వీరభద్ర విజయము/చతుర్థాశ్వాసము/వీరేశ్వరుండు దేవతలను సంహరించుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


వీరేశ్వరుండు దేవతలను సంహరించుట.

101-వ.
ఇట్లు వేదంబులు వివరించుటయును, వేల్పులు వినకుండుటయును, వెంగలి యైన దక్షుండు విరోధించుటయును, వీరభద్రుండు వీక్షీంచి తత్సభవారల కిట్లనియె.
102-శా.
“కామధ్వంసుఁడు సర్వతంత్రములకున్ గర్తారుఁ డంచున్ శ్రుతి
స్తోమంబుల్ వినిపింప నేఁడు వినమిన్ దుర్వృత్తి నున్నారిలన్
స్వామి ద్రోహులు మీరు మిమ్ముఁ గడిమిం సంగ్రామరంగస్ధలిన్
వేమాఱుం బరిమార్చి వైతు నిఁక దోర్వీర్యం బవార్యంబుగన్.”
103-వ.
అని పలికి.
104-సీ.
జంకించి మైవెంచి శంఖంబు వూరించి
గగనభాగం బెల్ల గలయఁ దిరిగి
అనికి సంరంభించి యార్పులఁ జేలగిం
బ్రహ్మాండభాండంబుఁ బగులఁ జేసి
భుజశాఖ లడలించి భూస్ధలి నంకించి
బలువిడి నాయుధంబులు ధరించి
అరులగుండెలు చించి యడిదంబు ఝలిపించి
దర్పించి సింహనాదంబుఁ జేసి
ఆ.
అతికరాళభృకుటితాస్యుఁడై కన్నుల
నిప్పులొలుక సురలు నెఱిఁ దలంక
వీరగణవిభుఁడు విలయకాలానల
రౌద్రమూర్తి వీరభద్రమూర్తి.
105-వ.
ఇట్లు మహావీరావేశంబున భేరీ ఢంకార నినాదంబులు గగన మండలంబు నిండి చెలంగ వెండియు నిట్లనియె
106-ఉ.
కంటక మైన యాగ మిది గౌరిశివార్పణ మంచు నార్పు మి
న్నంటఁగ నగ్గణంబులకు నందఱికిం జెయి సన్నఁజేసి తా
మంటలకన్ను విచ్చి మఖమండపశాలలు నీఱు చేసిమున్
మింట మిణుంగురుల్ మెఱియ మేదిని యెల్లఁ గణంగి ఘూర్ణిలన్.
107-క.
వదనంబున రోషాగ్నులు
వెదఁజల్లుచు ఘోరవీర వైశ్వానరుఁ డై
పదపడి నానాగతులను
విదళించెన్ వీరభుఁడు వేల్పులమూకన్.
108-వ.
మఱియుఁ; బ్రళయకాల నీలజీమూతపటలంబులంబోలి పోనీక వెనుతగిలి పలుదెసలం బాఱి విసరు వెనుగాడ్పు చందంబునఁ జరాచర జంతుసంఘంబుల మండలీభూతసముద్ధండ కోదండుం డై వైభవాడంబరం బగు బ్రహ్మాండంబుల నొండొండఁ జేర్చి చెండాడెడు ఘోరాడంబరుం డగు నఖండదండధర వైరి విధంబున దివిరాసి యరితూల యడుగుల పయింబడి యంకిలి లేక దరికొని గరలి వడిగాలి దోఁడుగాఁ గల్గు విలయకాలానలంబు కైవడిఁ గవిసి గిరిగహ్వర గహన గుహాంతర్గత శయనసుప్తంబులైన మదగంధగజ యూథంబుల ఘీంకారంబుచేత ప్రబోధింతబై వాని వెనుదవిలి కుంభస్థలమాంసంబు నఖదంష్ట్ర్రంబులం జించి చెండాడు సింగంబు పగిది మహార్ణవాంతరంగంబున మత్స్య కచ్ఛప కర్కటక తిమి తిమింగిలాది జంతుసంతానంబు లాగున పయఃపారావార మధ్యంబున నమృతాహరణార్థంబు దిరుగు మహామందరంబు తెఱంగున మహాభీకరంబుగాఁగఁ గలసి కరాళించి