పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/అక్రూరుడు బృందావనం గనుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తెభా-10.1-1198-క.
ముంటఁ గనె ఘనచందన
కుం కుటజ తాల సాల కురవక వట మా
కందన్ నందితబల గో
విందన్ వికచారుణారవిందన్ బృందన్.

టీక:- ముందటన్ = ఎదురుగ; కనెన్ = చూసెను; ఘన = గొప్పవైన; చందన = గంధపుచెట్లు; కుంద = మొల్లచెట్లు; కుటజ = కొడిసెచెట్లు; తాల = తాడిచెట్లు; సాల = మద్దిచెట్లు; కురవక = ఎఱ్ఱగోరింటలు; వట = మఱ్ఱిచెట్టు; మాకందన్ = మామిడిచెట్లు కలదానిని; నందిత = సంతోషింప జేయబడిన; బల = బలరాముడు; గోవిందన్ = కృష్ణులు కలదానిని; వికచ = వికసించిన; అరుణ = ఎఱ్ఱ; అరవిందన్ = తామరలు కలదానిని; బృందన్ = బృందావనమును.
భావము:- అలా వెళ్ళివెళ్ళి అక్రూరుడు; మంచిగంధం, మొల్ల, మల్లె, తాడి, మద్ది, గోరంట, మఱ్ఱి, మామిడి మొదలైన పెద్ద చెట్లూ, వికసించిన ఎఱ్ఱతామరలు కలిగి బలరామ శ్రీకృష్ణులను సంతసింప చేసేది అయిన బృందావనమును తన ఎదుట కనుగొన్నాడు.

తెభా-10.1-1199-వ.
కని బృందావనంబుఁ దఱియంజొచ్చి యందు సాయంకాలంబున నడవికి నెఱిగల మేతల వెంబడి దిగంబడి రాకచిక్కిన కుఱ్ఱుకోడె పడ్డ తండంబులం గానక పొద, యిరువు, మిఱ్ఱు, పల్లం,బనక తూఱి, పాఱి, వెదకి, కానక చీరెడు గోపకుల యాహ్వానశబ్దంబు లాకర్ణించుచుఁ; గోమలఘాసఖాదన కుతూహలంబులం జిక్కి మక్కువం గ్రేపులం దలంచి తలారింపక తమకంబులం దమతమ యంత నంభారావంబులు చేయుచు మూత్రంబులు స్రవింపఁ బరువు లిడు ధేనువులును; ధేనువులకు నోసరించుచు సద్యోజాతంబులగు తర్ణకంబుల వహించి నవసూతికలు వెనుతగులుటవలన దామహస్తులై చను వల్లవుల మెల్లన విలోకించుచు; మంద యిరు కెలంకులం గళంకరహితులై పులి, శివంగి, వేఁగి లోనగు వాలుమెకంబుల మొత్తంబుల వలన నప్రమత్తులై కుఠార, కుంత, శరాసన ప్రము ఖాయుధంబులు ధరియించి కావలితిరుగు వ్రేలం గడచి; నానావిధ సరసతృణకబళ ఖాదనగరిష్ఠలై గోష్ఠంబులు ప్రవేశించి రోమంథలీలాలసలై యున్న ధేనువులును; జన్నులు గుడిచి తల్లుల మ్రోలఁ బెల్లురేఁగి క్రేళ్ళుఱుకు లేగలుఁను; వెదలైన మొదవులం బైకొని పరస్పర విరుద్ధంబులై డీకొని కొమ్ముల యుద్ధంబులు సలుపు వృషభంబులును; నకుంఠితబలంబులఁ కంఠరజ్జువులం ద్రెంచుకొని పొదలుఱికి దాఁటి తల్లులం దూటి కుడుచు తఱపిదూడల దట్టించి పట్టనోపక గ్రద్దనఁ బెద్దలం జీరు గోపకుమారులును; గొడుకుల, మగల, మామలు, మఱందుల వంచించి పంచాయుధభల్ల భగ్నహృదయ లయి గృహకృత్యంబులు మఱచి శంకిలక సంకేతస్థలంబులఁ గృష్ణాగమ తత్పరలయి యున్న గోపకామినులును; గోష్ఠప్రదేశంబుల గోవులకుఁ గ్రేపుల విడిచి యొడ్డుచు, మరలం గట్టుచు, నీడ్చుచుం, గ్రీడించు గోపకులును; గోఖుర సముద్ధూత కరీష పరాగ పటలంబుల వలన నుల్లారి దులదుల నైన ధేనుదోహనవేళా వికీర్ణ పయోబిందు సందోహ పరంపరా సంపాదిత పంకంబులును; దోహనసమయ గోపకరాకృష్ట గోస్తన నిర్గతంబు లయి కలశంబులందుఁ బడియెడు క్షీరధారల చప్పుళ్ళును; మహోక్షకంఠ సంస్పర్శనస్నిగ్ధంబు లయిన మందిరద్వార దారుస్తంభంబుల పొంతలనుండి యులికిపడి నలుదిక్కులు గనుంగొని నూతనజనవిలోన కుపితంబులయి కరాళించు సారమేయంబులునుఁ గలిగి బలకృష్ణబాహుదండ ప్రాకారరక్షా విశేషభూషంబైన ఘోషంబు బ్రవేశించి; యందు.
