పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/సనకాదుల శాపంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తెభా-3-517-చ.
కతరత్న తోరణ సమంచిత కుడ్య కవాట గేహళీ
విచిత షట్సుకక్ష్య లరవిందదళాక్ష విలోకనోత్స వా
మతి నన్యముం గనక దాఁటి యనంతరకక్ష్య యందు ని
ద్ధను దదీయపాలుర నుదార సమాన వయో విశేషులన్.

టీక:- మరకత = పచ్చలు; రత్న = రత్నముల; తోరణ = తోరణములతో; సమంచిత = కూడిన; కుడ్య = గోడలు; కవాట = ద్వారములు; గేహళీ = గుమ్మములు; విరచిత = చక్కగా నిర్మింపబడిన; షట్ = ఆరు (6); సు = మంచి; కక్ష్యలన్ = ఆవరణలను; అరవిందదళాక్ష = విష్ణుని {అరవింద దళాక్షుడు - అరవింద (పద్మము) ల దళా (రేకుల) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; విలోకన = దర్శించునట్టి; ఉత్సవ = ఉత్సాహముతో కూడిన; ఆదర = ప్రీతి కల; మతిన్ = మనసులతో; అన్యమున్ = ఇతరములను; కనక = చూడక; దాటి = దాటి; అనంతర = తరువాతి; కక్ష్య = ఆవరణ; అందున్ = అందు; ఇద్దఱన్ = ఇద్దిరిని; తదీయ = దానిని; పాలురన్ = కాపలాకాస్తున్నవారిని; ఉదార = గొప్పవారును; సమాన = సమానమైన; వయో = వయస్సు మొదలగు; విశేషులన్ = ప్రత్యేకతలు కలవారిని;
భావము:- విష్ణువును చూడాలనే ఆనందంతో ఆ సనకాది మహర్షులు ఇతరమైనవేవీ చూడకుండా మరకతమణి తోరణాలతో అలంకరింపబడిన గోడలతో, రత్నాలు పొదిగిన కవాటాలతో ఒప్పుతున్న ఆరు మహాద్వారాలను దాటి ఏడవ మహాద్వారాన్ని చేరుకున్నారు. అక్కడ కావలి కాస్తున్న సమాన వయస్సు కల ఇద్దరు ద్వారపాలకులను చూచారు.

తెభా-3-518-సీ.
కాంచన నవరత్న టకాంగుళీయక-
హార కేయూర మంజీర ధరులఁ
మనీయ సౌరభాత మత్త మధుకర-
లిత సద్వనమాలికా విరాజి
తోరస్థ్సలుల గదాయుతులను ఘనచతు-
ర్భాహుల నున్నతోత్సాహమతుల
నారూఢ రోషానలారుణితాక్షుల-
భ్రూతా కౌటిల్య ఫాతలుల

తెభా-3-518.1-తే.
వేత్రదండాభిరాముల వెలయు నమ్ము
కుంద శుద్దాంత మందిరాళింద భూమి
నున్న యిద్దఱన్ సనకాది యోగివరులు
సూచుచును వృద్దు లయ్యు నాసుభగమతులు.

