పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/కృష్ణునికి జాతకర్మ చేయుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తెభా-10.1-173-వ.
అంత మందలో నందుండు నందనుండు పుట్టుట యెఱింగి, మహానందంబున నెఱవాదులగు వేదవిదులం బిలిపించి, జలంబులాడి, శుచియై, శృంగారించుకొని, స్వస్తి పుణ్యాహవాచనంబులు చదివించి, జాతకర్మంబు జేయించి, పితృదేవతల నర్చించి, క్రేపులతోడఁగూడఁ గైజేసిన పాఁడిమొదవుల రెండులక్షలను, గనక కలశ మణి వసన విశాలంబులైన తిల శైలంబుల లేడింటిని భూదేవతల కిచ్చిన.
టీక:- అంతన్ = అప్పుడు; మంద = వ్రేపల్లె; లోన్ = అందు; నందుండు = నందుడు; నందనుండు = పుత్రుడు; పుట్టుట = జన్మించుట; ఎఱింగి = తెలిసికొని; మహా = గొప్ప; ఆనందంబునన్ = సంతోషముతో; నెఱవాదులు = మిక్కిలి విద్వాంసులు; అగు = ఐన; వేదవిదులన్ = వేదపండితులను; పిలిపించి = రావించి; జలంబులాడి = స్నానములు చేసి; శుచి = పరిశుద్ధుడు; ఐ = అయ్యి; శృంగారించుకొని = అలంకరించుకొని; స్వస్థిపుణ్యాహవాచనంబులు = అశుద్ధి నివారక కర్మము, మంగళార్థము మూడుమారులు చెప్పెడు శుభకర్మము(ఆంధ్రశబ్దరత్నాకరము, ఆంధ్రవాచస్పతము); చదివించి = పఠింపజేసి; జాతక్రమంబున్ = పుట్టినప్పుడు జేయుకర్మ {జాతకర్మము - వ్యు. జ్యాతే కర్మ, షోడశకర్మములలో శిశువు పుట్టినప్పుడు చేయు కర్మము}; చేయించి = చేయించి {షోడశకర్మములు - 1గర్భాదానము 2పుంసవనము 3సీమంతము 4జాతకర్మము 5నామకరణము 6అన్నప్రాసన 7చౌలము 8ఉపనయనము 9ప్రాజాపత్యము 10సౌమ్యము 11ఆగ్నేయము 12వైశ్వేదేవము 13గోదానము 14సమావర్తము 15వివాహము 16అంత్యకర్మము}; పితృదేవతలన్ = పితృదేవతలను {పితృదేవతలు - వసురుద్రాది రూపులైన అగ్నిష్వాత్తుడు కవ్యవాహనుడు మొదలైనవారు}; అర్చించి = పూజించి; క్రేపుల = దూడల; తోడన్ = తో; కూడన్ = పాటు; కైచేసిన = అలంకరించిన; పాడి = పాలిచ్చెడి; మొదవులన్ = ఆవులను; రెండులక్షలను = రెండులక్షలను (2,00,000); కనక = బంగారు; కలశ = కుండలచేతను; మణి = రత్నములచేతను; వసన = వస్త్రములచేతను; విశాలంబులు = విరివిగా చేయబడినవి; ఐన = అగు; తిల = నువ్వుల; శైలంబులన్ = పెద్ద కుప్పలను; ఏడింటిని = ఏడింటిని (7); భూదేవతల్ = విప్రుల; కిన్ = కు; ఇచ్చినన్ = దానముచేయగా.
భావము:- ఇది ఇలా ఉండగా అక్కడ వ్రేపల్లెలో నందుడు తనకు కొడుకు పుట్టాడని విని, మహానందం పొందాడు. వేదపండితులు అయిన బ్రాహ్మణులను పిలిపించాడు. తాను శుచిగా స్నానాలు చేసి, అలంకరించుకున్నాడు. బ్రాహ్మణుల చేత స్వస్తివాచకాలు శుభాశీస్సులు పుణ్యాహవచనాలు చేయించాడు. బాలుడికి శుభకర్మలు చేయించాడు. పితృదేవతలకు తృప్తిగా పూజలు చేసాడు. రెండు లక్షల (2,00,000) పాడిఆవులను ఆభరణాలతో అలంకరించి దూడలతో సహా బ్రాహ్మణులకు దానాలు చేసాడు. పెద్ద పెద్ద నువ్వుల రాసులు ఏడింటితో (7) పాటు బంగారు చెంబులు, రత్నాభరణాలు, నూతన వస్త్రాలు దానం చేసాడు.

