పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/సాంఖ్యయోగంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తెభా-3-942-సీ.
" ప్రకారమున సర్వేశ్వరు నందును-
బ్రతిలబ్ధ భావసంన్నుఁ డగుచుఁ
జిరతర సద్భక్తిచేఁ బ్రవృద్ధం బైన-
తి మోదమునఁ బులకిశరీరుఁ
గుచు మహోత్కంఠ నానందభాష్పముల్-
డిగొనఁ బరితోషలధిఁ గ్రుంకి
గవత్స్వరూప మై వగుణగ్రాహక-
గుచు మత్సంబంధ నుకరించి

తెభా-3-942.1-తే.
సుమహితధ్యానమునఁ బరంజ్యోతి యందు
నముఁ జాల నియోజించి హిమఁ దనరు
మోక్షపద మాత్మలోన నపేక్షసేయు
నఘవర్తనుఁ డైన మహాత్ముఁ డెపుడు.

టీక:- ఈ = ఈ; ప్రకారమునన్ = విధముగ; సర్వేశ్వరున్ = విష్ణుమూర్తి; అందున్ = అందు; ప్రతి = చక్కగ; లబ్ధ = కలిగిన; భావ = భావములతో; సంపన్నుండు = సంపద కలవాడు; అగుచున్ = అవుతూ; చిరతర = మిక్కిలిబహుకాలపు; సత్ = మంచి; భక్తి = భక్తి; చేన్ = చేత; ప్ర = మిక్కిలి; వృద్ధంబు = వృద్ధి చెందినది; ఐన = అయిన; ఆతి = మిక్కిలి; మోదమునన్ = సంతోషముతో; పులకిత = పులకిస్తున్న; శరీరుడు = దేహము కలవాడు; అగుచున్ = అవుతూ; మహా = గొప్ప; ఉత్కంఠ = ఆసక్తి; ఆనంద = ఆనంద ములతో కూడిన; భాష్పముల్ = కన్నీరు; జడిగొనన్ = వర్షించగా; పరితోష = సంతోషము అనెడి; జలధిన్ = సముద్రములో; క్రుంకి = మునిగి; భగవత్ = భగవంతుని యొక్క; స్వరూపము = స్వరూపము; ఐ = అయ్యి; భవ = సంసారము యొక్క; గుణ = గుణములను; గ్రాహకము = గ్రహించివేయునది, మొసలి; అగుచున్ = అవుతూ; మత్ = నాతో; సంబంధమున్ = సంబంధమును, కూడుటను; అనుకరించి = అనుసరించి;
సు = మంచి; మహిత = మహిమాన్వితమైన; ధ్యానమునన్ = ధ్యానమును; పరంజ్యోతి = విష్ణుమూర్తి {పరంజ్యోతి - అన్నిటికిని అతీతమైన ప్రకాశము, విష్ణువు}; అందున్ = అందు; మనమున్ = మనస్సును; చాలన్ = మిక్కిలిగా; నియోగించి = అప్పచెప్పి, పనిపి; మహిమన్ = గొప్పదనముతో; తనరున్ = అతిశయించు; మోక్షపదమున్ = మోక్షప్రాప్తిని; ఆత్మన్ = మనస్సు; లోనన్ = లో; అపేక్షసేయున్ = కోరును; అనఘు = పుణ్యమైన; వర్తనుడు = ప్రవర్తన కలవాడు; ఐన = అయిన; మహాత్ముడు = గొప్పవాడు; ఎపుడున్ = ఎప్పుడును.
భావము:- ఈవిధంగా నిష్కళంకజీవనుడైన మహాత్ముడు సర్వేశ్వరునిపై నిలిపిన భావసంపద కలవాడై సమధిక సద్భక్తితో మిక్కిలి మోదంతో పులకించిన శరీరం కలవాడై ఎంతో కుతూహలంతో సంతోషబాష్పాలు పొంగిపొరలగా ఆనందం అనే సముద్రంలో మునిగి విషయ బంధాల నుండి విముక్తి కలిగించే నా స్వరూప సంబంధాన్ని చేకూర్చుకొని ఉత్తమ ధ్యానంతో అన్నింటిని మించిన వెలుగునందు మనస్సును నిల్పగలుగుతాడు. హృదయ పూర్వకంగా మోక్షాన్ని అపేక్షిస్తాడు.

