Jump to content

పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/గర్భసంభవ ప్రకారంబు

వికీసోర్స్ నుండి


తెభా-3-991-సీ.
"కైకొని మఱి పూర్వర్మానుగుణమున-
శ్వత్ప్రకాశకుం డీశ్వరుండు
టకుండు గావునఁ గ్రమ్మఱ జీవుండు-
దేహసంబంధంబుఁ దివిరి తాల్ప
దొరఁకొని పురుషరేతోబిందుసంబంధి-
యై వధూగర్భంబు నందుఁ జొచ్చి
కైకొని యొకరాత్రి లిలంబు పంచరా-
త్రముల బుద్బుదమును శమ దివస

తెభా-3-991.1-తే.
మందు గర్కంధు వంత యౌ నంతమీఁదఁ
బేశి యగు నంతమీఁదటఁ బేర్చి యండ
ల్ప మగు నొక్క నెల మస్తమును మాస
మళమైనను గరచరములుఁ బొడము.

టీక:- కైకొని = చేపట్టి; మఱి = మరి; పూర్వ = పూర్వపు జన్మలందలి; కర్మ = కర్మములకి; అనుగుణంబునన్ = అనుగుణముగా; శశ్వత్ప్రకాశుండు = హరి {శశ్వత్ప్రకాశుడు - శశ్వత్ (శాశ్వతమైన) ప్రకాశకుండు (ప్రకాశము కలవాడు), విష్ణువు}; ఈశ్వరుండు = హరి {ఈశ్వరుండు - ప్రభువు, విష్ణువు}; ఘటకుండు = సంఘటనలను కూర్చువాడు; కావునన్ = కనుక; క్రమ్మఱన్ = మరల; జీవుండు = జీవుడు; దేహ = శరీరముతో; సంబంధంబునన్ = సంబంధమును; తివిరి = ప్రయత్నిచి; తాల్పన్ = ధరించుటకు; దొరకొని = పూనుకొని; పురుష = పురుషుని; రేతస్ = శుక్ర; బిందు = బిందువు తో; సంబంధి = సంబంధమును కలవాడు; ఐ = అయ్యి; వధూ = స్త్రీ యొక్క; గర్భంబున్ = కడుపు; అందున్ = లోకి; చొచ్చి = ప్రవేశించి; కైకొని = చేపట్టి; ఒక = ఒక; రాత్రి = రాత్రికి; కలిలంబున్ = బురదగను; పంచ = అయిదు; రాత్రములన్ = రాత్రులకు; బుద్బదమున్ = బుడగగను; దశమ = పదవ; దివసము = దినము; అందున్ = వరకు; కర్కంధువు = రేగుపండు; అంతన్ = అంతయును; అంతమీద = ఆపైన; పేశి = మాంసము కలదియును;
అగున్ = అగును; అంతమీదటన్ = ఆపైన; పేర్చి = పెరిగి; అండ = అండముగ; కల్పము = ఏర్పడుట; అగున్ = జరుగును; ఒక్క = ఒక; నెల = మాసమునకు; మస్తకమును = తలయును; మాస = నెలలు; యమళమున్ = రెండు; ఐనను = అయినచో; కర = చేతులు; చరణములు = కాళ్ళు; పొడము = పొడచూపును.
భావము:- “ఈశ్వరుడు శాశ్వతంగా ప్రకాశించేవాడు, అన్నిటినీ సంఘటిత పరిచేవాడు కాబట్టి జీవుడు తన పూర్వకర్మలను అనుసరించి మళ్ళీ దేహాన్ని పొందగోరుతాడు. జీవుడు పురుషుని వీర్యబిందు సంబంధంతో స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. ఒక్క రాత్రికి శుక్రశోణితాల ద్రవరూపమైన కలిలమై, తర్వాత ఐదురాత్రులకు బుద్బుదమై, ఆపైన పదవదినానికి రేగుపండత అయి, అనంతరం మాంసపిండమై గ్రుడ్డు ఆకారం పొందుతాడు. ఒక నెలకు శిరస్సు ఏర్పడుతుంది. రెండు నెలలకు కాళ్ళు చేతులు వస్తాయి.

