ఆనందం మనిషైనవాడు/మా ఇంటి మెగాస్టారు - మా మంచి మాస్టారు

వికీసోర్స్ నుండి

మా ఇంటి మెగాస్టారు - మా మంచి మాస్టారు

కలిగొట్ల వెంకట శ్రీనివాసన్

సమాజానికి కొన్ని కొలతలు, లెక్కలు మాత్రమే అర్ధమవుతాయి. ఒకడు గొప్ప యోగి అన్నామంటే జనం కాషాయ కమండలాలో, కనీసం కొల్లయో ఊహించుకొని ఇహ బంధాలు తెంచుకున్నాడు అన్నట్టు ఉహిహించుకుంటుంది. ఆయన ఒక ఫిలాసఫర్ అంటే పేజీలకు పేజీలు తత్త్వం గురించి రాస్తునో, ఉపన్యసాలు ఇస్తూనో ఉంటారని ఆశిస్తుంది. అలాగే హీరో అంటే ఒంటి చేత్తో వందమందిని మట్టి కరిపించడం గురించి ఊహిస్తారేమో. ఐతే అవేవి అవసరం లేదు. సంసారిగా ఉండి అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూనే కర్మయోగిగా నిలిచే వారున్నారు. తన చిన్ని జీవితాన్ని జీవించడంలో తనకంటూ కొన్ని సూత్రాలు నిర్మించుకొని లక్షల మంది జీవితాలకు దిశను నిర్దేశం చెయ్యగల ఫిలాసఫర్స్ ఉన్నారు. తను తిట్టినవాడిని తిరిగి చిన్నమాట అనకుండా చిరునవ్వుతో బదులిచ్చి మట్టి కరిపించిన హీరోలు ఉంటారు. నా జీవితంలో అత్యంత దగ్గరగా చూసిన యోగి, ఫిలాసఫర్, హీరో - మా మావయ్య సూరంపూడి వెంకటరమణ. నిజానికి ఆయన తన జీవితానికి ఓ ఫార్ములా తయారు చేసుకున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా దాన్ని అచ్చంగా అమలు చేసుకున్నారు. అలాగని జీవితాన్ని ఆస్వాదించడం మాననూలేదు. ఇదంతా ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలుసుకుని, జెన్ ఫిలాసఫీ చదువుకుని తెచ్చిపెట్టుకున్నది కాదు. తనను తానూ అన్వేషించి దర్శించే మహర్షిలా తన జీవితాన్ని అనుభవించి తనదైన ఒక జీవన విధానాన్ని దర్శించారు. ఆ ఫార్ములా పూర్తిగా ఆయనలోంచి వచ్చినదే. ఆయన వ్యక్తిత్వం చూసి తెలుసుకుని కొన్ని అంశాలలో స్పూర్తి పొందిన చాలమందిలో నేనూ ఒకణ్ణి. ఆ విషయాలు పదిమందితో పంచుకుంటే మరికొందరికి ఉపయోగమని నమ్ముతూ ఈ వ్యాసం రాస్తున్నాను.

మావయ్య చిన్నతనం పూర్తిగా పేదరికంలో సాగింది. తండ్రి చనిపోతే అన్నయ్యలతో ఉమ్మడి కుటుంబంలో పెరిగాడు. చదువుకోవడమే కష్టమైన దశలో ట్యూషన్లు చెప్పుకుని చదివాడు. ఆ తర్వాత ప్రభుత్వోద్యోగం వచ్చి తన కాళ్ళ మీద తానూ నిలబడి, ఉమ్మడి కుటుంబం ఎవరి దారి వారిది అయిపోయాకా కూడా కుటుంబంలో అందరికీ అండగా నిలబడిన దగ్గర నుంచీ నాకు తెలుసు. ఎవరు ఏం అన్నారు, ఏమనుకున్నారు లాంటివి ఆయనకు చాలా చిన్న విషయాలు. ఎవరికీ ఏం కావాలి, వారికి తాను ఏం చెయ్యాలి అనేది తనకి ముఖ్యమైన విషయం. తనకన్నా పెద్దవాళ్ళు అందరినీ కొడుకులా చూసుకునేవాడు, తనకాన్నా చిన్నవాళ్ళని సొంత తండ్రిలా చూసేవాడు.

