పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/అక్రూరుడు వ్రేపల్లె కొచ్చుట
తెభా-10.1-1190-వ.
అంత నా రాత్రి మథురానగరంబున నక్రూరుండు వసియించి నియతుండయి మరునాడు రేపకడ లేచి నిత్యకృత్యంబు లాచరించి రథంబెక్కి కదలి నందగోకులంబునకుం బోవుచుం దెరువునం దనలో నిట్లనియె.
టీక:- అంతన్ = ఆ తరువాత; ఆ = ఆనాటి; రాత్రి = రాత్రి; మథుర = మథుర అనెడి; నగరంబునన్ = పట్టణము నందు; అక్రూరుండు = అక్రూరుడు; వసియించి = ఉండి; నియతుండు = సిద్ధమైన వాడు; అయి = అయి; మరునాడు = తరువాతి దినమున; రేపకడన్ = తెల్లవారగట్ల, ప్రాతఃకాలమున; లేచి = నిద్రలేచి; నిత్యకృత్యంబులు = దైనికచర్యలు; ఆచరించి = పూర్తిచేసుకొని; రథంబున్ = రథమును; ఎక్కి = ఎక్కి; కదిలి = బయలుదేరి; నంద = నందుని యొక్క; గోకులంబున్ = రేపల్లె; కున్ = కు; పోవుచున్ = వెళ్తూ; తెరువునన్ = దారిలో; తన = తన; లోన్ = మనసు నందు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అక్కడ ఆక్రూరుడు ఆవేళ రాత్రికి మథురలో ఉండి, మరునాటి తెల్లవారకట్ల లేచి నిత్యకర్మానుష్ఠానములు తీర్చుకుని రథమెక్కి నందుడి గోకులానికి పయనమై వెళ్ళుతూ, దారిలో ఇలా అనుకున్నాడు.
తెభా-10.1-1191-ఉ.
"ఎట్టి తపంబుఁ జేయఁబడె? నెట్టి చరిత్రము లబ్ధమయ్యెనో?
యెట్టి ధనంబు లర్హులకు నీఁబడెనో తొలిబామునందు; నా
యట్టి వివేకహీనునకు నాదిమునీంద్రులు యోగదృష్టులం
బట్టఁగలేని యీశ్వరుని బ్రహ్మమయున్ హరిఁ జూడఁగల్గెడిన్.
టీక:- ఎట్టి = ఎటువంటి; తపంబున్ = తపస్సు; చేయబడెన్ = చేయబడినదో; ఎట్టి = ఎటువంటి; చరిత్రము = నడవడి; లబ్ధము = కలుగుట; అయ్యనో = జరిగినదో; ఎట్టి = ఎటువంటి; ధనంబుల్ = సంపదలు; అర్హుల్ = అర్హత కలవారల; కున్ = కు; ఈబడెనో = దానము చేయబడెనో; తొలి = పూర్వ; బాము = జన్మము; అందున్ = లో; నా = నా; అట్టి = లాంటి; వివేకహీనున్ = తెలివితక్కువవాని; కున్ = కి; ఆది = ప్రథమ; ముని = ఋషులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; యోగదృష్టులన్ = జ్ఞానదృష్టిచేత; పట్టగన్ = తెలిసికొన; లేని = శక్యముకాని; ఈశ్వరుని = భగవంతుని; బ్రహ్మమయున్ = పరబ్రహ్మతా నైన వానిని; హరిన్ = కృష్ణుని; చూడన్ = చూచుట; కలిగెడిన్ = లభించుచున్నది.
భావము:- “పూర్వజన్మలలో నేను ఎంతటి తపస్సు చేసానో! ఏమి గొప్ప పనులు చేసానో! ఎంత గొప్ప దానములు అర్హమైన వారికి చేసానో! ఆర్యులైన పరమ యోగుల యోగ దృష్టికి కూడ అందని భగవంతుడు, బ్రహ్మస్వరూపుడు అయిన శ్రీకృష్ణుడిని చూడబోతున్నాను.
తెభా-10.1-1192-ఉ.
సూరులు దొల్లి యే విభుని శోభిత పాదనఖ ప్రభావళిం
జేరి భవాంధకారములఁ జిక్కక దాఁటుదు రట్టి దేవునిన్
వైరముతోడనైనఁ బిలువన్ ననుఁ బంచి శుభంబుఁ జేసె ని
ష్కారణ ప్రేమతోడ; నిదె కంసునిఁ బోలు సఖుండు గల్గునే.
