పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/అక్రూర ధృతరాష్ట్రుల సంభాషణ
తెభా-10.1-1518-ఉ.
"నీ యనుజుండు పాండుధరణీవిభుఁ డీల్గిన నీవు భూమి ధ
ర్మాయతబుద్ధి నేలుచుఁ బ్రజావళిఁ గాచుచు గౌరవంబుతోఁ
బాయక లోకులందు సమభావతఁ జేసితివేనిఁ గీర్తియున్
శ్రేయముఁ గల్గు వేఱొకటి చేసిన దుర్గతిగల్గు భూవరా!
టీక:- నీ = నీ యొక్క; అనుజుండు = తమ్ముడు; పాండు = పాండు; ధరణీవిభుడు = రాజు {ధరణీవిభుడు - రాజ్యమునకు ప్రభువు, రాజు}; ఈల్గిన = చనిపోవగా; నీవు = నీవు; భూమి = రాజ్యమును; ధర్మా = ధర్మముచేత; ఆయత = విశాలమైన; బుద్ధిన్ = బుద్ధితో; ఏలుచున్ = పాలించుచు; ప్రజా = జనుల, సంతతి; ఆవళిన్ = సమూహమును; కాచుచున్ = పోషించుచు; గౌరవంబు = గురుత్వ, పెద్దరికము; తోన్ = తోటి; పాయక = విడువక; లోకులు = ప్రజలు; అందున్ = ఎడల; సమభావతన్ = సమానముగా చూచుట; చేసితివి = నీవు చేసిన ఎడల; కీర్తియున్ = యశస్సు; శ్రేయమున్ = మేలు; కల్గున్ = కలుగును; వేఱొకటి = మరొకలా; చేసినన్ = చేసినట్లైతే; దుర్గతిన్ = నరకము, దుర్దశ; కల్గున్ = కలుగును; భూవర = రాజా, ధృతరాష్ట్రా {భూ వర – భూమికి వరుడు,రాజు}.
భావము:- “ఓ ధృతరాష్ట్రమహారాజా! నీ తమ్ముడు అయిన పాండుభూపతి మరణానంతరము నీవు రాజ్యం ధర్మ బద్ధంగా ఏలుతూ, లోకులను కాపాడుతున్నావు. గౌరవం భంగం కాకుండా సంతానాన్ని అందరిని సమదృష్టితో చూసుకున్నావంటే యశస్సు, క్షేమం లభిస్తాయి. ఇందుకు భిన్నంగా వర్తిస్తే దుర్గతి కలుగుతుంది సుమా!
తెభా-10.1-1519-సీ.
అవనీశ! పాండవులందు నీ నందను-
లందు సమానుండ వగుట బుద్ధి
యెవ్వనితో యోగ మిం దెవ్వనికి నిత్య-
మంగనాగార పుత్రాదికముల
వలన నయ్యెడి దేమి? వసుమతి నొక జంతు-
వుదయింప నొక జంతు వుక్కడంగు
నొకఁడు పుణ్యము జెందు నొకఁడు పాపము నొందు-
మీనజీవనభూత మిళిత జలముఁ
తెభా-10.1-1519.1-ఆ.