తెభా-3-943-వ.
అది గావున; ముక్తి నపేక్షించు మహాత్ముం డగు వాని చిత్తంబు విముక్తం బైన భగవద్వ్యతిరిక్తాశ్రయంబు గలిగి విషయాంతర శూన్యంబై విరక్తిం బొందుటంజేసి పురుషుండు శరీరభావంబుల ననన్యభావం బగు నిర్వాణపదంబు సూక్ష్మం బగు తేజంబు దన కంటె నధింకబగు తేజంబు తోడి సమానాకారంబు నగు చందంబున నిచ్చగించు; వెండియు.
టీక:- అదిగావునన్ = అందుచేత; ముక్తిన్ = ముక్తిని; అపేక్షించు = కోరు; మహాత్ముండు = గొప్పవాడు; అగు = అయిన; వాని = వాని; చిత్తంబున్ = మనస్సు; విముక్తంబున్ = విడిచిపెట్టేసినవి; ఐన = అయిన; భగవత్ = భగవంతుని యొక్క; వ్యతిరిక్త = వ్యతిరేకమును; ఆశ్రయంబున్ = ఆశ్రయమును; కలిగి = కలిగి; విషయ = లక్ష్యములు; అంతర = ఇతరమైనవి; శూన్యంబున్ = లేనివి; ఐ = అయ్యి; విరక్తిన్ = వైరాగ్యమును; పొందుటన్ = పొందుట; చేసి = వలన; పురుషుండు = పురుషుడు; శరీర = దేహమందలి; భావంబులన్ = ఆలోచనలలో; అనన్య = ఇతరము లేని; భావంబున్ = భావము; అగు = కలుగును; నిర్వాణపదంబున్ = ముక్తిపదము; సూక్ష్మంబు = చిన్నది; అగు = అయిన; తేజంబున్ = వెలుగు; తన = తన; కంటెన్ = కంటెను; అధికంబున్ = పెద్దది; అగు = అయిన; తేజంబున్ = వెలుగు; తోడి = తోటి; సమానాకారంబున్ = సమానమైన ఆకారముగన్; అగు = అగు; చందంబునన్ = విధముగనే; ఇచ్ఛగించు = ఇష్టపడును; వెండియున్ = మరియును.
భావము:- అందువల్ల మోక్షాన్ని అపేక్షించే మహానుభావుని మనస్సు సంసార బంధాలనుండి విముక్తమవుతుంది. దానిలో భగవంతునికంటె వ్యతిరిక్తమైన భాగానికి తావు లేదు. భగవంతునికంటె అన్యం కన్పించదు. ఇటువంటి వైరాగ్యం వల్ల పురుషునకు అనన్యస్థితి ప్రాప్తిస్తుంది. చిన్న వెలుగు తనకంటే పెద్దదైన వెలుగుతో కలిసినప్పుడు తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. అదే విధంగా జీవుడు తన శరీరం, మనస్సు మొదలైన వానియందు వేరే భావన లేక సర్వం భగవన్మయంగా సంభావిస్తాడు. ఆ అనన్యభావమే మోక్షం.

తెభా-3-944-సీ.
పురుషుఁడు చరమమై భువి నన్య విషయ ని-
వృత్తమై తగ నివర్తించు చిత్త
వృత్తాదులను గల్గి వెలయంగ నాత్మీయ-
గు మహిమ సునిష్ఠుఁడై లభించు
సుఖదుఃఖముల మనస్సునఁ దలపక యహం-
కారధర్మంబులుగాఁ దలంచి
నయంబు సాక్షాత్కృతాత్మతత్త్వము గల్గు-
తఁడు జీవన్ముక్తుఁ డండ్రు ధీరు

తెభా-3-944.1-తే.
తఁడు నే చందమున నుండు నిన వినుము
శరీరంబు నిలుచుటయును జరించు
యును గూర్చుండుటయు నిఁకేమియు నెఱుంగ
ర్థి వర్తించు విను తల్లి! తఁడు మఱియు.

