పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/చంద్రసూర్యపితృ మార్గంబు

వికీసోర్స్ నుండి


తెభా-3-1013-సీ.
"గృహ మందు వర్తించు గృహమేధు లగువారు-
హిత ధర్మార్థకాముల కొఱకు
సంప్రీతు లగుచుఁ దత్సాధనానుష్ఠాన-
నిరతులై వేదనిర్ణీత భూరి
గవత్సుధర్మ తద్భక్తి పరాఙ్ముఖు-
లై దేవగణముల నుదినంబు
జియించుచును భక్తిఁ బైతృక కర్మముల్-
సేయుచు నెప్పుడు శిష్టచరితు

తెభా-3-1013.1-తే.
గుచుఁ దగ దేవ పితృ సువ్రతాఢ్యు లయిన
కామ్యచిత్తులు ధూమాదితులఁ జంద్ర
లోకమును జెంది పుణ్యంబు లుప్త మయిన
రలి వత్తురు భువికి జన్మంబు నొంద.

టీక:- గృహము = గృహము; అందున్ = లో; వర్తించు = వసించు; గృహమేధులు = గృహస్తులు; అగు = అయిన; వారు = వారు; మహిత = గొప్పవి యైన; ధర్మ = ధర్మము; అర్థ = అర్థము; కామముల = కామముల; కొఱకున్ = కొరకు; సంప్రీతులు = మిక్కిలి కోరుతున్నవారు; అగుచున్ = అవుతూ; తత్ = వానిని; సాధనా = సాధించుటకైనవి; అనుష్టాన = చేయుటలో; నిరతులు = నిష్ఠకలవారు; ఐ = అయ్యి; వేద = వేదములందు; నిర్ణీత = నిర్ణయింప బడిన ప్రకారము; భూరి = అత్యధికమైన; భగవత్ = భగవంతునివి యైన; సు = మంచి; ధర్మ = ధర్మముల వర్తనము; తత్ = వాని పై; భక్తి = భక్తి యందు; పరాఙ్ముఖులు = విముఖులు; ఐ = అయ్యి; దేవ = దేవతల; గణములన్ = సమూహములను; అనుదినంబున్ = ప్రతినిత్యము; భజియించుచును = పూజించుచును; భక్తిన్ = భక్తిగా; పైతృ = పితృ; కర్మముల్ = కర్మలు; సేయుచున్ = చేస్తూ; ఎప్పుడున్ = ఎల్లప్పుడును; శిష్ట = పెద్దలు యొక్క; చరితులున్ = ప్రవర్తన కలవారు; అగుచున్ = అవుతూ; తగన్ = అవశ్యము;
దేవ = దేవతల; పితృ = పితృదేవతల; సు = మంచిగ; వ్రత = పూజించుటలో; ఆఢ్యులు = గొప్పదనము కలవారు; అయిన = అయిన; కామ్య = కోరికలందు; చిత్తులు = మనస్సు కలవారు; ధూమ = పొగ; ఆది = మొదలైన వాని; గతులన్ = విధములుగా; చంద్రలోకమున్ = చంద్రలోకమున; కున్ = కు; చెంది = వెళ్ళి; పుణ్యంబున్ = (చేసిన) పుణ్యము; లుప్తము = లోపించినది; అయినన్ = అవ్వగా; మరలి = వెనుకకు మరలి; వత్తురు = వచ్చెదరు; భువికిన్ = భూమికి; జన్మంబున్ = (పునర్) జన్మమును; పొందన్ = పొందుటకు.
భావము:- “సంసారానికి కట్టుబడిన గృహస్థులు ధర్మార్థకామాలపై ప్రీతి కలిగి వాటితోనే సంతుష్టులై వాటిని సాంధించడంలోనే మునిగి తేలుతూ ఉంటారు. వేదాలలో నిర్ణయింపబడిన భాగవత ధర్మాలకూ భగవద్భక్తికీ విముఖులై ఉంటారు. దేవగణాలను నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. పితృకార్యాలను భక్తితో చేస్తూ సదాచార సంపన్నులై ఉంటారు. కానీ ఇట్లా దేవతలకూ పితరులకూ సంబంధించిన సత్కర్మలను ఆచరించడంలోనే నేర్పరులై, కోర్కెలు నిండిన చిత్తం గలవారై ఉండి మోక్షాన్ని అందుకోలేరు. వారు ధూమ్రాది మార్గాలలో చంద్రలోకం చేరి అచ్చట సుఖాలు అనుభవించి పుణ్యం తరిగి నశింపగా మళ్ళీ జన్మ ఎత్తడం కోసం భూలోకానికి వస్తారు.

తెభా-3-1014-వ.
అదియునుం గాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:- అంతేకాక...

తెభా-3-1015-తే.
ప్రవిమలానంత భోగితల్పంబు నందు
యోగనిద్రాళువై హరి యున్న వేళ
ఖిల లోకంబులును విలయంబు నొందు
ట్టి సర్వేశ్వరునిగూర్చి లఘుమతులు.

టీక:- ప్రవిమల = మిక్కిలి స్వచ్ఛమైనవాడు; అనంత = అనంతుడు అనెడి; భోగి = సర్ప; తల్పంబున్ = శయ్య; అందున్ = పైన; యోగనిద్రా = యోగనిద్రను; ఆళువు = చెందినవాడు; ఐ = అయ్యి; హరి = నారాయణుడు; ఉన్న = ఉన్నట్టి; వేళన్ = సమయమున; అఖిల = సమస్తమైన; లోకంబులునున్ = లోకములును; విలయంబున్ = ప్రళయమును; పొందున్ = పొందును; అట్టి = అటువంటి; సర్వేశ్వరుని = భగవంతుని; గూర్చి = గురించి; అలఘు = గొప్ప; మతులు = వారు.
భావము:- అత్యంత నిర్మలమైన ఆదిశేషుని పానుపుమీద హరి యోగనిద్రలో మునిగి ఉన్న సమయంలో సమస్త లోకాలూ ప్రళయాన్ని పొందుతాయి. అటువంటి సర్వేశ్వరుణ్ణి బుద్ధిమంతులైనవారు (ధ్యానిస్తారు).

తెభా-3-1016-మ.
రికింపన్ నిజభక్తి యుక్తిగరిమం బాటిల్లు పంకేరుహో
విన్యస్త సమస్త ధర్మముల శాంస్వాంతులై సంగముం
రివర్జించి విశుద్ధచిత్తు లగుచుం బంకేజపత్రేక్షణే
ధర్మైక నివృత్తులై సతతమున్ దైత్యారిఁ జింతించుచున్.

టీక:- పరికింపన్ = పరిశీలించిచూసిన; నిజ = తన; భక్తి = భక్తితో; యుక్తిన్ = కూడినది యైన; గరిమన్ = గొప్పదనము; పాటిల్లున్ = కలిగి ఉందురు; పంకేరుహోదర = విష్ణుమూర్తి యందు {పంకేరు హోదరుడు - పంకేరుహము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు}; విన్యస్త = సమర్పించబడిన; సమస్త = సమస్తమైన; ధర్మములన్ = ధర్మములతో; శాంత = శాంతమైన; స్వాంతులు = మనస్సులు కలవారు; ఐ = అయ్యి; సంగమున్ = తగులములను; పరివర్జించి = పూక్తిగా వదిలేసి; విశుద్ధ = మిక్కిలి స్వచ్ఛమైన; చిత్తులు = మనస్సుకలవారు; అగుచున్ = అవుతూ; పంకేజపత్రేక్షణ = నారాయణునికి {పంకేజ పత్రేక్షణుడు - పంకేజము (పద్మము) యొక్క పత్ర (రేకు) ల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; ఇతర = ఇతరమైన; ధర్మ = ధర్మములు; ఏక = సమస్తము నుండి; నివృత్తులు = దూరముగ ఉండువారు; ఐ = అయ్యి; సతతమున్ = నిత్యము; దైత్యారిన్ = విష్ణుమూర్తినే {దైత్యారి - దైత్యులు (రాక్షసుల)కు అరి (శత్రువు), విష్ణువు}; చింతించుచున్ = స్మరిస్తూ.
భావము:- ఆ బుద్ధిమంతులు తమ భక్తిప్రపత్తులతో తమతమ ధర్మాలన్నింటినీ పద్మనాభునికే సమర్పించి, ప్రశాంత చిత్తులై, సర్వసంగ పరిత్యాగులై, పుండరీకాక్షుని ఆరాధన తప్ప ఇతర ధర్మాలనుండి దూరంగా ఉంటూ, నిత్యం ఆ దైత్యారినే ధ్యానిస్తూ (ఉంటారు).

తెభా-3-1017-సీ.
ఱియు, నహంకార మకార శూన్యులై-
ర్థి వర్తించుచు ర్చిరాది
మార్గగతుండును హనీయచరితుండు-
విశ్వతోముఖుఁడును విమలయశుఁడు
గదుద్భవస్థానసంహారకారణుం-
వ్యయుం డజుఁడుఁ బరాపరుండుఁ
బురుషోత్తముఁడు నవపుండరీకాక్షుండు-
నైన సర్వేశ్వరు నందు బొంది

తెభా-3-1017.1-తే.
మానితాపునరావృత్తి మార్గమయిన
ప్రవిమలానంద తేజోవిరాజమాన
దివ్యపదమున సుఖియించు ధీరమతులు
రలిరారెన్నఁటికిని జన్మములఁ బొంద

టీక:- మఱియున్ = ఇంకను; అహంకార = అహంకారము, నేను అను భావము; మమకార = మమకారములు, నాది అను భావములు; శూన్యులు = లేనివారు; ఐ = అయ్యి; అర్థిన్ = కోరి; వర్తించుచున్ = ప్రవర్తిస్తూ; అర్చి = వెలుగును; ఆది = గుర్తుగాకల; మార్గ = మార్గముల వెంట; గతుండున్ = వెళ్ళువాడును; మహనీయ = గొప్ప; చరితుండు = వర్తనలు కలవాడును; విశ్వతః = అత్యధికమైన; ముఖుడును = ప్రయత్నశీలియును; విమల = స్వచ్ఛమైన; యశుడు = కీర్తికలవాడును; జగత్ = విశ్వముల యొక్క; ఉద్భవ = సృష్టి; స్థాన = స్థితి; సంహార = లయ; కారణుండున్ = కారకుడు; అవ్యయుండున్ = నాశము లేనివాడును; అజుడున్ = పుట్టుకలేనివాడును; పరాపరుండున్ = పరము అపరము తానే అయినవాడు; పురుషోత్తముండు = పురుషులలో ఉత్తనుడు; నవపుండరీకాక్షుండు = నవకమైన పద్మముల వంటి కన్నులు ఉన్నవాడును; సర్వేశ్వరున్ = భగవంతుని; అందున్ = అందు; పొంది = పొంది;
మానిత = పూజనీయమైన; అపునరావృత్తి = వెనుకకు తిరిగి రానక్కరలేని; మార్గమునన్ = మార్గమున; ప్రవిమల = అతిస్వచ్ఛమైన; ఆనంద = ఆనందము; తేజస్ = తేజస్సులతో; విరాజమాన = విరాజిల్లుతున్న; దివ్య = దివ్యమైన; పదమునన్ = లోకమున; సుఖియించు = సుఖముగ ఉండెడి; ధీరమతులు = జ్ఞాన మనస్కులు; మరలి = వెనుకకుతిరిగి; రారు = రారు; ఎన్నటికిని = ఎప్పటికిని; జన్మములన్ = జన్మలను; పొందన్ = పొందుటకు.
భావము:- ఇంకా అహంకార, మమకారాలను వదిలి ప్రవర్తిస్తూ వెలుగు త్రోవల పయనించేవాడూ, గొప్ప చరిత్ర కలవాడూ, విశ్వమంతా నిండినవాడూ, పవిత్రమైన కీర్తి కలవాడూ, లోకాల సృష్టి స్థితి లయలకు కారణమైనవాడూ, నాశనం లేనివాడూ, జన్మరహితుడూ, శ్రేష్ఠులలో శ్రేష్ఠుడూ, పురుషోత్తముడూ, క్రొత్త తామరలవంటి కన్నులు కలవాడూ అయిన సర్వేశ్వరునిపై బుద్ధి నిలిపి, పునర్జన్మ లేని మహనీయమైన మార్గంలో స్వచ్ఛమై ఆనందమయమై తేజస్సుతో వెలిగిపోయే దివ్యపదాన్ని పొంది సుఖించే ధీరులు పునర్జన్మలను పొందడానికి ఎన్నటికీ భూమిపైకి తిరిగిరారు.

