వీరభద్ర విజయము/చతుర్థాశ్వాసము/ప్రమథగణములతో వీరభద్రుఁడు దండెత్తుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


ప్రమథగణములతో వీరభద్రుఁడు దండెత్తుట.

79-క.
కొందఱు మొనలై నడువఁగఁ
గొందఱు పంతంబు పలుకఁ గొందఱుమూకల్
సందడిఁ బాపఁగ మఱియును
గొందఱు దక్షుం దలంచి క్రోధింపంగన్.
80-క.
గండఁడు శంభుద్రోహర
గండఁడు మహి నన్యధైవగండరులకుఁ దా
మిండఁడగు వీరభద్రుండు
దండెతై గణాళి గొల్వ దక్షునిమీఁదన్.
81-వ.
ఇట్లు వీరరణ సైన్యాధిష్టితుండును, గోరాజ గమనుండును, భద్రేశ్వరీ సహితుండును, నారాచ గదా దండ భిండివాల త్రిశూల దివ్వబాణ నిశితాయుధ పరివృత బాహుదండుండును, రణదుందుభీ నిస్సహణ శంఖ కాహళ ఘంటి కారావ భీకరుండును, నతులిత కోపాటోప సంరంభుండును, సమర సన్నాహుండును, వివిధ విలసిత వీరలక్ష్మీ విలాసుండును, వృషభకేతనాలంకారుండును నై పురంబులు సాధింప వసుంధరారూఢుండును గౌరీసమేతుండును నై యరుదెంచు పురారాతి చందంబున నతి సుందరుండై వీరభద్రేశ్వరుం డరుగు దెంచుచున్న సమయంబున.
82-క.
గణపాదహతులచేతను
వణఁకి గిరుల్ తరులతోడ వసుధం బడియెన్
కణఁగి వసుంధరగిరులును
ఫణిపతిపైఁ బడియెఁ గమఠపతివైఁ బడియెన్.
83-క.
బలువిడి ప్రమథగణంబుల
బలముల వెనుధుళి గగనభాగముఁ గప్పెన్
అలరఁగ రేణువుఁ గప్పెను
జెలువుగ రవి మింటనుండి చీఁకటి గప్పెన్.
84-వ.
అంత నవ్వీరభద్రుండు తుహినాచలశిఖరంబు డాయంబోయి కతిపయ దూరంబున దక్షాధ్వరకలకలంబు విని గణంబుల కిట్లనియె.
85-సీ.
“ ఘనులార! వింటిరే గగనభాగం బెల్ల
హోమధూమము గప్పియున్న భంగి
వినవచ్చెనే మీకు వెదమంత్రంబులుఁ
బలికెడు హోతల కలకలంబు
అల్లన యేతెంచు నదె హవ్వములు గోరి
క్రందైన నిర్జరబృంద రవము
అల్లదె పాపాత్ము నధ్వరం బొనరించు
క్రతుశాల దవ్వునఁ గానవచ్చె
85-1-ఆ.
నింక దవ్వు లేదు యేర్పడఁ జూడుఁడో
శ్రీగిరీశు వేఱుచేసినాఁడు
క్రొవ్వినాఁడు వీని క్రొవ్వు నణంపంగ
వలయు దేవదైత్యవరులతోడ.”
86-వ.
అని హెచ్చరించి మైవెంచి వీరజనచూడామణియగు వీరభద్రేశ్వరుండు.
87-సీ.
బహుతంత్రములచేత భాసిల్లి యందంద
వేదనాదములచే వెలసి వెలసి
విదితవైభవముల విలసిల్లి విలసిల్లి
కలకలరవములఁ జెలఁగి చెలఁగి
హోతలపలుకుల నొప్పారి యొప్పారి
యాచార్యజనులచే నమరి యమరి
పృథుసదస్సులచేతఁ బెంపారి పెంపారి
వరయాగలక్ష్మిచే వ్రాలి వ్రలి
87-1-ఆ.
వెలుఁగుచున్న యట్టి వేదిపైఁ గూర్చుండి
బంధుకోటితోడ భాసురముగఁ
గొంతదనుకఁ గ్రతువునంతయు వేల్చిన
దక్షుఁ గనియె వీరదైవ మపుడు.
88-వ.
ఇట్లు కాంచి తదీయ మందిరంబు గణంబులుం దానును జుట్టుముట్టి విపుల వీరావేశ కోపాటోపోప సంరంభుఁడును గరాళ వదనుండును నై చెలంగి యార్చిన.
89-శా.
