కఱ్ఱ, కాడ; గుబ్బ = గొడుగు పైనుండు గుండ్రని భాగము, మొగ్గ యను; శిఖరంబున్ = శృంగము నుండి; ఆలంబి = వేలాడుతున్న; ముక్త = ముత్యముల; ఆవళుల్ = సరములు వలె; పరగన్ = ప్రసిద్ధ మగుచు; జారెడు = కారుతున్న; తోయ = నీటి; బిందువులు = బొట్లు; గోపాల = గోపికా; అంగన = స్త్రీల; అపాంగ = కడగంటి చూపులతోటి; హాస = చిరునవ్వుల; రుచుల్ = కాంతులు; రత్న = రత్నముల; చయంబున్ = సమూహముల; కాగన్ = అగునట్లుగా; అచల = కొండ యనెడి; ఛత్రంబు = గొడుగు; శోభిల్లెన్ = విలసిల్లెను; తత్ = ఆ యొక్క; గిరిభిత్ = ఇంద్రుని {గిరిభిత్ - గిరి (పర్వతములు) భిత్ (భేదించినవాడు), ఇంద్రుడు}; దుర్మద = దురహంకారమును; భంజి = భంగపరచునది; ఐ = అయ్యి; జలధరా = మేఘములచేత; ఖిన్న = ఖేదము పొందిపడిన; ప్రజా = జనులకు; రంజి = సంతోషము కలిగించునది; ఐ = అయ్యి.
భావము:- అలా శ్రీకృష్ణుడు ధరించిన గోవర్ధనగిరి అనే గొడుగు, పర్వతాలను భేదించే దేవేంద్రుడి దురహంకారాన్ని భంజిస్తూ; ప్రళయమేఘాల జలధారలచే స్రుక్కిన ప్రజలను రంజిస్తూ; ప్రకాశించింది. ఆ కొండ గొడుగునకు పురుషోత్తముని భుజాదండమే కఱ్ఱ; శిఖరమే గుబ్బ చక్కగా జారుతున్న జలబిందువులే నాలుగు ప్రక్కలా వేలాడుతున్న ముత్యాల సరములు; గోపికల కడగంటి చూపుతో కూడిన చిరునవ్వుల జిలుగులే రత్నాల వెలుగులు.

తెభా-10.1-924-క.
రాజీవాక్షునిచే నొక
రాజీవముభంగి శైలరాజము మెఱసెన్;
రాజేంద్ర! మీఁద మధుకర
రాజి క్రియన్ మేఘరాజి రాజిల్లెఁ గడున్.

టీక:- రాజీవాక్షుని = కృష్ణుని {రాజీవాక్షుడు - రాజీవ (కలువలవంటి) అక్షుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు}; చేన్ = చేతి యందు; ఒక = ఒకానొక; రాజీవము = తామరపువ్వు; భంగిన్ = వలె; శైల = కొండలలో; రాజము = శ్రేష్ఠము; మెఱసెన్ = ప్రకాశించెను; రాజేంద్రా = మహారాజా; మీదన్ = పైనున్న; మధుకర = తుమ్మెదల; రాజి = సమూహముల; క్రియన్ = వలె; మేఘ = మేఘముల; రాజి = సమూహము; రాజిల్లెన్ = ప్రకాశించెను; కడున్ = మిక్కిలి.
భావము:- ఓ పరీక్షన్మహారాజా! పద్మాక్షుని చేతిలో ఉన్న ఆ పర్వతరాజము మీద ఉన్న మేఘాలుతో, తుమ్మెదల గుంపు ముసిరినట్లున్న పద్మం వలె శోభిల్లింది.

తెభా-10.1-925-క.
డిగొని బలరిపు పనుపున
నుడుగక జడి గురిసె నే డహోరాత్రము; ల
య్యె గోపజనులు బ్రతికిరి
డిఁ దడియక కొండగొడుగు చాటున నధిపా!

