వీరభద్ర విజయము/చతుర్థాశ్వాసము/వీరభద్రుఁ డింద్రుఁడు మున్నగువారిని శిక్షించుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


వీరభద్రుఁ డింద్రుఁడు మున్నగువారిని శిక్షించుట.

111-క.
పొడు వైనకొండశిఖరము
విడువక పగులంగ పిడుగు వ్రేసినభంగిన్
పుడమిఁ బడి మన్ను గఱువఁగ
సుడివడ దేవేంద్రుఁ దన్నె సురసుర స్రుక్కన్.
112-క.
చెన్నార నీవు సన్నగఁ
బన్నగధరు విడిచి వచ్చి పాపాత్ముఁడ వై
యున్నాఁడ వనుచు సూర్యునిఁ
దన్నిన రక్తంబుఁ గ్రక్కె దారుణవృత్తిన్.
113-ఉ.
ఆలరి దక్షు నింటఁ జని హవ్యములం దిను చేతు లేవి నీ
నాలుక లేవిరా దహన నాకు మొఱంగిన నేఁడు పోదురా
వాలునఁ ద్రెంతు నంచుఁ గరవాలు మెఱుంగులురాలఁ బట్టి తా
నాలములోనఁ ద్రుంచె వడి నగ్ని కణంబులు ఘోర జిహ్వలన్.
114-ఆ.
దండధరుని బట్టి దమకించి పడవైచి
ముష్టిఘాతపాతదృష్టి ముంచి
ఱొమ్ముద్రొక్కి నిలిచి రూపించె ఘన బాహఁ
దండలీల మెఱయ దండివేల్పు.
115-క.
బడబాగ్నులొలుకఁ జూపులఁ
గుడుమిడుగురు లెగయఁ బేర్చి గదయెత్తి వడి
న్సుడివడ నైరృతి వ్రేసెను
జడధీశుని వరుణుఁ గాంచి జగతిం గూలన్.
116-క.
తనియని కోపదవాగ్నులు
మునుమిడి దరికొల్ప వీరముఖ్యుఁడు గడిమిన్
దనయార్పులచేఁ గాల్చె
న్మునుకొను నసురాదియక్షమూకల నలుకన్.
117-క.
రుద్రుఁడు శంకరుఁ డుండఁగ
రుద్రుల మని వ్రేలుచున్న రుద్రులె యంచున్
రౌద్రత నెత్తురుఁ గ్రక్కగ
రౌద్రులఁ గట్టలుకఁ బొడిచె రోషముచేతన్.
118-క.
హరుఁ డఖిలగురుం డని యు
ర్వరమ్రోయఁగ నిచటి కేల వచ్చితి చెపుమా
వరద యనుచుఁ దుదిగోరున
సరపాకృతివాణిముక్కు సయ్యనఁ జిదిమెన్.
119-క.
మఱి రాహుచేత మధ్యము
గరువంబడి యున్న వూర్ణకమలారిగతిన్
గఱగళుఁడు ముక్కుఁ జిదిమినఁ
దెఱవకు భారతికి మోముధృతి నొప్ఫారెన్.
120-క.
నెత్తురు ధారలు మొగమునఁ
జొత్తిల్లఁగ నగ్నిదేవుసుందరి ముక్కున్
వృత్తస్తనశిఖరంబులు
నత్తరి తుదిగోరఁ ద్రుంచి యవ్వలవై చెన్.
121-క.
వనితలచనులకు నీడైఁ
జనియెడు నని పంచశరుఁడు జక్కవదోయిం
గొనముక్కులు కోసినక్రియఁ
జనుముక్కులు దనరె వహ్ని సతికి రణోర్విన్.
122-మ.
భగునిన్ గూఁకటిఁ బట్టి నిష్ఠురగతిన్ బండ్లూడ నోరంతయుం
బగులన్ వ్రేసి కుదించుచుం బదరుచుం బాపాత్మునిం దక్షునిన్
దగవే చూచిన కన్ను లేవి యనుచుం ధట్టించి లీలాగతిన్
భగుకన్నుల్ వెఱికెన్ సురల్ బెగడఁగా భద్రుండు రౌద్రాత్ముఁ డై.
