ఆనందం మనిషైనవాడు
వెంకటరమణ షష్టిపూర్తి సందర్భంగా ప్రచురణ
ఆనందం మనిషైనవాడు
(సూరంపూడి వెంకటరమణ జీవిత చిత్రణ)
సంపాదకుడు:
సూరంపూడి పవన్ సంతోష్
ఆనందం మనిషైనవాడు
(సూరంపూడి వెంకటరమణ జీవిత చిత్రణ)
సంపాదకుడు: శ్రీ సూరంపూడి పవన్ సంతోష్
ముద్రణ: సెప్టెంబరు 2014 (శ్రీ వెంకటరమణ షష్టిపూర్తి సందర్భంగా)
కాపీలు : 500
వెల : రూ. 76-00
టైటిల్ డిజైన్ & డి.టి.పి.
ఎస్.కె.ఆర్. గ్రాఫిక్, తాడేపల్లిగూడెం
ప్రింటింగ్ :
మానస ప్రింటర్స్, తాడేపల్లిగూడెం
చిత్రకారుడు :
శ్రీ తమ్మా సత్యనారాయణ, తిరుపతిపురం
ప్రచురణ :
శ్రీ లాస్యప్రియ పబ్లికేషన్స్
1-12-7/3, రామాలయం వీధి
గొల్లగూడెం సెంటర్
తాడేపల్లిగూడెం - 534 101
కాపీరైటు : ప్రచురణ కర్త
ప్రతులకు :
సూరంపూడి పవన్ సంతోష్
1-12-7/3, రామాలయం వీధి
గొల్లగూడెం సెంటర్
తాడేపల్లిగూడెం - 534 101
సెల్ నెం. : 9640656411, 9490229922
e-mail : srilasyapriya.publications@gmail.com
అంకితం
శ్రీ సూరంపూడి వెంకటరమణగారి
తల్లిదండ్రులు
శ్రీ సూరంపూడి పట్టాభిరామయ్య శ్రీమతి సావిత్రిగార్ల
దివ్యస్మృతికి...
సంపాదకుని మాట
జీవితచరిత్రలు, ఆత్మకథలు సామాజిక చరిత్రను నిర్మించడంలో, ఒక ప్రాంతపు సంస్మృతిని అర్ధం చేసుకోవడంలో చాలా బాగా ఉపకరిస్తాయి. భవిష్యత్ తరాలవారు ఒక ప్రాంతం, కాలం ఆత్మను అవగాహన చేసుకోవాలంటే విశిష్టమైన వ్యక్తిత్వం, విస్తృతమైన కార్యరంగం ఉన్న వ్యక్తుల జీవితగాథలు అవసరం. ఉత్తమ ఉపాధ్యాయుడుగా, మంచి నాటక కళాకారుడిగా, విశిష్టమైన రచయితగా, అన్నింటికి మించి నిజాయితీ, నిబద్ధత, సమర్ధతలాంటి విలువలు కలిగిన వ్యక్తిగా మా నాన్నగారు - సూరంపూడి వెంకటరమణగారి జీవితం అలాంటి అధ్యయనానికి, అవగాహనకి పనికివస్తుందని నా నమ్మకం. నా నమ్మకానికి ఫలితమే ఈ పుస్తకం.
ఆయన షష్టిపూర్తికి ఓ పుస్తకాన్ని ప్రచురించాలని అనుకున్నప్పుడు సాధారణంగా షష్టిపూర్తులకు వేసే సావనీర్ వంటిది ప్రచురిద్దామని సన్నిహితులు, బంధువులు సలహాఇచ్చారు. అయితే ఆసక్తికరమైన సంఘటనలు, కాలగతిని పట్టి ఇచ్చే విశేషాలు. ఎందరికో స్ఫూర్తిదాయకం కాగల లక్షణాలు కలగలిసిన ఆయన జీవితాన్ని వ్యక్తీకరించడానికి అటువంటి సాధారణమైన ప్రయత్నాలు చాలదనిపించింది.