టీక:- కని = చూసి; బృందావనంబున్ = బృందావనమును; దఱియన్ = దగ్గరకు; చొచ్చి = వెళ్ళి; అందున్ = దానిలో; సాయంకాలంబునన్ = సాయంకాలము నందు; అడవి = అడవిలోని; కిన్ = కి; నెఱి = సమృద్ధిగా; కల = ఉన్నట్టి; మేతలన్ = గడ్డిల; వెంబడిన్ = వెంటపోవుటలో; దిగంబడి = లగ్నమై; రాక = తిరిగిరాకుండా; చిక్కిన = ఉండిపోయిన; కుఱ్ఱు = పాడియావులు; కోడె = మగదూడలు; పడ్డ = తొలిచూలి ఆవులు; తండంబులన్ = సమూహములను; కానక = కనుగొనలేక; పొద = పొదలు; ఇరువులు = సందులు; మిఱ్ఱు = మిట్టలు; పల్లంబు = గోతులు; అనక = అని లెక్కచేయక; తూఱి = చొరబడి; పాఱి = పరుగెత్తి; వెదకి = అన్వేషించి; కానక = కనుగొనలేక; చీరెడు = పిలుస్తున్న; గోపకుల = గోపాలకుల; ఆహ్వానశబ్దంబులన్ = పిలుపులను; ఆకర్ణించుచున్ = వినుచు; కోమల = మృదువైన, లేత; ఘాస = గడ్డి; ఖాదన = మేసెడి; కుతూహలంబులన్ = ఆసక్తులలో; చిక్కి = మైమరచి; మక్కువన్ = మోహముచేత; క్రేపులన్ = దూడలను; తలంచి = తలచుకొని; తలారింపక = ఆగకుండ; తమకంబులన్ = సంభ్రమములతో; తమతమంతయున్ = వాటంతటవే; అంభారావములు = అంబా అనెడి అరుపులు; చేయుచున్ = చేస్తు; మూత్రంబులున్ = పంచితములు; స్రవింపన్ = కార్చుచుండగా; పరువులిడు = పరుగులు పెట్టెడి; ధేనువులును = ఆవులు; ధేనువుల్ = ఆవుల; కున్ = కు; ఓసరించుచు = దూరముచేయుచు; సద్యత్ = అప్పుడే; జాతంబులు = పుట్టినవి; అగు = అయిన; తర్ణకంబులు = లేగ దూడలను {తర్ణకము - అప్పుడే పుట్టిన దూడ}; వహించి = ఎత్తుకొని; నవసూతికలు = కొత్తగా ఈనిన ఆవులు; వెనుతగులుట = వెంబడించుట; వలన = చేత; దామ = పలుపుతాడు; హస్తులు = చేతులో పట్టుకొన్నవారు; ఐ = అయ్యి; చను = పోవుచున్నట్టి; వల్లవులన్ = గొపాలకులను; మెల్లన = కంగారుపడకుండ; విలోకించుచు = చూస్తూ; మంద = పశువుల సమూహము; ఇరు = రెండు (2); కెలంకులన్ = వైపు లందు; కళంకరహితులు = కలవరములు లేని వారు; ఐ = అయ్యి; పులి = చిరుతపులులు; శివంగి = ఆడసింహములు; వేగి = పెద్దపులులు; లోనగు = మున్నగు; వాలు = క్రూర; మెకంబుల = మృగముల; మొత్తంబుల = సమూహముల; వలన = నుండి; అప్రమత్తులు = ఏమరనివారు; ఐ = అయ్యి; కుఠార = గొడ్డళ్ళు; కుంత = ఈటెలు; శరాసన = విల్లులు; ప్రముఖ = మున్నగు; ఆయుధంబులున్ = ఆయుధములను; ధరియించి = పూని; కావలితిరుగు = కాపలాకాయుచున్న; వ్రేలన్ = గోపాలురను; గడచి = దాటి; నానా = అనేక; విధ = విధములైన; సరస = రుచికరములైన; తృణ = గడ్డిపరకల; కబళ = పుంజములను; ఖాదన = తినుట యందు; గరిష్ఠలు = గొప్పవి; ఐ = అయ్యి; గోష్టంబులున్ = పశువుల దొడ్లను; ప్రవేశించి = చేరి; రోమంథ = నెమరువేసెడి; లీలా = విలాస మందు; అలసలు = మైమరచినవి; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; ధేనువులును = ఆవులు; చన్నులున్ = పొదుగుపాలను; కుడిచి = తాగి; తల్లుల = తల్లి ఆవుల; మ్రోలన్ = ముందర; పెల్లు = మిక్కిలి; రేగి = రెచ్చిపోయి; క్రేళ్ళుఱుకు = గంతులు వేసెడి; లేగలును = లేగదూడలు; వెదలు = ఋతువులు; ఐన = అయినట్టి; మొదవులన్ = ఆవులను; పైకొని = వెంబడించి; పరస్పర = ఒకదానితో నొకటి; విరుద్ధంబులు = విరోధించినవి; ఐ = అయ్యి; డీకొని = ఎదుర్కొని; కొమ్ముల = కొమ్ములతో; యుద్ధంబులున్ = యుద్ధములను; సలుపు = చేసెడి; వృషభంబులును = ఆబోతులును; అకుంఠిత = మొక్కపోని; బలంబులన్ = బలము ఉండుటచేత; కంఠరజ్జువులన్ = పలుపుతాళ్ళను; త్రెంచుకొని = తెంపుకొని; పొదలు = పొదలమీదుగా; ఉఱికి = దూకి; దాటి = దాటి; తల్లులన్ = తల్లి ఆవును; దూటి = పొదుగులుపొడిచి; కుడుచు = పాలుతాగెడి; తఱపిదూడలన్ = లేగలను; దట్టించి = నిలువరించి; పట్టనోపక = ఆపలేక; గ్రద్దన = శీఘ్రముగ; పెద్దలన్ = పెద్దవారిని; చీరు = పిలిచెడి; గోప = గొల్ల; కుమారులును = పిల్లలను; కొడుకులన్ = పుత్రులను; మగలన్ = భర్తలను; మామలన్ = భర్తతండ్రులను; మఱందులన్ = భర్తసోదరులను; వంచించి = మోసపుచ్చి; పంచాయుధ = మన్మథుని; భల్ల = బాణములచేత; భగ్న = దెబ్బతిన్న; హృదయలు = హృదయములు కలవారు; ఐ = అయ్యి; గృహ = ఇంటి; కృత్యంబులన్ = పనులను; మఱచి = మరచిపోయి; శంకిలక = బెదరక; సంకేత = గుర్తుగా పెట్టుకొన్న; స్థలంబులన్ = చోటు లందు; కృష్ణ = కృష్ణుని; ఆగమ = రాక యందే; తత్పరలు = లగ్నమైన వారు; అయి = ఐ; ఉన్న = ఉన్నట్టి; గోప = గొల్ల; కామినులును = భామలు; గోష్ఠప్రదేశంబులన్ = పశువుల దొడ్ల యందు; గోవుల్ = ఆవుల; కున్ = కు; క్రేపులన్ = దూడలను; విడిచి = వదలిపెట్టి; ఒడ్డుచున్ = నిలువరించుచు; మరలన్ = తిరిగి; కట్టుచున్ = కట్టేస్తూ; ఈడ్చుచున్ = లాగుతు; క్రీడించు = వినోదించెడి; గోపకులును = గొల్లలు; గో = ఆవుల యొక్క; ఖుర = గిట్టలచేత; సముద్ధూత = ఎగజిమ్మబడిన; కరీష = ఎండిన పేడ వలని; పరాగ = దుమ్ము; పటలంబుల = తెరల; వలనన్ = వలన; ఉల్లారి = సహింపరానిదై; దులదులన్ = సంభ్రమించినవి; ఐన = కాగా; ధేను = ఆవులను; దోహన = పాలుపితికెడి; వేళ = సమయము నందు; వికీర్ణ = చెదిరిపడిన; పయస్ = పాల; బిందు = చుక్కల; సందోహ = సమూహముల యొక్క; పరంపరా = ఎడతెగక పడుటచేత; సంపాదిత = కలిగినట్టి; పంకంబులును = జిడ్డులు; దోహన = పితికెడి; సమయ = అప్పుడు; గోప = గోపకుల; కర = చేతిచే; ఆకృష్ట = ఈడువబడిన; గో = ఆవుల యొక్క; స్తన = పొదుగులనుండి; నిర్గతంబులు = బయటకొచ్చెడివి; అయి = అయ్యి; కలశంబుల్ = చెంబుల; అందున్ = లో; పడియెడు = పడుతున్నట్టి; క్షీర = పాల; ధారల = ధారల యొక్క; చప్పుళ్ళును = ధ్వనులు; మహోక్ష = ఆబోతుల; కంఠ = మెడల సంస్పర్శనన్ = రాపిడులచేత; స్నిగ్ధంబులు = నునుపు గలవి; అయిన = ఐనట్టివి; మందిర = ఇండ్ల యొక్క; ద్వార = గుమ్మముల, వాకిళ్ళ; దారు = కఱ్ఱ; స్తంభంబుల = స్తంభముల; పొంతలన్ = దగ్గర; ఉండి = ఉండి; ఉలికిపడి = అదిరిపడి; నలుదిక్కులున్ = అన్నివైపులా {నలుదిక్కులు - 1తూర్పు 2దక్షిణము 3పడమర 4ఉత్తరము}; కనుంగొని = చూసి; నూతన = కొత్త; జన = వారిని; విలోకన = చూచుటచేత; కుపితంబులు = కోపించినవి; అయి = ఐ; కరాళించు = మొరిగెడి; సారమేయంబులును = కుక్కలు {సారమేయము - సరమ (ఆడు కుక్క) కు పుట్టినది, కుక్క}; కలిగి = కలిగి; బల = బలరాముడు; కృష్ణ = కృష్ణుల యొక్క; బాహుదండ = భుజము లనెడి; ప్రాకార = కోటగోడలచేత; రక్షా = కాపాడబడుట యనెడి; విశేష = మేలైన; భూషంబు = అలంకారము కలది; ఐన = అయిన; ఘోషంబున్ = వ్రేపల్లెను; ప్రవేశించి = చేరి; అందు = దానిలో.
భావము:- అక్రూరుడు బృందావనంలో ప్రవేశించాడు సంధ్యా సమయం కావడంతో దూడలూ కోడెలూ తొలిచూలు గేదెలూ గుంపులు గుంపులుగా మేతకైవెళ్ళి అక్కడి పచ్చని పచ్చికలు మేస్తూ ఎంతకూ ఇంటికి మరలిరాకపోతే వాటిని వెదకుటకోసం పోయి పొదలు మరుగులూ మిట్టపల్లాలు లెక్కింపక పొదలలో దూరి పరిగెత్తుతూ వెదుకులాడి కనుపించక ఎలిగెత్తి పిలిచే గోపబాలుర సవ్వడి ఆలకించాడు. మెత్తని పచ్చిక మేసే కుతూహలంతో ఆగి అంతలో తమ లేగదూడలను తలచుకుని ఆలస్యం చేయకుండా మమకారంతో తమకు తామే అంభారావాలు చేస్తూ, పొదుగుల నుండి పాలుకార్చుకుంటూ, పరుగెత్తి వస్తున్న ఆవులను వీక్షించాడు. అప్పుడే పుట్టిన దూడలను అరకడ నుంచుకుని పలుపులు చేతపట్టుకుని క్రొత్తగా ఈనిన బాలెంత గోవులు వెంబడించగా మెల్లగా వెడుతున్న వల్లవులను చూసాడు. చిరుతలు, సివంగులు, పెద్ద పులులు లాంటి క్రూరజంతువుల బారిన పడకుండా జాగరూకలై మందకు రెండు వైపులా గండ్రగొడ్డళ్ళు, ఈటెలూ, విల్లులు పట్టుకుని కావలికాస్తున్న కాపరులను దాటి ముందుకు సాగాడు. అక్కడ రకరకాలైన