Jump to content

ఈ మేను గలిగినందుకు సీతారామ నామమే బల్కవలెను

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః

ఈ మేను గలిగినందుకు సీతారామ నామమే బల్కవలెను 
రాగం: వరాళి
తాళం: ఆది

పల్లవి:
ఈ మేను గలిగినందుకు సీతారామ
నామమే బల్కవలెను ॥ఈమేను॥

అను పల్లవి:
కామాది దుర్గుణ స్తోమ పూరితమైన
పామరత్వమేగాని నేమము లేనట్టి ॥ఈమేను॥

చరణము(లు)
సంసారమున బ్రోవ దారిని పర
హింసజెందు కిరాతుఁడు
హంసరూపుల గతినడుగ రామనామ ప్ర
శంసజేసి యుపదేశించ ధన్యుఁడు గాలేదా? ॥ఈమేను॥

తాపసి శాపమిడగా జలోరగ
రూపముగొని యుండగా
తాపము సైరించక తల్లడిల్లగ శర
చాపధరుని నామ శ్రవణము బ్రోవలేదా? ॥ఈమేను॥

కరిరాజు తెలియలేక బలుఁడైన మ
కరిచేత గాసి జెందగా
అరలేక నిజమున నాదిమూలమనగ
వరదుఁడు వేగమే వచ్చి బ్రోవగలేదా ॥ఈమేను॥

ఆగమ వేదములను దానవుఁడు గొంపో
వగా చతురాననుఁడు
త్యాగరాజనుత తారక నామ యని
బాగున నుతింప భయము దీర్పగ లేదా? ॥ఈమేను॥