Jump to content

మహాపురుషుల జీవితములు/కాశీనాథ త్రియంబక తిలాంగు

వికీసోర్స్ నుండి

కాశీనాథ త్రియంబక తిలాంగు

ఈతఁడు గౌడ సారస్వత బ్రాహ్మణుఁడు. ఈతని పూర్వులు రమారమి నూరు సంవత్సరములక్రిందట గోవానగరమునుండి వచ్చి బొంబాయిలో కాపురముండిరి. ఈయన 1850 వ సంవత్సరం ముప్పది యవ యాగష్టున జన్మించెను. ఇతఁడు బాబురామచంద్రతిలాంగుగారి రెండవ కుమారుఁడు. ఆయన పెదతండ్రి త్రియంబక రామచంద్ర తిలాంగుగారు సంతానహీనుఁ డగుటచే నీపిల్లవానిని బెంచుకొనెను. తండ్రియు పెదతండ్రియు నవిభక్తులై కలిసి యుండినందున జ్యేష్ఠుఁడే యింటిపెత్తనము చేయుచుండెను. పెంచుకొన్న పెదతండ్రి పూర్వాచారపరాయణుఁడై మిక్కిలి నీతిమంతుఁడైనందున కాశీనాథత్రియంబకతిలాంగువద్ద నుండిన సకలసద్గుణములు వానివద్దనుంచి నేర్చుగొనిన వేయని చెప్పవచ్చును. కొంతకాల మతఁడుస్వభాష చిన్న బడులలో నేర్చుకొని యింగ్లీషు జదువుటకు 1859 వ సంవత్సరమున నెల్ఫినిష్టన్ పాఠశాలకుఁ బోయెను. ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు కేవలము జీతములకొఱకేగాక బాలుర విద్యాభివృద్ధికై పాటుపడుచు వచ్చిరి. అప్పుడు విద్యనేర్పినగురువులలో నారాయణమహాదేవ కరమానందుఁ డొకఁడు. కాశీనాథుఁడు పాఠశాలవిడిచినతరువాత సయితము కార్యాలోచన మేదియైనఁ జేయవలసి వచ్చినప్పుడు తన గురువగు పరమానందుని సహాయముగోరుచు వచ్చెను.

1864 వ సంవత్సరమునఁ గాశీనాథుఁడు ప్రవేశపరీక్షయందు, గృతార్థుడై కళాశాలలోఁ బ్రవేశించెను. ఆ కళాశాలాధ్యక్షుఁడును నందలి యుపాధ్యాయులును బాలురప్పగింప వలసినపాఠములు చదివించుటయేగాక బుద్ధిసూక్ష్మత హెచ్చుటకై యితర గ్రంథములుగూడ చదివించుచు వచ్చిరి. అట్టిగురువులయొద్ద విద్యనభ్యసించుట చేనతఁడు రెండేండ్లకే యనగా పదునెనిమిదేండ్లప్రాయముననే యమ్. ఏ. పరీక్షయందుఁ గృతార్థుఁడయ్యెను. పిమ్మట మఱి రెండేండ్లకు యల్. యల్. బి. అనగా బి. యల్ పరీక్షలో చేరెను. పట్టపరీక్షయందుఁ చేరిన మరుసటిసంవత్సరమే యనగా పదునేడేండ్ల ప్రాయముననే యతఁడు తాను చదువుకొన్న కళాశాలలో నొక యుపాధ్యాయుఁడుగా నియమింపఁబడి బాలుర కింగ్లీషు సంస్కృతము నైదేండ్లు నేర్పెను.