తెభా-3-992-వ.
మఱియు; మాసత్రయంబున నఖ రోమాస్థి చర్మంబులు లింగచ్ఛిద్రంబులు గలిగి నాలవ మాసంబున సప్తధాతువులును బంచమ మాసంబున క్షుత్తృష్ణలును గలిగి షష్ట మాసంబున మావిచేతం బొదువం బడి తల్లి కుక్షిని దక్షిణభాగంబునం దిరుగుచు మాతృభుక్తాన్న పానంబులవలనఁ దృప్తి బొందుచు నేధమానధాతువులు గల్గి జంతు సంకీర్ణంబగు విణ్మూత్రగర్తం బందుఁ దిరుగుచుఁ క్రిమిభక్షిత శరీరుండై మూర్ఛలం బొందుచుఁ దల్లి భక్షించిన కటుతిక్తోష్ణ లవణ క్షారామ్లాద్యుల్బణంబు లైన రసంబులచేత బరితప్తాంగుం డగుచు జరాయువునఁ గప్పంబడి బహిప్రదేశంబు నందు నాత్రంబులచేత బద్ధుండై కుక్షి యందు శిరంబు మోపికొని భుగ్నం బైన పృష్టగ్రీవోదరుండై స్వాంగ చలనంబు నందు నసమర్దుం డగుచుఁ బంజరంబందుండు శకుంతంబు చందంబున నుండి దైవకృతంబైన జ్ఞానంబునం బూర్వజన్మ దుష్కృతంబుల దలంచుచు దీర్ఘోచ్ఛ్వాసంబు సేయుచు నే సుఖలేశంబునుం బొందక వర్తించు; అంత నేడవ నెల యందు లబ్ధజ్ఞానుండై చేష్టలు గలిగి విట్క్రిమి సోదరుండై యొక్క దిక్కున నుండక సంచరించుచుం బ్రసూతి మారుతంబులచేత నతి వేపితుం డగుచు యోచమానుండు దేహాత్మదర్శియుఁ బునర్గర్భ వాసంబునకు భీతుండు నగుచు బంధనభూతం బగు సప్తధాతువులచే బద్ధుం డై కృతాంజలి పుటుండు దీనవదనుండు నై జీవుండు దా నెవ్వనిచే నుదరంబున వసియింపఁబడె నట్టి సర్వేశ్వరుని నిట్లని స్తుతియించు.
టీక:- మఱియున్ = ఇంకనూ; మాస = నెలలు; త్రయంబునన్ = మూటికి; నఖ = గోర్లు; రోమ = వెంట్రుకలు; అస్థి = ఎముకలు; చర్మంబులున్ = చర్మములును; లింగ = కామావయవ; ఛిద్రంబులున్ = రంధ్రములును; కలిగి = కలిగి; నాలవ = నాల్గవ; మాసంబునన్ = నెలలో; సప్తధాతువులును = సప్తధాతువులును {సప్తధాతువులు - వసాదులు (వస, అసృక్కు, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్లములు) - రోమాది (రోమ, త్వక్, మాంస, అస్థి, స్నాయువు, మజ్జ, ప్రాణములు)}; పంచమ = అయిదవ (5); మాసంబునన్ = నెలలో; క్షుత్ = ఆకలి; తృష్ణలను = దప్పులను; కలిగి = కలిగి; షష్ట = ఆరవ; మాసంబునన్ = నెలలో; మావి = గర్భంలోని మావి; చేతన్ = చేత; పొదువంబడి = చుట్టబడి; తల్లి = తల్లి యొక్క; కుక్షిని = పొట్టలో; దక్షిణ = కుడి; భాగంబునన్ = పక్క; తిరుగుచున్ = తిరుగుతూ; మాతృ = తల్లి; భుక్త = తిన్నట్టి; అన్న = అన్నము, ఆహారము; పానంబుల్ = తాగినవాని; వలనన్ = వలన; తృప్తిన్ = తృప్తిని; పొందుచున్ = పొందుతూ; ఏధమాన = వృద్ధిచెందుతున్న; ధాతువులున్ = ధాతువులు; కల్గి = కలిగి; జంతు = జంతువులతో; సంకీర్ణంబు = కలిసిపోయినది; అగు = అయిన; విట్ = మలము; మూత్ర = మూత్రములు కల; గర్తంబున్ = గుంట; అందున్ = లో; తిరుగుచున్ = తిరుగుతూ; క్రిమి = క్రిములచే; భక్షిత = తినబడుతున్న; శరీరుండు = దేహము కలవాడు; ఐ = అయ్యి; మూర్ఛలన్ = మూర్ఛలను; పొందుతూ = చెందుతూ; తల్లి = తల్లి; భక్షించిన = తిన్నట్టి; కటు = కారపు; తిక్త = చేదు; ఉష్ణ = వేడి; లవణ = ఉప్పని; క్షార = ఘాటు; ఆమ్ల = పులుపు; ఆది = మొదలగు; ఉల్బణంబులు = తీక్షములు; ఐన = అయినట్టి; రసంబులున్ = రుచుల; చేతన్ = చేత; పరి = మిక్కిలి; తప్త = తాపము చెందిన; అంగుడు = దేహము కలవాడు; అగుచున్ = అవుతూ; జరాయువునన్ = మావిచే; కప్పంబడి = కప్పబడి; బహిః = బయటి; ప్రదేశంబున్ = ప్రదేశము; అందున్ = లో; ఆత్రంబులన్ = పేగుల; చేతన్ = చేత; బద్ధుండు = కట్టబడినవాడు; ఐ = అయ్యి; కుక్షి = కడుపు; అందున్ = మీద; శిరంబున్ = శిరస్సును; మోపికొని = ఆన్చుకొని; భుగ్నంబున్ = వంగినట్టిది; ఐన = అయిన; పృష్ట = వీపు; గ్రీవ = మెడ; ఉదరుండు = కడుపు కలవాడు; ఐ = అయ్యి; స్వా = తన యొక్క, స్వంత; అంగ = అవయవముల; చలనంబున్ = కదిలించుట; అందున్ = అందు; అసమర్థుడు = చేతకానివాడు; అగుచున్ = అవుతూ; పంజరంబున్ = పంజరములో; అందున్ = లోపల; ఉండు = ఉండెడి; శకుంతంబున్ = శకుంతపక్షి; చందంబునన్ = వలె; ఉండి = ఉండి; దైవ = దేవునిచే; కృతంబు = చేయబడినది; ఐన = అయినట్టి; జ్ఞానంబున్ = జ్ఞానముతో; పూర్వ = కిందటి; జన్మ = జన్మములందలి; దుష్కృతంబులున్ = చెడ్డపనులు; తలంచుచున్ = స్మరించుకొనుచు; దీర్ఘ = పెద్దగా; ఉచ్ఛ్వాసంబున్ = ఊపిర్లు; చేయుచున్ = తీస్తూ; సుఖ = సుఖము; లేశంబునున్ = కొంచము కూడ; పొందక = కలుగక; వర్తించున్ = తిరుగును; అంతన్ = అంతట; ఏడవ = ఏడవ (7); నెల = మాసము; అందున్ = లో; లబ్ధ = పొందిన; జ్ఞానుండు = జ్ఞానము కలవాడు; ఐ = అయ్యి; చేష్టలు = కదలికలు; కలిగి = పొంది; విట్ = మలము; క్రిమి = క్రిములతో; సోదరుండు = సహ గర్భవాసము కలవాడు; ఐ = అయ్యి; ఒక్క = ఒక; దిక్కున = పక్క; ఉండకన్ = ఉండకుండగ; సంచరించుచున్ = తిరుగుతూ; ప్రసూతి = పురిటి; మారుతంబులు = నెప్పులు; చేతన్ = చేత; అతి = అధికముగ; వేపితుండు = వేగుచున్నవాడు; అగుచున్ = అవతూ; యోచమానుండు = యోచించుచున్న వాడును; దేహ = దేహమును; ఆత్మ = ఆత్మలను; దర్శియున్ = వేరుగా చూడ కలవాడును; పునర్ = మరల; గర్భ = గర్భమున; వాసంబున్ = నివసించుట; కున్ = కు; భీతుండున్ = భయపడుతు ఉన్నవాడును; అగుచున్ = అవుతూ; బంధన = కట్లు; భూతంబులున్ = వంటివి; అగు = అయిన; సప్తధాతువులున్ = సప్తధాతువులును; చేన్ = చేత; బద్ధుండు = కట్టబడినవాడు; ఐ = అయ్యి; కృత = ఒగ్గిన; అంజలి = దోసిలి; పుటుండు = పట్టినవాడు; దీన = దీనమైన; వదనుండును = ముఖము కలవాడును; ఐ = అయ్యి; జీవుండు = జీవుడు; తాన్ = తను; ఎవ్వరి = ఎవరి; చేన్ = చేత; ఉదరంబునన్ = గర్భములో; వసియింపబడెన్ = నివసింపజేయబడెనో; అట్టి = అటువంటి; సర్వేశ్వరుని = భగవంతుని {సర్వేశ్వరుడు - సర్వులకును ఈశ్వరుడు (ప్రభువు), విష్ణువు}; ఇట్లు = ఈ విధముగ; అని = అని; స్తుతియించున్ = స్తోత్రము చేయును.
భావము:- మూడు నెలలకు గోళ్ళు, వెంట్రుకలు, ఎముకలు, చర్మం, నవరంధ్రాలు ఏర్పడుతాయి. నాలుగవ నెలకు సప్తధాతువులు కలుగుతాయి. ఐదవనెలకు ఆకలి దప్పులు సంభవిస్తాయి. ఆరవ నెలలో మావిచేత కప్పబడి, తల్లి కడుపులో కుడివైపున తిరుగుతూ ఉంటాడు. తల్లి తిన్న అన్నంతో త్రాగిన నీటితో తృప్తి పొందుతుంటాడు. వాత పిత్త శ్లేశ్మలానే ధాతువులు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. మల మూత్రాల గుంటలలో పొర్లుతూ, అందలి క్రిములు శరీరమంతా ప్రాకి బాధపెట్టగా మూర్ఛపోతూ ఉంటాడు. తల్లి తిన్న కారం, చేదు, ఉప్పు, పులుపు మొదలైన తీవ్రరసాలు అవయవాలను తపింపచేస్తాయి. మావిచే కప్పబడి, బయట ప్రేగులచే కట్టివేయబడి తల్లిపొట్టలో తలదూర్చి, వంగి, ముడుచుకొని, పండుకొని ఉంటాడు. తన అవయవాలు కదలించటానికి శక్తిలేక పంజరంలో చిక్కిన పక్షివలె బంధితుడై ఉంటాడు. దైవదత్తమైన తెలివితో వెనుకటి జన్మలలోని పాపాలను తలచుకొని నిట్టూర్పులు విడుస్తాడు. కించిత్తుకూడా సుఖాన్ని పొందలేకుండా ఉంటాడు. ఏడవనెలలో జ్ఞానం కలుగుతుంది. కదలికలు కలుగుతాయి. మలంలోని క్రిములతో కలసి మెలసి ఒకచోట ఉండలేక కడుపులో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. గర్భవాయువులకు కంపించిపోతూ దేహాత్మ దర్శనం కలిగి, విమోచనాన్ని యాచిస్తూ, మళ్ళీ గర్భవాసం కలిగినందుకు భయపడుతూ బంధనరూపాలైన సప్తధాతువులతో బంధితుడై, చేతులు జోడించి దీనముఖుడైన జీవుడు ఏ దేవుడు తనకు ఈ గర్భవాసం కలిగించాడో ఆ సర్వేశ్వరుని ఈ విధంగా స్తుతిస్తాడు.

తెభా-3-993-క.
యమును భువనరక్షణ
ముకై స్వేచ్ఛానురూపమునఁ బుట్టెడి వి
ష్ణుని భయవిరహిత మగు పద
జయుగం బర్థిఁ గొల్తు వారని భక్తిన్.

టీక:- అనయమును = అవశ్యమును; భువన = విశ్వములను; రక్షణమున్ = రక్షించుట; కై = కోసమై; స్వేచ్ఛా = స్వతంత్రమైన; అనురూపమునన్ = అవతారములలో; పుట్టెడి = అవతరించెడి; విష్ణుని = విష్ణుమూర్తి యొక్క; భయ = భయము; విరహితము = లేనిది; అగు = అయిన; పద = పాదములు అనెడి; వనజ = పద్మముల {వనజము - వనము (నీటి)లో పుట్టునది, పద్మము}; యుగంబున్ = జంటను; అర్థిన్ = కోరి; కొల్తున్ = సేవించెదను; వారని = ఎడతెగని; భక్తిన్ = భక్తితో.
భావము:- ఎల్లప్పుడు లోకాలను రక్షించడానికి ఇచ్ఛానుసారం జన్మమెత్తుతూ ఉండే భగవంతుని పాదపద్మాలను అనురక్తితో, భక్తితో ఆరాధిస్తాను. ఆ పాదాలు నా భయాన్ని పటాపంచలు చేస్తాయి.

తెభా-3-994-వ.
అదియునుం గాక; పంచభూత విరహితుఁ డయ్యుం బంచభూత విరచితం బైన శరీరంబు నందుఁ గప్పంబడి యింద్రియ గుణార్థ చిదాభాస జ్ఞానుం డైన నేను.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ; పంచభూత = పంచబూతములును; విరహితుండ = లేనివాడను; అయ్యున్ = అయినప్పటికిని; పంచభూత = పంచభూతములచే; విరచితంబున్ = చేయబడినది; ఐన = అయిన; శరీరంబున్ = దేహము; అందున్ = లో; కప్పంబడి = కప్పబడి; ఇంద్రియ = ఇంద్రియముల; గుణ = ఇంద్రియ గుణములు; అర్థ = ఇంద్రియార్థములు యొక్క; చిత్ = విషయ జ్ఞానమున; అభాస = సందిగ్ద; జ్ఞానుండను = జ్ఞానము కలవాడను; ఐన = అయినట్టి; నేను = నేను.
భావము:- అంతేకాక పంచభూతాలు లేకున్నా పంచభూతాలతో ఏర్పడిన శరీరంతో కప్పబడి ఇంద్రియగుణాలు, ఇంద్రియార్థాల అస్తిత్వం తెలిసీ తెలియని అభాసజ్ఞానం కలిగిన నేను....

తెభా-3-995-సీ.
వ్వఁడు నిఖిల భూతేంద్రియమయ మగు-
మాయావలంబున హితకర్మ
ద్ధుఁడై వర్తించు గిది దందహ్యమా-
నంబగు జీవ చిత్తంబు నందు
వికారమై శుద్ధమై యఖండజ్ఞాన-
మున నుండు వానికి ముఖ్యచరితు
కు నకుంఠితశౌర్యుకుఁ పరంజ్యోతికి-
ర్వజ్ఞునకుఁ గృపాశాంతమతికిఁ

తెభా-3-995.1-తే.
డఁగియుఁ బ్రకృతిపురుషుల కంటెఁ బరముఁ
యిన వానికి మ్రొక్కెద స్మదీయ
దుర్భరోదగ్ర భీకర ర్భనరక
వేదనలఁ జూచి శాంతిఁ గావించు కొఱకు."

