Jump to content

పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/శ్రీహరిదర్శనంబు

వికీసోర్స్ నుండి


తెభా-3-531-వ.
అను సమయంబున.
టీక:- అను = అనెడి; సమయంబునన్ = సమయములో.
భావము:- జయవిజయులు ఇలా అంటున్న సమయంలో...

తెభా-3-532-మ.
రి సర్వేశుఁ డనంతుఁ డా కలకలం బాలించి పద్మాలయా
సాలాపవినోద సౌఖ్యరచనల్ చాలించి శుద్ధాంత మం
ది మాణిక్య సుగేహళుల్ గడచి యేతెంచెం బ్రపన్నార్తి సం
రుఁడై నిత్యవిభూతిశోభనకరుండై మానితాకారుఁడై.

టీక:- హరి = విష్ణుమూర్తి; సర్వేశుడు = విష్ణుమూర్తి {సర్వేశుడు - సర్వులకును ఈశుడు (ప్రభువు), విష్ణువు}; అనంతుడు = విష్ణుమూర్తి {అనంతుడు - అంతములేనివాడు, విష్ణువు}; ఆ = ఆ; కలకలంబున్ = రొదను; ఆలించి = విని; పద్మాలయా = లక్ష్మీదేవితో {పద్మాలయ - పద్మములను నివాసముగా కలామె, లక్ష్మీదేవి}; సరస = సరసమైన; ఆలాప = మాటలాడు కొను; వినోద = వినోదించుట యందలి; సౌఖ్యరచనల్ = సుఖ సంభాషణలను; చాలించి = ఆపివేసి; శుద్దాంతమందిర = అంతఃపురము యొక్క {శుద్దాంత మందిరము - శుద్ద (స్వచ్ఛమైన) అంత (లోని) మందిరము (భవనము), అంతఃపురము}; మాణిక్య = మాణిక్యములు పొదిగిన; సు = మంచి; గేహళుల్ = గడపలు; కడచి = దాటుకొని; ఏతెంచెన్ = వచ్చెను; ప్రపన్న = ఆశ్రయించినవారి; ఆర్తి = బాధలను; సంహరుడు = నిర్మూలించువాడు; ఐ = అయ్యి; నిత్య = శాశ్వతమైన; విభూతిన్ = వైభవముతో; శోభన = శుభములను; కరుండు = కలిగించువాడు; ఐ = అయ్యి; మానిత = పూజింపబడు; ఆకారుండు = స్వరూపము కలవాడు; ఐ = అయ్యి.
భావము:- అందరికీ ప్రభువైనవాడూ, అంతములేనివాడూ అయిన హరి ఆ కలకలాన్ని విని, లక్ష్మీదేవితో సరస సల్లాపాలు చేస్తూ వినోదించడాన్ని చాలించి, ఆశ్రయించినవారి కష్టాలను పోగొట్టేవాడై, శాశ్వత వైభవంతో శుభాలను కలిగించేవాడై అంతఃపురం యొక్క మాణిక్యాలు పొదిగిన మందిర ద్వారాలను దాటి మాననీయ స్వరూపంతో వచ్చాడు.

తెభా-3-533-వ.
మఱియును.
టీక:- మఱియును = ఇంకనూ.
భావము:- ఇంకా...

తెభా-3-534-చ.
నిధికన్యకామణియు సంభ్రమ మొప్పఁగఁ దోడరా మనో
నిజ లీలమైఁ బరమహంస మునీశ్వర వంద్య పాదపం
రుహములన్ వినూత్న మణికాంచన నూపుర మంజు ఘోషముల్
రుసఁ జెలంగ నార్యజనవంద్యుఁడు యోగిజనైకసేవ్యుఁడై.