తెభా-3-1018-వ.
మఱియుఁ, బరమేశ్వరదృష్టిచే హిరణ్యగర్భు నుపాసించువారు సత్యలోకంబున ద్విపరార్థావసానం బగు ప్రళయంబు దనుకఁ బరుండగు చతురాననుం బరమాత్మరూపంబున ధ్యానంబు సేయుచు నుండి పృథి వ్యాప్తేజోవాయ్వాకాశ మానసేంద్రియ శబ్దాది భూతాదుల తోడం గూడ లోకంబును బ్రకృతి యందు లీనంబుసేయ సర్వేశ్వరుండు సకల సంహర్త యగు సమయంబున గతాభిమానంబులు గలిగి బ్రహ్మలోకవాసు లగు నాత్మలు బ్రహ్మతోడం గూడి పరమానందరూపుండును సర్వోత్కృష్టుండును నగు పురాణపురుషుం బొందుదురు; కావున నీవు సర్వభూత హృదయపద్మ నివాసుండును శ్రుతానుభావుండును నిష్కళంకుడును నిరంజనుండును నిర్ద్వంద్వుండును నగు పురుషుని భావంబుచే శరణంబు నొందు"మని చెప్పి మఱియు నిట్లనియె.
టీక:- మఱియున్ = ఇంకను; పరమేశ్వర = పరమేశ్వరుడు అను; దృష్టి = దృష్టి; చేన్ = చేత; హిరణ్యగర్భున్ = బ్రహ్మదేవుని; ఉపాసించు = సేవించెడి; వారు = వారు; సత్యలోకంబున = సత్యలోకమున; ద్వి = రెండు; పరార్థ = పరార్థముల; అవసానంబున్ = చివరది; అగు = అయిన; ప్రళయంబున్ = ప్రళయము; దనుక = వరకు; పరుండు = పరుడు; అగు = అయిన; చతురానననున్ = బ్రహ్మదేవుని {చతురాననుడు - చతుః (నాలుగు, 4) ఆననములు (ముఖములు) కలవాడు, బ్రహ్మదేవుడు}; పరమాత్మ = పరమాత్మ; రూపంబునన్ = రూపములో; ధ్యానంబున్ = ధ్యానము; చేయుచున్ = చేస్తూ; ఉండి = ఉండి; పృథివి = పృథ్వి; అప్పు = నీరు; తేజస్ = తేజస్సు; వాయ్వు = వాయువు; ఆకాశ = ఆకాశములు; మానస = మనస్సు; ఇంద్రియ = ఇంద్రియములు; శబ్దాది = తన్మాత్తలు; భూత = భూతములు; ఆదులు = మొదలగువాని; తోడన్ = తోటి; కూడ = కూడా; లోకంబునున్ = లోకమును; ప్రకృతి = ప్రకృతి; అందున్ = అందు; లీనంబున్ = లీనము; చేయన్ = చేయగా; సర్వేశ్వరుండు = భగవంతుడు; సకల = సమస్తమును; సంహర్త = సంహరించువాడు; అగు = అయిన; సమయంబునన్ = సమయములో; గత = విడిచిన; అభిమానంబులున్ = అభిమానములు; కలిగి = ఉండి; బ్రహ్మలోక = బ్రహ్మలోకమునందలి; వాసులు = నివాసులు; అగు = అగు; ఆత్మలు = ఆత్మలు; బ్రహ్మ = బ్రహ్మదేవుని; తోడన్ = తోటి; కూడి = కూడి; పరమ = అతీతమైన; ఆనంద = ఆనందము యొక్క; రూపుండును = రూపముగ కలవాడును; సర్వ = సమస్తమైన విధములుగను; ఉత్కృష్ఠుండును = శ్రేష్ఠుడును; అగు = అయిన; పురాణపురుషున్ = పురాతన కాలమునుండియు ఉన్నవానిని; పొందుదురు = పొందెదరు; కావున = అందుచేత; నీవు = నీలు; సర్వ = సమస్తమైన; భూత = జీవుల; హృదయ = హృదయము అనెడి; పద్మ = పద్మమున; నివాసుండును = నివసించువాడును; శ్రుతానుభావుడును = వినబడుటచే తెలియబడువాడును; నిష్కళంకుడును = మచ్చలేనివాడును; నిరంజనుండును = అసహాయ దర్శనుడును; నిర్ద్వంద్వుండు = ద్వంద్వములు లేనివాడును; అగు = అయిన; పురుషుని = పురుషుని యొక్క; భావంబు = భావము, తలచుట; చేన్ = చేత; శరణంబు = శరణము; పొందుము = పొందుము; అని = అని; చెప్పి = చెప్పి; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- ఇంకా పరమేశ్వరుడనే దృష్టితో బ్రహ్మదేవుణ్ణి ఉపాసించేవారు సత్యలోకంలో రెండు పరార్థాల కాలం తరువాత వచ్చే ప్రళయం వరకు పరుడైన చతుర్ముఖుని పరమాత్మ రూపంలో ధ్యానిస్తూ ఉంటారు. సర్వేశ్వరుడు భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలను, మనస్సును, పంచేంద్రియాలను, పంచతన్మాత్రలను, వాటితో కూడిన సమస్త ప్రకృతినీ, సకల లోకాలనూ తనలో లీనం చేసుకుంటాడు. అప్పుడు సత్యలోకంలో నివసించే ఆత్మస్వరూపులు బ్రహ్మతో కూడ పరమానంద స్వరూపుడూ, సర్వోత్కృష్టుడూ అయిన పురాణపురుషునిలో లీనమౌతారు. కాబట్టి అమ్మా! నీవు సకల ప్రాణుల హృదయ పద్మాలలో నివసించేవాడూ, మహానుభావుడూ, నిష్కలంకుడూ, నిరంజనుడూ, అద్వితీయుడూ అయిన పురుషోత్తముణ్ణి శరణుపొందు” అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు.

తెభా-3-1019-మ.
"లస్థావర జంగమప్రతతికిం ర్చింపఁ దా నాఢ్యుఁడై
లంకశ్రుతిగర్భుఁడుం బరముఁడున్నైనట్టి యీశుండు సే
యోగీంద్రకుమారసిద్ధమునిదేశ్రేణియోగప్రవ
ర్తమై తన్ను భజింపఁజూపు సగుణబ్రహ్మంబు లీలాగతిన్

టీక:- సకల = సమస్తమైన; స్థావర = వృక్షాదులు {స్థావరములు - స్థిరముగ ఒకే స్థలమున ఉండునవి, వృక్షములు మొదలైనవి}; జంగమ = జంత్వాదులు యొక్క {జంగమములు - తిరుగగలవి, జంతువులు మొదలైనవి}; ప్రతతి = విస్తారమున; కిన్ = కును; చర్చింపన్ = పరిశీలించిచూసిన; తాన్ = తానే; ఆఢ్యుడు = నాథుడు; ఐ = అయ్యి; అకలంక = నిర్మలమైన; శ్రుతి = వేదములకు; గర్భుండు = పుట్టుటకు మూలస్థానమైన వాడు; పరముండు = అతీతమైన వాడును; ఐనట్టి = అయినటువంటి; ఈశుండు = విష్ణుమూర్తి {ఈశుడు - ప్రభావము చూపగలవాడు, విష్ణువు}; సేవక = సేవకులు అయిన; యోగి = యోగులలో; ఇంద్ర = శ్రేష్ఠులును; కుమార = సనకాదులు {కుమార చతుష్కము - సనకాదులు, 1సనకుడు 2సనందనుడు 3సనత్కుమారుడు 4సనత్సుజాతుడు}; సిద్ధ = సిద్ధులు; ముని = మునులు; దేవ = దేవతలు యొక్క; శ్రేణి = సమూహముల; యోగ = భక్తి యోగములందు; ప్రవర్తకము = నడపబడునది; ఐ = అయ్యి; తన్ను = తనను; భజింపన్ = సేవించగా; చూపున్ = దర్శనమిచ్చును; సగుణబ్రహ్మంబు = గుణములతోకూడిన అంతర్యామిగా; లీలా = లీలలు; గతిన్ = వలె.
భావము:- “సమస్త చరాచర ప్రాణికోటికి అధీశ్వరుడు, పవిత్రాలైన వేదాల పుట్టుటకు కారణభూతుడు, సర్వశ్రేష్ఠుడు అయిన పరమేశ్వరుడు యోగీంద్రులు, సనకాది కుమారులు, సిద్ధులు, మునులు, దేవతలు భక్తియోగంతో తనను భజింపగా వారికి సగుణస్వరూపంతో దర్శనమిస్తాడు.

తెభా-3-1020-సీ.
ట్టి సర్వేశ్వరుం య్యయి కాలంబు-
లందును దద్గుణ వ్యతికరమున
నియించు చుండు నీ చాడ్పున ఋషిదేవ-
ణములు దమతమ ర్మనిర్మి
తైశ్వర్య పారమేష్ఠ్యము లందుఁ బురుషత్వ-
మునఁబొంది యధికారములు వహించి
ర్తించి క్రమ్మఱ త్తురు మఱికొంద-
ఱారూఢకర్మానుసార మైన

తెభా-3-1020.1-తే.
నములను జాల గలిగి ధర్మముల యందు
శ్రద్ధతోఁ గూడి యప్రతిసిద్ధమైన
నిత్యనైమిత్తికాచార నిపుణు లగుచుఁ
గి రజోగుణ కలిత చిత్తములు గలిగి.

