ఆనందం మనిషైనవాడు/హాస్యచతురుడు వెంకటరమణ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

హాస్యచతురుడు వెంకటరమణ

అడ్డగర్ల వెంకటేశ్వరరావు,

కళాకారుడు,

విశ్రాంత ప్రధానోపాద్యాయుడు, తాడేపల్లిగూడెం.

తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో అక్షరదీక్షాప్రచార కార్యక్రమం జరుగుతోంది. అది నాలుగు రోడ్లకూడలి. అక్కడ చుట్టూ జనం గుముగూడి ఉన్నారు. "మోసం" అనే నాటిక ప్రారంభమైంది. 'ఒరే ఎంకటేశూ! ఎక్కడున్నావురా' అని ఓ తండ్రి అరుపులు. అందరూ అటువైపు చూస్తున్నారు. తప్పుకోండెహ మా ఎంకటేశు కనిపించాడా... ఏరా సుబ్బయ్యా! అన్నాడు. వాళ్లంటున్నారు ఉండెహె! ఇక్కడ మాస్టార్లు నాటకాలేత్తున్నారు!

వ్యాసకర్త వెంకటేశ్వరరావుతో రమణ హాస్యవల్లరి

అని విసుక్కుంటున్నారు. ఆ వ్యక్తి జనాన్ని తోసుకుంటూ ప్రదర్శన ప్రాంతానికి వచ్చేశాడు. ఒరే బాబా ఇక్కడున్నావా? అంతా ఎతుకుతున్నాన్రా! అంటూ కొడుకు పాత్రధారి చేతులు పట్టుకున్నాడు. అప్పటికి అందరికీ అర్దమైంది. జనాన్ని గెంటుకుంటూ వచ్చిన వ్యక్తి సూరంపూడి వెంకటరమణ మాస్టారని. అందరూ నవ్వుకుంటూ చప్పట్లుకొట్టారు. ఇంతకీ ఈ నాటికలో కొడుకు పెద్ద చదువులు చదువుతున్నానని మోసం చేస్తాడు. మోసపోయిన తండ్రి పాత్రలో చివర్న రమణ జనంచేత కంటతడి పెట్టించేవారు. ఇలా నాటికల్లో, లఘు హాస్యనాటిక (స్కిట్స్)ల్లో నటిస్తూ కడుపుబ్బ నవ్విస్తుంటారు. చిన్న పాత్ర అయినా, పెద్దదైనా సంభాషణ, ఆహార్యం వంటి విషయాల్లో ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. మేము అక్షరదీక్ష, నిరంతర విద్యా కేంద్రాలు ఏర్పాటు సందర్భంగా గూడెం మండలంలో కళాయాత్రలు చేశాం. పగలంతా పాఠశాలలో కష్టపడి పనిచేయడం, రాత్రి 11:00 గం||ల వరకు గ్రామాల్లో ప్రదర్శనలివ్వడం, ఇలా ఈ యజ్ఞంలా మా ప్రదర్శనలు సాగేవి. దీనితోపాటు తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరు వేదికలపై మేమిద్దరం వందలాది స్కిట్స్ ప్రదర్శించాం. అప్పటికప్పుడు స్కిట్ సిద్ధంచేయడం ఆయన ప్రత్యేకత. విమానాశ్రయ పాదచారుల సంఘం నెలవారీ కార్యక్రమాల్లో మా స్కిట్స్ ప్రదర్శనలు ఓ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. మా ఇద్దరిలో ఎవరు ఆ కార్యక్రమానికి వెళ్లకపోయినా ఆ సంస్థ సభ్యులు ఫోన్లుచేసి అడుగుతుంటారు. రమణ నన్ను బావగారూ అని ముద్దుగా పిలుస్తారు. నేనైతే బావగారు, అల్లుడుగారు అని పిలుస్తుంటాను. ఆయన పనిచేసిన పాఠశాలల్లో విద్యార్ధులను మంచి కళాకారులుగా తీర్చి దిద్దడం ఆయన ప్రత్యేకత. వార్షికోత్సవ కార్యక్రమాల్లో గ్రామ యువకుల్ని కూడా భాగస్వాముల్ని చేసి వారిచేత కూడా ప్రదర్శనలు ఇప్పించడం విశేషం. గణపవరం మండలంలో కూడా రమణ అక్షరదీక్ష కార్యక్రమాల్లో బాగంగా వీధి నాటికలు వేసి అక్షరాస్యత అభివృద్ధికి విశేష కృషిచేశారు.
  • వెంకటేశ్వరరావు చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్రధారిగా రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలలో పేరు పొందిన నటులు. ప్రధానోపాధ్యాయునిగా ఉద్యోగ విరమణ చేసి రంగస్థలంపై నటిస్తూ కళాకారుల సంఘంలో కోశాధికారిగా సేవలందిస్తున్నారు.

