Jump to content

వీరభద్ర విజయము/చతుర్థాశ్వాసము/శివునిహుంకారంబున వీరభద్రుండు పుట్టుట

వికీసోర్స్ నుండి


శివునిహుంకారంబున వీరభద్రుండు పుట్టుట.

53-ఉ.
ధారుణి దిగ్ధిరం దిరుగఁ దామరసప్రభవాండభాండముల్
బోరున ఘూర్ణిలన్ నిఖిలభూతములున్ బెగడొంద శూలి హుం
కారము చేనెఁ జేసిన నఖండతర ప్రళయాగ్నిసన్ని భా
కారుఁడు వీరభద్రుఁ డతిగర్వసముద్రుఁడు పుట్టె రౌద్రతన్.
53-వ.
ఇట్లు పుట్టి.
54-సీ.
సలలితవేదండచర్మాంబరంబుపై
భుజగేంద్ర చిహ్నంబు పొల్చువాఁడు
కాలాగ్ని హేతి సంఘంబుకైవడి నొప్పు
పదినూఱుచేతులఁ బరఁగువాఁడు
ప్రళయాభ్రవిద్యుత్పృభాభాసురం బగు
మెఱుగారుకోఱల మెఱయువాఁడు
భానుబింబముతోటి పర్వతాగ్రముభంగి
నెమ్మేని మణికిరీటమ్మువాఁడు
54-1-ఆ.
అలుగువాఁడు నిప్పు లొలుకుఁజూపులవాఁడు
మంటలెగయు నొసలికంటివాఁడు
బలిమిఁ బట్టి యెట్టిబ్రహ్మాండముల నైనఁ
ద్రుంపువాఁడు రిపులఁ జంపువాఁడు.
55-వ.
మఱియుఁ బ్రచండమార్తాండమండలమండితోద్దండ తేజో విరాజిత దుర్నీక్షణకుండలాభరణుండును, సహస్రరవి మండల తేజోవిలాస ప్రకాశిత దివ్వదేహుండును, బాలసూర్యప్రభా పటల చటుల పద్మరాగ మణిమకుటవిటంక విలంబమాన కర్కాటకశిరోవేష్టన కాలకూట త్రినేత్రసంయుక్తంబై రౌద్రరసంబు వెదచల్లు హస్తసహస్రంబును, గఠోరకుఠార గదాదండ భిండివాల కరవాల ముసల ముద్గర తోమర భల్లాంగ ప్రాస పట్టిన కోదండ శర చక్ర ముష్టిసంబగళ గదా త్రిశూల పరశు లవనిలాంగోష్ఠ్యసి క్షురి కౌతళ వంకుళీ యమదండ నారసజముదాళ శక్తిప్రముఖ దివ్య దివ్యాయుధసమూహ శిఖా సమాశ్రయంబై బ్రహ్మాండంబు వ్రక్కలించునట్టి దీర్ఘబాహుదండ సహస్రంబును, నారాయణేంద్రాది నిఖిలదేవతాదుల మణిఘటిత మకుటారణ్యస్ధలీ రంగవల్లీ రణరంగ తాండవక్రియా నిర్ఘాత భయదండంబు లగు చరణారవింద రాజితుండును భుజంగ రుద్రాక్షమాలికా విభూతి త్రిపుండ్ర శార్దూల చర్మాంబర సామజచర్మాంబర రథారూఢుండును, వజ్ర వైడూర్యేంద్ర నీల గోమేధిక పుష్యరాగ మరకత పద్మరాగాది మౌక్తికహార కేయూర కంకణాంగుళీయక మంజీరాంకిత దివ్యదేహుండును, ప్రళయకాల సమయపయోధరగర్జిత నిర్ఘాతజనిత నినదసన్నిభ సకల భువసభయంకర సింహనాదుండును, సకల బ్రహ్మాండభాండసముదయ భయద విపరీతాట్టహాసుండును, విపుల విలయకాలానల మారుత శైలశిఖర ప్రపాత నాసికాపుటకుటీ నిశ్శ్వాసుండును, మదగజగండభేరుండ సింహశరభశార్దూలాది సంగర విద్యావిశారదుండును, నిఖిల లేకైకోత్పత్తిస్ధితిలయప్రకారుండును, నిర్జరారాతిసంఘాత నిరస్త గహనక్రియాకలాపుండును, అఖిల భూత సమాశ్రయుండును నైన ధూమకేతుండును, త్త్రెలోక్య దానవ విదారుండును, అనేక సహస్రకోటి మధ్యందినమార్తాండపటల ప్రభోజ్జ్వలుండును, శైవదూషకజన వక్త్ర పదతాడన నిర్ఘాత సంఘటితుండును, అగణిత గుణగణాలంకృతుండును, అసహాయ శూరుండును, అతులిత దుర్వారగర్వదర్పోద్ధతుండును నై యొప్పుచున్న వీరభద్రేశ్వరుండు.