ఆనందం మనిషైనవాడు/పరిపూర్ణ జీవితం - బహుముఖ ప్రతిభ

వికీసోర్స్ నుండి

పరిపూర్ణ జీవితం - బహుముఖ ప్రతిభ

...బుద్దాల వెంకట రామారావు,

కళాపోషకులు,

బి. వి. ఆర్. కళాకేంద్రం వ్యవస్థాపకులు

సాంప్రదాయ కుటుంబంలో రమణ మాస్టారు జయనామ సంవత్సరము బహుళ అష్టమి నాడు కీ॥ శే॥ సావిత్రమ్మ, పట్టాభిరామయ్య పుణ్య దంపతులుకు అత్తిలి మండలం కంచుమర్రు గ్రామంలో జన్మించారు. కంచుమర్రులో ప్ర్రాథమిక విద్య, మంచిలి, కోరుకొల్లు పాఠశాలల్లో మాధ్యమిక విద్య, అత్తిలి డిగ్రీ కళాశాలలో ఇంటర్, డిగ్రీ విద్యనభ్యసించారు. మచిలీపట్నంలో బి.ఇడి.ని పూర్తిచేశారు. తదనంతరం 1977లో పాత్రికేయ వృత్తిలో ప్రవేశించి 1980-81 మధ్యకాలంలో ఈనాడు సబ్ ఎడిటర్‌గా ఈనాడు దినపత్రికలో విజయవాడలో పనిచేశారు. 1983వ సం॥లో ఆగష్టులో బల్లిపాడులో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించేవరకు పాత్రికేయ వృత్తిని పూర్తిస్థాయిలో కొనసాగించారు.

విద్యార్ది దశలోనే కళారంగంపట్ల అనురక్తిని, ఆసక్తిని పెంచుకొని 10 ఏళ్ళ చిరు ప్రాయంలోనే అనేక సాంఘిక నాటికలకు దర్శకత్వం వహించడమేగాక, నటించారు. అంతేకాక అల్లూరి సీతారామరాజు వంటి చారిత్రక నాటకాలు, లక్ష్మమ్మ కథ, బాలనాగమ్మ వంటి జానపద , భక్త కన్నప్ప, సింహాచల క్షేత్రమహిమ వంటి పౌరాణిక నాటకాలలో నటించారు. "మొద్దబ్బాయి"గా సాంఘిక నాటికలో వందలకొద్దీ ప్రదర్శనలలో నటించి మెప్పించారు. ఆయన శిక్షణలో విద్యార్దులు, మూడు బృందాలుగా పరమానందయ్య శిష్యులు హాస్యనాటకాన్ని ప్రదర్శించారు. సందర్భోచితంగా ఎన్నో వేదికలమీద అప్పటికప్పుడు హాస్య లఘునాటికలను రచించి, ప్రదర్శించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. దూరదర్శన్, చలన చిత్ర రంగాలలో వారు ప్రాతినిధ్యం వహించి మన్య విప్లవం నాటికలో పిళ్ళైపాత్రను అద్భుతంగా పోషించారు. 'అల్లుడుపోరు అమ్మాయిజోరు' చిత్రంలో నటించి మెప్పించారు. సామాజిక బాధ్యతగా నిరక్షరాస్యత నిర్మూలనకై పరితపించి అక్షరదీక్ష, అక్షరగోదావరి, అక్షర మహిళ కార్యక్రమాలకు తనవంతు సేవలందించారు. సామాన్య జనానికి అర్దమయ్యేరీతిలో వీధి నాటకాలను రూపొందించి, నటించి ప్రదర్శించారు. నిరంతర విద్యా కేంద్రాల వ్యాప్తికి ప్రచార బాధ్యతను భుజాన వేసుకొని ఎన్నో కళా ప్రదర్శనలకు దర్శకునిగా, వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