టీక:- పురుషుడు = పురుషుడు; చరమమై = చిట్టచివరిదైనది; ఐ = అయ్యి; భువిన్ = లోకములో; అన్య = ఇతర; విషయ = విషయముల నుండి; నివృత్తము = మరల్చబడినది, విముఖమైనది; ఐ = అయ్యి; తగ = అవశ్యము; నివర్తించు = ప్రవర్తించు; చిత్తవృత్తి = చిత్తవృత్తి; ఆదులను = మొదలగువానిని; కలిగి = ఉండి; వెలయంగ = ప్రకాశించునట్లు; ఆత్మీయము = తనది; అగు = అయినట్టి; మహిమన్ = గొప్పదనముతో; సు = మంచి; నిష్ఠుడు = నిష్ఠకలవాడు; ఐ = అయ్యి; లభించు = కలిగెడి; సుఖ = సుఖమును; దుఃఖములన్ = దుఃఖములను; మనస్సునన్ = మనస్సులో; తలపకన్ = లక్ష్యపెట్టక; అహంకార = అహంకారము యొక్క; ధర్మంబులు = ధర్మములు; కాన్ = అగునట్లు; తలంచి = తీసుకొని; అనయంబున్ = నిత్యము; సాక్షాత్కృత = సాక్షాత్కరించిన; ఆత్మతత్త్వము = ఆత్మతత్త్వము; కల్గున్ = కలుగునో; అతడున్ = అతనిని; జీవన్ముక్తుడు = జీవన్ముక్తుడు; అండ్రు = అనెదరు; ధీరులు = జ్ఞానులు; అతడున్ = అతడు; ఏ = ఏ; చందంబునన్ = విధముగా; ఉండున్ = ఉండును; అనినన్ = అనగా;
వినుము = వినుము; తన = తన యొక్క; శరీరంబు = దేహము; నిలుచుటయును = నిలుచుండుట; చరించుటయునున్ = తిరుగుట; కూర్చుంటయున్ = కూర్చొనుట; ఇఁకేమియున్ = ఇంకేమీకూడ; ఎఱుంగకన్ = తెలియక; అర్థిన్ = కోరి; వర్తించున్ = నడచును; విను = వినుము; తల్లి = తల్లి; అతడున్ = అతడు; మఱియు = ఇంకను.
భావము:- ఏ పురుషుడు తన జీవితానికి అంతిమ గమ్యాన్ని భావిస్తూ అన్య విషయాలనుండి నివృత్తమైన చిత్తంతో ఆత్మజ్ఞానమందు నిశ్చలమైన నిష్ఠ కలవాడై సుఖ దుఃఖాలను లక్ష్యపెట్టక అవి అహంకార ధర్మాలని గుర్తించి వర్తిస్తాడో ఆ పురుషునికి ఆత్మతత్త్వం సాక్షాత్కరిస్తుంది. అటువంటి వానినే జీవన్ముక్తుడని ప్రాజ్ఞులంటారు. అటువంటివాడు తన శరీరం నిలుచుండటం, కూర్చుండటం, తిరగడం మొదలైనవి ఏవీ తెలియకుండా ఉంటాడు. తల్లీ! ఇంకా విను.