టీక:- శరనిధికన్యకామణియు = లక్ష్మీదేవియును {శరనిధి కన్యకామణి - శరము (నీరు) కి నిథి వంటివాని, సముద్రుని కన్యకామణి (శ్రేష్ఠమైన పుత్రిక), లక్ష్మీదేవి}; సంభ్రమము = ఆశ్చర్యము; ఒప్పన్ = కలుగగా; తోడన్ = కూడా; రాన్ = వస్తుండగా; మనోహర = మనోహరమైన; నిజ = తన; లీలమై = లీలతో; పరమహంస = పరమహంసలచేత {పరమహంస - సన్యాస ఆశ్రమమున ఉత్తమ పదమును పొందినవాడు}; ముని = మునులలో; ఈశ్వర = శ్రేష్ఠులచేత; వంద్య = నమస్కరింపబడు; పాద = పాదములు అనెడి; పంకరుహములన్ = పద్మములను {పంకరుహము - నీట పుట్టునది, పద్మము}; వినూత్న = సరికొత్త; మణి = మణులు పొదిగిన; కాంచన = బంగారు; నూపుర = అందెల; మంజు = మృదువైన; ఘోషముల్ = సవ్వడి; వరుసన్ = క్రమముగా; చెలంగన్ = చెలరేగగా; ఆర్య = పూజ్యులైన; జన = జనులచే; వంద్యుడు = సేవింపబడువాడు; యోగి = యోగులైన; జన = జనులు; ఏక = అందరకును; సేవ్యుండు = సేవింపబడువాడు; ఐ = అయ్యి.
భావము:- లక్ష్మీదేవి కూడా తొట్రుపాటు కలిగినదై వెంట రాగా, పరమహంసలైన మునీశ్వరులు నమస్కరించే తమ పాదపద్మాలకున్న క్రొత్త మణులు పొదిగిన బంగారు అందెలు అడుగడుగుకూ మనోహరమైన శబ్దాలు చేస్తుండగా శ్రీహరి మహానుభావులచేత నమస్కరింపబడేవాడై, యోగులచేత సేవింపబడేవాడై శ్రీహరి వచ్చాడు.

తెభా-3-535-చ.
మణి హేమ కంకణ నికాయ ఝణంకృతు లుల్లసిల్ల న
చ్చ లిడు హంసపక్ష సితచామర గంధవహోచ్చలత్సుధా
రుచి రాతపత్ర సుభప్రవిలంబిత హారవల్లరీ
స గళత్తుషార కణజాల విరాజిత మంగళాంగుడై.

టీక:- కర = చేతి; మణి = మణులు పొదిగిన; హేమ = బంగారు; కంకణ = కంకణములు, కడియములు; నికాయ = సమూహముల; ఝణంకృతులు = ఝణ (గణగణ) యనే రవములు; ఉల్లసిల్ల = అతిశయింపగా; అచ్ఛరలు = అప్సరసలు; ఇడు = సేవించు; హంస = హంసల; పక్ష = రెక్కల ఈకలతో చేసిన; సిత = తెల్లని; చామర = చామరములు నుండి; గంధవహ = వీచు గాలులకు {గంధవాహుడు - వాసనలను మోసుకొని వెళ్ళు వాడు, వాయువు}; ఉచ్ఛలత్ = పైకెగురుతున్న; సుధాకర = చంద్రుని {సుధాకరుడు - సుధా (వెన్నెల)ను కరుడు చేయువాడు, చంద్రుడు}; రుచిర = వంటి ప్రకాశమానమైన; ఆతపత్ర = గొడుగు; సుభగ = అలంకారముగా; ప్రవిలంబిత = చక్కగా వేల్లాడుతున్న; హార = ముత్యాలహారముల; వల్లరీ = వరుసలు అను; సరస = చక్కగా; గళత్ = జారుతున్న; తుషార = మంచు; కణ = బిందువుల; జాల = సమూహముచే; విరాజిత = విలసిల్లుతున్న; మంగళ = శుభకరమైన; అంగుడు = దేహము కలవాడు; ఐ = అయ్యి;
భావము:- అప్సరసలు తమ చేతులకున్న మణులు పొదిగిన బంగారు కంకణాలు గల్లుగల్లున మ్రోగుతుండగా హంసరెక్కలవంటి తెల్లని వింజామరలను వీస్తున్నారు. ఆ వింజామరల గాలికి చంద్రబింబంలా వెలుగుతున్న వెల్లగొడుగు అంచులలో వ్రేలాడుతున్న ముత్యాల హారాలు బాగా కదులుతున్నాయి. వాటిమీదనుండి చల్లగా జారిపడుతున్న మంచుబిందువులతో అందాలు చిందే దివ్యమంగళ స్వరూపుడై శ్రీహరి వచ్చాడు.

తెభా-3-536-వ.
మఱియును.
టీక:- మఱియును = ఇంకనూ.
భావము:- ఇంకా...