టీక:- అట్టి = అటువంటి; సర్వేశ్వరుండు = నారాయణుడు {సర్వేశ్వరుడు - సర్వులకును ఈశ్వరుడు (ప్రభువు), విష్ణువు}; అయ్యయి = ఆయా; కాలంబులన్ = కాలముల; అందును = లోను; తత్ = ఆయా; గుణ = గుణముల; వ్యతికరమున = సమ్మేళనములతో; జనియించుచున్ = అవతరించుచును; ఉండున్ = ఉండును; ఈ = ఈ; చాడ్పునన్ = విధముననే; ఋషి = ఋషుల; దేవ = దేవతల; గణములు = సమూహములు; తమతమ = తమతమ; కర్మ = కర్మములచే; నిర్మిత = నిర్మింపబడినట్టి; ఐశ్వర్య = ఐశ్వర్యములు; పారమేష్ఠ్యములు = పరమేష్ఠిత్వముల; అందున్ = లోను; పురుషత్వమును = పుట్టుకలను; పొంది = పొంది; అధికారములున్ = అధికారములను; వహించి = చేపట్టి; వర్తించి = జీవించి; క్రమ్మఱన్ = మరలి; వత్తురు = వచ్చెదరు; మఱికొందఱు = మరికొంతమంది; ఆరూఢ = అధిష్టించిన; కర్మ = కర్మలను; అనుసారము = అనుసరించునది; ఐన = అయినట్టి;
మనములను = సంకల్పములు; కలిగి = కలిగి ఉండి; ధర్మముల = ఆయా ధర్మముల; అందున్ = లో; శ్రద్ధన్ = శ్రద్ధ; తోన్ = తోటి; కూడి = కలిగి ఉండి; అప్రతిసిద్ధము = విశిష్టము; ఐన = అయిన; నిత్య = నిత్య కర్మలు; నైమిత్తిక = నిమిత్తమునకైన కర్మలు; ఆచార = ఆచారములు లలో; నిపుణులున్ = నైపుణ్యములు కలవారు; అగుచున్ = అవుతూ; తగిన్ = అవశ్యము; రజోగుణ = రజోగుణములతో; కలిత = కూడిన; చిత్తములు = మనస్సులు; కలిగి = కలిగి ఉండి.
భావము:- అటువంటి సర్వేశ్వరుడు ఆయా సమయాలలో తన మహనీయ గుణగణాల కలయికచే అనేక రూపాలలో అవతరిస్తూ ఉంటాడు. ఈ విధంగా అతని అంశలు పంచుకొని పుట్టిన ఋషులు, దేవతలు తమ కర్మఫలాన్ని అనుసరించి పౌరుషంతో ఐశ్వర్యం, పారమేష్ఠ్యం మొదలైన అధికారాలు చేపట్టి కొంతకాలం అనుభవించి, యథాస్థానానికి తిరిగి వస్తారు. మరికొందరు కర్మానుసారమైన మనస్సు కలవారై, ధర్మమందు శ్రద్ధ కలవారై, ధర్మానికి విరుద్ధం కాకుండునట్లుగా, నిత్యమూ తాము చేయదగిన ఆచారాలను నిర్వర్తిస్తూ, రజోగుణంతో నిండిన మనస్సు కలవారై...

తెభా-3-1021-వ.
సకాములై యింద్రియజయంబు లేక పితృగణంబుల నెల్లప్పుడుఁ బూజించుచు గృహంబుల యందు వర్తించి హరిపరాఙ్ముఖు లగు వారు త్రైవర్గిక పురుషు లని చెప్పంబడుదురు.
టీక:- సకాములు = కోరికలు కలవారు; ఐ = అయ్యి; ఇంద్రియ = ఇంద్రియములను; జయంబున్ = జయింపగలుగుట; లేక = లేక ఉండి; పితృగణంబులన్ = పితృదేవతలను; ఎల్లప్పుడు = ఎప్పుడును; పూజించుచున్ = పూజిస్తూ; గృహంబులన్ = గృహముల; అందు = లో; వర్తించి = ప్రవర్తిల్లుతూ; హరి = విష్ణుమూర్తికి; పరాఙ్ముఖులు = విముఖములు; అగు = అయిన; వారున్ = వారు; త్రైవర్గికపురుషులు = త్రైవర్గికపురుషులు {త్రైవర్గములు - ధర్మ అర్థ కామములు మూడును}; అని = అని; చెప్పంబడుదురు = పిలువబడుతారు.
భావము:- కామప్రవృత్తికి లోబడి ఇంద్రియాలను జయింపలేక పితృదేవతలను అనుదినం ఆరాధిస్తూ గృహాలలో పడి సంసార నిమగ్నులై జీవిస్తూ, హరిపరాఙ్ముఖులై, ధర్మార్థకామాలను మాత్రమే నమ్ముకొని వర్తిస్తారు. అటువంటి వారు త్రైవర్గిక పురుషులని పిలువబడతారు.

తెభా-3-1022-చ.
వినుతగుణోత్తరుండు నురువిక్రముఁ డైన హరిన్ భజించి త
న్మన లసత్కథామృతము మానుగఁ గ్రోలుట మాని దుష్కథల్
విని ముద మందుచుందురు వివేకవిహీనత నూరఁబంది యా
త్మను మధురాజ్యభక్ష్యములు మాని పురీషము కేగు చాడ్పునన్.

టీక:- వినుతగుణోత్తరుండున్ = భగవంతుడు {వినుత గుణోత్తరుండు - వినుత (స్తుతింపబడిన) గుణములతో విశిష్టుడు, విష్ణువు}; ఉరువిక్రముండున్ = భగవంతుడు {ఉరు విక్రముండు - ఉరు (అత్యధికమైన) పరాక్రమము కలవాడు, విష్ణువు}; ఐన = అయినట్టి; హరిన్ = నారాయణుని; భజించి = కొలిచి; తత్ = అతని; మననలన్ = స్మరణములును; లసత్ = ప్రకాశవంతమైన; కథా = కథలు అనెడి; అమృతమున్ = అమృతమును; మానుగ = మనోజ్ఞముగ; క్రోలుటన్ = తాగుట; మాని = మాని వేసి; దుష్కథల్ = చెడ్డకథలను; విని = విని; ముదమున్ = సంతోషమును; అందుచున్ = పొందుతూ; ఉందురు = ఉండెదరు; వివేక = వివేకము; విహీనతన్ = మిక్కిలిగ క్షీణించుటచే; ఊరబంది = ఊర పంది; ఆత్మను = మనస్ఫూర్తిగ; మధుర = రుచికరమైన; ఆజ్య = నేతి; భక్ష్యములున్ = పిండి వంటలను; మాని = వదిలేసి; పురీషమున్ = మలమున; కున్ = కు; ఏగు = వెళ్ళు; చాడ్పునన్ = విధముగ.
భావము:- శుభగుణవిశిష్టుడు, అద్వితీయ పరాక్రముడు అయిన హరిని భజిస్తూ ఆయన మహిమలనే మననం చేస్తూ ఆయన మధుర కథాసుధను తనివితీరా త్రాగడం ఉత్తమలక్షణం. అలాకాకుండా మరికొందరు ఊరబంది అవివేకంతో తీయతీయని నేతివంటకాలను కాలదన్ని మలభక్షణకై పరుగెత్తినట్లుగా చెడ్డకథలను వింటూ ఆనందిస్తూ ఉంటారు.

తెభా-3-1023-చ.
వడ ధూమమార్గగతులై పితృలోకముఁ బొంది పుణ్యముం
బొలిసినవారు దొంటి తమ పుత్రులకుం దగఁ దాము పుట్టి వి
హ్వమతి గర్భగోళపతనాది పరేతధరాగతాంతమై
వెసిన కర్మ మిం దనుభవింతురు గావున నీవు భామినీ!

టీక:- అలవడ = తగిన; ధూమ = పొగ; మార్గ = దారిలలో; గతులు = వెళ్ళు వారు; ఐ = అయ్యి; పితృలోకమున్ = పితృలోకములను; పొంది = పొందినవారై; పుణ్యమున్ = చేసుకొన్న పుణ్యము; పొరసినన్ = వ్యయమైపోగా; వారున్ = వారు; తొంటిన్ = పూర్వపు; తమ = తమ యొక్క; పుత్రులకున్ = సంతానమునకు; తగన్ = అవశ్యము; తాము = తాము; పుట్టి = పుట్టి; విహ్వల = భయముచే స్వాధీనము తప్పిన; మతి = మనస్సులతో; గర్భ = గర్భము అనెడి; గోళ = గోళములో; పతన = పడుట; ఆది = మొదలు; పరేత = స్మశాన; ధరా = భూమికి; గత = పోవు; అంతమై = పర్యంతము; వెలసిన = కలిగిన; కర్మమున్ = కర్మఫలములను; ఇందున్ = ఇక్కడే; అనుభవింతురు = అనుభవించెదరు; కావునన్ = అందుచేత; నీవున్ = నీవు; భామినీ = తల్లీ {భామిని - స్త్రీ}.
భావము:- ధూమమార్గాల గుండా వెళ్ళి, పితృలోకం చేరి సుఖించేవాళ్ళు తమ పుణ్యం తరిగిపోగానే మళ్ళీ ఈ భూమిమీద తమ బిడ్డలకే బిడ్డలై జన్మిస్తారు. వశం తప్పిన మనస్సుతో మాతృగర్భంనుండి బయటపడింది మొదలుగా శ్మశాన భూమికి చేరే పర్యంతం ఆయా కర్మఫలాలను ఇక్కడే అనుభవిస్తాడు. కాబట్టి ఓ తల్లీ! నీవు...

తెభా-3-1024-క.
విను, సర్వ భావములఁ బర
ముని ననఘు ననంతు నీశుఁ బురుషోత్తము స
న్మమున భజియింపుము ముద
ము బునరావృత్తి లేని ముక్తి లభించున్."

టీక:- విను = వినుము; సర్వ = అన్ని; భావములన్ = రకములుగను; పరమునిన్ = విష్ణుమూర్తిని {పరము - సమస్తమునకు అతీతమైనవాడు, విష్ణువు}; అనఘున్ = విష్ణుమూర్తిని {అనఘుడు - పాపములు లేనివాడు, విష్ణువు}; అనంతున్ = విష్ణుమూర్తిని {అనంతుడు - అంతములేని వాడు, విష్ణువు}; ఈశున్ = విష్ణుమూర్తిని {ఈశుడు - ప్రభుత్వము కలవాడు, విష్ణువు}; పురుషోత్తమున్ = విష్ణుమూర్తిని {పురుషోత్తముడు - పురుషులలో ఉత్తముడు, విష్ణువు}; సత్ = మంచి; మనమునన్ = మనస్సుతోటి; భజియింపుము = కొలువుము; ముదమునన్ = సంతోషముతో; పునరన్ = మరల; ఆవృత్తి = వచ్చెడిది; లేని = లేనట్టి; ముక్తిన్ = ముక్తి; లభించున్ = లభ్యమగును.
భావము:- విను. సర్వశ్రేష్ఠుడు, పాపరహితుడు, అనంతుడు, అధీశ్వరుడు, పురుషోత్తముడు అయిన పరమేశ్వరుణ్ణి అన్నిరీతులా సద్బుద్ధితో సంతోషంగా సేవించు. దానివల్ల పునర్జన్మం లేని కైవల్యం నీకు లభిస్తుంది.”