టీక:- కాంచన = బంగారము; నవరత్న = నవరత్నముల తోచేసిన {నవరత్నములు - తొమ్మిది జాతుల మణులు, 1 మౌక్తికము (ముత్యము) 2 పద్మరాగము (కెంపు) 3 వజ్రము 4 ప్రవాళము (పగడము) 5 మరకతము (గరుడ పచ్చ, పచ్చ) 6 నీలము 7 గోమేధికము 8 పుష్యరాగము 9 వైడూర్యము}; కటక = కంకణములు; అంగుళీయక = ఉంగరములు; హార = హారములు, దండలు; కేయూర = భుజకీర్తులు; మంజీర = అందెలను; ధరలు = ధరించిన వారు; కమనీయ = ఇంపైన; సౌరభ = సువాసనలకు; ఆగత = ఆకర్షింపబడి; మత్త = పరవశించిన; మధుకర = తేనెటీగలచే; కలిత = కూడిన; సత్ = మంచి; వన = పూల; మాలికా = మాలలచే; విరాజిత = విలసిల్లుతున్న; ఉరస్థ్సలుల = వక్షస్థలములు కలవారిని; గదా = గదలతో; యుతులను = కూడినవారిని; ఘన = పెద్దపెద్ద; చతుర్ = నాలుగు (4); బాహులన్ = చేతులున్నవారిని; ఉన్నత = మిక్కిలి; ఉత్సాహ = ఉత్సాహముతోకూడిన; మతులన్ = మనసులుకలవారిని; ఆరూఢ = ఉదయించిన; రోషా = కోపము అను; అనల = అగ్నితో; అరుణిత = ఎఱ్ఱబారిన; అక్షులన్ = కన్నులు కలవారిని; భ్రూ = కనుబొమలు; లతా = తీగలవలె; కౌటిల్య = వంకరలుతిరిగిన; ఫాలతలులన్ = నుదురులు కలవారిని;
వేత్ర = ఫేము; దండ = బెత్తములతో; అభిరాములన్ = అతిశయిస్తున్న వారిని; వెలయున్ = ప్రకాశిస్తున్న; ఆ = ఆ; ముకుంద = విష్ణుని; శుద్దాంత = అంతపుర; మందిర = మందిరమునకు; అళింద = దగ్గరి; భూమిన్ = స్థలములో; ఉన్న = ఉన్నట్టి; ఇద్దఱన్ = ఇద్దరిని; సనకాది = సనకుడు మొదలగు; యోగి = యోగులలో; వరులు = శ్రేష్ఠులు; చూచుచున్ = చూస్తూ; వృద్ధులు = పెద్దవారు; అయ్యున్ = అయినప్పటికిని; ఆ = ఆ; సుభగ = సౌభాగ్యముకల; మతులున్ = మనసులు కలవారు.
భావము:- ఆ ద్వారపాలకు లిద్దరూ నవరత్నాలు పొదిగిన బంగారు కంకణాలు, ఉంగరాలు, హారాలు, భుజకీర్తులు, కాలి అందెలు ధరించి ఉన్నారు. ఇంపైన సువాసనలతో గండుతుమ్మెదలను ఆకర్శించే మేలుజాతి పూలదండలను వక్షస్థలాలపై అలంకరించుకొని ఉన్నారు. గదలు పట్టుకొని చతుర్భుజాలతో ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. వారి కళ్ళు రోషాగ్నితో ఎఱ్ఱబడి ఉన్నాయి. వారి ఫాలభాగాలు ముడిపడ్డ కనుబొమలతో వంకరలు తిరిగి ఉన్నాయి. వారి హస్తాలలో పేము బెత్తాలు కదులుతున్నాయి. ఆ విధంగా వారిద్దరూ ముకుందుని శుద్ధాంతమందిరం ముందు నిలబడి ఉన్నారు. వృద్ధులై కూడ సనకాది యోగులు శుద్ధమైన మనస్సు కలవారై....

తెభా-3-519-క.
ధీతఁ బంచాబ్దముల కు
మాకు లై కానఁబడుచు నమున శంకం
గూక చతురాత్మకు లని
వారిత గమనముల డాయచ్చిన నెదురన్.

టీక:- ధీరతన్ = బుద్ధి శక్తి కలిగి; పంచ = ఐదు (5); అబ్దముల = సంవత్సరముల వయసుకల; కుమారకులు = పిల్లలు; ఐ = అయ్యి; కానబడుచున్ = కనబడుతూ; మనమునన్ = మనసులో; శంకన్ = అనుమానమేమియును; కూరక = పొందక, పడక; చతుర = మనోహరమైన; ఆత్మకుల్ = స్వరూపము కలవారు; అనివారిత = వారింపరాని; గమనములన్ = వేగములతో; డాయన్ = దగ్గరకు; వచ్చిన = వచ్చిన; ఎదురన్ = ఎదురుగా.
భావము:- చతురమతులైన ఆ సనకాదులు ఐదేండ్ల బాలురవలె కనిపిస్తూ అనుమానించకుండా నిరాటంకంగా ఆ ద్వారపాలకులను సమీపించారు.