టీక:- ఎవ్వడున్ = ఎవరైతే; నిఖిల = సమస్తమైన; భూత = భూతములచేతను; ఇంద్రియ = ఇంద్రియములచేతను; మయము = నిండినది; అగు = అయిన; మాయా = మాయను; అవలంబమున్ = అవలంభించుటయందు; మహిత = అధికముగ; కర్మ = కర్మములచే; బద్దుడు = బంధిపబడినవాడు; ఐ = అయ్యి; వర్తించున్ = ప్రవర్తించెడి; పగిదిన్ = విధమున; దందహ్యమానంబున్ = దహించుచున్నది; అగు = అయిన; జీవ = జీవుని; చిత్తంబున్ = చిత్తము; అందున్ = లో; అవికారము = మార్పులుచెందనిది; ఐ = అయ్యి; శుద్ధము = స్వచ్ఛము; ఐ = అయ్యి; అఖండ = అఖండమైన; జ్ఞానమునన్ = జ్ఞానములో; ఉండు = ఉండెడి; వాని = వాని; కిన్ = కి; ముఖ్య = మఖ్యమైన; చరితున్ = వర్తన కలవాని; కున్ = కి; అకుంఠిత = కుంటుపడని; శౌర్యమున్ = శౌర్యము కలవాని; కున్ = కి; పరంజ్యోతి = అన్నిటికిని అతీతమైన ప్రకాశమున; కిన్ = కి; సర్వజ్ఞున్ = సర్వమును తెలియువాని; కున్ = కిని; కృపాశాంతమతి = దయాశాంతములు కలవావి; కిన్ = కిని; కడగి = పూని; ప్రకృతి = ప్రకృతి; పురుషుల్ = పురుషులు; కంటెన్ = కంటెను; పరముండు = అతీతడు; అయిన = అయినట్టి; వాని = వాని; కిన్ = కిని;
మ్రొక్కెదన్ = కొలిచెదను; అస్మదీయ = నా యొక్క; దుర్భర = భరింపరాని; ఉదగ్ర = చెలరేగుతున్న; భీకర = భయంకరమైన; గర్భ = గర్భస్థితి అనెడి; నరక = నరకము యొక్క; వేదనలన్ = బాధలను; చూచి = చూసి; శాంతి = శాంతిని; కావింతు = కలిగించు; కొఱకున్ = కోసమై.
భావము:- ఏ దేవుడు సమస్త జీవరాసులలో పంచేంద్రియాలతో పంచభూతాలతో నిండిన మాయను అంగీకరించి కర్మబంధాలకు లోబడి ఉన్నట్లు కన్పిస్తాడో, దహించుకొని పోతున్న జీవుని చిత్తంలో అవికారుడై, పరిశుద్ధుడై, అఖండజ్ఞాన స్వరూపుడై భాసిస్తుంటాడో ఆ ఉదాత్త చరితునికి, ఆ మొక్కవోని శౌర్యం కలవానికి, ఆ పరంజ్యోతికి, ఆ దయామయునికి, ఆ శాంతమూర్తికి, ప్రకృతి పురుషులకంటె అతీతుడైన ఆ భగవంతునికి ఈ భరింపరాని భయంకరమైన గర్భనరకంలో ఉన్న నన్ను రక్షించి శాంతి కలిగించమని నమస్కరిస్తున్నాను.”

తెభా-3-996-సీ.
నవుడు సుతునకు నని యిట్లనుఁ "దగ-
హితాత్మ! యెవ్వని హిమచేత
నమోహులై గుణర్మనిమిత్త సాం-
సారికమార్గ సంచారములను
ధృతిసెడి యలసి యేదిక్కు నెఱుంగక-
రిపాద ధ్యానంబు నాత్మ మఱచి
యుండు వారలకు నే యుక్తియు నమ్మహా-
పురుషు ననుగ్రహబుద్ధి లేక

తెభా-3-996.1-తే.
ద్గుణధ్యాన తన్మూర్తి ర్శనములు
గోచరించుట యెట్లు నాకునుఁ బ్రబోధ
లితముగఁ బల్కు"మనవుడుఁ పిలుఁ డనియె
నంబతోడను సుగుణకదంబతోడ.

టీక:- అనవుడు = అనగా; సుతున్ = పుత్రుని; కున్ = కి; జనని = తల్లి; ఇట్లు = ఈ విధముగ; అనున్ = అనెను; తగ = అవశ్యము; మహితాత్మ = గొప్పవాడ; ఎవ్వని = ఎవని; మహిమ = మహిమ; చేత = వలన; ఘన = మిక్కిలి; మోహులు = మోహము చెందినవారు; ఐ = అయ్యి; గుణ = గుణములు; కర్మ = కర్మముల; నిమిత్తంబున్ = నిమిత్తకారణములును కల; సాంసారిక = సంసారమందు బద్ధమైన; మార్గ = దారిలో; సంచారములన్ = సంచరించుటలుచే; ధృతిన్ = ధైర్యము; చెడి = తప్పి; అలసి = అలసిపోయి; ఏ = ఏ విధమైన; దిక్కున్ = దిక్కును; ఎఱుంగక = తెలియక; హరి = విష్ణుమూర్తి యొక్క; పాద = పాదములను; ధ్యానంబునన్ = ధ్యానించుటలో; ఆత్మన్ = మనసున; మఱచి = మఱచిపోయి; ఉండు = ఉండెడి; వారల = వారి; కున్ = కి; ఏ = ఏ విధమైన; యుక్తియున్ = ఉపాయమునను; ఆ = ఆ; మహా = గొప్ప; పురుషుని = పురుషుని; అనుగ్రహ = అనుగ్రహించు; బుద్ధి = బుద్ధి; లేక = లేకుండగ;
తత్ = అతని; గుణ = గుణములను; ధ్యాన = ధ్యానము; తత్ = అతని; మూర్తిన్ = స్వరూపము; దర్శనములున్ = దర్శించుటలు; గోచరించుట = తెలియుట; ఎట్లు = ఏ విధముగానగును; నాకునున్ = నాకును; ప్రబోధ = తెలివితో; కలితముగన్ = కూడినది అగునట్లు; పల్కుము = చెప్పుము; అనవుడు = అనగా; కపిలుడున్ = కపిలుడు; అనియెన్ = పలికెను; అంబ = తల్లి; తోడన్ = తోటి; సుగుణ = సుగుణముల; కదంబ = వల్లి, కలగలపు మాల; తోడన్ = తోటి.
భావము:- అని చెప్పిన కొడుకుతో తల్లి ఇలా అన్నది “ఓ మహానుభావా! ఎవని మాయవల్ల మానవులు వ్యామోహంలో పడి గుణకర్మ నిమిత్తంగా ఏర్పడ్డ ఈ సంసార మార్గంలో ప్రయాణిస్తూ ధైర్యం చాలక, అలసిపోయి దిక్కు తెలియక చీకాకు పడుతూ చివరకు ఆ దేవుని పాదాలను ధ్యానించాలనే విషయాన్ని కూడా మనస్సులో మరచిపోతారో, ఆ పురుషోత్తముని అనుగ్రహం లేనిదే ఆ మానవులకు ఆయన గుణగణాలను ధ్యానించాలనీ, ఆయన రూపాన్ని దర్శించాలనీ బుద్ధి పుడుతుందా? ఈ సంగతి నాకు కనువిప్పు కలిగేలా విప్పి చెప్పు” అని అడిగిన సద్గుణవల్లియైన తల్లితో కపిలుడు ఇలా అన్నాడు.

తెభా-3-997-వ.
"అట్టి యీశ్వరుండు గాలత్రయంబు నందును జంగమ స్థావరాంత ర్యామి యగుటంజేసి జీవకర్మ మార్గంబులం బ్రవర్తించు వారు తాపత్రయ నివారణంబు కొఱకు భజియింతురు"అని చెప్పి మఱియు నిట్లనియె.
టీక:- అట్టి = అటువంటి; ఈశ్వరుండు = భగవంతుడు; కాలత్రయంబున్ = ముక్కాలముల {కాలత్రయము - 1 భూత 2భవిష్య 3వర్తమాన కాలములు మూడును}; అందునున్ = అందును; జంగమ = జంతువులు మొదలైనవి {తిర్యక్కులు - తమంతతాము తిరుగు సామర్థ్యము కలవి, జంతువులు}; స్థావర = వృక్షాదులు {స్థావరములు - స్థిరముగ ఒకే స్థలమున ఉండునవి, వృక్షములు మొదలైనవి}; అంతర్యామి = లోపలను వ్యాపించి ఉండువాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; జీవ = జీవుల యొక్క; కర్మమార్గంబులన్ = కర్మమార్గములలో; ప్రవర్తించు = తిరిగెడి; వారు = వారు; తాపత్రయ = తాపత్రయముల {తాపత్రయములు - 1ఆధిభౌతికము 2ఆధ్యాత్మికము 3ఆధిదైవికము అనెడి బాధాకారణముల మూడు}; నివారణంబు = పోగొట్టుకొనుట; కొఱకున్ = కోసము; భజియింతురు = కొలుతురు; అని = అని; చెప్పి = చెప్పి; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను;
భావము:- “ఆ భగవంతుడు మూడు కాలాల్లోనూ చరాచర ప్రపంచంలోని సమస్త జీవరాసులలో అంతర్యామిగా ఉండడం వలన బ్రతుకు తెరువున పయనించేవారు తాపత్రయాలు తప్పించుకోవడానికై అతన్ని ఆరాధిస్తారు” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు.

తెభా-3-998-క.
"జయిత్రి! గర్భ మందును
క్రిమి విణ్మూత్ర రక్త ర్తము లోనన్
మునుఁగుచు జఠరాగ్నిని దిన
దిమును సంతప్యమానదేహుం డగుచున్.

