Jump to content

వీరభద్ర విజయము/చతుర్థాశ్వాసము/దక్షుని శిరంబుఁ ద్రుంచుట

వికీసోర్స్ నుండి


దక్షుని శిరంబుఁ ద్రుంచుట.

135-సీ.
“ఎఱిఁగితే మనములో నీశానుతత్త్వంబు
నెఱిఁగింతు నిచ్చోట నెఱుఁగ వేని
యిఁకనైన నిచ్చె దే యీశ్వరుభాగంబు
వెంగలి కొల్వులో వేల్పు లెల్ల
ఏపాట్లు పడియెద రీక్షించి చూడరా
యాలింపరా యోరి! బేల! యనుచు
నలుగుల నాటించి యఖిల శూలంబులఁ
గ్రొమ్మెఱుంగులు వెసఁ గ్రుమ్మఁబట్టి
ఆ.
దక్షుబంధుజనుల దక్షునికూఁతులు
మోదుకొనుచు బిట్టు మొఱలువెట్ట
దక్షుశిరముఁ ద్రుంచి తగ భద్రకాళిచే
సమ్మదమునఁ గేలిసలుప నిచ్చె.
136-వ.
అంత భద్రకాళియు మహాకాళియుం బోలెఁ గరాళించి దారుణాభీల శూలహస్త యై రణంబున మాఱులేక తిరుగుచు వీరభద్రుం డిచ్చిన దక్షుని మస్తకంబు గని మహాభయంబున.
137-మ.
ప్రియుఁ జూచుం దలయూచు నారుచులకుం బిల్చున్ నగు న్వేడుకం
బయలం బాఱఁగ వైచు నేచు నడుమన్ బంతంబుతోఁ బట్టుటన్
నయలీలన్ గబళించు దంచు దివిపై నాడించుఁ దూలించు ని
ర్భయతం దక్షుశిరంబు కందుక గతిన్ భద్రాణి వేభంగులన్.
138-వ.
తత్సమయంబున నయ్యాగపురుషుండు మాయామృగాకారుం డై తిరిగి పోవుటం గనుంగొని “పోకు పోకు నిలు నిలు మింక నెటు బోయెదు మత్కోపబడబానలంబు బాఱిఁ బడితివి గాక” యని విల్లు మోపెట్టి బెట్టిదం బగు నయ్యర్థచంద్రబాణంబుఁ దొడిగి కడువడి నతని శిరంబుఁ బుడమిం బడనేసి కూల్చి బిట్టార్చి చిక్కన మూకలపైఁ గవియుచుండ భయంపడిన దేవజనంబు లెల్లను నార్తారావంబుల మహాదైన్యంబున.