తెభా-3-520-క.
శ్రీలనేశ్వరదర్శన
లాసు లై యేఁగు బుధలలాముల నతి దు
శ్శీతఁ దద్వచనప్రతి
కూమతిం బోవకుండఁ గుటిలాత్మకు లై.

టీక:- శ్రీలలనేశ్వర = విష్ణుని {శ్రీలల నేశ్వరుడు - శ్రీ (లక్ష్మీ) లలన (దేవి) యొక్క ఈశ్వరుడు (భర్త), విష్ణువు}; దర్శన = దర్శనము కై; లాలసులు = మిక్కిలి ఆసక్తికలవారు; ఐ = అయ్యి; ఏగు = వెళ్ళుతున్న; బుధ = జ్ఞానులలో; లలాములన్ = శ్రేష్ఠులన్; అతి = మిక్కిలి; దుశ్శీలతన్ = చెడు ప్రవర్తనముతో; తత్ = వారి; వచన = మాటలకు; ప్రతికూల = వ్యతిరేక; మతిన్ = విధముగా; పోవకుండన్ = వెళ్లనీయక; కుటిల = వక్ర; ఆత్మకుల్ = బుద్ధి కలవారు; ఐ = అయ్యి;
భావము:- శ్రీనాథుని దర్శించాలనే ఆసక్తితో వెళ్తున్న ఆ యోగులను దుష్టస్వభావం కల ఆ ద్వారపాలకులు కుటిలబుద్ధితో, ప్రతికూల వాక్కులతో పోకుండా అడ్డగించారు.

తెభా-3-521-క.
వారించిన వారలు బృం
దాకు లీక్షించుచుండ దారుణ పటు రో
షారుణితాంబకులై రొద
వారించుచు వారు నచటివారును వినగన్.

టీక:- వారించినన్ = అడ్డగించిన; వారలున్ = వారు; బృందారకులు = దేవతలు; ఈక్షించుచున్ = చూస్తూ; ఉండగన్ = ఉండగా; దారుణ = భయంకరమైన; పటు = మిక్కిలి; రోషా = కోపముతో; అరుణిత = ఎఱ్ఱబారిన; అంబకులు = కన్నులు కలవారు; ఐ = అయ్యి; రొదన్ = కలకలమును; వారించుచున్ = అడ్డుకొనుచూ; వారు = వారును; అచటి = అక్కడి; వారున్ = వారును; వినగన్ = వింటుండగా.
భావము:- అలా అడ్డగించగా ఆ సనకాది యోగులు కోపంతో ఎరుపెక్కిన కన్నులు కలవారై, దేవతలు చూస్తుండగా కలకలాన్ని వారిస్తూ అక్కడున్నవారంతా వింటూ ఉండగా...

తెభా-3-522-వ.
ఇట్లనిరి.
టీక:- ఇట్లు = ఈవిధముగా; అనిరి = పలికిరి.
భావము:- ఇలా అన్నారు.

తెభా-3-523-చ.
"ము ననంతు భక్తపరిపాలు సుహృత్తము నిష్ఠు నీశ్వరే
శ్వరు భజియింపఁ గోరి యనివారణ నిం దరుదేర నిచ్చలున్
రితముదాత్ములై కొలువఁ బాయక తద్భజనాంతరాయ త
త్పమతి మాకు నిప్పు డరిడ్డ దురాత్ముల నేఁడు గంటిరే."

