ఆనందం మనిషైనవాడు/సేవా రమణీయం
సేవా రమణీయం
...వైబోయిన బాబులు
జిల్లా ప్రధాన కార్యదర్శి,
రంగస్థల కళాకారుల సంఘ అధ్యక్షుడు, తాడేపల్లిగూడెం.
కొంతమందికి పదవులు అలంకారం
కొంతమంది పదవికే అలంకారం
కొందరికి పదవులు అవసరం
కొందరు పదవులకు అవసరం
ఆ రెండో కోణానికి చెందినవారే మా "రమణగారు". 16 వత్సరాలనుండి కళాకారుల సంక్షేమ సంఘానికి వివిధ హోదాల్లో సేవలు అందిస్తున్నారు. కాని రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం 25వ వార్షికోత్సవం నిర్వహించడం, "రజత కమలం" సావనీరు (పుస్తకం) ఆవిష్కరించడం ఓ మైలురాయి. అది నిజానికి ఓ అద్భుతం. ఆ సమయంలో ఎవరు కార్యదర్శిగా ఉండాలనే సమస్య వచ్చినప్పుడు ఓ వ్యక్తిపేరు ముందుకు వచ్చింది, ఆయనే సూరంపూడి వెంకటరమణ. ఆయన కార్యదర్శిగా ఉండటానికి ముందు అంగీకరించలేదు. ఏమన్నారంటే "నా పరిచయాలను ఉపయోగించి సంఘానికి ఆర్ధిక సహాయం అందించవలసి వస్తుంద"ని ఆయన సంశయించారు. అయితే ఇంతకాలంగా అనేక పరిచయాలున్నా, ఏ ఒక్కర్నీ మా సంఘానికి ఆర్ధిక సహాయం చేయమని ఏనాడూ ఆయన కోరలేదు. అది ఆయనలోవున్న గొప్ప సుగుణం.
ఆయన సమర్ధత, పట్టుదల, కృషి, ఆలోచన, మా సంస్థకు అందించాలే తప్ప మరే విధమైన విషయాలలో జోక్యం చేయనక్కరలేదనే విషయాన్ని ఆయనకు చెప్పి, ఏమైనా ఆర్ధిక విషయంలో కావాలంటే నా పాట్లు నేను పడతాననే హామి రమణగార్కి ఇచ్చాకే ఎంతో ఆలోచించి రమణగారు కార్యదర్శి, సంస్థ కోశాధికారి పదవులను చేపట్టి సమర్ధవంతంగా వాటికి న్యాయం చేకూర్చారు. ఆపైన జరిగిన కార్యక్రమాలు, కళాకారుల సేవలు ఒక ప్రాధాన్యతను సంతరించు కున్నాయి.
రమణగారు తన కన్న తల్లిని, తన కుమార్తెను ఎంత అపురూపంగా చూసుకున్నారో, ఆ విధంగానే మాతృసంస్థ అయిన రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం విషయంలో ఎప్పుడు ఏ విధంగా సహకరించాలో ఆ విధంగా సహకరించి సంఘంలో తనకున్న సంబంధాన్ని చాటిచెప్పిన "మనీషి".
26వ వార్షికోత్సవం రోజు అది. వేదిక ఎదురుగావున్న కుర్చీలను రమణ శుభ్రం చేస్తుండగా చూశాను, ఎందుకు రమణగారు మీరు తుడవడమేంటి అని అడగ్గా ఆయన వెంటనే ఇది నా పని, నా సంస్థపని, నా స్వంతపని అని చెప్పిన సమాధానానికి నేను ఎంతగానో ఆనందపడ్డాను. ఆయన చేసే వృత్తి ఏమిటి, ఆయనకు సంఘంలో వున్న పలుకుబడి ఏంటి, అటువంటి వ్యక్తి ఈ కుర్చీలు తుడవడమేమిటి అని కృతజ్ఞతా పూర్వకంగా ఆయన వంక చూడటం నా పని అయింది.