తెభా-10.1-174-క.
"ఈ యాభీరకుమారుఁడు
శ్రీయుతుడై, వీర వైరిజేతయునై, దీ
ర్ఘాయుష్మంతుం డగు"నని
పాక దీవించి రపుడు బ్రాహ్మణ జనముల్.

టీక:- ఈ = ఈ; ఆభీర = గొల్ల; కుమారుడు = పిల్లవాడు; శ్రీ = సంపదలతో; యుతుడు = కూడినవాడు; ఐ = అయ్యి; వీర = శూరులైన; వైరి = శత్రువులను; జేతయున్ = జయించినవాడు; ఐ = అయ్యి; దీర్ఘ = ఎక్కువ; ఆయుష్మంతుడు = ఆయుష్షు కలవాడు; అగును = అగుగాక; అని = అని; పాయక = తప్పక; దీవించిరి = ఆశీర్వదించిరి; అపుడు = అప్పుడు; బ్రాహ్మణ = విప్రులైన; జనముల్ = వారు.
భావము:- బ్రాహ్మణులు అందరూ “ఈ నందగోపకుమారుడు సమస్త సంపదలతో; తులతూగగలడు; శత్రు వీరులను జయించగలడు; దీర్ఘాయుష్మంతుడు కాగలడు.” అని గట్టిగా దీవించారు.

తెభా-10.1-175-క.
దుందుభులు మొరసె; గాయక
సందోహము పాడె; సూతముదాయముతో
వందిజనులు కీర్తించిరి;
క్రందుగ వీతెంచె భద్రకాహళ రవముల్.

టీక:- దుందుభులు = నగరాలు, భేరీలు; మొరసెన్ = మోగినవి; గాయక = గానములు చేసెడివారి; సందోహము = సమూహము; పాడెన్ = ఆలపించెను; సూత = పొగడువారి; సముదాయము = సమూహముల; తోన్ = తోటి; వందిజనులు = స్తుతించువారు; కీర్తించిరి = స్తోత్రములు చేసిరి; క్రందుగన్ = సందడిగా; వీతెంచెన్ = వినబడెను; భద్ర = మంగళకరములైన; కాహళ = పెద్ద బాకాల; రవముల్ = ధ్వనులు.
భావము:- ఆ వ్రేపల్లెలో దుందుభులు మ్రోగించారు. గాయకులు ఆనందంతో పాటలు పాడారు. సూతులు వందిజనులు స్తోత్రాలతో కీర్తించారు. భద్రంకరములు అయిన బాకాల మోతలు చెవుల కింపుగా వినిపించాయి.

తెభా-10.1-176-క.
ల్లవ తోరణసురుచిర
ల్లీధ్వజరాజిధూపవాసనములతో,
ల్లలితములై యొప్పెను
ల్లవవల్లభుల యిండ్ల వాకిం డ్లెల్లన్

టీక:- పల్లవ = చిగురుటాకుల; తోరణ = వరుసలు కట్టినవానితోను; సురుచిర = చక్కనైన; వల్లీ = తీగలు గల; ధ్వజ = జండాల; రాజి = సమూహములతోను; ధూప = సాంబ్రాణి మున్నగువాని; వాసనముల = సువాసనల; తోన్ = తోటి; సల్లలితములు = మిక్కిలి మనోజ్ఞమైనవి; ఐ = అయ్యి; ఒప్పెన్ = చక్కగా ఉండెను; వల్లవ = గొల్లల, యాదవుల; వల్లభలు = శ్రేష్ఠుల; ఇండ్ల = నివాసముల; వాకిండ్లు = వాకిళ్ళు; ఎల్లన్ = అన్నియును.
భావము:- గొల్లనాయకుల ఇండ్లువాకిళ్ళు చిగురుటాకుల తోరణాలతో మనోహరములైన తీగలతో గొప్ప కేతనములతో ధూపముల పరిమళములతో ఇంపుగొల్పుతున్నవి.