తెభా-3-537-సీ.
నిఖిల మునీంద్ర వర్ణిత సస్మితప్రస-
న్నాననాంబుజముచే లరు వాఁడు
విశ్రుత స్నేహార్ద్ర వీక్షణ నిజ భక్త-
న గుహాశయుఁ డనఁ నరు వాఁడు
మానిత శ్యామాయమాన వక్షమున నం-
చిత వైజయంతి రాజిల్లు వాఁడు
జనావన కృపామృ తరంగితములై-
భాసిల్లు లోచనాబ్జముల వాఁడు

తెభా-3-537.1-తే.
ఖిల యోగీంద్రజన సేవ్యుఁ డైన వాఁడు
సాధుజనముల రక్షింపఁ జాలు వాడు
భువన చూడా విభూషయై భూరిమహిమ
మించు వైకుంఠపురము భూషించు వాఁడు.

టీక:- నిఖిల = సమస్తమైన; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠులచేత; వర్ణిత = కీర్తింపబడు; సస్మిత = చిరునవ్వుతో కూడిన; ప్రసన్న = ప్రసన్నమైన; ఆనన = మోము అనెడి; అంబుజము = పద్మము; చేన్ = చేత; అలరువాడు = ఒప్పువాడు; విశ్రుత = ప్రసిద్దికెక్కిన; స్నేహ = ప్రేమతో; ఆర్ద్ర = చెమ్మగిలిన; వీక్షణ = కన్నులు కల; నిజ = తన; భక్త = భక్తులైన; జన = జనుల; గుహా = హృదయములందు; ఆశయుడు = నివసించువాడు; అనన్ = అనగా; తనరువాడు = అతిశయించువాడు; మానిత = గౌరవింపబడిన; శ్యామా = నల్లని; అయమాన = రంగుకల; వక్షమునన్ = వక్షస్థలమున; అంచిత = అలంకరింపబడిన; వైజయంతి = వైజయంతి అను మాలచేత; రాజిల్లువాడు = విరాజిల్లువాడు; నత = స్తుతిస్తున్న; జన = జనులు అను; అవన = రక్షించునట్టి; కృపా = దయఅను; అమృత = అమృతతో; తరంగితములు = తౌణుకుచున్నవి; ఐ = అయ్యి; భాసిల్లు = ప్రకాశించు; లోచన = కన్నులు అను; అబ్జములవాడున్ = పద్మములుకలవాడును; అఖిల = సమస్తమైన; యోగి = యోగులలో; ఇంద్ర = ఉత్తములైన; జన = జనులచే; సేవ్యుండు = సేవింపబడువాడు; ఐన = అయిన; వాడు = వాడు;
సాధు = మంచి; జనములన్ = జనులను; రక్షింపన్ = రక్షించుటకు; చాలువాడు = సమర్థుడు; భువన = సకల భువనములకు; చూడావిభూష = శిరోమణి అను ఆభరణము వంటిది; ఐ = అయ్యి; భూరి = గొప్ప; మహిమన్ = మహిమతో; మించు = అతిశయించు; వైకుంఠ = వైకుంఠము అను; పురమున్ = పురమునకు; భూషించువాడు = ఆభరణము వంటివాడు.
భావము:- ఆ శ్రీహరి మునీశ్వరు లందరూ వర్ణించే మందహాస సుందరమైన ప్రసన్న ముఖపద్మంతో అలరేవాడు. విశేషమైన ప్రేమతో చెమ్మగిల్లిన కన్నులున్న తన భక్తజనుల హృదయాలలో నివసిస్తూ తనరేవాడు. విశాలమైన నల్లని వక్షస్థలంపై వైజయంతి అనే మాలచేత అలంకరింపబడి రాజిల్లేవాడు. నమస్కరించే జనులను రక్షించడంలో దయామృత తరంగాలు పొంగిపొరలే పద్మనేత్రాలు కలవాడు. ఆ విష్ణువు యోగిపుంగవు లందరిచేత సేవింపబడేవాడు. సజ్జనులను రక్షించడానికి సమర్థుడైనవాడు. అత్యంత మహిమాన్వితమై అఖిలలోకాలకు చూడామణి అయిన వైకుంఠపురాన్ని అలంకరించేవాడు.

