పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/కంసునికి మంత్రుల సలహా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తెభా-10.1-163-వ.
అని యిట్లు బ్రసన్నులైన దేవకీవసుదేవుల యనుజ్ఞ వడసి, కంసుం డింటికిం జని, యా రేయి గడపి, మఱునాఁడు ప్రొద్దునం గ్రద్దనం దనకుం బరతంత్రులగు మంత్రుల రావించి, యోగనిద్ర వలనం దా వినిన వృత్తాంతం బంతయు మంతనంబున నెఱింగించిన, నపుడు వార లతని కిట్లనిరి.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; ప్రసన్నులు = అనుకూలురు; ఐన = అయినట్టి; దేవకీ = దేవకీదేవి; వసుదేవుల = వసుదేవుల; అనుజ్ఞ = సెలవు; పడసి = తీసుకొని; కంసుండు = కంసుడు; ఇంటికిన్ = తన నివాసమున; కిన్ = కి; చని = వెళ్ళి; ఆ = ఆ; రేయి = రాత్రి; గడపి = గడపి; మఱునాడు = మర్నాడు; ప్రొద్దునన్ = ఉదయమే; గ్రద్దనన్ = త్వరితముగ; తన = అతని; కున్ = కి; పరతంత్రులు = మిక్కిలి అనుకూలురు; అగు = ఐన; మంత్రులన్ = మంత్రులను; రావించి = పిలిపించి; యోగనిద్ర = యోగమాయ; వలనన్ = నుండి; తాన్ = అతను; వినిన = విన్నట్టి; వృత్తాంతంబు = వర్తమానము; అంతయున్ = అంతా; మంతనంబునన్ = ఏకాంతమున; ఎఱింగించినన్ = తెలుపగా; అపుడు = అప్పుడు; వారలు = వారు; అతని = అతని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = చెప్పిరి.
భావము:- ఇలా ప్రసన్నులు అయిన దేవకీవసుదేవుల అనుమతి తీసుకుని, కంసుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఎలాగో గడపి మరునాడు ఉదయాన్నే తన మంత్రులను పిలిపించాడు. దేవి యోగమాయ చెప్పిన విషయాలు అన్నీ వారికి చెప్పి సలహా అడిగాడు. వారు ఇలా అన్నారు.

తెభా-10.1-164-క.
"ఇట్టయినఁ దడయ నేటికి?
ట్టణముల, మందలందుఁ, ల్లెల నెల్లన్
బుట్టెడి పెరిఁగెడి శిశువులఁ
ట్టి వధించెదము; మమ్ముఁ బంపు మధీశా!

టీక:- ఇట్టయినన్ = అలా అయితే; తడయన్ = ఆలస్యము చేయుట; ఏటికిన్ = ఎందుకు; పట్టణములన్ = పురములలోను; మందలు = గొల్లపల్లెలు; అందున్ = లోను; పల్లెలన్ = పల్లెటూళ్ళలోను; ఎల్లన్ = అన్నిచోట్లను; పుట్టెడి = పుట్టినట్టి; పెరిగెడి = పెరుగుతున్నట్టి; శిశువులన్ = చంటిపిల్లలను; పట్టి = పట్టుకొని; వధించెదము = చంపెదము; మమ్మున్ = మమ్ములను; పంపుము = పంపించుము; అధీశా = నాయకుడా, రాజా.
భావము:- “అలా అయితే ఇంకా ఆలస్యం దేనికి మహారాజా! పట్టణాలు, గొల్లపల్లెలు, గ్రామాలు అన్నిటిని వెదకి పసిపాపలు ఎక్కడ పుట్టినా పెరిగినా వధించి వస్తాము మమ్మల్ని ఆజ్ఞాపించండి

తెభా-10.1-165-మ.
దీయోజ్జ్వల బాహుచాప విలసద్బాణావళీ భగ్నులై,
దివిజాధీశ్వరు లే క్రియంబడిరొ? యే దేశంబులం డాఁగిరో?
శివునిం జొచ్చిరొ? బ్రహ్మఁ జెందిరొ? హరిన్ సేవించిరో? మౌని వృ
త్తి నాంతంబుల నిల్చిరో? మనకు శోధింపం దగున్ వల్లభా!