కంధుల్ వండలి పిండుగాఁ గలఁగె ఘీంకారంబు రోధించె ది
గ్గంధేభఁబులు గ్రుంగె భూతలము చుక్కల్ రాలె భూతంబులున్
మందీభూతము లయ్యెఁ దప్పె రవి బ్రహ్మండంబు భేదిల్లె ది
క్సంధుల్ ద్రెళ్లెఁ జగంబులుం బెగడె వే శంకించె నా బ్రహ్మయున్.
90-క.
కలకలము నొందు యాగము
వెలవెలనై చిన్నబోయె వేల్పులమూఁకల్
కలగిరి ఋషి మునిముఖ్యులు
ఎలుఁగింతయు లేక యుండి రెంతయు భీతిన్.
91-ఉ.
కొందఱు మూర్ఛవోయిరటఁ గొందఱు పాఱిరి భీతచిత్తులై
కొందఱు చచ్చి రచ్చటను గొందఱు దూరిరి శాశక్రంతలన్
గొందఱుఁ బుద్ధి మ్రాన్పడిరి గుండెలు ఝల్లని తల్లడింపఁగాఁ
గొందఱు సృష్టిసంహర మొకో యని నివ్వెఱఁగంది రా ర్తులై.
92-వ.
ఇట్లు సింహనాదంబు చేసి విజృంభితుం డై “యిం దెవ్వరేని
పాఱిపోయెదరు; వీరల మెదిలిపోనీకుం” డని రభసంబున నయ్యాగమంటపంబు చుట్టును ఖడ్గ పరశు త్రిశూలహస్తు లైన ప్రమథగణంబులఁ గాపు వెట్టి తానును వీరగణనేవితుం డై యవ్వీరభద్రుండు దక్షమఖమండపంబుఁ దరియం జొచ్చు సమయంబున; వెఱిచియు వెఱవని చందంబున దక్షుఁ డిట్లనియె.
93-క.
ఇచ్చోటి కేల వచ్చెద
వెచ్చో టే యూరు నిన్ను నెవ్వఁడు పంపన్
వచ్చితివి యేమికార్యము
చెచ్చెర వినుపింపు మనినఁ జిత్తములోనన్.
94-ఆ.
వెఱ్ఱివాఁడు వీఁడు వెంగలి మూఢుండు
భాగమెల్ల నేఱుపఱుపకున్న
మఱిగదాగణంగి మర్ధంచి వైచెద
నంచు నతని కనియె నలఘుబలుఁడు.
94-చ.
“ఎనయగ దేనదేవుఁ డగు నీశ్వరదూతను వీరభద్రుఁడన్
బనివిని నీదు జన్నమునఁ బాలుగొనం జనుదెంచినాఁడ భ
క్తిని శివుభాగ మేది యిట తెచ్చి సమర్పణ మీవు సేయుమా;
విను ననుఁ గూర్చి కుత్సితపువిద్యలు చేసినఁ బోదు వెంగలీ!
96-మ.
తలఁపన్ దుర్మతివై యొనర్చు నపరాధబుల్ శివుం గూర్చియున్
గల వెన్నేనియుఁ దొల్లి నీ వలన నింకన్ వీరభద్రుం డలం
తులఁ బోనేరఁడు సైపనేరఁడు వృథా దుర్బుద్ధివై ప్రాణముల్
ఫలమున్ గోల్పడ నేల శంకరునకున్ భాగంబు దెప్పింపుమా.”
97-వ.
అనిన నవ్వి దక్షుం డిట్లనియె.
98-క.
“యాగములోపల శివునకు
భాగము గలదనుచు శ్రుతులు వల్కినచో నీ
భాగము నీ కిచ్చెద నీ
యాగమములఁ దెలుపు మనిన నతి వేగమునన్.”
99-వ.
అనిన విని ఋగ్యజుస్సామాధర్వంబులు మహావినయభీతచిత్తు లై లేచి తదీయమఖమంటపంబున నున్న సదస్యులం జూచి యిట్లనియె.
100-సీ.
“నిఖిలతంత్రములకు నీలకంఠుఁడు వేల్పు
భువి నగ్రదైవంబు పూజసేయ
భాగ్యంబు కొఱఁతయే భావించి చూడుఁ డ
కర్మమానసులార! కష్టులార!
పరమేశుత త్త్వంబుఁ బరికింప రేమిటి
కీశాను నిజతత్వ మెఱఁగరేల
పరమోపదేశంబు పరమంబు పరమాత్మ
శివుఁ డౌట యెఱుఁగరే సృష్టి ననుచు
100-1-ఆ.
వేల్పు లెల్ల మాట వినకున్న దక్షుండు
వినియు వినని యట్ల కనలి యున్న
నచటనుండ వెఱచి యాగమంబులు బోయె
బ్రహ్మలోకములకు భయముఁ బొంది.