టీక:- పరమున్ = విష్ణుని {పరము - అందరికన్ననూ పైన ఉన్నవాడు, విష్ణువు}; అనంతున్ = విష్ణుని {అనంతుడు – అంతము లేనివాడు, విష్ణువు}; భక్తపరిపాలున్ = విష్ణుని {భక్తపరిపాలుడు - భక్తులను చక్కగా పాలించువానిని, విష్ణువు}; సుహృత్తమున్ = విష్ణుని {సుహృత్తముడు - మంచి మిత్రుడైన వాడు, విష్ణువు}; ఇష్టున్ = విష్ణుని {ఇష్టుడు - ఇష్టమైనవాడు, విష్ణువు}; ఈశ్వరేశ్వరున్ = విష్ణుని {ఈశ్వరేశ్వరుడు – ప్రభుల కెల్లనూ ప్రభువు ఐనవాడు, విష్ణువు}; భజియింపన్ = స్తుతింపను; కోరి = వాంఛించి; అనివారణన్ = ఆగక; ఇందన్ = ఇక్కడకు; అరుదేరన్ = రాగా; నిచ్చలున్ = నిత్యమును; భరిత = నిండు; ముత్ = సంతోషముతో కూడిన; ఆత్ములున్ = మనసులు కలవారము; ఐ = అయ్యి; కొలువన్ = సేవించుటకు; పాయక = విడువకుండగా; తత్ = ఆ; భజన = సేవించుటను; అంతరాయ = అడ్డుపడాలని; తత్పర = లగ్నమైన; మతిన్ = మనసుతో; మాకున్ = మాకు; ఇప్పుడు = ఇప్పుడు; అరిపడ్డ = అడ్డుపడుతున్న; దురాత్ములన్ = చెడ్డవారిని; నేడున్ = ఈరోజు; కంటిరే = చూసారా.
భావము:- “పరాత్పరుడూ, అనంతుడూ, భక్తజనపాలకుడూ, దీనబంధువూ, ప్రియతముడూ, సర్వేశ్వరుడూ అయిన విష్ణువును సేవించడానికి మేము ఎప్పుడూ నిరాటంకంగా ఇక్కడికి వస్తూ సంతోషంగా అతనిని ఆరాధిస్తూ ఉంటాము. అటువంటి మమ్ములను అడ్డగించి మా సేవకు ఆటంకం కలిగించిన ఈ దుర్మార్గులను మీరు చూచారు గదా.”