రోజురోజుకూ అరుదైపోతున్న ఆత్మీయతానురాగాలకు ఆయన నిలువెత్తు రూపం. చెల్లెలి పిల్లలా, అన్నయ్య పిల్లలా, అక్క పిల్లలా, సొంత పిల్లలా అన్న తేడా ఎక్కడా మచ్చుకైనా కనిపించేది కాదు. పిల్లలు ఎవరైనా పిల్లలే. మరీ మాట్లాడితే చెల్లెళ్ళు కూడా పిల్లలే అన్నట్టుగా ఉంటుంది ఆయన వ్యవహారం. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆయన తన తల్లిని చూసుకున్న పద్దతి. మావయ్య వాళ్ళ అమ్మని ప్రేమించి చూసుకున్న పద్ధతిలోనే ఆయన వ్యక్తిత్వం తెలుస్తుంది. మా అమ్మమ్మ ప్రారంభంలో ధనవంతులే అయినా జీవితమంతా కష్టాలు, పేదరికం అనుభవిస్తూ, వృద్ధాప్యంలో మాత్రం మావయ్య దగ్గర చాలా సంతోషం అనుభవించింది. విలువనివ్వడం, ఆరోగ్యం చూసుకోవడం, ప్రేమగా మాట్లాడడం ఇలా ఏం చూసినా ఆవిడకి జీవితం స్వర్గంగా చేసాడు. వాళ్ళు అద్దె ఇల్లు వెతుక్కునేటప్పుడు పెద్ద వయసు ఉన్న మనుషులు ఉంటే ఇల్లు ఇవ్వం అని కొందరు ఇంటి ఓనర్లు కండిషన్ పెట్టేవారట. ఆ మాట వింటే మాత్రం శాంతమూర్తి అయినా అగ్రహోదగ్రుడు అయి పోయేవాడట. తన తల్లిని మాట అనే అవకాశమే ఇవ్వకూడదన్న కారణంతో ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్న రోజుల్లో తెగించి ఇల్లు కొనేశాడు. ఎవరైనా పెట్టుబడిగానో, స్వంత కారణాలతోనో ఇల్లు కొంటారు. తల్లికోసం ఇబ్బందులు పడి మరీ ఇల్లు కొనడం ఎక్కడైనా ఉందా? ఆ ఇబ్బందుల్లోనే ఆయన ఏటేటా మా అమ్మమ్మ పుట్టినరోజును పెద్ద పండుగలా చేసేవాడు. తన పుట్టినరోజు ఎప్పుడూ జరుపుకోని మావయ్య తల్లి పుట్టినరోజు మాత్రం క్రమం తప్పకుండా చేసేవాడు. ఇంతకీ విచిత్రం ఏమిటంటే ఒక పుట్టినరోజు పండుగలో మా అమ్మమ్మ అనారోగ్యానికి వైద్యం చేస్తున్న హాస్పిటల్‌లో అమ్మమ్మని బాగా చూసుకున్న డాక్టరుకేకాక నర్సుకు, కాంపౌండర్‌కి సన్మానం చేసి గౌరవించారు.

కష్టనష్టాలు ఎదురైనా ఇంటిపేరు, ప్రఖ్యాతులు నిలబెట్టేలా ప్రవర్తించడం ఆయన వ్యక్తిత్వంలోని మరో ప్రధానాశం. కష్టం మనిషికి గీటురాయి. నుజంగా బంగారమేదో, కానిదేదో ఆ గీటురాయి చెప్పేసినట్టే ఈ కష్టం మనిషిని పరీక్షిస్తుంది. ఆ పరీక్షలో ప్రతీసారీ మావయ్యే నెగ్గాడు. ఎన్ని పనులు చుట్టుముట్టినా, మిన్ను విరిగి మీద పడినా తానూ చెయ్యాల్సినదేదో చేసుకుపోడమే ఆయన మూలతత్త్వం. ఎవరైనా సాయం అర్ధిస్తే తన కష్టనష్టాలు ఆయనకు ఎప్పుడూ గుర్తుకురావు. సహాయం చెయ్యడం తన ధర్మమైతే చేసుకుపోయేవాడు.