తెభా-3-538-సీ.
టి విరాజిత పీతకౌశేయశాటితో-
విత కాంచీగుణ ద్యుతి నటింప
నాలంబి కంఠ హారావళి ప్రభలతోఁ-
గౌస్తుభరోచులుగ్రందుకొనఁగ
నికాంతి జిత తటిద్వ్ర కర్ణ కుండల-
రుచులు గండద్యుతుల్ ప్రోదిసేయ
హనీయ నవరత్నయ కిరీటప్రభా-
నిచయంబు దిక్కుల నిండఁ బర్వ

తెభా-3-538.1-తే.
వైనతేయాంస విన్యస్త వామహస్త
లిత కేయూర వలయ కంణము లొప్ప
న్యకరతల భ్రమణీకృతానుమోద
సుందరాకార లీలారవింద మమర.

టీక:- కటి = మొలప్రాంతమున; విరాజిత = విరాజిల్లుతున్న; పీత = పచ్చని; కౌశేయ = పట్టు; శాటి = వస్త్రము; తోన్ = తో; వితత = మించుతున్న; కాంచీగుణ = మొలతాడు; ద్యుతి = ప్రకాశము; నటింపన్ = విరజిమ్ముతుండగా; ఆలంబి = వేలాడే; కంఠ = మెడలోని; హార = హారముల; ఆవళి = వరుసలు యొక్క; ప్రభలన్ = ప్రకాశము; తోన్ = తో; కౌస్తుభ = కౌస్తుభమణి; రోచులు = కాంతులు; క్రందుకొనగన్ = కమ్ముకొనగా; నిజ = తన; కాంతి = ప్రకాశముచే; జిత = జయింపబడిన; తటిత్ = మెరుపుతీగల; వ్రజ = సమూహములు కల; కర్ణ = చెవి; కుండల = కుండలముల; రుచులు = కాంతి; గండ = చెక్కిళ్ల; ద్యుతుల్ = కాంతులు; ప్రోదిసేయన్ = కలిసిపోగా; మహనీయ = గొప్ప; నవరత్న = నవరత్నములు {నవరత్నములు - తొమ్మిది జాతుల మణులు, 1 మౌక్తికము (ముత్యము) 2 పద్మరాగము (కెంపు) 3 వజ్రము 4 ప్రవాళము (పగడము) 5 మరకతము (గరుడ పచ్చ, పచ్చ) 6 నీలము 7 గోమేధికము 8 పుష్యరాగము 9 వైడూర్యము}; మయ = పొదిగిన; కిరీట = కిరీటము యొక్క; ప్రభా = కాంతుల; నిచయంబున్ = సమూహములు; దిక్కులన్ = నలుదిక్కులను {నలుదిక్కులు - తూర్ప దక్షిణము పడమర ఉత్తరములు}; నిండ = నిండుగా; పర్వన్ = వ్యాపించగా;
వైనతేయ = గరుత్మంతుని {వైనతేయుడు - వినతా దేవి యొక్క పుత్రుడు, గరుత్మంతుడు}; అంస = మూపుపై; విన్యస్త = ఉంచబడిన; వామ = ఎడమ; హస్త = చేతికి; కలిత = ఉన్నట్టి; కేయూర = భుజకీర్తులు; వలయ = మురుగులు; కంకణముల్ = కంకణములు; ఒప్పన్ = ఒప్పియుండగా; అన్య = ఇంకొక; కరతల = అరచేతిలో; భ్రమణీ = తిప్పుతూ; కృతా = ఉన్నట్టి; అనుమోద = సంతోషముతో కూడిన; సుందర = అందమైన; ఆకార = ఆకారముతో; లీలన్ = లీలకైన; అరవిందము = పద్మము; అమరన్ = అమరి ఉండగా;
భావము:- ఆ శ్రీహరి నడుము చుట్టూ ప్రకాశించే పచ్చని పట్టుపంచెతో బంగారు మొలత్రాడు వెలుగులు వెదజల్లుతున్నది. కంఠం చుట్టూ ఉన్న రత్నహారాల కాంతులు కౌస్తుభమణి కాంతులతో కమ్ముకొంటున్నాయి. మెరుపుతీగలను మించి ప్రకాశించే కర్ణకుండలాల కాంతులు చెక్కిళ్ళ కాంతులతో కలిసిపోతున్నాయి. గొప్పనైన నవరత్నాలు పొదిగిన కిరీటం కాంతులు నలుదిక్కులలో వ్యాపిస్తున్నాయి. గరుత్మంతుని మూపుపై ఆనించిన ఎడమచేతికి భుజకీర్తులు, మురుగులు, కంకణాలు ముచ్చట గొలుపుతుండగా, కుడి అరచేతిలో తిప్పుతున్న అందమైన పద్మం అమరి ఉండగా శ్రీహరి వచ్చాడు.