విలయసమయ విజృంభిత జీమూతనిర్ఘాత ప్రచండ ఘనరవ భయంకరంబుగా శంఖంబుఁ బూరించి విడంబించి యెక్కడఁ జూచినఁ దానయై హరి పురందర విరించాదులు దిగులుకొని బెదరి బెదరి పఱవఁ బోనీక యదరంటం దాఁకి గుడుసువడి వీఁకమై వెఱచఱచి పఱచునట్లుగా దేవగణంబుల మూకల కులికి యగ్గణరాజకంఠీరవుం డగ్గలిక మెఱయ బలువిడిఁ గడువడి కెరలి పిడుగులం బోలిన బాణాజాలంబులు పఱపుచు, శూలంబులఁ బొడుచుచు, నేలపాలు చేయుచుఁ, గఠారంబులఁ బొడుచుచుఁ, గుఠారంబుల ఖండించుచుఁ, బరశువుల నఱకుచు, నత్తళంబుల నొత్తుఛుఁ, జక్రంబులఁ ద్రెంచుచు, భిండివాలంబుల ఖండించుచుఁ, జంచువుల విజృంభించుచు, నఖంబులఁ జీరచు, పాదంబులఁ జవురుచు, పిడికళ్ల రువ్వుచు, నరచేతులం బాదుచుఁ, దూపులఁ బఱపుచుఁ, గవిసియుఁ దనివిఁ గొనక వెండియు; నానావిధ పదఘట్టనంబుల మహీమండలంబులఁ గప్పుచు, మార్తాండ మండలంబు తెఱంగున నతని వెయి చేతుల విడంబించి యఖండ వివిధ విలసిత విశిఖవ్రాతంబుల నందఱకు నన్ని రూపులై తోఁచి గొడుగులు విఱుచుచుఁ, జామరంబులఁ బొడిసేయుచు, శిరంబులు గూల్చుచు, శిఖలు వెఱుఁకుచు, వదనంబులు ద్రుంచుచు, సూరువులుఁ బదంబులు వ్రచ్చుచు, గళంబులు గోయుచు, భుజంబులు విడిపించుచు, నాలుకలు గోయుచు, ముక్కులు జిదుముచు, చెక్కులు గమకించుచు, ప్రేఁగులు ద్రెంచుచు, కన్నులు బెఱుకుచు, చెవులు ద్రెంచుచుఁ, గీరీటంబులు పదతాడనంబున రాల్చుచు, కండలు చెండుచు, రక్తంబులు గ్రోలుచు, నెముకలు రాల్చుచుఁ, బడద్రోచి పండ్లు పీఁకుచుఁ, గొందఱ హోమగుండంబుల నిండను వ్రేల్చుచు, నుదరంబులు ఖండించుచు యిట్లు మఱియుం; గలంచుచు, గుదించుచుఁ, గోలాహలంబు సేయుచు, యేపుమాపియుఁ జమరియుఁ జక్కడిచియు నెఱి చఱచియు నేలపాలొనర్చియు ననంత సమర కేళీవిహారం బొనరింప దేవసంఘంబులు సైరింపంజాలక నలంగియుఁ, దొలంగియు, నొచ్చియుఁ, జచ్చియుఁ, జర్జరితులై మూర్ఛిల్లియుఁ జెల్లాచెదరై పాఱియు, నొండొరువులఁ జొచ్చియు నున్నం గనుంగొని వీరభద్రేశ్వరుండు.
109-సీ.
పోకు నాముందఱ పోరాదు దేవేంద్ర!
పోయినఁ బోవునే భుజగశయన!
యెటుపోయె? దెటుపోయె? దెందుఁ బోయెద? వగ్ని!
నిలు నిలు నిలు నిలు నీరజాప్త!
బంటుతనము గాదు పాఱకు యమరాజ!
పవమాన! యెక్కడఁ బాఱె దింక?
పంద వైతివి యోమి చందుర! మగవాఁడ
రణమునఁ బాఱెదే రాజరాజ!
109-1-ఆ.
వీరు లైనవారు వెనుకకుఁ బోదురే
మగతనంబు విడువఁ దగునె వరుణ!
పోకుఁ డింక మీరు పోయినఁ బోకున్నఁ
బోటు సిద్ధ మెల్లభంగు లందు.
110-వ.
అని ముదలకించి యవ్వీరభద్రుండు రౌద్రోద్రేకంబునఁ బ్రళయకాలరుద్రుండై.