దత్తనూజు లెట్లు ద్రావుదు రట్లు మూ
ఢాత్ము విత్త మెల్ల నపహరింతు
రహితులైన కొడుకు లటమీఁద మనియైనఁ
జచ్చియైనఁ దండ్రి జాడఁ జనరు
టీక:- అవనీశ = రాజా, ధృతరాష్ట్రా {అవనీశ-భూమికి ఈశుడు,రాజు}; పాండవులు = పాండవులు {పాండవులు - పాండురాజు పుత్రులు, 1ధర్మరాజు 2భీముడు 3అర్జునుడు 4నకులుడు 5సహదేవుడు}; అందున్ = ఎడల; నీ = నీ యొక్క; నందనులు = కొడుకులు; అందున్ = ఎడల; సమానుండవు = సమానముగాచూచువాడవు; అగుట = ఐ ఉండుట; బుద్ధి = మంచి బుద్ధి; ఎవ్వని = ఎవడి; తోన్ = తోటి; యోగము = కూడిక; ఇందు = ఈ లోకమునందు; ఎవ్వనికిన్ = ఎవడికిమాత్రము; నిత్యము = శాశ్వతమైనది; అంగన = భార్య; ఆగార = ఇండ్లు; పుత్ర = బిడ్డలు; ఆదికములు = మున్నగునవాని; వలనన్ = వలన; అయ్యెడిది = కాగలమేలు; ఏమి = ఏమున్నది, ఏమీలేదు; వసుమతిన్ = భూమిమీద {వసుమతి - బంగారము గర్భమున కలది, భూమి}; ఒక = ఒకానొక; జంతువు = ప్రాణి; ఉదయింపన్ = పుట్టుతుండగా; ఒక = మరియొక; జంతువు = ప్రాణి; ఉక్కడంగున్ = చచ్చును; ఒకడు = ఒకానొకడు; పుణ్యమున్ = పుణ్యమును; చెందున్ = పొందును; ఒకడు = మరియొకడు; పాపమున్ = పాపమును; ఒందున్ = పొందును; మీన = చేపలకు; జీవనభూత = జీవికతో; మిళిత = కూడిన; జలమున్ = నీటిని; తత్ = వాటి; తనూజులు = పిల్లలు; ఎట్లు = ఏవిధముగానైతే; త్రావుదురు = తాగెదరో; అట్లు = అదే విధముగ.
మూఢాత్మున్ = మూఢబుద్ధి కలవాని; విత్తము = ధనము; ఎల్లన్ = అంతటిని; అపహరింతురు = లాగికొనెదరు; అహితులు = శత్రువుల వంటివారు; ఐన = అయిన; కొడుకులు = పుత్రులు; అటమీద = అటు పిమ్మట; మనియైనన్ = జీవించి ఉన్నను; చచ్చియైనన్ = చచ్చిపోయినను; తండ్రి = తండ్రి; జాడన్ = వైపునకు; చనరు = వెళ్ళరు.
భావము:- రాజా పాండుకుమారుల ఎడా, నీ కుమారుల ఎడా సమబుద్ధితో మెలగుట నీకు మంచిది. లోకంలో ఎవరితో సాంగత్యం ఎవరికి శాశ్వతం కనుక? పుత్ర, కళత్ర, గృహాదుల వల్ల ఏమి ఒరుగుతుంది? భూమి మీద ఒక ప్రాణి పుడుతూనే మరో ప్రాణి గిడుతుంది. ఒకడు పుణ్యం సంపాదిస్తాడు. మరొకడు పాపం సంపాదిస్తాడు. తల్లిచేపకు జీవనమైన నీళ్ళను దాని పిల్లలు త్రాగెడి విధంగా, బుద్ధిహీనుడైన తండ్రి ధనము అంతటిని అతని పుత్రులే శత్రువులై హరిస్తారు. అటుపై ఆ తండ్రి చచ్చినా బ్రతికినా అతని విషయం వారు పట్టించుకోరు.
తెభా-10.1-1520-క.
కావున మూఢాత్ముఁడవై
నీ వార్జించిన ధనంబు నీ పుత్రులు దు
ర్భావులు పుచ్చుకొనంగా
భూవర! నిందితుఁడ వగుదు భూనాకములన్.
టీక:- కావునన్ = అందుచేత; మూఢాత్ముడవు = మూఢబుద్ధి గలవాడవు; ఐ = అయ్యి; నీవు = నీవు; ఆర్జించిన = సంపాదించిన; ధనంబున్ = సంపదలను; నీ = నీ యొక్క; పుత్రులు = కొడుకులు; దుర్భావులు= దుష్ట స్వభావము గలవారు; పుచ్చుకొనంగా = కొల్లగొనగా, లాగుకొనగా; భూవర = రాజా, ధృతరాష్ట్రా; నిందితుడవు = దూషింపబడినవాడవు; అగుదువు = అయ్యెదవు; భూ = ఇహలోకము నందు; నాకములన్ = పరలోకము నందు.
