ఆనందం మనిషైనవాడు/ఒక ఆనందం, ఒక గర్వం

వికీసోర్స్ నుండి

ఒక ఆనందం, ఒక గర్వం

...వల్లీశ్వర్

ప్రధాన సంపాదకులు,

'ఆంధ్రప్రదేశ్‌' (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాసపత్రిక)

అప్పట్లో నేను ఈనాడు స్టాఫ్ రిపోర్టర్‌గా పశ్చిమగోదావరి జిల్లా బాధ్యతలు చూస్తున్న రోజుల్లో నా దగ్గరికి పాతికేళ్ళ యువకుడుగా సూరంపూడి వెంకటరమణ వచ్చాడు.

ఆనాటి రమణ (ఫోటోగ్రాఫర్: నందం తాతయ్య)

తనది అత్తిలి పట్టణమనీ, డిగ్రీ చదివి, భవిష్యత్‌లో ఉపాధ్యాయ వృత్తి స్వీకరించే ఉద్దేశ్యంలో ఉన్నానని తనకి విలేకరిగా పనిచేయాలని వుందనీ కోరిక వ్యక్తం చేశాడు. ఈ వృత్తిలో వుండాల్సిన లక్షణాలు, కఠోరమైన నియమాలు గురించి చెప్పాను. అత్తిలి లాంటి పట్టణంలో పార్ట్ టైం విలేకరిగా వృత్తిలో సంతృప్తి వుంటుందేమోగాని, న్యాయబద్ధంగా సంపాదించగల ఆదాయం చాలా తక్కువగా వుంటుందని చెప్పాను. మరోరకంగా చెప్పాలంటే అతన్ని నిరుత్సాహపరిచే విషయాలు ఎక్కువగా చెప్పాను. (నిజానికి అప్పట్లో మాకు అత్తిలిలో విలేకరి అవసరం ఉంది). నేను చెప్పినదంతా విన్నాక కూడా అతను తన ఆసక్తిని చంపుకోలేదు. ప్రయోగాత్మకంగా కొన్ని వార్తలు రాసి పంపమన్నాను. విచిత్రం ఏమంటే, వెంకటరమణ వ్రాసిన ఏ వార్తనీ తిరిగి ఎడిటింగ్ చేయాల్సిన అవసరం నాకు రాలేదు.

నేను ఈనాడులో రిపోర్టింగులో వివిధ స్థాయిలలో వేర్వేరు నగరాలలో 26 సంవత్సరాలు పనిచేసినా, సూరంపూడి వెంకటరమణలా ఎలాంటి శిక్షణ అవసరంలేకుండానే సమర్ధంగా రిపోర్టింగు చేయగలిగిన వారిని మాత్రం చాలా కొద్దిమందిని చూశాను. వెంకటరమణలో ఒక స్వతస్సిద్ధమైన జర్నలిస్టు వున్నాడు. నేను తిరుపతికి బదిలీ అయి వెళ్ళేముందు కలిశాడు. అతను జర్నలిస్టుగా రాణిస్తాడని నాకు విశ్వాసం కలిగింది. ఈ వృత్తిలోనే కొనసాగమని, మంచి భవిష్యత్తు వుంటుందని చెప్పాను. నేను విశాఖపట్నంలో వున్నా, ఢిల్లీలో వున్నా పశ్చిమగోదావరిజిల్లా వాళ్ళు ఎవరు కలిసినా వెంకటరమణ గురించి అడిగేవాణ్ణి. దాదాపు 20 సంవత్సరాల పాటు నాకు రమణ గురించి ఏమీ తెలియలేదు. పదేళ్ళ క్రితం ఈనాడు ఆదివారం అనుబంధంలో రమణ రాసిన కధనాలు చదివాను. విచారిస్తే తాడేపల్లిగూడెంలో వున్నట్లు తెలిసింది. నాలుగేళ్ళ క్రితం ఫోన్‌చేసి మాట్లాడినప్పుడు 1983 లోనే తాను టీచింగ్ వృత్తిలో స్థిరపడ్డాననీ చెప్పినప్పుడు మనస్సు చివుక్కుమంది. జర్నలిజానికి అవసరమైన విలువలు, నైపుణ్యం కల ఒక మంచి జర్నలిస్టు సమాజానికి దూరమయ్యాడు అనిపించింది. మూడేళ్ళ క్రితం, రమణ పదవీ విరమణ సభలో పాల్గొనే అవకాశం కలిగింది. గూడెంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చారు. వేర్వేరు రాజకీయ పక్షాలకు చెందినవారు వచ్చారు. అందరూ రమణ గురించి, అతనిలో గల టీచింగు వృత్తి విలువల గురించి, నిజాయితీ గురించి, అన్ని వర్గాలవారు అభిమానించేలా వుండే అతని మానవ సంబంధాల గురించి మాట్లాడినప్పుడు చాలా ఆనందపడ్డాను. రమణకి నేను నేర్పింది ఏమీ లేదు. అయినా నన్ను "గురువుగారూ" అని సంబోధిస్తాడు. అది అతని సంస్కారం. అతను లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పిల్లలు సంతోష్, వల్లీ, గాయత్రీలతో మాట్లాడినప్పుడు, వాళ్ళు చదివే సాహిత్యం గురించి, వాళ్ళకి రమణ నేర్పిన మౌలిక జీవన విలువల గురించి విన్నప్పుడు గర్వంగా అనిపించింది. ఒక మంచి జర్నలిస్టు సమాజానికి సరైన దిశా నిర్దేశం చేయగలడు. ఒక మంచి ఉపాధ్యాయుడు ఉత్తమ పౌరుల్ని తయారు చేయగలడు. ఈ రెండు వృత్తులలోనూ తనదంటూ ఒక ముద్ర వేసుకున్న వెంకటరమణ కుటుంబాన్ని ఆ వేంకట రమణుడి అనుగ్రహం ఎల్లప్పుడూ వెన్నంటి వుండాలని కోరుకుంటూ...