తెభా-3-524-వ.
అని మఱియు; సనకసనందనాదులు జయవిజయులం జూచి యిట్లనిరి "మీ మనంబుల స్వామి హితార్థం బై నిష్కపటవర్తనుల మైన మాబోఁటులఁ గుహకవృత్తి గల యితర జనంబులు భగవత్సదనంబుఁ బ్రవేశింతురో యను శంకం జేసి కొందఱం బ్రవేశింపఁజేయుటయుఁ; గొందఱ వారించుటయు; దౌవారిక స్వభావం బని వారింప దలఁచితిరేని బ్రశాంత దివ్యమంగళవిగ్రహుండును, గతవిగ్రహుండును, భగవంతుడును, విశ్వగర్భుండును నైన యీశ్వరుండు ప్రాప్యంబును, బ్రాపకంబును, బ్రాప్తియు నను భేదశూన్యుండు గావున మహాకాశంబు నందు ఘటపటాద్యాకాశంబులు వేఱులేక యేకంబై తోఁచు చందంబున విద్వాంసు లగు వా రమ్మహాత్ముని సకలాత్మ భేదరహితునింగాఁ బొడ గందురు; అదియునుంగాక లోకంబు నందు రాజులు సాపరాధులైన కింకర జనంబుల నాజ్ఞాపించు చందంబున నీశ్వరుండు దండించునో యను భయంబునం జేసి వారించితి మని తలంచితిరేని భూసురవేషధారుల మైన మాకును వైకుంఠనాయకుండైన సర్వేశ్వరునకును భేదంబు లేకుండుటం జేసి శంకసేయం బనిలేదు; ఇట్లగుట యెఱింగి మందబుద్దులరై మమ్ము వారించిన యనుచితకర్ములగు మీరలు మదీయశాపార్హు లగుదురు; గావున భూలోకంబునం గామ క్రోధ లోభంబులను శత్రువులు బాధింపం బుట్టుం"డని పలికిన.
టీక:- అని = అని; మఱియున్ = మరల; సనక = సనకుడు; సనందన = సునందనుడు; ఆదులు = మొదలగువారు; జయ = జయుడు {జయవిజయులు - వైకుంఠమున విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు}; విజయులన్ = విజయుడు అనువారలను; చూచి = చూసి; ఇట్లు = ఈవిధముగా; అనిరి = పలికిరి; మీ = మీ యొక్క; మనంబులన్ = మనసులలో; స్వామి = యజమాని; హిత = మేలు; ఆర్థంబున్ = కోరినవారు; ఐ = అయ్యి; నిష్కపట = కపటములేని; వర్తనులము = ప్రవర్తన కలవారము; ఐన = అయిన; మా = మా; పోటులన్ = వలెనే; కుహక = మోసపూరిత; వృత్తిన్ = వర్తన; కల = కలిగిన; ఇతర = మిగతా; జనంబులు = జనులు; భగవత్ = భగవంతుని; సదనంబున్ = భవనమును; ప్రవేశింతురో = ప్రవేశిస్తారేమో; అను = అనే; శంకన్ = అనుమానము; చేసి = వలన; కొందఱన్ = కొందరను; ప్రవేశింపన్ = లోపలకు వెళ్లనిచ్చుట; చేయుటయున్ = చేయుటయు; కొందఱన్ = కొందరను; వారించుటయున్ = అడ్డుకొనుటయును; దౌవారిక = ద్వారపాలకుల; స్వభావంబున్ = స్వాభావిక లక్షణము; అని = అని; వారింపన్ = ఆపవలెనని; తలచితిరి = అనుకొంటిరి; ఏని = అయితే; ప్రశాంతదివ్యమంగళవిగ్రహుండును = విష్ణుమూర్తి {ప్రశాంత దివ్య మంగళ విగ్రహుండు - ప్రశాంతమైన దివ్యమైన మంగళ (శుభ) కరము ఐన విగ్రహుండు (స్వరూపము కలవాడు), విష్ణువు}; గతవిగ్రహుండును = విష్ణుమూర్తి {గతవిగ్రహుండు - గత (తొలగిన) విగ్రహము (విరోధము) కలవాడు, విష్ణువు}; భగవంతుడును = విష్ణుమూర్తి {భగవంతుడు - మహిమాన్వితుడు, విష్ణువు}; విశ్వగర్భుండును = విష్ణుమూర్తి {విశ్వగర్భుండు - విశ్వము తన గర్భమున (కడుపులో) ఉన్నవాడు, విష్ణువు}; ఐన = అయిన; ఈశ్వరుండును = విష్ణుమూర్తి {ఈశ్వరుడు - ప్రభుత్వము కలవాడు, విష్ణువు}; ప్రాప్యంబునున్ = పొందబడినది; ప్రాపకంబున్ = పొందుట; ప్రాప్తియున్ = పొందినది; అను = అనెడి; భేద = తేడాలు; శూన్యుండు = లేనివాడును; కావున = కనుక; మహాకాశంబున్ = మహాకాశము; అందున్ = లో; ఘట = కుండ; పట = బట్ట; ఆది = మొదలగువాని లోని; ఆకాశంబులున్ = ఆకాశములు; వేఱు = భేదము; లేక = లేకుండగా; ఏకంబున్ = ఒకటే; ఐ = అయ్యి; తోచు = తెలియు; చందంబునన్ = విధముగా; విద్వాంసులు = పండితులు; అగు = అయిన; వారు = వారు; ఆ = ఆ; మహాత్మునిన్ = గొప్పవానిన; సకల = సమస్తమైన; ఆత్మ = ఆత్మలనుండి; భేద = వేరు; రహితునింగా = కానివానిగా; పొడగందురు = చూచెదరు; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; లోకంబున్ = ప్రపంచము; అందున్ = లో; రాజులు = రాజులు; సాపరాధులు = అపరాధముతోకూడినవారు; ఐన = అయినట్టి; కింకర = సేవక; జనంబులన్ = జనులను; ఆజ్ఞాపించు = శిక్షించు; చందంబునన్ = విధముగా; ఈశ్వరుండున్ = విష్ణువునూ; దండించునో = శిక్షించునో; అను = అనెడి; భయంబునన్ = భయము; చేసి = వలన; వారించితిమి = అడ్డితిమి; అని = అని; తలంచితిరి = అనుకొనిరి; ఏని = అయినట్లైతే; భూసుర = బ్రాహ్మణ {భూసుర - భూమికి సురలు (దేవతలు), బ్రాహ్మణులు}; వేష = వేషమును; ధారులము = ధరించినవారము; ఐన = అయినట్టి; మాకును = మావంటివారికిని; వైకుంఠ = వైకుంఠమునకు; నాయకుండున్ = ప్రభువు; ఐన = అయినట్టి; సర్వేశ్వరున్ = విష్ణుని {సర్వేశ్వరుడు - సర్వులకు (అందరకును) ఈశ్వరుడు (ఫ్రభువు), విష్ణుమూర్తి}; కున్ = కిని; భేదంబున్ = భేదమే; లేకుండుటన్ = లేకపోవుట; చేసి = వలన; శంకన్ = అనుమానము; చేయన్ = పడుటకు; పని = అవసరము; లేదు = లేదు; ఇట్లు = ఈవిధముగా; అగుటన్ = ఉండుట; ఎఱింగి = తెలిసి; మంద = మందగించిన; బుద్దులరు = బుద్ధికలవారు; ఐ = అయ్యి; మమ్మున్ = మమ్ములను; వారించినన్ = అడ్డగించిన; అనుచిత = తగని; కర్ములు = పనిచేసినవారు; అగు = అయిన; మీరలు = మీరు; మదీయ = మా యొక్క; శాప = శాపమునకు; అర్హులు = తగినవారు; అగుదురు = అయి ఉన్నవారు; కావునన్ = కనుక; భూలోకంబునన్ = భూలోకములో; కామ = కామము; క్రోధ = కోపము; లోభంబులు = లోభములు; అను = అనెడి; శత్రువులు = శత్రువులు; బాధింపన్ = బాధిస్తుండగా; పుట్టుండు = జన్మించండి; అని = అని; పలికిన = శపించిన.
భావము:- ఇలా పలికి సనక సనందనాదులు ద్వారపాలకులైన జయవిజయులను చూచి ఇలా అన్నారు. “మీరు మనస్సులలో మీ స్వామి మేలు కోరుకొనేవారై మోసగాళ్ళైన ఇతరులు భగవంతుని మందిరంలోకి ప్రవేశిస్తారేమో అనే అనుమానంతో కొందరిని రానివ్వడం, కొందరిని అడ్డగించడం ద్వారపాలకుల ధర్మంగా భావించి కపటం లేని మమ్మల్ని అడ్డగించారు. ప్రశాంతమూ, దివ్యమూ, శుభకరమూ అయిన ఆకారం కలిగినవాడూ, ఎవరితోనూ విరోధం లేనివాడూ, సమస్త విశ్వం తనలో ఇమిడి ఉన్నవాడూ అయిన భగవంతుడు ప్రాప్యం, ప్రాపకం, ప్రాప్తి అనే భేదాలు లేనివాడు కనుక మహాకాశంలో ఘటాకాశం, పటాకాశం వేరు వేరుగా కాక లీనమై ఉన్నట్లు తోచే విధంగా విద్వాంసులు ఆ మహాత్ముని అందరిలోనూ ఆత్మరూపంలో అభేదంగా దర్శిస్తారు. అంతేకాక లోకంలో రాజులు దోషులైన సేవకులను దండించినట్లు భగవంతుడు మిమ్మల్ని దండిస్తాడేమో అనే భయంతో మమ్మల్ని అడ్డగించామని భావించారేమో. భూసురులమైన మాకూ, వైకుంఠాధిపతి ఐన భగవంతునికీ భేదం లేదు కనుక అనుమానించవలసిన పని లేదు. ఇది తెలిసికూడ మందబుద్ధులై మమ్మల్ని అడ్డగించి చేయరాని పని చేసి మా శాపానికి అర్హు లయ్యారు. కావున కామక్రోధలోభాలనే శత్రుగుణాలతో (అరిషడ్వర్గాలు - కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం ) భూలోకంలో పుట్టండి.”