తెభా-3-1025-వ.
అనిచెప్పి; వెండియు నిట్లనియె "భగవంతుం డగు వాసుదేవుని యందు బ్రయుక్తం బగు భక్తియోగంబు బ్రహ్మసాక్షాత్కార సాధనంబు లగు వైరాగ్య జ్ఞానంబులం జేయు; అట్టి భగవద్భక్తి యుక్తం బైన చిత్తం బింద్రియవృత్తులచే సమంబు లగు నర్థంబు లందు వైషమ్యంబును బ్రియాప్రియంబులును లేక నిస్సంగంబు సమదర్శనంబు హేయోపాదేయ విరహితంబునై యారూఢంబైన యాత్మపదంబు నాత్మచేఁ జూచుచుండు జ్ఞానపురుషుండును బరబ్రహ్మంబును బరమాత్ముండును నీశ్వరుండును నగు పరమపురుషుం డేకరూపంబు గలిగి యుండియు దృశ్యద్రష్టృ కరణంబులచేతం బృథగ్భావంబు బొందుచుండు; ఇదియ యోగికి సమగ్రం బగు యోగంబునం జేసి ప్రాప్యంబగు ఫలంబు; కావున విషయ విముఖంబు లగు నింద్రియంబులచేత జ్ఞానరూపంబును హేయగుణ రహితంబును నగు బ్రహ్మంబు మనోవిభ్రాంతిం జేసి శబ్దాది ధర్మం బగు నర్థరూపంబునం దోఁచు; అది యెట్టు లర్థాకారంబునం దోఁచు నని యడిగితివేని నహంకారంబు గుణరూపంబునం జేసి త్రివిధంబును భూతరూపంబునం బంచవిధంబును నింద్రియరూపంబున నేకాదశవిధంబును నై యుండు; జీవరూపుం డగు విరాట్పురుషుండు జీవవిగ్రహం బైన యండం బగు జగంబునం దోఁచుచుండు; దీని శ్రద్ధాయుక్తం బయిన భక్తిచేత యోగాభ్యాసంబునం జేసి సమాహితమనస్కుం డై నిస్సంగత్వంబున విరక్తుం డైనవాడు పొడగనుచుండు; అది యంతయు బుధజనపూజనీయ చరిత్రవు గావున నీకుం జెప్పితి; సర్వ యోగ సంప్రాప్యుం డగు నిర్గుణుండు భగవంతుం డని చెప్పిన జ్ఞానయోగంబును మదీయభక్తి యోగంబును నను రెండు నొకటియ యింద్రియంబులు భిన్నరూపంబులు గావున నేకరూపం బయిన యర్థం బనేక విధంబు లగు నట్లేకం బగు బ్రహ్మం బనేక విధంబులుగఁ దోఁచు; మఱియును.
టీక:- అని = అని; చెప్పి = చెప్పి; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; భగవంతుండు = గోవిందుడు {భగవంతుడు - విశ్వమునకు భగము (పుట్టుకకు స్థానము) అయినవాడు, విష్ణువు}; అగు = అయిన; వాసుదేవుని = గోవిందుని {వాసుదేవుడు - సర్వభూతములందును అంతర్యామిగా వసిండువాడు, విష్ణువు}; అందున్ = అందు; ప్రయుక్తంబు = ప్రయోగింపబడినది; అగు = అయిన; భక్తియోగంబ = భక్తయోగము మాత్రమే; బ్రహ్మ = పరబ్రహ్మ {పరబ్రహ్మ - సర్వాతీతమైన విశ్వకారణభూతుడు, విష్ణువు}; సాక్షాత్కార = సాక్షాత్కారమునకు; సాధనంబులు = పనిముట్లు {సాధనంబులు - సాధించుటకు ఉపయోగపడునవి, పనిముట్లు}; అగు = అయిన; వైరాగ్య = వైరాగ్యము; జ్ఞానంబులన్ = జ్ఞానములను; చేయున్ = కలుగజేయును; అట్టి = అటువంటి; భగవద్భక్తి = భగవద్భక్తికి; యుక్తంబు = తగినట్టిది; ఐన = అయిన; చిత్తంబు = మనస్సు; ఇంద్రియ = ఇంద్రియముల; వృత్తుల్ = ప్రవృత్తుల; చేన్ = వలన; సమంబులు = సమత్వముకలది; అగు = అగును; అర్థంబులు = ప్రయోజనములు; అందున్ = ఎడల; వైషమ్యంబునున్ = భేదభావములు; ప్రియా = ప్రియభావములు; అప్రియంబులును = అప్రియభావములును; లేక = లేకుండగ; నిస్సంగంబున్ = తగులములులేనిదియును; సమదర్శనంబును = సమదృష్టియును; హేయ = ఏవగింపులును; ఉపాదేయ = ఇష్టపడుటలు; విరహితంబున్ = లేకుండుటయును; ఐ = అయ్యి; ఆరూఢంబున్ = అరోపించుకొన్నది; ఐన = అయిన; ఆత్మపదంబున్ = ఆత్మస్థితిని; ఆత్మ = మనస్సు; చేన్ = వలన; చూచుచుండు = దర్శించుచుండును; జ్ఞానపురుషుండును = వాసుదేవుడు {జ్ఞానపురుషుండు - జ్ఞానమే పురుషరూపము అయినవాడు, విష్ణువు}; పరబ్రహ్మంబును = వాసుదేవుడు {పరబ్రహ్మంబు - అత్యుత్తమ బ్రహ్మము, విష్ణువు}; పరమాత్ముండును = వాసుదేవుడు {పరమాత్ముండు - అతీతమైన ఆత్మ ఐనవాడు, విష్ణువు}; ఈశ్వరుండును = వాసుదేవుడు {ఈశ్వరుండు - ఈశత్వము కలవాడు, విష్ణువు}; అగు = అయిన; పరమపురుషుండు = వాసుదేవుడు {పరమపురుషుడు - అతీతమైన పురుషత్వము కలవాడు, విష్ణువు}; ఏక = సమస్తమును తానైన; రూపంబున్ = స్వరూపమును; కలిగి = కలిగి; ఉండియున్ = ఉండియును; దృశ్య = చూడబడునదియును; ద్రష్ట = చూచువాడును; కరణంబుల్ = ఇంద్రియములును; చేతన్ = వలన; పృథగ్భావంబున్ = వేరగు భావమును; పొందుచున్ = పొందుతూ; ఉండును = ఉండును; ఇదియ = ఇదే; యోగి = యోగి; కిన్ = కి; సమగ్రంబున్ = పరిపూర్ణము; అగు = అయిన; యోగంబునన్ = యోగసాధనము; చేసి = వలన; ప్రాప్యంబున్ = పొందదగినది; అగున్ = అయ్యెడి; ఫలంబున్ = ఫలితము; కావున = అందుచేత; విషయ = ఇంద్రియార్థముల నుండి; విముఖంబులున్ = మరలినవి; అగు = అయిన; ఇంద్రియంబుల్ = ఇంద్రియముల; చేతన్ = వలన; జ్ఞాన = జ్ఞానము యొక్క; రూపంబును = స్వరూపమును; హేయ = ఏవగించుకొను; గుణ = గుణములు; రహితంబును = లేనిదియును; అగు = అయిన; బ్రహ్మంబున్ = బ్రహ్మము; మనస్ = మనస్సు యొక్క; విభ్రాంతిన్ = చలించుటలు; చేసి = వలన; శబ్దాది = శబ్దము మొదలైన; ధర్మంబున్ = ధర్మములు; అగు = అయిన; అర్థ = ప్రయోజనముల; రూపంబునన్ = రూపములలో; తోచున్ = తోచును, గ్రహింపబడును; అది = అది; ఎట్టుల = ఏ విధముగా; అర్థ = ప్రయోజనముల; ఆకారంబునన్ = స్వరూపములో; తోచున్ = తోచును, గ్రహింపబడును; అని = అని; అడిగితివి = అడిగిన; ఏని = అట్లయితే; గుణ = గుణముల; రూపంబునన్ = రూపముల; చేసి = వలన; త్రి = మూడు (3) {త్రిగుణములు - 1సత్వగుణము 2రజోగుణము 3తమోగుణము}; విధంబునున్ = విధములును; భూత = భూతముల; రూపంబునన్ = రూపములో; పంచ = అయిదు (5) {పంచభూతములు - 1ఆకాశము 2తేజస్సు 3వాయువు 4జలము 5పృథ్వి}; విధంబునున్ = విధములుగను; ఇంద్రియ = ఇంద్రియముల; రూపంబునన్ = రూపములలో; ఏకాదశ = ఇరవైయొక్క (11) {ఏకాదశేంద్రియములు - పంచజ్ఞానేంద్రియములును, 1కన్నులు 2ముక్కు 3చెవులు 4నాలుక 5చర్మము పంచకర్మేంద్రియములు, 6కాళ్ళు 7చేతులు 8వాక్కు 9పాయువు 10ఉపస్థు మరియును 11మనస్సు}; విధంబునున్ = విధములుగను; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; జీవ = జీవుని; రూపుండు = రూపము కలవాడు; అగు = అయిన; విరాట్పురుషుండు = విష్ణుమూర్తి {విరాట్పురుషుడు - విశ్వమేస్వరూపమైనవాడు, విష్ణువు}; జీవవిగ్రహంబు = సజీవమైనరూపమును; ఐన = అయిన; అండంబు = అండము; అగు = అయిన; జగంబునన్ = విశ్వములో; తోచుచున్ = తోచుచును, గ్రహింపబడుచును; ఉండు = ఉండును; దీనిన్ = దీనిని; శ్రద్ధా = శ్రద్ధతో; యుక్తంబున్ = కూడినది; అయిన = అయిన; భక్తి = భక్తి; చేతన్ = చేతను; యోగ = యోగమును; అభ్యాసంబునన్ = సాధనచేయుట; చేసి = వలనను; సమాహిత = కూడగట్టుకొన్న; మనస్కుండు = మనస్సు కలవాడు; ఐ = అయ్యి; నిస్సంగత్వంబునన్ = సర్వవిధ సంగములు వదలుటచే; విరక్తుండు = వైరాగ్యము కలవాడు; ఐన = అయిన; వాడు = వాడు; పొడగనుచున్ = దర్శించుచున్; ఉండు = ఉండును; అది = అది; అంతయున్ = అంతయును; బుధ = జ్ఞానులు అయిన; జన = జనములచే; పూజనీయ = పూజింప తగిన; చరిత్రవు = వర్తనలు కలామెవు; కావునన్ = కనుక; నీకున్ = నీకు; చెప్పితిన్ = చెప్పితిని; సర్వ = సర్వవిధములు అయిన; యోగ = యోగసాధనములచేతను; ప్రాప్యుండు = పొందదగినవాడు; అగు = అయిన; నిర్గుణుండు = గుణరహితుడు; భగవంతుండు = విష్ణుమూర్తి; అని = అని; చెప్పిన = చెప్పినట్టి; జ్ఞానయోగంబును = జ్ఞానయోగమును; మదీయ = నా యొక్క; భక్తియోగంబునున్ = భక్తియోగమును; అను = అనెడి; రెండున్ = రెండును (2); ఒకటియ = ఒకటే (1); ఇంద్రియంబులు = ఇంద్రియములు; భిన్న = విభిన్నమైన; రూపంబులున్ = రూపములు కలవి; కావునన్ = కనుక; అనేక = అనేకమైన; రూపంబు = రూపములు కలది; అయిన = అయినట్టి; అర్థంబ = ఇంద్రియార్థము మాత్రము; ఏక = ఒకే; విధంబున్ = విధమైనది; అగున్ = అగును; అట్లే = ఆ విధముగనే; ఏకంబున్ = ఏకమే; అగు = అయిన; బ్రహ్మంబున్ = బ్రహ్మము కూడ; అనేక = అనేకమైన; విధంబులన్ = విధములుగా; తోచున్ = తోచును, గ్రహింపబడును; మఱియును = ఇంకను.
భావము:- అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు. “పరమేశ్వరుడైన వాసుదేవుని యందు అభివ్యక్తమైన భక్తియోగం బ్రహ్మసాక్షాత్కారానికి సాధనాలైన జ్ఞానాన్నీ వైరాగ్యాన్నీ కలుగజేస్తుంది. అటువంటి భగవద్భక్తితో కూడిన చిత్తం ఇంద్రియ వ్యాపారాలలో సమంగా వర్తిస్తుంది. అటువంటి మనస్సు కలవానికి హెచ్చుతగ్గులు, ప్రియాప్రియములు, విషయ లాలస, గ్రహింప దగినవీ, తిరస్కరింప దగినవీ ఉండవు. సర్వత్ర సమదర్శన మేర్పడుతుంది. తనలో ఉన్న ఆత్మ స్వరూపాన్ని తాను చూడగలుగుతాడు. జ్ఞానస్వరూపుడు, పరబ్రహ్మ, పరమాత్ముడు, ఈశ్వరుడు అయిన పరమేశ్వరుడు ఒకే రూపం కలవాడై ఉండికూడా కనబడే రూపాన్ని బట్టీ, చూచేవారినిబట్టీ, చూడటానికి ఉపయోగపడే సాధనాలనుబట్టీ వేరువేరు రూపాలలో గోచరిస్తాడు. ఇదే యోగి అయినవాడు సంపూర్ణ యోగంవల్ల పొందదగిన ఫలం. కావున విషయాలనుండి వెనుకకు మరలిన ఇంద్రియాలవల్ల జ్ఞాన స్వరూపమూ, హేయగుణ రహితమూ అయిన పరబ్రహ్మ దర్శనం లభిస్తుంది. ఆ పరబ్రహ్మమే మనస్సు యొక్క భ్రాంతి వలన శబ్దం స్పర్శం మొదలైన వాని ధర్మాలైన అర్థాల స్వరూపంతో గోచరిస్తున్నది. ఆ పరబ్రహ్మం అర్థస్వరూపంతో ఎట్లా కనిపిస్తుందని నీకు సందేహం కలుగవచ్చు. అహంకారం గుణరూపం ధరించి సత్త్వరజస్తమస్సులై మూడు విధాలుగానూ, భూతరూపం ధరించి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలనే అయిదు విధాలుగానూ, ఇంద్రియరూపం ధరించి పదకొండు విధాలుగానూ ఉంటుంది. ఈ విధంగా అహంకారమే నానావిధాలుగా భాసిస్తుంది. విరాట్పురుషుడు జీవస్వరూపుడు. జీవరూపమైన ఈ జగత్తు అనే గ్రుడ్డులో అతడు నిండి ఉంటాడు. ఈ పరమ రహస్యాన్ని శ్రద్ధా సహితమైన భక్తితోనూ, యోగాభ్యాసంతోనూ, నిశ్చల చిత్తం కలవాడై వైరాగ్యం పొందినవాడు దర్శిస్తాడు. అమ్మా! నీవు జ్ఞాన సంపన్నులైన పెద్దలు పూజింపదగిన చరిత్ర గలదానవు. కాబట్టి నీకు ఈ విషయమంతా వెల్లడించాను. సమస్త యోగసాధనలవల్ల పొందదగిన పరబ్రహ్మను నిర్గుణుడని జ్ఞానయోగులు పలుకుతున్నారు. నేను చెప్పిన భక్తియోగం ఆ పరమాత్మను సగుణుడుగా పేర్కొంటున్నది. వాస్తవానికి జ్ఞానయోగం భక్తియోగం రెండూ ఒక్కటే. ఇంద్రియాలు వేరువేరు రూపాలతో ఉంటాయి. అందువల్లనే ఒకే రూపంలో ఉండే వస్తువు అనేక విధాలుగా తోచినట్లు, ఒకే పరమాత్మ అనేక విధాలుగా గోచరిస్తున్నాడు.