అలాగే ఆయనకంటూ ఒక స్వంత సిద్ధాంతం, వ్యక్తిత్వం ఉన్నాయి. తండ్రిగా, భర్తగా, కొడుకుగా, బంధువుగా, బడి మాస్టారుగా, ఇప్పుడు విశ్రాంత ఉద్యోగిగా తన సిద్దాంతాన్ని అన్ని పాత్రలకూ, పరిస్థితులకు అన్వయించుకుని జీవిస్తాడు. ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు వేరైనా, పరిస్థితులు మారినా మారొచ్చుగాక ఆయన వ్యక్తిత్వం మాత్రం సమున్నతంగా నిలబడే ఉంది. అది నీళ్ళలా ఎందులో పోస్తే దానిలా మారేది కాదు, రాయిలా ఏం వచ్చినా చలించనిదీ కాదు. అది ప్రత్యేకం. ఆయన సిద్దాంతం/త్వాత్త్వికత వేలిముద్రలా అత్యంత విశిష్టం. గొప్ప నాయకులు, తత్త్వవేత్తలు, రచయితలూ, కళాకారులు మాత్రమే అలా జీవన తాత్త్వికత తయారు చేసుకో గలుగుతారు. మిగిలిన వారంతా అనుసరించి తీరాల్సిందే. సొంతంగా ఒక జీవన తాత్త్వికత కలిగిన ఆ కోవకే చెందినవాడు మా మావయ్య. పైగా నా సిద్ధాంతం ఇది అని ఎప్పుడూ ఎవరికీ చెప్పేవాడు కాదు. చేసుకుపోవడమే తప్ప నా జీవన వేదాంతం ఇది అని ఆయనకే తెలిదేమో. ఆయన ఆదర్శాలు నోటితో కాక చేతలతోనే చెప్పారు. జీవితాన్ని సరళంగా ఉంచుకోవడం, నిజాయితీని విడిచిపెట్టక పోవడం, ఎవరినీ బాధ పెట్టకపోవడం, తను ధర్మమని భావించింది. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా చేసి తీరడం లాంటివి కొన్ని లక్షణాలు.

రచ్చ గెలిచేవారు చాలామంది ఇంట గెలవలేరు. ఎందుకంటే బయట సమాజాన్ని, దూరంగా ఉండే బంధుమిత్రులు ప్రభావితం చేయడానికి వారి సమయం ఖర్చైపోగా పిల్లలతో మాట్లాడేందుకు కూడా సమయం ఉండదు. ఐతే మావయ్య ఇంట గెలిచాకే రచ్చ గెలిచాడు. ఆయన వ్యక్తిత్వం, నిబద్ధత తనతోనే మిగిలిపోలేదు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన పిల్లలు కూడా నిజమైన వారసులుగా తయారవ్వడం విశేషం. తాను ఎక్కడికి వెళ్ళినా పిల్లలను తనతోపాటుగా తీసుకువెళ్ళడం, తనకు తెలిసిన గొప్ప వ్యక్తులతో పరిచయం చేయడం లాంటివి చేయడంతో పిల్లలు కూడా ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఆణిముత్యాల్లా తయారయ్యారు. పైన చెప్పిన మిగిలిన అన్ని చేయవచ్చు కానీ ఈ పని చేయడం మాత్రం సాధారణమైన విషయం కాదు. గొప్ప గొప్ప వ్యక్తులు చాలామంది పిల్లలను తమంత గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్ధడంలో ఫెయిల్ అయినవారే. కోట్లాది మందిని ప్రభావితం చేయగలిగిన నాయకులనే తన ఏకలవ్య శిష్యులుగా చేసుకున్న గాంధీజీ సొంత కొడుక్కి ఆదర్శాన్ని, దాన్ని ఆచరించడంలో ఉన్న గొప్పదనాన్ని వివరించలేకపోయారు. ఆ లోటు కూడా మా మావయ్యకు లేదు.