టీక:- జనయిత్రి = తల్లి {జనయిత్రి - జననమును ఇచ్చినామె, తల్లి}; గర్భము = కడుపు; అందునున్ = లోపల; ఘన = అనేకమైన; క్రిమి = క్రిములు; విట్ = మలము; మూత్ర = మూత్రము; రక్త = రక్తములు కల; గర్తము = మురుకి గుంట; లోనన్ = లోపల; మునుగుచున్ = ములుగుతూ; జఠరాగ్నినిన్ = ఆకలితో; దినదినమును = రోజురోజుకి; సంతప్యమాన = మిక్కిలి తపించిపోతున్న; దేహుండు = శరీరము కలవాడు; అగుచున్ = అవుతూ.
భావము:- “అమ్మా! జీవుడు తల్లి గర్భంలో క్రిములతో నిండిన మలమూత్రాల నెత్తురు గుంటలో మునుగుతూ, ఆకలి మంటలతో దినదినం తపించే దేహం కలవాడై...

తెభా-3-999-ఆ.
దీనవదనుఁ డగుచు దేహి యీ దేహంబు
లన నిర్గమింపఁ లఁచి చనిన
నెలల నెన్నికొనుచు నెలకొని గర్భంబు
లన వెడలఁ ద్రోయువారు గలరె?'

టీక:- దీన = దీనమైన; వదనుండున్ = ముఖము కలవాడు; అగుచున్ = అవుతూ; దేహి = దేహమును ధరించువాడు, జీవుడు; ఈ = ఈ; దేహంబున్ = శరీరమును; వలనన్ = నుండి; నిర్గమింపన్ = వెడలవలెనని; తలంచి = అనుకొని; చనిన = గడచిన; నెలలన్ = నెలలను; ఎన్నికొనుచున్ = లెక్కించుకొనుచును; నెలకొని = పూనుకొని; గర్భంబున్ = గర్భము; వలనన్ = వలన; వెడలన్ = వెలువడునట్లు; త్రోయు = తోసెడి; వారున్ = వారు; కలరే = ఉన్నారా.
భావము:- దైన్యంతో నిండిన ముఖం కలవాడై, ఆ గర్భనరకంనుండి బయటపడాలని భావిస్తూ, గడచిన నెలలు లెక్కించుకుంటూ ‘నన్ను ఈ గర్భంనుండి వెలువరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ’

తెభా-3-1000-వ.
అని తలంచుచు "దీనరక్షకుం డయిన పుండరీకాక్షుండు దన్ను గర్భనరకంబువలన విముక్తునిం జేయ నమ్మహాత్మునికిఁ బ్రత్యుపకారంబు సేయలేమికి నంజలి మాత్రంబు సేయందగునట్టి జీవుండ నైన నేను శమదమాది యుక్తం బైన శరీరంబు నందు విజ్ఞానదీపాంకురంబునం బురాణపురుషు నిరీక్షింతును"అని మఱియు
టీక:- అని = అని; తలంచుచున్ = అనుకొనుచు; దీన = దీనులను; రక్షకుండు = రక్షించువాడు; అయిన = అయినట్టి; పుండరీకాక్షుండు = నారాయణుడు {పుండరీకాక్షుడు - పుండరీకము (పద్మము)ల వంటి కన్నులు కలవాడు, విష్ణువు}; తన్ను = తనను; గర్భ = గర్భము అనెడి; నరకంబున్ = నరకము; వలనన్ = నుండి; విముక్తునిన్ = విడుదల; చేయన్ = చేసినందుకు; ఆ = ఆ; మహాత్మున్ = మహాత్ముని; కిన్ = కి; ప్రత్యుపకారంబున్ = ప్రత్యుపకారము; చేయన్ = చేయ; లేమి = లేకపోవుట; కిన్ = కు; అంజలి = నమస్కారము; మాత్రము = మత్రమే; చేయన్ = చేయ; తగు = కలిగిన; అట్టి = అటువంటి; జీవుండన్ = జీవుడను; ఐన = అయినట్టి; నేనున్ = నేను; శమ = శమము; దమ = దమము; ఆది = మొదలైనవానిని; యుక్తంబున్ = కూడినది; ఐన = అయినట్టి; శరీరంబున్ = దేహము; అందున్ = లోపల; విజ్ఞాన = విజ్ఞానము అనెడి; దీప = దీపపు; అంకురంబునన్ = అంకురమునందు; పురాణపురుషున్ = నారాయణునికై {పురాణపురుషుడు - పురాతన కాలము నుండియు ఉన్నవాడు, విష్ణువు}; నిరీక్షింతున్ = ఎదురుచూచెదను; అని = అని; మఱియున్ = ఇంకనూ.
భావము:- అని తలపోస్తూ ‘దీనులను రక్షించే పుండరీకాక్షుడు ఒక్కడే నన్ను ఈ గర్భనరకం నుండి విముక్తుణ్ణి చేయగలడు. అయితే ఆ మహాత్మునకు నేను ప్రత్యుపకారం ఏమీ చేయలేను. చేతులు జోడించి నమస్కారం మాత్రమే చేయగలుగుతాను. నేను కేవలం జీవుడను. శమ దమాది గుణాలతో కూడిన రాబోయే జన్మలో విజ్ఞాన దీపాంకురాన్ని వెలిగించుకొని ఆ వెలుగులో పురాణపురుషుణ్ణి చూస్తాను’ అనుకొని, మళ్ళీ ఇలా అనుకుంటాడు.

తెభా-3-1001-సీ.
"నెకొని బహు దుఃఖముకు నాలయ మైన-
యీ గర్భనరకము నేను వెడలఁ
జాల బహిఃప్రదేమునకు వచ్చిన-
నుపమ దేవమాయా విమోహి
తాత్ముండనై ఘోరమైనట్టి సంసార-
క్ర మందును బరిశ్రమణశీలి
నై యుండవలయుఁ దా దిగాక గర్భంబు-
నందుండు శోకంబు పనయించి

తెభా-3-1001.1-తే.
యాత్మ కనయంబు సారథి యైన యట్టి
రుచిర విజ్ఞానమునఁ దమోరూపమైన
భూరి సంసారసాగరోత్తాణంబు
సేసి యీ యాత్మ నరసి రక్షించుకొందు.

టీక:- నెలకొని = పూనుకొని; బహు = అనేకమైన; దుఃఖముల్ = దుఃఖముల; కున్ = కు; ఆలయమున్ = స్థానము; ఐన = అయినట్టి; ఈ = ఈ; గర్భ = గర్భము అనెడి; నరకమున్ = నరకమును; నేనున్ = నేను; వెడలన్ = బయటపడ; చాలన్ = లేను; బహిర్ = వెలుపలి; ప్రదేశము = చోటున; కున్ = కు; వచ్చినన్ = వచ్చినను; అనుపమ = సాటిలేని; దేవ = దేవుని యొక్క; మాయా = మాయచే; విమోహిత = మిక్కిలి మోహమున పడిన; ఆత్ముడను = ఆత్మకలవాడను; ఐ = అయ్యి; ఘోరము = ఘోరము; ఐనట్టి = అయినట్టి; సంసార = సంసారము అనెడి; చక్రమున్ = చక్రము; అందున్ = లోపల; పరిశ్రమ = మిక్కిల కష్టపడు; శీలిన్ = స్వభావము కలవాడను; ఐ = అయ్యి; ఉండన్ = ఉండ; వలయున్ = వలసినదే; అది = అంతే; కాక = కాకుండగా; గర్భంబున్ = గర్భము; అందు = లోపల; ఉండు = ఉండెడి; శోకంబున్ = దుఃఖమును; అపనయించి = తొలగించి;
ఆత్మ = ఆత్మ; కున్ = కు; అనయంబున్ = నిత్యము; సారథి = మార్గదర్శి; ఐన = అయిన; అట్టి = అటువంటి; రుచిర = చక్కటి; విజ్ఞానమునన్ = విఙ్ఢానముతో; తమస్ = చీకటి; రూపము = స్వరూపము; ఐన = అయిన; భూరి = అతిమిక్కిలిపెద్దదైన {భూరి - అతి పెద్ధసంఖ్య 1 తరవాత 34 సున్నాలు కలది అదే లక్ష అయితే 5 సున్నాలు మాత్రమే}; సంసార = సంసారము అనెడి; సాగర = సముద్రమును; ఉత్తరణంబున్ = దాటుటను; చేసి = చేసి; ఈ = ఈ; ఆత్మనున్ = ఆత్మను; అరసి = తెలుసుకొని; రక్షించుకొందు = రక్షించుకొనెదను.
భావము:- ‘ఎన్నెన్నో దుఃఖాలకు నిలయమైన ఈ గర్భనరకం నుండి నేను బయట పడలేను. ఒకవేళ బయటకు వచ్చినా దేవమాయలకు లోనై వ్యామోహంతో భయంకరమైన సంసార వలయంలో చిక్కుకొని పరిభ్రమిస్తూ ఉండవలసిందే. అందుకని ఈ గర్భశోకాన్ని పోగొట్టేదీ, ఆత్మను సారథియై నడిపించేదీ అయిన విజ్ఞానాన్ని ఆశ్రయించి అంధకార బంధురమైన సంసార సాగరాన్ని దాటి ఆత్మను రక్షించుకుంటాను.

తెభా-3-1002-వ.
మఱియును.
టీక:- మఱియును = ఇంకను.
భావము:- ఇంకా...

తెభా-3-1003-చ.
రఁగుచు నున్న దుర్వ్యసనభాజనమై ఘన దుఃఖమూలమై
యఁగ బెక్కుతూంట్లు గలదై క్రిమిసంభవ మైనయట్టి దు
స్త బహు గర్భవాసముల సంగతి మాన్పుటకై భజించెదన్
సిజనాభ భూరి భవసాగరతారక పాదపద్మముల్."