తెభా-3-525-క.
వాలు విని తమ మనములు
భూరిస్ఫుట చండకాండపూగంబులచే
వారింపరాని భూసుర
దారుణవాక్యముల కులికి ల్లడపడుచున్.

టీక:- వారలున్ = వారు; విని = విని; తమ = తమయొక్క; మనములు = మనసులు; భూరి = బహుమిక్కిలి; స్ఫుట = గట్టి; చండ = భయంకరమైన; కాండ = బాణముల; పూగంబులన్ = సమూహముల; చేన్ = చేతనూ; వారింపరాని = వారింపలేని; భూసుర = బ్రాహ్మణుల; దారుణ = కఠినమైన; వాక్యముల్ = పలుకుల; కున్ = కి; ఉలికి = ఉలికిపడి; తల్లడపడుచున్ = తల్లడిల్లుచూ.
భావము:- ఆ ద్వారపాలకులు పదునైన దారుణ బాణాలతో కూడ వారింపరాని వారి మాటలు విని ఉలిక్కిపడి తల్లడిల్లారు.

తెభా-3-526-క.
రితాపంబును బొందుచు
సిజలోచనుని భటులు నకాది మునీ
శ్వరుల పదాంబుజములకుం
మర్థిన్ మ్రొక్కి నిటలటితాంజలు లై.

టీక:- పరితాపంబున్ = బాధ; పొందుచున్ = పడుతూ; సరసిజలోచనుని = విష్ణుని {సరసిజలోచనుడు - సరసిజముల (పద్మము) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; భటులు = భృత్యులు; సనకాది = సనకుడు మొదలగు {సనకాది - సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనత్సుజాతుడు అను బ్రహ్మదేవుని కుమారులు}; ముని = మునులలో; ఈశ్వరుల = శ్రేష్ఠుల; పాద = పాదములు అనెడి; అంబుజముల్ = పద్మములు; కున్ = కి; కరము = మిక్కిలి; అర్థిన్ = శ్రద్దతో; మ్రొక్కి = నమస్కరించి; నిటల = నొసట; ఘటిత = హత్తించిన; అంజలులు = మోడ్చిన చేతులు కలవారు; ఐ = అయ్యి.
భావము:- ఆ విష్ణుభటులు పరితాపం పొంది సనకాది మునుల పాదాలకు భక్తితో మ్రొక్కి, నుదుట చేతులు జోడించి...

తెభా-3-527-వ.
ఇట్లనిరి.
టీక:- ఇట్లు = ఈవిధముగా; అనిరి = పలికిరి.
భావము:- ఇలా అన్నారు.

తెభా-3-528-మ.
"యోగీశ్వరులార! మమ్ము మది నొవ్వన్ మీర లిట్లన్న ని
ష్ఠు వాక్యంబుల కింక మా మనములన్ శోకింపగా రాదు స
త్పురుషశ్రేణిఁ బరాభవించిన వృథాభూతాత్ములన్ మమ్ము మా
దురితం బింతకుఁ దెచ్చె మీఁద శుభముం దూకొందు మే మారయన్.

