Jump to content

వీరభద్ర విజయము/చతుర్థాశ్వాసము/పార్వతికోపంబున భద్రేశ్వరి యను కన్య పుట్టుట

వికీసోర్స్ నుండి


పార్వతికోపంబున భద్రేశ్వరి యను కన్య పుట్టుట.

56-క.
రుద్రునకుం బొడచూవెను
రుద్రాణియు నంతలోన రోషాత్మక యై
భధ్రేశ్వరి యనుకన్యక
రౌద్రతఁ బుట్టెంచె ఘనకరాళానన యై.
57-వ.
అంతఁ దత్సమయంబున వీరభద్రేశ్వరుండు భద్రేశ్వరిం గూడూకొని పరమేశ్వరుని పాదపంకజంబులకు సాష్టాంగదండప్రణామంబు లాచరించి కరసహస్రంబులు మొగిడ్చి “దేవా! మీరు నన్నుం బుట్టింపఁ గారణం బేమియో యవధరింపుఁ” డని యిట్లనియె.
58-సీ.
“నీ యాజ్ఞఁ గడచి యీ నిఖిలంబులకు బ్రహ్మ
కొన్ని మిక్కిలి సేయుచున్న వాఁడొ
నీ యాజ్ఞ గడచి యీ నీరజనాభుండు
నొండుజాడలఁ బోవుచున్న వాఁడొ
నిను మీఱి పవనుండు నేలయు నింగియు
నొక్కటి గావించుచున్న వాఁడొ
నీపంపుదప్పి యీ నింగి మార్తాండుండు
పన్ని మిక్కిలి కాయుచున్న వాఁడొ
58-1-గీ.
అట్లుగాకయుఁ బడబాగ్ని యంతజలముఁ
గరము గ్రోలుచున్నది యొకో కాముఁడేచు
చున్నవాఁడేమొ యీశాన చెప్పవేమి?
చిక్కఁబట్టి కేలున వారి నుక్కణంతు.
59-క.
కట్టలుక మీరు నన్నును
బుట్టింపఁగ నేల వలసె బొలుపుగ నాకున్
నెట్టన యానతి యీవే
పుట్టువు నంత్యంబు లేని భూతాధిపతీ!”
60-వ.
అనిన విని యల్లన నవ్వు మొగంబున నద్దేవున కిట్లనియె.
61-శా.
“ వింటే యంతయు వీరశేఖర! మమున్ వెల్వెట్టి దక్షుండు నీ
వెంటన్ వేల్వఁదొడంగినాఁడు మరలన్ విష్ణుండు నింద్రుండు న
వ్వెంటన్ బోయినవారు వారి నచటన్ వేవేగ దండించి నీ
వింటన్ బుట్టు శరానలంబున రణోర్విన్నీఱుగావింపుమా.
62-ఉ.
ఇమ్ముల నీవు వేగ చని యేచి మహారణకేళి యాడు మీ
యమ్మయు నేను వచ్చి మునియాశ్రమభూమి వసించి నీ విలా
సమ్ములు చూచుచుండెదము జర్జరితంబుగ దక్షుఁ జంపి యా
గమ్ము హరించి ర” మ్మనుచు నానతి యిచ్చిన వీరుఁ డిట్లనెన్.
63-క.
“ భావజమదసంహర! నా
నావేదాతీత! వినుత నాగాధిపతీ!
దేవేంద్రార్చిత పదయుగ!
దేవా! దేవాదిదేవ! త్రిదశాధిపతీ!
64-ఉ.
కుంభిని ద్రెంతునో? జముని గుండెలు చెండుదునో? సురాచల
స్తంభము ద్రెంతునో? సురల చట్టలు చీరుదునో? కడంగి ది
క్కుంభుల ద్రుంతునో? యజుని క్రొవ్వణగింతునొ? సూర్యచంద్రులన్
 జృంభణమెల్ల మాన్పుదునొ? చుక్కల డుల్తునొ? పార్వతీశ్వరా!
65-శా.
బ్రహ్మేద్రామర పూజితాంఘ్రియుగళా! బాలేందుచూడామణీ!
బ్రహ్మేంద్రాదులఁ బట్టి వ్రేల్పు టది మద్బాహాబలప్రౌఢికిన్