టీక:- సూరులు = పండితులు; తొల్లి = పూర్వము; ఏ = ఏ యొక్క; విభుని = దేవుని యొక్క; శోభిత = ప్రకాశించెడి; పాద = కాలి; నఖ = గోరు; ప్రభా = కాంతుల; ఆవళిన్ = సమూహమును; చేరి = సమీపించి; భవ = సంసార, జన్మాంతర; అంధకారములన్ = దుఃఖము లనెడి చీకట్లలో; చిక్కకన్ = చిక్కుకొనకుండ; దాటుదురు = గడచెదరు; అట్టి = అటువంటి; దేవునిన్ = భగవంతుని; వైరము = శత్రుత్వము; తోడన్ = తోటి; ఐనన్ = అయితేనేమి; పిలువన్ = పిలుచుకుని వచ్చుటకు; ననున్ = నన్ను; పంచి = పంపించి; శుభంబున్ = మేలు; చేసెన్ = కలిగించెను; నిష్కారణ = అకారణమైన; ప్రేమ = ప్రేమ; తోడన్ = తోటి; ఇదె = ఇదిగో; కంసుని = కంసుడిని; బోలు = సాటి వచ్చెడి; సఖుండు = మిత్రుడు; కల్గునే = దొరకునా, దొరకడు.
భావము:- పరమ విజ్ఞులు అయిన వారు ముందు ఏ దేవదేవుడి కాలిగోళ్ళ కాంతిపుంజాలను ఆశ్రయించి జననమరణాలనే చీకట్లలో చిక్కుకొనక తరిస్తారో! అటువంటి భగవంతుడైన కృష్ణుడిని వైరబుద్ధితో జయించడం కోసం అయినా పిలుచుకు రమ్మని నిష్కారణ ప్రేమతో నన్ను పంపి కంసుడు నాకెంతో మేలు చేసాడు. అతని వంటి చెలికాడు మరొకడు ఎక్కడా దొరకడు కదా.
తెభా-10.1-1193-మ.
ఇతఁడా కంసునిచేతఁ బంపువడి నన్ హింసింప నేతెంచినాఁ
డతిదుష్టుం డని చూచునో? సకలభూతాంతర్బహిర్మధ్య సం
గతుఁ డౌటం దలపోసి నన్ను సుజనుంగాఁ జూచునో? యెట్టి యు
న్నతిఁ గావించునొ? యే క్రియం బలుకునో? నా భాగ్య మెట్లున్నదో?"
టీక:- ఇతడు = ఇతను; ఆ = ఆ యొక్క; కంసుని = కంసుడి; చేతన్ = చేత; పంపువడి = పంపబడి; నన్ = నన్ను; హింసింపన్ = చంపుటకు; ఏతెంచినాడు = వచ్చెను; అతి = మిక్కిలి; దుష్టుండు = చెడ్డవాడు; అని = అని; చూచునో = తలచునేమో; సకల = నిఖిలమైన; భూత = ప్రాణుల యొక్క; అంతః = లోపలందు; బహిః = వెలుపలందు; మధ్య = మధ్యమందు; సంగతుడు = చేరి ఉండువాడు; ఔటన్ = అగుటచేత; తలపోసి = తర్కించుకొని; నన్ను = నన్ను; సుజనున్ = మంచివాని; కాన్ = అగునట్లు; చూచునో = తలపోయునేమో; ఎట్టి = ఎటువంటి; ఉన్నతిన్ = గౌరవమును; కావించునో = చేయబోవునో; ఏ = ఎటువంటి; క్రియన్ = విధముగ; పలుకునో = మాట్లాడబోవుచున్నాడో; నా = నా యొక్క; భాగ్యము = అదృష్టము; ఎట్లు = ఎలా; ఉన్నదో = ఉందో ఏమో.
భావము:- “ఈ అక్రూరుడు ఆ కంసుడు పంపుతే, నన్ను హింసించడానికి వచ్చిన పరమ దుర్మార్గు” డని శ్రీకృష్ణుడు నన్ను అనుమానిస్తాడో? నిఖిల ప్రాణుల లోపల వెలుపల రెండూ కానిది అందు మిక్కిలి వ్యాపించి ఉండేవాడు కనుక, ఆలోచించి అభిమానిస్తాడో? నన్ను ఎలా గౌరవిస్తాడో? నాతో ఏవిధంగా మాట్లాడతాడో? ఇంతకీ నా అదృష్టం ఎలా ఉందో ఏమిటో?”
తెభా-10.1-1194-వ.
అని మఱియును.
టీక:- అని = అని; మఱియును = అటుపిమ్మట.
భావము:- ఈవిధంగా తలపోస్తూ ఇంకా ఇలా అనుకోసాగాడు.
తెభా-10.1-1195-మ.
"అలకభ్రాజితమై సుధాంశునిభమై హాసప్రభోద్దామమై
జలజాక్షంబయి కర్ణకుండల విరాజద్గండమై యున్న యా
జలజాతాక్షు ముఖంబు చూడఁగలుగున్ సత్యంబుపో నాకు నా
వలది క్కేగుచు నున్న వీ వనమృగ వ్రాతంబు లీ త్రోవలన్.