టీక:- వర = గొప్ప; యోగి = యోగులలో; ఈశ్వరులారా = శ్రేష్ఠమైన వారా; మమ్మున్ = మమ్ములను; మదిన్ = మనసునకు; నొవ్వన్ = నొప్పి కలుగునట్లు; మీరలు = మీరు; ఇట్లు = ఈవిధముగా; అన్న = పలికిన; నిష్ఠుర = కఠినమైన; వాక్యంబుల్ = మాటల; కున్ = కి; ఇంకన్ = ఇంక; మా = మా యొక్క; మనములన్ = మనసులలో; శోకింపగన్ = బాధపడగా; రాదు = అవసరము లేదు; సత్ = మంచి; పురుష = పురుషుల; శ్రేణిన్ = సమూహమును; పరాభవించిన = అవమానించిన; వృథా = వ్యర్థ; భూతాత్ములన్ = జీవులను; మమ్మున్ = మమ్ములను; మా = మా; దురితంబున్ = పాపము; ఇంతకున్ = ఇంతవరకూ; తెచ్చె = తీసుకొని వచ్చినది; మీదన్ = ఇకపైన; శుభమున్ = శుభములను; దూకొందుము = అందుకొందుము; మేము = మేము; అరయన్ = తరచిచూసిన.
భావము:- “ఓ యోగీశ్వరులారా! మా మనస్సులు నొచ్చుకొనే విధంగా మీరన్న కఠినవాక్యాలకు మేము దుఃఖించడం లేదు. వ్యర్థజీవనులమై సత్పురుషులను అవమానించిన మా పాపమే మాకీ గతి పట్టించింది. ఇక భవిష్యత్తులో శుభం చేకూర్చుకోడానికి మేము ప్రయత్నిస్తాము.

తెభా-3-529-వ.
అది యెట్లంటిరేని.
టీక:- అది = అది; ఎట్లు = ఏవిధముగా; అంటిరి = అనుచున్నవారు; ఏని = అయినట్లైతే.
భావము:- అది ఎలాగంటే...

తెభా-3-530-ఉ.
మీ రుణావలోకన సమేతులఁగా మముఁ జేయుఁ జిత్తముల్
దూకొనెనేని మాచనువుఁ ద్రోయక యీఁదగుఁ గామ లోభముల్
కైకొని పుట్టు చోట నవకంజదళాక్షుని నామవిస్మృతిం
బైకొనకుండ దాననె శుభం బగు మీఁది మదీయ జన్మముల్."

టీక:- మీ = మీ యొక్క; కరుణ = దయా; అవలోకన = దృక్కులు, చూపులు; సమేతులన్ = కూడినవారము; కాన్ = అగునట్లు; మమున్ = మమ్ములను; చేయున్ = చేయవలెనని; చిత్తముల్ = మనసున; దూకొనెనేని = అనిపించినన్; మా = మా యొక్క; చనువున్ = కోరికను; త్రోయకన్ = తోసిపుచ్చక; ఈన్ = ఇచ్చుటకు; తగున్ = తగును; కామ = కామము; లోభముల్ = లోభములు; కైకొని = పూని; పుట్టు = జన్మింపబోవు; చోట = ప్రదేశమున; నవకంజదళాక్షుని = విష్ణుని {నవ కంజద ళాక్షుడు - నవ (కొత్త, తాజా) కంజము (పద్మము)ల దళము (రేక)ల వంటి అక్షులు (కన్నులు) ఉన్నవాడు, విష్ణువు}; నామ = పేరును; విస్మృతిన్ = మరచిపోవుటకు; పైకొనకుండ = లోబడిపోకుండు నట్లు; దాననె = దాని వలననే; శుభంబున్ = శుభములు; అగున్ = కలుగును; మీది = రాబోవు; మదీయ = మా యొక్క; జన్మముల్ = జన్మలలో.
భావము:- మమ్మల్ని కరుణించాలనే సంకల్పం మీ మనసుల్లో ఉంటే ఈ మాత్రం దయచేయండి. అదేమంటే మేము లోభమోహాలతో పుట్టినచోట శ్రీహరి నామాన్ని మరువకుండా ఉండేటట్లు అనుగ్రహించండి. అందువల్ల తర్వాతి జన్మాలలో మాకు శుభం కలుగుతుంది."