తెభా-10.1-177-క.
సుపులు నూనెలు నలఁదిన
సఁ దనరి, సువర్ణ బర్హి ర్హ ప్రభతోఁ
సిమి గలిగి, వెలుగొందుచుఁ,
సు లన్నియుఁ మందలందుఁ బ్రసరించె, నృపా!

టీక:- పసువులు = పసుపు కుంకుమ గంధములు; నూనెలు = చమురులు; అలదిన = రాసినట్టి; పసన్ = చాతుర్యముచేత; తనరి = అతిశయించి; సువర్ణ = బంగారపు; బర్హి = నెమళ్ళ; బర్హ = పింఛముల; ప్రభ = కాంతుల; తోన్ = తోటి; బసిమిన్ = నవకము, అందము; కలిగి = కలవై; వెలుగొందుచున్ = ప్రకాశించుచు; పసులు = ఆవులు; అన్నియున్ = ఎల్లను; మందలు = గొల్లపల్లెల; అందున్ = లో; ప్రసరించెన్ = మెలగెను; నృపా = రాజా.
భావము:- గోపకులు అందరూ తమ పశువుల శరీరాలకు పసుపు నూనె కలిపి పట్టించారు. ఆ పశువులు బంగారురంగు నెమలిపింఛముల లాగ పచ్చని పసిమిరంగుతో వెలుగొందుతూ మందలలో చిందులు వేశాయి.

తెభా-10.1-178-క.
క్రేళ్ళుఱికి మసలె లేఁగలు;
ల్లడిగొని ఱంకె లిడియె దవృషభంబుల్;
పెల్లుగ మొదవులు పొదుఁగుల
ల్లించెం బాలు, బాలుసంభవవేళన్

టీక:- క్రేళ్ళు = చెంగుమని; ఉఱికి = దూకుచూ; మసలెన్ = మెలగెను; లేగలు = లేగదూడలు; మల్లడిగొని = మత్తెక్కి; ఱంకెలు = రంకెలు (ఎద్దు అరుపు); ఇడియెన్ = వేసినవి; మద = మదించిన; వృషభంబులు = ఎద్దులు; పెల్లుగన్ = అధికముగా; మొదవులు = ఆవులు; పొదుగులన్ = పొదుగులనుండి; జల్లించెన్ = కురిపించెను; పాలు = క్షీరములను, పాలను; బాలు = బాలకృష్ణుని; సంభవ = జన్మించిన; వేళన్ = సమయమునందు.
భావము:- బాలుడు కలిగిన సమయంలో ఆ మందలలోని లేగదూడలు చెంగున గంతులు వేశాయి. పోతరించిన వృషభాలు ఉత్సాహంతో ఖణిల్లు మని ఱంకెలు వేశాయి. ఆవులు పుష్కలంగా పాలు వర్షించాయి.

తెభా-10.1-179-క.
రఁగఁ జదివెడి పొగడెడి
వారికి, విద్యలను బ్రతుకువారికి, లేమిం
జేరిన వారికి నెల్లను
గోక మును నందు డిచ్చె గోధనచయముల్.

టీక:- ఆరగన్ = నిండుగా; చదివెడి = పఠించెడి; పొగడెడి = స్తుతించెడి; వారి = వారల; కిన్ = కు; విద్యలను = విద్యలు చూపుట ద్వారా; బ్రతుకు = జీవికసాగించెడి; వారి = వారల; కిన్ = కు; లేమిన్ = పేదరికమువలన; చేరిన = ఆశ్రయించిన; వారి = వారల; కిన్ = కు; ఎల్లను = అందరకు; కోరక = అడుగక; ముందే = ముందుగనే; నందుడు = నందుడు; ఇచ్చెన్ = దానము చేసెను; గో = ఆవుల; ధన = ధనముల; చయముల్ = సమూహములను.
భావము:- నందుడు ఆ సమయంలో తృప్తిగా దానాలు చేసాడు. ప్రతిదినమూ వచ్చి పుణ్యకథలు వినిపించే బ్రాహ్మణులకూ, స్తోత్రపాఠాలుచేసే వందిగాయకులకూ, గారడీలు ఇంద్రజాలాలు పగటివేషాలు మొదలైన విద్యలపై బ్రతికేవారికి, దారిద్ర్యంతో బాధపడుతూ దరిచేరినవారికి, అందరికి వారు అడగక ముందే గోవులను ధనాన్ని కొల్లలుగా దానం చేసాడు.