బ్రహ్మంబే పరమేశ! నీవుఁ బ్రణుతింపం గర్వదుర్వారులన్
బ్రహ్మాదుల్ దెగ రూపడంతు నొకఁడన్ బ్రహ్మాండభాండావళుల్.
66-మ.
నడతున్ దక్షునిమీఁదఁ గయ్యమునకున్ నారాచఘోరాగ్నులన్
బుడమిం దేవగణంబులం దునిమి సంపూర్ణాహుతుల్ పోసెదన్
గడిమిం గెల్చెదఁ గూల్చెదం గలచెదం గాలించెదన్ జంపెదన్
గడిఖండంబులు జేసెదన్ నుఱిమెదన్ ఖండించెదన్ మించెదన్.
67-క.
నా కెదురెవ్వరు జగముల
నీ కెదురెవ్వరు మహేశ! నిఖిలాధిపతీ!
నాకీ తెరువునఁ బొడమఁగ
నీకంఠవిషంబు నీవె నిర్మలమూర్తీ!”
68-వ.
అనిన విని మెచ్చి పార్వతీ దేవి యవ్వీర శేఖరున కిట్లనియె.
69-శా.
“ కట్టల్కన్ గణలోకనాధ! నిను మత్కార్యార్ధమై యీ యెడన్
బుట్టించెన్ భుజగేంద్రభూషణుఁ డొగిన్ భూతేశు నిందించి తాఁ
బెట్టన్ జన్నము దక్షుఁ డద్దివిజులన్ బిల్పించినాఁ డా సభన్
గట్టుగ్రంబుగఁ గూల్చి ర”మ్మనుచు నా కాళ్యాణి దీవించుచున్.
70-క.
కట్టడ హరుఁడును దానును
బెట్టిరి తగ వీరసేను బీరముతోడన్
నెట్టనఁ బ్రణమిల్లి వెసన్
జెట్టిమగండైన వీర శేఖరుఁ డెలమిన్.
71-వ.
అట్టి పనిఁ బూని దక్షయాగంబుపైఁ బోవ గమకించి వీరభద్రుం డతులిత రౌద్రాకారుండై యిట్లని విచారింపందొణంగె.
72-ఉ.
శూలము యూపగంబమును శోణితధారలు వేయుబాణముల్
చాలిన దర్భలుం గుణము చప్పుడు మంత్రము సృక్కులుం దొనల్
గ్రాలు రణోర్వి మంటపముగా సురగోవులసోమయాజి యై
వ్రేలుచు రోషణాగ్నులను వీరుఁడు భద్రుఁడు శంభుప్రీతిగన్.
73-వ.
అని సకలలోకంబులుం గొనియాడ వీరయాగంబు సేయవలయు నని విచారించి.
74-శా.
ఝంకార భ్రుకుటాననుం డయి ధరాచక్రంబు ఝూర్ణిల్లఁ గా
హుంకారించిన భద్రుమేన లయకాలోగ్రాగ్నికీలావళిన్
సంకాశోద్ధతకోపచిత్తులు రణోత్సాహుల్ జగద్భీషణా
హంకారుల్ ఘను లంతకాంతకు లుదగ్రాగ్నుల్ మహావిక్రముల్.
75-ఉ.
పాహసధైర్యమానసులు చంద్ర ఫణీంద్ర విభూషణుల్ శివ
ద్రోహరగండకీర్తు లతిదోర్బలగేయులు భూరి తీవ్రహా
లాహలజృంభితుల్ శిఖివిలంబితనేత్రులు చారుగోపతీ
వాహులు వైరివీరమదవారణసింహులు పుట్టి రుగ్రతన్.
76-వ.
ఇట్లు పుట్టిన.
77-ఉ.
ఎక్కడఁ జూడ వారె యయి యేపున లక్షలుఁగోట్లు నెందఱో
దిక్కులు పిక్కటిల్ల నతితీవ్రత లెక్కకుదాఁటి యుగ్రతన్
జుక్కలు మోవ నేచి యలచుక్కలు రాల నుదగ్రమూర్తి యై
యొక్కట యార్పుగొన్నఁ బ్రతిహుంకృతిఁ జేసె నజాంజభాండముల్.
78-వ.
అంతఁ దదీయ గణనికాయంబులు తన్నుఁ బరివేష్టించి దండప్రణామంబు లాచరించి సంభ్రమంబున.