123-శా.
యోషాగాధలు పల్కు మంత్రములు దా నెచ్చోటికిం బోయెరా
పూషాదిత్య దురాత్మ యంచుఁ బెలుచన్ భూమిం బడన్వైచి ని
ర్దోషుం డాతనిపండ్లు డుల్చె నది హేతుఖ్యాతి గా థాత్రిలో
భాషల్ తప్పులు వోయె నాతనికిఁ దా భాషించుచో నెప్పుడున్.
124-శా.
చంద్రా నిన్ను ధరించియున్న పరమున్ సర్వేశ్వరుం బాసి యీ
యింద్రాదిత్యులభంగి నేఁడు భువిపై నేతెంచి యిచ్చోట మ
త్సాంద్రక్రోధహతుండ వైతి వనుచుం జంకించి పాదంబులం
జంద్రుం భూగతుఁ జేసి ప్రామె చిదుకన్ సంగ్రామరంగంబునన్.
125-వ.
తదనంతరంబ.
126-చ.
వెనిమిటిఁ బ్రాముచోఁ బురుషభిక్షము వెట్టు మటంచుఁ దారకాం
గన లరుదెంచి మ్రొక్కు క్రియఁ గ్రక్కుననొత్తి శశాంకుఁ ద్రొక్కఁగా
జననమునొంది పెల్లగసి సర్వజనంబునకున్విచిత్ర మై
యొనరఁగ భద్రుపాదముల నొవ్పె సుథాజలబిందుసంఘముల్.
127-వ.
మఱియు; సముచితాలాపంబులు పలుకు యుగాంతకాల రుద్రుండునుం బోలె నట్టహాసంబు సేయుచు; మహితమందర మహీధ్రమథిత మహార్ణవ కల్లోలచయంబునుం బోలె శోషించుచు; కంఠీరవంబునుంబోలె గర్జించుచు; మదాంధసిందురxబునుం బోలె మ్రోయుచు; వర్షాకాలమేఘంబునుం బోలె శరవృష్టి గురియుచు; రాహుమండలంబునుం బోలె నొడియుచు; గంతులు ద్రొక్కుచుఁ దాండవంబాడు పురారాతియునుం బోలె వింతగతుల రణవిహారంబు సలుపుచుఁ; బెనుగాలియుం బోలెఁ దూలుచు; బడబాగ్నియునుం బోలె నార్చుచు; నంధకారంబునుం బోలెఁ గప్పుచు; నేలయు నింగియు నొక్కటియై పొడువుపొడువు పోనీకుఁ బోనీకు చంపు చంపు మని యెఱింగించుచు; దశశతకోటిసహస్రలక్షానేకకోటిసంఖ్యలై దేజరిల్లుచు; యూపంబులఁ బెఱుకుచు; నాచార్యుల నడచుచు; హోతలప్రాణంబులు హోమంబులకు నాహుతులు గావించుచు; పశువుల ననువులు బాపుచు; గంధర్వుల కంధరంబులు ద్రెంచుచు; సిద్ధసాధ్యచయంబుల ధట్టించుచు; సూర్యులం దూలించుచు; తాపసుల విచారించుచు; మునిజనులం దండకమండల యజ్ఞోపవీతములు తుత్తుమురులు సేయుచు; బ్రహ్మ శిరంబుఁ గుదియించుచు; సురాసురజాతంబుల నెరియించుచు; నిప్పులు లొలుకు చూపుల నందఱం గప్పి తలలు కోసి కుప్పలు పెట్టుచుఁ; బ్రేవులు పోగులువైచుచు; కండలు చెండి కొండలుగా వైచుచు; పీనుఁగుపెంటల నడుమ నెత్తురుటేఱులు గావించుచు; దేవభటుల మాంసంబు లిచ్చి భద్రకాళి మెప్పించుచు; భూతప్రేతపిశాచగణంబులం దనుపుచు; వీరజయలక్షీ విలాసుం డై ప్రజ్వరిల్లుచు వీరభద్రేశ్వరుండు.