తెభా-3-539-వ.
మఱిఁయుఁ; జరణారవింద మంజు కింజల్కపుంజప్రభా రంజిత తులసీ మరంద బందుర గంధానుబంధ సుగంధి గంధవహాస్వాద కలిత సేవాతత్పరులై చనుదెంచు యోగీంద్రులకు మానసానందకారియు బహిఃకరణాంతఃకరణ పరితోషప్రకీర్ణ రోమాంచ రుచిదాయకంబును ప్రభాపూర్తియుక్తంబును నగు మూర్తితోడ నిజ సౌందర్య వర కళావినిర్జిత శ్రీరమణీ సౌందర్య భాసమానుం డగుచుఁ; బాదచారి యై; యఖిల విశ్వగురుం డైన సర్వేశ్వరుండు వేంచేసె నప్పుడు.
టీక:- మఱియున్ = ఇంకనూ; చరణా = పాదములు అనెడి; అరవింద = పద్మముల; మంజు = మనోహరమైన; కింజల్క = కేసరముల; పుంజ = గుత్తుల; ప్రభా = కాంతులచే; రంజిత = ప్రకాశిస్తున్న; తులసీ = తలసి యొక్క; మరంద = మకరందముతో; బందుర = నిండిన; గంధా = సువాసనలుతో; అనుబంధ = కూడిన; సుగంధి = సువాసన కల; గంధవహా = వాయువును; ఆస్వాద = ఆస్వాదించుటచే; కలిత = కలిగిన; సేవా = సేవాభావము నందు; తత్పరులు = నిమగ్నులు; ఐ = అయ్యి; చనుదెంచు = వచ్చుచున్న; యోగి = యోగులలో; ఇంద్రుల = ఉత్తముల; కున్ = కు; మానస = మనసునకు; ఆనంద = ఆనందమును; కారియున్ = కలిగించునదియును; బహిఃకరణ = బాహ్యేంద్రియములకు; అంతఃకరణ = అంతరింద్రియములకు; పరితోష = సంతోషముతో కూడిన; ప్రకీర్ణ = వ్యక్తమగు; రోమాంచ = గగుర్పాటుతో కూడిన; రుచి = కాంతిని; దాయకంబునున్ = కలుగజేయునదియును; ప్రభా = కాంతితో; పూర్తి = నిండుతనముతో; యుక్తంబునున్ = కూడినదియును; అగు = అయిన; మూర్తి = స్వరూపము; తోడన్ = తో; నిజ = తన; సౌందర్య = అందము యొక్క; వర = శ్రేష్ఠమైన; కళా = కళచే; వినిర్జిత = చక్కగా జయింపబడిన; శ్రీరమణీ = లక్ష్మీదేవి; సౌందర్య = సౌందర్యముతో; భాసమానుండు = ప్రకాశించువాడు; అగుచున్ = అవుతూ; పాదచారి = కాలినడకను వచ్చువాడు; ఐ = అయ్యి; అఖిల = సమస్తమైన; విశ్వ = విశ్వమునకును {విశ్వగురుడు - జగద్గురువు, విష్ణువు}; గురుండు = గురువు; ఐన = అయిన; సర్వేశ్వరుండు = విష్ణుమూర్తి {సర్వేశ్వరుడు - సర్వులకు (అందరకును) ఈశ్వరుడు (ఫ్రభువు), విష్ణుమూర్తి}; వేంచేసెన్ = వచ్చెను; అప్పుడు = అప్పుడు.
భావము:- ఆ శ్రీహరి పాదపద్మాలలోని కేసరాలవలె తులసీదళాలు వెలుగులు వెదజల్లుతున్నవి. ఆ తులసీదళాలతో మిళితమైన మకరంద సుగంధాలతో చల్లగా మెల్లగా వీచే కమ్మని పిల్లగాలులను ఆస్వాదిస్తూ సేవాభావంతో యోగీంద్రులు ఆయన వెంట నడుస్తున్నారు. ఆ యోగీశ్వరుల మనస్సులకు విష్ణుమూర్తి దివ్యస్వరూపం ఆనందదాయకమై వెలుపలి లోపలి ఇంద్రియాలకు సంతుష్టి కలిగిస్తున్నది. ఆ అనుభవం చేత వారు గగుర్పాటు చెందుతున్నారు. ఇటువంటి పరిపూర్ణ తేజోవంతమైన స్వరూపంతో విష్ణుమూర్తి నడచి వచ్చాడు. ఆయన ప్రక్కన లక్ష్మీదేవి నడచివస్తున్నది. మిక్కిలి శ్రేష్ఠమైన ఆమె సౌందర్యం విష్ణుమూర్తి సౌందర్యానికి లోబడి అందులో ఒక అంశంగా వెలుగొందుతున్నది. ఆ విధంగా సకల జగత్తులకు ఈశ్వరుడైన విష్ణువు అక్కడికి వచ్చాడు.