టీక:- వడిగొని = తీవ్రమైనదై; బలరిపు = ఇంద్రునియొక్క {బలరిపు - బలాసురుని శత్రువు, ఇంద్రుడు}; పనుపున = ఆనతిచేత; ఉడుగక = వదలకుండ; జడిన్ = జడివాన; కురిసెన్ = కురిసినది; ఏడు = ఏడు (7); అహోరాత్రములు = రాత్రింబగళ్ళు; ఆ = ఆ యొక్క; ఎడన్ = సమయమునందు; గోప = యాదవ; జనులు = ప్రజలు; బ్రతికిరి = రక్షింపబడిరి; జడిన్ = వానజల్లులకు; తడియకన్ (దడియకన్) = తడిసిపోకుండ (బెదరిపోకుండ); కొండ = పర్వతము అనెడి; గొడుగు = గొడుగు; చాటునన్ = మఱుగునందు; అధిపా = రాజా.
భావము:- మహారాజా! బలుడు అనే రాక్షసుడి సంహరించిన దేవేంద్రుడి అజ్ఞ ప్రకారం ఎడతెరిపి లేకుండా ఏడు పగళ్ళు, ఏడు రాత్రులు భోరున జడివాన కురిసింది. గొడుగులా కాసిన ఆ కొండ మాటున గొల్లలు అందరూ ఏమాత్రం తడవకుండా, దడవకుండా బతికిపోయారు.

తెభా-10.1-926-వ.
ఇట్లు హరి యే డహోరాత్రంబులు గిరి ధరించిన గిరిభేది విసిగి వేసరి కృష్ణు చరితంబులు విని వెఱఁగుపడి విఫలమనోరథుండై మేఘంబుల మరలించుకొని చనియె నంత నభోమండలంబు విద్యోతమాన ఖద్యోతమండలం బగుట విని గోవర్థనధరుండు గోపాలకుల కిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; హరి = కృష్ణుడు; ఏడు = ఏడు (7); అహోరాత్రంబులున్ = రాత్రిబగళ్లు; గిరిన్ = కొండను; ధరించినన్ = మోయగా; గిరిభేది = ఇంద్రుడు {గిరిభేది - పర్వతములను భేదించినవాడు, ఇంద్రుడు}; విసిగివేసరి = మిక్కిలి విసిగిపోయి; కృష్ణు = కృష్ణుని యొక్క; చరితంబులు = వర్తనలు; విని = విని; వెఱగుపడి = ఆశ్చర్యముచెంది; విఫలమనోరథుండు = వ్యర్థ యత్నము కలవాడు; ఐ = అయ్యి; మేఘంబులన్ = మేఘములను; మరలించుకొని = వెనుకకు పిలుచుకొని; చనియెన్ = వెళ్ళిపోయెను; అంతన్ = అంతట; నభోమండలంబు = ఆకాశము; విద్యోతమాన = ప్రకాశించుచున్నట్టి; ఖద్యోత = సూర్య; మండలంబు = మండలము కలది; అగుటన్ = ఐ యుండుటను; విని = విని; గోవర్దనధరుండు = కృష్ణుడు {గోవర్దనధరుడు - గోవర్దనపర్వతము మోసినవాడు, కృష్ణుడు}; గోపాలకుల్ = గొల్లవారల; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- హరి గోవర్ధనగిరిని అలా ఏడు రోజులు ధరించాడు. పర్వత భండనుడైన ఇంద్రుడు విసిగి వేసారి శ్రీ కృష్ణుడి వీరచరితం విని విస్మయం చెందాడు. అతడు తన ప్రయత్నము వమ్ము కావడంతో వెనుదిరిగి మేఘాలను మళ్ళించుకుని వెళ్ళిపోయాడు. వాన వెలియగానే గగనతలం సూర్యకాంతితో పరిఢవిల్లింది. అప్పుడు ఆ గోవర్దనగిధారి గొల్లలతో ఇలా అన్నాడు.