కరణీకం కులవృత్తిగా కలిగిన ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఆయన జీవితం ప్రారంభమైంది. చిన్నతనంలోనే తండ్రి మరణం, ఆస్తులు హరించుకుపోవడం, అన్నలు చేస్తున్న కరణీకం రెవెన్యూ సంస్కరణల పేరిట తొలగించడం, ఉమ్మడి కుటుంబ బాధ్యతలువంటివి ఆయన తొలినాళ్ల జీవితంలోనే ఎదురుకావడంతో కష్టాన్ని ఇష్టపడే మనిషి అయ్యారు. సినిమాథియేటర్‌లో ఈవినింగ్, సెకండ్ షోలకు టిక్కట్టు కౌంటర్‌లో పనిచేయడం, రోజుకు ఒక ఇడ్లీకోసం ట్యూషన్ చెప్పడం, ఆగ్రోన్ సంస్థలో ఎరువులు అమ్మడం మొదలుకొని ఎన్నో పనులు చదువుతూనే చేసారు. నిజాయితీగా సంపాదించు కొనేందుకు పనికివచ్చే ఏ వృత్తినైనా గౌరవించడం ఆయనకు అవి నేర్పాయి. అదే సమయంలో మా గ్రామం కంచుమర్రులో నాటకాలు వేసేందుకు కొందరు మిత్రులతో "జైహింద్ నాటక కళాసమితి" ఏర్పాటు చేశారు. నిత్యం ఇంటిలో ఉపయోగపడేందుకు దొరికే ఏ వస్తువునైనా బాధ్యతగా తీసుకొచ్చేవారు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల భవిష్యత్తు బాగుండాలని తపించేవారు. ఇన్ని చేస్తున్నా ఆయన విశ్వవిద్యాలయం స్థాయిలో తెలుగులో మొదటి స్థానంలో ఉత్తీర్ణులయినారు. 100% అటెండెన్స్‌కిగాను ఇచ్చిన సర్టిఫికెట్‌లు మా ఇంటిలో ఇంకా ఉన్నాయి. ఇవి ఆయన చిన్నతనం గురించి ఎవరెవరో చెప్పగా నాకు తెలిసిన విశేషాలు. ఈ లక్షణాలనే భావి జీవితం అంతా నిక్కచ్ఛిగా అమలు చేశారు.
ఉపాధ్యాయునిగా, కళాకారునిగా, గ్రంథాలయోద్యమంలో, వివిధ సంస్థలలో బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఎన్నెన్నో పాత్రలు పోషించారు. ఇన్నిటిమధ్య తనదైన వ్యక్తిత్వం, ప్రత్యేకత నిలుపుకొన్నారు. అటువంటి వ్యక్తి జీవితంలోని ఆసక్తికరమైన ఘట్టాలు, ప్రత్యేకతలు ఆయననుంచి స్ఫూర్తి పొందినవారు, ఆయనతో పనిచేసినవారు వ్రాస్తే అదొక విశిష్టమైన జీవితచరిత్ర అవుతందనే భావనతో ఈ పుస్తకాన్ని తయారుచేసాను.
'బహుముఖ ప్రజ్ఞాశాలియైన ఆయన జీవితంలో ఎన్నో కోణాలు ఉన్నాయి. వాటి నుంచి గొప్ప ఉపాధ్యాయునిగా, మంచి నాటక కళాకారునిగా, కళా, సాహిత్య సంస్థలలో ముఖ్యునిగా, గొప్ప వ్యక్తిత్వమున్న మనిషిగా, అవధానాల్లో అప్రస్తుత ప్రసంగానికి పేరుపొందిన పృచ్ఛకునిగా ఆయనలోని పాత్రలను ఆవిష్కరించేలా ఉండాలని నిర్ణయించుకున్నాము. ఈ అంశాలపై ఒక్కో వ్యక్తితో ఒక్కో వ్యాసం రాయించాము. ఆ వ్యక్తులను ఎంపికచేయడంలోనూ ఒక పద్ధతి పాటించాను. ఆయనకు ఎందరో ప్రఖ్యాత వ్యక్తులతో పరిచయం ఉన్నా, మరెందరో ఆత్మీయులు ఉన్నా సంబంధిత వివరాలు ఆ వ్యక్తికి ఎంతవరకూ తెలిసి ఉండొచ్చు అన్న ప్రశ్న వేసుకుని ఆ క్రమంలోనే ఎంచుకున్నాను. ఆయా రంగాల్లో ఆయనతో కలిసి పనిచేయడం, ఆయనను గమనించగల సాన్నిహిత్యం కలిగివుండడం, కొందరి విషయంలో ఆయనను స్ఫూర్తిగా తీసుకొని జీవితాన్ని