భావము:- కావున ఓ రాజా! నీవు అధర్మపరుడవై గడించిన సంపదలు అన్నీ దుర్భుద్ధులైన నీ కొడుకులు తీసేసుకుంటారు. నీవేమో ఇక్కడ భూలోకంలోనూ, అక్కడ స్వర్గలోకంలోనూ నిందల పాలవుతావు.
తెభా-10.1-1521-శా.
నిందం బొందకు మయ్య! యీ తనువు దా నిద్రా కళా దృష్టమౌ
సందోహంబు విధంబు నిల్వదు సుమీ; జాత్యంధతం బొందియున్
మందప్రజ్ఞత లేల చేసెదవు సమ్యగ్జ్ఞాన చక్షుండవై
సందేహింపక యిమ్ము పాండవులకున్ సర్వంసహా భాగమున్."
టీక:- నిందన్ = దూషింపబడుటను; పొందకుము = పొందవద్దు; అయ్య = నాయనా; ఈ = ఈ యొక్క; తనువు = దేహము; తాన్ = అది; నిద్రా = నిద్రయందు; ఆకళా = కలలో అవగాహన మగు దాని వలె; దృష్టము = తోచునది; ఔ = ఐనట్టి; సందోహంబు = వస్తుసముదాయము; విధంబు = వంటిది; నిల్వదు = స్థిరముగా ఉండదు; సుమీ = సుమా; జాత్యంధతన్ = పుట్టుగుడ్డి తనమును; పొందియున్ = పొందినప్పటికిని; మందప్రజ్ఞలు = తెలివిమాలిన తనములు; ఏలన్ = ఎందుకు; చేసెదవు = చేయుచున్నావు; సమ్యక్ = మంచి; జ్ఞాన = బుద్ధి అనెడి; చక్షుండవు = కన్నులు కలవాడవు; ఐ = అయ్యి; సందేహింపక = అనుమానములు పెట్టుకోకుండ; ఇమ్ము = పంచి ఇచ్చివేయుము; పాండవుల్ = పాండవుల; కున్ = కు; సర్వంసహా = భూమి యందలి {సర్వంసహా - సమస్తమును భరించునది, భూమి}; భాగమున్ = భాగమును.
భావము:- ఈ శరీరం స్వప్నదృష్ట వస్తుసముదాయం వంటిది, నిలబడి ఉండేది కాదు, అనిత్యమైనది. నీవు పుట్టంధుడవు అయినను, మందబుద్ధివి మాత్రం కావద్దు. జ్ఞాననేత్రుడవై సంశయము మాని పాండవులకు రాజ్యంలో వారి భాగము వారికి పంచి ఇచ్చివేయి.”
తెభా-10.1-1522-వ.
అనిన ధృతరాష్ట్రుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; ధృతరాష్ట్రుండు = ధృతరాష్ట్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా ధర్మ బోధ చేసిన అక్రూరుడితో ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు.
తెభా-10.1-1523-సీ.
"నీ మాట మంచిది నిశ్చయ మగు; నైన-
నస్థిరంబైన నా యంతరంగ
మందు నిల్వదు సుదామాచలస్ఫటిక శి-
లాతత ద్యుతి తటిల్లతిక భంగి;
నమృతంబు నొందియు నానందితుఁడు గాని-
నరుమాడ్కి నేను నానంద మొంద;
నీశ్వరాజ్ఞావిధ మెవ్వఁడు దప్పింప-
నోపు విజ్ఞానియై యుండియైన
తెభా-10.1-1523.1-ఆ.
విశ్వమెల్లఁ జేసె విభజించి గుణముల
నెవ్వఁ డనుసరించె నెవ్వఁ డవని
భారమెల్లఁ బాపఁ బ్రభవించె దేవకి
కెవ్వఁ డాత్మతంత్రుఁ డీశ్వరుండు.