తెభా-10.1-927-క.
"ఉడిగెను వానయు గాలియు
డిచెడి నదులెల్లఁ బొలుప ఱద లిగిరెఁ; గొం
డుగున నుండక వెడలుఁడు
కొడుకులుఁ గోడండ్రు సతులు గోవులు మీరున్. "

టీక:- ఉడిగెను = వదిలినది; వానయున్ = వర్షము; గాలియు = గాలి; వడి = ప్రవాహతీవ్రత; చెడి = తగ్గిపోయి; నదులు = నదులు; ఎల్లన్ = అన్నిటి యందు; పొలుపన్ = చక్కన కాగా; వఱదలు = పొంగిపొర్లిపోవుటలు; ఇగిరెన్ = ఇంకిపోయినవి; కొండ = పర్వతము; అడుగునన్ = కింద; ఉండకన్ = ఉండకుండా; వెడలుడు = బయటకురండి; కొడుకులు = పుత్రులు; కోడండ్రున్ = కోడళ్ళు; సతులు = స్త్రీలు; గోవులున్ = పశువులు; మీరున్ = మీరు.
భావము:- “వాన వెలసిపోయింది; గాలి నిలచిపోయింది; నదుల ఉరవడి తగ్గింది; వరదలు ఆగిపోయాయి; కొండ అడుగున ఇక ఉండకండి; మీ కొడుకులతో, కోడళ్ళతో, కులకాంతలతో, గోవులతో బయటకు వచ్చేయండి.”