సాహితీ సేవలో భాగంగా, ఎన్నో అవధాన కార్యక్రమాలలో "అప్రస్తుత ప్రసంగంచేసి ప్రేక్షకుల కరతాళధ్వనులందుకున్నారు. సాహితీ సమాఖ్య సభ్యునిగా, కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా, అధ్యక్షునిగా విశేష సేవలందించారు. సంక్షోభ సమయంలో సమాఖ్య కార్యక్రమాలకు ఆటంకం లేకుండా ముందుకు నడిపించారు. ఎందరో ప్రముఖ సాహితీవేత్తలను రప్పించి వారి అద్భుతమైన ప్రసంగాలద్వారా శ్రోతలను ఆనందింపజేయడంతో పాటు, వారికి ఘన సత్కారాలు చేశారు. భావితరాలకు భాషపట్ల, సంస్కృతిపట్ల, సాహిత్యంపట్ల అనురక్తిని కలిగించారు. ఆంధ్ర పద్యకవితా సదస్సు ఉపాధ్యక్షునిగా కంఠస్థ పద్యపోటీలు, వ్యాసరచన పోటీలు దిగ్విజయంగా నిర్వహించి విద్యార్థులకు దాతల సహకారంతో చక్కని బహుమతులందించారు. నన్నయభట్టారక పీఠం, ఇండియన్ కల్చరల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సేవా సంస్థలలో వివిధ హోదాలలో తమ సేవలందించారు. వారి రేడియో కథానిక 'కనువిప్పు', మినీ కవితల వికాసం వ్యాసం రచించి వినిపించగా ఆకాశవాణి, విజయవాడ కేంద్రంలో ప్రసారమైంది. పత్రికా సంపాదకునిగా, మధుమంజరి సాహిత్య పత్రికకు ఏడాదిపాటు సేవలందించారు. రేడియోలో కవితలు ప్రసారమయ్యాయి. వీరి రచనలు పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వీరి రచన 'ఎవడిగోలవాడిది' హాస్యనాటిక పలు ప్రదర్శనలిచ్చారు. బి.వి.ఆర్. కళాకేంద్రం నాటక కళాపరిషత్ నిర్వహణ కమిటీ సలహాదారుగా సేవలందిస్తున్నారు. తెలుగు భాషా ప్రాచీన హోదా కల్పించుటలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో పాల్గొని 62 తాళపత్ర గ్రంథాలను వెలుగులోనికి తీసుకొచ్చారు. పెంటపాడు మండల సమన్వయకర్తగా తమ సేవలందించారు. బల్లిపాడు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయవృత్తిలో ప్రవేశించినది మొదలు లింగారాయుడుగూడెం పాఠశాలలో ఉద్యోగ విరమణ వరకు విద్యార్థుల అభివృద్ధే ధ్యేయంగా అనేక కార్యక్రమాలను రూపొందించి, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. ప్రతిభావంతులైన పేద విద్యార్ధులకోసం దాతల సహకారమర్ధించి, వారికవసరమైన ఫీజులు పుస్తకాలు, టి.వి.లు, కంప్యూటర్లు దుస్తులు సమకూర్చారు. విద్యార్థుల శారీరక దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి అవసరమైన ఆటవస్తువులు, వినోద సాధనాలు, వ్యాయామ పరికరాలు, స్కూలులో పచ్చదనం, పరిశుభ్రతలో భాగంగా మొక్కలు పెంపకం, సాంస్కృతిక ప్రదర్శనలకు వేదికలను సమకూర్చారు.

ప్రయోగాత్మకంగా గొల్లగూడెం పాఠశాలలో దాతల సహకారంతో విద్యార్ధులకు సౌకర్యవంతంగా కుర్చీలందించారు. ప్రభుత్వానికి విధానాలు నచ్చడంతో సర్వశిక్ష అభియాన్ నిధులతో, పాఠశాలకు కుర్చీలను ఏర్పాటుచేసేలా ఉత్తర్వులిచ్చారు.

