Jump to content

పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాశీనాథ త్రియంబక తిలాంగు

203

దీరిక లేక యున్నను గాశీనాథతిలాంగు సంస్కృతభాష పరిశ్రమము మరువలేదు. భర్తృహరి నీతిశతకము ముద్రారాక్షస నాటకము నింగ్లీషుటిప్పణము వ్రాసి ప్రకటించెను. అంత దృప్తినొందకయతడు పురాతనత్రామ్ర శిలాశాసనముల శోధించి వానిలో గలవిషయములచే లోకమునకు తెలియజేయుచు వచ్చెను. 1876 వ సంవత్సరమున నతడు బొంబాయి యూనివరిసిటీలో సభికుడయ్యెను. 1877 వ సంవత్సరమున నీదేశమందున్న తెల్లవారినిమాత్రము 'వాలంటరీకోరు' అను పేరుగల యొకవిధమున సేనలోఁ జేర్చికొనవలసిన దనియు నల్లవారినిమాత్ర మందుఁ జేర్చుకొనగూడదనియు దొరతనమువారిని వేడుకొనుటకు బొంబాయిలోనొక సభజరిగెను. ఈతిలాంగుగారును ఫిరోజిషా మెహతాగారును మఱియొక సభచేసి నల్లవారి నందుజేర్చికొనక పోవుట వారి నవమానించుట యని నొక్కి చెప్పి యుపన్యాసమిచ్చిరి.

1878 వ సంవత్సరమున గవర్నరు జనరలుగారగు లిట్టనుప్రభువు గారు స్వభాషలలోఁబ్రకటింపఁబడు వృత్తాంతపత్రికల నడిచివేయుట కొక చట్టము నిర్మించిరి. ఆకాలమున నీతిలాంగుగా రట్టిచట్టము ధర్మవిరుద్ధమని హిందూప్రకాశ పత్రికలో పలుమారు వ్రాసిరి. 1879 వ సంవత్సరమున లిట్టను ప్రభువుగారు దూదిసరకులమీఁద కట్టిన సుంకములకు గూర్చి తిలాంగుగా రాపన్నులు దేశానర్థకములని యుపన్యాసములిచ్చి యాప్రభువుపరిపాలనము దేశాభివృద్ధిపరాఙ్ముఖమని తెలియ జేసిరి. 1880 వ సంవత్సరమున నప్పటిగవర్నరుగారు తిలాంగుగారికి జాయంటు జడ్జీపని నిచ్చెదమని చెప్పగాఁ నతఁ డక్కరలేదనియెను. పిమ్మట దొరతనము వారాయనకు లాకాలేజీలో నుపాధ్యాయత్వ మిచ్చిరి. ఈపని యదివఱకు దొరలకేగాని స్వదేశస్థుల కిచ్చుట లేదు. 1882 వ సంవత్సరమున గవర్నరుజనరలుగారగు రైఫన్ ప్రభువుగారు వానిని "ఎడ్యుకేషనల్ కమీషనులో" సభికుఁడుగా నేర్పరచిరి.