తెభా-3-540-చ.
స్థి శుభలీల నట్లరుగుదెంచిన యవ్విభు విద్రుమారుణా
నవపల్లవస్ఫురదుదంచిత కుంద రుచిస్మితైక సుం
వదనారవిందము ముదంబునఁ దప్పక చూచి యమ్మునీ
శ్వరులు నిజాత్మలం దనివిసాలక వెండియుఁ జూచి రిమ్ములన్.

టీక:- స్థిర = శాశ్వతమైన; శుభ = శుభము; లీలన్ = వలె; అట్లు = ఆవిధముగా; అరుగుదెంచిన = వచ్చిన; ఆ = ఆ; విభు = ప్రభువు యొక్క; విద్రుమ = పగడమువంటి; అరుణా = ఎఱ్ఱటి; అధర = పెదవి అను; నవపల్లవ = చిగురుకొమ్మకు; స్ఫురత్ = ప్రకాశించి; ఉదంచిత = ఉదయిస్తున్న; కుంద = మల్లెమొగ్గ; రుచిత్ = కాంతి కల; స్మిత = చిరునవ్వులు; ఏక = నిండిన; సుందర = చక్కటి; వదన = మోము అనెడి; అరవిందము = పద్మమును; ముదంబునన్ = సంతోషముతో; తప్పక = అవశ్యము; చూచి = చూసి; ఆ = ఆ; ముని = మునులలో; ఈశ్వరులు = ఉత్తములు; నిజ = తమ; ఆత్మలన్ = మనసులలో; తనివి = తృప్తి; చాలక = తీరక; వెండియున్ = మరల; చూచిరి = చూసిరి; ఇమ్ములన్ = మరింత స్పష్టముగా.
భావము:- ఆ విధంగా సుస్థిరమూ శుభకరమూ అయిన శోభావైభవంతో వచ్చిన ఆ విష్ణుమూర్తి పగడాల పెదవి క్రొంజిగురాకులా ఉంది. స్వామి చిరునవ్వు ఆ చిగురాకుపై విలసిల్లే మల్లెమొగ్గల అందాన్ని అందుకున్నది. అటువంటి గోవిందుని సుందర ముఖపద్మాన్ని సనక సనందనాదులు ఆనందంగా సందర్శించారు. మనస్సులు తృప్తి చెందక మళ్ళీ మళ్ళీ మాధవుణ్ణి సందర్శించారు.

తెభా-3-541-చ.
సునిశిత భక్తిఁ దన్ముఖముఁ జూచిన చూడ్కులు ద్రిప్పలేకయుం
నుఁగొని రెట్టకేలకు నల్మష భక్త విధూత ఖేదముల్
మునిజన చిత్తమోదములు ముక్తినివాస కవాట భేదముల్
వినుత వి నూత్న నూపురిత వేదము లమ్మహనీయు పాదముల్.

టీక:- సునిశిత = మిక్కిలి వాడియైన; భక్తిన్ = భక్తితో; తత్ = అతని; ముఖమునన్ = మోమును; చూచిన = చూసినట్టి; చూడ్కులున్ = చూపులను; త్రిప్పలేకయున్ = తిప్పుకొనలేకపోయినను; కనుగొనిరి = చూడగలిగిరి; ఎట్టకేలకున్ = చివరకి; అకల్మష = నిర్మలమైన, మలినము లేని; భక్త = భక్తుల; విధూత = పోగొట్టబడిన; ఖేదముల్ = దుఃఖములను; ముని = మునులైన; జన = జనుల; చిత్త = మనసులకు; ఆమోదములు = సంతోషమును కలిగించునవియును; ముక్తి = మోక్షము అను; నివాస = గృహముల; కవాట = ద్వారములను; భేదములు = తెరచునవియును; వినుత = స్తుంతింపబడిన; వినూత్న = సరికొత్త; నూపురిత = అందెలుగా; వేదముల్ = వేదములు కలవి యైన; ఆ = ఆ; మహనీయు = గొప్పవాని; పాదముల్ = పాదములు.
భావము:- ఆ సనక సనందనాది మునులు అచంచలమైన భక్తితో ఆ శ్రీహరి ముఖాన్ని చూపులు త్రిప్పుకోలేక చూసి చూసి, ఎట్టకేలకు చూపులు త్రిప్పుకొని స్వామి పాదాలమీద కేంద్రీకరించారు. ఆ పాదాలు కల్మషము లేని భక్తుల భేదాలను పోగొట్టేవి, మునుల మనస్సులకు మోదాన్ని కలిగించేవి, మోక్షమందిరం యొక్క ద్వారాలను తెరిపించేవి, వేదాలను క్రొంగ్రొత్త నూపురాలుగా చేసికొని పొగడ కెక్కినవి.

