Jump to content

వీరభద్ర విజయము/చతుర్థాశ్వాసము/దధీచి దక్షుని మందలించుట

వికీసోర్స్ నుండి


దధీచి దక్షుని మందలించుట.

18-శా.
“ ఓయీ దక్ష! యిదేమి యీ తెఱఁగు దా నూహింప లోకంబు లో
 నే యాచారము యెట్టి ధర్మచరితం బే వేదమార్గంబకో
ఏ యాచారము యెట్టి ధర్మచరితం బే వేద మందైన నే
ధీయుక్తిం బరమేశుఁ బిల్వఁ దగదో తెల్లంబుగాఁ జూడుమా.
19-ఉ.
దేవరకన్ను లై వెలుఁగు ధీరులఁ బావక సూర్యచంద్రులన్
దేవరలెంకలౌ మునుల దేవరభృత్యులఁ గేశవాదులన్
దేవత లాదిగాఁ బిలిచి దేవపితామహుఁ డైన శ్రీ మహా
దేవుని బిల్వఁగాఁ దగదె దివ్యవిచారము లై దలంపుమా.
20-ఉ.
భీమయదేవు నొండొరులు బిల్వ నెఱుంగరు గాక ఋగ్యజు
స్సామయధర్వణాది శ్రుతిసంఘములోఁ బరికించినాఁడ వీ
భూమిఁ దలంపఁగాఁ దగిన ప్రోడవు నీవు శివుండు రామికిన్
నీ మదిఁ జూడుమా ఫలము నిష్ఫల మొందునొ నిన్నుఁ జెందునో.”
21-వ.
అనవుడు దక్షుం డతులిత కోపాతురుం డై యిట్లనియె.
22-క.
“రుద్రుం డంచును నీ వొక
రుద్రుని జెప్పెదవు గాక రుద్రాక్షధరుల్
భద్రత నేగురు నార్గురు
రుద్రులు గల రింక నొక్క రుద్రుని నెఱుఁగన్.
23-మ.
అదె మా యాగము నందు దేవతలు నయ్యంభోజనాభుండునుం
ద్రిదశేంద్రుండును నున్నవారు గడు సంప్రీతిం దగన్మంగళ
ప్రద మొందన్విధిమంత్ర పూజిత హవిర్భాగంబు లేనిచ్చెద
న్విదితం బై శ్రుతివూర్వమై తనరఁ గావింతున్ ముఖంబున్నతిన్.”
24-వ.
అనవుడు దధీచి దక్షున కిట్లనియె.
25-క.
“ఈ విష్ణుం డీ బ్రహ్మయు
నీ విబుధేశ్వరులు మఱియు నీ రుద్రులు నే
దేవేశువలనఁ బుట్టిరి
భావింపఁగ నేర వీవు పాపవిచారా!
26-సీ.
పరఁగ నే దేవుండు ప్రళయకాలంబున
నెందఱు బ్రహ్మల యేపు మాపె
వెలయ నే దేవుండు విలయావసరమున
నెందఱు విష్ణుల యేపు మాపె
జడియ కే దేవుండు సంహారవేళల
నెందఱు నింద్రుల యేపు మాపె
వరయంగ నేదేవుఁ డంత్య కాలములోన
నెందఱు రుద్రుల యేపు మాపె
ఆ.
నట్టి దేవదేవు నభవు నవ్యయు నీశుఁ
గమలజాండనాథు గౌరినాథు
నిఖిలలోకనాథు నిందింపఁగా రాదు
పాతకంబు దక్ష! పాపచక్ష!
27-క.
మూఁడేసి కండ్లు కలిగిన
పోడిమితో రుద్రు లంచుఁ బొగడెడువారిన్
మూఁడేసి కండ్లు నిజమో
పోడిమియొ తలంచి చూడ పోలిక యొక్కో.
28-క.
కన్నులు గానక ప్రేలెదు
క్రొన్నెలధరు వేరు చేసి కొలిచెద వీవున్
నిన్నును నీ తర మెఱుఁగవు
యిన్ని జగంబులకుఁ దండ్రి యెవ్వఁడు చెపుమా?
29-వ.
అదియునుం గాక.
30-సీ.
అమర నీ రుద్రులే హరి నమ్ముగాఁ జేసి
యిలఁగూలఁ ద్రిపురంబు లేయువారు
నెరయ నీ రుద్రులే నిఖిలంబుఁ జెరగొన్న
యంధకాసురుఁ బట్టి యణఁచువారు
బలసి యీ రుద్రులే ప్రళయకాలుని బట్టి
ఖండించి మునిరాజుఁ గాచువారు
కదసి యీ రుద్రులే గరళంబు గుదియించి
కంఠకోణము నందుఁ గప్పువారు
ఆ.
ఎనయఁ జదువు లెల్ల యెఱుఁగును జెప్పుమా?
యిట్టి రుద్రమహిమ యిజ్జగంబు
నట్టి రుద్రు మహిమ యెఱుఁగంగ నలవియె?
థాత కైన నతని తాత కైన.
31-క.
ఈ రుద్రులఁ బదివేలను
గారవమునం బూజ సేయ క్రతుఫల మది తాఁ
జేరునె నిన్నును రోయుచు