అనేక కారణాలతో పాఠశాల విద్యకు దూరమైన విద్యార్ధుల తల్లిదండ్రులను ఒప్పించి, విద్యార్ధులను స్కూళ్ళకు రప్పించారు. పాఠశాల విద్యార్ధులతో వార్షికోత్సవాలు, వనభోజనాలు నిర్వహించి, సమష్ఠితత్వాన్ని ఐక్యతను, సమానత్వాన్ని బోధించుటయేగాక ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శప్రాయుడయ్యారు.

ఉమ్మడి కుటుంబం నేపధ్యంలో పుట్టి పెరిగిన రమణ మాస్టారు అందరికీ ఆదర్శప్రాయంగా కుటుంబ ధర్మాన్ని నెరవేర్చారు. అన్నదమ్ముల పట్ల, అక్కచెల్లెళ్ళుపట్ల గౌరవంతో, ప్రేమతో, బాధ్యతతో వ్యవహరించారు. మాతృమూర్తికి ఆమె తుదిశ్వాసదాకా రమణ సాయిలక్ష్మి దంపతులు సేవలందించారు. అన్నదమ్ములపట్ల అవ్యాజమైన ప్రేమతో రెండో అన్న రామచంద్రుడుగారి మరణానంతరం, వదినగారు పోషనకు తగిన ఏర్పాట్లు చేశారు. సమాజానికి స్పూర్తిని కలిగించేలా మాతృమూర్తి సావిత్రమ్మ జన్మదిన వేడుకలు కుటుంబసభ్యుల, బంధుమిత్రుల, ఆత్మీయుల సమక్షంలో ఎంతో వేడుకగా జరిపేవారు. అక్కగారిపట్ల గౌరవభావంతో, ప్రేమతో, అక్క కుమార్తె సాయిలక్ష్మిని సహధర్మచారిణిగా స్వీకరించి, చక్కని సంతానాన్ని కుమారుడు పవన్ సంతోష్, కుమార్తెలు శ్రీ నాగవల్లి, మీనా గాయిత్రిలను పొందారు.

మానవతా వాదిగా సమాజంలో జరిగే అనేక విషయాలకు స్పందించి వాటికి స్వచ్చంద సంస్థల, దాతల, రాజకీయ ప్రముఖుల దృష్టికి తీసుకొని వచ్చి, వారి సహకారంతో పేదవారి కష్టాలను తీర్చడానికి అన్నివిదాల ప్రయత్నించేవారు. పేద కళాకారులకు ఆర్ధిక సత్కారాలను ఏర్పాటుచేయించే వారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహకారంగా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా అధ్యాత్మిక పీఠం, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్, బి.వి.ఆర్. కళాకేంద్రం, నటరాజ కళాపీఠం, రంగస్థల వృత్తి కళాకారుల సంక్షేమసంఘం, పాదచారుల సంఘం, యువకళామిత్రమండలి, దవళసత్యం కళామిత్ర మండలి, తులసీరాం, కె. కె. డి. ప్రసాద్ మిత్రమండలి, చైతన్య కల్చరల్‌యూనిట్, చిరుగులాబి, ఘంటసాల గానసభ, త్యాగరాజగాన సభకు వివిధ హోదాలలో తమ సేవలందించారు. కులమతాలకు, వర్గాలకతీతంగా సేవలందిస్తున్న సేవాపరాయణుడు.

తోటి ఉపాధ్యాయులపట్ల స్నేహధర్మంతో మెలగి, వారి కష్ట సుఖాలలో పాలు పంచుకొని, వారికి అవసరమైన సలహాలు, సూచనలు సహకారాన్ని అందించేవారుగా అధికార, అనధికారులకు తలలో నాలుకగా రమణ మెలుగుతుంటారు.

వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జరిగే అనేక వైద్య ఆరోగ్య రక్తదాన శిబిరాలలో పాల్గొని సేవలందించారు. తనకున్న బాధలను తనలోనే దాచుకుని, ఇతరుల సంతోషానికి అహర్నిశం శ్రమించే సౌజన్యమూర్తి వెంకటరమణ. ఆయనను ఎంత కీర్తించినా తక్కువే. ఆయనో బాధ్యతగల కుమారుడు. ఆదర్శప్రాయుడైన సోదరుడు. ఆయనో గొప్ప భర్త. సత్ససంతానానికి తండ్రి. కుటుంబ శ్రవణుడు, లక్ష్మణ ఏకలవ్యుడు, నిరంతరాన్వేషి, నిత్యవిద్యార్థి. ఆయన శాంతమూర్తి, చిద్విలాసి, చిదానందమూర్తి. ఆయనో ఉత్తమ ఉపాధ్యాయుడు. ఆయనో గొప్ప సాహిత్యాభిలాషి. ఆయనో కళాపిపాసి. ఆయనో గొప్ప సమాజసేవా పరాయణుడు. ఆయనో గొప్ప స్నేహశీలి. ఆయన సమాజ స్ఫూర్తిప్రదాత - మార్గదర్శి.

-- ఉత్తమ ఉపాధ్యాయుడుగా జిల్లాస్థాయిలో 2002లో, రాష్ట్రస్థాయిలో 2013లో పురస్కారాలందుకున్నారు. గ్రంథాలయ అభివృద్ధికి అత్తిలి గ్రంథాలయ అధ్యక్షునిగా అయ్యంకి వెంకట రమణయ్య పురస్కారమందుకొన్నారు.
-- విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలలో నాలుగుసార్లు బహుమతులందుకున్నారు.
-- ఆవంతిక రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ రాష్ట్రస్థాయి పురస్కారం.
-- బి.వి.ఆర్. కళాకేంద్రంచే ఉగాది పురస్కారం.
-- నవోదయా ఫ్రెండ్స్ యూనియన్‌వారిచే మహంకాళమ్మ పురస్కారం.
-- శ్రీ విద్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠాపురస్కారం.
-- నటరాజ కళాపీఠం గౌరవ సత్కారం.
-- యువకళామిత్ర మండలి సాహితీపురస్కారం.
-- కళాభారతి, విశాఖపట్నంవారిచే సత్కారం.
-- నెహ్రూ యువకేంద్రం, స్నేహ యువజన సంస్థ, నేర్పరి యూత్, ఎ. ఎస్. ఆర్. బి. ఇడి. కళాశాల వారిచే సత్కారం.
-- పెద్దింట్లమ్మ, మావుళ్ళమ్మ దేవస్థానాల వారిచే సత్కారాలు.
-- నిడదవోలు గ్రంథాలయ అభివృద్ధిసంస్థచే సాహితీ పురస్కారం.
-- జిల్లా సాంస్కృతిక మండలివారిచే జిల్లా కలెక్టరుగారిచే సత్కారాలు.

వీరి సేవా భావానికి, సాహిత్య, కళారంగాల, సమాజిక సేవలకు నిదర్శనాలు

వ్యాసకర్త కళాపోషకులు, అనేక సంస్థలకు గౌరవ అధ్యక్షులుగా వాటి అభివృద్ధికి కృషిచేస్తున్నారు. బి. వి. ఆర్. కళాకేంద్రం వ్యవస్థాపకునిగా రంగస్థల కళలను నిరంతరం పోషిస్తున్నారు.

టీచరుగా

                                    తే. బడుగు ఎరుకల పిల్లను బడిని జేర్చి -
                                        "ఎరుక" గల బోధనావృత్తి గరపినాడు!
                                        బాలుడొక కుంటి, వాని - "దుబాయి" పంపు -
                                        చదువు లందించె ఆదర్శ చదువులయ్య
                                        వృత్తియే దైవమనెడు ప్రవృత్తి - రమణ!!