  • వ్యాసకర్త పాత్రికేయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించి, ప్రధాన సంపాదకుని స్థాయికి ఎదిగిన వ్యక్తి. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలలో పత్రికారంగంలో పలు హోదాలలో పనిచేశారు. సంపాదకత్వం, అనువాదం, అనుసృజన, రచన రంగాలలో అందెవేసిన చేయి.

లేఖాక్షతలు...

నా మదిలోని మాట

అప్పుడే ఆయనకి అరవై వసంతాలు వచ్చాయా! అంతేలెండి మంచి మనుషులతో ఉన్నపుడు కాలం హిమంలా కరిగిపోతుంది. ఇక వెంకటరమణ గురించి చెప్పాలంటే - ఎక్కడనుండి మొదలు పెట్టాలి, ఎక్కడ ముగించాలి అన్నదే తెలియడంలేదు.

మధురమైన మనిషి - స్నేహశీలి - దయామయుడు - ఆపద్బాంధవుడు - బంధుప్రీతిపరుడు - నిస్వార్దపరుడు - మితభాషి - ఇలా ఎన్నోమంచి గుణాలు గుర్తొస్తాయి. ఎప్పుడూ చిరుమందహాసంతో సాదాసీదా వేషధారణలో ఉండే రూపం గుర్తొస్తుంది. ఇవన్నీ మచ్చుతునకలు మాత్రమే.

ఆయనకు సంఘంలో ఉండే పరపతికి, మంచి పేరుకి కొలమానం లేదు. ఏ స్థాయివాడినైనా తనవద్దకు వచ్చి కష్టం చెప్పుకొని అడగడమే

రమణ దంపతులను సత్కరిస్తున్న పి. టి. వెంకటేశ్వర్లు, శ్రీను ఆళ్ళ.

చిత్రంలో బంధువులతోపాటు విశ్వేశ్వరరావుకూడా ఉన్నారు. (కుడినుండి 2వ వారు)

తరువాయి అవసరమైతే ఎంతటివారినైనా అడిగి తనవంతు సాయం అందించడం ఆయన రక్తంలోనే ఉందేమో? స్వంత కుటుంబానికి మాత్రం ఇతరులద్వారా సహాయ సహకారాలు తీసుకోవడం అంటే ఆయనకు నచ్చని మెచ్చని విషయం.

దైవపూజ, సోదర - సోదరీ ప్రేమ, ఆయన చిన్నతనం నుంచి వచ్చిన లక్షణాలు. నిజ జీవితంలో పలకరించే ప్రతివ్యక్తిని అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లలా భావించి ఆప్యాయతను పంచే వ్యక్తి. ఆయన ఈ అరవై సంవత్సరాలలో దగ్గర వ్యక్తిగా ఆయనలో విసుగు - విరామం, అలసట - చిరాకు, భేద భావాలు ఎప్పుడూ చూడలేదు. ఇలా ఎప్పుడూ ఒకేలా ఉండే వ్యక్తులు ఇంకెవరైనా ఉంటే వారిలో వెంకటరమణే అగ్రగణ్యుడు.

ఆయన శరీరానికి ఇచ్చే విశ్రాంతి కేవలం అయిదారు గంటలు మాత్రమే (రాత్రి ఒంటిగంట నుండి ఉదయం ఆరు) ఇంకా సమాజం కోసం ఏంచేయాలి అనే తపనతో ఎప్పుడూ ఆయన మెదడుకు విశ్రాంతి ప్రకటించలేదు.

ఆయన ఇలాగే మంచి ఆలోచనలతో మంచిపనులకు పూనుకొనే శక్తి భగవంతుడు ఇవ్వాలి. జీవిత సహచరి అయిన మా అమ్మాయి సాయిలక్ష్మి, భర్తకు ఇచ్చే సహకారం ఆదరణ, ఎంకరేజ్‌మెంట్ ఆయన బలం. ఇక ఆయన ముగ్గురు పిల్లలు కడిగిన ముత్యాలు. తండ్రి నోటినుండి ఊడిపడ్డట్టు ప్రవర్తిస్తారు. వెంకటరమణ చిరాయుష్కుడై వయస్సుతో నిమిత్తం లేకుండా అందరికి తనవంతు సాయం, దైర్యం, స్ఫూర్తి అందించాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.