తెభా-10.1-180-వ.
ఆ సమయంబున.
టీక:- ఆ = ఆ; సమయంబునన్ = సమయమునందు.
భావము:- ఆనాడు . . . .

తెభా-10.1-181-క.
కంచుకములు, తలచుట్లును,
గాంన భూషాంబరములుఁ, డు మెఱయఁగ నే
తెంచిరి, గోపకు లందఱు
మంచి పదార్థములు గొనుచు మాధవుఁ జూడన్.

టీక:- కంచుకములు = చొక్కాలు, అంగీలు, ఱవికెలు; తలచుట్లును = తలపాగాలు; కాంచన = బంగారు; భూష = ఆభరణములు; అంబరములు = వస్త్రములు; కడు = మిక్కిలి; మెఱయగన్ = ప్రకాశించుచుండగా; ఏతెంచిరి = వచ్చిరి; గోపకులు = గొల్లలు; అందఱున్ = ఎల్లరు; మంచి = మేలైన; పదార్థములున్ = వస్తువులను; కొనుచు = తీసుకొని వచ్చి; మాధవున్ = శ్రీకృష్ణుని {మాధవుడు - మాధవి భర్త, కృష్ణుడు}; చూడన్ = చూచుటకు.
భావము:- గోపకులందరూ నందుని నందనుణ్ణి చూడడానికి బయలుదేరారు; అందరూ అంగీలు తొడుక్కున్నారు; తలపాగాలు చుట్టుకున్నారు; బంగారు అభరణాలు, అందమైన దుస్తులు ధరించారు; అందరూ శుభకరములైన పదార్థాలు తీసుకుని నందుని ఇంటికి వచ్చారు; ఆ పుట్టిన వాడు లక్ష్మిదేవికి భర్త కనుక అందరూ సంపదలతో తులతూగుతూ వచ్చారు.

తెభా-10.1-182-క.
తెంచి, చూచి చెలఁగుచు
నేతులఁ, బెరుఁగులను, బాల, నీళ్ళను, వెన్నం
బ్రీతి వసంతము లాడిరి
యేరులై, సరసభాష లెసగన్ గొల్లల్.

టీక:- ఏతెంచి = వచ్చి; చూచి = చూసి; చెలగుచున్ = చెలరేగుచు; నేతులన్ = నేతితోను; పెరుగులనున్ = పెరుగుతోను; పాలన్ = పాలతోను; నీళ్ళనున్ = నీళ్ళతోను; వెన్నన్ = వెన్నతోను; ప్రీతిన్ = ఇష్టముగా; వసంతములు = ఒకరిపై నొకరు జల్లుకొనుట, వసంతోత్సవములు; ఆడిరి = ఆటలు ఆడిరి; ఏతరులు = తుళ్ళుతున్నవారు; ఐ = అయ్యి; సరస = సరసపు; భాషలు = మాటలు; ఎసగన్= విజృంభించగా; గొల్లలు = యాదవులు.
భావము:- అలావచ్చి ఆ బాలుని చూసి గోపకులు అందరూ ఆనందముతో పొంగిపోతున్నారు; ఉత్సాహంతో చెలరేగి నేతులను పెరుగులను పాలను నీళ్ళను వెన్నను ఒకరిపై ఒకరు చిమ్ముకుంటూ ఛలోక్తులు విసురుకుంటూ వసంతోత్సవం జరుపుకున్నారు.

తెభా-10.1-183-వ.
తదనంతరంబ.
టీక:- తదనంతరంబ = ఆ తరువాత.
భావము:- అలా బాలుని చూసి ఆనందంతో పండుగ చేసుకున్న పిమ్మట.