టీక:- భవదీయ = నీ యొక్క; ఉజ్జ్వల = ప్రకాశవంతమైన; బాహు = భుజబల; చాప = ధనుస్సు నందు; విలసత్ = విలసిల్లెడి; బాణ = బాణముల; ఆవళీ = సమూహములచేత; భగ్నులు = ఒడిపోయినవారు; ఐ = అయ్యి; దివిజ = దేవతా; అధీశ్వరులు = ప్రభువులు; ఏక్రియన్ = ఎలా; పడిరో = పడిపోయారో; ఏ = ఏ; దేశంబులన్ = దేశములలో; డాగిరో = దాక్కొన్నారో; శివునిన్ = శంకరుని; చొచ్చిరొ = శరణువేడిరో; బ్రహ్మన్ = బ్రహ్మదేవుని; చెందిరొ = చేరిరో; హరిన్ = విష్ణుమూర్తిని; సేవించిరో = కొలిచిరో; మౌని = మునుల; వృత్తని = విధానమున; వనాంతంబులన్ = అడవులలో; నిల్చిరొ = వసించిరో; మన = మన; కున్ = కు; శోధింపన్ = వెతుకుట; తగున్ = యుక్తమైనపని; వల్లభా = రాజా.
భావము:- మహారాజా! భయంకరంగా ప్రకాశిస్తున్ననీ బాహువులతో ప్రయోగించిన బాణాల దెబ్బలు తిన్న దేవతాప్రభువులు ఏమైపోయారో? ఎక్కడ తలదాచుకున్నారో? శివుని ఆశ్రయించారేమో? లేక బ్రహ్మనో విష్ణువునో సేవిస్తున్నారేమో? అదీ కాకపోతే మునివృత్తులను స్వీకరించి నిరాశతో అరణ్యాలమధ్యలో ఉండిపోయారేమో? మనం వెదకడం మంచిది.

తెభా-10.1-166-క.
నొచ్చిరి శాత్రవు లనుచును
విచ్చలవిడిఁ దిరుగ వలదు, వివిధాకృతులన్
మ్రుచ్చిలి వత్తురు; వారలు
చ్చిన యందాఁక మఱవఁ న దధిపునకున్.

టీక:- నొచ్చిరి = దెబ్బతిన్నారు; శాత్రవులు = వైరులు; అనుచునున్ = అనుకొనుచు; విచ్చలవిడిన్ = స్వేచ్ఛగా; తిరుగన్ = సంచరించుట; వలదు = పనికిరాదు; వివిధ = అనేక విధములైన; ఆకృతులన్ = రూపములలో; మ్రుచ్చిలి = మోసపుచ్చి; వత్తురు = వచ్చెదరు; వారలున్ = వారు; సచ్చిన = చచ్చిపోయే; అందాక = వరకు; మఱవన్ = ఉపేక్షించుట; చనదు = తగదు; అధిపున్ = రాజున; కున్ = కు.
భావము:- శత్రువులు దెబ్బతిన్నారు కదా! అనుకుని విచ్చలవిడిగా తిరగరాదు. వారు ఎన్నో రకాల వేషాలతో దొంగతనంగా రాగలరు. వారు చచ్చిపోయేటంతవరకు రాజైనవాడు వారిని మరచిపోరాదు.

తెభా-10.1-167-క.
త్తికొనుచు రానీఁజనఁ
దెత్తిన రోగముల, రిపుల, నింద్రియముల ను
త్పత్తి సమయములఁ జెఱుపక
మెత్తన గారాదు; రాదు మీఁద జయింపన్.

టీక:- ఒత్తికొనుచున్ = తోసుకొనుచు; రానీన్ = రానిచ్చుట; చనదు = తగదు; ఎత్తిన = విజృంభించిన; రోగములన్ = జబ్బులను; రిపులన్ = శత్రువులను; ఇంద్రియములనున్ = ఇంద్రియములను; ఉత్పత్తి = పుట్టెడి, అంకురించిన; సమయములన్ = అప్పుడే, సమయంలోనే; చెఱుపక = నశింపజేయకుండ; మెత్తనన్ = మెత్తబడుట, ఉపేక్షించుట; కారాదు = చేయరాదు; రాదు = వీలుకాదు; మీదన్ = ఆతరువాత; జయింపన్ = లొంగదీసుకొనుటకు.
భావము:- విజృంభించిన రోగాలను, శత్రువులను, ఇంద్రియాలను అవి మనను ఆక్రమించేవరకు ఊరుకోరాదు. అవి పుట్టినప్పుడే త్రుంచివేయడంలో మెతకదనం చూపుట పనికిరాదు. ముదిరిన తరువాత జయించడం మన వల్ల కాదు.

తెభా-10.1-168-మ.
రశ్రేణికి నెల్లఁ జక్రి ముఖరుం; డా చక్రి యేధర్మమం
రున్; గోవులు, భూమిదేవులు, దితిక్షామ్నాయ కారుణ్య స
త్యములున్, యాగ తపోదమంబులును, శ్రద్ధాశాంతులున్ విష్ణుదే
ము; లిన్నింటిని సంహరించిన నతం డంతంబునుం బొందెడిన్.