నీ ఆత్మీయుడు

కలిగొట్ల విశ్వేశ్వరరావు.

విశ్రాంత రక్షణశాఖ ఉద్యోగి.

"సం"గతులు

నమస్కారంకాదు... మనస్కారం...

ఎవరైనా నమస్కారం ఎలా పెడతారు? రెండు చేతులూ జోడించికానీ, ఒక చెయ్య చిరంజీవిలాపెట్టి సెల్యూట్‌కానీ చేస్తారు కదా. కానీ తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి వెంకట మధుసూదనరావు (నాని)గారు సూరంపూడి వెంకటరమణకు మాత్రం ఒక చెయ్యి ముక్కుముందు నిలువుగా పెట్టి తలను అడ్డంగా ఊపుతారు. ఇదేం విచిత్రం అంటే దాని వెనుక ఓ కథ ఉంది.

వెంకటరమణ స్కిట్‌లు (లఘు హాస్య నాటికలు) రూపొందించి ప్రదర్శిస్తూంటారు. ఆయన వేసే స్కీట్లలో విసనకర్ర స్కిట్ బాగా ఫేమస్. తాటాకుల విసనకర్రలు అమ్మే వ్యాపారిగా ఆయన నటించారు. విసనకర్రలండీ.. విసనకర్రలు... అంటూ వచ్చే ఆ వ్యాపారి "కచ్చితంగా రెండేళ్ళు గ్యారంటీ" ఇచ్చి అమ్ముతాడు. తీరాచూస్తే రెండు రోజులకే విసనకర్ర విరిగిపోతే విసుగెత్తిన కస్టమర్ పిలిచి ఆ విషయం చెప్పి కడిగేస్తాడు. తన విసనకర్ర మంచి క్వాలిటీ ఉన్నది, మీకే వాడుకోవడం వచ్చి ఉండదు అంటూ "ఇంతకీ ఎలా వాడారు" అని అడుగుతాడు వ్యాపారి. విసనకర్రతో విసురుకొని చూపిస్తాడు కస్టమర్. అదండీ జరిగిన విషయం అలా కాదు ఇలా వాడాలి అంటూ చేయి (విసనకర్రగా ఇమిటేట్ చేసి) ముందుపెట్టి తల అడ్డంగా ఊపుతాడు. ఈ స్కిట్ ప్రసిద్ద వేదికలపై దాదాపుగా 1980 నుంచి వందసార్లకు పైగా వ్యాపారి వేషం వేసి పగలబడి నవ్వించారు రమణ.

ఎమ్మెల్యే కాకముందు నుంచీ నాని స్కిట్‌ను చూసి చాలా ఇష్టపడేవారు. ఓసారి సింగపూరు, మలేషియాల్లో తెలుగువారి సాంస్కృతిక కార్యక్రమాలకు అతిధిగా వెళ్లిన ఈలి ఈ స్కిట్ అభినయించారు. ఆ వేదిక నవ్వులు, కరతాళధ్వనులతో మార్మోగింది. ఎందరో తెలుగువారు నానికి స్నేహితులు, అభిమానులు అయ్యారు.

తిరిగి వచ్చాక ఓ సందర్భంలో గూడెంలోని కళావేదికపై మాట్లాడుతూ ఈ విషయం పంచుకున్నారు. రమణకు అప్పటినుంచీ చేయి విసనకర్రలా పెట్టి తల అడ్డంగా ఊపుతూ అభివాదం చేయడం ప్రారంబించారు. "లేకపోతే విరిగిపోతుంది, విసినికర్ర" అంటూ ఆ జోకు గుర్తుచేస్తారు. ఈ నమస్కారం ఆయనకు మాత్రమే కాదు ఆయనలోని కళాకారుడికి అంటారు నాని.

రవణావతారాలు:

...తమ్మా సత్యనారాయణ

ఆదర్శ పౌరసత్వం

                                     ఆ|| వారసత్వ శైలి - వరసత్వమౌవెల్గు,
                                           కష్టజీవనమ్ము, కరుణదృష్టి,
                                           మంచితనము, నీతి, మాన్యమౌ చరితయు,
                                           శత్రు రహితమైన మైత్రి - రమణ!!

సాహితీవేత్తగా

                                    తే|| కవిత, నాటిక, వ్యాసము, కథలు మొదలు -
                                          ఏకపాత్రలు, గీతాలు, ఏకధాటి
                                          వ్రాసి, వినిపించి, ఆకాశవాణియగుచు,
                                          దూరదర్శనుడై - మన చేరువయ్యె!!

సత్యసాయి సేవాసమితి సన్మానం