తెభా-10.1-184-ఆ.
"మినోము ఫలమొ? యింత ప్రొ ద్దొక వార్త
వింటి మబలలార! వీను లలర;
న యశోద, చిన్నిగవానిఁ గనె నట
చూచి వత్త మమ్మ! సుదతులార! "

టీక:- ఏమి = ఎట్టి; నోము = వ్రతములు నోచిన; ఫలమొ = ఫలితముగనో; ఇంతప్రొద్దు = ఇప్పటికి; ఒక = ఒకానొక; వార్తన్ = శుభ వర్తమానమును; వింటిమి = విన్నాము; అబలలార = ఇంతులూ {అబల - బలము తక్కుగా ఉండునామె, స్త్రీ}; వీనులు = చెవులు; అలరన్ = ఆనందించగా; మన = మన యొక్క; యశోద = యశోద; చిన్ని = చంటి; మగవాని = మగపిల్లవాడిని; కనెను = ప్రసవించెను; అటన్ = అట; చూచి = చూసి; వత్తము = వచ్చెదము; అమ్మ = అమ్మ; సుదతులార = సుందరీమణులారా {సుదతి - మంచి పలువరుస కలామె, అందగత్తె}.
భావము:- "ఓ సుందరమైన చెలులారా! ప్రొద్దునే లేస్తూనే ఇంత మంచి శుభవార్త చెవులార విన్నాం, ఏనాడు నోచిన నోముల ఫలితమో గానీ; మన యశోదమ్మ చిన్న పాపడిని కన్నదట. చూసి వద్దాం సుందరీమణులు! రండి రండి"

తెభా-10.1-185-వ.
అని యొండొరుల లేపికొని, గోపిక లోపికలు లేని చిత్తంబుల నెత్తిన తత్తఱంబు లొత్తుకొన, నుదారంబులగు శృంగారంబులతో నిండ్లు వెలువడి.
టీక:- అని = అని; ఒండొరులన్ = ఒకరినొకరు; లేపికొని = బయలుదేరదీసికొనుచు; గోపికలు = గొల్లస్త్రీలు; ఓపికలు = తాలుములు, ఓర్పులు; లేని = లేనట్టి; చిత్తంబులన్ = మనసులతో; ఎత్తిన = కలిగిన; తత్తఱంబులు = తొట్రుబాటులు; ఒత్తుకొనన్ = కమ్ముకొనగా; ఉదారంబులు = విరివియైనవి; అగు = ఐన; శృంగారంబుల = అలంకారముల; తోన్ = తోటి; ఇండ్లు = తమ నివాసములనుండి; వెలువడి = బయలుదేరి.
భావము:- ఆ గోపికలు సహజంగానే సున్నితహృదయాలు గలవారు. ఈవార్త వినేసరికి తొందర ఎక్కువైంది. అపూర్వంగా అలంకారాలు చేసుకుని ఒకరి నొకరు లేవండి లేవండి అని చెప్పుకుంటూ ఇళ్ళనుండి బయలుదేరారు.

తెభా-10.1-186-క.
గతులును, బలుపిఱుదులుఁ,
బిడికెడు నడుములును, వలుఁద బిగి చనుఁగవలున్,
వెడఁద నయనములు, సిరి తడఁ
డు మోములు, భ్రమర చికుర రములు, నమరన్.

టీక:- జడగతులునున్ = మెల్లని నడకలు, జడల సొంపులు; పలు = పెద్ద; పిఱుదులున్ = పిఱ్ఱలు; పిడికెడు = పిడికిట్లో సరిపడు సన్నని; నడుములునున్ = నడుములు; వలుద = లావైన; బిగి = గట్టి, బిగువైన; చను = స్తనముల; కవలున్ = జంటలు; వెడద = వెడల్పైన; నయనములున్ = కళ్ళు; సిరి = సౌభాగ్యములు, లక్ష్మీకళలు; తడబడు = మెదలెడి, తడబడెడి; మోములున్ = ముఖములు; భ్రమర = తుమ్మెదలవంటి; చికుర = శిరోజములు; భరములున్ = విరివైనవి, అధికమైనవి; అమరన్ = అమరి ఉండగా.
భావము:- అందరికి త్వరగానే వెళ్ళాలి అని ఉన్నది కాని, విశాలమైన పిరుదులు; పొంకమైన వక్షోజాలు; పిడికిట్లో ఇమిడేటంత సన్నని నడుము; ఇంకెలా త్వరగా నడువగలరు. నెమ్మదిగా నడకలు సాగుతున్నాయి. కన్నులు మాత్రం ఆనందంతో విశాలంగా విచ్చుకున్నాయి. పెద్ద తుమ్మెద రెక్కలవలె నల్లనైన పెద్దతల కొప్పులు చక్కగా ఊగుతున్నాయి. లక్ష్మీకళలు కూడా ఆ గోపికల మోముల అందాల ముందు తడబడుతున్నాయి.