టీక:- అలక = ముంగురులచేత; భ్రాజితము = ప్రకాశించునది; ఐ = అయ్యి; సుధాంశు = చంద్రబింబమును; నిభము = పోలునది; ఐ = అయ్యి; హాస = నవ్వుల; ప్రభ = మెరుపులచేత; ఉద్దామము = గొప్పగా ఉన్నది; ఐ = అయ్యి; జలజా = పద్మముల వంటి; అక్షంబు = కన్నులు కలది; అయి = ఐ; కర్ణకుండల = చెవి కుండలములచేత; విరాజత్ = ప్రకాశించుచున్నట్టి; గండము = చెక్కిళ్ళు కలది; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; ఆ = ఆ యొక్క; జలజాతాక్షు = పద్మాక్షుని, కృష్ణుని; ముఖంబు = మోము; చూడన్ = చూచుట; కలుగున్ = జరుగును; సత్యంబుపో = ఇది తథ్యము; నా = నా; కున్ = కు; ఆవలదిక్కు = కుడివైపుగ; ఏగుచున్నవి = వెళ్ళుచున్నాయి; ఈ = ఈ; వన = అడవిలోని; మృగ = జంతువుల; వ్రాతంబులు = సమూహములు; ఈ = ఈ; త్రోవలన్ = దారి యందు.
భావము:- “పద్మాక్షుడైన శ్రీకృష్ణుడి ముఖము ముంగురులతో ముచ్చటగా ప్రకాశిస్తుంటుంది, చంద్రుడితో సరిపోలుతూ ఉంటుంది, నవ్వుల నిగ్గులతో నివ్వటిల్లుతూ ఉంటుంది. కమలదళాల వంటి కన్నులు, చెవులకమ్మల కాంతులతో అందగించే చెక్కిళ్ళు కలిగి ఉంటుంది. అటువంటి మోము దర్శించబోతున్నా. ఇది తథ్యం. ఇదిగో ఈ దారులమ్మట నేను ప్రయాణిస్తుంటే అడవిమృగాలు నాకు కుడిపక్కగా వెళ్తూ శుభాన్ని సూచిస్తున్నాయి.
తెభా-10.1-1196-ఉ.
మాపటివేళ నేను చని మాధవుపాదసమీప మందు దం
డాపతితుండనైన నతఁ డాశుగకాలభుజంగవేగ సం
తాపిత భక్తలోక భయ దారణమైన కరాబ్జ మౌదలన్
మోపి హసించి నా కభయముం గృపతోడుత నీయకుండునే?"
టీక:- మాపటి = సాయంకాల; వేళన్ = సమయానికి; నేను = నేను; చని = వెళ్ళి; మాధవున్ = కృష్ణుని; పాద = కాళ్ళ; సమీపమందు = వద్ద; దండాపతితుండను = సాగిలపడిన వాడను; ఐనన్ = కాగా; అతడు = అతను; ఆశుగ = మిక్కిలి వేగవంతమైన (ఆశుగము = బాణము , వాయువు); కాలభుజంగ = కాలసర్పము వలె; వేగన్ = వేగముతో; సంతాపిత = తపింపజేయబడిన; భక్త = భక్తుల; లోక = సమూహముల యొక్క; భయ = వెరపులను; దారణము = భేదించునది; ఐన = అయినట్టి; కర = చేయి అనెడి; అబ్జమున్ = పద్మమును; ఔదలన్ = తలమీద; మోపి = ఉంచి; హసించి = నవ్వి; నా = నా; కున్ = కు; అభయమున్ = రక్షణమును; కృప = దయ; తోడన్ = తోటి; ఈయకుండునే = ఇవ్వకుండా ఉంటాడా.
భావము:- సాయంకాలం అయ్యేసరికి నేను వెళ్ళి శ్రీకృష్ణుడి పాదాల దగ్గర చేరి సాగిలపడి నమస్కరిస్తాను. ఆయన గబగబ పరుగెత్తే కాలమనే సర్పానికి తల్లడిల్లిపోయే భక్తుల భయాన్ని తొలగించే తన కరకమలాన్ని నా తలపై పెట్టకపోతాడా. చిరునవ్వులు చిందిస్తూ కరుణతో నాకు అభయ ప్రదానం ఇవ్వకపోతాడా.”
తెభా-10.1-1197-వ.
అని మఱియు నక్రూరుం డనేకవిధంబుల గోవింద సందర్శనంబు గోరుచు నమంద గమనంబున సుందర స్యందనారూఢుండయి చని చని.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకను; అక్రూరుండు = అక్రూరుడు; అనేక = పెక్కు; విధంబులన్ = విధములుగ; గోవింద = కృష్ణుని {గోవిందుడు - గోవులకు ఒడయుడు, కృష్ణుడు}; సందర్శనంబు = చూచుటను; కోరుచున్ = ఆశించుచు; అమంద = వేగముగ; గమనంబునన్ = వెళ్ళుటచేత; సుందర = అందమైన; స్యందన = రథమును; ఆరూఢుండు = ఎక్కినవాడు; అయి = ఐ; చనిచని = తొందరగావెళ్ళి.
భావము:- ఇలా రకరకాలుగా అక్రూరుడు గోపాలకృష్ణుడి సందర్శనం కోరుకుంటూ రథము ఎక్కి వేగంగా ప్రయాణం చేసి వెళ్ళి వెళ్ళి. . . .