టీక:- నీ = నీ యొక్క; మాట = పలుకు; మంచిది = మేలైనదే; నిశ్చయము = నిజమైనదే; అగున్ = ఔను; ఐనన్ = అయినను; అస్థిరంబు = నిలకడలేనిది; ఐన = అయిన; నా = నా యొక్క; అంతరంగము = మనసు; అందున్ = లో; నిల్వదు = నిలిచియుండదు; సుదామ = సుదామ అనెడి; అచల = కొండ యందలి; స్ఫటిక = స్ఫటికపు; శిలా = రాతి; తల = ఫలకముపై; ఆద్యుత = పడిన, ప్రతిఫలించిన; తటిల్లతిక = మెరుపు; భంగిన్ = వలె; అమృతంబున్ = అమృతమును {అమృతము - మృతము (చావును) చేరనీయనిది}; ఒందియున్ = పొందినప్పటికిని; ఆనందితుడు = సంతోషించువాడు; కాని = అవ్వని; నరు = మానవుని; మాడ్కిన్ = వలె; నేనున్ = నేనుకూడ; ఆనందమున్ = సంతోషమును; ఒందన్ = పొందను; ఈశ్వరాజ్ఞావిధము = దైవయోగము; ఎవ్వడున్ = ఎవడుమాత్రము; తప్పింపన్ = తప్పించుటకు; ఓపున్ = చాలును; విజ్ఞాని = మిక్కిలి జ్ఞానముకలవాడు; ఐ = అయ్యి; ఉండియైనన్ = ఉన్నప్పటికి.
విశ్వము = ప్రపంచము; ఎల్లన్ = అతటిని; చేసె = సృష్టించెనో; విభజించి = వేరుపరచి; గుణములన్ = త్రిగుణములను; ఎవ్వడు = ఎవరు; ఐనన్ = అయినను; అనుసరించెన్ = అవలంబించెనో; ఎవ్వడు = ఎవడు; అవని = భూమి యొక్క; భారమున్ = భారమును {భారము - అధికమైన బరువు మీదనుండుట}; ఎల్లన్ = సర్వమును; పాపన్ = తొలగించుటకు; ప్రభవించెన్ = పుట్టెనో; దేవకి = దేవకీదేవి; కిన్ = కి; ఎవ్వడు = ఎవడు; ఆత్మతంత్రుడు = స్వతంత్రుడో; ఈశ్వరుండు = సర్వజ్ఞానసంపన్నుడో;
భావము:- నీవు పలికినమాట నిజమైనదే, మంగళకరమైనదే ఐనను, అది సుదామ పర్వత మందలి స్ఫటికశిలా ప్రదేశంలో ఉదయించి తళుక్కున మెఱసి మాయమైపోయే మెరుము వలె నామదిలో స్థిరంగా నిలువదు. (“సుదామ” పర్వతం పైని తొలుత మెఱుస్తుంది కాబట్టి మెఱుమునకు సౌదామని అని పేరు వచ్చిందని ఒక కథ; సుదామము అంటే - 1. మబ్బు, 2.కొండ. 3 సముద్రము - ఆంధ్రశబ్దరత్నాకరము). అమృతమును పొందినను ఆనందించని మరణశీలి యగు మానవుడు వలె నేను కూడ ఆనందమును పొందలేను. పరమేశ్వర సంకల్పమును ఎవడు తప్పించగలడు. ఎవడు జ్ఞానస్వరూపుడై ఉండి ఈ విశ్వమును సృజించి అందులో ప్రవేశించి జీవులకు కర్మలను వాటికి తగిన ఫలములను విభాగించి ఇచ్చుచున్నాడో? ఎవడు భూభారం మాన్పుటకు దేవకీదేవికి సుతుడై జన్మించినాడో? తనకు విహార తంత్రమైన సంసారచక్రభ్రమణానికి ఎవడు కారణమైన పరమేశ్వరుడో?. . . .
తెభా-10.1-1524-వ.