తెభా-10.1-187-ఉ.
వేడుకతోడఁ గ్రొమ్ముడులు వీడఁ, గుచోపరి హారరేఖ ల
ల్లాడఁ, గపోలపాలికల హాటకపత్రరుచుల్ వినోదనం
బాడఁ, బటాంచలంబు లసియాడఁగఁ, జేరి, యశోద యింటికిన్
జేడియ లేగి, చూచి రొగి జిష్ణుని విష్ణునిఁ జిన్నికృష్ణునిన్.

టీక:- వేడుకన్ = సరదాగా వేసిన; క్రొత్త = సరికొత్త; ముడులు = కొప్పులు; వీడన్ = సడలుతుండగా; కుచ = స్తనముల; ఉపరి = మీది; హార = హారముల; రేఖలు = వరుసలు; అల్లాడన్ = చలించుచుండగా; కపోలపాలికలన్ = చెంపల ప్రదేశము నందు; హాటక = బంగారు; పత్ర = పత్రముల; రుచుల్ = కాంతులు; వినోదనంబున్ = వేడుకగా; ఆడన్ = కదులుతుండగా; పటాంచలంబులు = పైటకొంగులు; అసియాడగన్ = వేళ్ళాడగా; చేరి = కూడి; యశోద = యశోద యొక్క; ఇంటి = నివాసమున; కిన్ = కు; చేడియలు = పడతులు; ఏగి = వెళ్ళి; చూచిరి = చూసిరి; ఒగిన్ = ఒక్కసారిగా, చక్కగా, వరుసగా; జిష్ణుని = శ్రీకృష్ణుని {జిష్ణుడు - జయించెడి శీలము కలవాడు, విష్ణువు}; విష్ణుని = శ్రీకృష్ణుని {విష్ణువు - సర్వవ్యాపకుడు, హరి}; చిన్నికృష్ణునిన్ = బాలకృష్ణుని.
భావము:- ఆతురతలు పెరిగిపోతుండటంతో అంతకంతకు పెరుగుతున్న గోపికల నడక వేగాలు నందుని ఇంటికి చేరేసరికి దాదాపు పరుగును అందుకున్నాయి. అప్పుడే వేసుకుని వచ్చిన జడముడులు విడిపోయాయి; వక్షస్థలంపైన ఉన్నహారాలు అల్లల్లాడిపోయాయి; బంగారు కర్ణపత్రాల కాంతులు వారి చెక్కిళ్ళపై కదులుతున్నాయి; పైట కొంగులు గాలిలో ఒయ్యారంగా నాట్యాలు చేసాయి; ఆవిధంగా ఆ గోపికలు యశోద ఇంటికి చేరి, ఎంతో ఉత్సాహంతో చిన్ని కృష్ణుడిని చూసారు. అతడు సకల జయశీలుడు, దానవులనే కాదు వారి హృదయాలను కూడా జయింపబోతున్న వాడు అయిన విష్ణువు కదా.

తెభా-10.1-188-వ.
చూచి సంతసించి, తెచ్చిన కానుక లిచ్చి.
టీక:- చూచి = చూసి; సంతసించి = సంతోషించి; తెచ్చిన = తీసుకొని వచ్చిన; కానుకలు = బహుమానములను; ఇచ్చి = సమర్పించి.
భావము:- గోపికలు చిన్నికృష్ణుని చూసి ఎంతో సంతోషించారు. తాము తెచ్చిన కానుకలు ఇచ్చారు.