తెభా-3-945-వ.
మదిరాపానంబునం జేసి మత్తుం డగు వాఁడు దనకు బరిధానంబగు నంబరంబు మఱచి వర్తించు చందంబునఁ, దన శరీరంబు దైవాధీనం బని నశ్వరం బని తలంచి యాత్మతత్త్వనిష్ఠుండై యుపేక్షించు; అదియునుం గాక సమాధియోగంబునం జేసి సాక్షాత్కృతాత్మతత్త్వంబు గలవాడయి స్వాప్నికశరీరంబు చందంబున యావత్కర్మఫలానుభవ పర్యంతంబు పుత్ర దార సమేతం బగు ప్రపంచంబు ననుభవించి; యటమీదఁ బుత్ర దారాది సంబంధంబువలనం బాసి వర్తించు.
టీక:- మదిరా = మద్యమును; పానంబున్ = తాగుట; చేసి = చేసి; మత్తుండు = మత్తెక్కినవాడు; అగు = అయిన; వాడు = వాడు; తన = తన; కున్ = కు; పరిధానంబు = ధరింపబడినది; అగు = అయినట్టి; అంబరంబున్ = బట్టను; మఱచి = మరిచిపోయి; వర్తించు = తిరుగు; చందంబునన్ = విధముగ; తన = తన యొక్క; శరీరంబున్ = దేహము; దైవ = దేవునికి; ఆధీనంబున్ = ఆధీనములో ఉన్నది; అని = అనియు; అశ్వరంబున్ = నశించునది; అని = అనియు; తలంచి = అనుకొని; ఆత్మతత్వ = ఆత్మతత్త్వము నందు; నిష్ఠుండు = నిష్ఠ కలవాడు; ఐ = అయ్యి; ఉపేక్షించున్ = అలక్ష్యము చేయును; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; సమాధియోగంబునన్ = సమాధియోగము; చేసి = వలన; సాక్షాత్కృత = సాక్షాత్కరించిన; ఆత్మతత్త్వంబు = ఆత్మతత్త్వము; కల = కలిగిన; వాడు = వాడు; అయి = అయ్యి; స్వాప్నిక = స్వప్నమునకు చెందిన; శరీరంబు = దేహము; చందంబునన్ = వలె; యావత్ = సమస్తమైన; కర్మ = కర్మములు; ఫల = ఫలములను; అనుభవించు = అనుభవించుట; పర్యంతము = పూర్తగు వరకు; పుత్ర = సంతానము; దార = భార్యలతో; సమేతంబు = కూడినట్టిది; అగు = అయిన; ప్రపంచంబున్ = ప్రపంచమును; అనుభవించి = అనుభవించేసి; అటమీద = ఆపైన; పుత్ర = సంతానము; దార = భార్యలతో; ఆది = మొదలగు; సంబంధంబున్ = సంబంధములను; పాసి = విడిచి; వర్తించు = నడచును.
భావము:- మద్యపానం చేసి మైకంలో ఉన్న మనుష్యుడు పైబట్టను మరచిపోయి ప్రవర్తించిన విధంగా జీవన్ముక్తుడైనవాడు తన శరీరం దైవాధీనమనీ, అది ఎప్పుడో నశించిపోయేదనీ భావించి ఆత్మతత్త్వాన్ని అవగతం చేసుకొని ఉపేక్షాభావంతో ఉంటాడు. అంతేకాకుండా ఏకాగ్రభావంతో ఆత్మ సాక్షాత్కారం పొందినవాడై కర్మఫలం అనుభవింప వలసినంత వరకు భార్యాపుత్రులతో కూడిన ఈ సంసారాన్ని స్వప్నంలో లాగా అనుభవిస్తాడు. తర్వాత కలనుండి మేల్కొన్నవానిలాగా ఈ సంసార బంధాలన్నీ వదలిపెట్టి వర్తిస్తాడు.

తెభా-3-946-సీ.
సుత దార మిత్రానుజులకంటె మర్త్యుండు-
భిన్నుఁడై వర్తించుచున్నరీతి
విస్ఫులింగోల్ముక విపులధూమములచే-
వ్యవాహనుఁడు వేయినరీతి
లనొప్ప దేహంబులన నీ జీవాత్మ-
రికింప భిన్నరూమున నుండుఁ
విలి భూతేంద్రియాంతఃకరణంబుల-
భాసిల్లుచున్న యీ ప్రకృతిరూప

తెభా-3-946.1-తే.
బ్రహ్మమున కాత్మ దాఁ బృథగ్భావ మగుచు
ద్రష్టయయి బ్రహ్మ సంజ్ఞచేఁ నరుచుండు
ఖిలభూరి ప్రపంచంబు లందుఁ దన్నుఁ
విలి తనయందు నఖిల భూములఁ గనుచు.