128-లగ్రా.
నిక్కి గణనాథుఁ డొక యక్కజపు విల్లు వడి
నెక్కిడి గుణధ్వనుల దిక్కు లొగి మ్రోయన్
గ్రక్కున మిణుంగురులు గ్రక్క బలుభూతములు
చక్క దొడఁగే యనగ వెక్కసము దోఁపన్
లెక్కలకు దాఁటి చని యొక్కట సురాదులను
జక్కడచె నప్పు డతి చిక్కువడి మ్రొక్కన్
డొక్కడువు నిక్కుఁ డను దిక్కురులనాదములఁ
జుక్క లురలం ధరణి గ్రక్కదలుచుండన్.
129-వ.
మఱియు వీరావేశంబున.
130-సీ
పట్టిసంబులఁ ద్రుంచి పలుబాణముల నొంచి
ముసలాయుధంబుల మోది మోది
అలుగుల నాటించి యరచేతులను వ్రేసి
ముష్టిఘాతంబుల ముంచి ముంచి
కత్తుల నెఱయించి గదల క్రుళ్లణగించి
భూరిశూలంబులఁ బొడిచి పొడిచి
శక్తులఁ దూలించి చక్రాలఁ బరిమార్చి
పటునారసంబులఁ బఱపి బఱపి
130-1-తే.
పెనఁచి నరములు వ్రేగులు వెఱికిఁ బెఱికి
చెనఁకి మేనులపట్టలు చీరిచీరి
డాసి చెక్కులు ముక్కులు గోసి కోసి
వీరభద్రుండు వేల్పులఁ దోలఁ దొడఁగె.
131-శా.
వీచున్నెత్తురు గమ్ముదేర నణఁచున్ వీరంబు దోరంబుగా
వైచున్ నింగికి నేలకున్ దిశలకున్ వజ్రప్రహారంబులన్
దాఁచుం గూల్చు నదల్చు నేర్చుఁ గరముల్ ఖండించి హోమాగ్నిలోఁ
ద్రోచుం గూఁకటి బట్టి మొత్తి సురలన్ దుర్వారగర్వోద్ధతిన్.
132-శా.
నిక్కున్ ఠాంకృతీనేయఁగాఁ జెలఁగు భృంగీ ఘోషఘోషంబుగాఁ
ద్రొక్కున్ సర్వవసుంధరావహుఁ డనంతుం డెంతయున్ రోజఁగాఁ
జొక్కున్ భీకర మైనహుంకృతులచేఁ జుక్కల్ వెసన్ రాలఁగా
దిక్కుల్ మ్రోయ నజాండభాండములు భీతిన్ బెల్లు ఘూర్ణిల్లఁగన్.
133-సీ.
ఒకమాటు కత్తుల నొరలంగఁ గుత్తుకల్
విడిపించి తనతోటి వెలఁది కిచ్చు
నొకమాటు హోతల కుఱికి మధ్యంబులు
ఖండించి భూతసంఘముల కిచ్చు
నొకమాటు నఖముల నూరుస్థలంబులు
వ్రచ్చి బేతాళక వ్రజము కిచ్చు
నొకమాటు గదలచే నూరుతలంబులు
మరియించి మృగసంఘములకు నిచ్చు
ఆ.
ఒక్కమాటు గముల నొక్కటఁ జెండాడు
నొక్కమాటు సురల నొల్లఁ బుచ్చు
వీరభద్రురణము వే ఱెవ్వరిని బోల్ప
వచ్చు నతనిఁ బోల్ప వచ్చుఁ గాక.
134-వ.
ఇట్లు రణంబు సేయుచు నవ్వీరజనచూడామణి యగు వీరభద్రుండు దక్షు నుపలక్షించి.