1872 వ సంవత్సరమున కాశీనాథుఁడు న్యాయవాదికిఁగావలసిన మఱికొన్ని పరీక్షలయందును గృతార్థుఁడై బొంబాయి హైకోర్టులో న్యాయవాది యయ్యెను. కుశాగ్రబుద్ధియగు నీతఁడు పరీక్షల యందు గృతార్థుఁడగుటయేగాక బహుగ్రంథములు శోధించి చదివి పలు తెఱంగుల తనజ్ఞానము నభివృద్ధిచేసికొనుచు వచ్చెను. ఆయన యమ్. ఏ. పరీక్షయందుఁచేరిన వాఁడయ్యు దానదివఱకు నేర్చికొనిన విద్య మిక్కిలి స్వల్ప మనియు "అనంతశాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చకాలో బహవశ్చవిఘ్నాః" యను నార్యోక్తినిపట్టి నేర్చికొనవలసినదే విస్తారముగ నున్నదనియుఁ దెలిసికొని న్యాయవాదిపరీక్షకు జదువునప్పుడే యింగ్లీషులోనున్న భాషాగ్రంథములు తత్వశాస్త్రములు మొదలగు వానిని జాగరూకతతోఁ జదివెను. ఇట్లు చదువుటయె కాక యతఁడు బొంబాయిలో నాకాలమున వెడలుచుండిన హిందూప్రకాశము మొదలగు కొన్నిపత్రికలకు వ్యాసములు వృత్తాంతములు వ్రాసిపంపుచు నెడనెడ జ్ఞానాభివృద్ధి కరములగు సభలకుఁ బోయి పెద్దలిచ్చు నుపన్యాసములను విని స్వయముగఁ దానుపన్యాసమును వ్రాసి చదివి యెల్లవిధముల బుద్ధిని వికసింపఁ జేసెను. విధముగా నభ్యాసము చేసికొన్నగాని లౌకిక వ్యవహారములలోఁ దాను ప్రవేశించుటకు తగనని యట్లుచేయుచు వచ్చెను.

అదియునుగాక బొంబాయిలోనున్న ప్రార్థనసమాజ మందిరమున కతఁడు ప్రతివారము బోయి యచ్చట జేయఁబడిన మతబోధలను శ్రద్ధతోవిని గృహమునకు జనిన పిదప విన్నదంతయుఁ గాగితముమీఁద వ్రాసి "మీరు చెప్పినదంతయు నేను సరిగా గ్రహించి వ్రాసితినో లేదో చూడు" డని యుపన్యాస మిచ్చిన వారివద్దకే మరల బంపుచుండెను. ఇతరులు చెప్పిన విషయములను సరిగా గ్రహించి సరిగా దెలియజేయుట నెఱుగనివాఁడు ప్రపంచమునం దెప్పటికిని గొప్పవాఁడు కాలేడనిభావించి యతఁడీ విధమున జేయుచు వచ్చెను. అవ్విధంబున నొరుల యుపన్యాసములు విని జ్ఞాపకముంచుకొని మరల వ్రాయుచుండుటచేతనే యతఁడు మిక్కిలి సరసమైన శైలితో నింగ్లీషువ్రాయుటయు మాటలాడుటయు నతని కలవడెను. ఆంగ్లేయభాషలో మిల్లు, కారై, స్పెన్సరు, మొదలగు మహాత్ముల గ్రంథములయం దతని కత్యంతమభిరుచి. సంస్కృతముమీఁద వానికున్న యభిమానమునకు మేరలేదు. బాపుశాస్త్రీయను నొక పండితుఁడు విద్యార్థులకు బాణినివ్యాకరణము చెప్పుచుండ నతఁడక్కడకు బ్రతిదినముబోయి యా శాస్త్రము నేర్చికొనెను. ఆనందగిరి వ్రాసిన శంకర విజయము మరొకరు వ్రాసిన శంకరవిజయముఁ జదివి కాశీనాథుఁడు శంకరాచార్యుని చరిత్రము సంగ్రహముగా నింగ్లీషున వ్రాసి విద్యార్థుల సమాజమువద్దఁ జదివెను. ఈ కాలముననే యీ విద్వాంసుఁడు భగవద్గీతల నింగ్లీషులోనికి భాషాంతరీకరణము చేసెను. ఈభాషాంతరీకరణముననే సంస్కృత విద్యాపారంగతుఁడగు మోక్సుమూలరు పండితుఁడు తాను ప్రకటించిన ప్రాచీన పవిత్ర గ్రంథములలోఁ జేర్చి లోకమునకు వెల్లడించెను. ఆదినములలోఁ జేసిన మనఃపరిశ్రమమును బట్టియే కాశీనాథుఁడు న్యాయవాదియైన పిదప నతి సూక్ష్మబుద్ధితో వ్యాజ్యముల నడపి ప్రతిష్ఠసంపాదింపఁ గలిగెను. ఆతని వాగ్ధోరణి యాతనియుక్తులు న్యాయాధిపతుల మనస్సులనాకర్షించుచు నతనినేర్పు స్వల్పకాలములోనే వానికి గొప్ప పేరు దెచ్చెను. న్యాయాధిపతులు సయితము పలుమారువానిప్రజ్ఞలకుఁ బొగడుచువచ్చిరి. సంస్కృతమునందతఁడు మిక్కిలి ప్రజ్ఞావంతుఁడగుటచే హిందూశాస్త్రములమీఁద వచ్చిన వ్యాజ్యములలో నతనియాలోచన ప్రమాణమైయుండెను. జడ్జీలు సయితము సందిగ్ధవిషయములలో నీతనిసహాయ మపేక్షించుచువచ్చిరి. యూరపుఖండమున క్రీస్తు దేశమున హోమరను కవి ఈలియడ్డును నొక గ్రంథమువ్రాసెను. దానియందలి కథ యచ్చముగ రామాయణమువలె నుండును. అందుచే సంస్కృతపండితుడగు వీబరను దొరగారు రామాయణము రచించిన వాల్మీకి మహర్షి హోమరుకవి వ్రాతలను దొంగిలించెనని వ్రాసిరి. కాశీనాథతిలాంగు హోమరు కవిత్వము వాల్మీకి కవిత్వము, జాగ్రత్తతో జూపుచు నొకవ్యాసము వ్రాసెను. ఆ వ్యాసము హిందూ దేశస్థులే గాక యింగ్లాండు వారు సయితము చాల మెచ్చిరి.