అన్నలు వదినలతో రమణ దంపతులు

జీవితంలో ఆటు పోట్లు ఎదుర్కొన్న వాళ్ళు చాలామంది మూస మనుషులు అయిపోతుంటారు. తమ చిన్ననాట అనుభవించిన కలలను చిదిమేసుకుంటూ పోతారు. ఐతే మావయ్య కఠినమైన జీవితాన్ని అనుభవిస్తూ, బాధ్యతలు బంధాలు నిర్వర్తిస్తూనే చివరకు తనకు ఆసక్తి ఉన్న కళారంగాన్ని కూడా వదులుకోలేదు. పగలంతా స్కూల్లో, సాయంత్రాలు హడావుడి పనుల్లో, ఆపైన రచన వ్యాసంగంలో రోజంతా కరిగిపోయినా రాత్రి పన్నెండు గంటలకు నాటకాల రిహార్సల్స్‌కి వెళ్లి తెల్లవారుజామున ఇంటికి వచ్చేవాడు. ఐతే అదేమీ ఆయన ఇబ్బందిపడుతూ చేసినపనికాదు. ఆయన కావాలని ఆస్వాదిస్తూ చేశారు. కొందరు యోగా చేసినట్టుగా ఆయన కళలో శాంతి వెతుక్కున్నారని అనిపిస్తుంది నాకు. హాస్యంతో అందరినీ అలరించే మావయ్య తనని రీచార్జ్ చేసుకుంటాడు. ఆస్వాదిస్తూ చేయడంవల్ల కావచ్చు చాలా గొప్ప కళాకారుడు ఆయన. కళ కేవలం ప్రదర్శించేదే కాదు. నిత్యజీవితంలో ప్రతి అంశంలోనూ ఆయనకి కళాత్మకంగా జీవిస్తారు. తెలుగుపై ఎంత ప్రేమంటే ఆయన ఇల్లే తెలుగు లోగిళ్ళకు అసలైన అర్ధం అనిపిస్తుంది నాకు. ఆ ఇంట్లో వినిపించేది కనిపించేది అంతా తెలుగుదనమే.

చివరగా నాకు ఆయనలో ఆశ్చర్యం రేకెత్తించే విషయం ఏంటంటే పైన చెప్పినవన్నీ చేస్తూనే జీవితాన్ని నవ్వుతూ ఆస్వాదించడం. కష్టాల్లో, సమస్యల్లో, సమయం లేని సందర్భాల్లో కూడా తనను తాను సంతోషంగా ఉంచుకోగలగడం. పెద్ద పెద్ద హోదాల్లో పనిచేస్తూ, విపరీతంగా సంపాదించుకుంటూ కూడా తామేదో దారుణమైన కష్టం పడిపూతున్నాం అన్న భ్రమలో ఉండేవాళ్లనే ఎక్కువ చూస్తున్నాం. తను చేసే పనిలో ఉన్న స్ట్రెస్ కుటుంబం మీద చూపించి ఇంటిని నరకంగా మార్చుకునే వాళ్ళూ ఉన్నారు. కానీ నిజమైన కష్ట నిష్టూరాలు అనుభవిస్తూ అవకాశం ఉన్నా అవినీతి వైపు కన్నెత్తి చూడకుండా అత్యంత నియమబద్ధమైన జీవితం జీవిస్తూ కూడా మావయ్య అదేదో పెద్ద కష్టం అనుకోలేదు. రోజుకు ఇరవై, ముఫ్పై కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్ళినా ప్రయాణంలో ఆనందాలను ఆస్వాదించాడు. ఏ రోజూ సంతోషాన్ని చెరిగిపోనివ్వలేదు. ఉన్న కొంత సమయాన్ని, కాస్త డబ్బునీ, కొద్ది అవకాశాన్నీ జీవితం జీవించేందుకు, పక్కవారికీ సంతోషం పంచేందుకు ఉపయోగించాడు. కష్టాలు ఎదుర్కొనేటప్పుడు చిరునవ్వు నవ్వగలిగిన వాడినీ, తను నమ్మిన విలువల కోసం తనను తానూ గెలవగలిగిన వాడిని, ఏమున్నా ఏమి లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండగలిగిన వాడినీ హీరో అనొచ్చు అని ఒప్పుకుంటే మా మావయ్య మెగాస్టార్.