రియాలిటీ షో

అది రామచంద్రాపురం (తూ||గో||జిల్లా) బస్టాండ్. అప్పటికి రాత్రి 8:00 గంటలైంది. ఓ వ్యక్తి గట్టిగా కేకలేయడం మొదలుపెట్టాడు. "దమ్ముంటే రండెహే" అని అరుస్తున్నాడు. కొందరు అతని వాలకం చూసి కంగారు పడుతున్నారు. కొందరు నవ్వుకుంటున్నారు. ఆ గుంపులో ఉన్న ఇద్దరు "ఒరేయ్ ఇందాక స్టేజి మీద మిమ్రికీ చేసిన లెక్చరర్ ఆయనే కదరా, ఏం చదివితే ఏం లాభం, అప్పుడే తాగేసి గందరగోళం చేస్తున్నాడు చూడు" అనుకుంటున్నారు. కొంతసేపు అయ్యాక ఆ వ్యక్తి శాంతించాడు. అప్పుడు "ఏం రవణా ఎలా ఉంది మినీ రియాలిటీ షో" అనడంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. "ఇదంతా సరదాగా చేసిన పనా" అన్నారు వారిలో కొందరు. అత్తిలి డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తూ వందలాది వేదికలపై నాటికలు, మిమిక్రీ షోలు చేసేవారు. సినీ హాస్యనటుడ్సుబహ్మానందం, తనప్రియ శిష్యుడైన వెంకటరమణను కూడా తీసుకెళ్ళి తాను మిమిక్రి చేసేముందు రమణతో ఏకప్రాతలు చేయించేవారు. అలా రామచంద్రాపురం వెళ్ళినపుడు జరిగిన సరదా సంఘటనే ఇది. "రవణా నేను ఇపుడో తమాషా చేస్తా చూడు, నేను తాగినట్టు నటిస్తాను, నువ్వు నన్ను పట్టుకుని ఆపుతున్నట్టు నటించు" అంటూ బస్టాండ్‌లో తాగినట్టు హడావిడి చేశారు.

సినీనటుడు కాకముందు బ్రహ్మానందం, మిత్రుడు పెమ్మరాజు శ్రీనివాస్‌లతో వెంకటరమణ (1978)

ఇక ఇకలు పోతే ఊరుకోను

అవి అత్తిలి మండలం స్కిన్నెరపురంలో రామలింగేశ్వరస్వామి కళ్యాణోత్సవాలు జరుగుతున్న రోజులు. ఆరోజు అత్తిలి లెక్చరర్ బ్రహ్మానందం (ప్రస్తుత ప్రముఖ సినీ హాస్యనటుడు) మిమిక్రీ ఏర్పాటు చేశారు. కంచుమర్రు, ఆరవల్లి, కోరుకొల్లు గ్రామాల ప్రజలుకూడా ఆ కార్యక్రమ్మానికి వచ్చారు. సభ కిటకిటలాడుతోంది. బ్రహ్మానందం మిమిక్రీ మొదలైంది. అయిదు నిముషాలు అయింది ఒక్కరూ నవ్వడంలేదు, పది నిముషాలైనా అదే పరిస్థితి. నవ్వొస్తోంది కాని గుప్పెట్లోమొఖం దాచుకొంటున్నారు. ఆయన వెంటే ఉన్న సూరంపూడి వెంకటరమణను బ్రహ్మానందం పిలిచారు. "ఇదేమిటి రమణా ఇన్ని జోకులు వేసినా ఒక్కరూ నవ్వరేమిటి? విషయం కనుక్కో" అన్నారు. జనంలోకి వెళ్ళి ఎందుకు మీరు నవ్వడంలేదు? అని అడిగితే సత్యంగారు (ఆవూరి పెద్ద, అనంతర కాలంలో జడ్. పి. చైర్మన్) ఇక ఇకలు పోవద్దన్నారు. వచ్చే ఆయన పెద్ద లెక్చరర్‌గారు పిచ్చ పిచ్చగా నవ్వితే ఊరుకోను అని మైక్‌లో చెప్పారట. అప్పటికి మిమిక్రీ అంటే అవగాహన లేకపోవడమే కారణం. అప్పుడు రమణ సత్యంగారి దగ్గరకు వెళ్ళి "ఇది నవ్వుకోవలసిన కార్యక్రమమండి కాస్త మీ వాళ్ళకు చెప్పండి" అని చెప్పారు. వెంటనే ఆయన వేదిక ఎక్కి "ఇది నవ్వుకొనేప్రోగ్రామ్‌అంటామీరు నవ్వుకోవచ్చు" అనడంతో నవ్వులు ప్రారంభమయ్యాయి. ఇక బ్రహ్మానందంగారు బ్రహ్మానందమే పొదారు.