తెభా-3-1026-సీ.
అంబ! నారాయణుం ఖిలశాస్త్రములను-
మధికానుష్ఠిత వన తీర్థ
ర్శన జప తపోధ్యయన యోగక్రియా-
దానకర్మంబులఁ గానఁబడక
యేచిన మనము బాహ్యేంద్రియంబుల గెల్చి-
కల కర్మత్యాగరణి నొప్పి
లకొని యాత్మతత్త్వజ్ఞానమున మించి-
యుడుగక వైరాగ్యయుక్తిఁ దనరి

తెభా-3-1026.1-తే.
హిత ఫలసంగరహిత ధర్మమునఁ దనరు
ట్టి పురుషుండు దలపోయ ఖిల హేయ
గుణములనుఁ బాసి కల్యాణగుణ విశిష్టుఁ
డైన హరి నొందుఁ బరమాత్ము నఘుఁ డగుచు

టీక:- అంబ = తల్లీ; నారాయణుండు = భగవంతుడు {నారాయణుడు - నారము (నీరు)లు అందు వసించువాడు, విష్ణువు}; అఖిల = సమస్తమైన; శాస్త్రములనున్ = శాస్త్రముల వలనను; సమధిక = సమృద్ధిగా; అనుష్టిత = అనుష్టానములు; సవన = యాగములు; తీర్థదర్శన = తీర్థయాత్రలు; జప = జపములు; తపస్ = తపస్సులు; అధ్యయన = అధ్యయనములు; యోగక్రియా = యోగక్రియలు; దాన = దానములు; కర్మంబులన్ = కర్మలును వలనను; కానబడక = కనబడక; ఏచిన = విజృంభించిన; మనమున్ = మనస్సు; బాహ్య = బహిర్ముఖంబులు అయిన; ఇంద్రియంబులన్ = ఇంద్రియములను; గెల్చి = జయించి; సకల = సమస్తమైన; కర్మ = కర్మములను; త్యాగ = త్యజించు; సరణిన్ = విధముగా; ఒప్పి = ఒప్పుగా ఉండి; తలకొని = పూనుకొని; ఆత్మ = ఆత్మ; తత్త్వ = తత్త్వము యొక్క; జ్ఞానమునన్ = జ్ఞానమును; మించి = పెంచుకొని; ఉడుగక = వదలని; వైరాగ్య = వైరాగ్యమునందలి; యుక్తిన్ = నేర్పులో; తనరి = అతిశయించి;
మహిత = గొప్పదైన; ఫల = ఫలితములతో; సంగ = తగులము; రహిత = లేని; ధర్మమునన్ = ధర్మమునందు; తనరున్ = అతిశయించెడి; అట్టి = అటువంటి; పురుషుండు = పురుషుడు; తలపోయన్ = పరిశీలించిన; సకల = సమస్తమైన; హేయ = రోయదగిన; గుణములనున్ = గుణములకు; పాసి = దూరమై; కల్యాణ = శుభమైన; గుణ = గుణములు; విశిష్టుడు = విశిష్టముగ కలవాడు; ఐన = అయిన; హరిన్ = భగవంతుని; పొందున్ = చెందును; పరమాత్మున్ = పరమాత్ముని; అనఘుడు = పుణ్యుడు; అగుచున్ = అవుతూ.
భావము:- అమ్మా! నారాయణుడు సమస్త శాస్త్రాలను చదివినందువల్లను, అనుష్ఠానాలూ యజ్ఞాలూ తీర్థయాత్రలూ జపతపాలూ ఆచరించినందువల్లనూ కనిపించడు. వేదాలు అధ్యయనం చేయడం వల్లనూ, యోగాభ్యాసాల వల్లనూ, దానాలూ వ్రతాలూ చేసినందువల్లనూ గోచరింపడు. చంచలమైన మనస్సును లోగొని చెలరేగిన ఇంద్రియాలను జయించి, కర్మ లన్నింటినీ భగవదర్పితం చేసి, ఆత్మస్వరూపాన్ని గుర్తించి, తరిగిపోని వైరాగ్యంతో ఫలితాలను అపేక్షించకుండా ప్రవర్తించే పురుషుడు మాత్రమే దుర్గుణాలను దూరం చేసుకొని పాపాలను పటాపంచలు గావించి అనంత కళ్యాణ గుణ విశిష్టుడు పరమాత్మ అయిన ఆ హరిని చేరగలుగుతాడు.