  • వ్యాసకర్త ఐ. సి. డబ్ల్యు. చదివి అక్కౌంట్స్, సాప్ట్‌వేర్ నిపుణునిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం విప్రోలో లీడ్ కన్సల్టెంట్ హోదాలో ఉన్నారు. శ్రీనివాసన్ వెంకటరమణ మేనల్లుడు. చిన్నతనం నుంచి ఆయనను దగ్గరగా చూసిన వ్యక్తి.

"సం"గతులు

తారుమారు

"హలో అన్నయ్యా...! ఎక్కడున్నావ్‌రా? ఇందాకట్నించీ చచ్చి పోతున్నాను" అంటూ రోడ్‌పైకి సైకిల్‌మీద వెళ్ళగానేఫోన్. "ఎక్కడేంటీ గూడెంలోనే ఉన్నాను. ఇప్పుడే బయటకు బయల్దేరాను" అన్నాను. "గూడెమా?" అని అవాక్కయి. "అయితే రాంగ్ నెంబరండీ" అంటూ ఫోను పెట్టేసింది.

నేను మరలా 4 నిమిషాలు సైకిల్ తొక్కి బస్టాండ్ దగ్గరకు చేరుకున్నాను. మళ్లీ ఫోను మోగింది. "ఒరే అన్నయ్యా ఎక్కడున్నావురా"

"బస్టాండ్ దగ్గరమ్మా"

"ఇందాక నేను చేసానురా ఎవరికి వెళ్ళింది? పోన్లే ఇప్పుడైనా నువ్వే ఫోను ఎత్తావు"

"ఇంతకీ నీ పేరేంటమ్మా"

"పేరా? రమాదేవి"

"నాకు రమాదేవి అన్న చెల్లెలు ఉన్నమాట నిజమేగాని నేను మాత్రం మీ అన్నయ్యని కాదు. నాపేరు వెంకటరమణ, మాది తాడేపల్లిగూడెం. "అయ్ బాబోయ్ మళ్ళీ మీరా".

ఇంకో పది నిమిషాలు గడిచి పైర్ స్టేషన్ దగ్గరకు వెళ్తే మళ్లీ ఫోన్.

"ఒరేయ్ అన్నయ్యా పొద్దుటినించీ సచ్చిపోతున్నాను రా. నీకు ఫోన్ చేస్తోంటే ఎదవ సచ్చినోడు ఎవరో ఎత్తుతున్నాడురా"

"ఆ ఎదవ సచ్చినోణ్ణి నేనే. మీ అన్నయ్యని కాదు".

అయ్యో మీరా! సారీ అండీ. అంటూ ఫోన్ కట్ చేసింది.

ఈ సంఘటన అక్కడితో అయిపోయిన ఇదే సంభాషణ ఎందరో ప్రేక్షకుల నవ్వులు పూయించింది. రమణ స్క్రిప్ట్‌గా, జోక్‌గా మలిచి ఎన్నెన్నో వేదికలపై ప్రదర్శించారు. అనుభవించేటప్పుడు చిరాకైనా, ప్రదర్శించేటప్పుడు పదిమందిని నవ్వించిన తృప్తి మిగులుతుంది.

రవణావతారాలు:

తమ్మా సత్యనారాయణ

కళాకారునిగా...

                                       తే|| అక్షరాస్యత కోసమై అభినయించి,
                                             నవ రసమ్ములు పండించు నటన జూపి;
                                             శిష్యులకు నేర్పి, సత్కాళాసేవజేసి,
                                             వృద్ధనటులకు జీవనవృద్ధి సలిపె!!

టి. వి. సీరియల్ షూటింగ్‌కు సిద్ధమవుతున్న దృశ్యం