టీక:- పరగుచున్ = ప్రసిద్ధమగుచు; ఉన్న = ఉన్నదియు; దుర్వ్యసన = చెడ్డబాధలకు; భాజనము = నెలవు; ఐ = అయ్యి; ఘన = అత్యధికమైన; దుఃఖ = దుఃఖమునకు; మూలమున్ = కారణము; ఐ = అయ్యి; అరయగన్ = తెలిసికొనిన; పెక్కు = అనేకమైన; తూంట్లు = కన్నములు; కలది = ఉన్నది; ఐ = అయ్యి; క్రిమి = క్రిములు; సంభవము = కలది; ఐన = అయిన; అట్టి = అటువంటి; దుస్తర = దాటరాని; గర్భ = గర్భమునందు; వాసముల్ = వసించుటలుతో; సంగతిన్ = కూడుటలను; మాన్పుట = మానునట్లు చేయుట; కై = కోసము; భజించెదన్ = కొలచెదను; సరసిజనాభ = నారాయణుని {సరసిజనాభుడు - సరసిజము (పద్మము) నాభి (బొడ్డు)న కలవాడు, విష్ణువు}; భూరి = మిక్కిలి పెద్దదైన; భవ = సంసారము అనెడి; సాగర = సముద్రమును; తారక = తరింపజాలిన; పాద = పాదములు అనెడి; పద్మముల్ = పద్మములు.
భావము:- ఈ గర్భనరకం అనేక వ్యసనాలకు నిలయమైనది. అంతులేని దుఃఖాలకు మూలమైనది. ఎన్నో రంధ్రాలు గలది. క్రిములకు జన్మస్థానమైనది. ఇటువంటి ఎన్నో గర్భవాసాల ఆపదను పోగొట్టడానికై సంసార సాగరాన్ని తరింపజేసే కమలనాభుని పాదపద్మాలను ఆశ్రయిస్తాను.’

తెభా-3-1004-క.
ని కృతనిశ్చయుఁ డయి యే
చి విమలజ్ఞాని యగుచు జీవుఁడు గర్భం
బు వెడల నొల్లకుండం
నియెడు నవమాసములును ననీ! యంతన్.

టీక:- అని = అని; కృతనిశ్చయుడు = నిశ్చయించుకొన్నవాడు; అయి = అయ్యి; ఏచిన = అతిశయించిన; విమల = స్వచ్ఛమైన; విజ్ఞాని = మంచి జ్ఞానము కలవాడు; అగుచున్ = అవుతూ; జీవుడు = జీవుడు; గర్భంబునన్ = గర్భము నుండి; వెడలన్ = బయటపడుటకు; ఒల్లకుండన్ = అంగీకరింపకుండగా; చనియెడున్ = గడచును; నవ = తొమ్మిది (9); మాసములున్ = నెలలును; జననీ = తల్లీ {జనని - జన్మను ఇచ్చిన ఆమె, అమ్మ}; అంతన్ = అంతట.
భావము:- తల్లీ! ఈ విధంగా నిశ్చయించుకొని అతిశయించిన నిర్మలజ్ఞానం కలవాడై, జీవుడు గర్భం నుండి వెడలిరాకుండా తొమ్మిది నెలలు అలాగే గడుపుతాడు.

తెభా-3-1005-వ.
దశమమాసంబున వాని నధోముఖుం గావించిన నుచ్ఛ్వాస నిశ్శ్వాసంబులు లేక ఘన దుఃఖభాజనుండు విగత జ్ఞానుండు రక్తదిగ్భాగుండు నై విష్టాస్థక్రిమియుం బోలె నేలంబడి యేడ్చుచు జ్ఞానహీనుం డై జడుడునుం బోలె నుండి; యంత నిజ భావానభిజ్ఞు లగు నితరుల వలన వృద్ధిం బొందుచు నభిమతార్థంబులం జెప్పనేరక; యనేక కీటసంకులం బయిన పర్యంకంబు నందు శయానుండై; యవయవంబులు గండూయమానంబు లైనఁ గోఁకనేరక యాసనోత్థాన గమనంబుల నశక్తుండై; తన శరీరచర్మంబు మశక మత్కుణ మక్షికాదులు పొడువ గ్రిములచే వ్యధంబడు క్రిమియుంబోలె దోదూయమానుండై రోదనంబు సేయుచు విగతజ్ఞానుండై మెలంగుచు; శైశవంబునం దత్త త్క్రియానుభవంబుఁ గావించి పౌగండ వయస్సునఁ దదనురూపంబు లగు నధ్యయనాది దుఃఖంబు లనుభవించి; తదనంతరంబ యౌవనంబు ప్రాప్తం బైన నభిమతార్థ ఫలప్రాప్తికి సాహసపూర్వకంబు లగు వృథాగ్రహంబులు సేయుచుఁ గాముకుండై; పంచమహాభూతారబ్దం బగు దేహం బందుఁ బెక్కుమాఱు లహంకార మమకారంబులం జేయుచుఁ దదర్థంబులైన కర్మంబు లాచరించుచు సంసారబద్ధు డగచు దుష్పురుష సంగమంబున శిశ్నోదరపరాయణుండై వర్తించుచు నజ్ఞానంబునం జేసి వర్దిష్యమాన రోషుం డగుచుఁ; దత్ఫలంబు లగు దుఃఖంబు లనుభవించుచుఁ గాముకుండై నిజనాశంబునకు హేతువు లగు కర్మంబులం బ్రవర్తించు చుండు; మఱియును.
టీక:- దశమ = పదవ (10); మాసంబునన్ = నెలలో; వానిని = అతనిని; అధోముఖునిన్ = తలకిందులుగా; కావించిననున్ = చేయగా; ఉచ్ఛ్వాసనిశ్శ్వాసంబులున్ = ఊపిరి; లేక = ఆడక; ఘన = అద్యధికమైన; దుఃఖ = దుఃఖము; భాజనుండున్ = విస్తరించినవాడును; విగత = విడిచిపోయిన; జ్ఞానుండును = జ్ఞానము కలవాడును; రక్త = రక్తముచే; దిగ్భాగుండును = పూర్తిగా పులుమబడినవాడును; ఐ = అయ్యి; విట్ = మలము; అస్థ = అందలి; క్రిమియున్ = క్రిమిని; పొలెన్ = వలె; నేలన్ = నేలపై; పడి = పడి; ఏడ్చుచున్ = ఏడుస్తూ; జ్ఞాన = జ్ఞానము; హీనుండు = లేనివాడు; ఐ = అయ్యి; జడుడున్ = తెలివితక్కువవాడిని; పోలెన్ = వలె; ఉండి = ఉండును; అంతన్ = ఆ తరువాత; నిజ = తన; భావన్ = భావములను; అనభిజ్ఞులు = ఎరుగనివారు; అగు = అయిన; ఇతరులన్ = ఇతరుల; వలన = చేత; వృద్ధిన్ = పెంచబడుటను; పొందుచున్ = పొందుతూ; అభిమత = ఇష్టమైన; అర్థములు = వస్తువులను; చెప్పన్ = చెప్ప; నేరకన్ = లేక; అనేక = అనేకమైన; కీటన్ = పురుగులచే; సంకులంబున్ = కలిసిపోయినది; అయిన = అయినట్టి; పర్యంకంబున్ = శయ్య; అందున్ = మీద; శయానుండు = పండుకొనబెట్టిన వాడు; ఐ = అయ్యి; అవయవంబులున్ = అవయవములు; కండూయమానంబున్ = దురద పెట్టుచున్నవి; ఐనన్ = అయనను; గోక = గోకుకొన; నేరకన్ = లేక; ఆసన = కూర్చొనుట; ఉత్థాన = లేచుట; ఆగమనంబులన్ = నడచుటలందు; అశక్తుండ = శక్తిలేనివాడు; ఐ = అయ్యి; తన = తన; శరీర = దేహము యొక్క; చర్మంబున్ = చర్మము; మశక = దోమలు; మత్కుణ = నల్లులు; మక్షిక = ఈగలు; ఆదులు = మొగలగునవి; పొడువన్ = కుట్టగ; క్రిముల్ = క్రిములు; చేన్ = చేత; వ్యధన్ = బాధ; పడు = పడెడి; క్రిమియున్ = క్రిమిని; పొలెన్ = వలె; దోదూయమానుండు = చేతులతో పారాడు వాడు; ఐ = అయ్యి; రోదనంబున్ = ఏడుస్తుండుట; చేయుచు = చేస్తూ; విగత = విడిచిన; జ్ఞానుండు = జ్ఞానము కలవాడు; ఐ = అయ్యి; మెలంగుచున్ = మెల్లిగా తిరుగుతూ; శైశవంబునన్ = శైశవములో; తత్తత్ = ఆయా; క్రియా = పనులందు; అనుభవంబున్ = అనుభవమును; కావించి = పొంది; పౌగండ = పౌగండము (5 ఏండ్లు) దాటిన; వయసునన్ = వయస్సులో; తత్ = దానికి; అనురూపంబులు = తగినవి; అగు = అయిన; అధ్యయన = చదువుకొనుట; ఆది = మొదలైన; దుఃఖంబులను = బాధలను; అనుభవించి = అనుభవించి; తదనంతరంబ = ఆ తరువాత; యౌవనంబున్ = యౌవనము; ప్రాప్తంబున్ = వచ్చినది; ఐన = అయిన; అభిమత = ఇష్టమైన; అర్థ = కోరికలు; ఫల = ఫలించుటను; ప్రాప్తి = పొందుట; కున్ = కు; సాహస = సాహసముతో; పూర్వకంబులు = కూడినవి; అగు = అయిన; వ్యథా = అనవసరపు; ఆగ్రహంబులున్ = కోపములు; చేయుచున్ = చేస్తూ; కాముకుండు = కామోద్రేకము కలవాడు; ఐ = అయ్యి; పంచమహాభూత = పంచబూతములుతో {పంచమహాభూతములు - 1ఆకాశము 2తేజస్సు 3వాయువు 4నీరు 5పృథ్వి}; ఆరబ్దంబున్ = చేయబడినది; అగు = అయినట్టి; దేహంబున్ = శరీరము; అందున్ = పై; పెక్కు = అనేక; మాఱులు = సార్లు; అహంకార = అహంకారములు; మమకారంబులన్ = మమకారములను; చేయుచున్ = చేస్తూ; తత్ = వాని; అర్థంబులు = కోసము; ఐన = అయిన; కర్మంబులన్ = పనులను; ఆచరించుచున్ = చేస్తూ; సంసార = సంసారమున; బద్ధుడు = బంధములలో చిక్కుకున్నవాడు; అగుచున్ = అవుతూ; దుష్పురుష = చెడ్డవారితో; సంగమంబునన్ = సహవాసము వలన; శిశ్న = కామము యందు; ఉదర = తిండి యందు; పరాయణుండు = లగ్నము అయినవాడు; ఐ = అయ్యి; వర్తించుచున్ = ప్రవర్తిస్తూ; అజ్ఞానంబునన్ = అజ్ఞానము; చేసి = వలన; వర్దిష్యమాణ = పెరుగుతున్న; రోషుండున్ = రోషము కలవాడు; అగుచున్ = అవుతూ; తత్ = వాని; ఫలంబులున్ = ఫలితములు; అగు = అయిన; దుఃఖంబులన్ = బాధలను; అనుభవించుచున్ = అనుభవిస్తూ; కాముకుండు = కామమోద్రేకము కలవాడు; ఐ = అయ్యి; నిజ = తన; నాశంబునన్ = నాశనమున; కున్ = కు; హేతువులు = కారణములు; అగు = అయిన; కర్మంబులన్ = పనులలో; ప్రవర్తించుచుండు = తిరుగుతుండును; మఱియును = ఇంకను.
భావము:- పదవ నెలలో జీవుడు తలక్రిందుగా తిరిగి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేక ఎంతో బాధపడుతూ జ్ఞానరహితుడై, నెత్తురు పులుముకున్న దేహంతో భూమిమీద పడి ఏడుస్తూ, ఎరుకలేనివాడై ఉండి, తన ఉద్దేశ్యం అర్థం చేసికోలేని ఇతరులచే పోషింపబడుతూ, తనకు కావలసిన దేదో చెప్పలేక, పెక్కు కీటకాలతో నిండిన ప్రక్కమీద పండుకొని, శరీరం దురద పుట్టినా గోకుకొనలేక, కూర్చోడానికి లేవడానికి నడవడానికి శక్తి చాలక, తన ఒంటి నిండా దోమలూ నల్లులూ ఈగలూ మొదలైనవి ప్రాకి కుడుతూ ఉంటే వారింపలేక, క్రిములచే పీడింపబడే క్రిమిలా బాధపడుతూ, ఏడుస్తూ, జ్ఞానం లేనివాడై మెలగుతూ, శైశవంలో ఆయా అవస్థలను అనుభవించి, బాల్యంలో విద్యాభ్యాసం మొదలైన వాటితో శ్రమపడి, ఆ తర్వాత యౌవనంలో తన కోర్కెలు తీర్చుకొనడం కోసం సాహసంతో కూడిన పనికిమాలిన పంతాలూ పట్టుదలలూ పూనుతూ, కామోద్రేకంతో ప్రవర్తిస్తూ, పంచభూతాత్మకమైన తన దేహంమీద మాటిమాటికీ అహంకార మమకారాలు పెంచుకుంటూ, అందుకు తగిన పనులు చేస్తూ, సంసార బంధాలలో కట్టుబడి, దుష్టుల స్నేహంవల్ల కామం పండించుకొనడం, కడుపు నిండించుకొనడంతోనే సతమతమౌతూ, అజ్ఞానియై పెచ్చు పెరిగిపోతున్న మచ్చరంతో దానికి ఫలమైన దుఃఖాన్ని అనుభవిస్తూ, కామాంధుడై, తన నాశనానికి మూలకారణమైన చెడుపనులను చేస్తూ ఉంటాడు. ఇంకా...