ఆతఁడు 1873 వ సంవత్సరమున మొట్టమొదట బహిరంగమైన సభలోనికివచ్చి యొక్క యుపన్యాసమిచ్చెను. ఆసభ యప్పుడు క్రొత్తగాబుట్టిన యుప్పుచట్టమును గురించి చర్చించుటకు జరిగెను. అతఁడు నాడిచ్చిన యుపన్యాసము నింగ్లీషుపత్రికలు స్వదేశపత్రికలు సమానముగఁ గొనియాడెను. అతని నోటినుండి యాంగ్లేయభాష వెలువడునప్పు డాంగ్లేయులు సయితము తమభాషకిట్టిసౌకుమార్యము గలదాయని తెల్లబోయి చూచెడువారు. న్యాయవాదియై విశేష ప్రసిద్ధిగాంచుచు రాజకీయవ్యవహారములలో మిగులఁ బనిచేయుచుఁ దీరిక లేక యున్నను గాశీనాథతిలాంగు సంస్కృతభాష పరిశ్రమము మరువలేదు. భర్తృహరి నీతిశతకము ముద్రారాక్షస నాటకము నింగ్లీషుటిప్పణము వ్రాసి ప్రకటించెను. అంత దృప్తినొందకయతడు పురాతనత్రామ్ర శిలాశాసనముల శోధించి వానిలో గలవిషయములచే లోకమునకు తెలియజేయుచు వచ్చెను. 1876 వ సంవత్సరమున నతడు బొంబాయి యూనివరిసిటీలో సభికుడయ్యెను. 1877 వ సంవత్సరమున నీదేశమందున్న తెల్లవారినిమాత్రము 'వాలంటరీకోరు' అను పేరుగల యొకవిధమున సేనలోఁ జేర్చికొనవలసిన దనియు నల్లవారినిమాత్ర మందుఁ జేర్చుకొనగూడదనియు దొరతనమువారిని వేడుకొనుటకు బొంబాయిలోనొక సభజరిగెను. ఈతిలాంగుగారును ఫిరోజిషా మెహతాగారును మఱియొక సభచేసి నల్లవారి నందుజేర్చికొనక పోవుట వారి నవమానించుట యని నొక్కి చెప్పి యుపన్యాసమిచ్చిరి.