టీక:- అమర = దేవతల; శ్రేణి = సమూహముల; కిన్ = కి; ఎల్లన్ = అందరకు; చక్రి = విష్ణుమూర్తి {చక్రి - చక్రాయుధము కలవాడు, హరి}; ముఖరుండు = ముఖ్యమైనవాడు; ఆ = ఆ; చక్రి = విష్ణుమూర్తి; ఏ ధర్మంబున్ = ఏయే ధర్మముల; అందున్ = అందు; అమరున్ = ఒప్పి ఉండును; గోవులు = ఆవులు; భూమిదేవతలు = బ్రాహ్మణులు; తితిక్ష = క్షాంతి, ఓర్పు; ఆమ్నాయ = వేదములు; కారుణ్య = భూతదయ; సత్యములున్ = సత్యములు; యాగ = యజ్ఞములు; తపస్ = తపస్సులు; దమంబులును = ఇంద్రియ నిగ్రహములు; శ్రద్ధ = శ్రద్ధ; శాంతులున్ = నెమ్మది తనములు; విష్ణున్ = విష్ణుమూర్తి; దేహములు = స్వరూపములు; ఇన్నిటిన్ = ఇన్నిటిని; సంహరించినన్ = నాశనము చేసినచో; అతండున్ = అతడు; అంతంబున్ = నాశనమును; పొందెడిన్ = పొందగలడు.
భావము:- దేవతలు అందరకీ ఆ విష్ణువే ముఖ్యుడు. అతడు ధర్మము నందు నిలచి ఉంటాడు. విష్ణువును సంహరించాలంటే అతని శరీరం మనకి దొరకాలి. అది ఒక్కచోట దొరకదు. అతనికి ఎన్నోశరీరాలు ఉన్నాయి. గోవులు, బ్రాహ్మణులు, వేదములు, ఓరిమి, కారుణ్యము, సత్యము, యాగము, తపస్సు, దమము, శ్రద్ధ, శాంతి ఇవన్నీ విష్ణువు యొక్క శరీరాలే. వీటిని అన్నింటినీ అంతంచేస్తే అతడు కూడా నిలువనీడలేక నశించిపోతాడు.

తెభా-10.1-169-వ.
కావున.
టీక:- కావునన్ = కనుక.
భావము:- మంచిని మట్టుపెడితే విష్ణువు నశించిపోతాడు కనుక . . .

తెభా-10.1-170-ఉ.
చంపుదుమే నిలింపులను? జంకెల ఱంకెలఁ దాపసావళిం
బంపుదుమే కృతాంతకుని పాలికిఁ? గ్రేపులతోడ గోవులం
ద్రుంపుదుమే? ధరామరులఁ దోలుదుమే? నిగమంబులన్ విదా
రింపుదుమే? వసుంధర హరింపుదు మే? జననాథ! పంపుమా. "

టీక:- చంపుదుమే = వధించమంటావా; నిలింపులను = దేవతలను, బ్రహ్మవేత్తలని; జంకెలన్ = అదలించుటలతో; ఱంకెలన్ = బొబ్బలు అరుపులతో; తాపస = ఋషుల; ఆవళిన్ = సమూహములను; పంపుదుమే = పంపించమంటావా; కృతాంతకుని = యముని; పాలి = వద్ద; కిన్ = కి; క్రేపుల = దూడల; తోడన్ = తోపాటు; గోవులన్ = ఆవులను; త్రుంపుదుమే = నరకమంటావా; ధరామరులన్ = బ్రాహ్మణులను {ధరామరులు - ధర (భూమి)పై అమరులు (దేవతలు), విప్రులు}; తోలుదుమే = తరిమేయమంటావా; నిగమంబులన్ = వేదములను; విదారింపుదుమే = భేదించమంటావా; వసుంధరన్ = భూమిని; హరింపుదుమే = అపహరించమందువా; జననాథ = రాజా; పంపుమా = ఆజ్ఞాపింపుము.
భావము:- మహారాజా! దేవతలను చంప మంటావా? తపస్సు చేసుకునే మునులను భీకర గర్జనలతో యముని వద్దకు పంపేయ మంటావా? దూడలతో కూడా గోవులను నరికివేయ మని అంటావా? బ్రాహ్మణులను తరిమి తరిమి కొట్టమంటావా? లేక వేదాలను చింపివేయమంటావా? అదీకాకపోతే, భూమినే చుట్టచుట్టి తెచ్చి నీ వశంలో ఉంచమంటావా? ఏమి చేయమంటావో మమ్మల్ని ఆజ్ఞాపించు.”