తెభా-3-1006-సీ.
నయిత్రి! సత్యంబు శౌచంబు దయయును-
ధృతియు మౌనంబు బుద్ధియును సిగ్గు
క్షమయును యశమును మమును దమమును-
మొదలుగాగల గుణంబులు నశించు
నుల కసత్సంగము నని యెఱిఁగించి-
వెండియు నిట్లను వినుము, మూఢ
హృదయులు శాంతి విహీనులు దేహాత్మ-
బుద్ధులు నంగనా మోహపాశ

తెభా-3-1006.1-తే.
ద్ధ కేళీమృగంబుల గిదిఁ దగిలి
రవశస్వాంతముల శోచ్యభావు లైన
వారి సంగతి విడువంగ లయు నందు
నంగనాసంగమము దోష మండ్రు గాన.

టీక:- జనయిత్రి = తల్లీ; సత్యంబున్ = సత్యమును; శౌచంబున్ = శౌచమును, శుచియును; దయయునున్ = దయయును; ధృతియున్ = ధైర్యమును; మౌనంబునున్ = మౌనము; బుద్ధియునున్ = బుద్ధియును; సిగ్గు = సిగ్గును; క్షమయునున్ = ఓర్పును; యశమునున్ = కీర్తియును; శమమునున్ = శమమును; దమమునున్ = దమమును; మొదలుగాగల = మొదలైన; గుణంబులున్ = గుణములు; నశించున్ = చెడిపోవును; జనుల్ = జనముల; కున్ = కు; అసత్సంగమునన్ = చెడుసహవాసములు వలన; అని = అని; ఎఱిగించి = తెలిపి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అను = పలికెను; వినుము = వినుము; మూఢ = మోహము చెందిన; హృదయులు = హృదయములు కలవారు; శాంతి = శాంతి; విహీనులు = లేనివారు; దేహ = దేహమే; ఆత్మ = తాము; బుద్ధులు = అనుకొనువారు; అంగనా = స్త్రీ; మోహ = మోహము అనెడి; పాశ = పాశములచే; బద్ధ = బంధింపబడిన; కేళీ = పెంపుడు; మృగంబుల్ = జంతువుల;
పగిదిన్ = వలె; తగిలి = తగుల్కొని; పరవశ = పరవశించుచున్న; స్వాంతములన్ = మనస్సులతో; శోచ్య = శోకింపదగిన, శోచనీయమైన; భావులు = భావములు కలవారు; ఐన = అయినట్టి; వారి = వారి యొక్క; సంగతిన్ = సాంగత్యమును; విడువంగవలయున్ = విడిచిపెట్టవలసినది; అందున్ = వానిలోను; అంగనా = స్త్రీలతో; సంగమము = సాంగత్యము; దోషము = మిక్కిలి చెడ్డది; అండ్రు = అందురు; కాన = కావున.
భావము:- అమ్మా! దుర్మార్గుల సాంగత్యంవల్ల సత్యం, శుచిత్వం, దయ, ధ్యైర్యం, మితభాషణం, బుద్ధి, సిగ్గు, ఓర్పు, కీర్తి, శమం, దమం మొదలైన గుణాలన్నీ నశిస్తాయి” అని చెప్పి కపిలుడు తల్లితో మళ్ళీ ఇలా అన్నాడు. “మూఢ హృదయులు, శాంతి లేనివాళ్ళు, దేహమే ఆత్మ అని భావించేవాళ్ళు, స్త్రీ వ్యామోహంలో చిక్కుకొని గొలుసులతో బంధించిన పెంపుడు మృగాలలాగా పరులకు వశమైన బుద్ధి కలవారు శోచనీయులు. అటువంటివారి సాంగత్యం వదలిపెట్టాలి. అందులోను స్త్రీసాంగత్యం బలీయమైన దోషం అని ప్రాజ్ఞులంటారు కదా!