నీరస మగుఁ గాక క్రతువు నిష్ఫలగతులన్.
32-ఉ.
నీ చరియించు నోమునకు నీవు ప్రియంబునఁ గొల్చు రుద్రు లే
నీచులు వీరు చాలుదురె నీకు ఫలం బొకటైనఁ జెప్పుమా
యీ చతురాననాదులకు నేడుగడల్ భువిఁ దానయైన తా
రాచలనాథు నీ వెఱుఁగ నబ్బునె పొందునె దక్ష! యీ యెడన్.
33-క.
దేవుఁడు నాకంబునకును
దేవుఁడు త్రిత్రింశకోటి దేవావలికిన్
దేవుఁడు లోకంబులకును
దేవుం డీశ్వరుఁడె కాక దేవుఁడు గలఁడే?
34-ఉ.
మేరువు వింటికమ్మి యట మేదిని తేరట సూర్యచంద్రు లిం
పారఁగ బండికండ్లట ననంతుఁడు నారట బ్రహ్మవిష్ణువుల్
సారథియున్ శరంబులట సామచయం బట గుఱ్ఱముల్ మనో
జారికి నెవ్వ రీడు? త్రిపురాసురవైరికి నన్యదైవముల్.
35-ఉ.
చెచ్చెర బ్రహ్మ తొల్లియును శ్రీపతియుం దమలోన వాదమై
మచ్చరకించి పాదములు మౌళియుఁ గానఁగఁ బూని గర్వులై
యచ్చుగ మిన్ను మన్నుఁ గన హంసయుం బందియు నై కడంకతోఁ
గ్రచ్చరఁ ద్రవ్వి యీశ్వరుని గానఁగఁ జాలిరొ యేపు దూలరో.
36-క.
ఆతని యొక గురి సేయఁగ
నాతని నొక కొలఁది సేయనగునే తమలో
నీతి యెఱుంగక వారలుఁ
చేతో మోదంబుతోడఁ జిక్కులం బడరే?
37-క.
పంతంబులాడి శంకరు
నెంతయుఁ బొడగానవలయు ననియును దమలోఁ
జింతింపఁ జిక్కువడ్డవి
యెంతయు వేదంబు లొరుల కెఱుఁగఁగ వశమే?
38-క.
గౌరీమనోహరునకున్
థారుణి బ్రహ్మాదిసురలు దాసులు గారే
నారాయణుఁ డరయంగా
మారారికిఁ బ్రియుఁడు కాఁడె? మతకరిదక్షా!
39-క.
సకలాధిపతికి శివునకు
నకలంకున కమితమతికి నభవున కిలలో
నొక పేదవేల్పు సరియే
ప్రకటింపఁగఁ దగదు పరమపాపము దక్షా!
40-క.
మత్తల్లి క్రొవ్వినాఁడవు
చిత్తంబున సరకుగొనవు శివుఁ డటు నిను ను
వ్వెత్తుగఁ గొనవచ్చిన నీ
పొత్తగువా రెవ్వ రెందుఁ బోయెదు? చెపుమా.
41-క.
వలదు శశిఖండభూషణుఁ
జెలువుగఁ బిలిపించి పూజనేయుము ప్రీతిన్
వలవదు చెప్పితి” ననినను
నలరుచు నప్పలుకు వాఁడు హాస్యము చేనెన్.
42-వ.
పుణ్యమానసుం డగుదధీచి కోపమానసుం డై నయనంబుల వాని వీక్షీంచి యమ్మఖంబున నతని దగ్ధంబుగా శపింప గమకించి నాకున్ వేగిరపడ నేల యిక్కార్యంబునకుం గైలాసవాసుం డున్నవాఁడు గదా యని దేవతల మొగం బై యిట్లనియె.
43-ఉ.
“పన్నుగ మీర లందఱును పాలసముద్రము తొల్లి ద్రచ్చుచోఁ
గ్రన్నన నుద్భవించి మిముఁ గాలుచుచో నభయంబు లిచ్చి తా
సన్నుతిఁ జిచ్చు మ్రింగఁ జెయిసాచిన దేవరకీయ రాని యీ
జన్న ములోనఁ జేతు లిటుచాతురె దేవతలార! కష్టులై.
44-ఉ.
ఇచ్చట నుండఁగావలవ దిందుశిఖామణి లేనిచోట మీ
వచ్చుటచేటు నా విమలవాక్యము దప్పదు లీలఁ గామునిం
జెచ్చెరఁగూల్చి యున్న పెనుజెట్టి శివుం డిటు వచ్చె నేని మీ
చచ్చుట తెల్ల మో యమరసంఘములార! వినుండు చెప్పితిన్.”
45-క.
అని పలికి నిర్మలాత్మకుఁ
డనుపమగుణుఁ డచట నుండ కవిరళబుద్ధిన్
మనమున రోయుచుఁ జనియెను
చనుటం గనుగొనుచుఁ బాసి చనరై రమరుల్.
46-ఆ.
దక్షుఁ బాయ రైరి తలపోయలేరైరి
యిక్షుచాపవైరీ నెఱుఁగరైరి
నింద్యులైరి సురలు నిఖిలలోకంబులఁ
దమకు వచ్చుచేటు దలఁపరైరి.