తెభా-10.1-928-వ.
అనిన విని సకల గోపజనులు శకటాద్యుపకరణ సమేతులై గోవులుం దారును గొండ యడుగు విడిచివచ్చి రచ్యుతుండును జెచ్చెరఁ దొల్లింటి యట్ల నిజస్థానంబున గిరినిలిపె; నంత వల్లవులెల్లం గృష్ణునిఁ గౌగలించుకొని సముచిత ప్రకారంబుల సంభావించి దీవించిరి; గోపికలు సేసలిడి, దధ్యన్నకబళంబు లొసంగుచు నాశీర్వదించిరి; నంద బలభద్ర రోహిణీ యశోద లాలింగనంబుజేసి భద్రవాక్యంబులు పలికిరి; సిద్ధసాధ్యగంధర్వవరులు విరులుగురియించిరి సురలు శంఖ దుందుభులు మ్రోయించిరి; తుంబురు ప్రముఖులయిన గంధర్వులు పాడి; రప్పుడు.
టీక:- అనినన్ = అని చెప్పగా; విని = విని; సకల = అందరు; గోప = యాదవ; జనులున్ = ప్రజలు; శకట = బండ్లు; ఆది = మున్నగు; ఉపకరణ = సాధనములతో; సమేతులు = కూడినవారు; ఐ = అయ్యి; గోవులున్ = పశువులు; తారునున్ = వారు; కొండ = కొండ; అడుగు = కింద ప్రదేశమును; విడిచి = వదలివేసి; వచ్చిరి = వచ్చితిరి; అచ్యుతుండును = కృష్ణుడు {అచ్యుతుడు - చ్యుతము లేనివాడు, విష్ణువు}; చెచ్చెరన్ = శీఘ్రముగా; తొల్లిటి = ఇంతకుముందున్న; అట్ల = విధముగనే; నిజస్థానంబునన్ = స్వస్థానమునందు; గిరిన్ = కొండను; నిలిపెన్ = నిలబెట్టెను; అంతన్ = అప్పుడు; వల్లవులు = గోపకులు; ఎల్లన్ = అందరు; కృష్ణున్ = కృష్ణుని; కౌగలించుకొని = ఆలింగనముచేసి; సముచిత = తగిన; ప్రకారంబుల = విధముగ; సంభావించి = గౌరవించి; దీవించిరి = ఆశీర్వదించిరి; గోపికలు = గొల్లస్త్రీలు; సేసలు = అక్షతలు; ఇడి = వేసి; దధి = పెరుగు; అన్న = అన్నపు; కబళంబులున్ = ముద్దలు; ఒసంగుచు = ఇచ్చుచు; ఆశీర్వదించిరి = దీవించిరి; నంద = నందుడు; బలభద్ర = బలరాముడు; రోహిణీ = రోహిణీదేవి; యశోదలు = యశోదాదేవి; ఆలింగనంబు = కౌగలించుకొనుట; చేసి = చేసి; భద్ర = శుభకరమైన; వాక్యంబులున్ = పలుకులు; పలికిరి = పలికిరి; సిద్ధ = సిద్ధులు; సాధ్య = సాధ్యులు; గంధర్వ = గంధర్వ; వరులు = ఉత్తములు; విరులున్ = పూలను; కురియించిరి = వర్షించిరి; సురలు = దేవతలు; శంఖ = శంఖములు; దుందుభులు = భేరీలు; మ్రోయించిరి = వాయించిరి; తుంబురు = తుంబురుడు; ప్రముఖులు = మొదలైనవారు; గంధర్వులు = గంధర్వులు; పాడిరి = పాటలు పాడిరి; అప్పుడు = ఆ సమయము నందు.
భావము:- అలా చెప్తున్న కృష్ణుడి మాటలు విని, గోపకులందరూ బండ్లూ మొదలైన సాధనాలతో, ఆవులతో, కొండ క్రింద నుండి బయటకు వెంటనే వచ్చేసారు. శ్రీ కృష్ణుడు శీఘ్రంగా అ పర్వతాన్ని ఇదివరకటిలా యధాస్థానంలో ఉంచాడు. అంతట గోపకు లందరూ అచ్యుతుణ్ణి ఆలింగనం చేసుకుని తగు విధంగా సన్మానించి దీవించారు; యాదవకాంతలు అక్షతలు చల్లి పెరుగన్నం ముద్దలు తినిపిస్తూ దీవించారు; నందుడు, బలరాముడు, రోహిణి, యశోద, కృష్ణుణ్ణి కౌగలించుకుని శుభవాక్యాలు పలికారు; సిద్ధులు, సాధ్యులు, గంధర్వులూ పూలవాన కురిపించారు; వేల్పులు శంఖాలూ, దుందుభులూ మోగించారు; తుంబురుడు మొదలైన గంధర్వ గాయకులు గానాలు చేసారు.

తెభా-10.1-929-క.
ల్లవకాంతలు దన కథ
లెల్లను బాడంగ నీరజేక్షణుఁ డంతన్
ల్లవబలసంయుతుఁడై
ల్లన గోష్ఠంబుఁ జేరె వనీనాథా!

టీక:- వల్లవ = గోపికా; కాంతలు = స్త్రీలు; తన = తన యొక్క; కథలు = కథలు; ఎల్లన్ = అన్నిటిని; పాడంగ = పాడుతుండగ; నీరజేక్షణుడు = కృష్ణుడు {నీరజేక్షణుడు - నీరజ (పద్మములవంటి) ఈక్షణుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు}; అంతన్ = అంతట; వల్లవ = గోపకులు; బల = బలరాములతో; సంయుతుడు = కూడినవాడు; ఐ = అయ్యి; అల్లన = మెల్లిగా; కోష్ఠంబున్ = మందను; చేరెన్ = చేరెను; అవనీనాథా = రాజా {అవనీనాథుడు - అవని (భూమికి) నాథుడు, రాజు}.
భావము:- ఓ పరీక్షన్మహారాజా! యాదవాంగనలు తన గాధలన్నీ గానం చేస్తుండగా ఆ పద్మనేత్రుడు కృష్ణుడు గొల్లలతో గోవులతో కలిసి మెల్లగా వ్రేపల్లె చేరుకున్నాడు.