టీక:- సుత = పుత్రులు; దార = భార్య; మిత్ర = స్నేహితులు; అనుజులు = సోదరులు; కంటెన్ = కంటెను; మర్త్యుండు = మానవుడు {మర్త్యుడు - మృత్యువు కలవాడు, మానవుడు}; భిన్నుడు = వేరైనవాడు; ఐ = అయ్యి; వర్తించుచున్న = ఉంటున్న; రీతిన్ = విధముగ; విస్పులింగ = అగ్నికణములు; ఉల్ముక = కొరివి, కాలుతున్న కఱ్ఱమంట; విపుల = విస్తృతమైన; ధూమముల్ = పొగల; చేన్ = నుండి; హవ్యవాహనుండు = అగ్నిదేవుడు; వేఱయిన = వేరుగ ఉండు; రీతిన్ = విధముగ; వలనొప్పన్ = పోలి ఉండెడి; దేహంబు = శరీరము; వలనన్ = నుండి; ఈ = ఈ; జీవాత్మ = జీవుడు; పరికింపన్ = తరచిచూసిన; భిన్న = వేరైన; రూపమున్ = స్వరూపమున; ఉండున్ = ఉండును; తవిలి = వ్యక్తమగుచున్; భూత = పంచభూతములు; ఇంద్రియ = దశేంద్రియములు; అంతఃకరణంబులన్ = అంతఃకరణచతుష్టయములతో; భాసిల్లుతున్న = ప్రకాశిస్తున్న; ఈ = ఈ; ప్రకృతి = ప్రాకృతిక; రూప = రూపము కల;
బ్రహ్మమున = పరమాత్మ; కున్ = కు; ఆత్మ = ఆత్మ; తాన్ = తాను; పృథక్ = వేరైన; భావము = భాగము; అగుచున్ = అవుతూ; ద్రష్ట = చూచువాడు, దర్శించువాడు; అయి = అయ్యి; బ్రహ్మ = బ్రహ్మ; సంజ్ఞ = అను పేరు; చేన్ = తోటి; తనరుచున్ = అతిశయించి; ఉండున్ = ఉండును; అఖిల = సమస్తమైన; భూరి = అత్యధికమైన విధములగు; ప్రపంచంబుల్ = ప్రపంచముల; అందున్ = అందులోను; తన్నున్ = తనను; తవిలి = వ్యక్తముగుచున్; తన = తన; అందున్ = లో; అఖిల = సమస్తమైన; భూతములన్ = భూతములను; కనుచున్ = చూచుచున్.
భావము:- పుత్ర మిత్ర కళత్రాదులకంటె మానవుడు వేరైనట్లు, మిణుగురుల కంటే, కొరవుల కంటే, పొగ కంటే అగ్ని వేరైనట్లు దేహం కంటే జీవాత్మ వేరై ఉంటుంది. పంచభూతాలు, ఇంద్రియాలు, అంతఃకరణము, వీటితో భాసించే ఈ ప్రకృతి రూప పరమాత్మ కంటే ఆత్మ వేరుగా ఉంటుంది. ఆ ఆత్మ బ్రహ్మ సంజ్ఞతో ద్రష్టయై ఒప్పుతూ అఖిల భూతాలలో తననూ, తనలో అఖిల భూతాలను కనుగొంటుంది.

తెభా-3-947-వ.
వెండియు.
టీక:- వెండియున్ = మరియును.
భావము:- ఇంకా…

తెభా-3-948-సీ.
రుస ననన్యభావంబునఁ జేసి భూ-
తావళి యందుఁ దదాత్మకత్వ
మునఁ జూచు నాత్మీయ తరోపాదాన-
ముల యందుఁ దవిలి యిమ్ముల వెలుంగు
నిట్టి దివ్యజ్యోతి యేకమయ్యును బహు-
భావంబులను దోఁచు ప్రకృతిగతుఁడు
గుచున్న యాత్మయుఁ బొడొందు దేవ తి-
ర్యఙ్మనుష్యస్థావరాది వివిధ

తెభా-3-948.1-తే.
యోనులను భిన్నభావంబు నొందుటయును
జాలఁ గల్గు నిజగుణ వైమ్యమునను
భిన్నుఁడై వెల్గుఁ గావున బేర్చి యదియు
దేహసంబంధి యగుచు వర్తించుచుండు.