తెభా-3-1027-వ.
అదిగావున, నీకుం జతుర్విధ భక్తియోగప్రకారంబుఁ దేటపడఁ నెఱింగించితి; అదియునుం గాక, కామరూప యగు మదీయ గతి జంతువుల యందు నుత్పత్తి వినాశ రూపంబుల నుండు నవిద్యా కర్మ నిర్మితంబు లైన జీవునిగతు లనేక ప్రకారంబులై యుండు; అదియు జీవాత్మ వాని యందుం బ్రవర్తించి యాత్మగతి యిట్టిదని యెఱుంగక యుండు"నని చెప్పి, మఱియు నిట్లనియె "ఇట్టి యతి రహస్యం బగు సాంఖ్యయోగ ప్రకారంబు ఖలునకు నవినీతునకు జడునకు దురాచారునకు డాంబికునకు నింద్రియలోలునకుఁ బుత్ర దారాగారాద్యత్యంతాసక్త చిత్తునకు భగవద్భక్తిహీనునకు విష్ణుదాసుల యందు ద్వేషపడు వానికి నుపదేశింప వలవదు; శ్రద్ధాసంపన్నుండును, భక్తుండును, వినీతుండును, నసూయారహితుండును, సర్వభూత మిత్రుండును, శుశ్రూషాభిరతుండును, బాహ్యార్థజాత విరక్తుండును, శాంతచిత్తుండును, నిర్మత్సరుండును, శుద్ధాత్ముండును, మద్భక్తుండును, నగు నధికారికి నుపదేశింప నర్హంబగు; ఈ యుపాఖ్యానం బే పురుషుండేనిఁ బతివ్రత యగు నుత్తమాంగన యేని శ్రద్ధాభక్తులు గలిగి మదర్పితచిత్తంబునన్ వినుఁ బఠియించు నట్టి పుణ్యాత్ములు మదీయ దివ్యస్వరూపంబుఁ బ్రాపింతు"రని చెప్పెను"అని మైత్రేయుండు విదురునకు వెండియు నిట్లనియె "ఈ ప్రకారంబునం గర్దమదయిత యైన దేవహూతి గపిలుని వచనంబులు విని నిర్ముక్తమోహ పటల యగుచు సాష్టాంగ దండప్రణామంబు లాచరించి తత్త్వవిషయాంకిత సాంఖ్యజ్ఞానప్రవర్తకం బగు స్తోత్రంబుసేయ నుపక్రమించి కపిలున కిట్లనియె.
టీక:- అదిగావునన్ = అందుచేత; నీకున్ = నీకు; చతుః = నాలుగు (4) {చతుర్విధభక్తియోగములు - 1ఆర్తునకైనభక్తియోగము 2జిజ్ఞాసువుకైనభక్తియోగము 3అర్థార్థికైనభక్తియోగము 4జ్ఞానికైనభక్తియోగము}; విధ = విధములైన; భక్తియోగ = భక్తియోగముల; ప్రకారంబున్ = విధములను; తేటపడగన్ = తేటతెల్లమగునట్లు; ఎఱింగించితిన్ = తెలిపితిని; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; కామ = కోరికల; రూప = రూపమైనది; అగు = అయిన; మదీయ = నా యొక్క; గతి = వర్తనము; జంతువులన్ = జీవుల; అందున్ = లో; ఉత్పత్తి = జనన; వినాశ = మరణ; రూపంబులన్ = రూపములలో; ఉండున్ = ఉండును; అవిద్యా = అవిద్యతో కూడిన; కర్మ = కర్మములచే; నిర్మితంబులు = నిర్మిపబడినవి; ఐన = అయిన; జీవుని = జీవుని; గతులు = వర్తనలు; అనేక = అనేకమైన; ప్రకారంబులన్ = విధములు; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; అదియున్ = అదికూడ; జీవాత్మ = జీవాత్మ; వాని = వాని; అందున్ = లో; ప్రవర్తించి = ప్రవర్తించుటచే; ఆత్మగతి = ఆత్మగతి; ఇట్టిది = ఇటువంటిది; అని = అని; ఎఱుంగక = తెలియక; ఉండున్ = ఉండును; అని = అని; చెప్పి = చెప్పి; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; ఇట్టి = ఇటువంటి; అతి = పరమ; రహస్యంబున్ = రహస్యమైనది, దాచుకొనదగినది; అగు = అయిన; సాంఖ్యయోగ = సాంఖ్యయోగము; ప్రకారంబున్ = విధానమును; ఖలునకున్ = దుర్జనునికిని; అవినీతునకునున్ = అణకువలేనివానికిని; జడునకున్ = తెలివితక్కువవానికిని; దురాచారునకున్ = చెడువర్తనలుకలవానికిని; డాంబికునకున్ = గర్వము కలవానికిని; ఇంద్రియలోలునకున్ = ఇంద్రియములకు వశుడై చరించు వానికిని; పుత్ర = పుత్రుల; దార = భార్య; ఆగార = ఇల్లు; ఆది = మొదలైనవాని యందు; అత్యంత = మిక్కిలి; ఆసక్త = తగులము కల, ఆపేక్ష కల; చిత్తునన్ = మనస్సు కలవాని; కున్ = కిని; భగవత్ = భగవంతుని ఎడ; భక్తి = భక్తి; హీనున్ = లేనివాని; కున్ = కిని; విష్ణు = విష్ణుమూర్తి యొక్క; దాసుల = సేవాపరాయణుల; అందున్ = ఎడల; ద్వేష = ద్వేషము; పడు = చెందు; వానికిన్ = వానికిని; ఉపదేశింప = చెప్పుట; వలవదు = వద్దేవద్దు; శ్రద్ధా = శ్రద్ధ అనెడి; సంపన్నుండును = సంపద కలవాడును; భక్తుండును = భక్తి కలవాడును; వినీతుండను = వినయము కలవాడును; అసూయా = అసూయ; రహితుండును = లేనివాడును; సర్వ = సమస్తమైన; భూత = జీవులకును; మిత్రుండును = మిత్రుడును; శుశ్రూష = వినవలెనని; అభిరతుండును = మిక్కిలి సంకల్పము కలవాడును; బాహ్య = బయటి ప్రపంచపు; అర్థ = విషయములందు; జాత = కలిగిన; విరక్తుండును = విరక్తి కలవాడును; శాంత = ప్రశాంతమైన; చిత్తుండును = మనస్సు కలవాడును; నిర్మత్సరుండును = మత్సరము లేనివాడును; శుద్ధ = స్వచ్ఛమైన; ఆత్ముండును = ఆత్మకలవాడును; మత్ = నా యొక్క; భక్తుండును = భక్తుడును; అగు = అయిన; అధికారి = యోగ్యున; కిన్ = కు; ఉపదేశింపన్ = ఉపదేశించుటకు; అర్హంబున్ = తగినది; అగున్ = అయి ఉండును; ఈ = ఈ; ఉపాఖ్యానంబున్ = ఉపాఖ్యానమును; ఏ = ఏ; పురుషుండున్ = పురుషుడు; ఏని = కాని; పతివ్రత = పతివ్రత; అగున్ = అయిన; ఉత్తమ = శ్రేష్ఠమైన; అంగన = స్త్రీ {అంగన - మంచి అంగ సౌష్టవము కలామె, స్త్రీ}; ఏని = కాని; శ్రద్ధా = శ్రద్ధయును; భక్తులు = భక్తియును; కలిగి = కలిగి ఉండి; మత్ = నాకు; అర్పిత = అర్పింపబడిన; చిత్తంబునన్ = మనస్సుతో; వినున్ = వినినను; పఠియించున్ = చదువినను; అట్టి = అటువంటి; పుణ్యాత్ములు = పుణ్యాత్ములు; మదీయ = నా యొక్క; దివ్య = దివ్యమైన; స్వరూపంబున్ = స్వరూపమును; ప్రాపింతురు = పొందుదురు; అని = అని; చెప్పెను = చెప్పెను; అని = అని; మైత్రేయుండు = మైత్రేయుడు; విదురున్ = విదురుని; కున్ = కి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; ఈ = ఈ; ప్రకారంబునన్ = విధముగా; కర్దమ = కర్దముని; దయిత = భార్య; ఐన = అయిన; దేవహూతి = దేవహూతి; కపిలుని = కపిలుని; వచనంబులున్ = ఉపదేశములను; విని = విని; నిర్ముక్త = పూర్తిగా విడిచిన; మోహ = మోహముల; పటల = సమూహములుకలామె; అగుచున్ = అవుతూ; సాష్టాంగదండప్రణామంబులన్ = సాష్టాంగనమస్కారములను {సాష్టాంగదండప్రణామము - కూడగట్టుకొన్న అష్ట (ఎనిమిది 1నుదురు 2కళ్ళు 3ముక్కు 4చెవులు 5 గడ్డము 6రొమ్ము 7ఉదరము 8కాళ్ళు) అంగములతోను దండము (కఱ్ఱ) వలె నేలపై పండుకొని చేయు నమస్కారము}; ఆచరించి = చేసి; తత్త్వ = తత్త్వము యొక్క; విషయ = విషయములు; అంకిత = ఎంచబడినట్టి; సాంఖ్య = సాంఖ్యావేదము నందలి; జ్ఞాన = జ్ఞానము; ప్రవర్తకంబున్ = ప్రవర్తించునట్టి; స్తోత్రంబున్ = స్తోత్రమును; చేయన్ = చేయుటను; ఉపక్రమించి = ప్రారంభించి; కపిలున్ = కపిలుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను;
భావము:- అందువల్ల నీకు నాలుగు విధాలైన భక్తి మార్గాలను విశదంగా తెలియజెప్పాను. అంతేకాక స్వేచ్ఛారూపమైన నా సంకల్పం ప్రాణులందు జనన మరణ రూపాలతో ఉంటుంది. అజ్ఞానంతో ఆచరించే కర్మల మూలంగా కలిగే జీవుని ప్రవర్తనలు అనేక విధాలుగా ఉంటాయి. జీవాత్మ అటువంటి అకర్మలు ఆచరిస్తూ అత్మస్వరూపం ఇటువంటిది అని తెలియని స్థితిలో ఉంటాడు” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు. “ఇటువంటి అతిరహస్యమైన సాంఖ్యయోగ పద్ధతి దుష్టునకు, నీతి హీనునకు, మూర్ఖునకు, దురాచారునకు, డంబాలు కొట్టేవానికి, ఇంద్రియ సుఖాలకు లోబడిన వానికి, పిల్లలూ ఇల్లాలూ ఇల్లూ మొదలైన వానిపై ఆసక్తి కలవానికి, భగవంతునిపై భక్తి లేనివానికి, విష్ణు భక్తులను ద్వేషించే వానికి ఉపదేశింపకూడదు. శ్రద్ధాసక్తుడు, భక్తుడు, వినయసంపన్నుడు, ద్వేషరహితుడు, సర్వప్రాణులను మైత్రీభావంతో చూచేవాడు, విజ్ఞాన విషయాలను వినాలనే అసక్తి కలవాడు, ప్రాపంచిక విషయాలపై విరక్తుడు, శాంతచిత్తుడు, మాత్సర్యం లేనివాడు, స్వచ్ఛమైన మనస్సు కలవాడు, భక్తులందు ప్రేమ కలవాడు, పరస్త్రీలను మంచి భావంతో చూచేవాడు, చెడు కోరికలు లేనివాడు అయిన వానికి మాత్రమే ఈ సాంఖ్యయోగం ఉపదేశింప తగినది. అటువంటివాడే ఇందుకు అర్హుడైన అధికారి. ఈ ఉపాఖ్యానాన్ని ఏ పురుషుడైనా, పతివ్రత అయిన ఏ స్త్రీ అయినా శ్రద్ధాభక్తులతో నాపై మనస్సు నిలిపి వినినా, చదివినా అటువంటి పుణ్యాత్ములు నా దివ్య స్వరూపాన్ని పొందుతారు” అని కపిలుడు దేవహూతితో చెప్పాడని చెప్పి మైత్రేయుడు విదురుణ్ణి చూచి ఇంకా ఇలా అన్నాడు. “ఈ విధంగా కర్దమమహర్షి అర్ధాంగి అయిన దేవహూతి కపిలుని ఉపదేశం విని, మోహం తొలగిపోగా అతనికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి, పరబ్రహ్మకు సంబంధించిన తాత్త్వికమైన సాంఖ్య జ్ఞానంతో కపిలుణ్ణి స్తోత్రం చేయడం ప్రారంభించి ఇలా అన్నది.

తెభా-3-1028-సీ.
"నయంబు విను, మింద్రియార్థ మనోమయం-
బును భూతచయ మయంబును నశేష
భూరి జగద్బీజభూతంబును గుణప్ర-
వాహ కారణమును లనుమెఱయు
నారాయణాభిఖ్యనాఁ గల భవదీయ-
దివ్యమంగళమూర్తిఁ దేజరిల్లు
చారు భవద్గర్భసంజాతుఁ డగునట్టి-
మలగర్భుండు సాక్షాత్కరింప

తెభా-3-1028.1-తే.
లేక మనమునఁ గనియె ననేక శక్తి
ర్గములు గల్గి సుగుణప్రవాహరూప
మంది విశ్వంబు దాల్చి సస్రశక్తి
లితుఁడై సర్వకార్యముల్ లుగఁజేయు.

టీక:- అనయంబున్ = ఎల్లప్పుడును; వినుము = వినుము; ఇంద్రియ = ఇంద్రియములచే; అర్థ = గుర్తింపబడునవియును; మనస్ = మనస్సు; మయంబున్ = తో కూడినది; భూతచయ = పంచ భూతముల సమూహమును; మయంబునున్ = తో కూడినది; అశేష = సమస్తమైన; భూరి = లెక్కించరాని {భూరి - అతి పెద్దసంఖ్య 1 తరువాత 34 సున్నాలు ఉండు సంఖ్య}; జగత్ = లోకముల మహా సృష్టికి; బీజ = విత్తనము; భూతంబునున్ = వంటిదియును; గుణ = గుణముల; ప్రవాహ = వ్యాప్తికి; కారణమును = కారణమైనదియును; వలను = నేర్పుతో; మెఱయు = ప్రకాశించునదియును; నారాయణ = నారాయణుడు అని; అభిఖ్య = పేరు; నాఁ గల = (అనగల) కలిగిన; భవదీయ = నీ యొక్క; దివ్య = దివ్యమైన; మంగళ = శుభకరమైన; మూర్తిన్ = స్వరూపముతో; తేజరిల్లు = అతిశయించు; చారు = అందమైన; భవత్ = నీ యొక్క; గర్భ = గర్భమున; సంజాతుడు = పుట్టినవాడు; అగునట్టి = అయినట్టి; కమలగర్భుండున్ = బ్రహ్మదేవుడు; సాక్షాత్కరింపన్ = దర్శించను;
లేక = లేక; మనమునన్ = మనస్సులో; కనియెన్ = చూసెను; అనేక = అనేకమైన; శక్తి = శక్తి యొక్క; వర్గములు = విభాగములు; కల్గి = కలిగి; సుగుణ = సుగుణముల; ప్రవాహ = వ్యాప్తియైన; రూపమున్ = రూపమును; అంది = పొంది; విశ్వంబున్ = విశ్వమును; తాల్చి = ధరించి; సహస్ర = అత్యధికమైన; శక్తి = శక్తితో; కలితుడు = కూడినవాడు; ఐ = అయ్యి; సర్వ = సమస్తమైన; కార్యముల్ = కార్యములను {కార్యములు - కార్యకారణసంబంధముచే కారణముల వలన అగు కార్యములు}; కలుగజేయు = సృష్టించును.
భావము:- ఇంద్రియాలతో, ఇంద్రియార్థాలతో, మనస్సుతో, పంచభూతాలతో నిండి సమస్త జగత్తుకు బీజభూతమై సత్త్వరజస్తమోగుణ ప్రవాహానికి మూలకారణమై నారాయణుడనే నామంతో నీ దివ్యమంగళ విగ్రహం తేజరిల్లుతూ ఉంటుంది. అటువంటి నీ కళ్యాణమూర్తిని నీ నాభికమలం నుండి జన్మించిన చతుర్ముఖుడే సాక్షాత్తుగా దర్శించలేక ఎలాగో తన మనస్సులో కనుగొన గలిగాడు. అలా చూచి నీ అనుగ్రహంవల్ల అనేక శక్తులను తనలో వ్యక్తీకరించుకొని వేలకొలది శక్తులతో కూడినవాడై ప్రవాహరూపమైన ఈ విశ్వాన్ని సృజింప గల్గుతున్నాడు. సృష్టి సంబంధమైన సర్వకార్యాలను నిర్వహింప గలుగుతున్నాడు.

తెభా-3-1029-వ.
అంత.
టీక:- అంతన్ = అంతట.
భావము:- అప్పుడు...

తెభా-3-1030-తే.
తుల భూరి యుగాంతంబు నందుఁ గపట
శిశువవై యొంటి కుక్షినిక్షిప్త నిఖిల
భువననిలయుండవై మహాంభోధి నడుమ
జారు వటపత్రతల్పసంస్థాయి వగుచు.

టీక:- అతుల = సాటిలేని; భూరి = అత్యధికమైన; యుగాంతంబున్ = ప్రళయముల; అందున్ = సమయములలో; కపట = మాయా; శిశువవు = శిశువు; ఐ = అయ్యి; ఒంటిన్ = ఒంటరిగ; కుక్షి = కడుపున; నిక్షిప్త = దాచిన; నిఖిల = సమస్తమైన; భువన = విశ్వములకును; నిలయుండవు = నివాసమైనవాడవు; ఐ = అయ్యి; మహా = మహా; అంభోధి = సముద్రము; నడుమన్ = మధ్యలో; చారు = అందమైన; వట =మఱ్ఱి; పత్ర = ఆకు అనెడి; తల్ప = పాన్పుపై; సంస్థాయివి = చక్కగా ఉన్నవాడవు; అగుచున్ = అవుతూ.
భావము:- మహాప్రళయ సమయంలో సమస్త భువన సముదాయాన్ని నీ ఉదరంలో పదిలంగా దాచుకొని మహాసాగర మధ్యంలో మఱ్ఱి ఆకు పాన్పుమీద మాయాశిశువుగా ఒంటరిగా శయనించి ఉంటావు.

తెభా-3-1031-తే.
లీల నాత్మీయ పాదాంగుళీ వినిర్గ
తామృతము గ్రోలినట్టి మహాత్మ! నీవు
డఁగి నా పూర్వభాగ్యంబు తన నిపుడు
పూని నా గర్భమున నేడు పుట్టితయ్య!

టీక:- లీలన్ = లీలగా; ఆత్మీయ = తన యొక్క; పాద = పాదము యొక్క; అంగుళీ = బొటకనవేలు నుండి; వినిర్గత = వెడలుచున్న; అమృతమున్ = అమృతమును; క్రోలునట్టి = తాగుచున్నట్టి; మహాత్మా = మహాత్ముడా; నీవున్ = నీవు; కడగి = యత్నించి; నా = నా యొక్క; పూర్వ = పూర్వజన్మములందలి; భాగ్యంబు = భాగ్యము; కతన = వశమున; ఇపుడు = ఇప్పుడు; పూని = పూని; నా = నా యొక్క; గర్భమునన్ = గర్భములో; నేడు = ఇప్పుడు; పుట్టితి = పుట్టితివి; అయ్య = తండ్రి.
భావము:- మహానుభావా! ఆ విధంగా వటపత్రశాయివైన నీవు లీలగా నీ కాలి బొటనవ్రేలిని నోటిలో నుంచుకొని అందలి అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటావు. అటువంటి నీవు నా పూర్వపుణ్య విశేషంవల్ల ఇప్పుడు నా కడుపున పుట్టావు.

తెభా-3-1032-వ.
అట్టి పరమాత్ముండ వయిన నీవు.
టీక:- అట్టి = అటువంటి; పరమాత్ముడవు = భగవంతుడవు {పరమాత్మ - అన్నిటికిని అతీతమైన ఆత్మ కలవాడు, విష్ణువు}; అయిన = అయినట్టి; నీవున్ = నీవు.
భావము:- అటువంటి పరమాత్మ స్వరూపుడవైన నీవు...

తెభా-3-1033-సీ.
రుస విగ్రహపారశ్యంబునను జేసి-
ఘురామ కృష్ణ వరాహ నార
సింహాది మూర్తు లంచితలీల ధరియించి-
దుష్టనిగ్రహమును శిష్టపాల
మును గావించుచు యమున సద్ధర్మ-
నిరతచిత్తులకు వర్ణింపఁ దగిన
తురాత్మతత్త్వ విజ్ఞానప్రదుండవై-
ర్తింతు వనఘ! భన్మహత్త్వ

తెభా-3-1033.1-తే.
జున కయినను వాక్రువ్వ లవిగాదు
నిగమజాతంబు లయిన వర్ణింప లేవ
యెఱిఁగి సంస్తుతి చేయ నే నెంతదాన
వినుత గుణశీల! మాటలు వేయునేల?

టీక:- వరసన్ = వరుసగా; విగ్రహ = ఆకారముల యందలి; పారవశ్యంబునను = పరవశము చెందుట; చేసి = వలన; రఘురామ = శ్రీరామచంద్రుడు; కృష్ణ = శ్రీకృష్ణుడు; వరాహ = ఆదివరహావతారము; నరసింహ = నరసింహుడు; ఆది = మొదలగు; మూర్తులన్ = స్వరూపములలో; అంచిత = పూజనీయమైన; లీలన్ = లీలలతో; ధరియించి = అవతరించి; దుష్ట = దుష్టులను; నిగ్రహమును = శిక్షించుటయును; శిష్ట = శిష్టులను; పాలనమును = పాలించుటయును; కావించుచున్ = చేయుచు; నయమునన్ = చక్కగా; సత్ = మంచి; ధర్మ = ధర్మములందు; నిరత = నిరతమైన; చిత్తుల్ = మనస్సులు కలవారి; కున్ = కి; వర్ణింపన్ = వర్ణించుటకు; తగిన = తగిన; చతురాత్మతత్త్వ = చతురాత్మతత్త్వమున {చతురాత్మతత్త్వము - చతుర్వ్యూహముల (1వాసుదేవుడు 2సంకర్షణుడు 3అనిరుద్ధుడు 4ప్రద్యుమ్నుడు) సృష్టికి చతురహంకారములను (1మనస్సు 2బుద్ధి 3చిత్తము 4అహంకారము) ప్రసాదించిన తత్త్వము}; విజ్ఞాన = విజ్ఞానమును; ప్రదుండవున్ = ఇచ్చువాడవును; ఐ = అయ్యి; వర్తింతువు = ప్రవర్తింతువు; అనఘ = పుణ్యుడా; భవత్ = నీ యొక్క; మహత్వమున్ = మహిమము; అజున్ = బ్రహ్మదేవుని; కిన్ = కి; అయినను = అయినప్పటికిని;
వాక్రువ్వ = చెప్పుటకు; అలవి = వీలు; కాదు = కాదు; నిగమ = వేదముల; జాతంబులు = సమూహములు; అయినన్ = అయినప్పటికిని; వర్ణింపన్ = వర్ణించను; లేవ = లేవు; ఎఱిగి = తెలిసి; సంస్తుతి = చక్కగా స్తుతి; చేయన్ = చేయుటకు; నేను = నేను; ఎంత = ఎంత; దాన = దానిని; వినుత = కీర్తింపబడిన; శీల = వర్తన కలవాడ; మాటలు = మాటలు; వేయున్ = వేలకొలది; ఏలన్ = ఎందులకు.
భావము:- అవతారాలమీద ముచ్చటపడి వరుసగా రఘురాముడుగా, కృష్ణుడుగా, వరాహస్వామిగా, నరసింహమూర్తిగా ఆకారాలు ధరించి దుష్టశిక్షణం, శిష్టరక్షణం చేస్తావు. ఉత్తమ ధర్మంపట్ల ప్రవృత్తమైన చిత్తం కల భక్తులకు జ్ఞానదృష్టిని ప్రసాదించటం కోసం వాసుదేవ సంకర్షణ అనిరుద్ధ ప్రద్యుమ్న వ్యూహాలను అవలంబించి ప్రవర్తిస్తావు. అనఘుడవు, అనంత కళ్యాణగుణ సంపన్నుడవు అయిన నీ మహత్త్వాన్ని అభివర్ణించడం చతుర్ముఖునకు, చతుర్వేదాలకు కూడా సాధ్యం కాదంటే నేనెంతదాన్ని? వెయ్యి మాటలెందుకు? నిన్ను తెలుసుకొని సన్నుతించటం నాకు శక్యం కాని పని.

తెభా-3-1034-వ.
అదియునుం గాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:- అంతే కాకుండా...

తెభా-3-1035-క.
ధీహిత! భవన్మంగళ
నాస్మరణానుకీర్తము గల హీనుల్
శ్రీమంతు లగుదు రగ్ని
ష్టోమాదికృదాళికంటె శుద్ధులు దలఁపన్.