తెభా-3-1007-వ.
దీని కొక్క యితిహాసంబు గలదు; 'తొల్లి యొక్కనాడు ప్రజాపతి దన కూఁతు రయిన భారతి మృగీరూపధారిణి యై యుండం జూచి తదీయ రూపరేఖా విలాసంబులకు నోటువడి వివశీకృతాంతరంగుండును విగత త్రపుండును నై తానును మృగరూపంబు నొంది తదనుధావనంబు హేయం బని తలంపక ప్రవర్తించెం;' గావున నంగనాసంగమంబు వలవ; దస్మదీయ నాభికమల సంజాత చతుర్ముఖ నిర్మిత మరీచ్యాద్యుద్భూత కశ్యపాది కల్పిత దేవ మనుష్యాదు లందు మాయా బలంబునం గామినీజన మధ్యంబున విఖండిత మనస్కుండు గాకుండఁ బుండరీకాక్షుండైన నారాయణఋషికిం దక్క నన్యులకు నెవ్వరికిం దీరదు"అని వెండియు నిట్లనియె.
టీక:- దీని = దీని; కిన్ = కి; ఒక్క = ఒక; ఇతిహాసము = ప్రాచీన కథనము; కలదు = ఉన్నది; తొల్లి = పూర్వము; ఒక్కనాడు = ఒకదినమున; ప్రజాపతి = బ్రహ్మదేవుడు; తన = తన; కూతురు = పుత్రిక; అయిన = అయినట్టి; భారతిన్ = భారతిని; మృగీ = ఆడులేడి; రూప = రూపమును; ధారిణి = ధరించినది; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; చూచి = చూసి; తదీయ = ఆమె యొక్క; రూప = అందము; రేఖా = సౌష్టవము; విలాసంబుల్ = విలాసముల; కున్ = కు; ఓటుపడి = లొంగిపోయి; వివశీ = పరవశము; కృత = చెందిన; అంతరంగుండును = మనస్సు కలవాడును; విగత = విడిచిన; త్రపుండును = సిగ్గుకలవాడును; ఐ = అయ్యి; తానును = తన కూడ; మృగ = మగ లేడి; రూపంబున్ = రూపమును; ఒంది = ధరించి; తత్ = దానిని; అనుధావనంబున్ = వెంటపడుట; హేయంబున్ = ఏవగింపుకలిగించునది; అని = అని; తలంపక = చూడక; ప్రవర్తించెన్ = ప్రవర్తించెను; కావునన్ = కనుకనే; అంగనా = స్త్రీలతో; సంగమంబున్ = సాంగత్యము; వలవదు = వద్దు; అస్మదీయ = నా యొక్క; నాభీ = బొడ్డు; కమల = పద్మమున; సంజాత = పుట్టిన; చతుర్మఖ = చతుర్ముఖ బ్రహ్మదేవునిచే; నిర్మిత = సృష్టింపబడిన; మరీచి = మరీచి; ఆది = మొదలైనవారికి; ఉద్భూత = పుట్టిన; కశ్యప = కశ్యపుడు; ఆది = మొదలగువారిచే; కల్పిత = సృష్టింపబడిన; దేవ = దేవతలును; మనుష్య = మానవులును; ఆదులు = మొదలైనవారి; అందున్ = అందు; మాయా = మహిమ యొక్క; బలంబునన్ = శక్తితో; కామినీ = స్త్రీ; జన = జనముల; మధ్యంబునన్ = నడుమ; విఖండిత = బాగదెబ్బతిన్న; మనస్కుండు = మనస్సు కలవాడు; కాకుండన్ = కాకుండా ఉండుట; పుండరీకాక్షుండు = గోవిందునికి {పుండరీకాక్షుడు - పుండరీకము (పద్మము)ల వంటి కన్నులు కలవాడు, విష్ణువు}; ఐన = అయినట్టి; నారాయణ = నాయణుడు అను {నారాయణుడు - నారము (నీరు)లందు వసించువాడు, విష్ణువు}; ఋషి = ఋషి {ఋషి - శాస్త్రకారుఁడగు ఆచార్యుఁడు, మంత్ర ద్రష్ట. , వ్యు. ఋషీ = గతౌ-ఋష + కి (కృ.ప్ర.) జ్ఞానముచే సంసార పారమును చేరువాఁడు.}; కిన్ = కి; తక్కన్ = తప్పించి; అన్యులకున్ = ఇతరులకు; ఎవ్వరికిన్ = ఎవరికిని; తీరదు = వీలుకాదు; అని = అని; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- దీనికొక ప్రాచీన కథ ఉంది. పూర్వం ఒకనాడు బ్రహ్మదేవుడు తన కూతురైన సరస్వతి ఆడులేడి రూపాన్ని ధరించి ఉండగా చూచి, ఆమ సౌందర్య లావణ్యాలకు మురిసిపోయి, పరవశించిన హృదయంతో సిగ్గు విడిచి, తానుకూడ మగలేడి రూపాన్ని ధరించి నీచమని భావించకుండా ఆమె వెంటబడి పరుగులెత్తాడు. కాబట్టి పురుషునకు స్త్రీసాంగత్యం తగదు. నా నాభికమలం నుండి పుట్టిన బ్రహ్మ, అతనిచే సృష్టింపబడిన మరీచి ప్రముఖులు, వారికి పుట్టిన కశ్యపాదులు, వీరిచే కల్పించబడిన దేవతలు, మనుష్యులు, వీరందరిలోను చక్కదనాల చుక్కలైన రమణీమణుల మాయలకు చిక్కకుండా మొక్కవోని మనస్సు కలిగి ఉండడం అన్నది పుండరీకాక్షుడైన ఒక్క నారాయణ మహర్షికే తప్ప ఇతరులకు ఎవ్వరికీ సాధ్యం కాదు” అని కపిలుడు మళ్ళీ ఇలా చెప్పాడు.

తెభా-3-1008-తే.
రూఢి నా మాయ గామినీరూపమునను
బురుషులకు నెల్ల మోహంబుఁ బొందజేయుఁ
గాన పురుషులు సతులసంగంబు మాని
యోగవృత్తిఁ జరించుచు నుండవలయు.

టీక:- రూఢిన్ = అవశ్యము; నా = నా యొక్క; మాయ = మాయ; కామినీ = స్త్రీల {కామిని - కామము కలామె, స్త్రీ}; రూపముననున్ = రూపములో; పురుషుల్ = పురుషుల; కున్ = కు; ఎల్లన్ = అందరకు; మోహంబున్ = మోహమును; పొందన్ = చెందునట్లు; చేయున్ = చేయును; కాన = కావున; పురుషులు = పురుషులు; సతుల = స్త్రీలతో; సంగంబున్ = తగులము; మాని = విడిచి; యోగ = యోగ; వృత్తిన్ = మార్గమున; చరించుచున్ = వర్తించుచు; ఉండవలయున్ = ఉండవలయును.
భావము:- “నా మాయయే స్త్రీరూపంలో పురుషులకు మోహాన్ని కలిగిస్తుంది. కాబట్టి పురుషులు పరస్త్రీ సాంగత్యాన్ని పరిత్యజించి యోగమార్గంలో చరిస్తూ ఉండాలి.

తెభా-3-1009-క.
ధీతతో మత్పదసర
సీరుహసేవానురక్తిఁ జెందినవారల్
నారీసంగము నిరయ
ద్వాముగా మనము లందు లఁపుదు రెపుడున్.

టీక:- ధీరత = ధైర్యము; తోన్ = తోటి; మత్ = నా యొక్క; పద = పాదములు అనెడి; సరసీరుహ = పద్మముల; సేవా = కొలుచుట యందు; అనురక్తిన్ = కూరిమిని; చెందిన = కలిగించుకొన్న; వారల్ = వారు; నారీ = స్త్రీలతోడి; సంగము = తగులము; నిరయ = నరకమునకు; ద్వారముగ = ప్రవేశింపజేయునదిగా; మనములన్ = మనస్సులలో; తలపుదురు = తలచెదరు; ఎపుడున్ = ఎప్పుడును.
భావము:- స్థిరబుద్ధితో నా పాదపద్మాలను సేవించడంలో ఆసక్తి కలవారు స్త్రీసాంగత్యాన్ని నరకద్వారంగా మనస్సులలో భావిస్తారు.

తెభా-3-1010-క.
రిమాయా విరచితమై
రుణీరూపంబుఁ దాల్చి రఁ బర్విన బం
ధు తృణపరివృత కూపము
ణి నదియు మృత్యురూపకం బగు మఱియున్.

టీక:- హరి = విష్ణు; మాయా = మాయచేత; విరచితము = చక్కగా చేయబడినది; ఐ = అయ్యి; తరుణీ = స్త్రీ {తరుణి - తరుణమైన (తగిన) వయసు కల ఆమె, స్త్రీ}; రూపంబున్ = రూపము; తాల్చి = ధరించి; ధరన్ = భూమిపైన; పర్విన = వ్యాపించిన; బంధుర = బాగా పెరిగిన; తృణ = గడ్డితో; పరివృత = ఆవరింపబడిన; కూపమున్ = నూతి, బావి; కరణిన్ = వలె; అదియున్ = అదికూడ; మృత్యు = మృత్యువు యొక్క; రూపకంబున్ = స్వరూపము; అగున్ = అగును; మఱియున్ = ఇంకను.
భావము:- నా మాయచేత కల్పించబడిన కామినీరూపం దట్టమైన గడ్డిచే కప్పబడిన కూపానికి అనురూపమై, మృత్యుస్వరూపమై ఉంటుంది. ఇంకా...

తెభా-3-1011-చ.
పశు మిత్ర పుత్ర వనితా గృహకారణభూత మైన యీ
నువున నున్న జీవుఁడు పదంపడి యట్టి శరీర మెత్తి తా
నుగతమైన కర్మఫల మందకపోవఁగరాదు మింటఁ బో
యి భువిఁ దూరినన్ దిశల కేగిన నెచ్చట నైన డాగిఁనన్.

టీక:- ధన = సంపద; పశు = పశువులు; మిత్ర = మిత్రులు; పుత్ర = పుత్రులు; వనితా = భర్య; గృహ = ఇల్లు లకు; కారణభూతము = కారణాంశముగ; ఐన = ఉన్నట్టి; ఈ = ఈ; తనువునన్ = దేహమున; ఉన్న = ఉన్నట్టి; జీవుడు = జీవుడు, దేహి; పదంపడి = తరవాత; అట్టి = అటువంటి; శరీరమున్ = దేహమున; ఎత్తి = ధరించి; తాన్ = తాను; అనుగతము = అనుసరించునది; ఐన = అయిన; కర్మ = కర్మముల; ఫలమున్ = ఫలితమును; అందకన్ = చెందకుండగా; పోవగరాదు = పోవుట వీలుకాదు; మింటన్ = ఆకాశమునకు; పోయినన్ = వెళ్ళినను; భువిన్ = భూమిలోనికి; దూరినన్ = దూరినను; దిశల్ = దిక్కుల; కున్ = కు; ఏగినన్ = వెళ్ళినను; ఎచ్చటన్ = ఎక్కడ; ఐనన్ = అయినా; డాగినన్ = దాగు కొనినను.
భావము:- ధనధాన్యాలు, పశువులు, పుత్రులు, మిత్రులు, స్త్రీలు, గృహాలు మొదలైన వాటికి కారణభూతమైన ఈ శరీరంలో ఉన్న జీవుడు ఇవన్నీ అనుభవించి మళ్ళీ ఈ జన్మలోని కర్మఫలాన్ని అనుభవించడం కోసం ఇటువంటి శరీరాన్ని మళ్ళీ ధరిస్తాడు. ఆకాశంలోకి ఎగిరిపోయినా, భూమిలో దూరినా, దిక్కులకు పారిపోయినా, ఎక్కడ దాగినా కర్మఫలాన్ని అనుభవింపక తప్పదు.