టీక:- వరుసన్ = క్రమముగ; అనన్య = అనితరము; భావంబునన్ = అని భావించుట; చేసి = వలన; భూత = భూతములు; ఆవళిన్ = సమస్తము; అందున్ = లోను; తత = వానిని; ఆత్మకత్వమున = తానేయనుభావమున; చూచున్ = దర్శించును; ఆత్మీయ = తన యొక్క; ఘనతర = అత్యధికమైన {ఘనము - ఘనతరము - ఘనతమము}; ఉపాధానముల్ = దేహములు; అందున్ = అందు; తవిలి = వ్యక్తమగుచున్; ఇమ్ముల = మనోజ్ఞముగ; వెలుంగున్ = వెలిగెడి; ఇద్ధజ్యోతి = దివ్యజ్యోతి; ఏకము = ఒకటే; అయ్యున్ = అయినను; బహు = ఆనేక; భావంబులన్ = విధములుగ; తోచు = కనిపించును; ప్రకృతి = ప్రకృతి; గతుడు = లోనున్నవాడు; అగుచున్న = అవుతున్న; ఆత్మయున్ = తనను; పొగడొందు = ప్రసిద్దమగును; దేవ = దేవతలు; తిర్యక్ = జంతువులు; మనుష్య = మనుష్యులు; స్థావర = వృక్షములు; ఆది = మొదలగు; వివిధ = రకరకముల;
యోనులన్ = గర్భములలో; భిన్న = వేరవేరు; భావంబును = విధములు; ఒందుటయున్ = కలుగుటలు; చాలన్ = చాలా రకాలు; కల్గున్ = కలుగును; నిజ = తన; గుణ = గుణములలో; వైషమ్యమునను = బేధములతో; భిన్నుడు = వేరువేరుగ యైనవాడు; ఐ = అయ్యి; వెల్గున్ = ప్రకాశించును; కావునన్ = అందుచేత; అదియున్ = అదికూడ; దేహ = ఆయా దేహములకు; సంబంధి = సంబంధించినవి; అగుచున్ = అవుతూ; వర్తించుచున్ = ప్రవర్తిస్తూ; ఉండున్ = ఉండును.
భావము:- సర్వ భూతాలలోను అనన్య భావంతో, సర్వత్ర ఆత్మగా వెలుగుతూ ఉంటుంది. ఆ దివ్యజ్యోతి ఒక్కటే అయినా పెక్కింటివలె కనిపిస్తుంది. ప్రకృతిగతమైన ఆ ఆత్మ దేవతలు, మనుష్యులు, జంతువులు, స్థావరాలు మొదలైన వేరువేరు యోనులలో వేరువేరు భావాన్ని పొందుతూ భిన్న గుణాలతో భిన్నంగా వెలుగుతూ ఉంటుంది. నిజానికి దేహాలు మాత్రమే వేరు కాని వెలుగు ఒక్కటే.

తెభా-3-949-క.
భావింప సదసదాత్మక
మై వెలయును దుర్విభావ్య గుచు స్వకీయం
బై ర్తించుచుఁ బ్రకృతిని
భామునఁ దిరస్కరించు వ్యస్ఫూర్తిన్.

టీక:- భావింపన్ = పరిశీలించిన; సదసదాత్మకము = సత్యాసత్యమను ద్వైధీభావముతో కూడినది; ఐ = అయ్యి; వెలయును = విలసిల్లును; దుర్విభావ్యము = భావించుటకు కష్టమైనది; అగుచున్ = అవుతూ; స్వకీయంబు = స్వతంత్రము; ఐ = అయ్యి; వర్తించుచున్ = ప్రవర్తిస్తూ; ప్రకృతిని = ప్రకృతిని; భావమునన్ = భావములోనే; తిరస్కరించున్ = తిరస్కరించును; భవ్య = యోగ్యమైన; స్ఫూర్తిన్ = స్ఫూర్తితో.
భావము:- ఆత్మ సదసదాత్మకమై, భావాతీతమై, ఆత్మీయ భావంతో వర్తిస్తూ తన ఉజ్జ్వల తేజస్సుతో ప్రకృతిని తిరస్కరించి లోబరచుకుంటుంది.