టీక:- ధీ = బుద్ధిబలమున; మహిత = మహనీయుడా; భవత్ = నీ యొక్క; మంగళ = శుభకరమైన; నామ = నామములను; స్మరణ = స్మరించుట; అనుకీర్తనమున్ = ఇతరులతో కలిసి పాడుట; కల = కలిగినట్టి; హీనుల్ = పేదవారు; శ్రీమంతులు = ధనవంతులు; అగుదురు = అగుదురు; అగ్నిష్ఠోమ = అగ్నిష్ఠోమము; ఆది = మొదలగు; కృత్ = యజ్ఞములుచేయువారి; ఆళి = సమూహములు; కంటెన్ = కంటెను; శుద్ధులు = స్వచ్ఛమైనవారు; తలపన్ = పరిశీలించిన.
భావము:- ఓ జ్ఞానస్వరూపా! మంగళకరమైన నీ నామాన్ని స్మరించినా, కీర్తించినా దరిద్రులు శ్రీమంతులౌతారు. అటువంటివారు అగ్నిష్ఠోమం మొదలైన యజ్ఞాలు చేసినవారికంటె పరిశుద్ధు లవుతారు.

తెభా-3-1036-వ.
అదియునుం గాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:- అంతే కాకుండా...

తెభా-3-1037-క.
నీ నామస్తుతి శ్వపచుం
డైను జిహ్వాగ్ర మందు నుసంధింపన్
వానికి సరి భూసురుఁడుం
గానేరఁడు చిత్రమిది జగంబుల నరయన్.

టీక:- నీ = నీ యొక్క; నామ = నామములను; స్తుతి = స్తుతించుట; శ్వపచుండు = నీచకులస్తుడు {శ్వపచుడు - కుక్కలను వండుకొని తినువాడు, నీచకులస్తుడు}; ఐనను = అయినను; జిహ్వ = నాలుక; అగ్రము = చివర; అందుననున్ = లోనైను; సంధింపన్ = తగిలించిన ఎడల; వానికిన్ = వానికి; సరి = సమానమైనవాడు; భూసురుడున్ = బ్రాహ్మణుడును {భూసురుఢు - భూమికి సురుడు (దేవత), బ్రాహ్మణుడు}; కానేరడు = కాలేడు; చిత్రము = విచిత్రమైనది; ఇది = ఇది; జగంబులన్ = లోకములో; అరయన్ = పరిశీలించినచో.
భావము:- లోకాలన్నిటిలో విచిత్రమైన విషయ మేమిటంటే భక్తిపూర్వకంగా నీ నామాన్ని జిహ్వాగ్రాన నిలుపుకొని జపించినట్లయితే వాడు కుక్కమాంసం తినేవాడైనా వానితో బ్రాహ్మణుడు కూడా సాటి కాలేడు.

తెభా-3-1038-ఉ.
విధ మాత్మలం దెలిసి యెప్పుడు సజ్జనసంఘముల్ జగ
త్పానమైన నీ గుణకథామృత మాత్మలఁ గ్రోలి సర్వ తీ
ర్థాళిఁ గ్రుంకినట్టి ఫలమందుదు రంచు సమస్త వేదముల్
వావిరిఁ బల్కుఁ గావునను వారలు ధన్యులు మాన్యు లుత్తముల్.

టీక:- ఈ = ఈ; విధమున్ = విధముగా; ఆత్మలన్ = మనస్సులలో; తెలిసి = తెలిసికొని; ఎప్పుడున్ = ఎల్లప్పుడును; సత్ = మంచి; జన = జనముల; సంఘముల్ = సమూహములు; జగత్ = లోకములకు; పావనము = పవిత్రము చేయునవి; ఐన = అయిన; నీ = నీ; గుణ = గుణములు; కథా = కథలు అనెడి; అమృతమున్ = అమృతమును; ఆత్మలన్ = మనస్ఫూర్తిగా; క్రోలి = ఆస్వాదించుట; సర్వ = సమస్తమైన; తీర్థ = తీర్థముల; ఆవళిన్ = సమూహమున; క్రుంకిన = స్నానమాచరించిన; అట్టి = అటువంటి; ఫలమున్ = ఫలితమును; అందుదురు = పొందుదురు; అంచున్ = అనుచూ; సమస్త = సమస్తమైన; వేదముల్ = వేదములు; వావిరిన్ = ఉత్కృష్టముగా; పల్కున్ = స్తుతించును; కావునన్ = అందుచేత; వారలు = వారు; ధన్యులు = ధన్యజీవులు; మాన్యులు = పూజనీయులు; ఉత్తముల్ = ఉత్తములు.
భావము:- ఈ పరమార్థాన్ని చక్కగా తెలిసికొన్న సజ్జనులు సర్వదా లోకపావనమైన నీ మధుర కథాసుధారసాన్ని తనివితీరా మనసారా త్రాగుతారు. అటువంటి వారికి సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలం ప్రాప్తిస్తుంది. ఈ విధంగా వేదాలన్నీ గొంతెత్తి చాటుతున్నాయి. అందువల్ల అటువంటి మహనీయులే మాననీయులు, ఉత్తములు, సాధుసత్తములు.

తెభా-3-1039-వ.
అదిగావునఁ; బరబ్రహ్మంబవును, బరమపురుషుండవును, బ్రత్యఙ్మనో విభావ్యుండవును, సమస్తజన పాపనివారక స్వయంప్రకాశుండవును, వేదగర్భుండవును, శ్రీమహావిష్ణుడవును నగు నీకు వందనంబు లాచరించెదను"అని స్తుతించినం బరమపురుషుండును, మాతృ వత్సలుండును నగు కపిలుండు గరుణారసార్ద్రహృదయకమలుం డై జనని కిట్లనియె.
టీక:- అదిగావునన్ = అందుచేత; పరబ్రహ్మంబవునున్ = పరబ్రహ్మము అయినవాడవును; పరమ = అత్యుత్తమ; పురుషుండవునున్ = పురుషుడవును; ప్రత్యక్ = ప్రత్యక్షముగను; మనస్ = మనస్సునందును; విభావ్యుండవునున్ = భావింప తగినన వాడవును; సమస్త = సమస్తమైన; జన = జనముల; పాప = పాపములను; నివారక = నివారించెడి; స్వయంప్రకాశుండవును = స్వయంప్రకాశము కలవాడవును; వేద = వేదములు; గర్భుండవును = గర్భమున కలవాడవును; శ్రీమహావిష్ణుడవును = శ్రీమహావిష్ణువు అయినవాడవును; అగు = అయిన; నీకున్ = నీకు; వందనంబులున్ = నమస్కారములు; ఆచరించెదను = చేసెదను; అని = అని; స్తుతించినన్ = స్తుతించగా; పరమ = అతీతమైన; పురుషుండును = పురుషుడును; మాతృ = తల్లి ఎడల; వత్సలుండును = వాత్సల్యము కలవాడును; అగు = అయిన; కపిలుండు = కపిలుడు; కరుణా = దయా; రస = రసముచే; ఆర్ద్ర = ద్రవించిన; హృదయ = హృదయము అనెడి; కమలుండు = కమలము కలవాడును; ఐ = అయ్యి; జనని = తల్లికి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- అందువల్ల పరబ్రహ్మవూ, పరమపురుషుడవూ, వెలుపలా లోపలా సంభావింప తగినవాడవూ, సకల జీవుల పాపాలను పటాపంచలు చేసేవాడవూ, స్వయంప్రకాశుడవూ, వేదమూర్తివీ, మహావిష్ణు స్వరూపుడవూ అయిన నీకు నమస్కరిస్తున్నాను.” అని దేవహూతి స్తుతించగా పురుషోత్తముడూ, మాతృప్రేమతో నిండినవాడూ అయిన కపిలుడు కరుణరసార్ద్రహృదయుడై తల్లితో ఇలా అన్నాడు.

తెభా-3-1040-తే.
"విలి సుఖరూపమును మోక్షదాయకంబు
నైన యీ యోగమార్గమే నంబ! నీకు
నెఱుఁగ వివరించి చెప్పితి నిది దృఢంబు
గాఁగ భక్తి ననుష్ఠింపు మలనయన!

టీక:- తవిలి = పూని; సుఖ = సుఖము యొక్క; రూపమును = స్వరూపమును; మోక్ష = మోక్షమును; దాయకంబున్ = ఇచ్చునదియును; ఐన = అయిన; ఈ = ఈ; యోగమార్గము = యోగమార్గమును; ఏన్ = నేను; అంబ = తల్లి; నీకున్ = నీకు; ఎఱుగన్ = తెలియునట్లు; వివరించి = వివరించి; చెప్పితిన్ = చెప్పితిని; ఇది = ఇది; దృఢంబున్ = గట్టిపడినది; కాగ = అగునట్లు; భక్తిన్ = భక్తిని; అనుష్ఠింపుము = శ్రద్ధగా చేయుము; కమలనయన = తల్లీ {కమల నయన - కమలముల వంటి నయనములు (కన్నులు) ఉన్నామె, స్త్రీ}.
భావము:- “కమలదళాల వంటి కన్నులు గల తల్లీ! సుఖస్వరూపమూ, మోక్షప్రదమూ అయిన ఈ యోగమార్గాన్ని నీకు తేటతెల్లంగా వెల్లడించాను. దీనిని నీవు దృఢమైన భక్తితో అనుష్ఠించు.

తెభా-3-1041-క.
జీన్ముక్తి లభించుం
గావున నేమఱక తలఁపు కైకొని దీనిన్
వావిరి నొల్లని వారికి
దాల మగు మృత్యుభయము వ్వగు సుఖమున్."

టీక:- జీవన్ముక్తి = జీవన్ముక్తి {జీవన్ముక్తి - దేహమున ఉండగనే లభించు ముక్తి}; లభించున్ = దొరకును; కావునన్ = కనక; ఏమఱక = ఏమరుపాటు లేకుండగ; తలంపు = జ్ఞప్తిన ఉంచుకొనుము; కైకొని = చేపట్టి; దీనిన్ = దీనిని; వావిరిన్ = ఎక్కువగా; ఒల్లని = ఒప్పని; వారికిన్ = వారికి; తావలము = దగ్గర; అగున్ = అగును; మృత్యు = మృత్యువు వలని; భయమున్ = భయము; దవ్వు = దూరము; అగు = అగును; సుఖమున్ = సుఖమును.
భావము:- దీనిని ఏకాగ్రచిత్తంతో ఏమరుపాటు లేకుండా ఆచరించేవారికి జీవన్ముక్తి లభిస్తుంది. ఈ మార్గాన్ని ఇష్టపడని వారికి మృత్యుభీతి కలుగుతుంది. సుఖం దూరమవుతుంది.”

తెభా-3-1042-క.
ని యిట్లు దేవహూతికి
మలరఁగ గపిలుఁ డాత్మమార్గం బెల్లన్
వినిపించి చనియె"నని విదు
రుకున్ మైత్రేయముని వరుం డెఱిఁగించెన్.

టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; దేవహూతి = దేవహూతి; కిన్ = కి; మనమున్ = మనస్సు; అలరగన్ = సంతోషపడునట్లు; కపిలుడు = కపిలుడు; ఆత్మమార్గమున్ = తన సాంఖ్య యోగమార్గమును; వినిపించి = చెప్పి; చనియెన్ = వెళ్ళెను; అని = అని; విదురునన్ = విదురుని; కున్ = కి; మైత్రేయ = మైత్రేయుడు అను; ముని = మునులలో; వరుండు = శ్రేష్ఠుడు; ఎఱిగించెన్ = తెలిపెను.
భావము:- అని ఈ విధంగా కపిలుడు దేవహూతికి మనస్సు సంతోషించేటట్లు ఆత్మతత్త్వాన్ని ఉపదేశించి వెళ్ళిపోయాడని మైత్రేయుడు విదురునికి తెలియజేశాడు.