రమణగారితో కళాకరంగంలో అనేక కళారూప ప్రదర్శనలు చేయడం, అలాగే టి. వి. సీరియల్స్‌లో "వేంగీ వైభవం" "నఱ్ఱవాడ వెంగమాంబ"లో కలిసి నటించడం, అంతేగాక ఆయన స్వీయరచన స్కిట్స్ (లఘునాటిక)లో చేసి ప్రజల ప్రశంసలు అందుకోవడం ఒక అపురూపమైన సమయం. సంఘంలో ప్రతిభా పురస్కారాలు (సన్మాన పత్రాలు) వ్రాయడం ఎంతో సమర్ధవంతంగా నిర్వహించారు.
ఈ సంఘం ఇంత అభివృద్ధి చెందటానికి ఈయన కృషి ముఖ్యం. ఒక వ్యక్తి ఒక్క రంగంలోనే అతని అదృష్టంకొద్ది రాణించడం జరుగుతుంది. అయితే రమణగారు విద్యారంగంలో, రచనా రంగంలో, కళారంగంలో, సేవారంగంలో రాణిస్తున్నారంటే అది ఆయన పూర్వజన్మ సుకృతం. అటువంటి సుకృతం ఉంటేగాని రాణించరు.
సినీ వినీలాకాశంలో తేజరిల్లుతున్న ప్రముఖ సినీనటులు బ్రహ్మానందం గారితో ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగానే మా కళాకారుల సంక్షేమ సంఘంలో ఉన్న సభ్యుడు పొన్నాడ వీరబ్రహ్మంగారితో మాట్లాడతారుగాని బ్రహ్మానందం గొప్పవాడని, పొన్నాడ వీరబ్రహ్మంగారు సామాన్యుడని ఎంచిచూడక సమభావంతో సంభాషించే సమతామూర్తి రమణ.
రమణగారి వ్యక్తిత్వం, ప్రవర్తనలో నిబద్ధత, విషయాలలో ఆయనను చూసి కొన్ని నేను అలవర్చుకున్నాను.
- వ్యాసకర్త రంగస్థల కళాకారుల సంక్షేమసంఘం, ప|| గో|| జిల్లా ప్రధాన కార్యదర్శిగా గూడెం మండలశాఖ అధ్యక్షునిగా కళాకారుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. రంగస్థలంపై గాయకునిగా, నటునిగా ప్రసిద్ధిచెందిన వ్యక్తి. టి. వి. ధారావాహికల్లో నటించారు.
"సం"గతులు
అదే గొప్ప అవార్డు
1983 నాటికి అత్తిలి మండలంలోని బల్లిపాడు శివారు పెదపాడు కుగ్రామం అనే పేరుకు నిదర్శనం. ఆనాటికి ఆ గ్రామంలో సంపన్నులు లేరు. అందరూ రెక్కల కష్టాన్ని నమ్ముకున్న పేదలే. ఐతే విద్య విలువ తెలిసిన మనుషులు కావడంతో చదువంటే ప్రాణం పెట్టేవారు.
అప్పుడే రమణ ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచరుగా చేరారు. అంతవరకూ ఏకోపాధ్యాయ పాఠశాల. పామర్తి సుబ్బారాయుడుగారు ప్రధానోపాధ్యాయులు. ఆయన రిటైర్‌మెంటుకు చేరువయ్యి, దూరాన తణుకు నుంచి సైకిల్‌పై రావాల్సి రావడంతో సెలవులు అవసరమయ్యేవి. అప్పటిదాకా ఒకడే ఉపాధ్యాయుడు కావడంతో సెలవులు పెట్టేవీలుకూడా లేక చాలా సెలవులు మిగిలాయి. రమణ చేరడంతో ఆయన రిలీఫ్ ఫీల్ అయ్యారు. ఆ సెలవులన్నీ ఉపయోగించుకుని స్కూలు భారం ఆయనకు అప్పగించారు.