తెభా-3-950-వ.
ఈ యాత్మ నిజస్వరూపంబునం జేసి వర్తించు"నని కపిలుం డెఱింగించిన విని దేవహూతి వెండియు నిట్లనియె "మహాత్మా! మహదాది భూతంబులకుం బ్రకృతి పురుషులకుం గల్గిన పరస్పర లక్షణంబులను దత్స్వరూపంబులను నెఱింగించితి; వింక నీ ప్రకారంబున సాంఖ్యంబు నందు నిరూపింపఁబడు నట్టి ప్రకారంబును, భక్తియోగ మహాత్మ్యంబును, బురుషుండు భక్తియోగంబునం జేసి సర్వలోక విరక్తుం డగునట్టి యోగంబును, బ్రాణిలోకంబునకు సంసారం బనేక విధం బయి యుండుఁ; గావున బరాపరుండవై కాలస్వరూపి వైన నీ స్వరూపంబుు యే నీవలని భయంబునం జేసి జనులు పుణ్యకార్యంబులు సేయుచుండుదురు; మిథ్యాభూతం బైన దేహంబు నందు నాత్మాభిమానంబుసేయుచు మూఢుండై కర్మంబు లందు నాసక్తం బైన బుద్ధిం జేసి విభ్రాంతుం డగుచు సంసార స్వరూపం బగు మహాంధ కారంబు నందుఁ జిరకాల ప్రసుప్తుం డైన జనునిఁ బ్రబోధించుకొఱకు యోగభాస్కరుండవై యావిర్భవించిన పుణ్యాత్ముండవు నీవు; గావున, నాకు నిన్నియుం దెలియ సవిస్తరంబుగా నానతియ్యవలయు"ననిన దేవహూతికి గపిలుం డిట్లనియె.
టీక:- ఈ = ఈ; ఆత్మ = ఆత్మ (సాధకుడు); నిజ = తన; స్వరూపంబునన్ = స్వరూపమైన ఆత్మగా; చేసి = తెలుసుకొని; వర్తించున్ = నడచుకొనును; అని = అని; కపిలుండు = కపిలుడు; ఎఱింగించినన్ = తెలుపగా; విని = విని; దేవహూతి = దేవహూతి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; మహాత్మా = మహాత్ముడా; మహదాది = మహదాది {మహదాది - మహత్తు మరియు పంచభూతములైన 1ఆకాశము 2తేజస్సు 3వాయువు 4జలము 5పృథ్వి అను కారణభూతములు}; భూతంబుల్ = భూతముల; కున్ = కు; ప్రకృతి = ప్రకృతి; పురుషుల్ = పురుషుల; కున్ = కును; కల్గిన = ఉన్నట్టి; పరస్పర = అన్యోన్యమైన; లక్షణంబులను = లక్షణములను; తత్ = వాని; స్వరూపంబునున్ = స్వరూపములను; ఎఱింగింతివి = తెలిపితివి; ఇంకన్ = ఇంక; ఈ = ఈ; ప్రకారంబునన్ = విధముగనే; సాంఖ్యంబున్ = సాంఖ్యాయోగము; అందున్ = లో; నిరూపింపబడున్ = నిరూపింపబడే; అట్టి = అటువంటి; ప్రకారంబును = విషయమును; భక్తియోగ = భక్తియోగము యొక్క; మహాత్మ్యంబును = గొప్పదనమును; పురుషుండు = పురుషుడు; భక్తియోగంబునన్ = భక్తియోగము; చేసి = వలన; సర్వ = సమస్తమైన; లోక = లౌకికముల నుండి; విరక్తుండు = వైరాగ్యము పొందినవాడు; అగునట్టి = అయ్యేటటువంటి; యోగంబునున్ = యోగమును; ప్రాణి = జీవ; లోకంబున్ = జాలమున; కున్ = కు; సంసారంబు = భవము; అనేక = అనేకమైన; విధంబున్ = విధములుగ; అయి = అయ్యి; ఉండున్ = ఉండును; కావునన్ = కనుక; పర = పరుడవు (బయట ఉండువాడవు); అపరుండవున్ = అపరుడవు (లోన ఉండువాడవు); ఐ = అయ్యి; కాల = కాలమే; స్వరూపివిన్ = స్వరూపమైన వాడవు; ఐన = అయిన; నీ = నీ యొక్క; స్వరూపంబునున్ = స్వరూపమును; ఏ = ఎటువంటి; నీ = నీ; వలని = వలన; భయంబున్ = భయము; చేసి = చేత; జనులు = ప్రజలు; పుణ్య = పుణ్యవంతములైన; కార్యంబులున్ = పనులను; చేయుచున్ = చేస్తూ; ఉండుదురు = ఉంటారు; మిథ్యా = అసత్య; భూతంబున్ = రూపము; ఐన = కలదైన; దేహంబున్ = శరీరము; అందున్ = ఎడల; ఆత్మా = తనదనుకొనెడి; అభిమానంబునన్ = ఆపేక్ష; చేయుచున్ = చెందుతూ; మూఢుండు = మూర్ఖుడు; ఐ = అయ్యి; కర్మంబులు = కర్మముల; అందున్ = లో; ఆసక్తంబున్ = తగులుకొన్నది; ఐన = అయిన; బుద్ధిన్ = బుద్ధి; చేసి = వలన; విభ్రాంతుడు = మిక్కిలి భ్రాంతి కలవాడు {భ్రాంతి - లేనిది ఉన్నదనుకొనుట}; అగుచున్ = అవుతూ; సంసార = సంసారము యొక్క; మహా = గొప్ప; అంధకారంబునన్ = చీకటి; అందున్ = లో; చిర = ఎక్కువ; కాల = సమయము; ప్రసుప్తుండు = అతినిద్రాలోలుడు; ఐన = అయిన; జనునిన్ = వానిని; ప్రబోధించు = మెలకువలోకి తెచ్చుట, లేపుట; కొఱకున్ = కోసమై; యోగ = యోగమును ప్రసరించుటలో; భాస్కరుండవు = సూర్యుడవు; ఐ = అయ్యి; ఆవిర్భవించిన = అవతరించిన; పుణ్యాత్ముండవు = పుణ్యాత్ముడవు; నీవున్ = నీవు; కావునన్ = అందుచేత; నాకున్ = నాకు; అన్నియున్ = అన్నీ; తెలియన్ = తెలియునట్లు; సవిస్తారంబుగా = మిక్కిలి వివరణాత్మకముగ; ఆనతి = సెలవు; ఇయ్యన్ = ఇవ్వ; వలయును = వలసినది; అనిన = అనగా; దేవహూతిన్ = దేవహూతి; కిన్ = కి; కపిలుండు = కపిలుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- ఈ ఆత్మ నిజస్వరూపంతో విరాజిల్లుతుంటుంది” అని కపిలుడు తెలియజెప్పగా విని దేవహూతి మళ్ళీ ఇలా అన్నది. “అసత్యమైన దేహంపై ఆత్మాభిమానం పెంచుకొని మూర్ఖుడై, కర్మలపై ఆసక్తి కలిగిన బుద్ధితో భ్రమించి, సంసారమనే పెనుచీకటిలో చాలాకాలం నిద్రామత్తుడైన జనుని మేల్కొల్పడం కోసం యోగభాస్కరుడవై పుట్టిన పుణ్యాత్ముడవు నీవు. కాబట్టి ఓ మహాత్మా! మహదాది భూతాలకు, ప్రకృతి పురుషులకు ఉన్న వేరువేరు లక్షణాలను చెప్పావు. వాటి వాటి స్వరూపాలను వివరించావు. ఆ విధంగానే సాంఖ్యయోగాన్ని అనుసరించి భక్తియోగ మహత్త్వాన్ని వెల్లడించు. పురుషుడు భక్తియోగం ద్వారా సమస్త ప్రపంచంనుండి విరక్తుడయ్యే విధం వివరించు. ప్రాణిలోకానికి అనేక విధాలుగా ఉండే సంసారానికి పరాపరుడవై కాలస్వరూపుడవై ఉన్న నీ స్వరూపాన్ని ఎరిగించు. కాలస్వరూపుడవైన ఏ నీ భయంవల్ల మానవులు పుణ్యకర్మలు చేస్తారో వానిని సవిస్తరంగా తెలిసేలా చెప్పు” అని అడుగగా దేవహూతితో కపిలుడు ఇలా అన్నాడు.