తెభా-3-1012-వ.
అట్టి పురుషరూపంబు నొందిన జీవుండు నిరంతర స్త్రీసంగంబుచే విత్తాపత్య గృహాదిప్రదం బగు స్త్రీత్వంబు నొందు; ఈ క్రమంబున నంగనా రూపుం డగు జీవుండు మన్మాయచేఁ బురుషరూపంబు నొంది ధనాదిప్రదుం డగు భర్తను నాత్మబంధకారణం బగు మృత్యువునుగ నెఱుంగ వలయు; మఱియు జీవోపాధిభూతం బగు లింగదేహంబుచే స్వావాస భూతలోకంబున నుండి లోకాంతరంబు నొందుచుం బ్రారబ్ద కర్మఫలంబుల ననుభవించుచు; మరలం గర్మాదులందాసక్తుఁ డగుచు మృగయుండు గాననంబున ననుకూల సుఖప్రదుం డైనను మృగంబునకు మృత్యు వగు చందంబున జీవుండు భూతేంద్రియ మనోమయం బైన దేహంబు గలిగి యుండు; అట్టి దేహనిరోధంబె మరణంబు; ఆవిర్భావంబె జన్మంబునుం; గాన సకల వస్తువిషయ జ్ఞానంబు గలుగుటకు జీవునకు సాధనంబు చక్షురింద్రయం బగు ద్రష్టదర్శనీయ యోగ్యతాప్రకారంబున జీవునకు జన్మమరణంబులు లేవు; గావున భయకార్పణ్యంబులు విడిచి సంభ్రమంబు మాని జీవప్రకారంబు జ్ఞానంబునం దెలిసి ధీరుండై ముక్తసంగుం డగుచు యోగ వైరాగ్యయుక్తం బైన సమ్యగ్జ్ఞానంబున మాయావిరచితం బైన లోకంబున దేహాదులం దాసక్తి మాని వర్తింప వలయు"నని చెప్పి; వెండియు నిట్లనియె.
టీక:- అట్టి = అటువంటి; పురుష = పురుషుని; రూపంబున్ = రూపమున; పొందిన = చెందిన; జీవుండు = జీవుడు, దేహి; నిరంతర = ఎడతెగని; స్త్రీ = స్త్రీ; సంగంబున్ = సాంగత్యము; చేన్ = వలన; విత్తా = ధనము; అపత్య = సంతానము; గృహా = ఇళ్లు; ఆది = మొదలైన వానికి; ప్రదంబున్ = కలుగుటకు కారణము; అగు = అయిన; స్త్రీత్వంబున్ = స్త్రీగా జన్మమును; పొందున్ = పొందును; ఈ = ఈ; క్రమంబునన్ = విధముగనే; అంగనా = స్త్రీ; రూపుండు = రూపమున ఉన్నవాడు; అగు = అయిన; జీవుండు = జీవుడు, దేహి; మత్ = నా యొక్క; మాయ = మాయ; చేన్ = చేత; పురుష = పురుషునిగా; రూపంబున్ = రూపమును; పొంది = పొంది; ధన = ధనము; ఆది = మొదలైనవి; ప్రదుండు = కలిగించువాడు; అగు = అయిన; భర్తను = భర్తను; ఆత్మ = తన; బంధ = బంధనములకు; కారణంబున్ = కారణము; అగు = అయిన; మృత్యువును = మరణము; కాన్ = అగునట్లు; ఎఱుంగ = తెలిసికొన; వలయున్ = వలసినది; మఱియున్ = ఇంకను; జీవ = జీవన; ఉపాధి = ఆధారము; భూతంబున్ = అయినది; అగు = అయిన; లింగదేహము = లింగదేహము; చేన్ = చేత; స్వ = తన యొక్క; ఆవాసభూతంబు = నివాసమైన; లోకంబునన్ = లోకములో; ఉండి = ఉండి; లోక = లోకము; అంతరంబున్ = వేరొకటిని; పొందుచున్ = పొందుతూ; ప్రారబ్ద = పురాకృత; కర్మ = కర్మముల; ఫలంబులన్ = ఫలితములను; అనుభవించుచున్ = అనుభవిస్తూ; మరలన్ = మళ్ళీ; కర్మ = కర్మములు; ఆదులు = మొదలైనవాటి; అందున్ = అందు; ఆసక్తుడు = ఆసక్తి కలవాడు; అగుచున్ = అవుతూ; మృగయుండు = వేటగాడు; కాననంబునన్ = అడవిలో; అనుకూల = అనుకూలమైన; సుఖ = సుఖములు; ప్రదుండు = అమర్చు వాడు; ఐనను = అయినప్పటికిని; మృగంబున్ = జంతువున; కున్ = కు; మృత్యువున్ = మృత్యువే; అగు = అయ్యెడి; చందంబునన్ = విధముగనే; జీవుండు = జీవుడు, దేహి; భూత = పంచభూతములు; ఇంద్రియ = ఇంద్రియములు; మనస్ = మనస్సులతో; మయంబున్ = కూడినది; ఐన = అయిన; దేహంబున్ = శరీరమును; కలిగి = కలిగి; ఉండున్ = ఉండును; అట్టి = అటువంటి; దేహ = శరీరము యొక్క; నిరోధంబె = అడ్డగింపె; మరణంబున్ = మరణము; ఆవిర్భవంబె = ఏర్పడుటే; జన్మంబునున్ = పుట్టుకయును; కాన = కావున; సకల = సమస్తమైన; వస్తు = వస్తువులకు; విషయ = సంబంధించిన; జ్ఞానంబున్ = తెలివిని; కలుగుట = కలిగించుట; కున్ = కు; జీవున్ = జీవుని; కున్ = కి; సాధనంబు = సాధనము; చక్షురింద్రియంబు = కన్ను; అగున్ = అగును; ద్రష్ట = చూచువాడు; దర్శనీయ = చూడతగినది; యోగ్యత = సమత్వమును చూడగలుగుట; ప్రకారంబునన్ = విధములో; జీవున్ = జీవున; కున్ = కు; జన్మమరణంబులున్ = జననమరణములు; లేవు = లేవు; కావున = అందుచేత; భయ = భయములు; కార్పణ్యంబులున్ = దీనత్వములు; విడిచి = వదిలేసి; సంభ్రమంబున్ = కంగారుపడుటను; మాని = మానేసి; జీవ = జీవన; ప్రకారంబున్ = విధానమును; జ్ఞానంబున్ = జ్ఞానమును; తెలిసి = తెలిసికొని; ధీరుండు = ధైర్యము కలవాడు; ఐ = అయ్యి; ముక్త = విడిచిన; సంగుండు = తగులములు కలవాడు; అగుచున్ = అవుతూ; యోగ = యోగమును; వైరాగ్య = వైరాగ్యమును; యుక్తంబున్ = కూడినది; ఐన = అయిన; సమ్యగ్ఙ్ఢానంబునన్ = సరియగు జ్ఞానముతో; మాయా = మాయతోకూడి; విరచితంబున్ = సృష్టింపబడినది; ఐన = అయినట్టి; లోకంబునన్ = లోకములో; దేహ = శరీరము; ఆదులు = మొదలగు వానిపై; ఆసక్తి = అసక్తిని; మాని = వదిలేసి; వర్తింపన్ = ప్రవర్తింప; వలయున్ = వలసినది; అని = అని; చెప్పి = చెప్పి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- అటువంటి పురుషరూపాన్ని ధరించిన జీవుడు ఎడతెగని స్త్రీసాంగత్యంవల్ల భోగభాగ్యాలు, పిల్లలు, ఇల్లు మొదలైన వాటిపై ఆసక్తి పెంచుకొని వచ్చే జన్మలో స్త్రీగానే జన్మిస్తాడు. ఈ విధంగా స్త్రీత్వాన్ని పొందిన జీవుడు నా మాయవల్ల పురుషరూపాన్ని పొంది ధనాదులను ఇచ్చే భర్తను సంసారబంధనానికి కారణంగా తెలుసుకోవాలి. ఈ సంసారబంధమే మృత్యువు. జీవునకు ఆధారంగా లింగమయ దేహం నిలిచి ఉంటుంది. ఆ లింగమయదేహంతో తనకు నివాసమైన ఈ లోకంనుండి వేరు లోకాలను పొందుతూ పూర్వకర్మలయొక్క ఫలితాన్ని అనుభవిస్తూ, తిరిగి కర్మలపై ఆసక్తుడు అవుతూ ఉంటాడు. మనస్సుతో పంచభూతాలతో పంచేంద్రియాలతో ఏర్పడి సుఖ సాధనమైన దేహం క్రమంగా శుష్కించి నశిస్తుంది. అడవిలో వేటగాడు మృగాలకు గానాదులతో అనుకూలమైన సదుపాయాలు కూర్చేవాడైనా, అతడే మృగాలపాలిటికి మృత్యువుగా పరిణమిస్తాడు. అట్టి దేహాన్ని చాలించడమే మరణం. దానిని పొందడమే జననం. కనుక సకల వస్తువులకూ సంబంధించిన జ్ఞానాన్ని పొందడానికి జీవునకు సాధనం కన్ను. ద్రష్ట చూడదగిన దానిని చూడడం అనే యోగ్యత సంపాదించుకున్నప్పుడు జీవునకు పుట్టడం, గిట్టడం అనేవి ఉండవు. కాబట్టి మానవుడు పిరికితనాన్నీ, దైన్యభావాన్నీ వదలిపెట్టి, తొందర లేనివాడై, జీవుని స్వరూపాన్ని జ్ఞానం ద్వారా తెలుసుకొని, ధైర్యం వహించి బంధనాలు లేనివాడై యోగ్యమైన వైరాగ్యంతో కూడిన చక్కని జ్ఞానాన్ని అలవరచుకోవాలి. మాయాకల్పితమైన ఈ లోకంలో దేహం మొదలైన వానిపై ఆసక్తి లేకుండా ఉండాలి” అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు.