ఆనందం మనిషైనవాడు/అవధాన విందులో అప్రస్తుత వడ్డన

వికీసోర్స్ నుండి

అవధాన విందులో అప్రస్తుత వడ్డన

...చక్రావధానుల రెడ్డప్ప ధవేజీ

నాకూ, సూరంపూడి వెంకటరమణకి సంబంధం ఈనాటిది కాదు. దాదాపు ముప్ఫై ఏళ్ళ క్రితం, అప్పటికింకా నేటి ప్రముఖ అవధాని కోట లక్ష్మినరసింహంగారు అవధాని కాలేదు. కోట వారి ద్వారా నాకూ, ప్రఖ్యాత అవధాని ఇప్పుడు గురుసహస్రావధానిగా ప్రాచుర్యం పొందిన కడిమెళ్ళ వరప్రసాద్‌గారికి పరిచయమైన సన్మిత్రుడు రమణగారు. సాంప్రదాయమైన విద్య, ఆధునికమైన భావాలు - రెండూ కలగలిసిన వ్యక్తి ఆయన. తెలుగులో అవధానం దివ్యంగా వెలుగుతున్న రోజులవి. ఊరూరా అవధానాలు, వాటిలో మా పృచ్ఛకత్వాలు - ఏ ఆదివారమూ ఇంట్లో ఉండేవాళ్ళం కాదు.

మొదట మా పరిచయమైన రోజుల్లో రమణ అవధాన క్రీడపట్ల మంచి ఆసక్తితో ఉండేవారు. ఎక్కడ అవధానమున్నా సూరంపూడి ఉండాల్సిందే. ఎన్నెన్నో కబుర్లు పంచుకున్నాం. వాటిలో అవధానాలమీద రమణకున్న పట్టు మమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచింది. అప్పటికింకా నేటిలా రమణ గడుగ్గాయి కాలేదు. చాలా సిగ్గరిగా ఉండేవారు. మేమంతా పట్టుబట్టి పృచ్ఛకత్వానికి కూర్చోబెట్టాము. పత్రికా రంగంలో పేరొందిన పెమ్మరాజు బాపిరాజుగారి షష్టిపూర్తి సందర్భంగా అత్తిలిలో జరిగిన అవధానంలో సూరంపూడి వెంకటరమణ తొలిసారి అప్రస్తుత ప్రసంగం చేశారు. నేనుండగా తాను చేయనని రమణ పట్టు. నాతోపాటు ఆయననీ కూర్చోబెట్టి చేయాలని నా పట్టుదల. మొత్తానికి అవధానంలో పృచ్చకుడయ్యాడు. మొదటి పర్యాయమే అద్భుతంగా చేశాడు.

అప్రస్తుత ప్రసంగం అనేది అవధాన విద్యలో జనాకర్షణ కలిగిన అంశం. అవధాని మిగిలిన ఏడుగురు పృచ్చకుల్ని ఎదుర్కొంటూ తీవ్రమైన పాండిత్య, సాహిత్య సమాలోచనల్లో ఉండగా, సాహితీ సమరంలాంటి సీరియస్ అంశంలో ఉండగా "అవధానిగారూ..." అంటూ అత్యంత చిలిపి ప్రశ్ననో, మెలిక ప్రశ్ననో వేసి ప్రేక్షకులకు వినోదం పంచేవారు - అప్రస్తుత ప్రసంగీకులు. ఆ అంశంలో వేసిన ప్రశ్నకు తడుముకోకుండా చురకల్లాంటి సమాధానం అవధానులు చెప్పగా, ఆహుతులు హాయి నవ్వుకుంటారు. ఎంతో సమయస్ఫూర్తి, హాస్యచతురత ఉన్నవారే ఈ అంశం నిర్వహించగలరు. ఈ అంశం సమర్ధంగా పృచ్ఛకులు నిర్వహించలేకపోతే మొత్తానికి అవధానం చప్పబడిపోయిందని చప్పరించే ప్రమాదముంది.

స్వతహాగా చమత్కారం, ఏ కొత్త ప్రక్రియని చూసినా ఆకళించుకోగల సాధికారం మా రమణ సొత్తు. పాత్రికేయునిగా పనిచేసినవాడు కావడంతో - సమకాలీన సమస్యలు అవధానంలో అవలీలగా ఉదహరించేవారు. ఒక్కో ప్రశ్న, దానికి అవధాని సమాధానం పది కార్టూన్ల పెట్టుగా ఉండేది. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించిన విసుర్లు జోరుగా ఉండేవి. ఒకసారి అత్తిలిలో నేటి ప్రముఖ శతావధాని కోట లక్ష్మీనరసింహంగారి అవధానంలో రమణ

చైతన్య కల్చరల్ అసోసియేషన్ సభలో

శ్రీ కె. సైమన్‌పాల్ చేతుల మీదుగా సత్కారం.

చిత్రంలో సంస్థ కార్యదర్శి శ్రీ పి. టి. వెంకటేశ్వర్లు

అప్రస్తుతం చేశాడు. అప్పటి, ఇప్పటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పెట్టిన పథకం "ప్రజల వద్దకు పాలన"పై సంబంధించిన రమణ ప్రశ్న ఇప్పటికీ గిలిగింతలు పెడుతుంది. ముఖ్యంగా అవధానిని ఇరకాటంలో పడేసే ప్రశ్న అది. దీనికితోడు ప్రేక్షకుల్లో ముందు వరుసలో నాటి చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రి కోటగిరి విద్యాధరరావు కూడా ఉన్నారు. ధైర్యంగా రమణ అడిగిన ప్రశ్నకి అవధాని ఆలోచించే సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఆ కాలం గడిచిపోయింది. అయినా నాటి చక్కిలిగిలిని మరువలేము కదా. అప్పటినుంచీ సూరంపూడి వెంకటరమణ "స్టార్ అప్రస్తుతం" అయిపోయారు. కానీ రాజకీయల జోకులు తగ్గించారు. అంటే - అవధానిని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక, అవధాన ప్రక్రియకు చెడ్డపేరు తేలేక తగ్గించాడు కానీ ప్రశ్నలు సంధించలేక కాదు.

ముఖ్యంగా అప్రస్తుతం చేసేవారికి సర్కస్‌లో జోకర్‌లా అన్నింటా అవగాహన ఉండాలి. అది మా రమణలో పుష్కలం. రోజూ పేపర్‌లో కార్టూన్లు వదలకుండా చదువుతాడేమో చెయ్యి పదునుగా వెళ్తూంటుంది. అవధాని ఎటు తిప్పినా అడ్డుకోగలిగిన సవ్యసాచి మా సూరంపూడి. సూరంపూడీ...! నీకు అప్పుడే అరవై ఏళ్ళు వచ్చాయా! నాకుమాత్రం కంచుమర్రు నుంచి అత్తిలి, అత్తిలినుంచి కుందవల్లి, కాశిపాడు, పిప్పర... ఎన్నో ఊళ్ళు సైకిళ్లు తొక్కుకుంటూనే వెళ్ళి అవధానాల్లో పాల్గొని తిరిగివచ్చిన రోజులే గుర్తొస్తున్నాయి. అవధానాల పేరు చెప్పుకుని మనం పంచుకున్న అభిరుచులు - అత్తిలి పచ్చిపులుసువారి హోటల్లో పెసరట్టు రుచి చూపించావుగా - ఇప్పుడది నే రుచి మరిగిపోయాను. అ పెసరట్టు రుచి ఎన్నాళ్ళు గుర్తుంటుంతో గానీ, నీకూ నాకూ ఉన్న అనుభూతుల రుచులు ఎన్ని జన్మలకైనా గుర్తుంటాయి సుమా. నువ్వూ, నేనూ మళ్ళీ అవధాన స్వర్ణయుగంలో అడుగుపెడదాం. కొత్త తరం అవధానులు ఐతే పుట్టుకు వస్తున్నారు కానీ, అప్రస్తుత ప్రశ్నలు మాత్రం ఇంకా మనవే - ఇదొకటేచాలు మన కృషికి గుర్తింపు.


  • వ్యాసకర్త బహుభాషావేత్త, వందలాది అవధానాలలో అప్రస్తుత ప్రసంగం నిర్వహించి ప్రముఖ పృచ్ఛకునిగా పేరొందిన వ్యక్తి. వ్యాఖ్యాత్తగా కూడా లబ్ద ప్రతిష్టులు.

రవణావతారాలు:

...తమ్మా సత్యనారాయణ

                                   తే|| చిత్ర, సంగీత, సాహిత్య, శిల్ప, నాట్య
                                         వేత్తలెందరొ అక్షతల్ - చిత్తమలర
                                         చల్లి, దీవెనలీయగా, వెల్లువెత్తు
                                         పూర్ణ శుభములు ఈ "షష్టిపూర్తి" వేళ!!

                                   తే|| తల్లిపాలనె గ్రోలిన - ధర్మగుణము,
                                         వెన్నతో పెట్టినట్టిది - వినయ విద్య,
                                         భక్తి సమ్మిశ్రమైన సేవాను రక్తి,
                                         తరలివచ్చెను "రమణ"యై తగినవేళ!!

                                   అ|| వెన్నముద్దవంటి, వెన్నెల గుడివంటి,
                                         మేలి తెలుగువంటి, మీదు ఇంట -
                                         శ్రీనివాసుడిచ్చు - సిరిసంపదల మాల
                                         "షష్టిపూర్తి" వేళ సంతసమున!!

                            చం|| తెలియదు నిన్నునన్ను విడదీయని తీయని బంధమేదొ - ఈ
                                   చెలిమిని గూర్చెనోరమణ! చిత్తములూనవి ప్రేమ పొత్తముల్;
                                   కలము లిఖించలేని రసకావ్యము గావలె జీవితమ్ము! కో
                                   వెలవలె శాంతిధామమయి - వెల్గునుగాక భవన్నివాసమున్!!

                             తే|| శ్రీల వెలయుత - మీ గృహసీమ సతము!
                                   ప్రేమ సుమగంధ పూరిత ప్రీతమగుత!
                                   స్నేహ, వాత్సల్య, సౌమనస్సేవ్య మగుత!
                                   "సాయి" మృదుకరాశీస్సుధా శాయి యగుత!!

                            చం|| వ్యయమగుగాక - మీకుగల వ్యర్ధ ప్రభావిత కష్టనష్టముల్!
                                   నయమగుగాక - సౌఖ్య అభినందన చందన స్పందనమ్ములున్!
                                   ప్రియమగుగాక - నవ్యసుమపేశల రాగవసంతముల్! మహో
                                   దయమగుగాక - జీవన సుధాకలశమ్ముగ భావికాలముల్!!