నెలాఖరు రోజున స్కూలుకు వచ్చేవారు. నెల మొదటి, రెండు తేదీల్లో బిల్లులు, మంత్లీ రిటర్న్‌లు (ఎం. ఆర్.) తయారు చేసుకుని మళ్లీ మూడో తేదీ నుంచి సెలవుల్లోకి వెళ్ళిపోయేవారు. దీంతో దాదాపు నెలంతా ఏకోపాధ్యాయ పాఠశాల అయిపోయేది.
అయిదు తరగతులకు రమణే బోధించేవారు. ఆ ఊరుకి అన్ని వైపులా పుంతరోడ్లే ఉండేవి. మట్టిరోడ్లు కావడంతో వానవస్తే మోకాలు లోతు కయ్య అత్తిలికి మూడు కిలోమీటర్ల దూరంగా గుమ్మంపాడు లాకులున్నాయి. ఆ లాకుల మీదుగా గ్రామానికి రావాల్సివచ్చేది. పొడిగా ఉన్నప్పుడు సైకిల్‌మీద ఆయన ఎక్కితే... వాన పడగానే సైకిల్ ఆయన నెత్తిపైకి ఎక్కేది. స్కూల్లో ఉంగా వర్షం వస్తే సైకిల్ తలపైన పెట్టుకుని మోకాలు లోతు బురద నీళ్లలో నడిచి వెళ్లేవారు. ఏకోపాధ్యాయుడు కావడంతో ఏ రోజూ సెలవు పెట్టే వీలు లేదు. సెలవు పెడితే పిల్లల చదువు దెబ్బతింటుంది. దాంతో వర్షాకాలంలో వారానికి మూడు రోజులు సైకిల్‌తో సర్కస్ ఫీట్లు. మెడ వాలిపోయెలా మోసి ఇబ్బంది పడడం తప్పేదికాదు.
కొన్నాళ్లకి ఆయన కష్టం చూడలేక గ్రామంలోని యువకులు వంతులవారీగా వాన పడినపుడు సైకిల్ మోసి లాకుల దగ్గర దింపేవారు. కొన్నిసార్లు వాన పడినపుడు లాకుల దగ్గరకు చేరి ఆయన కోసం వేచివుండి తీసుకొచ్చిన సందర్బాలు ఉన్నాయి.
ఈ అభిమానం కొన్నాళ్లు బాగానే ఉన్నా తన కోసం మరొకరు ఇబ్బంది పడడం బాగోలేదని అనుకున్నారు. వర్షం వచ్చే సూచనలు కనిపిస్తే లాకుల దగ్గర ఉండే కిళ్ళీకొట్టులో సైకిల్ పెట్టి స్కూలుకు వెళ్ళడం మొదలు పెట్టారు.
ఇది జరిగిన ఐదేళ్లకు 2 స్కూల్లు ట్రాన్స్‌ఫర్ అయ్యి, దాసుళ్ల కుముదవల్లి అనే పూరి పాఠశాలలో పనిచేస్తుండగా మళ్లీ ఆ యువకులు అందరూ వచ్చారు. వాళ్ళ ఊరి పాఠశాలలో ఆయన చేరి పూర్వ వైభవం తీసుకు రావాలని కోరిక. కాని ఆయన పనిచేస్తున్న డి. కుముదపల్లి వదిలి వెళ్లదలుచుకోక పోవడంతో వాళ్లు బతిమాలి, బతిమాలి వెళ్లిపోయారు.
రవణావతారాలు:
...తమ్మా సత్యనారాయణ
అవధాన పృచ్ఛకునిగ
తే|| సాహితీ సమరాంగణ సభల లోన -
నిగ్గుదేలిన అవధాన దిగ్గజముల -
కలచు అప్రస్తుతాంకుశములను గ్రుచ్చి,
వాసికెక్కిన పృచ్ఛక వరుడు - రమణ!!
పుస్తకావిష్కరణ సభలో ప్రసంగిస్తున్న రమణ.
ప్రముఖ గురుసహస్రావధాని డా. కడిమెళ్ళ వరప్రసాద్
తదితరులతో...