1878 వ సంవత్సరమున గవర్నరు జనరలుగారగు లిట్టనుప్రభువు గారు స్వభాషలలోఁబ్రకటింపఁబడు వృత్తాంతపత్రికల నడిచివేయుట కొక చట్టము నిర్మించిరి. ఆకాలమున నీతిలాంగుగా రట్టిచట్టము ధర్మవిరుద్ధమని హిందూప్రకాశ పత్రికలో పలుమారు వ్రాసిరి. 1879 వ సంవత్సరమున లిట్టను ప్రభువుగారు దూదిసరకులమీఁద కట్టిన సుంకములకు గూర్చి తిలాంగుగా రాపన్నులు దేశానర్థకములని యుపన్యాసములిచ్చి యాప్రభువుపరిపాలనము దేశాభివృద్ధిపరాఙ్ముఖమని తెలియ జేసిరి. 1880 వ సంవత్సరమున నప్పటిగవర్నరుగారు తిలాంగుగారికి జాయంటు జడ్జీపని నిచ్చెదమని చెప్పగాఁ నతఁ డక్కరలేదనియెను. పిమ్మట దొరతనము వారాయనకు లాకాలేజీలో నుపాధ్యాయత్వ మిచ్చిరి. ఈపని యదివఱకు దొరలకేగాని స్వదేశస్థుల కిచ్చుట లేదు. 1882 వ సంవత్సరమున గవర్నరుజనరలుగారగు రైఫన్ ప్రభువుగారు వానిని "ఎడ్యుకేషనల్ కమీషనులో" సభికుఁడుగా నేర్పరచిరి. హిందూదేశములోవిద్యాభివృద్ధి యెట్లగుచున్నదో కనుగొనుటకీసభ యేర్పడినది. ఈసభలోఁగూర్చుండి యతఁడు పడినపరిశ్రమకురైఫన్ ప్రభువుగారు మిక్కిలి సంతసించి వానికి సి. ఐ. యి, అనుబిరుదము నిచ్చిరి. ఆసభలో నతని సహకారకులై పనిజేసిన కొందఱు పాఠశాలలో నీతిపుస్తకములు కొన్నిటిని బాలుర చేతఁ జదివించి నీతిప్రత్యేకముగా నేర్పవలయునని నాదరింప నీతి బాలురు చదువుచున్నట్లి ప్రతి గ్రంథములో నున్నదనియుఁ బ్రత్యేకముగా నేర్పనక్కర లేదనియు దిలాంగుగారు వారివాదములఁ బూర్వపక్షముచేసి వ్రాసిరి.