తెభా-10.1-171-వ.
అని పలుకు మంత్రుల మంత్రంబుల నిమంత్రితుండై, బ్రాహ్మణ నిరోధంబు నిషిద్ధం బని తలంపక కాలపాశబద్ధుండయి, విప్రాది సాధుమానవులఁ జంప దానవులం బంపి, యంతిపురంబునకుం జనియె; ననంతరంబ యా రక్కసులు వెక్కసంబు లగు మొక్కలంబుల సజ్జనుల పజ్జలం బడి, తర్జన గర్జన భర్జనాది దుర్జనత్వంబులం జేసి, నిర్జించి పాపంబు లార్జించిరి.
టీక:- అని = అని; పలుకు = బోధించెడి; మంత్రులన్ = మంత్రుల యొక్క; మంత్రంబులన్ = ఆలోచనలచేత; నిమంత్రితుండు = ప్రభావములో పడినవాడు; ఐ = అయ్యి; బ్రాహ్మణ = బ్రహ్మణులను; నిరోధంబున్ = అడ్డగించుట; నిషేధంబున్ = కూడనిపని; అని = అని; తలపక = ఎంచకుండ; కాల = కాలము అనెడి; పాశ = పాశములకు; బద్ధుండు = చిక్కినవాడు; అయి = ఐ; విప్ర = బ్రాహ్మణులు; ఆది = మున్నగు; సాధు = మంచి; మానవులన్ = వారిని; చంపన్ = సంహరించుటకు; దానవులన్ = రాక్షసులను; పంపి = నియమించి; అంతిపురంబున్ = అంతఃపురమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళిపోయెను; అనంతరంబ = ఆ తరువాత; ఆ = ఆ; రక్కసులు = రాక్షసులు; వెక్కసంబులు = సహింపరానివి; అగు = ఐన; మొక్కలంబులన్ = క్రూరవర్తనములచేత; సజ్జనుల = మంచివారి; పజ్జలంబడి = వెంటబడి; తర్జన = బెదిరించుటలు; గర్జన = అరుపులు; భర్జన =వేపుకుతినుట; ఆది = మున్నగు; దుర్జనత్వంబులన్ = దుష్టచేష్టలను; చేసి = చేసి; నిర్జించి = వధించి; పాపంబులున్ = పాపములను; ఆర్జించిరి = సంపాదించిరి.
భావము:- ఆ విధంగా మాట్లాడుతున్న మంత్రుల ఆలోచనలకు కంసుడు ప్రభావితం అయ్యాడు. బ్రాహ్మణులను బాధించడం తప్పు అని ఆలోచించ లేదు. కాలము అనేది అతని దుష్కర్మ రూపంలో యమపాశంవలె అతణ్ని బంధించి వేసింది. బ్రాహ్మణులు మొదలైన సాధుజనులను చంపడానికి తన అనుచరులైన రాక్షసులను పంపి తాను అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అటు పిమ్మట రాక్షసులు భీకరంగా విజృంభించారు. సజ్జనుల వద్దకు చేరి భయపెట్టారు. దూషించారు. దండించారు. ఇలా అనేక దుర్మార్గాలతో వారిని బాధించి వేధించి ఎన్నో పాపాలు మూటగట్టుకున్నారు.

తెభా-10.1-172-ఆ.
వెదకి వెదకి, దైత్యవీరులు సాధుల
డఁప, వారి బలము డఁగిపోయె;
శము, సిరియు, ధర్మ, మాయువు, భద్రంబు,
నార్యహింసజేయ డఁగుఁగాదె.

టీక:- వెదకివెదకి = బాగా వెతికి మరీ; దైత్య = రాక్షస; వీరులు = సైనికులు; సాధులన్ = సాధువులను; అడపన్ = అణచివేయుచుండగా; వారి = ఆ రాక్షసుల; బలములు = శక్తులు; అణగిపోయెన్ = క్షీణించిపోయినవి; యశమున్ = కీర్తి; సిరియున్ = సంపదలు; ధర్మమున్ = పుణ్యము; ఆయువు = ఆయుష్షు; భద్రంబున్ = మేలు; ఆర్య = ఉత్తములను; హింస = హింసించుట; చేయన్ = చేసినచో; అడగున్ = అణగిపోవును; కదె = కదా, నిజముగ.
భావము:- ఆవిధంగా ఆ దానవులు సజ్జనులను వెదకి వెదకి మరీ హింసపెడుతూ ఉంటే క్రమంగా వారిలోని అసలైన బల సామర్థ్యాలు నశించి పోయాయి. పూజ్యులను హింసిస్తే కీర్తి, ఐశ్వర్యం, ధర్మం, ఆయుర్దాయము, క్షేమము నశించిపోతాయి కదా.