మిసిమిగల కసవులు మేసి బలిసి కొట్టాలలో చేరి ఆవులు మెల్లగా నెమరువేస్తున్నాయి. దూడలు పాలు గుడిచి తల్లుల యెదుటే చెలరేగి చెంగు చెంగున దుముకుతున్నాయి. ఎదకు వచ్చిన ఆవులపై బడి దాటుతూ వృషభాలు ఎదురు నిలచి ఒకదానితో ఒకటి ఢీకొని కొమ్ములతో కుమ్ములాడుకుంటున్నాయి. ఆరునెలల వయసు గల దూడలు మొక్కవోని బలంతో మెడ పలుపులు త్రెంచుకుని పొదలు దూకి కుప్పించి దూకుతూ తల్లిపొదుగులను పొడిచి పొడిచి పాలు కుడుస్తున్నాయి. వాటిని అదలించి ఇవతలకు పట్టి ఈడువ లేక పిల్లలు పెద్దలను పిలుస్తున్నారు. కొడుకులను భర్తలను మామలను మరదులను మరపించి మన్మథశర పీడితలై గొల్లమగువలు ఇంటిపనులు మరచి జంకు వదలి సంకేత ప్రదేశాలకు చేరి కృష్ణుడి రాక కోసం వేచి ఉన్నారు. గోపకులు పసులకొట్టాలలో ఆవులకు దూడలను విడుస్తూ తిరిగి కట్టి వేస్తూ మరల పట్టి ఈడుస్తూ క్రీడిస్తున్నారు. ఆవుల గిట్టల వలన పొడి పొడియై వ్యాపించిన ఎండు పేడ దుమ్ము గోవులను పితికేటప్పుడు చెదిరిన పాల తుంపరల మొత్తముచే తడిసి అణిగిపోయి అడుసుగా మారింది. గోపాలుకులు పాలు పిండేటప్పుడు ఆవుల చనుల నుండి చెంబుల లోనికి కారే క్షీరధారలు జుంజుమ్మని చప్పుడు చేస్తున్నాయి. ఆబోతులు మెడ దురద తీర్చుకోవడానికి ఒరసికొనగా నునుపారిన గృహద్వారసీమలోని స్తంభాల సమీపాన ఉన్న కుక్కలు ఉలికిపడి క్రొత్త వారిని చూసి కోపంతో మొఱుగుతున్నాయి. ఆ గొల్లపల్లె బలరామకృష్ణులు భుజదండములనే ప్రాకారంతో పరిరక్షింపబడుతూ ఉన్నది. అక్రూరుడు సాయంసంధ్యా సమయంలో అలాంటి వ్రేపల్లె ప్రవేశించాడు. అలా ప్రవేశిస్తూనే అక్కడ. . .

తెభా-10.1-1200-క.
జాంకుశాది రేఖలు
హరిపాదముల చొప్పుఁ ని మోదముతోఁ
బుకించి రథము డిగి యు
త్కలికన్ సంతోషబాష్ప లితాక్షుండై.

టీక:- జలజ = పద్మరేఖ; అంకుశ = అంకుశమురేఖ; ఆది = మున్నగు; రేఖలు = శుభకర గీతలు; కల = కలిగిన; హరి = కృష్ణుని; పాదములన్ = అడుగు జాడల; చొప్పున్ = చక్కదనమును; కని = చూసి; మోదము = సంతోషము; తోన్ = తోటి; పులకించి = గగుర్పాటుచెంది; రథమున్ = వాహనమును; డిగి = దిగి; ఉత్కలికన్ = తహతహతో; సంతోష = సంతోషమువలన కలిగిన; బాష్ప = కన్నీరు; కలిత = కలిగిన; అక్షుండు = కన్నులు కలవాడు; ఐ = అయ్యి.
భావము:- పద్మము, అంకుశము మొదలగు శుభ లక్షణములు కల కృష్ణుడి పాద ముద్రలను అక్రూరుడు సంతోషంతో తిలకించాడు. మేను పులకించింది. కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోగా, అతను ఉత్కంఠతో రథం దిగాడు.