అట్టి కృష్ణునకు నమస్కరించెద; నా నందనందనుని దివ్యచిత్తంబునం గల తెఱంగునన్ బ్రతుకం గలవార” మని వీడ్కొలిపిన, నక్రూరుం డతని తలంపెఱింగి “నీతలంపుఁ గనుగొంటి నీకిష్టం బగునట్లు వర్తింపు” మని పలికి మరలి మథురకుం జనుదెంచి తదీయ వృత్తాంతంబు రామకృష్ణుల కెఱింగించె; నంతఁ గంసుభార్యలగు నస్తియు బ్రాస్థియు విధవలయి దుఃఖించుచుం దమ తండ్రి యయిన జరాసంధుని కడకుం జని.
టీక:- అట్టి = అటువంటి; కృష్ణున్ = కృష్ణుని; కున్ = కి; నమస్కరించెదన్ = నమస్కారము చేసెదను; ఆ = ఆ ప్రసిద్ధు డైన; నందనందనుని = కృష్ణుని {నంద నందనుడు - నందుని పుత్రుడు, కృష్ణుడు}; దివ్య = మహిమాన్వితమైన; చిత్తంబునన్ = మనస్సులో; కల = ఉన్న; తెఱంగునన్ = రీతిగనే; బ్రతుకన్ = జీవించి; కలవారము = ఉండెడివారము; అని = అని; వీడ్కొలిపిన = సెలవిచ్చి పంపగా; అక్రూరుండు = అక్రూరుడు; అతని = అతని; తలంపు = భావము; ఎఱింగి = తెలిసి; నీ = నీ యొక్క; తలంపు = ఉద్దేశమును; కనుగొంటి = తెలిసికొంటిని; నీ = నీ; కున్ = కు; ఇష్టంబు = ఇచ్చ; అగునట్లు = వచ్చిన విధముగ; వర్తింపుము = నడచుకొనుము; అని = అని; పలికి = చెప్పి; మరలి = వెనుదిరిగి; మథుర = మథురానగరమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; తదీయ = అతని; వృత్తాంతంబున్ = సమాచారము; రామ = బలరాముడు; కృష్ణుల = కృష్ణుల; కున్ = కు; ఎఱింగించె = తెలిపెను; అంతన్ = అప్పుడు; కంసు = కంసుని యొక్క; భార్యలు = పెండ్లాములు; అస్తి = అస్తి; ప్రాస్తియున్ = ప్రాస్తి; విధవలు = భర్తలేనివారు; అయి = అయ్యి; దుఃఖించుచున్ = ఏడుస్తూ; తమ = వారి యొక్క; తండ్రి = తండ్రి; అయిన = ఐనట్టి; జరాసంధుని = జరాసంధుని {జరాసంధుడు - జర అనెడి రాక్షసిచే రెండుభాగములైన శరీరము సంధానింపబడి జీవించిన వాడు, మగధ దేశపు ఒక రాజు}; కడ = వద్ద; కున్ = కు; చని = వెళ్ళి.
భావము:- అట్టి పరమపురుషు డగు శ్రీకృష్ణునకు వందనము సమర్పిస్తున్నాను. ఆ నందుడి కుమారుడి యొక్క దివ్యచిత్తమున ఎట్లున్నదో అట్లే మా జీవితాలు నడుస్తాయి.” అని చెప్పి వీడ్కోలు పలికాడు. అక్రూరుడు ధృతరాష్ట్రుని భావము అర్థము చేసుకున్నాడు. “నీ అభిప్రాయము గ్రహించాను నీ కేది హితవో అట్లే కానివ్వు.” అని పలికి హస్తినాపురము నుండి మరలి మథురకు చేరి ధృతరాష్ట్రుని చందమంతా కృష్ణబలరాములకు తెలిపాడు. అంతలో, కంసుడి భార్యలైన అస్తి, ప్రాస్తి అనేవారు విధవలై దుఃఖిస్తూ తమ తండ్రి ఐన జరాసంధుడి దగ్గరకు వెళ్ళి. . .