1883 వ సంవత్సరమున ఇల్బర్టుబిల్లు అనునది హిందూదేశమునం దంతటఁ జర్చింపఁబడెను. దొరలేవైన నేరములు చేసినప్పుడు నల్ల న్యాయాధిపతులు వారిని విచారింపవచ్చునని యీచట్టముయొక్క ముఖ్యాభిప్రాయము. ఇది దొరల కనిష్టమై వివాదకారణమయ్యెను, ఆదినములలో నీతిలాంగుగారు బొంబాయిలో నొక సభచేయించి యాబిల్లు చాలా శ్రేయోదాయకమని న్యాయమని యుపన్యసించెను. ఈయుపన్యాసమును వాని ప్రతిపక్షులుసయితము గొనియాడిరి. 1884 వ సంవత్సరమున నీతఁడు బొంబాయి గవర్నరుగారి శాసన నిర్మాణసభలో సభికుఁడుగా నియమింపఁబడి హైకోర్టు జడ్జీయగు వఱకు నాసభలోఁ బనిచేసెను. ఆసభలోనుండి మహారాష్ట్రదేశమునకు ముఖ్యముగా బొంబాయినగరమునకుఁ జాల నుపకారముచేసెను. 1885 వ సంవత్సరమున నితఁడు హ్యూందొరగారితోఁ గలసి దేశీయ మహాసభాస్థానమునకుఁ బాటుపడి ప్రథమసభ బొంబాయిలోఁ జరిగించెను. 1888 వ సంవత్సరమున నలహాబాదులోఁ జరిగిన దేశీయమహాసభ కితఁడుపోయి శాసననిర్మాణసభలలో స్వదేశీయ సభికులను మునుపటికంటె నెక్కువగా జేర్పవలసినదని దొరతనమువారికి విన్నవించుచు నుపన్యసించెను. ఇది యాతని యుపన్యాసములలో శ్రేష్ఠ మయినది. 1880 వ సంవత్సరమున దొరతనమువారీయనను బొంబాయి హైకోర్టు జడ్జిగా నేర్పరచిరి. ఈ యుద్యోగమున కీయన సర్వవిధములచేతఁ దగినవాఁడని యాకాలమునఁ దెల్లవారు నల్లవారు నను భేదము లేక యెల్లవారుం గొనియాడిరి. అతఁడెంత మంచి న్యాయాధిపతియో వానితూర్పు లెంతశాస్త్రబద్ధములుగ నెంత యుక్తి యుక్తములుగ నున్నవో వానిని జదివిన వారందఱు నెఱుంగుదురు. హిందూ దేశములో రాయల్ ఏషియాటిక్కు సొసయిటీలనుపేర కొన్ని సమాజములు గలవు. సంస్కృతము మొదలగు ప్రాగ్దేశవిద్యలను గూర్చి పరిశ్రమ జేయుటయు తామ్రశిలాశాసనాదులత్రవ్వించి చక్క జేయుటయు నీ సభయొక్క ముఖ్యోద్దేశము. ఈ సమాజ మొకటి కలకత్తాలోను మఱియొకటి బొంబాయిలోనుగలదు. బొంబాయిలో నున్న సభకు శ్రీతిలాంగుగారిని దక్కినసభికు లగ్రాసనాధిపతిగ జేసిరి. ఈగౌరవము నల్లవారి కెవ్వరి కదివఱకు గలిగియుండలేదు. అతఁడు హైకోర్టుజడ్జియై దొరతనమువారి కొలువులోఁ బ్రవేశించినను దేశీయమహాసభమీఁద నాతనికిగల యభిమానము రవంతయేనియుఁ గొఱత వడదయ్యె. 1892 వ సం|| రాంతమందు వాని దేహస్థితి చెడి పోయెను. అది మొదలొక సంవత్సరము రోగపీడితుఁడై 1893 వ సంవత్సరము సెప్టెంబరు 1 వ తారీఖున నీమహాపురుషుఁడు లోకాంతరగతుఁ డయ్యెను.

అతని మరణమునుగూర్చి తెల్లవారు నల్లవారు ననుభేదము లేక హిందూదేశస్థులగు జనులందఱు మిక్కిలి దుఃఖించిరి. ఈసచ్చరిత్రుని జ్ఞాపకార్థము బొంబాయి నగరములో నొక పెద్ద సభ చేయబడెను; ఆసభ కప్పటిగవర్నరుగారగు హారిసుప్రభువుగా రగ్రాసనాధిపత్యము వహించిరి. ఆ కాలమున బొంబాయి హైకోర్టులో మొదటి జడ్జీగారు నీలాంగును గూర్చి చెప్పిన మాటలలో గొన్నిఁటి నిందుదహరించుచున్నాము. "తిలాంగు విషయమున నేను చెప్పవలసిన ముఖ్యాంశ మొకటున్నది. హిందువులలో నిప్పుడనేకు లింగ్లాండు మొదలగు దేశములకుఁ బోయిరి. అచ్చట నాగరికతను జనుల యాచారము లను వ్యవహారధర్మములను స్వయముగ జూచి నేర్చికొను చున్నారు. తిలాంగు స్వదేశము నెన్నడు విడిచిపెట్టకపోయిన కేవలము పాశ్చాత్యుల గ్రంథముల సహాయముననే వారి యాచార వ్యవహారాదులను నాగరికతను జూచిన వారికంటె నెక్కుడుగ గ్రహించెను. ఈయన స్వదేశమగు బొంబాయి రాజధానిని దరచుగ విడిచియుండ లేదు. నేనెఱిఁగినంత వఱకీయన స్వదేశమునునొక్కసారి మాత్రము విడిచెను. ఈ విధముగ నతఁడు పశ్చిమదేశ గ్రంథములు జదివి ప్రాగ్దేశాచారముల నవలంబించి ప్రవర్తించుటచే జనులకందఱ కతఁడు సర్వదా దుష్టుఁడై మెలంగెను. ఈతని మరణముచేత హిందూదేశ మంతయు మహా నష్టమును బొందినది."