దిద్దుకోవడం వంటివే ప్రమాణాలుగా తీసుకున్నాను. వారితో వ్యాసాలు రాయించుకోవడంలోనూ ఎన్నో ప్రయత్నాలు చేశాను. స్వతహాగా రచయితలైన కొందరు నేరుగా వ్యాసాలు అందిస్తే, మరికొందరు సంఘటనలు, అభిప్రాయాలు రాసి ఇచ్చి వ్యాసంగా ఎడిట్ చేస్తే చూసి అంగీకరించారు. ఒకరిద్దరి విషయంలో వారితో సమయాన్ని గడిపి వారి మాటలు ఏరుకుని వారి భావాలు పేజీలపై పెట్టినవీ ఉన్నాయి. రెడ్డప్ప ధవేజీగారు, నామాల మూర్తిగారు ఏకంగా ప్రసంగంగా ఫోనులో ఏకపాఠంగా, ఆశువుగా చెప్పెయ్యడం విశేషం. వీరందరితోనూ మాట్లాడి, వారితో తెలిసినవీ, తెలియనివీ ఎన్నో కలబోసుకోవడంలో మా నాన్నగారి గురించి తెలియనివి ఎన్నో తెలుసుకున్నాను. ఆయన మేనల్లుడు శ్రీనివాసన్ చెప్పిన విశేషాలైతే ఆయనను సరికొత్తగా అర్ధం చేసుకునేలా చేశాయి. ప్రిజంలో చూస్తే తెల్లని సూర్యకాంతి ఏడు రంగులుగా కనిపించినట్టు వీరందరి మాటల్లో ఆయన వ్యక్తిత్వం వేయి రూపాలుగా కనిపించింది.
ఎన్నో విధాలుగా ఈ సంపుటిని జాగ్రత్తగానే తయారుచేసినా కొన్ని కోణాలు మరచిపోయి ఉండొచ్చు. ఆయనకు మాత్రమే తెలిసినవీ ఉంటాయి. మొదట పేర్కొన్న ప్రణాళిక పరిపూర్ణం కావాలన్నా, ఆయన అనుభవాలు, ఆయన కాలం, ఆయన తత్త్వం పూర్తిగా అందాలన్నా తప్పనిసరిగా ఆయన తన అనుభవాలు తాను రాసుకోవాలి. జ్ఞాపక శకలాలుగానో, అనుభవాల మాలగానో కాగితంపై పెట్టాలి. నేను ప్రారంభించిన ఈ ప్రణాళిక ఆయన తన ఆత్మకథాత్మక వ్యాసాలు రాసి పరిపూర్ణం చేస్తారని ఆశిస్తున్నాను.
సూరంపూడి పవన్ సంతోష్
సంపాదకుడు
అభినందనలు
శ్రీ సూరంపూడి వెంకటరమణ ఉపాధ్యాయునిగా, కవిగా, కళాకారునిగా, దర్శకునిగా, గాయకునిగా అన్నిటిని మించి మంచిని ప్రోత్సహించే సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా పలు అంశాలలో ఆయన చేసిన కృషి అభినందనీయం. షష్టిపూర్తి సందర్భంగా వారికి, వారి కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని ప్రార్దిస్తున్నాను. ఇంతవరకు ఉన్న సేవా గుణం దాక్షిణ్యం నిండు నూరేళ్ళు కొనసాగాలని అభిలషిస్తున్నాను.
తేదీ : 6 - 9 - 2014
నల్లజర్ల
అభినందనలు
తాడేపల్లిగూడెం మండలం లింగారాయుడుగూడెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాద్యాయునిగా ఉద్యోగ విరమణచేసి, షష్ఠిపూర్తి మహోత్సవం నిర్వహిస్తున్న శ్రీ సూరంపూడి వెంకటరమణగారికి శుభాకాంక్షలు. ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా వివిధ పాఠాశాలల్లో పనిచేసి పాఠవాలల, విద్యార్థుల అభివృద్ధికి వారుచేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి. కవిగా, కళాకారునిగా, దర్శకునిగా, వ్యాఖ్యాతగా శ్రీ రమణ సమాజానికి చేస్తున్న సేవలు ప్రశంసనీయం. వారి భావిజీవితం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని ఆశిస్తున్నాను.