తెభా-3-542-చ.
ని నఖ పద్మరాగమణి కాంతివిభాసిత పాదపద్మము
ల్మముల యందుఁ గీల్కొలిపి బ్దమనోరథ యుక్తు లై పునః
పురభివందనంబులు విభూతి దలిర్ప నొనర్చి యోగమా
ర్గనిరత చిత్తులున్ వెదకి కానఁగలేని మహానుభావునిన్.

టీక:- కని = చూసి; నఖ = గోర్లు అనెడి; పద్మరాగ = పద్మరాగము అను; మణి = రత్నముల; కాంతి = ప్రకాశముచే; విభాసిత = విలసిల్లుతున్న; పాద = పాదములు అనెడి; పద్మముల్ = పద్మములను; మనముల = మనసుల; అందున్ = లో; కీల్కొలిపి = హత్తించుకొని; లబ్ధ = లభించిన; మనోరథ = కోరికలుతో; యుక్తులు = కూడినవారు; ఐ = అయ్యి; పునఃపునః = మరలమరల; అభివందనంబులున్ = చక్కటి నమస్కారములు; విభూతిన్ = వైభవములు; తలిర్పన్ = చిగురొత్తగా; ఒనర్చి = చేసి; యోగ = యోగ; మార్గ = విధానములో; నిరత = లగ్నమైన; చిత్తులున్ = మనసులు కలవారైనను; వెదకి = వెదకియును; కానగలేని = చూడలేని; మహానుభావునిన్ = గొప్పవానిని.
భావము:- కోరిక తీరిన ఆ సనక సనందాది మహర్షులు నిరంతరం యోగమార్గాసక్తులైన మహాయోగులు సైతం ఎంత వెదకినా కనిపించని మహానుభావుడైన విష్ణువును కన్నులారా చూసారు. పద్మరాగ మణుల కాంతులతో ప్రకాశించే ఆ భగవంతుని పాదపద్మాలను తమ హృదయాలలో పదిలపరచుకొని పదేపదే నమస్కారాలు చేశారు.

తెభా-3-543-క.
మాసమున నిలిపిరి త
ద్ధ్యానాస్పదుఁడైన వానిఁ త్త్వజ్ఞులకుం
గా నగువాని భక్తజ
నానందకరైక మూర్తి లరిన వానిన్.

టీక:- మానసమునన్ = మనసులలో; నిలిపిరి = స్థిరపరచుకొనిరి; తత్ = వారి; ధ్యాన = ధ్యానమే; ఆస్పదుడు = నివాసముగా కలవాడు; ఐన = అయినట్టి; వానిన్ = వానిని; తత్వజ్ఞులు = తత్త్వజ్ఞానము కలవారు; కున్ = కు; కానన్ = చూచుటకు; అగు = అయ్యే; వానిన్ = వానిని; భక్త = భక్తులు ఐన; జన = జనులకు; ఆనంద = ఆనందమును; కర = చేయుటయే; ఏక = సర్వమైన; మూర్తిన్ = స్వరూపముతో; అలరిన = ఒప్పిన; వానిన్ = వానిని;
భావము:- ధ్యానించేవారికి మాత్రమే వశమయ్యేవాడూ, తత్త్వజ్ఞులకు దర్శన మిచ్చేవాడూ, భక్తులైన వారికి బ్రహ్మానందాన్ని ప్రసాదించే స్వరూపం కలవాడూ అయిన ఆ పరాత్పరుణ్ణి మునీశ్వరులు తమ మనస్సులలో నిలుపుకున్నారు.