కాశీనాథతిలాంగు న్యాయవాదియై యుండుట రాజకీయ వ్యవహారములలో బ్రవేశించి ప్రతిష్టగాంచుట మొదలగు పనులతోనే కాలము బుచ్చక సంఘ సంస్కారముపై చాలనిష్ట గలిగియుండెను. హిందూ వితంతువు వైధవ్యమును గూర్చి యాయన పలుమారు దుఃఖించెను. అతి బాల్యవివాహములు వానికిష్టము లేదు. ప్రస్తుతము హిందూ దేశమందున్న వర్ణభేదము దేశమున కరిష్టదాయకమని యతఁడు తలంచెను. అతడు చనిపోవుటకు ముందు పదియేండ్లక్రిందట వఱకు దొరతనమువారు మన సంఘవిషయములలో జోక్యము కలుగ జేసికొనగూడదని యభిప్రాయపడుచు వచ్చెను. కాని యిటీవల 1800 వ సంవత్సరమందు 12 సంవత్సరముల లోపు బాలికలకు గర్భాధానము చేయఁగూడనని దొరతనమువారు చట్టము నేర్పరచే నప్పుడు హిందువులంద రదికూడదని వాదించుచుండ నప్పుడుతిలాంగు గారు తనకొంటి యభిప్రాయమును మార్చుకొనియెను. దేశాధిపతులు ప్రజలను సర్వ విధముల గాపాడవలసిన భారము వారిపై నున్నదిగనుక దురాచారము చేత బాధపడు ప్రజలనుగూడ రక్షింప వలసిన దేయని యాయన యభిప్రాయము, అందుచే దురాచారముల నడచు చట్టముల నేర్పరుచుటలో దొరతనమువారు మంచిపనియే చేసెనని యాయన సంతోషించెను. బొంబాయి నగరమునందు స్థాపింపఁ బడిన స్త్రీపునర్వివాహ సంఘమునకు సభాధ్యక్షుఁడుగా నుండెను. సంఘసంస్కారముమీఁద నభిమాన మెంతయున్నను తిలాంగు తన సంస్కారపద్ధతుల నాచరణలోనికిఁ దెచ్చినవాఁడు కాఁడు. అతిబాల్యవివాహ లిష్టములేకున్నను 1893 వ సంవత్సరమున నితఁ డెనిమిదేండ్ల వయసుగల తనకూఁతునకు వివాహము చేసెను. హిందూదేశస్థు లనేకులు లిదివిని యైకకంఠ్యముగ వానినధిక్షేపింప నప్పు డాయన తానుచేసినది తప్పే యనియుఁ దనశరీరస్థితి చెడిబోవుటచే తాను బ్రతికియుండగానే కూఁతురు వివాహముచేయ వలయునని యట్లు చేసితిననియుఁ జాల విచారించెను. "ప్రమాదో ధీమతామని" యన్నట్టు లెంతవారికైన లోపము లుండకపోవుగదా ఇదితప్ప యతనియం దేవిధమయిన లోపములు లేవు. ఈయనమరణమువల్ల హిందూదేశమున కంతకు గొప్పనష్టము గలిగెనని జనులు భావించిరి.