వీరభద్ర విజయము/చతుర్థాశ్వాసము/వీరభద్రవిజయ ప్రకారంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


వీరభద్రవిజయ ప్రకారంబు.

1-ఉ.
శ్రీరమణీయవీర సరసీగణరంజితసోమ! వాసవాం
భోరుహసంభవప్రముఖభూరినిలింపభుజాబలప్రతా
పోరుమహాంధకారపటలోగ్ర విఖండన చండభానుగం
భీర గుణాభిరామ! రణభీమ! వినిర్జితకామ! శంకరా!
2-వ.
పరమజ్ఞానభావుం డగు వాయుదేవుం డమ్మహామునులతో “మీ రడిగిన యర్థంబు లెల్ల సవిస్తారంబుగా నెఱింగించితి; మునీంద్రులారా! వీరభద్రేశ్వరుని విజయప్రకారంబు నిజంబు వర్ణింప బ్రహ్మదేవునకు నలవిగా దైనను నాకుం దోచిన విధంబున విన్నవించెద వినుం” డని యిట్లనియె.
3-క.
“మఱి వైవస్వతమన్వం
తరమున నొక కాల మందు దక్షుఁ డదక్షుం
డురుతర పాపవిచక్షుఁడు
పరఁగన్ జన్మించె ఘోరపాపాత్మకుఁ డై.
4-క.
ప్రాలేయాచల మందున
వేలుపులకు నేకతంబ విహరించుటకున్
మేలైన చోట భూమికి
వ్రాలిన యాకాశగంగ వచ్చిన చోటన్.
5-క.
శివకరమై యుండెడుచో
శివదేవుని వేఱుచేసి శివకల్మషుఁ డై
దివిజులఁ బిలువం దొడఁగెను
నవహితమతి నశ్వమేధయాగము సేయన్.
6-వ.
అంత.
7-సీ.
అమరేంద్ర పావక యమ దానవాధీశ
వరుణాది నిఖిల దిగ్వల్లభులను
మార్తాండ మృగధర మంగళ బుధ గురు
మందాది గ్రహరాజ మండలంబు
కౌశిక గౌతమ కణ్వ మార్కండేయ
కాత్రి వసిష్ఠాదు లైన మునులు
క్రతుకమలోద్భవ కశ్యపాంగీరస
పులహ పులస్త్యాది జలజభవులు
ఆ.
అచ్యుతాది దేవతానాయకులు యక్ష
సాధ్య సిద్ధ వసు భుజంగ రుద్ర
గణము లాదిగాఁగఁ గల్లు వారందఱు
దక్షుమఖము చూడఁ దగిలి చనిరి.
8-వ.
ఇట్లు సకల దేవతలును జనుదెంచిన వారల నుచితోపచారంబుల సంభావించి వూజించి డక్షుండు మఖంబుం జేయందొడంగె నయ్యవసరంబున.
9-చ.
చెలువుగ వచ్చి వేదములు చెప్పినఠావుల నున్న నిర్జరుల్
బలసి మఖంబులోపలను భాగము లియ్య భుజింపఁ గోరుచో
మలహరురామిఁ దా నెఱిఁగి మాన్యులఁ దత్సభవారిఁ జూచి ని
శ్చలతరవాక్య దోషతమచండమరీచి దధీచి యిట్లనున్.
9-క.
“పూజింపఁ దగినవారల
పూజింపక నేర్పు మాలి పూజన లిచ్చెన్
పూజింపఁ దగనివారికి
నీ జగమున నింత బుద్ధిహీనుఁడు గలఁడే.
11-క.
ఇది దుష్కృత మని యెఱుఁగఁడు
ఇది మిక్కిలి నింద్య మగుట యెంతయు నెఱుఁగం
డిది గడవ దనుచు నెఱుఁగఁడు
ఇది యేలనొ శంభుఁ బిల్వఁ డితఁ డెబ్భంగిన్.
12-క.
పొడవులు తానై పొదలిన
పొడవగు పరమేశు మఱచి పొరిఁ బాపములన్
బొడవై జీవచ్ఛవముల
పొడవుగఁ బూజించు వెఱ్ఱి భూమిం గలఁడే.
13-ఆ.
యాగకర్త లేని యాగంబు చెల్లునే
కలయ నంగ మెల్లఁ గలిగి యున్న
శిరము లేని తనువు చెలరేఁగి యాడునే
పొలయుఁ గాక నేలఁ గలయుఁ గాక.”
14-వ.
అనిన విని యతండు తదీయాలాపంబులు కర్మవశంబునఁ దన మనంబు చొరక శూలంబులై తాఁకిన నదరిపడి సదస్యుల నాలోకించి “ మహాత్ములారా! భవదాగమన కారణంబునఁ గృతార్థుండ నైతి;” నని పలికి పూజించి పిలువఁ దొడంగి నాఁ డితఁడు శంకరదేవుఁడు లేని జన్నము నెయ్యడలఁ గలదె వేదములారా!” యని మఱియును.
15-క.
“మొదలుండ నచటఁ బోయక
తుదిగొమ్మలు నీటఁ దడుపఁ దుద నిష్ఫలమై
పొదలుంగా కది ప్రబలునె
పదపడి శివరహితమైన ఫలముం గలదె.
16-చ.
చెలువుగ సర్వదైవములఁ జేసినదైవము నాదిదైవముం
చిలువక నన్యదైవములఁ బిల్చియుఁ బూజలు చేసి జన్నముల్
నలుపఁ దొడంగినాఁ డితఁడు శంకరదేవుఁడు లేని జన్నమున్
దలఁపఁగ నెయ్యెడం గలదె తథ్యము వేదము లందుఁ జూడరే.”
17-వ.
అని పుణ్యచక్షుం డగు దధీచి పాపచక్షుం డగు దక్షున కిట్లనియె.