శుభాకాంక్షలు
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, నటుడు, రచయిత, దర్శకుడు శ్రీ సూరంపూడి వెంకటరమణ 60 ఏళ్ళ పుట్టిన రోజు పండుగ సందర్భంగా షష్ఠిపూర్తిమహోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఆయన నాటకాలు, ఏకపాత్రలు, హాస్యోక్తులు వంటి కళా ప్రక్రియల్లో ప్రజల్నిఅలరిస్తుంటారు. ఎన్నోసార్లు వారి ప్రదర్శనలు తిలకించి ఆనందపడ్డాను. వ్యక్తి గతంగా చాలా సంవత్సరాలుగా నాకు మంచి స్నేహితులు. పట్టణ అభివృద్ధి విషయంలో ఆయన నిరంతరం తన అభిప్రాయాలను చెబుతుంటారు. ఆయనకు ఈ సందర్భముగా శుభాకాంక్షలు తెలియచేస్తూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
మంగళాశాసనాలు
...త్రిభాషా మహా శతావధాని,
ప్రణవ పీఠాధిపతి
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్
ప్రణవ పీఠం, రామానగర్, ఏలూరు
పవిత్ర మనస్కుడు శ్రీ సూరంపూడి వేంకటరమణగారితో నాకు 1989 నుంచి పరిచయం ఉంది. మా అవధానాలలో పృచ్ఛకులుగా పాల్గొనడమేకాక, అవధానాలను అపూర్వ రీతిలో ప్రాచుర్యం పొందేలా వ్యాసాలు రచించి, అవధానానికి సత్కీర్తిని ప్రసాదించిన రమణీయ హృదయం శ్రీ రమణగారిది. ఈయన ఉపాధ్యాయుడు, నిరంతరాభ్యాస శీలి, సహృదయుడు. తన సొంత డబ్బుతో అవధానులను చాలామందిని ఎన్ని విధాలుగా సత్కరించినాడో నేనెఱుగుదును. కేవలం పృచ్ఛకునిగా పేరు పత్రికలలో రావడం తప్ప, ఎన్ని చేసినా తన పేరుని పత్రికలలో ప్రకటించుకోని అమాయక చక్రవర్తి. కవితాభిమానంతో, ఎన్ని పనులున్నా మానుకొని, కవి పండితుల కార్యక్రమాలన్నింటికీ వచ్చి, యధాశక్తి సత్కరించి వెళ్ళే మా రమణకు షష్టిపూర్తి అంటే ఆశ్చర్యం, ఆనందం. "కాలోహి దురితక్రమ." అన్నారు కదా! భవిష్యత్తులో శ్రీ రమణగారి "సహస్రచంద్ర దర్శనాని"కి నాకు పిలుపు వస్తుందనీ, అప్పుడుకూడా మా ముగ్గురమ్మలు కొలువై ఉన్న ప్రణవపీఠం నుండి మంగళాశాసనం అందించగలననీ నా నమ్మకం. శ్రీ రమణగార్కి సకల శుభాలు కలగాలని మంగళాశాసనాలు చేస్తున్నాను.
శా|| సూరంపూడి కులాబ్జ భాస్కరుడు, సుశ్లోకుండు, విద్యారసా
కారుండున్, రమణాఖ్యు డార్యజన విఖ్యాతుండు, సన్మిత్రు డం
హోరాశి ప్రగతి ప్రచండుడును, సంధ్యోపాసనా ప్రీత చే
తో రమ్యుండగు వేంకట ప్రదితుడందున్ సంపదౌన్నత్యముల్
విషయసూచిక
1 |
7 |
23 |
31 |
35 |
38 |
42 |
49 |
55 |
వ్యాసాల మధ్యలో "సం"గతులు, రవణావతారాలు, లేఖాక్షతలు గుదిగుచ్చి అల్లిన మాల ఇది.
This work is released under the Creative Commons Attribution-Share Alike 4.0 International license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed—and if you alter, transform, or build upon this work, you may distribute the resulting work only under the same license as this one.